top of page
Original.png

మనోధైర్యం - ఆత్మ విశ్వాసంతో ముందడుగు

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #మనోధైర్యం - ఆత్మ విశ్వాసంతో ముందడుగు, #ManodhairyamAthmaViswasamthoMundadugu, #TeluguKathalu, #తెలుగుకథలు


ree

Manodhairyam - Athma Viswasamtho Mundadugu - New Telugu Story Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 02/02/2025

మనోధైర్యం - ఆత్మ విశ్వాసంతో ముందడుగు - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఫోన్ రింగవుతుంటే లిఫ్టు చేసింది అప్పుడే నిద్ర లేచిన సుజాత. 

"ఏయ్ సుజీ ! ఎలా ఉన్నావు? నేను రవిని". అవతల వ్యక్తి పలకరింపు విని త్రృళ్ళిపడింది సుజాత. చాలా చనువుగా ' సుజీ 'అని ఏక వచన సంభాషణ. 


అప్పుడు గుర్తుతెచ్చుకొంది అతనిని. చాలా రోజుల నుంచి తను కాలేజీకి వెళ్తున్నా, వస్తున్నా తనని ప్రేమిస్తున్నానంటూ వెంబడిస్తూ వేధిస్తున్నాడని. అతను తన సీనియర్. రాజకీయ నాయకుడి కొడుకు. "నాకు అలాంటి అభిప్రాయం లేదు. నాకు చదువే ముఖ్యం. నాకు చాలా ఆశయాలు ఉన్నాయి. నా జోలికి రావద్దు " అని చాలా సార్లు అతన్ని పిలిచి చెప్పింది సుజాత. అతను తన ప్రవర్తన మార్చుకోకపోతే ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. ఆయన ' అతని మీద చర్య తీసుకుంటాను' అని చెప్పి రవిని పిలిచి మందలించడం, తత్ఫలితంగా ఆయన ఉద్యోగ బదిలీ వెనువెంటనే జరిగాయి. 


అయినా "నీవు లేకపోతే బ్రతకలేను, ఆత్మహత్య హత్య చేసుకుని చచ్చిపోతాను " అంటూ రవి వేధింపులు ఎక్కువ అవడంతో తన తల్లిదండ్రులకు చెప్పింది సుజాత. వాళ్లు సుజాతకు ధైర్యాన్ని నూరిపోసి రవి తల్లి తండ్రులను అతికష్టం మీద కలిసి విషయం వివరించి రవిని తన కూతురి జోలికి రాకుండా చూడమని చెప్పారు. 


 వాళ్ళు తమ కొడుకు ప్రవర్తనను విని అతనిని మందలించక పోగా వెనకేసుకేసుకొచ్చి సమర్థిస్తుంటే ఆశ్చర్య పోయారు సుజాత తల్లి తండ్రులు. పిల్లలు చెడిపోయేందుకు ఇలాంటి తల్లిదండ్రులే సగం కారణం అనుకుని చేసేది లేక తమ ఇంటికి వచ్చారు. 


చదువు - సంధ్య లేకుండా ఇలా ఆడపిల్లలను ప్రేమ పేరుతో లొంగదీసుకోవట, ఆ తర్వాత వాళ్ళను మోసం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. రవి రాజకీయ నాయకుడి కొడుకు అవడంతో ఎవరూ ఏమీ చేయలేక పోతున్నారు. సుజాత ధైర్యం, ఆత్మ విశ్వాసం అధికంగా ఉన్న ఈ కాలపు ఆడపిల్ల. అయినా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది సుజాత. ఎలాగైనా చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం పొంది, జీవితంలో స్థిరపడి తన తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి అన్న ది సుజాత ఆశయం. 


ఇంకో 2 నెలలలో కాలేజీ చదువు పూర్తవుతోందనగా కాంపస్ సెలక్షన్ లో మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది. సుజాత ఆనందానికి అవధులు లేవు. తల్లి తండ్రులు సుజాత కు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ముందు సుజాత ఇప్పుడే తనకు పెళ్ళి వద్దని వారించినా వాళ్ళ అభిప్రాయానికి ఒప్పుకుంది. 


 మంచి సంబంధమని వేణు అనే సాఫ్టువేరు ఇంజనీర్ తో సుజాతకు పెళ్ళి చూపులు, ఇద్దరూ ఒకరికొకరు నచ్చటం, ఇరువురి అభిప్రాయాలు కలవటం జరిగాయి. వెంటనే ఇరు వైపులా పెద్దలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం, వివాహ తేదీ నిర్ణయం కూడా జరిగింది. 


విషయం తెలిసిన రవి మండిపడి పగతో రగిలిపోతూ ఎలాగైనా పెళ్ళి చెడగొడతానని, 

వెళ్ళి వేణుకు, వాళ్ళ వాళ్ళకు సుజాత గురించి

చెడుగా చెపుతానని సుజాతను, వాళ్ళ తల్లి తండ్రులను బెదిరించాడు. 


అతన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదని ఆమెకు స్పష్టం గా తెలుసు. అయినా సుజాత అతని బెదిరింపులకు భయపడలేదు. ధైర్యంగా ముందుకడుగు వేసి తల్లి తండ్రులతో వేణు వాళ్ళింటికి వెళ్ళి వేణుని, వాళ్ళ తల్లి తండ్రులను కలిసి రవి తనని ఏవిధంగా వెంబడించి ఇబ్బందులు పెడుతున్నదీ, పెళ్ళి కుదిరాక ఎలా బెదిరిస్తున్నదీ సుస్పష్టంగా తెలిపి " నిశ్చితార్థం రోజునే మీకు ఈ విషయం చెబుదామనుకున్నాను కానీ అప్పుడు మీకు చెప్పే వ్యవధి కూడా లేకుండా వెంటనే ఆ కార్యక్రమం జరిగింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీ అందరికీ పూర్తి అంగీకారమైతేనే సంతోషంగా మీ ఇంటి కోడలిగా, వేణుకు భార్యగా వస్తాను. " అని చెప్పింది సుజాత. 


సుజాతలోని నిజాయితీని మనసులో నే మెచ్చుకుని, అటువంటి మంచి వ్యక్తి తన భార్యగా రావడం తన అద్రృష్టం అని సంతోషించాడు వేణు. 

విద్యాధికులు, వివేకవంతులైన వేణు తల్లి తండ్రులు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చి సుజాత ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని మెచ్చుకుని సంతోషం తో పెళ్ళికి సుముఖత తెలిపారు. తల్లితండ్రులతో సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయింది సుజాత. 


పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నకొద్దీ రవి ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఎన్నో అడ్డంకులు కల్పిస్తూ, సుజాతకు తనతో అక్రమ సంబంధం ఉందని, పెళ్ళి ఆపాలని వేణుకు, వాళ్ళ తల్లి తండ్రులకు చెప్పి పెళ్ళి చెడగొట్టే ప్రయత్నం చేశాడు. అంతకు ముందే తమకు సుజాత విషయం వివరించడంతో వాళ్ళు రవి మాటలను నమ్మకపోగా బుధ్ధి చెప్పి పంపించారు. 


రవి తండ్రికి రాజకీయ పరపతి ఉండడంతో ఏ పరిస్థితులలోను పెళ్లికి ఆటంకం కలుగకుండా స్థానికుల సహకారం, మీడియా సహకారం కూడా తీసుకున్నారు ఇరుకుటుంబాలు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు దేనినైనా, ఎవరినైనా ఎదుర్కొనవచ్చు అని సుజాత అభిప్రాయం. పెళ్లికి రవి ఎన్ని ఇబ్బందులు, ఆటంకాలు కల్పించినా 

సుజాత పెళ్ళి వేణుతో వైభవంగా జరిగింది. ఇంక చేసేది లేక రవి మిన్నకుండి పోయాడు. పైగా అందరి ద్రృష్టిలో మీడియా, స్థానిక ప్రజల ముందు అల్లరి అవడంతో రవిని చదువు నెపంతో విదేశాలకు పంపించారు అతని తల్లితండ్రులు. 


 సుజాత, వేణులు కొత్త కాపురం మొదలు పెట్టి ప్రేమగా అన్యోన్యంగా ఉంటూ మూడు పువ్వులు- ఆరుకాయలుగా సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. ఆ ముచ్చటైన జంటను చూసి ఇరుకుటుంబాలు సంతోషంతో తృప్తి చెందుతూ మనసులోనే ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 



.. సమాప్తం .. 


-నీరజ హరి ప్రభల









Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page