top of page
Original.png

ఉపకారం


తండ్రి కొడుకుని డాక్టర్ చేయడానికి అందుకున్న ఉపకారం, సంవత్సరాల తర్వాత ప్రాణరక్షణగా తిరిగి వచ్చిన దృశ్యం

Upakaram - Telugu Emotional Family Story | Jeedigunta Srinivasa Rao

ఉపకారం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 20/08/2026


జీవితంలో మనం ఎవరికైనా చేసిన సహాయం వెంటనే మనకు తిరిగి రావాల్సిన అవసరం లేదు. కానీ నిజమైన మనసుతో చేసిన ఉపకారం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో మన జీవితాన్ని తాకుతుంది. తండ్రి రంగనాథ్ తన కొడుకు వెంకటేష్‌ను డాక్టర్ చేయాలనే కల కోసం పడిన తపన, ఆ సమయంలో లక్ష్మీదేవి చేసిన నిస్వార్థ సహాయం, చివరకు అదే సహాయం ఎలా ప్రాణరక్షణగా తిరిగి వచ్చిందో ఈ కథ మనసును హత్తుకునేలా చెబుతుంది. ఉపకారం, మానవత్వం, తల్లిదండ్రుల త్యాగం, కృతజ్ఞత, మంచి మనసు వంటి విలువలను గుర్తుచేసే శ్రీనివాసరావు జీడిగుంట గారి ‘ఉపకారం’ ప్రతి ఒక్కరూ చదవాల్సిన మంచి తెలుగు కథ.

ఒక స్వీట్ బాక్స్‌లో దాచిన సహాయం…


ఒక తండ్రి కలను నిజం చేసింది.

అదే ఉపకారం కాలం తిరిగిన తర్వాత ఎలా తిరిగి వచ్చిందో తెలుసుకోవాలంటే… శ్రీనివాసరావు జీడిగుంట గారి ‘ఉపకారం’ కథ చదవాల్సిందే.


మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పటికీ వృథా కాదు!

రంగనాథ్, సుమలతలకు వెంకటేష్ ఒక్కడే అబ్బాయి. రంగనాథ్ ఏలూరులో ఒక హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తూ, తనకు వచ్చే జీతంతో సంసారంలో లోటు లేకుండా గడుపుతున్నాడు. కొడుకు వెంకటేష్‌ని అల్లారుముద్దుగా పెంచుతూ మంచి కాలేజీలో చదివించి, నీట్ (NEET) ఎగ్జామ్స్‌లో ర్యాంక్ తెచ్చుకోవడంతో మెడిసిన్ కోసం జాయిన్ చేసే టైమ్‌కి తాను ఒక చిన్న ఉద్యోగినని తెలుసుకున్నాడు. డొనేషన్ కట్టడం అనేది పెద్ద సమస్యగా మారింది.


ఆ రోజు హోటల్ మూసేసాక, ఆ రోజు వచ్చిన డబ్బులు తీసుకుని తన యజమాని ఇంటికి వెళ్లి ఆయనకు లెక్క అప్పజెప్పాడు. తన కొడుకుని మెడికల్ కాలేజీలో జాయిన్ చేసే విషయం చెప్పి, ఏదైనా సహాయం చేస్తే మెల్లగా తనకు వచ్చే జీతంలో తిరిగి కొంత కొంత ఇస్తానని అడిగాడు.


హోటల్ యజమాని ఒక్కసారి రంగనాథ్ వంక చూసి, “చూడు, నువ్వు మా హోటల్లో సీనియర్‌వి నిజమే. అయితే ఇప్పుడు నీకు అవసరమయ్యే మూడు లక్షలు నువ్వు తిరిగి తీర్చడానికి పదేళ్లు పడుతుంది. నీకు మిగిలిన సర్వీస్ ఇంకా రెండేళ్లు మాత్రమే ఉంది. నీ కొడుకు డాక్టర్ చదువు కంప్లీట్ అవ్వడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది.

చూడు, ప్రతీ మనిషికీ భాగ్యవంతుడు కావాలని, తన సంతానం బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉంటుంది. కానీ అలా కుదురుతుందా? మనకి తగినంతలో మనం ఉండాలి కానీ ఇతరులతో పోటీ పడటం మంచిది కాదు. అందుకే నా మాట విని మీ అబ్బాయిని డిగ్రీ చదివించు. నువ్వు రిటైర్ అవ్వగానే నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తాను” అన్నాడు.


“నిజమే సార్! కానీ స్తోమత చూసుకుని పిల్లలని చదివించలేకపోతే వాళ్ల బ్రతుకులు ఎదుగుదల లేకుండా ఉండిపోతాయి. అందుకే మా అబ్బాయిని డాక్టర్‌గా చూడాలనేది మా కోరిక. ఇంకో చోట డబ్బు కోసం ప్రయత్నం చేస్తాను” అని వెనుతిరిగాడు రంగనాథ్.

ఇంతలో లోపల నుంచి యజమాని భార్య లక్ష్మీదేవి వచ్చి, “ఉండండి రంగనాథ్ గారు, ఈ స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్లండి. ఉదయం ఆంజనేయస్వామికి పూజ చేసినప్పుడు ప్రసాదంగా ఇచ్చారు. మా ఇద్దరికీ షుగర్ కదా, మీ అబ్బాయికి ఇవ్వండి. తప్పకుండా స్వామి దయవల్ల మీ కోరిక తీరుతుంది” అంది. యజమానురాలు ఇచ్చిన స్వీట్ బాక్స్ తీసుకుని ఆలోచించుకుంటూ బయలుదేరాడు రంగనాథ్.


‘లాభం లేదు, ఊరిలో ఉన్న పెంకుటిల్లు అమ్మేసి కొడుకుని చదివించాలి. వాడు డాక్టర్ అయితే వాడే పెద్ద ఇల్లు కొంటాడు’ అనుకుని ఇంటికి చేరాడు. సంచిని టేబుల్ మీద పెట్టి కుర్చీలో కూర్చుని ఉన్న భర్తకి సుమలత మంచినీళ్ల గ్లాస్ అందించి, “వెళ్లిన పని అయిందా?” అని అడిగింది.


“ఎంతైనా నేను పనివాడిని, వాళ్లు యజమానులు. పనికి విలువ కట్టి ఇస్తారు తప్ప ఉపకారం చేయరు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేసి అబ్బాయిని చదివిద్దాం. ఎవ్వరి సహాయం అక్కర్లేదు” అన్నాడు. “ఆ సంచిలో ఆంజనేయస్వామి ప్రసాదం ఉంది, కొద్దిగా నువ్వు నోట్లో వేసుకుని నాకు కూడా పెట్టు. ఇక అంతా ఆ స్వామిదే బాధ్యత” అన్నాడు.


సంచిలో ఉన్న స్వీట్ బాక్స్ తీసి మూత తీసిన సుమలత, “అరే! ఇందులో డబ్బులు ఉన్నాయి, స్వీట్స్ లేవు” అని బాక్స్‌ని భర్త చేతికి ఇచ్చింది.

దానిలో డబ్బులతో పాటు ఒక చిన్న ఉత్తరం రాసి ఉంది. అది హోటల్ యజమాని భార్య రాసింది: “మా హోటల్ పెట్టినప్పటి నుంచి మీరే హోటల్ మేనేజ్ చేశారు. మా వారు వ్యాపార అలవాటు ఉండి, తాను ఎంత ఖర్చు పెడితే తిరిగి ఎంత వస్తుంది అని లెక్కలు వేసుకుంటారు. మన దగ్గర నమ్మకంగా పనిచేసే వారు మనవాళ్లే అనే అభిప్రాయం ఎప్పుడు కలుగుతుందో తెలియదు. అందుకే నేను అలా అనుకుని, మీ అబ్బాయి చదువుకి అవసరమైన డబ్బులు ఈ స్వీట్ బాక్స్‌లో ఉంచాను. మీరు మీ అబ్బాయిని డాక్టర్ కోర్సులో జాయిన్ చేయించండి” అని రాసి ఉంది.


“యజమానికి తెలియకుండా డబ్బులు తీసుకోవడం మంచిది కాదు, వెళ్లి తిరిగి ఇచ్చేస్తాను” అన్నాడు రంగనాథ్. “మీరు చేసే పనికి మనకి ఉపకారం చేద్దామని ముందుకు వచ్చిన యజమాని భార్యకి ఇబ్బంది కలుగుతుందని ఆలోచించండి. ఆవిడ మంచి మనసుతో సహాయం చేసింది. ముందు అబ్బాయిని మంచి మెడికల్ కాలేజీలో జాయిన్ చేయించండి. ఇల్లు అమ్మి డబ్బులు మీ యజమాని భార్యకి తిరిగి ఇద్దురు గానీ” అంది సుమలత.


మొత్తానికి రంగనాథ్ కృషి, అతని కొడుకు కోరిక నెరవేరింది. హైదరాబాద్‌లో ఒక పేరున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. విషయం తెలిసి హోటల్ యజమాని ముక్కున వేలు వేసుకుని, ‘ఇంత డబ్బు కట్టి ఒక హోటల్ మేనేజర్ కొడుకుని డాక్టర్ కోర్సు చదివించడం ఎలా?’ అని అనుకుని, హోటల్ రాబడి పాత లెక్కలు మళ్లీ చూసుకున్నాడు అనుమానంతో. ఒక్క పైసా అనవసరంగా ఖర్చు చేసినట్టు లేకపోవడంతో గమ్మున ఉండిపోయాడు.


అనుకున్నట్టే రెండేళ్లలో రిటైర్ కావాల్సిన రంగనాథ్‌కి తన యజమాని ఇంకో సంవత్సరం సర్వీస్ పొడిగించారు. అప్పటికి కొడుకు చదువు నాలుగో సంవత్సరానికి వచ్చేసింది. ప్రతీ సంవత్సరం కాలేజీ ఫస్ట్ వస్తున్న వెంకటేష్‌కి కాలేజీ యాజమాన్యం నుంచి మంచి సహకారం అందటంతో, మిగిలిన కోర్సు పూర్తి చేసి కాలేజీ వారి సహాయంతో ‘మాస్టర్ ఆఫ్ సర్జరీ’లో చేరి గుండె జబ్బుల మీద స్పెషలిస్ట్‌గా మారాడు. తన చదువుకి సహాయం చేసిన కాలేజీ యాజమాన్యం వారి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్లోనే కార్డియాలజిస్ట్‌గా పని చేయడం మొదలుపెట్టాడు.


ఊరిలో ఖాళీగా ఉన్న తల్లిదండ్రులను హైదరాబాద్‌కి తీసుకువచ్చి, తండ్రి రంగనాథ్ చేత హాస్పిటల్లో ఒక మెడికల్ షాప్ పెట్టించాడు.

అతి త్వరలోనే వెంకటేష్ హస్తవాసి గల డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎటువంటి గుండె జబ్బులకైనా డాక్టర్ వెంకటేష్ అన్నంత పేరు వచ్చింది. ఇటు తెలంగాణ నుంచే కాక ఆంధ్రా, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల నుంచి కూడా రోగులు రావడంతో వెంకటేష్ తన సమయాన్ని ఎక్కువ భాగం హాస్పిటల్‌కే అంకితం చేశాడు. బంజారాహిల్స్‌లో ఒక అందమైన భవనం కూడా కొనుక్కున్నాడు.


ఒకరోజు రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, “అమ్మా! ఈ రోజు ఏమిటి స్పెషల్?” అన్నాడు వెంకటేష్ తల్లితో. “నీకిష్టమైన కొబ్బరి శనగపప్పు, వంకాయ వేపుడు, మజ్జిగ పులుసు” అంది సుమలత.

ఏదో ఆలోచిస్తూ అన్నం తింటున్న కొడుకుతో, “అబ్బాయీ! డబ్బులు లేనప్పుడే కంచం దగ్గర కుదురుగా కూర్చుని భోజనం చేసేవాడివి. ఇప్పుడు చేతినిండా డబ్బులు ఉన్నా కడుపునిండా అన్నం తినడానికి నీకు టైమ్ కుదరడం లేదు” అంది సుమలత.

“అమ్మా! ప్రాణం మీదికి వచ్చిన కేసులు రోజుకి ఆరు ఆపరేషన్లు చేసేసరికి నీరసం వచ్చేస్తోంది. ఒక్కటే ఆశ... ఇంటి దగ్గర మా అమ్మ నాకు ఇష్టమైన వంటలు చేసి ఎదురుచూస్తూ ఉంటుందని” అని అన్నాడు నవ్వుతూ. “అమ్మా, నాన్నగారు పడుకున్నారా?” అన్నాడు.


“పడుకున్నారు. కానీ ఆయనకు రాత్రి టైమ్‌లో మెడికల్ షాప్ వేరే వారి మీద వదిలేస్తున్నానని బెంగ” అంది.

“ఏదో ఆయనకి బోర్ కొట్టకుండా మెడికల్ షాప్ పెట్టించాను, నేను సంపాదిస్తున్నానుగా. నాన్నను ఎక్కువ శ్రమ తీసుకోవద్దని చెప్పు” అన్నాడు. “అది సరే కానీ అమ్మా, నా చదువుకి సహాయం చేసిన హోటల్ యజమాని గారికి డబ్బులు తిరిగి ఇచ్చేశారా నాన్న?” అని అడిగాడు కొడుకు. “నీ చదువు బాధ్యత మీ కాలేజీ వాళ్లు తీసుకున్న తరువాత డబ్బుకి ఇబ్బంది లేదు కదా అని ఇల్లు అమ్మగా మిగిలిన డబ్బుల నుంచి అప్పు తీర్చడానికి వెళ్లారు. అయితే యజమాని గారి భార్య ‘మీ నాన్నను తన అన్నగారుగా తలచి సహాయం చేశాను, అప్పుగా కాదు’ అని డబ్బు తీసుకోలేదు. ఆవిడ చాలా మంచిది” అంది.


భోజనం పూర్తి చేసుకుని తన తండ్రి పడుకున్న గదిలోకి వెళ్లి తండ్రిని చూసి బయటకు వస్తుంటే, “అన్నం తిన్నావా?” అని తండ్రి అడగటం చూసి, “మీరు ఇంకా పడుకోలేదా?” అన్నాడు వెంకటేష్.


“నువ్వు ఇంటికి వచ్చేదాకా నిద్ర ఎలా పడుతుందిరా?” అన్నాడు రంగనాథ్. “నీకు త్వరగా పెళ్లి చేసి మా బాధ్యత కోడలికి అప్పగించి హాయిగా విశ్రాంతి తీసుకుంటాము” అన్నాడు.


“నాన్నా, ఒకసారి ఆలోచించండి. ఈ నా హడావిడి లైఫ్‌లో పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని బాధ పెట్టడం అవసరమా?” అన్నాడు వెంకటేష్.

“ఒక డాక్టర్‌నే చేసుకో, నిన్ను అర్థం చేసుకుంటుందిలే” అన్న తండ్రితో, “అలాగే, మీరు పడుకోండి. అర్ధరాత్రి అయింది” అని తన గదిలోకి వెళ్లిపోయాడు.

“అమ్మాయి.. కొద్దిగా కౌంటర్ చూసుకో. కాంటీన్‌కి వెళ్లి కాఫీ తాగి వస్తాను” అని మెడికల్ షాప్ గుమాస్తాకి చెప్పి కాంటీన్ వైపు నడిచాడు రంగనాథ్. హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో ఉన్న పేషెంట్ల గుంపుని చూసి ‘వీళ్ల వల్లనే మేమందరం బతుకుతున్నాము’ అనుకుంటూ నడుస్తుండగా, ఒక కుర్చీలో కూర్చుని ఉన్న ఆవిడని చూసి ఆమె దగ్గరికి వెళ్లి, “అమ్మగారు.. నేను గుర్తున్నానా? మీ హోటల్ మేనేజర్ రంగనాథ్‌ని. మీరేమిటి ఇక్కడ ఉన్నారు?” అని అడిగాడు.


“బాగున్నారా రంగనాథ్ గారు! మా వారికి హార్ట్ ఎటాక్ రావడంతో విజయవాడలో చూపించాము. ఆయనకి రెండు హార్ట్ వాల్వ్‌లు పాడైపోయాయని, హైదరాబాద్‌లో ఈ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్ వెంకటేష్‌కి చూపించమన్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత తెలిసింది ఆ డాక్టర్‌కి రెండు నెలల వరకు ఖాళీ లేదు అని. ఐసీయూలో ఉంచి వేరే డాక్టర్ గారికి అప్పగించారు. మీరేమిటి హాస్పిటల్‌కి వచ్చారు, అందరూ కులాసానేగా?” అని అడిగింది.


“అందరూ బాగానే ఉన్నాము. మీరు చెప్పిన డాక్టర్ వెంకటేష్ మా అబ్బాయే. వాడు ఈ రోజు డాక్టర్ అయ్యాడంటే ఆనాడు మీరు చేసిన సహాయమే కారణం. మా అయ్యగారిని ఈ రోజు మా అబ్బాయి చూసి, ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి. నేను ఇక్కడ మెడికల్ షాప్ నడుపుతున్నాను, అలా వెళ్లి కాఫీ తాగుదాం రండి” అని ఆవిడని తీసుకుని వెళ్లి కొడుకు రూంలో కూర్చోబెట్టి, అక్కడ ఉన్న నర్స్‌తో “డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు?” అన్నాడు.


“ఉదయం ఏడు గంటలకు వచ్చి ఒక పదిమంది పేషెంట్లను చూసి ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లారు. సార్ కోసం తెచ్చిన టిఫిన్ అలాగే ఉంది” అంది.

“సరే, నువ్వు వెళ్లి రెండు కాఫీలు తీసుకుని రా. ఈవిడ మా యజమానురాలు” అని చెప్పాడు రంగనాథ్. కాఫీ తాగి అరగంట అయినా కొడుకు రూమ్‌కి రాకపోవడంతో రంగనాథ్ గారు కొడుక్కి ఫోన్ చేసి, “ఒక ఐదు నిమిషాలు ఇక్కడికి రా” అన్నాడు.

“ఏమిటో చెప్పండి నాన్నా, నేను ఆపరేషన్ చేయడానికి వెళ్లాలి” అన్నాడు వెంకటేష్. రెండు ముక్కల్లో సంగతి చెప్పి, “వీలు చూసుకుని ఐసీయూలో 23వ బెడ్ మీద ఉన్న చలపతి రావు గారిని చూసి ఆయనను రక్షించే బాధ్యత తీసుకో” అని చెప్పాడు రంగనాథ్.


రెండు గంటల తరువాత తండ్రికి ఫోన్ చేసి, “ఈ రోజు అమ్మని నాకోసం డిన్నర్ చేయొద్దు అని చెప్పండి. మీ యజమానికి వెంటనే ఆపరేషన్ చేయాలి. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్ ఉంది బతకడానికి. ఖర్చు ఎనభై లక్షల వరకు అవుతుంది. ముందు నేను ఆ విషయాలు చూసుకుంటాను, నువ్వు ఆవిడని మన ఇంటికి తీసుకుని వెళ్లు” అని చెప్పాడు.


రాత్రి ఎనిమిది గంటలకు తండ్రికి ఫోన్ చేసి, “నాన్నా! ఆపరేషన్ బాగానే జరిగింది, కొన్నాళ్లు హాస్పిటల్లోనే ఉండాలి. మీరు ఆవిడకి ఈ విషయం చెప్పండి” అన్నాడు.


“అయితే మేము ఇంటికి వెళ్తాము, ఆపరేషన్ అయ్యేంతవరకు హాస్పిటల్ వదిలి రాను అనడంతో నేను ఇక్కడే ఉన్నాను” అన్నాడు రంగనాథ్.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తన ఇంటికి తీసుకుని వచ్చాడు వెంకటేష్, తన తండ్రి పనిచేసిన హోటల్ యజమానిని. “మీరు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఒక ఆరు నెలలు విశ్రాంతి అవసరం” అని చెప్పాడు.


“బాబు.. ఆనాడు మీ నాన్న నన్ను నీ చదువుకి డబ్బులు అప్పు ఇవ్వమన్నప్పుడు నేను సహాయం చేయకపోగా మీకెందుకు పెద్ద చదువులు అన్నాను. ఈ రోజు నువ్వే నా ప్రాణం కాపాడావు! రంగనాథ్, నువ్వు నన్ను క్షమించు” అని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు చలపతిరావు.


హాస్పిటల్ బిల్లు ఎంత అయింది అని చలపతి అడగలేదు, రంగనాథ్ చెప్పలేదు.

తన యజమాని పూర్తి ఆరోగ్యంతో వెళ్లడం, యజమానురాలి కళ్లలో కృతజ్ఞతలు చూడటం రంగనాథ్‌కి ఆనందంగా ఉన్నా, కొడుకు ఆయన వైద్యానికి ఎంత ఖర్చు పెట్టాడో అని అడగడానికి కూడా భయపడ్డాడు.


ఆ రోజు ఆదివారం. ఆపరేషన్లు ఉదయమే పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన కొడుకుని చూసి, “త్వరగా వచ్చావు. లంచ్ రెడీ చేస్తాను, వేడిగా చేమదుంపల వేపుడు చేస్తాను. డ్రెస్ మార్చుకుని రా” అంది సుమలత.


“ఎవరో చూడు.. కారులో దిగారు” అంటూ కొడుకుతో పాటు బయటకు వచ్చింది సుమలత. కారులో నుంచి మెరుపుతీగ లాంటి అమ్మాయి దిగి చేతిలో చిన్న బ్యాగ్‌తో వచ్చి, “నమస్కారమండి, నేను చలపతి రావు గారి అమ్మాయిని” అనడంతో లోపలికి రమ్మని పిలిచారు.


“క్షమించండి, నేను కొత్తగా అమెరికా వెళ్లడం వలన నాన్నకి ఒంట్లో బాగుండకపోయినా వెంటనే రాలేకపోయాను. నాన్నగారు మీకు ఈ చెక్కు స్వయంగా నన్నే తీసుకుని వెళ్లి ఇవ్వమన్నారు. హాస్పిటల్లో మా కోసం ఖర్చు పెట్టిన డబ్బులు” అంటూ చెక్కు వెంకటేష్‌కు ఇచ్చింది.


“మీ అమ్మగారు నన్ను తన మేనల్లుడు అనుకుని నా చదువుకి సహాయం చేశారు. ఇప్పుడు ఈ చెక్కు తీసుకుని మీ అమ్మగారి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉండలేను” అంటూ చెక్కుతో పాటు కాఫీ ఇచ్చి పంపించేసాడు వెంకటేష్.


“మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఎందుకంటే మన కులాలు వేరు కదా” అని ఫోన్ చేసి అడుగుతున్న యజమాని గారితో, “సంతోషం, అంతకంటేనా!” అన్నాడు రంగనాథ్. ఎందుకంటే ఆ రోజు చెక్కు తీసుకుని వచ్చినప్పుడు కొడుకుతో ఆ అమ్మాయి నచ్చింది అనిపించుకున్నాడు.

ఒక్కొక్కసారి తెలియకుండా చేసిన ఉపకారం జీవితంలో ఎప్పుడో అప్పుడు సహాయపడుతుంది.


— శుభం —

జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):











జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


జీడిగుంట శ్రీనివాసరావు

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page