వీభోవరా - పార్ట్ 13
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 6 days ago
- 6 min read
Updated: 21 hours ago
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, , #Veebhovara, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Veebhovara - Part 13 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 12/08/2025
వీభోవరా - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాశీలో గంగాస్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ. ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డి. ఐ. జి ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు. కాశ్యపశర్మ మృత దేహాన్ని తనకు అప్పగించమని పోలీసులను కోరుతారు స్వామీజీ.
గతం గుర్తుకు తెచ్చుకుంటారు స్వామీజీ.
అనాథ బాలుడు విజయ్ శర్మను తన కొడుకు కాశ్యప శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ. పిల్లలతో యాత్రకు వెళ్లిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు. విజయ్ శర్మ, కాశ్యప శర్మ లను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు. కాలేజీ చదువుకోసం పిల్లలిద్దరినీ మురళీ మోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు. స్వామీజీ తిరిగి కనబడి గంగ కారణంగా కాశ్యప్ కు స్దాన చలనం ఉందని చెబుతాడు. గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యప్. దుర్గారావు వల్ల ప్రమాదాన్ని శంకించి, గంగ, కాశ్యప్ లను వేరే వూరి కాలేజీలో చేరుస్తారు. చదువు పూర్తయ్యాక కాశ్యప్, గంగల వివాహం జరిపించాలని కోరుతారు మురళీమోహన్ గారి సోదరుడు శాంతకుమార్.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీభోవరా - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక వీభోవరా - పార్ట్ 13 చదవండి..
దుర్గారావు హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయినాడు.
ఢిల్లీకి వెళ్ళియుండిన ఎం.ఎల్.ఎ భీమారావు తిరిగి వచ్చాడు. ఎలక్షన్స్ దగ్గరకొచ్చాయి.
ఢిల్లీలో జరిగిన హోం మినిష్టర్ మీటింగులో, ఎలక్షన్స్ తరువాత భీమారావు (గెలిస్తే) సెంట్రల్ మినిస్టర్ ఛాన్స్ వచ్చేలా చేస్తానని చీఫ్ మినిష్టర్ శతకోటి శంకరరావు భీమారావుకు ఆశను చూపించాడు.
ఎలక్షన్‍లో తమపార్టీ రాష్ట్రంలో గెలవాలని, గెలిపించాలని తాను సెంట్రల్ మినిష్టర్ కావాలని భీమారావు నిర్ణయించుకొన్నాడు. ఊరికి తిరిగి వచ్చాడు.
ఆ రాత్రి..... భోజనాల సమయంలో దుర్గారావు....
"నాయనా!...."
"ఏందిరా!...."
"ప్రిన్సిపాల్‍ను పిలిపించు."
"ఎందుకు?"
"నన్ను కొట్టినవాడిని గురించి విచారించవా!..."
"అది ముగిసిపోయిన కత. దాన్ని కలేబెట్టి నా పరువును తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు తెలిసిన ఇసయం, తప్పు నీదే అంట. నీవు కోరినట్టుగా నేను ప్రిన్సిపాల్ మహమ్మద్‍తో ఎగాదిగా మాట్లాడలేనురా. కారణం, మూడునెలల్లో ఎలక్షన్. వాళ్ళ కులం ఓట్లన్నీ మన పార్టీకి పడాలంటే మహమ్మద్‍తో నేను నీ గొడవను గురించి మాట్లాడకూడదు. వారివి ముఫ్ఫైవేల ఓట్లు పైగా వున్నాయి. ఆ వర్గానికి మనం వ్యతిరేకమైతే మనం ఓడిపోతాము. అందుకని నీవు కుదురుగుండా కొంపలో పడుండు. పిచ్చిపిచ్చి అలోచనలు చేయకు. అర్థం అయ్యిందా!...." ఆవేశంగా చెప్పాడు భీమారావు.
దుర్గారావు పెదివిని విరిచి తల ఆడించాడు.
తల్లి కావేరి "ఒరేయ్! ఆ విషయాన్ని మరిచిపో. మీ నాయనకు ఎలక్షన్ ప్రచారంలో సాయం చెయ్యి. పదిమంది చేత మంచివాడివనిపించుకో. కోపం తాపం చేటు. తెలుసుకో!...." అనునయంగ చెప్పింది.
తలాడించి వారి దగ్గరనుండి తన గదికి వెళ్ళిపోయాడు. తల్లీతండ్రి చెప్పిన మంచి మాటలు దుర్గారావుకు రుచించలేదు. అతని మనస్సులో గంగ, కాశ్యప్‍ల పట్ల ఆగ్రహావేశాలు చల్లారలేదు. పగ ప్రతీకార వాంఛ అతని మనస్సుకు గ్రహణంగా క్రమ్ముకొన్నాయి.
దుర్గారావుకు ఇరువురు ప్రియమిత్రులు. రాహుకేతువుల్లాంటి వారు నరహరి మురారి. వారిరువురినీ పిలిచి గంగ కాశ్యప్‍ల గురించి విచారించి వారు ఎక్కడ వున్నదీ తనకు తెలియజేయాలని ఆజ్ఞాపించాడు.
వారు కాలేజీ మొగపిల్లలను కొందరిని కలిసి గంగ, కాశ్యప్‍లను గురించి విచారించారు. కొందరు మాకు వారిని గురించి తెలియదన్నారు.
కొందరు వారిద్దరు లవర్స్, ఇంట్లో వారి వివాహానికి సమ్మతం లేదు. ఆ కారణంగా వారు ఎటో పారిపోయారన్నారు. తమకు తెలిసి వార్తను నరహరి మురారీలు దుర్గారావుకు తెలియజేశారు. వారు చెప్పిన గాలివార్తను దుర్గారావు నమ్మలేదు.
ఎలక్షన్ డేట్ అనౌన్స్ అయ్యింది. అన్ని పార్టీల వారూ తీవ్రంగా రాత్రింబవళ్ళు ప్రచారం చేయసాగారు.
దుర్గారావు అతని మిత్రులు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇల్లిల్లూ తిరిగి భీమారావుకు మీ అమూల్యమైన ఓటును క్యాండిల్ (కొవ్వొత్తి) గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరారు. లేబర్ కాలనీ పేద జనాలకు మందును, ఓటు వెయ్యి రూపాయలు చొప్పున పంచిపెట్టారు.
ప్రచారం ముగిసింది. పోలింగ్ పకడ్బందీగా జరిగింది. ఎంతో రచ్చరచ్చగా వున్న ఊరు సద్దుమణిగింది. నిర్ణీత తేదీన ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం స్థానాల్లో భుజంగరావు వర్గం పదహారు స్థానాల్లో గెలిచింది. ఆపోజిట్ పార్టీకి అఖండ విజయం.
భీమారావు డిపాజిట్ కోల్పోయాడు. నెత్తిన గుడ్డ వేసుకొని కన్నీరు కార్చాడు. వీరి నాయకుడు శతకోటి శంకరయ్య (CM) కూడా డిపాజిట్ కోల్పోయాడు. జనం తలుచుకొంటే రాజు కింకరుడవుతాడు. కింకరుడు రాజవుతాడు. భీమారావు ఢిల్లీ మంత్రి (కేంద్రం) ఆశ అడియాసగా మారిపోయింది. జనాలను నోటికొచ్చినట్లు తిట్టాడు. దానికి దుర్గారావు వంత పాడాడు.
భీమారావు పవర్ పోయింది. వేలు వేలు ఖర్చుపెట్టి నష్టపోయినందుకు బాధపడ్డాడు. ప్రజలమీద ద్వేషం పెరిగింది. చేజారిపోయిన ధనాన్ని తిరిగి అక్రమ వ్యాపారాల మూలంగా సంపాదించాలని నిర్ణయించుకొన్నాడు.
విజయ్, కాశ్యప్‍లు విడిపోయినందుకు కొన్ని రోజులు విచారపడ్డా. ఆ తర్వాత చదువు పై పూర్తి ధ్యాసను మళ్ళించారు. నాలుగున్నరకు లేచి కాలకృత్యాదులు, వ్యాయామం, యోగాసనాలు చేయడం ప్రారంభించేవారు. జనరల్ నాలెడ్జి బుక్స్ ను తీరిక సమయాల్లో చదివేవారు. విజయ్ నెలకొకసారి గుంటూరుకు వెళ్ళి కాశ్యప్ యోగక్షేమాలను విచారించి గంగ విషయంలో జాగ్రత్తగా త్వరపడకుండా నిగ్రహంగా వుండాలని హెచ్చరించి, దైవధ్యానం అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని తన తండ్రి రామశర్మ చెప్పిన మాటలను కాశ్యప్‍కు గుర్తు చేసి వస్తుండేవారు.
తాను తీరిక సమయంలో ధ్యానాన్ని సాగించేవాడు. తొలుత అరగంట కొంతకాలం తరువాత గంట సమయం ద్యానంలో గడిపేవాడు విజయ్.
ఆ ధ్యాన సమయంలో అతనికి వారు, చిన్నవయస్సులో విజయవాడలో చూచిన స్వామీజీ, బి.ఎ తొలి సంవత్సరం పరీక్షల అనంతరం శ్రీశైల యాత్ర సమయంలో పునర్థశనాన్ని ప్రసాదించిన ఆ స్వామీజీ కళ్ళముందు నిలిచేవారు. ఏదో సందేశాలను చెప్పేవారు.
ధ్యానానంతరం విజయ్ కళ్ళు తెరిస్తే.... అతని మనస్సుకు ఎంతో ప్రశాంతత, ఆనందం లభించేది. ఆగ్రహావేశాలు పూర్తిగా సమసిపోయాయి.
కాలచక్రం ప్రశాంతంగా రెండు చుట్లు తిరిగింది. మూడవ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. శలవలు ఇచ్చారు.
విజయ్ మనస్సున ఎంతోకాలంగా అరుణాచలాన్ని, శ్రీ రమణుల ఆశ్రమాన్ని దర్శించాలనే సంకల్పం.
మురళీ మోహన్ గారితో చర్చించారు.
అరుణాచలంలో మహోన్నత శివాలయాన్ని పరమశివుల ఆజ్ఞప్రకారం విశ్వకర్మ నిర్మించారట. అక్కడి శివలింగం అగ్నిరూపం. ఆలయం చుట్టూ వున్న ప్రదేశానికి అరుణపురం అనిపేరు.
అరుణాచలగిరి అతి ప్రాచీనమైనది. హిమాలయ పర్వతాల కన్నా ముందు ఉద్భవించినది. అరుణాచల గిరి ప్రదిక్షణం (పాదరక్షలు లేకుండా) చేయుట వలన ఆరోగ్యము, ఇష్టకామితము సిద్ధించును. ప్రతి పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు (స్త్రీ బాల పురుషులు) ఆ మహోన్నత గిరి ప్రదిక్షణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. పద్నాలుగు కిలోమీటర్ల వృత్తాకారములో ఆ గిరి వెలసియున్నది.
ఆ మహాక్షేత్రంలో భారతీయ హైందవ ఋషి పుంగవులు, యోగి జీవన్ముక్తులు ప్రపంచ ప్రఖ్యాత పరమ గురువులు అయిన శ్రీ శ్రీ రమణ భగవానుల ఆశ్రమం వుంది.
వాటినన్నింటినీ చూడాలని విజయ్ ఆకాంక్ష. పుస్తకాలు చదివి తెలుసుకొన్న విషయం అది.
విజయ్ తన తిరువన్నామలై ప్రయాణం గురించి కాశ్యప్‍కు ఫోన్‍లో చెప్పాడు. విజయ్ ప్రోగ్రాంను అడిగి తెలుసుకొన్నాడు కాశ్యప్. తను వస్తున్నట్లుగా విజయ్‍కి చెప్పాడు.
శాంతకుమార్ గారికి చెప్పి విజయ్ తిరువన్నామలైకి బయలుదేరి సిద్ధం అయినాడు. గంగ పెద్ద తల్లితండ్రులకు చెప్పి కాశ్యప్‍తో నెల్లూరుకు బయలుదేరింది.
గంగ, కాశ్యప్, విజయ్‍లు అక్కడ నుండి అరుణాచలం బయలుదేరారు.
సాయంత్రం నాలుగు గంటలకు వారు అరుణాచలం చేరారు. ముగ్గురు మనస్సున పరమ ఆనందం. అరుణాచలానికి దక్షిణ వారణాసి అనిపేరు.
ముగ్గురూ బాడుగ గది తీసుకొని స్నానం చేసి బట్టలు మార్చుకొని శివాలయంకు వెళ్ళి జగత్ మాతాపితలను దర్శించారు.
తీర్థప్రసాదాలను స్వీకరించి, హోటల్లో భోజనం చేసి గదికి చేరుకొన్నారు. గడిచిన రెండు సంవత్సరాల విశేషాలను అన్నాతమ్ములు చర్చించుకొన్నారు ఆనందంగా నవ్వుకొన్నారు.
మరుదినం ఉదయం శ్రీ భగవానుల ఆశ్రమంలో వారి తల్లిగారి వారి సమాధులను దర్శించారు. అది ఒక ప్రశాంత నిలయం. స్వదేశీయులే కాదు, అనేకమంది విదేశీయులు కూడా ఆ ఆశ్రమాన్ని సందర్శించడం విజయ్, కాశ్యప్, గంగలు చూచారు. శ్రీ భగవాన్ రమణగురువుల పట్ల వారికి వున్న గౌరవం, భక్తి, శ్రద్ధలను చూచి వీరు ఆశ్చర్యపోయారు.
ధ్యానమందిరంలో కూర్చొని కొంతసేపు ధ్యానం చేసికొని గిరి ప్రదక్షిణకు లేచారు.
సింధు అతని స్నేహితురాలు లాలస అక్కడ ఆశ్రమంలో వారికి దర్శనమిచ్చారు.
ఆ ఇరువురినీ చూచి గంగ, కాశ్యప్‍లు ముఖాలను ప్రక్కకు తిప్పుకొన్నారు. సింధూ వారిని చూచింది.
విజయ్ చూచీ చూడనట్టు ముందుకు నడిచాడు. ముగ్గురూ ఆశ్రమం బయటికి వచ్చి గిరి ప్రదక్షిణం ప్రారంభించారు.
కొంతదూరం నడిచాక విజయ్ వెనుతిరిగి చూచి.... సింధూ తన స్నేహితురాలు కూడా గిరి ప్రదక్షిణం చేస్తున్నట్లు గ్రహించాడు.
"అన్నా!...."
"చెప్పు కాశీ!....."
"సింధూను చూచావా!"
"ఆ.... చూచాను"
"తను మనలను గురించి వాళ్ళ అమ్మా నాన్న అన్నలతో చెబుతుందేమో!" సందేహంతో అడిగాడు కాశ్యప్.
"చెప్పనీరా!... మనకేం?"
"ఏం లేదన్నా!" నవ్వాడు కాశ్యప్.
"ఇద్దరికీ చెబుతున్నా. వెనక్కి తిరిగి చూడటం కాని, ఏదైనా అనవసర పురాణం మాట్లాడటం కాని చేయకండి ’ఓం శ్రీ అరుణాచలశివ.... ఓం శ్రీ అరుణాచలశివ....’ అని మనస్సున ఆ ధ్యానంతో ముందుకు నడవండి. ఇక మాట్లాడకూడదు" అన్నాడు విజయ్.
పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం చేసేదానికి వారికి నాలుగంటల సమయం పట్టింది. తొమ్మిది గంటలకు ప్రారంభించిన వారు పన్నెండు గంటలకు గిరి ప్రదక్షిణాన్ని ముగించారు.
హోటల్లో భోజనానికి వెళ్ళారు. ఆర్డర్ ఇచ్చారు.
పది నిముషాల తరువాత.....
సింధు ఆమె స్నేహితురాలు లాలస ప్రక్క రోలో ఖాళీగా వున్న కుర్చీలలో కూర్చున్నారు.
సింధూకు ప్రక్కగా వేరే రోలో గోడవైపు గంగ ప్రక్కన కాశ్యప్ కూర్చున్నారు. వారికి ఎదురుగా విజయ్.
సింధూ విజయ్ ముఖంలోకి చూచింది.
"గుడ్ ఆఫ్టర్‍నూన్ మాస్టారు గారూ!..." నవ్వుతూ చెప్పింది.
విజయ్ తలాడించాడు.
అరటి ఆకుల్లో వడ్డన ప్రారంభం అయింది. అవపోసనం పట్టి విజయ్ కాశ్యప్‍లు, గంగ భోజనం చేయ ప్రారంభించారు.
సింధూ, విజయ్ ఏ స్పీడుతో తింటున్నారో అదే స్పీడుతో తానూ తినసాగింది. ఆమె ఉద్దేశ్యం విజయ్‍తో మాట్లాడాలని.
భోజనాలు ముగిశాయి. ముందు కాశ్యప్, వెనుకాల గంగ, ఆమె వెనుకాల విజయ్ బేసిన్ దగ్గరకు నడిచారు.
సింధూ, లాలస, విజయ్ వెనకాల నడిచారు.
గంగ, కాశ్యప్‍లు చేతులు కడుక్కొని ప్రక్కకు జరిగారు.
వారిరువురు మనసుల్లోనూ ’ఓ పిశాచి ఇక్కడికి మనలను ఫాలో చేస్తూ ఎలా వచ్చిందనే ప్రశ్న?"
విజయ్ చేయి కడుక్కొని వెనుతిరిగాడు. సింధూ ముందుకు జరిగి....
"సార్!.... నేను మీతో మాట్లాడాలి!...." అంది మెల్లగా.
"బయట వుంటాను రండి" విజయ్ బయటికి నడిచాడు. కాశ్యప్ గంగలను సమీపించాడు.
"మీరు రూమ్‍కు వెళ్ళండి" వేగంగా చెప్పాడు.
అతని భావన కాశ్యప్‍కు అర్థం అయ్యింది. గంగ చేతిని తన చేతిలోనికి తీసుకొని హోటల్ గదివైపుకు నడిచాడు వేగంగా. విజయ్ హోటల్ ముందు నిలబడ్డాడు. లోనికి చూచాడు. నవ్వుతూ సింధూ అతన్ని సమీపించింది. లాలస వారికి కొంతదూరంలో నిలబడింది.
"చెప్పండి!...."
"మా అమ్మా నాన్నలు నాకు సంబంధాలు చూస్తున్నారు!" మెల్లగా తలవంచుకొని చెప్పింది.
"ఆ విషయం నాతో చెప్పడంలో మీ ఉద్దేశ్యం?" అడిగాడు విజయ్.
సింధూ దీనంగా విజయ్ ముఖంలోకి చూచింది క్షణంసేపు. తలదించుకొంటూ.....
"ఐ లవ్ యూ!" మెల్లగా చెప్పింది సింధూ.
"దానికి నాకు చాలా దూరం! తల్లితండ్రుల మాటలను గౌరవించండి. వారి మాటలను వినండి. వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మ్యారేజ్ లైఫ్" సౌమ్యంగా చెప్పి వేగంగా ముందుకు నడిచాడు విజయ్.
"సార్!...." పిలిచింది సింధూ.
లాలస సింధూను సమీపించింది.
విజయ్ వెనుతిరగకుండా వేగంగా ముందుకు పోయాడు.
సింధూ కళ్ళల్లో కన్నీరు....
"సింధూ! ఏడుస్తున్నావెందుకే!" అడిగింది లాలస.
కర్చీఫ్‍తో కళ్ళ నీళ్ళను అద్దుకొంటూ.... "కంట్లో నలక ఏదో పడినట్లుందే!.... పద" అంది సింధూ.
ఇరువురూ వారి కారు వైపుకు నడిచారు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments