top of page
Original.png

భక్త అంబరీషుడు - పార్ట్ 3

6 minutes ago
3 min read

అంబరీషుడు సుదర్శన చక్రం నుంచి దుర్వాస మహర్షిని రక్షిస్తున్న పౌరాణిక దృశ్యం

Baktha Ambareeshudu - Part 3 - Telugu Devotional Story | Sudhavishwam Akondi

భక్త అంబరీషుడు - పార్ట్ 3 - తెలుగు భక్తి కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on 25/11/2026


అహంకారం లేకుండా, పెద్దలను గౌరవిస్తూ శ్రీహరి స్మరణతో జీవించాలనే గొప్ప సందేశాన్ని ఈ పౌరాణిక కథ అందిస్తుంది.


అన్ని లోకాలూ తిరిగి, బ్రహ్మదేవుని వద్దకు, పరమశివుని వద్దకూ కూడా వెళ్లి సుదర్శన చక్రం నుంచి రక్షించమని వేడుకుంటాడు దుర్వాస మహర్షి. 


కానీ వాళ్లు మాకు సాధ్యపడదని చెబుతారు. చివరకు శ్రీహరి వద్దకు వెళ్లినా, ఆయన కూడా నా వల్ల కాదని, అంబరీషునే వేడుకొమ్మని చెప్పి పంపిస్తాడు. అంబరీషుని కాళ్లు పట్టుకోవడానికి వెళతాడు మహర్షి.


అప్పుడు... తన కాళ్లు పట్టుకోబోతున్న దుర్వాస మహర్షిని వారిస్తాడు అంబరీషుడు. "అయ్యో మహర్షీ! మహా తపస్వి అయిన మీరు నాలాంటి అల్పుని పాదాలు పట్టుకోవడం ఏమిటి? మీరు అలా చేయకూడదు" అని దూరం జరిగి, అంతటి మహర్షి నా కాళ్లు పట్టుకోవడమా అని బాధపడతాడు కూడా ఆ భక్తుడు.


"అంబరీషా! నీ భక్తిని గురించి సరిగ్గా ఆలోచించక, క్షణికమైన ఆవేశంతో ఇలా ప్రవర్తించాను. శ్రీహరి పరమ భక్తుడివైన నీవు ఆయన పూర్తి అనుగ్రహం పొందిన మహానుభావుడివి.


నన్ను ఈ చక్రం బారినుండి రక్షించు! నీవే అందుకు సమర్థుడవు! ఈ చక్రం నీకోసమే ఇక్కడ ఉంది. నీ మాటే వింటుంది" అన్నాడు శాంతంగా.


అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ... "ఓ చక్రమా! నీవు దానవులను మాత్రమే శిక్షించే దానవు. 


ఆ పరమాత్మ నిన్ను దుష్టులైన వారిని శిక్షించడానికి వినియోగిస్తాడు. నీకు, శ్రీహరికి భేదం లేదు. ఏదో చిన్న పొరపాటు చేసిన సాత్వికుడైన ఈ మహర్షిని వదిలివేయు" అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు సుదర్శన చక్రం మహర్షిని వదిలివేసి అంతర్థానం అవుతుంది.


ఆ తర్వాత దుర్వాసుడు అంబరీషుని పొగుడుతాడు. మిగతా జనులు కూడా మహర్షికి బాగా బుద్ధిచెప్పావు అంటారు. కానీ ఆయన మాత్రం... 'ఇదంతా శ్రీహరి కృప' అని, మహర్షి పూజనీయుడు అని వాళ్లతో అని, మహర్షికి భోజనం పెట్టి, అతిథి సత్కారం చేసి, పంపించి, అప్పుడు తాను తింటాడు.


జీవితం అంతా ఆ స్వామి స్మరణలోనే ఉండి, చివరికి ఆయనలోకి చేరిపోతాడు. ఈ మహాత్ముని కార్తీక మాసంలో ఏకాదశి నాడు స్మరించడం వల్ల మనకు కూడా అటువంటి అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి తరించగలుగుతాము.


ఇంతకీ అంతటి మహర్షికి ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? మహర్షులకు కోపం వస్తే, ఇంకేం మహర్షి అనే రకరకాల ప్రశ్నలు రావడం ఈ కలియుగంలో సామాన్యం. 


అలా ఆయనకు కోపం వచ్చి, అలా భంగపడడానికి ఒక కారణం ఉంది. సామాన్యులకు జీవితంలో నడుచుకునే విధానాన్ని చెప్పడానికి కొన్ని సంఘటనలు మహర్షుల, మహాత్ముల జీవితంలో జరిగేలా, ఎలా ఉండాలో చెప్పేలా భగవంతుడు సృష్టిస్తాడు.


పూర్వం దుర్వాస మహర్షి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలని అనుకుని, ఔరస మహర్షి కూతురు అయిన 'కందళి' అనే ఆమెను పెళ్లి చేసుకుంటానని ఔరస మహర్షిని అడుగుతాడు. 


కానీ పుట్టుకతో కోపం కలిగిన మహర్షి ఈయన. ఆయన తల్లి కడుపులో ఉన్నప్పుడు హైహయులు అనే వారు ఏర్పరిచిన ఉద్రిక్తత వల్ల మహా కోపంతో తల్లి కడుపులోంచి బయటకు వస్తాడు దుర్వాసుడు. అలా ఆయనలో కొంత కోపం ఉంటుంది. 


ధర్మాత్ముల పైన, భక్తులు, వినయంగా ఉండే వారిపై కోపించడు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా కోపం బయటకు వస్తూ ఉంటుంది.


తన కూతురిని అడుగుతున్నాడు కానీ ఈయన ముక్కోపి, పిల్లను ఇస్తే ఏమవుతుందో, ఇవ్వనంటే కోపం తెచ్చుకుంటాడేమో అనే ఆలోచన వచ్చిన ఔరస మహర్షి...



"నా కూతురు నీకు సరిపోదు. తను కొంచెం అవివేకి" అని ఏదో ఒక కారణం చెప్పి, పిల్లను ఇవ్వనని అంటాడు ఔరస మహర్షి.


కానీ... "పర్వాలేదు. నేను సర్దుకుంటాను" అని చెప్పి, పెళ్లి చేసుకుంటాడు దుర్వాసుడు ఆమెను.


కానీ ఓ రోజు ఏదో పనిలో ఆలస్యం చేసిన భార్యపై కోపం వచ్చి, ఆమె వైపు కోపంగా చూస్తాడు మహర్షి. అలా చూడగానే కందళి భస్మం అవుతుంది.



అప్పుడు... 'అయ్యో! ఇలా చేశాను. కాస్త కోపం తగ్గించుకోలేకపోయాను!' అని పశ్చాత్తాపంతో బాధపడి, ఆవిడకు వరం ఇస్తాడు. "నువ్వు కందళి కనుక కదళి అంటే అరటి చెట్టుగా పుడతావు. అలాగే పెరుగుతావు. 


ఎంతగా తెంపినా మళ్లీ పెరుగుతావు నశించకుండా! భగవంతునికి నీ నుండి వచ్చే పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలా నువ్వు తరిస్తావు!" అని వరం ఇస్తాడు.


జరిగిన విషయాలు తెలియని ఔరస మహర్షి ఒకరోజు తన కూతుర్ని, అల్లుడిని చూద్దామని వస్తాడు. 'కందళి' తండ్రి అయిన ఔరస మహర్షికి తన కూతురు ఎక్కడా కనిపించదు. \


అప్పుడు ఆయన దివ్యదృష్టితో చూసి, జరిగిన విషయం గ్రహించి, కోపంతో... "నేను వద్దన్నా సర్దుకుంటానని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఇలా చేశావు. 


అందుకే నీకు శాపం ఇస్తున్నా! భవిష్యత్తులో ఒక రాజర్షి చేతిలో అవమానం పొంది, అన్ని లోకాలూ తిరిగి నీ తప్పు చెప్పుకుంటావు" అని శపిస్తాడు.


ఆ శాప ఫలితంగానే ఇలా అన్ని లోకాలూ తిరిగి, రక్షణ కోరతాడు దుర్వాసుడు.


అలా మనిషి నియమబద్ధంగా జీవిస్తూ, అహంకారం లేకుండా, ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చినా, అంతా ఆ శ్రీహరి అనుగ్రహంగా వచ్చినదని భావిస్తూ, పెద్దల పట్ల, భాగవతుల పట్ల వినయంగా ఉంటూ ఈశ్వర స్మరణతో అంబరీషునిలా జీవిస్తే, చివరికి ఆయనలాగే ఆ శ్రీహరిని చేరుకుంటాడు అని ఈ కథ తెలియజేస్తుంది.


సర్వం శ్రీహరి చరణారవిందార్పణమస్తు 🙏🙏

శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏సుధావిశ్వం

  


సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page