![](https://static.wixstatic.com/media/acb93b_7f4972856d7e449bb433f32998aa68ab~mv2.png/v1/fill/w_980,h_980,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_auto/acb93b_7f4972856d7e449bb433f32998aa68ab~mv2.png)
'Panigrahanam - 8' New Telugu Web Series
Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి.
హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.
సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.
గతం గుర్తుకొస్తుందతనికి.
కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త. అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల. హాస్పిటల్ లో కోలుకుంటుంది. భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె.
ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష. ఫోన్ లో లక్ష్మణ అనే వ్యక్తికి అతని భార్య విడాకుల నోటిస్ పంపినట్లు విని బాధ పడతాడు. 'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' పేరుతో ఒక సంస్థను ప్రారంభిస్తాడు విరూపాక్ష.
మిత్రులను, పత్రికా విలేఖరులను ఆహ్వానించి సహకారం కోరుతాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడ్డ అభిప్రాయం బేధాలను సామరస్యంగా పరిష్కరించడమే ఈ కన్సల్టెన్సీ ఉద్దేశమని చెబుతాడు.
ముందుగా సాగర మేఖల కాపురం సరిదిద్దాలనుకుంటాడు.
ఆమె భర్తకు కాల్ చేసి సాగర మేఖలకు అతనంటే విముఖత లేదని చెబుతాడు.
మొదట్లో అతను సరిగ్గా బదులివ్వక పోయినా విరూపాక్ష పట్టుదల వల్ల మెత్తబడతాడు.
సాగర మేఖలలో కూడా మార్పు వచ్చి భర్త దగ్గరకు వెళ్తుంది.
ఇక పాణిగ్రహణం ధారావాహిక ఎనిమిదవ భాగం చదవండి.
"హలో! 'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ'"
"అవును.. మీరూ మేమూ చుట్టాలమే.. నేను సమీర్ తండ్రి ని"
డైరెక్టు గా ఫోన్ చేస్తే.. వెటకారంగా ఉంటుంది. ‘మా విషయాల్లో మీకేంపనీ?’ అంటారు. అందుకే విరూపాక్ష, దీని గురించి వేరే వారిచేత చెప్పించాడు.. సమీర్ తల్లిదండ్రులు వచ్చారు ముగ్గులోకి..
"సమస్య ఏంటి?"
"రెండేళ్ళనుండి కోర్టులచుట్టూ తిరగలేక చస్తున్నామ్. కేసులు కోర్టుల్లో పడితే ఓ పట్టాన తెములుతాయా ? ఫీజు ఇచ్చుకుంటాం.. ఉపాయం చెబుదురూ! "
"విషయం ఏంటిట? "
గంటసేపు జరిగిందంతా చెప్పనిచ్చాడు.
"నేనడిగింది.. ఎందుకలా జరిగింది? భవిష్యత్తు లో ఆమె ఏంచేయాలనుకుంటోంది అనీ?"
"మా పిల్లలు మాకేం చెప్పరు. మా పిల్లలే కాదు.. ఏ పిల్లలైనా అంతే ఉన్నారు.
చదువులు వచ్చినాయ్. బయటి ప్రపంచం తెలీటల్లా.. సర్దుబాట్లు తెలీటల్లా.. లేక మనమే చెప్పట్లేదో!? చెప్పేంత టైం ఏదీ? వినేంత టైం ఎవరికీ? చదువూ!.. చదువూ!.. చదువూ!.. తర్వాత కెరీర్ ముఖ్యం అంటున్నారు."
"మర్కట కిశోర న్యాయమా?
మార్జాల కిశోర న్యాయమా?
అన్నట్లుంది.. నేటిపిల్లలతో.. "
"అంటే?"
"మర్కటం అంటే కోతి.. మార్జాలం అంటే పిల్లి. కిశోరం అంటే పిల్ల.. కోతి చెట్ల మీంచి దూకేటప్పుడు.. కోతిపిల్ల.. కోతి పొట్టను గట్టిగా పట్టుకునే ఉంటుంది. పట్టుకోకపోతే పడిపోతుంది. అక్కడ భద్రత, బాధ్యత అంతా కోతిపిల్లదే. అదే పిల్లుల విషయంలో పిల్ల బాధ్యత తల్లిదే. నోటితో పట్టుకునే ఏడు సందులు తిప్పుతుందిట. కాబట్టీ మనం పిల్లల్ని పట్టుకోవాలో? మనల్ని వాళ్ళే పట్టుకోవాలో?.. "
"సమస్యంతా అక్కడే వస్తోంది"
వారంరోజులు సమీర్ ఫామిలీ తో టచ్ లోనే ఉండి.. మనస్థత్వాలూ.. మాటతీరూ పరిశీలన చేసి.. చర్చలు జరిపాక..
"సమీర్ భార్య ఫోన్ నెంబర్ ఇవ్వండీ"
వారం తర్వాత.. సమీర్ తండ్రి ఫోన్ చేసాడు."ఏం తేలింది?"
"మీలోనే లోపం ఉన్నట్లు తేలింది. "
"అదెలా?"
"సమీర్ భార్యకి తండ్రిలేడు. ఏమిటో! ఈమధ్య తండ్రి లేని సంసారాలే ఎక్కువవుతున్నాయి. విడిపోతున్నారో.. దేవుడి దగ్గరకే పోతున్నారో గానీ, సింగిల్ పేరెంటెడ్.. కుటుంబాలు.. ప్చ్.. ఇక మీ విషయానికి వస్తే.. తల్లి ఆడపిల్లలిద్దరినీ కష్టపడి పెంచింది. చదువూ చెప్పించింది. ఇవన్నీ మీకు తెలుసు కదూ! "
"అవును.. ఐతే!?"
"మగపిల్లల లాగానే ఆడపిల్లలూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళా రేపూ, తల్లీదండ్రీ బాధ్యత ఆడపిల్లలూ తీసుకుంటున్నారు. మీ కోడలు విషయం లోనూ వాళ్ళ అమ్మ గురించే.. ఆవిషయం వాళ్ళు పెళ్ళి కి ముందే మీకూ చెప్పారుటగా! "
"ఆమె పెళ్ళి కాని చెల్లెలితో పాటు ఉంటోందిగా !"
"ఏదో అనారోగ్యం తో బాధపడుతోంది. తీసుకు వస్తానంది. సమీర్ వద్దన్నాడు. "
"దీనిమీద మెుదలైన వాదన, బట్టతల..బానపొట్ట.. తో పరాకాష్ఠ నంది, నరం కోసుకుని, హాస్పటల్ పాలయ్యి, ఆదెబ్బకి ఇద్దరికీ వివాహం మీద నమ్మకం పోయి, విరక్తి వచ్చి, ‘విడాకులైతే చాలురా నాయనా!’ అనుకుంటున్నారు."
"మీ అబ్బాయి ఇదంతా మీకు చెప్పాడా? పోనీ ఇన్నిసార్లు కోర్టుచుట్టూ తిరిగినా ఆ అమ్మాయీ, ఈ విషయమై నోరు విప్పిందా? తెంపేసుకు అవతల పడదామనే తప్ప.. గట్టిగా ముడేద్దామనే.. ఓర్పుఏదీ?.. ఆ అమ్మాయి సమస్య మీరు పరిష్కరించగలిగితే! కథ సుఖాంతం.”
"ఇంతజరిగిందా.. ఏరా సమీర్.. " కొడుకు నడిగాడు.
"మీరూ మీ అబ్బాయీ ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి.. పరిష్కరించలేనంత సమస్యేం కాదు. కేవలం పరస్పరం అవగాహన లోపం అంతే !"
తండ్రీ కొడుకు ఏం మాట్లాడుకున్నారో..
నాలుగు రోజుల తర్వాత ఫోన్..
"విరూపాక్షా! నువ్వు రేపు మా యింటికి రావాలి. "
“ఎందుకో!?”
"మా కోడలి చేతి కాఫీ తాగటానికి "
"తప్పకుండా.. కాఫీ కేమిటీ? వీలు చూసుకుని భోజనానికే వస్తా. మనం మనం చుట్టాలమేగా! ఆ అమ్మాయి కూడా నాకూ పరిచయమేగా! " నవ్వాడు విరూపాక్ష.
ఇంత తేలికగా పరిష్కారం అయిందే?!
అన్నీ ఇలా పరిష్కారమవ్వవు. కొన్ని కేసులు ముజ్జిడ్డు గా ఉంటాయి, అనుకున్నాడు.
లిస్టులో సమీర్ పేరు టిక్ కొట్టేసాడు.
@@@@@@@@@
నెక్స్ట్ లక్ష్మణ.
"లక్మణా! ఏం చేస్తున్నావ్? "
"ఏముందన్నయ్యా! ఆఫీసుపని.. ఇంటికివచ్చాక మెస్ పనికి తమ్ముడికి సాయం.. తినడం.. పడుకోటం"
"భార్య, కూతురూ వద్దా? "
"నాతో వేళాకోళమా అన్నయ్యా!"
"మాచెల్లి, నాకు వస్తున్నానని చెప్పిందే!.." మెుదటి బాణం వేసాడు.
"నీకు ఫోన్ చేసిందా? అదేదో నాకే చేయవచ్చుగా?!"
‘నువ్వంత పిచ్చివాడివి కాబట్టే.. తను నిన్ను ఆడిస్తోంది’ మనసులో అనుకున్నాడు విరూపాక్ష.
బయటికి మాత్రం.. "ఎన్ని సార్లు చేసినా నీనెంబర్ కలవట్లేదుట"
"అవునా!? ఈ నెంబర్ కి చేయమని చెప్పన్నయ్యా! "
ఇదేమిటీ! ఆమె ఎక్కడుందో తెలీకుండా బాణంవేసానే! ఇంత ఈజీగా లక్ష్మణ ఒప్పుకుంటాడని అనుకోలేదే!? ఇప్పుడు ఆమెను వెదకాలి ఎలా? ఆమె ఇక్కడికి రావటానికి నిరాకరిస్తే?
ఇంతలో ఫోన్.. "నేనన్నయ్యా! హంసమంజీరను.. నీ సక్సెస్ నంతా, ఓ కథగా వ్రాద్దామనుకుంటున్నాను. నువ్వు అనుమతినిస్తే!"
"కథేం ఖర్మ.. నవలే రాస్కో! ఏదీ.. ఓ కమ్మని కవిత చెప్పు"
"అతడు-- సమస్యల గవాక్షానికి
పరిష్కార తోరణమైనవాడు.
అతడు-- పూలల్లోని మకరందాన్ని
సేకరించి.. రంగరించి..
ప్రతి గుండెకూ అందించగల
అమృత కలశుడూ..
అతడు -- శిలలను పుష్పింపజేయగల ఆమనీ..
అతడు.. విరులకు సరిగమలు నేర్పగల స్వరధుని..
మోడులాంటి జీవితాలు చిగిరిస్తే..
అది కనికట్టు కాదు.
అది అతడికే తెలిసిన
మానసేంద్రియ సేద్యం..
అతడే.. మళ్ళీ అతడే.. "
"కవిత ఎతడి గురించి చెప్పవో గానీ బాగుంది. "
"ఏమై పోతుందో అనుకున్న సాగరమేఖల జీవితం బాగుపడటం చాలా సంతోషంగా ఉంది. నువ్వు, నువ్వు స్థాపించిన సంస్థ, నీ కృషి, వైవాహిక జీవితం పట్ల, బాధ్యతను, సమాజానికి అందజేయాలనే నీ ఆదర్శం, నేటి తరానికి నవ్వే స్ఫూర్తి.. ఆల్ ద బెస్ట్ "
ఫోన్ కట్ చేసింది.
అదిసరే లక్ష్మణ భార్య ను ఎక్కడని వెదకాలీ?.. తలవిదిలించాడు విరూపాక్ష.
@@@@@
======================================
సశేషం
=======================================
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_625ee2fdbd4947398a0b24e53fbe6eba~mv2.png/v1/fill/w_158,h_121,al_c,q_85,enc_auto/acb93b_625ee2fdbd4947398a0b24e53fbe6eba~mv2.png)
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
![](https://static.wixstatic.com/media/acb93b_00f9141ec2044496a6095a9c4fd9e67d~mv2.jpg/v1/fill/w_980,h_653,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_auto/acb93b_00f9141ec2044496a6095a9c4fd9e67d~mv2.jpg)
![](https://static.wixstatic.com/media/acb93b_e9644735114d404b88bb67fdf873e2a3~mv2.png/v1/fill/w_291,h_427,al_c,q_85,enc_auto/acb93b_e9644735114d404b88bb67fdf873e2a3~mv2.png)
KODURI SESHAPHANI SARMA • 23 hours ago
బాగుంది.కథనం మంచి మార్గంలో నడుస్తూంది.