top of page
Original.png

మమతల ఒడి

#DaralaVijayaKumari, #దారలవిజయకుమారి, #MamathalaOdi, #మమతలఒడి, #TeluguInspirationalStories, #హృదయానికిహత్తుకునేతెలుగుకథలు


Mamathala Odi - Heart touching Telugu Story | Dr. Darala Vijaya Kumari - మమతల ఒడి - హృదయానికి హత్తుకునే తెలుగు కథ | డా. దారల విజయ కుమారి

Published in manatelugukathalu.com on 16/03/2026 


అమెరికాలో ఖరీదైన ఇళ్ళ సముదాయం ఉన్న ప్రదేశం. అక్కడ ఎన్నో ఖరీదైన భవనాలు ఉన్నా, 'దృశి మ్యాన్షన్' చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఖరీదైన ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైనింగ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అడుగడుగునా ప్రతిబింబించేలా వసతులు. అభిరుచికి తగినట్టుగా కట్టించుకున్న సుదర్శన్ అనే ప్రవాస భారతీయుని నివాసం. 


రాత్రి పదకొండు దాటింది. ఆ ప్రదేశమంతా మెల్లమెల్లగా నిద్రలోకి జారుకుంటోంది. కానీ 'దృశి మ్యాన్షన్' రెండవ అంతస్తులో మాస్టర్ బెడ్ రూమ్ పక్క గదిలో ఇంకా లైటు వెలుగుతోంది. సుదర్శన్ తన బెడ్ రూమ్‌లో ఇంకా పని చేస్తున్నాడు. కాస్సేపటికి టేబుల్ పైన ఉన్న ఆస్తులకు, షేర్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మళ్ళీ ఒకసారి సరి చూసుకుని కవర్లలో పెట్టేసాడు. ఏదో గుర్తొచ్చినట్టుగా గది బయటకు వచ్చి మాస్టర్ బెడ్ రూమ్ తలుపు తోసుకుని లోపలికి వెళ్లబోయి, మళ్ళీ వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. 


ఆ గదిలో సుదర్శన్ భార్య, పక్కనే మరొక గదిలో కూతురు నిద్రపోతున్నారు. కింద బెడ్ రూమ్‌లో మెయిడ్ పడుకుంది. వాళ్ళంతా ఎంతో నిశ్చింతగా నిద్రపోతున్నారు. అందుకు కారణమైన సుదర్శన్ మాత్రం కమ్మటి నిద్రకు దూరమై చాలా కాలమైంది. సుదర్శన్ మనసు గతం వైపుకు మళ్ళింది. 


తన భారతదేశం వదిలి ఈ విదేశీ గడ్డపై కాలు మోపి, ఇక్కడే స్థిరంగా ఉండిపోయాడు. తాను, తన కుటుంబం అమెరికన్ సిటిజెన్స్ అయిపోయారు. ఈ సంస్కృతికే అలవాటు పడిపోయారు. చెప్పాలంటే, ఈ విదేశీ గడ్డపైని హంగులు ఆర్భాటాలకు ఒకింత ఎక్కువగానే అలవాటు పడ్డారు. తన మేధాశక్తిని తన దేశం గౌరవించలేదని, ఈ పరాయి దేశం తనను గుర్తించి, ఇంత వైభవాన్ని, సంపదను ఇచ్చిందని, తన దేశం కంటే ఈ దేశంపై చాలా గౌరవం పెరిగింది సుదర్శన్‌కు. అతనికి తన దేశం, తన ఊరు, తన కన్నవాళ్ళు, అయినవాళ్ళు ఎప్పుడో గానీ గుర్తు రాకుండా అయిపోయారు. అలా చాలా ఏళ్ళు బాగానే జరిగింది. 


సంవత్సరం సంవత్సరం కేలండర్‌తో పాటూ ఎన్నో మారిపోతున్నా. అప్పుడు చాలా వేగమైన, చురుకైన, తెలివైన సుదర్శన్ మెదడు ఇప్పుడూ అలాగే ఉంది. కాలంతో పాటూ మనుషుల ఆలోచనలు, జీవన విధానం మారుతోంది, దాంతో మనుషుల అవసరాలు మారుతున్నాయి. మరింత వేగమైన, చురుకైన, తెలివైన మెదళ్లు కంపెనీలకు కావాల్సి వస్తోంది. సుదర్శన్ కంటే మెరుగైన అప్‌గ్రేడెడ్ తెలివితేటలు, నైపుణ్యాలు ఈ దేశ బిజినెస్ ప్రపంచానికి కావాలి. కంపెనీల మధ్య పోటీ పెరిగిపోతోంది. ప్రజల కోరికలకు అనుగుణంగా చాలా వేగంగా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నారు. 


ప్రతి ఏడూ దానికి తగినట్టుగా పెద్ద చదువుల డిగ్రీలు పట్టుకుని కొత్త తరం వస్తోంది. రోజుకో కొత్త నైపుణ్యం వెలుగు చూస్తోంది. దాంతో కొత్త పదవులు, ఉద్యోగాలు, చిన్న వయసుకే పెద్ద ప్రమోషన్లు. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులు ఇప్పుడు వేలు, లక్షల్లో ఉన్నారు. సుదర్శన్ పనిచేసే కంపెనీలోనే ఎందరో కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. ఎక్కడైనా సమస్య వస్తే చాలాసార్లు తననే సంప్రదించే కంపెనీ యాజమాన్యానికి సుదర్శన్ అవసరం రోజురోజుకూ తగ్గిపోయింది. 


సుదర్శన్ తాను ఎక్కడో వెనుకనే ఉండిపోయానని తెలుసుకుంటూనే ఉన్నాడు. కంపెనీలో వస్తున్న మార్పులను చూసి, చాలా రోజుల నుండి అతనిలో ఏదో తెలియని అలజడి మొదలైపోయింది. సుదర్శన్ ఉద్యోగంలోకి చేరినప్పుడు ఎంత మందిని వెనక్కి నెట్టేసాడో, అతడు ఏనాడూ ఆలోచించందుకైనా సిద్ధపడలేదు. నిజానికి ఇప్పుడు యువతరం కొత్త కొత్త నైపుణ్యాలను, తెలివితేటలను, విజ్ఞానాన్ని సంపాదించారు, కానీ అతనది గుర్తించడానికి ఇష్టపడటం లేదు. 


సి, సి ప్లస్ ప్లస్, జావా ప్లస్ ప్లస్, హెచ్‌టిఎంఎల్, డాట్ నెట్, పైథాన్... సాగిపోతోందలా... ఒక కొత్త టెక్నికల్ భాష నేర్చుకుని వస్తే, కొన్నేళ్లకే మరో కొత్త భాష, కోర్సు నేర్చుకోకపోతే ఉద్యోగంలో వెనుకబడినట్టే. అతనైనా మరొకరైనా అంగీకరించినా లేకున్నా, ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలలో కొత్త పరిజ్ఞానం అలా ప్రవహిస్తూనే ఉంది. సుదర్శన్ తెలివి వెనుకబడిపోయింది. ఆ విషయం అతని కంటే ముందు అతను పనిచేస్తున్న కంపెనీ గ్రహించిందని అతనికి తెలుస్తోంది. 


'ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఆటోమేటిక్ మెసేజ్ వస్తుందేమో.. లేదు, లేదు, మెయిల్ పెడతారేమో...' అలా అని అనుకుంటేనే అతనికి నిద్రపట్టదు, ఆకలి వేయదు, అనవసరమైన వణుకు మొదలవుతుంది అతనిలో. ఉద్యోగుల సంఖ్యను తగ్గించి కంపెనీ యజమానులు ఈ సంక్షోభం నుంచి బయటపడాలనుకుంటున్నారు. కంపెనీలో ఎవరి టెర్మినేషన్ లైనా సరే, ఎన్నోసార్లు జ్వరం తెప్పించాయి సుదర్శన్‌కు. 


ఈ సంఘర్షణ వల్ల అతనిలో రేగిన అలజడి గురించి ఎవరితో అయినా పంచుకుందామనే ఉంది, కానీ సుదర్శన్ భార్య సుమేధ ఉమెన్ అసోసియేషన్ పనులతో బిజీగా ఉంటుంది. కూతురు తన కాలేజీ వర్క్‌తో బిజీ. రాత్రి భోజనాల దగ్గర కలిసినా గబగబా తినేసి అలసట వల్ల కూతురు తన గదికి వెళ్లిపోతుంది, భార్యేమో పక్క పైన పడుకోగానే నిద్రపోతుంది. ఇక్కడి సంస్కృతిలో భాగంగా అడగకనే ఒకరు ఇంకొకరి విషయాలలో తలదూర్చరు, అది ఎంత సొంత వాళ్ళైనా సరే. అతను చెప్పేదాకా "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగే పరిస్థితి లేదు. 


దాంతో సుదర్శన్ తనలోని బాధను తానే మోసుకుని తిరుగుతున్నాడు. ఈసారి మాటు వేసేది ఎవరికోసమో? వేటు వేసేది ఎవరిపైనో? బహుశా "నా పైనేనా?" అని సుదర్శన్ ఉలిక్కిపడని రోజు లేకుండా పోయింది. ఎందుకంటే హఠాత్తుగా ఏదో ఒక పోస్టుకు, ఒక ఉద్యోగానికి ఉద్వాసన చెప్పి ఇంటికి పంపడం సర్వసాధారణమైపోయింది. 


"నాకెందుకులే, నా వంతు రాదులే. అబ్బే, నన్ను అస్సలు వదులుకోరులే" అనుకుంటూనే ఇప్పుడు సుదర్శన్ దాకా వచ్చేసింది. ఢోకా లేనితనం ఎక్కడుంది? అసలు ఉందా లేదా? అదేమో కానీ, సుదర్శన్ జీవితంలో ఆ ఊసే లేకుండా అయిపోయింది. అర్థం పర్థం లేని కారణాలు చూపించి, ఉద్యోగస్తుల చేతికి 'గులాబీ రంగు కాగితం' ఇచ్చేసి, వెళ్లిపోమంటున్నారు.


 కొంత కాలం క్రితం వేరే కంపెనీలో పనిచేసేవాడు సుదర్శన్. ఎక్కువ ప్యాకేజీ పేరుతో ఈ కంపెనీకి రప్పించుకున్నారు. కాదు, అతనే ఆశపడ్డాడేమో... "ఉద్యోగం ఎలా ఉంది రా?" అని భారతదేశం నుంచీ నాన్న ఫోన్ చేసి అడిగితే... "ఇప్పుడు వేరే కంపెనీలో చేస్తున్నా నాన్నా, మరింత ఎక్కువ జీతంతో" అని అనగానే... "అయ్యో, అలా మారితే ఏం బాగు నాయనా? కాస్త కుదురుగా, పర్మినెంట్‌గా ఉండేలా ఏదైనా మంచి ఉద్యోగం చూసుకో" అని సుదర్శన్ అమ్మ అననే అంది. 


కానీ నాన్న, "నీకేం తెలుసు? ఏది మంచిదో వాడికి తెలుసులే ఏది చేయాలో" అనేసాడు, కొడుకు అభిప్రాయం తెలుసుకున్నట్టుగా. 


ఈరోజు అమ్మ మాట నిజమైంది. ఒక కంపెనీ కాదంటే మరోటి, ప్యాకేజీ ఎక్కువ ఇస్తారంటే మరోటి. ఇంకా ఖర్చులు, ఇంకా పెద్ద జీతము, ఆశకు అంతెక్కడో తెలియలేదు. ఇది ఆఖరుది కాకపోవచ్చు. తాను పెద్ద స్థాయిలోనే ఉండొచ్చు, కానీ ఈ మధ్య చిన్న చిన్న వృత్తిపరమైన అవమానాలు, ఆశాభంగాలు ఎదుర్కొంటున్నాడు. 


రోజువారి పరుగులో వెనుకబడుతున్నాడు. దాంతో నిజంగానే అలసిపోయాడు. 'ఇక జీతాలు ఇవ్వలేం, రేపు కొందరిని తీసేస్తాం' అన్న ప్రకటన వచ్చింది. ఇది కుదిపేసే అనుభవం సుదర్శన్‌కు. ఈ వారం రాబోయే లిస్ట్‌లో తన పేరు ఉందేమో అన్న ఊహ అతన్ని నిలువనీయడం లేదు.


***************


సాయంకాలం త్వరగా ఇంటికి వచ్చేసాడు సుదర్శన్. ఇంట్లో ఎవరూ లేరు మెయిడ్ తప్ప. మంచం పైన పడుకుని కళ్ళు మూసుకుని పడుకుంటే చాలు, మనసు గతంలోకి వెళ్ళిపోతోంది. ఆ రోజు సుదర్శన్ అమెరికాకు వెళ్తున్నాడని ఎవరెవరో వచ్చి పలకరించారు. పనిగట్టుకుని మరీ పొగిడేశారు. వాళ్ళ పిల్లలను అతనితో పోల్చుకుని, "మా పిల్లల కంటే మీ సుదర్శన్ చాలా తెలివైనోడు" అంటూ పెదవి విరిచారు. 


అప్పుడు, "అలా చేయకండి పెద్దయ్యా. ఎవరికైనా అవకాశం వస్తేనే వాళ్ళను వాళ్ళు నిరూపించుకోగలరు. నేనేమీ పెద్ద గొప్ప కాదు" అని పరోక్షంగా చిన్నబుచ్చబడుతున్న వాళ్ళ పిల్లల వైపు మర్యాద కోసమైనా వకాల్తా పుచ్చుకోలేకపోయాడు. బహుశా తనకు సంక్రమించిన ఈ గౌరవం ఇంచు కూడా తగ్గించుకోవడం తనకు ఆ రోజు ఇష్టం లేకపోయింది. 


విదేశీ గడ్డపై కాలు మోపకముందే అతనిలో స్వదేశీ భావన సన్నగిల్లింది. ఇప్పుడు ఈ విదేశీ ఉద్యోగం వెనక్కీ ముందుకీ ఊగుతూ భవిష్యత్తు భయపెడుతుందని అతను ఏనాడూ అనుకోలేదు. "ఈ ప్రయాణంలో ఇదొక మజిలీ" అని ఎందుకు గ్రహించలేక పోయాడో అని ఇప్పుడు చింతిస్తున్నాడు! 


అసలీ విదేశాల్లో ఉద్యోగం చేయాలనే పిచ్చి ఆలోచన ఎలా మొదలైంది? తనలోకి ఎలా వచ్చి చేరింది? లేనిపోని ఆశలను దట్టించి ఆ ఆలోచనలను తనపైకి వదిలింది ఎవరు? అని ఆలోచిస్తే, ఇప్పుడు గుర్తుకొస్తోంది నాన్న చిన్ననాటి స్నేహితుడు రామన్న చిన్నాయన. "తన కొడుకు డిగ్రీ చదివి టీచర్ ట్రైనింగ్‌లో చేసాడని, వద్దన్నా వినకుండా పొలం పనులకు వెళ్తాడని, తన కొడుకు సూరిగాడిపై కోపంగా ఉందని" ఏదేదో చెప్పుకుని వెళ్లిపోసుకునే వాడు. 


నాన్న తన చదువు గురించి, తెలివితేటల గురించి గొప్పగా చెబితే, "ఫారిన్‌కు పంపించు, బాగా సంపాదిస్తాడు" అని రోజూ నాన్నకు చెప్పి చెప్పి, నాన్న తనతో చెప్పి, తాను దాన్ని అమలు చేసేదాకా ఆగలేదు. వాళ్ళ నాన్న ఎంత కించపరిచేలా మాట్లాడినా సూరి ఏనాడు తనపై తిరగబడలేదు, తనపై అసూయ పెంచుకోలేదు, పైగా తన్ను కలిసి మనస్ఫూర్తిగా అభినందించాడు. సూరిగాడు అంత పరిణితి ఎలా సాధించాడో? ఇప్పుడు భారతదేశంలో తమ ఊరిలో సూరి జీవితం సజావుగా సాగుతోంది. అలాంటి వాళ్ళు ఎప్పుడూ బాగానే ఉంటారు. తనకు గుర్తుకుంది. ఒకసారి సెలవులకి ఇండియాకు వెళ్ళినప్పుడు రామన్న చిన్నాయన భోజనానికి పిలిచాడు. తన కూతురు దృశి సరిగ్గా తినలేదు, అసలు ఆ నీళ్ళు తాగనంది. 


"మినరల్ నీళ్ళు తీసుకొని రారా. వాళ్ళు మనలాగా ఈ నీళ్లు తాగుతారనుకున్నావా? పాపం, అమ్మాయికి మన తిండి కూడా సరిపడినట్టు లేదు" అని సూరిని అంత ఎండలో బజారుకు పంపించేసాడు. 


ఆ రోజు రామన్న చిన్నాయన మాటలు, చేతలు సూరిని గాయపరిచే ఉంటాయి, కానీ ఆ గాయం ఈ రోజు తనను సలుపుతోంది. ఆ వేళ తాగే నీళ్ల కోసం సూరి ఎండన పడి వెళ్ళే అవసరం లేదని సూరిని ఎందుకని ఆపలేకపోయాడో తాను అని ఈ రోజు బాధపడుతున్నాడు. తనకిలా జరగాల్సిందే. సూరిని చూసినప్పుడల్లా ప్రశాంతంగా, ప్రసన్నంగా కనిపిస్తాడు. తాను అది అప్పటికే గ్రహించాడు కానీ, సూరి లాంటి వాళ్ళందరినీ చేతకానివాళ్ళు అని జమకట్టేసాడు తను. 


తనకు వచ్చిన అవకాశం వాళ్ళకు వస్తే వద్దనుకుంటారా? అనే అనుకున్నాడు. అప్పట్లో తెలిసీ కావాలనే అట్టహాసంగా తన తెలివితేటలను ప్రదర్శనకు పెట్టాడేమో. "ఈ అదృష్టం అందరికీ రాదు" అని రామన్న చిన్నాయన అనే మాట తనకు ఎంతో సంతోషాన్ని కలిగించేది. 


తన ఊరిలో, తన మట్టిలో, తన వాళ్ళతో కలిసి బతకడంలో ఏదో ఉందన్నది సూరి తెలుసుకున్నంతగా తాను ఎందుకని తెలుసుకోలేదో... నిన్నటి దాకా హై-ఫైగా తినడం, బట్టలు కట్టుకోవడం, షాపింగ్, శుభకార్యాలు, స్నేహితులు... ప్రతి విషయంలోనూ ఒక పెద్ద స్థాయిని చూసుకుని మురిసిపోతూ జీవించి. రేపటి నుంచి అవన్నీ చేసుకోవడం కుదరదు అంటే, ఏమైపోతుంది తన పరిస్థితి? 


డబ్బుకు కొదవ ఇప్పుడైతే రాదు. ఈ ఉద్యోగం పోయినా మరోటి దొరకకపోదు, కానీ కంపెనీలన్నీ వయసు, నైపుణ్యం, తెలివి చూసి ఉద్యోగం ఇస్తున్నాయి. తనకు వయసు కాస్త ఎక్కువే. ఏదో ఒక జాబ్ దొరికినా ఇంత ఉన్నతమైన పదవి దొరకదు, దాంతో తాను ఇమడలేడు. రేపు ఎప్పుడైనా తనను ఉద్యోగంలో నుంచి తీసేసారని తెలిస్తే, తన భార్య చీదరించుకుంటుందా? తన ముద్దుల బిడ్డ "నువ్వు పనికిరాని తండ్రివి" అని అంటుందా? స్నేహితులు ముందులా మాట్లాడుతారా? అసలు ఇవన్నీ కాదు, ఏవీ లేకుండా తను తన దేశానికి తిరిగి వెళ్తే అందరూ ముందులా ప్రేమ చూపుతారా? అలాగే గౌరవిస్తారా? 


వృత్తిని, తెలివిని, హోదాను అనుబంధాలకు ముడిపెట్టి జీవించాడు. ఇందులో ఔచిత్యం ఉందా? ఒంటరిగా ఉంటే ఇవే ఆలోచనలు. ఉద్యోగం పోతుందని తెలిసి సుదర్శన్‌లో తాత్విక చింతన మొదలైంది. ఈ మధ్య కన్నవాళ్ళు, చిన్ననాటి స్నేహితులు గుర్తొస్తున్నారు. పాపం, తన అమ్మానాన్నలు వాళ్ళని చూసేందుకు ఏళ్ల తరబడి వెళ్ళకపోవడానికి ఎన్ని వీలైతే అన్ని కారణాలు చెబుతూనే ఉన్నా, వాళ్ళు అవన్నీ నమ్మారు. 


తనకు వెసులుబాటు లేనందుకు "పని పని అని ఆరోగ్యం పాడుచేసుకోకు, వేళకు తిని విశ్రాంతి తీసుకో" అని తన కోసమే బాధపడ్డారు. ఎందుకంతగా దిగజారిపోయాడో తాను? దేశం కాని దేశంలో ఓడిపోయి, వాకిట్లోకొస్తే భుజం తట్టేవాళ్ళు, కొలతల్లేని మమతలను, కొసరి కొసరి వడ్డించే వాళ్ళు పరాయి దేశంలో ఎలా దొరుకుతారు? దైన్యాన్ని మనసు సంచిలో నింపుకుని నడిచి నడిచి గుండె గొంతులో వంపుకుందామని ఒక గ్లాసుడు ఆదరణను అడిగితే, ఇక్కడ ఎవరిస్తారు? 


విదేశీ ఎడారి మలుపు దగ్గరే ఆగిపోయాక, ఎప్పుడో ఒకసారి వెళ్ళినా, నేస్తంలా తన నేల తనను గుమ్మం దాకా మోసుకుని దింపేది. అప్పుడు తనకు తానెవరో తెలుసు, అప్పుడు తనలో తానుండేవాడు. అనురాగమే అమ్మానాన్నలై, ఆత్మీయతే అక్కచెల్లెళ్ళు, ఆప్యాయతే అన్నదమ్ములు, మంచికోరే మనవాళ్ళు, చిరునవ్వే తన చిరునామాగా ఉండేది. ఇప్పుడు నడమంత్రపు సిరి దాపున నిలబడి, ధనం పూతలు పూయబడి, తానెవరో తనకే గుర్తు చిక్కడం లేదు. ఇప్పుడు ఖరీదైన సౌధంలోని తన్ను చూస్తే, ఒంటరి కొమ్మకు వేలాడే దిగులు పక్షి గుర్తొస్తుంది. 


మనసు, తనువుల్ని హోదా మాయ కొదిలి ఎన్ని అశాంతి ద్వారాల్ని తెరిపించుకున్నాడో? సిరుల జలాల్లో మునిగిపోయాడో? డబ్బుల సంతలో దారపోయాడో? ఆడంబరాల అగాధంలోకి తన్ను తానే తోసేసుకున్నాడో? స్వయంకృతాపరాధి తాను. తన్ను తాను ఎక్కడని వెతుక్కోగలడు? సంపదల బావిలో చేదుకున్నది చేదేనని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తనలోని మానవత్వపు మందిరాన్ని పడగొట్టుకునేసాక, తాను మనిషెలా అవుతాడు? భయం, బాధ, వెతలు, వేదన... తానెరుగని రుగ్మతలు ఈనాడు తన్ను కబళించ చూస్తుంటే, నెమ్మది మందుల కోసం వెతుక్కుంటున్నాడు. 


తన గడ్డపై కాలు మోపి, తన నీళ్ళు తాగి, తన తిండి తిని, అమ్మ ఒడిలోనో, నాన్న చేతిలోనో, అన్న ఆలింగనంలోనో, అక్క దీవెనలోనో తన వాళ్ళ ముచ్చట్లు దొరికే ప్రశాంతతలో వెతుక్కుంటే, బహుశా తనకు తాను తప్పక దొరుకుతాను. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెనక్కి వెళ్ళగలడు? "నీ సేవలు ఇక చాలు. ధన్యవాదాలు. ఇక ముందు అవసరమైతే మీ సేవల కోసం మేం కబురు చేస్తాం. ఇదిగోండి మీకు రావాల్సిన జీతం వగైరా" అంటూ వాళ్ళు తీసేయక ముందే తానే వెళ్లిపోవాలి. 


ఆడంబరాల్లోకి అదేపనిగా విలీనం చేసుకున్న తన ఉనికి. అదృశ్యంగా ఉన్న ఆత్మకు కవచంగా ఉందేమో ఈ దేహం. తోడి పారేసినట్టు దిక్కుల కొకటిగా విసిరేసినట్టు ఉంది. తనకు తానుగా దేహాన్ని ఖాళీ చేయాల్సిన సమయమొస్తుందని ఎప్పుడైనా అనుకున్నాడా? తిరిగి ఇచ్చేయాల్సినవి, తీర్చుకోవాల్సినవి వేరువేరుగా ముందే సర్దుకుంటున్నాడు. ఇది తన స్వయం కృత్యం. 


వికసించిన సుమం పరిమళాల గురించి ఏ వీలునామా రాయదు, రాలిపోతుందంతే. ఇప్పుడు తానూ అంతే. ఎదిగే క్రమంలో తన బ్రతుకు పునాదులకై శ్రమించి. ఎగిరే దిశలో తన రెక్కల సత్తువు ఇచ్చిన కన్నవారి ప్రేమను అంకెల్లోకి తర్జుమా చేసాడేమో? కన్నీటికి కొలబద్దలను, తప్పిదాలకు భూతద్దాలను ఉపయోగించి, తరచి తరచి త్రాసులో తూచి, నాణ్యతా పరీక్షలు చేసే పరాయి పంచన తనను తాను నిగ్గు తేల్చుకుని, నిఖార్సైన తానుగా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. 


కష్టమో నష్టమో, బాధో సౌఖ్యమో... అనుభవాలను బేరీజు వేసుకుని, అవకతవకల్లోంచీ, ఎగుడుదిగుడుల్లోంచీ, మనస్సాక్షి దారుల గుండా పయనించలేనప్పుడు తాను సిగ్గుపడ లేదెందుకో! తన ఎగుడుదిగుడులు తనను కలవర పెడుతున్నప్పుడు సత్యాన్ని ఒప్పుకునేందుకు తాను నిరాకరించాడు. ద్వంద్వ ప్రమాణాలు, ఆర్థిక హెచ్చుతగ్గులతో, గతుకుల సామాజంలో ఒక బాటలో ఒద్దికగా నడిచాడేమో. గుండె గోడు వెళ్ళబోసుకునేందుకు, ఎదలో చిక్కగా పొదుపుకుందుకు భోగ భాగ్యాలెందుకు? ఇది కూడా తెలుసుకోలేకపోయాడు తాను.


*******************


చాలా రోజుల సంఘర్షణ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు సుదర్శన్. అమూల్య గుణగణాల అలంకరణలో మెరిసిపోయే అమ్మానాన్నలనే ఆత్మ సౌందర్యవంతుల జాబితాలో ఇక తాను ఉండడు. వారంలో చివరి రోజు. బహుశా రేపటి లిస్ట్‌లో తన పేరు ఉండొచ్చు. తన చేతికి గులాబీ రంగు కాగితం వచ్చేలోగా తాను శాశ్వతంగా నిద్రపోవాలి. 


అమ్మ లాంటి మృత్యువు తన ఒడిలోకి నన్ను చేర్చుకుంటుంది. తనకు, మరణానికి మధ్య అస్పష్టత అణుమాత్రమైనా లేని స్నేహ ఒడంబడిక ఇదేనేమో. గూగుల్‌లో ఏవేవో తాత్విక చింతనకు సంబంధించినవన్నీ చదవడం మొదలు పెట్టాడు. మరణాన్ని మనస్ఫూర్తిగా హత్తుకోవడం అంత సులువు కాదు. తెల్లవారేలోగా అంతా ముగిసిపోవాలి. ఏ భాష అర్థం కాక, ఏ చూపులూ తనను నడిపించక, గమ్యం తనకు బోధపడక, కాఠిన్యాలను చిదుముకుంటూ, కళ్ళ ముందు కటిక చీకటి అలుముకుంటోంది. 


ఎద లోగిలిలో వెలుగును పరుచుకుంటున్న వేళ, అడుగడుగునా మొలిచే ఆత్మ సందర్శన చూడగలుగుతూ, జీవ ప్రాణ చైతన్యాల సంయోగంగా ఈ జీవితం ఇక ఉండదు. తన దేశాన్ని, మనుషులను, అయిన వాళ్ళను అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు వికసించింది గుత్తులు గుత్తులుగా జ్ఞానం. అలవోకగా ఆధ్యాత్మికతను అనుభూతి చెందేలా, అంతరంగ ప్రపంచంలోకి అలవోకగా అడుగిడేలా, అంతరంగ విశ్వాన్ని చూపే అపురూప వెలుగు, అంతర్నేత్రం తెరుచుకుంటోంది. 


జ్ఞాన పుష్పాలు వికసిస్తూ, ప్రజ్ఞ పరిఢవిల్లుతూ, మృత్యువును కూడా మమకారంతో స్పృశిస్తూ, జీవ ప్రాణ చైతన్యాల సంయోగంగా ఈ జీవితం దృశ్యాలను ఆవిష్కరించుకుంటూ, అనంతంలోకి అడుగిడతాడేమో... కనురెప్పల తలుపులు తోసుకుని, కల లోంచీ, మాయలోంచీ అనంతంలోకి అడుగిడిన క్షణమే ఆత్మానందమేమో! ఏదో గుర్తొచ్చినట్టుగా గదిలోకి వచ్చి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసాడు. చాలా ఏళ్ల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఉగాది రోజున తీసిన ఫోటోలు, వీడియో ప్లే అవుతున్నాయి. అమ్మ, నాన్న, అక్క, బావ, వాళ్ళ పిల్లలు, తన కూతురు, భార్య... ఎంతో సంతోషంగా గడిపిన క్షణాలు. అమ్మ ఉగాది పచ్చడి పంచుతోంది. అందరూ చేతులు చాచి భక్తితో కళ్ళకు అద్దుకుని తింటున్నారు. తన కూతురు ఆ పచ్చడి తిని ముఖం చాలా ఇబ్బందిగా పెట్టింది. అది గమనించి అమ్మ ఆమె తల నిమిరి చిరునవ్వుతో ఏదో చెబుతోంది, తన కూతురు అది విని తల ఊపుతోంది. తల్లిదండ్రులు సమక్షంలో ఉంటే నిజంగానే ఏ బాధా ఉండదు. వాళ్ళకు దూరంగా ఉండి ఎంతో పోగొట్టుకున్నాడు. రాత్రి పన్నెండు కావస్తూంది. ఇంకా సేపట్లో, ఇంకా సేపట్లో అని వాయిదా వేసుకుంటూ, అసలు ఎలా చనిపోవాలా అని సెల్‌లో వెతుకుతున్నాడు. పక్క గదిలో తన భార్య, మరొక గదిలో తన కూతురు నిద్రపోతున్నారు. మరొక కంపెనీ వెతుక్కుంటాడని వాళ్ళు అనుకోవచ్చు, కానీ తాను అలసిపోయాడు. ఇప్పటికే అవమానభారంతో ఉన్నాడని వాళ్ళకు తెలియదు. కాస్త ముఖం చిన్నబుచ్చుకుంటేనే అమ్మ అట్టే కనిపెట్టేసేది. "అదేం నాయనా, ముఖం అలా ఉందేమిటి? ఏమైందో చెప్పు" అంటూ చెప్పేదాకా వదిలేది కాదు. 


"వాడు సరిగ్గా తిన్నట్లు లేడు, ఏమైందో కనుక్కో" అనేవాడు నాన్న. 


ఇక్కడేమో మనుషుల మధ్య, మనసుల మధ్య ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరాదనే విదేశీ సంస్కృతి పరదాలు. ఎంత విదేశంలో ఉన్నా తన స్వదేశీ ఆత్మ అక్కడి ఆత్మీయత కోసం కొట్టుకులాడుతుంది. చివరగా ఒక్కసారి నాన్నతో మాట్లాడితే, అమ్మ ఒడిలో తలవాల్చి పడుకుంటే, వాళ్ళ పాదాలను తన కన్నీళ్ళతో కడిగితే, సూరిని కలిసి "నువ్వే విజేతవురా సూరి" అని చెప్పగలిగితే, చదువు నేర్పిన మాస్టారు గారిని కలిసి "గెలవడమే నేర్పించారేం మాస్టారూ? ఓడిపోవడం కూడా నేర్పించండి. పడిపోతుంటే పట్టుకుని నిలబడటం నేర్పండి. జారిపోతుంటే నిలదొక్కుకోవడం నేర్పండి" అని అడిగితే బాగుంటుంది. 


ఇవి తన చివరి కోరికలు. తన భార్య తలుపు తడుతోంది. తీయాలా వద్దా? తీస్తే తన నిర్ణయం ఆలస్యం అవుతుంది. ఆమె కొడుతూనే ఉంది. 


చివరికి "మామయ్య కాల్ చేసారు. మీకు కాల్ చేస్తే మీరు తీసుకోవడం లేదని నాకు చేసారు. తలుపు తెరవండి" అని అంటోంది. 


ఇక లాభం లేదని, "సరే, నేను చేస్తాను, నువ్వు వెళ్ళి పడుకో" అని అనగానే ఆమె వెళ్ళిపోయింది. 


మ్యూట్‌లో ఉన్న సెల్ చూస్తే నాన్న మిస్డ్ కాల్స్. ఆ టైంలో తనకు కాల్ చేయాలని నాన్నకు ఎందుకనిపించిందో... ఇక ఏదీ ఆలోచించకుండా నాన్నకు కాల్ చేసాడు. మొదటి రింగ్‌కే కనెక్ట్ అయ్యాడు. "ఏం నాన్నా, ఈ వేళప్పుడు కాల్ చేసారు?" ఏదో అడగాలని అడిగాడు. 


"ఏమో నాయనా, ఎందుకో చేయాలనిపించింది. నీ నిద్ర పాడుచేసానో ఏమో..." 


"అదేం లేదు నాన్నా. అమ్మ ఎలా ఉంది?" 


"బాగానే ఉంది. ఎందుకో ఒకటే నీ గురించి కలలు వస్తున్నాయని, చూడాలని కన్నీళ్లు పెట్టుకుంటుంది." 


సుదర్శన్ గుండె ఏడవడం మొదలుపెట్టింది. 


"సూరి కనిపించి చెప్పాడురా. మీ కంపెనీలో చాలా మందిని ఉద్యోగంలోంచి తీసేసారట. నీ ఉద్యోగం కూడా ఉండకపోవచ్చు అని అన్నాడు. నిజమేనా?" 


"అవును నాన్నా" అంటుంటే గొంతు పూడుకుపోయింది. 


నాన్నకు అర్థమైంది. "పోతే పోతుంది. మన దేశంలో లేని ఉద్యోగమా? ఏదీ లేకుంటే మన పొలం ఉంది. దానికి మించిన జీవనాధారం ఏముంది? వెంటనే మన దేశానికి వచ్చేయ్." 


"నాన్నా..." 


"నువ్వింకేమీ చెప్పొద్దు. కోడల్ని, పిల్లను తీసుకుని బయల్దేరి వచ్చేయ్. కోడలికి మేము నచ్చకపోతే వేరు కాపురం ఉందురు కానీ." 


గుండెను పిండేస్తున్నాయి నాన్న మాటలు. 


"అలా ఏం లేదులే నాన్నా" ఈసారి కళ్ళు నిర్విరామంగా వర్షించడం మొదలైంది. "సరే నాన్నా, వచ్చేస్తా" నిజంగానే అన్నాడు. 


"వచ్చేయ్ నాయనా! మిమ్మల్ని చూస్తూ ఉంటే మేము ఇంకొన్నాళ్ళు బతుకుతాము." 

"అలాగే నాన్నా." 


భారతదేశానికి వస్తానని అనడంలో ఇంత ఆనందం మునుపు ఎన్నడూ అనుభవంలోకి రాలేదు సుదర్శన్‌కు.


***************


డా. దారల విజయ కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డా. దారల విజయ కుమారి

పేరు : డా. దారల విజయ కుమారి

చదువు : డాక్టరేట్ ఇన్ సైకాలజీ

కుటుంబం : భర్త శ్రీ సురేంద్ర బాబు, పిల్లలు సాహితీ చరణ్, ప్రవల్లిక

స్వంత జిల్లా కర్నూలు, ప్రస్తుత నివాసం తిరుపతి


రచనలు : వేచాను కలకై..కవితా సంకలనం,

చర్విత చరణం - కథా సంకలనం

వివాహ బంధం.. దీర్ఘ కవిత (తానా - ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి పోటీలో చోటు చేసుకుంది)


మొదటి నవల, "హేమంత తుషారం" ఉషా- శ్రీ వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందింది.


రెండవ నవల "ఎ బర్డ్ ఇన్ ది హ్యాండ్" ఉషా సుజన ఫౌండేషన్ నవలల పోటీలో బహుమతి లభించింది


బహుమతులు..పురస్కారాలు :

************

సాహిత్య ప్రస్థానం , కౌముది, కథా మంజరి, వివిధ, స్నేహ ప్రజా శక్తి, సాక్షి ఫన్ డే, నెచ్చెలి, ఈమాట, మల్లెతీగ ,సహరి , విశాలాక్షి, స్వాతి సచిత్ర వార పత్రిక, విమల సాహితీ సంస్థ, వార్త, నేటి నిజం, మహిళా మార్గం, శ్రమ జీవి, ప్రజా సాహితి పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన కథల కవితల పోటీలలో పలు కథలు కవితలు బహుమతులు పొందాయి, ప్రచురించబడ్డాయి. కొన్ని కథలు,  సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఆలిండియా రేడియో లోనూ ప్రసారం చేయబడ్డాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page