వీభోవరా - పార్ట్ 14
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 11 hours ago
- 8 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Veebhovara - Part 14 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 17/08/2025
వీభోవరా - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు. స్వామీజీ తిరిగి కనబడి మురళీ మోహన్ గారి కూతురు గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. దుర్గారావు వల్ల ప్రమాదాన్ని శంకించి, గంగ, కాశ్యప్ లను వేరే వూరి కాలేజీలో చేరుస్తారు. చదువు పూర్తయ్యాక కాశ్యప్, గంగల వివాహం జరిపించాలని కోరుతారు మురళీమోహన్ గారి సోదరుడు శాంతకుమార్. ఎలెక్షన్లలో భీమారావు ఓడిపోతాడు.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 14 చదవండి..
అరుణాచలం నుండి విజయ్, కాశ్యప్, గంగలు వారి వూరికి చేరారు. రామశర్మ భార్య మాధవికి, తనకు శాంతకుమార్ గారికి కాశ్యప్, గంగల విషయంలో జరిగిన సంభాషణను చెప్పియున్నందున మాధవి గంగకు ఆనందంగా స్వాగతం పలికింది. గంగ, రుద్రమ, భాస్కర్ శర్మలను ప్రీతిగా పలుకరించింది. తాను తిరువన్నామలై నుండి రుద్రమకు తెచ్చిన గాజులు, పూసల దండలు ఇచ్చింది. వాటిని చూచి రుద్రమ చాలా సంతోషించింది.
"వదినా!.... అన్నీ బాగున్నాయి" ఆనందంగా నవ్వుతూ చెప్పింది రుద్రమ.
నాలుగురోజులు ఎంతో సరదాగా పంట చేలు, తోటలు, దొడ్లు కాశ్యప్‍తో తిరిగి చూచింది గంగ. ఆ గ్రామీణ వాతావరణం గంగకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. రామశర్మ గారి కుటుంబ సభ్యులందరి ప్రవర్తన గంగకు ఎంతగానో నచ్చింది.
ఆరోజు కాశ్యప్, గంగలు గుంటూరుకు బయలుదేరారు. కాశ్యప్ గంగను గుంటూరులో వదలి స్వగ్రామానికి వచ్చాడు.
తండ్రి తనయులు కలిసి వ్యవసాయ పనులు చేసుకొనేవారు. ఆ పనులు వారికి ఎంతో ఆనందాన్ని కలిగించేవి.
బి.ఎ ధర్డ్ ఇయర్ రిజల్డ్స్ వచ్చాయి. ఇరువురూ స్టేట్ ఫస్టులో పాసైనారు. పత్రికా విలేఖరులు ఆ గ్రామానికి వచ్చి వారిరువురి ఫొటోలను తీసుకొని వెళ్ళిపోయారు. మరుదినం పేపర్లో మొదటి పేజీలో ఇరువురి ఫొటోలను వేసి, వారిని గురించి అభినందించారు. ఆ పేపర్‍ను చూచి రామశర్మ, మాధవి, రుద్రమ, భాస్కర్ శర్మలు ఎంతగానో అనందించారు.
వడలు, పాయసం చేసి జగత్ మాతా పితలకు నివేదన చేసి అందరి నోటిని తీపి చేసింది మాధవి.
ఊరి స్నేహితులు వచ్చి కాశ్యప్, విజయ్‍లను అభినందించారు.
కాలేజీలు, స్కూళ్ళు తెరిచారు.
కాశ్యప్... విజయ్‍లు గుంటూరుకి వెళ్ళారు. కాశ్యప్‍ను గుంటూరులో వదలి.... విజయ్ నెల్లూరికి వచ్చాడు. తాను సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లు మురళీ మోహన్ గారికి చెప్పాడు.
తన ప్రేమ విజయ్ విషయంలో విఫలమై, గంగ, కాశ్యప్‍ల ప్రేమ ఫలించినందుకు సింధూకు వారిరువురిపై ద్వేషం.
కాలేజీ తెరిచిన మూడవ వారం సోమవారం నాడూ సింధూ విజయ్ వద్దకు ట్యూషన్‍కు వచ్చింది.
"విజయ్ సార్! కంగ్రాట్యూలేషన్. స్టేట్ ఫస్ట్ పాసైనందుకు!" చిరునవ్వుతో తన కుడిచేతిని ముందుకు చాపింది సింధూ.
"థాంక్యూ!" విజయ్ తన చేతిని కదిలించలేదు.
సింధూ ఆశ్చర్యంతో అతని ముఖంలోకి చూచింది.
"నేను మీకు ఒక విషయం చెప్పాలి!"
"చెప్పండి" ఆశగా అతని ముఖంలోకి చూచింది సింధూ.
"నేను మీకు ఇకపై ట్యూషన్ చెప్పలేను. మిగతావారినీ రావద్దన్నాను. కనుక మీరు ఇంటికి వెళ్ళండి. రేపటినుండి రాకండి ప్లీజ్!" అభ్యర్థనగా చెప్పాడు విజయ్.
"నేను మిమ్మల్ని ఇంతకుముందు వలే తరుచుగా డిస్ట్రబ్ చేయను సార్. ఏదైనా సందేహం ఉంటే తప్ప. కనుక నేను ఇచ్చటికి వచ్చి చదువుకొంటాను సార్!" ప్రాధేయపూర్వకంగా అడిగింది సింధూ.
"కుదరదు.... కుదరదు" ఖచ్చితంగా చెప్పాడు విజయ్.
సింధూ కొన్ని క్షణాలు అతని ముఖంలోకి పరీక్షగా చూచి, తలదించుకొని మెల్లగా నడిచి వీధిలో ప్రవేశించింది.
డ్రైవర్ ఫీర్ ఆమెను చూచి.....
"చిన్నమ్మాయిగారూ! ఏం తొందరగా వచ్చేశారు?"
"ఫీర్! ఆ సార్‍కి తీరిక లేదట. నన్ను రావద్దన్నారు పద" మెల్లగా చెప్పింది సింధూ. కార్లో విచారంగా కూర్చుంది.
ఫీర్ కారును స్టార్ట్ చేశాడు.
ఇంటికి వెళ్ళిన సింధూ విషయాన్ని తల్లి కావేరికి విచారంగా చెప్పింది.
"చూడు సింధూ! నేను నాన్న నీకు మంచి సంబంధం చూస్తున్నాము. త్వరలో నీ వివాహం జరుగబోతూ వుంది. బి.ఎ పాసైనావు కదా! ఇకపై నీవు చదవవలసిన అవసరం లేదు. హాయిగా ఆనందంగా ఇంట్లో ఉండు. నీకు త్వరలో పెండ్లి చూపులు" చిరునవ్వుతో చెప్పింది కావేరి.
"అమ్మా!.... నేను నా మనస్సులోని మాటను చెప్పనా!"
"ఆ.... చెప్పు!...."
"నాకు ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలని లేదమ్మా!"
"చదువుతావా!"
"అవును"
"ఏం చదువుతావు?"
"ఎం.ఎ"
"సరే!.... మీ నాన్నగారు రానీ నీ అభిప్రాయాన్ని వారికి చెబుతాను. వారేమంటారో నీవు విందువుగాని."
"నాన్న అడిగినా నీకు చెప్పిన సమాధానమే వారికీ చెబుతాను."
"మీ నాన్నగారిని గురించి నీకు బాగా తెలుసుగా!"
"తెలుసు అమ్మా!.... నేను ఆయన కూతురునేగా! వారు తన నిర్ణయాన్ని ఎలా మార్చుకోలేరో, నేను అలాగే నా నిర్ణయాన్ని మార్చుకోలేను."
ఢిల్లీకి పోయిన దుర్గారావు తిరిగివచ్చాడు. విచారంగా వున్న సింధూను చూచాడు.
"ఏం సింధూ! దిగులుగా వున్నావ్!" అడిగాడు దుర్గారావు.
విజయ్ తనతో చెప్పిన మాటను సింధూ దుర్గారావుకు చెప్పింది.
దుర్గారావు పీర్‍ను (డ్రైవర్) పిలిచి, విజయ్‍ని పిలుసుకొని రమ్మన్నాడు. ఫీర్ వెళ్ళిపోయాడు.
సింధూ, తిరువన్నామలైలో తాను గంగను, కాశ్యప్‍లను చూచినట్లు దుర్గారావుకు చెప్పింది.
దుర్గారావు మనస్సు రెండున్నర సంవత్సరాల క్రింద జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది. గంగ, కాశ్యప్‍ల పైన మనస్సున పగ ప్రతీకార వాంఛ రగిలింది. తన గదిలోనికి వెళ్ళిపోయాడు. సింధూ తన గదికి వెళ్ళిపోయింది.
అరగంట తరువాత విజయ్ వచ్చాడు.
వరండాలో నిలబడ్డాడు. ఫీర్ లోనికి వెళ్ళి విజయ్ వచ్చిన విషయాన్ని దుర్గారావుకు చెప్పాడు. దుర్గారావు ఆవేశంగా వరండాలోనికి వచ్చాడు.
"నీవేకదూ విజయ్!"
అవునన్నట్లు తలాడించాడు విజయ్.
దుర్గారావు గొంతు విని కావేరి వరండాలోనికి వచ్చింది.
వినయంగా విజయ్ కావేరికి నమస్కరించాడు.
"కూర్చోబాబు!" చిరునవ్వుతో చెప్పింది కావేరి.
"పనివుందండి వెళ్ళాలి. విషయం ఏమిటో చెప్పండి!"
"అమ్మాయికి ట్యూషన్ చెప్పనన్నావట."
"అవునండీ, నాకు వీలుకాదు. నేను మావూరు వెళ్ళిపోతున్నాను" వినయంగా చెప్పాడు.
"కాశ్యప్ ఎక్కడ వున్నాడు?"
"వాడు ఇక్కడ లేడు."
"అడిగింది ఎక్కడ వున్నారని!"
"అర్థం అయ్యింది. వాడితో మీకేం పని?"
"లెక్క ఒకటి బాకీ వుంది!"
"ముగిసిపోయిన పాత లెక్కను ఇప్పుడెందుకు సార్ తలచుకొంటారు!" చిరునవ్వుతో చెప్పాడు విజయ్.
"నీ దృష్టిలో ముగిసిందన్న లెక్క నా దృష్టిలో ఇంకా ముగియలేదు!"
"సరే మీ ఇష్టం!.... అమ్మగారూ!.... నేను వెళతాను...."
సింధూ వరండాలోకి వచ్చింది. విజయ్‍ను చిరునవ్వుతో చూచింది.
"కూర్చోండి మాస్టారు గారూ!" ప్రీతిగా చెప్పింది.
"వచ్చిన పని అయిపోయింది వెళతాను."
"నా ప్రశ్నకు నీవు జవాబు చెప్పలేదు. చెప్పకుండా ఇక్కడినుంచి పోలేవు!"
విజయ్ పరీక్షగా కొన్ని క్షణాలు దుర్గారావు ముఖంలోకి చూచాడు. చిరునవ్వుతో.....
"బ్రదర్!.... మీకు ఆవేశం జాస్తి. ఆలోచన తక్కువ. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అమ్మగారు.. రెండున్నర సంవత్సరాల క్రిందట జరిగిన గొడవను గురించి మీ అబ్బాయి, నన్ను ఇక్కడినుండి కదలిపోలేవు అంటున్నారు. అది తప్పు. మీ అబ్బాయికి నచ్చచెప్పండి. వెళుతున్నాను" వేగంగా వరండా మెట్లు దిగి వీధి వైపుకు నడిచాడు విజయ్.
ఆవేశంతో గుడ్లు పెద్దవిచేసి దుర్గారావు విజయ్‍ను చూడసాగాడు. సింధూ విచారంగా విజయ్‍ను చూడసాగింది.
"ఆ సంఘటనలో తప్పు నీదేనని ప్రిన్సిపాల్ గారు మీ నాన్నతో చెప్పారు. అప్పుడు మీ నాన్న ఎం.ఎల్.ఎ కాబట్టి పత్రికలవారికి, మీడియాకి చెప్పి ఆ వార్తను అందరికీ తెలియకుండా చేశారు. ఇప్పుడు మీ నాన్నకు పదవి లేదుగా! పగ ప్రతీకారం అని ఎలాంటి పాడు పని చేయకుండా బుద్ధిగా ఉండు. మేము నీ చెల్లి పెండ్లి ప్రయత్నం చేస్తున్నాము. నీవల్ల దాని జీవితం పాడుకాకూడదు జాగ్రత్త" హెచ్చరించింది కావేరి.
ఆవేశంగా దుర్గారావు తన గదిలోనికి, సింధూ విచారంగా తన గదిలోనికి వెళ్ళారు.
సింధూ విజయ్‍ని తలుచుకొని ఏడుస్తూ మంచం మీద పడుకొంది.
భీమారావు వచ్చాడు. రావడంతోనే.....
"కావేరీ!" బిగ్గరగా పిలిచాడు.
"ఎందుకండీ అంత బిగ్గరగా పిలుస్తారు. నాకేమైనా చెముడా!" విసుగ్గా అంది కావేరి.
"ఏమోయ్! ఒక మంచివార్త!...." చిరునవ్వుతో చెప్పాడు భీమారావు.
"ఏమిటండీ అదీ?..."
"మన ఆపోజిట్ వర్గం ప్రెజెంట్ ఎం.ఎల్.ఎ రాజేంద్ర భూపతి నన్ను పిలిపించి తన కుమారుడు విజయేంద్ర భూపతి మన అమ్మాయిని ఎప్పుడో ఎక్కడో చూచాడట. మన వివరాలు తెలుసుకొని, రాజేంద్ర భూపతితో మన అమ్మాయిని వివాహం చేసుకొంటానని, మనతో మాట్లాడమని చెప్పాడట అతను డాక్టర్. రాజేంద్రభూపతి ఏమన్నాడో తెలుసా!.... ‘చూడు భీమారావు. ఈ పార్టీలు.. గెలుపు ఓటములు.. రాజకీయాలు వేరు. మంచివంశం, మంచిసంబంధం వేరు. నా కొడుక్కి నీ కూతురు నచ్చింది. నేను వారిరువురికీ వివాహం చేయాలని నిర్ణయించుకొన్నాను. నీవు సరే అంటే నిశ్చితార్థం.... త్వరలోనే వివహం జరిపిద్దాం. నీవేమంటావ్!"
రెండు క్షణాల తరువాత "ఒక్కగానొక్క కొడుకు. కోట్ల ఆస్తికి వారసుడు. నేను సంతోషంగా ఒప్పుకొన్నాను. ఈ సంబంధం నాకు ఎంతో ఇష్టం" చిరునవ్వుతో చెప్పాడు భీమారావు.
"అమ్మాయిని అడిగి...." కావేరి పూర్తిచేయకమునుపే....
"ఏందే నువ్వనేది?... మన అమ్మాయి మన మాటను కాదంటుందా!" ఆవేశంగా అన్నాడు భీమారావు.
హాల్లో జరిగిన తండ్రి తల్లి సంభాషణను విన్నది సింధు. తల్లి తన దగ్గరకు వస్తుందని తన గది తలుపును బిగించింది.
ఆ రాత్రి భోజన సమయంలో....
భుజంగరావు తన నిర్ణయాన్ని సింధూకు తెలియజేశాడు.
"చాలా మంచి సంబంధం. సింధూ ఈ తండ్రి సదా నీ మేలు కోరేవాడు. తల్లీ నీవు నా మాటను అంగీకరించాలి. విజయేంద్ర భూపతి డాక్టర్. అతనితో నీ జీవితం చాలా బాగుంటుందమ్మా!" ప్రాదేయపూర్వకంగా చెప్పాడు భీమారావు.
తండ్రి తత్త్వం తెల్సిన సింధూ మౌనంగా వుండిపోయింది.
"మౌనం సమ్మతం!" ఆనందంగా నవ్వాడు భీమారావు.
సింధూ ఏదో విన్నట్లు నటించి తన గదిలోనికి వెళ్ళిపోయింది. ఆమెకు డైరీ వ్రాసే అలవాటు.
తన ప్రతిచర్యను తల్లి తండ్రితో తాను తన విషయంగా చేసిన సంభాషణను విజయ్‍తో తన ప్రసంగాన్ని, దానికి అతను చెప్పిన సమధానాన్ని తేదీ వేసి వ్రాసింది/ వ్రాస్తుంది. ఆనాటి తన తల్లి, తండ్రి సంభాషణను తన చర్యనూ కూడా వ్రాసింది.
చివర.... విజయ్ తన్ను కాదన్నా, ట్యూషన్ చెప్పనని అన్నా మనస్సు విజయ్‍ను మరువలేనంటున్నది. నా ప్రేమను విజయ్ ఏనాటికైనా అర్థం చేసికొంటాడా లేదా!.... చివరిసారిగా ప్రస్తుత పరిస్థితుల రీత్యా విజయ్‍ను ఒకసారి కలవాలని, తన నిశ్చితాభిప్రాయాన్ని అతనికి చెప్పాలి అని వ్రాసి ముగించింది సింధూ.
ఆ మరుదినం ఉదయం రామశర్మ, మాధవి కూతురు రుద్రమ, భాస్కర్‍లు గ్రామాన్నుండి నెల్లూరికి మురళీమోహన్ ఇంటికి వచ్చారు.
రుద్రమ విజయ్‍ని చూచి చాలా ఆనందపడింది. అప్పటి ఆమె వయస్సు పదహారు సంవత్సరాలు (భాస్కర్ వయస్సు అంతే, వారు కవలలు) ప్లస్ వన్ చదువుతున్నారు.
వారి రాకకు కారణం గంగ వివాహ విషయంగా మాట్లాడే దానికి రామశర్మను రమ్మన్నారు మురళీమోహన్ గారు. గుంటూరు నుంచి శాంతకుమార్ సుభద్ర వచ్చారు.
"బావగారు కుశలమా!" అడిగాడు శాంతకుమార్.
"ఆఁ.... బావగారూ అంతా కుశలమే!...."
"కాశ్యప్‌కు బి.ఎ ముగిసింది కదా! గంగ, కాశ్యప్‍ల వివాహం జరిపిస్తే మంచిదని మా అభిప్రాయం. మీరేమంటారు!" అడిగారు ప్రిన్సిపాల్ శాంత కుమార్ గారు.
వారి ఉద్దేశ్యం గంగా, కాశ్యప్‌లు యుక్తవయస్కులు. ఒకే చోట (ఊరు) వుంటున్నారు. వయస్సు పరస్పర అభిమానం రీత్యా ఏదైనా పొరపాటు జరిగితే..... అది మంచిదికాదని, దానికి ఆస్కారాన్ని కల్పించకుండా వివాహాన్ని జరిపిస్తే అన్నింటికీ మంచిదన్న బావన.
ఆ విషయాన్నే ఆ అన్నాతమ్ములు రామశర్మగారికి చెప్పారు. రామశర్మ గారి మనస్సున విజయ్‍కు వివాహం చేయకుండా కాశ్యప్‍కు ముందుగా వివాహం చేయడం ఇష్టం లేదు.
ఆకారణంగా మెల్లగా.....
"బావగారూ!.... కాశ్యప్ ఎం.ఎ చదవాలనుకొంటున్నాడుగా అది పూర్తికాగానే....." రామశర్మ పూర్తిచేయకముందే "బావగారూ! కాశ్యప్ ఎం.ఎ చదవడం లేదు. సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆరునెలల్లో ఆ పరీక్ష జరుగురుంది. తర్వాత IPS ట్రైనింగ్ రెండు భాగాలు ప్రధమ రెండు మాసాలు ఎల్.బి.యస్. యన్. ఎ.ఎ (LBSNAA) అనగా లాల్‍బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్‍సోరి (MUSSOORIE) అక్కడ IPS ప్రైమరీ ట్రైనింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఇవ్వబడుతుంది. తర్వాత ఇరవై ఒక్క నెలలు హైదరాబాదులో సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ మొత్తం రెండు సంవత్సరాలు.
మొదటి ఉద్యోగం అసిస్టెంట్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP).
ఇక గంగ విషయం.... తాను BED ట్రైనింగ్ చేయాలనుకొంటూ వుంది. ఆ ట్రైనింగ్ కూడా రెండు సంవత్సరాలు. వివాహాన్ని మనం జరిపిస్తే వారి ఇష్టానుసారంగా వారు వీలును బట్టి కలుసుకోగలుగుతారు. అది వారికి మనకు కూడా ఆనందం కదా బావా! ఆలోచించండి" అనునయంగా చెప్పాడు శాంతకుమార్.
కొన్నినిముషాలు రామశర్మ మౌనంగా వుండిపోయాడు. లేచి భార్యను సమీపించాడు. ఇరువురూ ప్రక్కగదిలోనికి వెళ్ళారు.
"విన్నావుగా వారి నిర్ణయం?" అడిగాడు రామశర్మ.
"ఆ విన్నాను. వారు ఆడపిల్ల కలవారు కదా! వారి ఆలోచనలు వారివి" అంది మాధవి.
"మరి మన ఆలోచన?"
"మీరే చెప్పాలి!"
"నాకు విజయ్‍తో మాట్లాడాలని వుంది."
"వాడు పెద్దవాడు కదా!"
"అవును"
"వాడికి పెండ్లి చేయకుండా కాశ్యప్‍కు చేస్తారా!"
"నాకు చేయాలని లేదు. కానీ....!"
"ఏమిటి ఆ కానీ?...." నిష్టూరంగా అడిగింది మాధవి క్షణం తర్వాత.....
"మా అన్నయ్య కూతురు సావిత్రి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది కదా ఆ అమ్మాయి విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?" అడిగింది మాధవి.
"సావిత్రా! ఆమెకేం తక్కువ. బంగారు బొమ్మ. ఫొటో తెప్పింది విజయ్‍కు చూపిస్తాం. సరేనా!....."
"అలా అన్నారు ఆనందంగా వుంది" నవ్వుతూ చెప్పింది మాధవి.
రామశర్మ తన బావమరిది సత్యనారాయణ శర్మకు ఫోన్ చేసి సావిత్రి ఫొటోను పంపమన్నాడు.
మరుసటి దినం సత్యనారాయణ శర్మ సబ్ రిజిస్టార్ ఒంగోలు నుండి నెల్లూరికి వచ్చాడు.
సత్యనారాయణ శర్మను శాంతకుమార్, మురళీమోహన్ వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు రామశర్మ. విజయ్‍ను కూడా సత్యనారాయణ శర్మను గురించి చెప్పాడు.
విజయ్‍శర్మను చూచి సత్యనారాయణ శర్మ ఆనందించాడు. విజయ్ తన కూతురు సావిత్రికి తగిన వరుడని భావించాడు. రామశర్మ, సావిత్రి ఫొటోను విజయ్‍కి చూపించాడు.
"విజయ్!...."
"నాన్నా!....."
"మురళీమోహన్ గారు, శాంత కుమార్ గారు గంగ వివాహ విషయంలో తొందర పడుతున్నారు. వారిరువురూ ఇష్టపడుతున్నారన్న విషయం నీకూ తెలుసు. నీవు పెద్దవాడివి. నీ వివాహం చేయకుడా కాశ్యప్ వివాహం జరిపించడం నాకూ, మీ అమ్మకు ఇష్టం లేదు. కనుక సావిత్రి ఫొటో ఇదిగో చూడు. నీ అభిప్రాయాన్ని చెప్పు. అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. చాలా మంచిబిడ్డరా!" విజయ్ చేతికి ఫొటోను అందించాడు.
ఫొటోను చూచిన విజయ్ పెదవులపై చిరునవ్వు.
ప్రక్కనే ఆత్రంగా తనను చూస్తున్న తల్లి మాధవి చేతికి ఫొటోను అందించాడు.
"నాన్నా!..... విజయ్!.... అమ్మాయి నీకు నచ్చిందా!" ఆత్రంగా అడిగింది మాధవి.
"అమ్మా!.... నాకు ప్రస్తుతంలో వివాహం చేసుకోవాలని లేదు. కానీ నాన్నగారు నా వివాహాన్ని ముందు జరిపించి, కాశ్యప్ గంగల వివాహాన్ని జరిపించాలనుకొంటున్నారు. కనుక మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా!.... మీరు సదా మా మేలు కోరేవారే కదా!...." చిరునవ్వుతో చెప్పాడు విజయ్.
రామశర్మ, మాధవిలకు పరమానందం.
మురళీమోహన్, శాంతకుమార్‍లకు తన సమ్మతిని తెలియజేశాడు రామశర్మ.
ఆ అన్నదమ్ములు, వారి అర్థాంగులు రామశర్మ గారి సమ్మతికి సంతోషించారు.
ముందు విజయ్, సావిత్రిల వివాహం, తర్వాత కాశ్యప్ గంగల వివాహం జరిగే రీతిగా సత్యనారాయణ శర్మ గారి తండ్రి పాండురంగ శర్మ, ఎనభై సంవత్సరాల పెద్ద. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం కలవారు. వారిచేత ముహూర్తాలను నిర్ణయించవలసిందిగా సత్యనారాయణ శర్మకు తెలిపారు.
సత్యనారాయణ శర్మ పరమానందంగా ఆ బాధ్యతను స్వీకరించారు. రుద్రమ విజయ్‍తో ప్రవర్తించే తీరును రెండుమూడు సార్లు చూచిన మాధవీ, తన అన్న సత్యనారాయణతో రుద్రమను ఒంగోలుకు పంప నిర్ణయించుకుంది.
ఒక్కగానొక్క కూతురు ఎంతో గారం, ఇరుగురుపొరుగు వారి మాటలను విని రుద్రమ తెలిసీ తెలియని వయస్సు కారణంగా విజయ్ విషయంలో అలా ప్రవర్తిస్తుందని, ఆ తత్త్వం రుద్రమలో మారాలంటే విజయ్ దూరంగా వుండటం అవసరమని నిర్ణయించుకొన్న మాధవి తన సోదరుడు సత్యనారాయణ శర్మతో "రుద్రమను నీతో ఒంగోలుకు పంపుతా, అక్కడ కాలేజీలో చేర్పించు సత్యా!..." తమ్ముడితో చెప్పింది మాధవి.
వారు "సరే అక్కా!" అన్నారు.
ఆ మరుదినం సత్యనారాయణ శర్మతో రుద్రమను ఒంగోలుకు పంపించింది మాధవి.
ఒంగోలుకు చేరిన సత్యనారాయణ శర్మ గంగ - కాశ్యప్, విజయ శర్మల జాతకాలను తండ్రి పాండురంగ శర్మగారికి ఇచ్చి విజయ్, సావిత్రికి, కాశ్యప్ గంగలకు నిశ్చితార్థం, వివాహ ముహూర్తాలను నిర్ణయించవలసిందిగా చెప్పారు.
మంచిరోజు, సమయం చూచుకొని పాండురంగశర్మగారు పంచాగాన్ని చేతికి తీసుకొన్నారు.
వారి ఇల్లాలు అన్నపూర్ణమ్మ తుమ్మింది. శకునం సరిగా లేదని పంచాంగాన్ని ప్రక్కన పెట్టారు.
భీమారావు పురోహితులను పిలిపించి సింధూ విజయేంద్ర భూపతుల జాతకాలను ఇచ్చి నిశ్చితార్థ, వివాహ ముహూర్తాలను నిర్ణయించమన్నారు. పురోహితులు వారంరోజుల్లో శుక్రవారం నాడు నిశ్చితార్థానికి నెలరోజుల్లో సోమవారం నాడు తిధివార నక్షత్ర యోగాలను చూచి మంచిముహూర్తాలను నిర్ణయించి, వ్రాసి ఇచ్చి వెళ్ళిపోయారు.
=======================================================================
ఇంకా వుంది..
వీభోవరా - పార్ట్ 15 త్వరలో
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments