పాణిగ్రహణం - 6

'Panigrahanam - 6' New Telugu Web Series
Written By Bhagavathula Bharathi
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ....
హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి.
హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.
సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.
గతం గుర్తుకొస్తుందతనికి.
సాగరమేఖలకు వివాహం జరుగుతుంది.
ఇద్దరు ఆడపిల్లల తరువాత ఒక అబ్బాయి పుడతాడు.
కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల.
అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త.
అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల.
హాస్పిటల్ లో కోలుకుంటుంది.
భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె.
ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష.
ఫోన్ లో లక్ష్మణ అనే వ్యక్తికి అతని భార్య విడాకుల నోటిస్ పంపినట్లు విని బాధ పడతాడు. బట్టలు, నగలు, కొన్ని ఆస్తి పాత్రలు తీసుకోని వెళ్లి పోయిందని లక్ష్మణ చెబుతాడు.
పాణిగ్రహణం ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పాణిగ్రహణం ఎపిసోడ్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక పాణిగ్రహణం ధారావాహిక ఆరవ భాగం చదవండి.
చిన్నగదే ఐనా కొంతమంది ఆహూతులతో ఇద్దరు పత్రికా విలేఖరులతో కళకళ లాడుతోంది.
'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' అనే చిన్న బ్యానర్
వెనకవైపు గోడకు తగిలించి ఉంది.
వాటర్ బాటిల్స్, స్నాక్స్, టీ సర్వ్ చేయబడ్డాయి.
"ఎందుకు పిలిచాడో? ఇదంతా ఏమిటో? "
వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నారు.
"కాసేపట్లో అదే తెలుస్తుందిగా! వండుకున్నమ్మ తినక మానదుగా! కడుపుతో ఉన్నమ్మ కనక మానదుగా! " నవ్వులూ.
గొంతువిప్పాడు విరూపాక్ష.
"నా యింట్లో ఇంత చిన్న గదిలోకి నేను ఆహ్వానించగానే, మీమీ పనులు మానుకుని అమూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించి.... వచ్చిన శ్రేయోభిలాషులకు, పత్రికా విలేఖరులకు ముందుగా ధన్యవాదాలు... "
"డియర్ ఫ్రెండ్స్...వెనకనున్న బ్యానర్ చూడగానే మీకు సగం అర్ధమయిపోయి ఉండాలి"
"అంటే 'మ్యారేజ్ బ్యూరో' ఏదైనా పెడుతున్నావా? విరూ! మరి ఉద్యోగం?"
"ఉద్యోగం దారిదానిదే! ఇది మ్యారేజి బ్యూరో కాదు. " అని క్షణం ఆగి....
"మీ అందరికీ తెలుసు. ఇవాళా రేపూ వివాహ వ్యవస్థ ఎంత ఛిన్నాభిన్నమైపోతోందో? "
"అవును విరూ! మా వాళ్ళలోనే మూడు విడాకుల కేసులు... "
"నిజమే! పెళ్ళి పెళ్ళని శుభలేఖలు పంచి, లక్షలు పెట్టి, కల్యాణ మంటపాలు మాట్లాడి లక్షలు ఖర్చు చేసి పెళ్ళిళ్ళు చేసినంతసేపు పట్టట్లా ! ఇంటికివచ్చి కాళ్ళుకడుక్కున్నంత సేపట్లో, ఫోన్.... ఆ జంటకు విడాకులని... "
"పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటేనే... ఆ!... ఎందుకులే! వీళ్ళు కలిసిఉండేదా? పెట్టేదా? గిఫ్ట్, ప్రయాణం ఛార్జీలు దండగ... వాళ్ళు కలిసున్నారని తెలిసాక పోదాం, అనిపిస్తోంది" ఓ పెద్దాయన అన్నాడు.
"శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యంభవతి శతమితిశతం దీర్ఘమాయుః " అని ఆశీర్వదించినంతసేపు పట్టట్లా. "
"కారణం ఏమిటంటారూ?" విరూపాక్ష చర్చకు దిగాడు.
"ఆ... ఆడవాళ్ళ చదువులూ, ఉద్యోగాలూ " ఆడవాళ్ల మీద ఉక్రోషంతో అన్నాడు ఓ పెద్దాయన.
"మరి చదువుకోని వాళ్ళూ విడిపోయినట్లు విన్నానూ"
"ఐతే! ఇగోలేమో! నేనూ అనే... కాన్సెప్ట్ " అన్నారు ఇంకొకరు.
"కొంత కారణం కావచ్చు... కానీ అన్నీ అలాగూ లేవు. "
"మరి నువ్వేమంటావో అది చెప్పు విరూ!" చనువుగా అడిగింది పెద్దావిడ.
"ఎక్కడవిన్నా విడాకులూ, విడాకులూ.. దీనికి కారణం ఇదీ? అని నేనే కాదు ఎవరూ విశ్లేషించలేరు. కానీ వాళ్ళిద్దరిలోనూ, విడాకులకు కారణమైన, ఏదో కీలక అంశం ఉంటుంది. 'గేహళీదత్తదీపన్యాయం' లాగా..
గుమ్మంమీద పెట్టిన దీపం రెండువైపులా కాంతినిస్తుంది. అలాగే ఇరుపక్కాలూ ఎవరిది వింటే వారిదే మనకి న్యాయమనిపిస్తుంది. దాన్ని ఆసాంతం ఓర్పుతో సరిచేయగలిగితే... పరిష్కరించవచ్చు. "
"దానికి కోర్టులూ, పెద్దలూ ఉన్నారుగా. నువ్వు కొత్తగా చేసేదేముంది? "
"ఉన్నాయ్! కానీ మెుండితనంతో భార్యాభర్తలు.... భీష్మించుకు కూర్చుంటే కోర్టులూ, పెద్దలూ ఏమీ చేయలేరేమో!? "
"పైగా ఎప్పుడు విడాకులైపోతాయా!? మళ్లీ పెళ్ళి చేసేద్దాం. లేదంటే... ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తారూ, అనీ.... వాళ్ళు మా మాట వినట్లేదు. బలవంతంగా కాపురం చేయిస్తే... అసలే రోజులు బాగుండలేదు.... హత్యలో? ఆత్మహత్యలో? ఎందుకు వచ్చిన హైరానా? అందుకే వదిలేసాం... అనీ!... బోలెడు కారణాలు చెబుతున్నారు పెద్దలు.... అభిప్రాయాలు కలవక పోతే, కాపురం ఎలాచేస్తాం?" అని చెబుతున్నారు పిల్లలూ..... "
"పైగా పిల్లలు కూడా మనసులో మాటను, పెద్దలతో స్వేచ్ఛగా చర్చించలేకపోతున్నారు”
"సార్! దీనికి చాలా మ్యారేజ్ కౌన్సిలింగ్ సెంటర్లు వెలిసాయ్. వాటిల్లో భార్యాభర్తల పరస్పర నిందారోపణలే తప్ప, విషయం మాత్రం పరిష్కారించలేకపోతున్నాయ్. ఇవన్నీ వినీవినీ, కౌన్సిలింగ్ డాక్టర్ చేతులెత్తేసిన సందర్భాలూ... ఓ జర్నలిస్ట్ గా నేను చూసాను."
"గాయం ఎక్కడైందో! అక్కడ మందువేయాలి. సమస్య ఎక్కడ ఉందో! దాన్ని పట్టుకోవాలి. విడాకుల కేసులు.. చాలా సున్నితమైనవి.. ఇందులో చదువుకున్నవారూ, చదువు లేనివారూ సమానమే. నలుగుర్నీ పోగేసి, సమస్య చర్చించీ, నలుగురు చేరాక అందరూ తలో మాటా మాట్లాడీ, బంధాన్ని ఇంకాస్త తెంపేయటానికే అవకాశం ఉంది. కాబట్టి
అవసరమైన వాళ్ళకి, అవసరమైన, చికిత్స చేయగలిగితే చాలు... " నవ్వాడు విరూపాక్ష.
"ఇలాంటివి చాలా చూసాములే" అన్నట్లుగా చూసారంతా.
విరూపాక్ష నిరుత్సాహ పడలేదు.
"'నేనుసైతం' ప్రయత్నిస్తాను. నేటి వివాహ వ్యవస్థ చూస్తుంటే చాలా భయం వేస్తోంది.
భవిష్యత్తులో భార్యాభర్తలు అనే బంధాలు నిలబడతాయా? కథల్లో మాత్రమే చెప్పుకోవాలా అనగనగా! పూర్వం ఓ భార్యాభర్తా ఉండేవారూ.... అని.... "
"ఎవరో ఒకరు పూనుకోకపోతే, కొంతైనా మార్పురాదుగా!మళ్ళీ ఇదంతా సరిచేయటానికి 'బోధాయనుడూ'... 'వాత్సాయనుడూ' మరోసారి జన్మ ఎత్తిరావాలా?”
"మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరేగా! దయచేసి ఈ మేటర్ మీ పేపర్ లో వేయండి... నేను చేపట్టిన కార్యక్రమం లో ఎలాంటి ఫీజులు, పారితోషికాలూ లేవు. మనీ తో లావాదేవీలు ఉండవ్. "
"మరి ఉద్యోగం మానేస్తున్నారా ?"
"నేను ఉద్యోగ బాధ్యతలలో ఉంటానుకాబట్టి, నాభార్య ను దీనికి చైరపర్సన్ గా ఉంచుతున్నాను "
"నా సెలవుదినాలలో, తను సేకరించిన విషయాలమీద పరిష్కారాలు సూచించబడతాయ్. "
"అంటే ప్రతిమగవాడి విజయంవెనుకా ఓ స్త్రీ ఉంటుందన్నది నిజం చేస్తారన్నమాట. " వాతావరణం తేలిక పరచడానికి ఎవరో జోక్ చేసారు.
"విజయం వెనుక ఉన్నదీ... స్త్రీనే. ఈ కన్స్ ల్టెన్సీ పెట్టడానికీ కారణమూ ఓ స్త్రీ నే... 'అక్క'.... " అంటుండగా విరూపాక్ష ముఖం వివర్ణమవటం అందరూ గమనించారు.
తేరుకుని "అందుకే నా ప్రయాణం, ప్రయత్నం ఇంటినుండే మెుదలవుతుంది. " అన్నాడు.
"ఇంటగెలిచి రచ్చగలవాలి అన్నారుగదా! ఓ వేళ ఇంటగెలవలేకపోతే?"జర్నలిస్ట్ అడిగాడు.
"కన్స్ ల్టెన్సీ మూసేస్తాను. సరేనా! " కాన్ఫిడెంట్ గా అన్నాడు విరూపాక్ష.
"ఇంకేవైనా అనుమానాలూ, సందేహాలూ ఉన్నాయా అండీ? " అందర్నీ ఉద్దేశించి అడిగాడు.
"ఎన్నో సందేహాలూ, సంశయాలూ.... ఉన్నాయి. ఉంటాయి. ఫలితాన్ని బట్టి... వాటన్నటికీ.... జవాబులు సమకూరుతాయి. అటువంటి సమాధానం కోసం ఎదురుచూస్తాం! "ఓ జర్నలిస్ట్ అన్నాడు.
"అవన్నీ నిజమే! అన్నీ సవ్యంగా జరిగి, సత్ఫలితాలు వస్తే, మేమే పేపర్లలో మీపేరు, మీ కన్స్ ల్టెన్సీ పేరునూ, ఆకాశానికి ఎత్తేస్తాము. కాస్త తేడా వస్తే, ఇదంతా మోసం, .... ఇంకా... ఇంకా.... రాసేస్తామ్ " నవ్వాడు ఓ జర్నలిస్ట్. నవ్వుల్లో అందరు శృతి కలిపారు.
'పాణిగ్రహణం కన్స్ ల్టెన్సీ ' గురించి అన్ని పేపర్లలో ఈవార్త బహుముఖంగా ప్రచురితమైంది. కొంతమంది విచిత్రం గా చెప్పుకున్నారు.
విడాకుల బాధితులు మాత్రం.. ఓ రాయి వేద్దాం... ఫీజు ఎలాగూ లేదుగా! పోయిందేముందీ! అని ఫోన్ లో నెంబర్ నోట్ చేసుకున్నారు.
ఫోన్లు రావటమూ మెుదలయింది.
పేపర్ మీద పేర్లు వరుసలో వ్రాసాడు.
సాగరమేఖల
సమీర్
లక్ష్మణ
ఇంకా.... చాలా పేర్లు వ్రాసాడు.
ముందుగా... సాగరమేఖల..
===========================================
సశేషం
పాణిగ్రహణం ఎపిసోడ్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
===========================================
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
Twitter Link
https://twitter.com/ManaTeluguKatha/status/1623204681131651073?s=20&t=KEUnq66YFWeS0CsYGQsYSw
Podcast Link
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
https://www.manatelugukathalu.com/profile/bharathi/profile
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

