అచ్చిరాని తెల్లచొక్కా
- Varanasi Sudhakar

- Jun 2
- 4 min read
Acchirani Tellachokka - Telugu Comedy Story | Varanasi Sudhakar
అచ్చిరాని తెల్లచొక్కా - తెలుగు హాస్య కథ | వారణాసి సుధాకర్
Published in manatelugukathalu.com on 02/06/2026
బాల్యం, కౌమారం, యవ్వనం, ఉద్యోగ జీవితం... ప్రతి దశలో ఒక తెల్లచొక్కాతో రచయితకు ఏర్పడిన సరదా అనుభవాల సమాహారమే ఈ హాస్యరచన. తెల్లచొక్కా మీద పడిన మరకలు మాత్రమే కాదు, జీవితంలో మిగిలిన మధుర జ్ఞాపకాలను కూడా రచయిత చమత్కారంగా గుర్తు చేసుకున్నారు. నవ్విస్తూ, పాత రోజుల్ని గుర్తు చేస్తూ, మనల్ని మన బాల్యానికి తీసుకెళ్లే ఆహ్లాదకరమైన రచన ఇది.ప్రతి పాఠకుడూ తన జీవితంలోని ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇందులో చూసుకుంటాడు.
నా బాల్యావస్థలో...
చిన్నప్పుడు నా పుట్టిన్రోజు నాడు, మా అమ్మ నలుగెట్టి, కుంకుడుకాయ పులుసుతో చక్కగా 'అభ్యంతరస్నానం' చేయించిన ప్రతిసారీ, తల రుద్దుతూ,"ఎంత మట్టి వస్తోందో, చూడు" అనేది.
నా ఫ్రెండ్ విస్సిగాడు - నేను, ఇసకలో ఆడి, ఆ ఇసకతో పరస్పరం తలంబ్రాలు పోసుకుంటే మట్టిగాక ఏమొస్తుంది ?
🤪
సరే, ఎలాగో ఎర్రబడ్డ కళ్ళతో, తెల్లచొక్కా తొడుక్కుని స్కూలుకి వెళితే, మా రామనాధం మేస్టారు, నాకు జవాబు తెలియని ఏదో ప్రశ్న అడిగితే... చెప్పలేకపోయినందుకు "మట్టిబుర్ర" అన్నారు !
"ఈయనకెలా తెలిసిపోయిందబ్బా ?" అనుకుని, "పొద్దున్న మా అమ్మగారు తలంటారండి" అన్నాను. ఆయనతో సహా క్లాసులో అందరూ ఫక్కుమన్నారు !
😂😂😂
💐💐
నా కౌమార దశలో...
నా చిన్నప్పుడు మా పక్కింటి బ్యాంకు గుమస్తా, నక్కింటి నారాయణ గారు, "వైట్ అండ్ వైట్" డ్రస్సు వేసుకుని , టకప్పు కూడా చేసుకుని, అప్పట్లో వచ్చిన "చదువుకున్న అమ్మాయిలు" సినిమాలో బ్యాంకుద్యోగి ఏఎన్నార్ లాగ ఫీలయిపోతూ, నొక్కుల జుట్టు అందంగా దువ్వుకుని, డొక్కు సైకిలు మీద డూటీకి వెళుతుంటే...నాకు ఆవేశం వచ్చేసి, కోడి కెక్కరించినట్టున్న నా జుట్టుని పదిసార్లు దువ్వుకుని, మా క్లాసులో వున్న అమ్మాయిల ముందు షైనై పోదామని తలంచి, ఇంట్లో పేచీపెట్టి మరీ కుట్టించుకున్న తెల్ల డ్రస్సు వేసుకుని, బళ్ళోకెళ్ళాను.
మన కేశ సంపద, స్వతంత్రం ప్రకటిస్తూ, కొత్తగా నాటిన వరిచేలో మొక్కల్లాగ, వెంట్రుకలన్నీ దేనికది విడివిడిగా నిలబడినట్టు మా మేష్టారికి ఎప్పుడు కనబడిందో గాని, "ఇప్పుడు నీ జుట్టే నువ్వు చెప్పిన మాట వినకపోతే, రేపు నీ పెళ్ళాం ఏం వింటుందిరా ?" అని, మా క్లాసులో అమ్మాయిల ముందు నన్ను అవమానించడం, వాళ్ళు ఫక్కున నవ్వడం, మయసభలో ఎన్టీఆర్ ని చూసి ద్రౌపది నవ్వినప్పుడు కలిగినంత బాధ కలిగింది !
😥😥
సాయంత్రం మా స్కూలు గ్రౌండ్లో మా కుర్ర గ్యాంగుతో "దూద్ బాల్" (టెన్నిస్ బంతితో ఒకళ్ళనొకళ్ళు చితక్కొట్టుకోవడం) ఆడి కొంపకు చేరుకుంటే, మా అమ్మ, "అదేవిట్రా, పొద్దున్న చక్కటి తెల్లబట్టలు వేసుకెళ్ళి,ఇలా ఎర్ర రంగు డ్రస్సుతో వచ్చావ్ ?" అనేదాకా మనకి తెలీలేదు !
"నేరం నాది కాదు, ఎర్ర కంకరది !" అని సరిపెట్టుకున్నాను...
😌😌
💐💐
మన యవ్వన రాగాలలో...
వచ్చీరాని వయసులో, "ఉమ్మడి కుటుంబం" సినిమాలో ఎన్టీఆర్ తెల్లటి ప్యాంటు తొడుక్కుని, చొక్కాలోంచి లోపల బనీను కనపడేట్టు తెల్లటి చొక్కా కుట్టించుకుని, "చెప్పాలని ఉందీ...గుండె విప్పాలని ఉందీ" అని పాడుతూ, అదే రంగు మ్యాచింగ్ చీర కట్టుకున్న క్రిష్ణకుమారి వెంటపడుతుంటే చూసి ఆనందించకుండా, ఎన్టీఆర్ తెల్లచొక్కా మీదా, క్రిష్ణకుమారి మీదా మనసు పారేసుకుని (🤫) తెల్లటి బనీను కొనుక్కుని , తెల్లచొక్కా కూడా కుట్టించుకున్నాను కానీ...చొక్కా లోపలున్న బనీను బయటికి కనపడ్డం లేదు !
కాటన్ చొక్కాలోంచి ఏం కనపడుతుంది ?
అప్పటికే లోపలున్న బనీను కనపడే టెర్లిన్ చొక్కాలు బజార్లో వస్తున్నాయ్ కానీ, అది కొనడానికి మనకి బడ్జెట్ చాల్లేదు !
😞
సర్లే...కుట్టించుకున్న తెల్లచొక్కా చూసి అందరూ ఆనందిస్తారు కదాని, పనిలో పని, దారిలో మా సందు చివరున్న లోకల్ క్రిష్ణకుమారి కూడా చూస్తుంది కదాని, గెద్దగూడు లాంటి మన క్రాఫుని పదిసార్లు దువ్వీ దువ్వీ, రెండు దువ్వెన్నలు విరగ్గొట్టి, ఇంట్లో కడుపునిండా తినాల్సినవన్హీ (?) తిని, రోడ్డున పడ్డాను...
అప్పుడు సగం దూరం వెళ్ళాక వెలిగింది...ఆరోజు "ఏప్రిల్ ఫూల్స్ డే" అని ! మిత్రులందరూ ఒకళ్ళనొకళ్ళు ఇంకుతో సత్కరించుకునే పవిత్ర దినమని మనకి స్పృహ వచ్చేసరికి మా తొట్టి గ్యాంగు మిత్రులందరూ చేతుల్లో ఇంకు పిచికారీలు పట్టుకుని, నా చుట్టూ నాట్యం చేస్తున్నారు !
💃💃💃
తర్వాత తెలివిగా ఆ నీలం పువ్వుల తెల్లచొక్కాని చాలాకాలం డిప్ప కొట్టించుకుందుకు వెళ్ళేటప్పుడు, ఏప్రిల్ ఒకటి నాడు మాత్రమే బయటికి తీసి వాడుకున్నాను.
😎😎
💐💐
ఉద్యోగపర్వం...
"అంతస్తులు" సినిమాలో, ఏయన్నార్, తెల్హటి చొక్కాలోంచి తెల్హటి బనీను కనిపిస్తూ, ఇంకో తెల్హటి ప్యాంటు తొడుక్కుని, తెల్లగా నవ్వుతూ, తల్లో తెల్లటి పూలు పెట్టుకుని, తెల్హటి చీరలో మెలికలు తిరిగిపోతున్న క్రిష్ణకుమారిని చూసి, "తెల్లచీర కట్టుకున్నదెవరికోసమూ.." అనిపాడుతుంటే, ఆ స్ఫూర్తితో, ఆ తెల్లడ్రస్సు మీద మళ్ళీ మోజుపడి, నాలుగు తెల్ల చొక్కాలు కుట్టించేశాను.
పెళ్ళికూతురికి వైట్ కలరంటే ఇష్టమని తెలుసుకుని, పెళ్ళిచూపులకి వెళ్ళేటప్పుడు, ఒక అద్భుతమైన తెల్లడ్రస్సు ఒంటికి తగిలించుకుని, హడావిడిగా భోజనం చేస్తుంటే...
"ఆదిలోనే హంసపాదు" అన్నట్టు, తొడుక్కున్న మొదటి రోజే ఆ తెల్లచొక్కా మీద వేడి వేడి సాంబారు పడిపోతే, "నువ్వు నాకు నచ్చావ్" సినిమాలో వెంకీ లాగ, మొత్తం డ్రస్సు మార్చాల్సి వచ్చింది !
😥
పట్టు వదలని విక్రమార్కుళ్ళాగ, రెండో తెల్లచొక్కా తొడుక్కుని, ఎర్ర బస్సు ఎక్కితే...ఎప్పుడు తగిలిందో, ఎలా తగిలిందో...నాకు తెలీకుండానే ఛాతీ భాగంలో నల్లటి పెద్ద ఆయిల్ మరక ప్రత్యక్షం !
😟😟
"ముందుకు సాగుటయా, వెనుకకు మరలుటయా ?" అనే సందేహం వచ్చింది కానీ, రాకరాక వచ్చిన మంచి సంబంధం కాకి ఎత్తుకు పోతుందని భయపడి, ముందుకే సాగాను...
"మరక మంచిదే..." అనుకుందో ఏమో, నీలం చీర కట్టుకున్న పెళ్ళికూతురు, పచ్చ జండా ఊపేసింది !
మొదటిసారి, "తెల్లచొక్కా అచ్చొచ్చింది !" అనుకుని,"యాహూ..." అని అరిచేశాను !
🥳🥳🤗🤗
💐💐
డాక్టర్ అవబోయి. ముఖ్యమంత్రి అయిపోయిన వైయస్సార్ గారు, ఎప్పుడు చూసినా, తెల్హటి చొక్కాలోంచి, రంగుమాయని బనీను కనిపిస్తూ, తెల్హటి పంచెకట్టుకుని, తెల్లగా నవ్వుతూ కనిపిస్తుంటే, ఆయన బట్టల్ని అంత తెల్లగా ఎలా మెయింటేన్ చేస్తాడో తెలుసుకోవాలనుకున్నాను కానీ, ఆయన అపాయింట్మెంటు దొరకలేదు !
😞
"గొప్పవాళ్ళు కొన్ని వేల డ్రస్సులు కుట్టించుకుంటార్రా, ఒకసారి తొడిగిన డ్రస్సు మళ్ళీ తొడగరు, అందుకే అంత తెల్లగా మెరుస్తారు" అన్నాడు, మా ఫ్రెండు, చలిమిడి చెలమయ్య. నేను అవాక్కు !
ఇప్పటికీ మా ఇంట్లో ఒక డజనుకి పైగా తెల్లచొక్కాలు ఆయిల్ మరకలు, ఆవకాయ కర్రులు, సాంబారు, మసాలా కారం తీపి గుర్తులతో మా బీరువాలో మూలుగుతున్నాయ్ !
కాఫీపొడి వడగట్టిన గుడ్డ రంగులో, ఓ పాతిక బనీన్లు ముక్కుతున్నాయ్ !
వాటిని వాడుకోలేం...బయట పడెయ్యలేం !
😟😟
ఫేసుబుక్కులో, ఎందరెందరో మహానుభావులు చెప్పిన, మరకలు పోవు చిట్కాలు, టూత్ పేస్టు, కాల్గేట్ వారి తెలపళ్ళ పొడి, టాల్కం పౌడరు, టైడ్, గంజి, పాలు, సున్నం, చాకలి సోడా వాడినా...
"ఎంత ఉతికినా...ఎన్ని వాడినా...
ఎంతవారికైన మరక పోవునా..." అని ఆరున్నొక్కో రాగంలో పాడుకుంటూ, సరిపెట్టుకోడమే ఉత్తమం !
వారణాసి సుధాకర్.
💐💐💐💐💐💐
నా యీ స్వానుభవాల తెల్లచొక్కా కథ...
ఎన్నిరోజులు తొడిగినా, ఎన్నిసార్లు సాంబారు, ఆవకాయ అన్నాలు తిన్నా, మరకలు పడకుండా, తెలుపు మెరుపు తగ్గకుండా చూసుకుంటూ, వేసుకుంటున్న ధవళ వస్త్రధారులందరికీ...
సామూహికంగా, మూకుమ్మడిగా అంకితం !
😌😌🙏
***
వారణాసి సుధాకర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
అందరికీ నమస్కారం.
నా పేరు వారణాసి సుధాకర్.
పుట్టినది, పెరిగినది, తణుకు పట్టణంలో...
హైస్కూలు దశలో చదువుతో పాటు, వివిధ కళలలో, ఆటలలో, చురుకుగా పాల్గొని, వందల బహుమతులు పొందాను.
కాలేజీ విద్యార్థి దశనుంచి, విజయచిత్ర లాంటి సినిమా పత్రికలలో రచనలు చేసి, బహుమతులు పొందాను.
LIC లో సీనియర్ మేనేజర్ గా పనిచేసి, విశ్రాంత జీవితం గడుపుతూ, సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ, ప్రజలకు ఎంతో కొంత ఉపయోగించే విషయాలను తెలియజేసే కథలు రాస్తూ, వివిధ ఫేస్ బుక్ గ్రూపుల్లో సుమారు వందకు పైగా కథలు రాశాను, ఇంకా రాస్తున్నాను.
ప్రస్తుతం పిల్లలు, మనవలతో అమెరికాలో వుంటున్నాను.
ఇదీ క్లుప్తంగా నా పరిచయం.
🙏







Comments