top of page
Original.png

మాస్టారికి కానుక


పెళ్లి వేడుకలో గురువును సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు
పెళ్లి వేడుకలో గురువును సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

mastariki kanuka - Telugu Emotional Story | Dr. Shahanaz Bathul

మాస్టారికి కానుక - తెలుగు భావోద్వేగ కథ |Dr. షహనాజ్ బతుల్ 

Published in manatelugukathalu.com on 20/05/2026


పందొమ్మిది సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితుల పెళ్లి సందర్భంగా కలుసుకున్న శిష్యులు… తమ జీవితాలను మలిచిన గురువు సత్యం మాస్టారిని అనుకోకుండా కలుస్తారు. గురువు చూపిన మానవత్వం, నిజాయితీ, ప్రేమకు కృతజ్ఞతగా వారు అందించిన “మాస్టారికి కానుక” ప్రతి హృదయాన్ని తాకే భావోద్వేగ తెలుగు కథ.


శేఖర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగాడు. తన సూట్‌కేస్ తీసుకొని, క్యాబ్ బుక్ చేశాడు. క్యాబ్‌లో కూర్చున్నాడు. క్యాబ్ బయలుదేరింది. హైదరాబాద్‌లో ఎన్ని సంవత్సరాల తర్వాత కాలు పెట్టాడు? క్యాబ్‌లో నుండి చూస్తుంటే చాలా మార్పులు కనిపిస్తున్నాయి.


చాలా పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్‌మెంట్లు. తన బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. పదవ తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాడు. ఆ తర్వాత తండ్రికి ఢిల్లీకి బదిలీ అవ్వగా, కుటుంబం ఢిల్లీ వెళ్ళిపోయింది.


అక్కడే ఇంటర్ చదివాడు. ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయాడు.


తరువాత తండ్రికి విశాఖపట్నం బదిలీ అయింది. విశాఖపట్నంలో ఉన్నప్పుడు తండ్రి పదవీ విరమణ, తనకు పెళ్లి జరగడం, జరిగిపోయాయి.


విశాఖపట్నం నుండి భార్యను తీసుకొని, మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. ఇప్పుడు తను ఇద్దరు పిల్లల తండ్రి. ఇప్పుడు హైదరాబాద్‌లో తన చిన్ననాటి స్నేహితుడు రాము పెళ్లి జరుగుతుంది.


కొంచెం ఆలస్యంగా చేసుకుంటున్నాడు. తన క్లాస్‌మేట్స్, తన స్నేహితులు అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి.


రాము అసలు పెళ్లి చేసుకుంటాడో లేదో అనుకున్నారు. రాముకి సీత దొరుకుతుందో లేదో అనేవారు. అందరూ ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలకు తండ్రులు అయిపోయారు.

హైదరాబాద్ వదిలి చాలా సంవత్సరాలు అయ్యింది. అందరినీ కలిసినట్లుంటుంది అనే ఉద్దేశంతో వచ్చాడు.


రాము పెళ్లిలో చిన్నప్పటి స్నేహితులు కలవాలని అనుకున్నారు. వాళ్లు కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్‌బుక్‌లో కొంతమంది స్నేహితులు కలిశారు. వాళ్ళందరూ కలిసి ఒక వాట్సాప్ సమూహం చేసుకున్నారు.


రాము పెళ్లికి విశాఖపట్నం నుండి కొద్దిమంది మాత్రమే వచ్చారు. అప్పటికి ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాట్సాప్‌లో కలిశాక, ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఎన్నో విషయాలు పంచుకున్నారు.


అందరూ ఒకసారి కలుసుకోవాలని అనుకున్నారు. అంతలో రాము పెళ్లి శుభలేఖ వాట్సాప్‌లో పెట్టాడు. "మీరందరూ తప్పక రావాలి. నా పెళ్లిలోనైనా అందరమూ కలుద్దాము. మనము పదవ తరగతి చదివి పందొమ్మిది సంవత్సరాలయ్యింది.

పాఠశాల రోజులు గుర్తు చేసుకుందాము. ఎంత బిజీగా ఉన్నా నాలుగు రోజులు సెలవు పెట్టి రావాలి" అని నిర్ణయించుకున్నారు.


రాము పెళ్లికి అందరూ వస్తున్నారు. ఇవన్నీ గుర్తుకు వస్తుంటే పాఠశాలలోని సత్యం మాస్టారు గుర్తుకు వచ్చారు.


మాస్టారు పదవీ విరమణ చేసి ఉంటారు. ఎలా ఉన్నారో? ఎక్కడ ఉన్నారో?

పాఠశాలలో పాఠాలు చెప్పే మాస్టర్లు అందరూ బాగా చెప్పేవారు. అందరూ మంచివాళ్లే. తను, రాము ఇద్దరూ క్లాస్‌లో బాగా చదివేవారు.దాదాపు మాస్టర్లు అందరూ తామిద్దరినీ బాగా అభిమానించేవారు.అందరిలోకి మంచి మాస్టారు సత్యం మాస్టారు.సత్యం మాస్టారు తెలుగు బోధించేవారు. తెలుగు రాని వాళ్లకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పేవారు.


తెలుగు భాష మీద అభిమానం ఏర్పడుతుంది. తెలుగు క్లాసును అందరూ ఆసక్తిగా వినేవారు.మంచితనానికి మారుపేరు. మానవత్వం మూర్తీభవించిన మనిషి. విద్యార్థులతో ప్రేమగా మాట్లాడేవారు. నిజాయితీ ఆభరణం.ఒకసారి శంకరం మాస్టారు కొత్తగా చేరిన ఉపాధ్యాయునితో,"మనం నిజాయితీగా ఉంటేనే, విద్యార్థులను నిజాయితీగా ఉండమని చెప్పగలం.మనం సమయాన్ని పాటిస్తేనే విద్యార్థులకు సమయానికి క్లాస్‌కి రమ్మని చెప్పగలం.మన పనిని బాధ్యతాయుతంగా చేస్తేనే, వాళ్లను బాగా చదవమని చెప్పగలం," అని చెప్పారు.


ఈ మాటలు తను వినడం జరిగింది. అప్పుడు "మాస్టారు ఎంత బాగా చెప్పారు" అనుకున్నాడు. ఇంకా మాస్టారి మీద అభిమానం పెరిగింది. ప్రతి వృత్తిలోనూ నిజాయితీపరులు, అవినీతిపరులు ఉంటారు.నిజమే. మాస్టారు కష్టపడి పని చేస్తారు. క్లాస్‌కి ఎప్పుడూ ఆలస్యంగా రారు.పేపర్లు దిద్దేటప్పుడు కూడా న్యాయంగా దిద్దేవారు. అంతే కాదు, పేదవారి మీద జాలి, దయ ఉండేవి. ఒక విద్యార్థికి ఫీజు కట్టడానికి తండ్రి దగ్గర డబ్బులు లేకపోతే,చదువు మానిపిస్తానన్నారు. ఆ విద్యార్థి బాధగా స్నేహితులతో చెప్పుకున్నాడట.


ఆ విషయం తెలిసి,వాళ్ల ఇంటికి వెళ్లి,"మీ అబ్బాయికి చదువు మాన్పించవద్దు. మీ అబ్బాయి ఫీజులు నేను కడతాను," అన్నారట. ముందు ఆ విద్యార్థి తండ్రి ఒప్పుకోలేదుట.


"కావాలంటే అప్పుగా తీసుకోండి. నేను అడగను. మీరు ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. చదివి ఉద్యోగం చేసి తీర్చండి," అన్నారట. సరేనని ఆ విద్యార్థి తండ్రి ఒప్పుకొని కొడుకుని పాఠశాలకు పంపించాడు. ఈ వార్త పాఠశాల అంతా తెలిసిపోయింది. అందరూ సత్యం మాస్టారు గురించి "మానవత్వం మూర్తీభవించిన మాస్టారు" అని చెప్పుకున్నారు.


శరణాలయానికి చందాలు బాగా ఇస్తుండేవారు. "ఆయన జీవితంలో సగం దానాలకే వెళ్లేవేమో" అనుకునేవాళ్లం. ఎవరైనా కష్టంలో ఉంటే,తనకు లేకపోయినా దానం చేసేవారు. కష్టాన్ని చూడలేరు. అనాథ శరణాలయం వాళ్లకి భోజనాలు పెడుతుండేవారు. రెండుసార్లు శేఖర్, రాము వడ్డనలో సహాయం చేశారు. మాస్టారుకి ఒక కొడుకు ఉండేవాడు, వినయ్. తాము పదో తరగతిలో ఉన్నప్పుడు, వినయ్‌కి పెళ్లి జరిగింది. పెళ్లిలో కొంతమంది విద్యార్థులు భోజన సమయంలో వడ్డనలో సహాయం చేశారు. మాస్టారు వద్దని చెప్పినా, కల్పించుకుని సహాయం చేశారు. విద్యార్థులు గురువుకు సహాయం చేయకుండా ఎలా ఉంటారు?


మాస్టారు గారికి ఆస్తి ఏమీ లేదు. అద్దె ఇంట్లో ఉండేవారు. తన తాహతు కంటే ఎక్కువగానే చేశారు. వినయ్ అన్న ఇంజినీరింగ్ చదివాడు.


మాస్టారు పంచిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేము. "ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను కదా, మాస్టర్ గారిని కలవాలి," అనుకున్నాడు శేఖర్.


ఒక్కసారి కారు ఆగిపోయింది. ముందుకి వంగి, వెనక్కి వచ్చాడు.

"ఏమైంది? హఠాత్తుగా ఆపావు?" డ్రైవర్‌ను అడిగాడు.


"ఎవరో ముసలాయన ఎదురుగా వచ్చాడు," అన్నాడు డ్రైవర్.


"ఆపు. నేను దిగుతాను," అన్నాడు.


"ఎందుకు సార్?"


శేఖర్ కిందకు దిగి, ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్లి,"నేను రోడ్డు క్రాస్ చేయిస్తాను," అని చెప్పి, చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు.


"ఈ ముఖం ఎక్కడో చూసినట్లు ఉంది," అనుకున్నాడు. మళ్లీ పరీక్షగా చూశాడు.

ఆయన ఎవరో కాదు, తనకు పాఠశాలలో తెలుగు బోధించిన, మంచి, మానవత్వం, సంస్కారం నేర్పిన సత్యం మాస్టారు.


"నమస్తే మాస్టారు," అని చెప్పి, కాళ్లకు నమస్కారం చేశాడు.


"ఎవరూ?" అడిగారు.


"నేను శేఖర్‌ని. పందొమ్మిది సంవత్సరాల క్రిందట పదవ తరగతి చదివాను. మేము పదవ తరగతిలో ఉన్నప్పుడు, మీ అబ్బాయి వినయ్ అన్న పెళ్లి అయింది. పెళ్లిలో మేము సహాయం చేశాము."


"ఆ, ఆ గుర్తుకు వచ్చింది. నీతో మరో అబ్బాయి ఉండేవాడు. మీరిద్దరూ బాగా చదివేవారు."


"అవును మాస్టారు, రాము. ఇప్పుడు అతని పెళ్లి. రండి మాస్టారు," అని తీసుకొచ్చి, కారులో కూర్చోబెట్టాడు.

మాస్టారు నోటినుండి పరిస్థితి తెలుసుకున్నాడు.


వినయ్ పెళ్లి అయ్యాక, రెండు సంవత్సరాలు హైదరాబాద్‌లోనే ఉన్నాడు.

వినయ్ భార్య రాధిక కూడా ఇంజినీరింగ్ చదివింది. తర్వాత ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు.అప్పటినుండి, మాస్టారు, శ్రీమతి అన్నపూర్ణ ఇక్కడే ఉండేవారు. పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన డబ్బుతో ఇల్లు కొన్నారు.


ఆ ఇంట్లో ఇద్దరూ ఉండేవారు. నాలుగు సంవత్సరాల క్రితం అన్నపూర్ణ చనిపోయింది.తల్లి చనిపోయినప్పుడు, కొడుకు, కోడలు, మనవలు ఎవ్వరూ రాలేదు. తనని వృద్ధాశ్రమంలో చేరమని ఫోన్‌లో చెప్పాడు.


అమెరికా వెళ్ళాక ఒకే ఒక్కసారి వచ్చి, రెండు నెలలు ఉండి వెళ్ళాడు అంతే.తనకి వృద్ధాశ్రమంలో చేరటం ఇష్టం లేదు. ఒక గది, చిన్న కిచెన్ తను ఉంచుకుని, మిగిలిన ఇంటిని అద్దెకు ఇచ్చేశాడు. అద్దెకు ఉన్న ఇంట్లో ఆమె తనకి భోజనం పెడుతుంది. దానికి తను డబ్బు ఇస్తున్నాడు. ఇదీ మాస్టారి పరిస్థితి. 


శేఖర్‌కి వినయ్ మీద చాలా కోపం వచ్చింది. కన్న తండ్రిని వదిలేస్తాడా? మాస్టారు తన కథ చెప్పి కళ్లు ఒత్తుకున్నారు."బాధపడవద్దు మాస్టారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. మా స్నేహితులు అందరూ రాము పెళ్లికి వస్తున్నారు," అని చెప్పాడు.


రాము ఇంటికి చేరారు. మాస్టారు గారిని చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. చిన్నప్పటి సంగతులు అన్నీ గుర్తు చేసుకున్నారు. చాలా సంతోషంగా గడిపారు. రాము ఎం.బి.బి.ఎస్. చదివాడు. పెళ్లి కూతురు కూడా ఎం.బి.బి.ఎస్. చదివింది.పెళ్లి అయిపోయింది. మాస్టారుని కలవక ముందే, పెళ్లికి రాకముందే అందరూ కలిసి మాస్టారికి కానుక ఇవ్వాలని, సన్మానం చేయాలని అనుకున్నారు.

మాస్టారు వచ్చారు కాబట్టి, పెళ్లి తంతు అంతా అయిపోయిన తర్వాత అందరి ముందు మాస్టారుకి శాలువా కప్పి సన్మానం చేశారు. ఫోటోలు తీసుకున్నారు.


వారిలో ఒక విద్యార్థి సతీష్ టీచర్ అయ్యాడు, బీ.ఏ., బీ.ఎడ్. చదివి. పాఠశాలలో తెలుగు టీచర్. తన ప్రవృత్తి కవితలు రాయడం.


సతీష్ కొన్ని కవితలు రాశాడు. దానిని పబ్లిష్ చేశాడు. ఆ పుస్తకాన్ని సత్యం మాస్టారికి అంకితం ఇచ్చాడు. అది కానుకగా ఇచ్చారు మాస్టారికి. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఇప్పుడు అందరూ మాస్టారు గారికి సహాయం చేయాలనుకున్నారు.


రాము తనతో పాటు ఉంచేసుకుంటానన్నాడు. రాము తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది.


"భార్యాభర్తలు ఇద్దరూ ఉండబోతున్నారు కాబట్టి, నేను నా తండ్రి నా దగ్గర ఉన్నారనుకుంటాను," అన్నాడు.


"మాస్టారు నన్ను మీ కొడుకు అనుకోండి. మీరు నా దగ్గరే ఉండాలి. మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకుంటాను," అన్నాడు.మాస్టారు చాలా సంతోషించారు. రాముతో ఉండటానికి ఒప్పుకున్నారు.

(సమాప్తం) &&&&&&&&&&&&&

Dr. షహనాజ్ బతుల్ గారి కొన్ని ఇతర రచనలు:




Dr. షహనాజ్ బతుల్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




రచయిత్రి పరిచయం : నా వివరములు:

నేనుబి.ఎస్సీ వరకు ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) లో చదివాను. ఎం. ఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ పట్నం లో చదివాను. గణితము లో రీసెర్చ్, ఐ.ఐ. టి (ఖరగ్ పూర్ ) లో చేసాను. జె. యెన్.టి.యు.హెచ్ (హైదరాబాద్) లో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసాను.

1980 నవంబర్ దీపావళి సంచిక వనిత, మాస పత్రిక లో మొదటి వ్యాసం ప్రచురింప బడింది. వ్యాసాలూ, కుట్లు అల్లికలు, వాల్ డెకొరేషన్ పీసెస్, గ్రీటింగ్ కార్డ్స్, తయారు చేయడం, వంటలు, కవితలు, కథలు ప్రచురింప బడ్డాయి. 2000 తర్వాత చాలా కాలం వ్రాయలేదు. మళ్ళీ 2021 నుండి ప్రతిలిపిలో చాలా వ్రాసాను. 160 దాకా కథలు, చాలా వ్యాసాలూ, నాన్ ఫిక్షన్, కవితలు చాలా వ్రాసాను.

చాలా సార్లు ప్రశంసా పత్రాలు వచ్చాయి.

ఒక సాటి 10 భాగముల సీరియల్ కి బహుమతి వచ్చింది. ఒక సారి డైరీ కి బహుమతి వచ్చింది. ఒక సారి వేరే ఆన్లైన్ వీక్లీ లో ఒక కథ కు బహుమతి వచ్చింది.


--షహనాజ్ బతుల్--


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page