top of page
Original_edited.jpg

కట్టు బానిస

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #కట్టుబానిస, #KattuBanisa, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Kattu Banisa - New Telugu Story Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 26/11/2025 

కట్టు బానిస - తెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

“నరహరీ, కట్టు బానిస అన్న పదం భలే పాపులర్ అయ్యిందోయ్. విన్నావా?” 


“ఆహా, బాహుబలిలో మాటే కదా!” 


“అదే. నీకు స్వచ్చంద కట్టు బానిసల సంఘంగురించి తెలుసా! “

 

“తెలియకేం, tfi_ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కట్టు బానిస పేరిట, సినీ అభిమానులు ఒక అభిమాన సంఘం పెట్టుకున్నారు. మనం కూడా అలాంటిది ఒకటి పెడితే, యెలా వుంటుందని ఆలోచిస్తున్నా. ” 


“ఎవరిపై అభిమానంతో?”


“ఇంకెవరు? భార్యలే! మనం జీవించేది వారి కనుసన్నల్లోనే కదా. దాని పేరు తాళికట్టు బానిస సంఘం." 


“మన సంఘానికి శ్రీ కృష్ణుడిని గౌరవ చైర్మన్ గా ప్రకటిద్దాం. జయదేవుని గీతగోవిందం చూడు. అందులో ‘ మమ శిరసి మండనం..దేహి పద పల్లవం ఉధారం’. అంటే నీ పాదాలను దయతో నా తలపై వుంచు అని కృష్ణుడు, రాధని బ్రతిమాలుకున్నాడని చెప్పాడు. ఆయనే మనకి నిజమైన మార్గదర్శి, నాయకుడు. ”


“ప్రేమికురాలికే అంత దాసుడయ్యాడు. భార్య సత్యభామ సంగతి చెప్పనలవి కాదు. ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలో కృష్ణుడు, నను భవదీయ దాసుడ నని ఆమె కాళ్ళ దగ్గర మ్రోకరిల్లాడు. ఆయనే మన గురువు. "


"టైం ఆరైంది. ఇంక ఇంటికి పోక పోతే, ఈ రోజు తలంటే. వస్తా! రేపు ఆఫీసులో కలుద్దాం. వెయిటర్! డబ్బు తీసుకో" అని అంటూ నరహరి లేచి బయలుదేరాడు. అతని స్నేహితుడు అతడిని అనుసరించాడు. 


వారికి కొద్ది దూరంలో కూర్చుని, వారి సంభాషణ విన్న రఘు కలవరపడ్డాడు. 


ఎన్నో హాస్యోక్తులని, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి హితవాక్యాలని, పుట్టిన వానికి వివాహం తప్పదు, భార్యతో బాధలు తప్పవు, అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపతగదు వంటి తత్వోపదేశాలు, విన్నా కూడా అమ్మా నాన్నల పట్టుదల మారదు. ఎలాగైనా ఈ యేడు రఘుని ఒక ఇంటి వాడిని చేసేస్తామని బంధువులకు మాట యిచ్చారు. 


ఇంతకీ వాళ్ళని నిందించి యేం ప్రయోజనం? ఉచిత సలహాలిచ్చే బంధువులని, జోకులేసే స్నేహితులని అనాలి. 


క్రింది జన్మలో వారు జోరీగలై వుంటారు. అంతకుముందు జన్మలో కాకులై వుంటారు. 

అలా తిట్టుకున్నాక, అతని ధ్యాస, తనని అక్కడ నిరీక్షించేలా చేస్తున్న సుష్మ మీదకి మళ్ళింది. 

ఇంతకీ, సుష్మ అనబడే సుందరాంగి ఇంకా ఎందుకు రాలేదో? కురవని మేఘంలా, వికసించని కుసుమంలా, ప్రత్యక్షం కాని దేవతలా, కనబడని నక్షత్రంలా వుందే! 


మంచిది. ఈ రోజుకి బ్రతికాను అని అనుకుంటుండగా, అతని తల్లి నుంచి ఫోన్! 


"నాన్నా ఇంటికి వచ్చెయ్యి. ఆ అమ్మాయి మన సంబంధం వద్దని చెప్పింది. ఆ అమ్మాయికి వుంగరాల జుత్తు వున్న అబ్బాయి వద్దట. "


"పోనీ గుండు ఇష్టమా అని నువ్వడగలేదా? ఎప్పుడూ గుండూరావులా వుండేవాడిని. " 


"అరె! ఆ మాట తట్టలేదురా! ఇప్పుడే అడుగుతాను" అని ఫోన్ కట్ చేసింది. 


"ఏమిటో వెర్రి తాపత్రయం! ఏదో ఒక వంక చెప్పి ఆ అమ్మాయి వద్దనుకుంది. అది అమ్మకు తెలిసినా ఒక ఆశ. " అని అనుకుని, వెయిటర్ ని పిలిచి, ఎంతో కులాసాగా, స్నాక్స్, కాఫీ ఆర్డరిచ్చాడు. 

@@@

 పెళ్ళి చూపులకు వచ్చిన జానకిని చూసి రఘు ఒక్క నిమిషం అనిమేషుడయ్యాడు. 

“రఘూ! ముందు మీరు మాట్లాడుతారా, లేక నన్ను మాట్లాడమంటారా? అని జానకి అడిగింది. 

"లేడీస్ ఫస్ట్ అన్నారు. అదే నియమం పాటిద్దాం" అన్నాడు రఘు వుత్సాహంగా. 


"మీరిలా అనడం వల్ల నాకు మూడు విషయాలు అర్ధమయ్యాయి. ఒకటి మీరు నన్ను చూసి పడిపోయారు, అంటే మీరు బాహ్య సౌందర్య ఆరాధకులు. రెండు, మీకు సాంప్రదాయమంటే ఇష్టం. అంటే మీరు ఓల్డ్ జనరేషన్. మూడు, మీరు కాస్త ఇబ్బంది వున్న చోట నన్ను ముందుకు తోసి, మీరు వెనక దాక్కుంటారు. అంటే. మీలో ఆధిపత్య ధోరణి లేదు "


ఆమె విశ్లేషణాత్మక వ్యాఖ్యలు విని రఘు నోరెళ్ళబెట్టాడు. 

"ఈగలున్నాయి. నోట్లోకి పోవచ్చు" అంది ఆమె. 

తూటాలాంటి ఆమె మాటకు ఖంగు తిన్నాడు. 


“ఆమె వెయిటర్ని పిలిచి రెండు గ్లాసుల ద్రాక్ష జ్యూసు ఆర్డరిచ్చింది. ఆ తర్వాత రఘుని ఇలా అడిగింది. 


"ద్రాక్ష జ్యూసు మీకెందుకు యిస్తున్నానో తెలుసా?" 


ఎదురు చూడని ప్రశ్నకు, రఘు నిరుత్తరుడయ్యాడు. ఆమె యిలా చెప్పింది. 

"ద్రాక్ష అనేక రుచుల సమ్మిశ్రితం. తీపి, పులుపు, సుగంధం, కషాయం వంటి రుచులు కలిసి వున్న పానీయం. రేపు మన కాపురం కూడా ఇలాగే వుంటుందని మీకు సంకేతమిస్తున్నాను. ”


ఆమె వివరణతో రఘు కళ్ళు మెరిసాయి. ఆమె మరొక ప్రశ్న సంధించింది. 

"రఘూ! సంసారం ఒక వ్యవస్థ లాంటిది. దానికి పెట్టుబడి కావాలి. మీరెలాంటి పెట్టుబడి పెడతారు?. "


నెల నెలా లక్షల్లో సంపాదిస్తున్న రఘుకి పోయిన ప్రాణం తిరిగివచ్చింది. 


"ఒక ఫ్లాట్ వుంది. కోటి రూపాయల.. " జానకి అతని మాటలకు అడ్డు పడుతూ, " మీ ఆస్తి వివరాలు నాకు వద్దు. అలా చెప్పడం మీకు మంచిది కాదు. మీ ఆస్తి కొట్టేయడానికి నేను విడాకులు కోరే ప్రమాదముంది" 


రఘు జావకారిపోయాడు. 

"మీ ప్రశ్నకు మీ సమాధానం యేమిటో?' అని మెల్లగా గొంతు పెగల్చుకుని అడిగాడు. 


"మొదటిది డబ్బు పెట్టుబడి. మన కాపురానికయ్యే ఖర్చులో సగం నేను భరిస్తాను. రెండోది స్వేద పెట్టుబడి. అన్ని రకాల పనులను దాదాపు సమంగా మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను. "


"మీరు నా అర్ధాంగి అన్న మాట. నేను కూడా అలాగే చేస్తాను. " 


అతని జవాబు విని ఆమె కనీకనబడనట్లు నవ్వుతూ అడిగింది. 

"భవిష్యత్తు గురించి మీకున్న కల లేమిటి?" 


"స్వీట్ హోం. హాయిగా భార్యా బిడ్డలతో కలిసి వుండడం. అమ్మా నాన్నలకి ఆసరాగా వుండడం."


"ఆ మాట యెవరైనా చెబుతారు. అంటే మీరు సగటు మనిషి. లేచాం, తిన్నాం, పడుకున్నాం టైపు. " 


ఆమె మాటకు రఘు ఉడుక్కున్నాడు. 

"అన్యాయం. సంతోషంగా వుండడానికి ఎన్నో చేస్తాం. ఏం చేస్తానన్నది నా భార్య యిష్టం పైన ఆధార పడి వుంటుంది. " 


మెల్లగా లేచి, ' మీరు పప్పు సుద్ద లాంటి వారు. మీకు మంచి అమ్మాయి దొరకాలి అని ఆ దేవుని ప్రార్ధిస్తాను, " అని అతని ముఖంలోకి ప్రసన్నంగా చూసింది. 


రఘు హతాశుడై, మౌనాన్ని ఆశ్రయించాడు. 


ఒక నిమిషం తర్వాత ఆమె చిరునవ్వుతో, అతని ముఖంలోకి చూస్తూ, " మౌన మునీ వెడుతున్నా" అంది. వెయిటర్ని పిలిచి, హోటల్ బిల్లులో సగ భాగం చెల్లించి, వెళ్ళిపోయింది. 


రఘు కొద్ది సేపు స్థబ్దంగా వుండిపోయాడు. ఆ తర్వాత తేరుకుని, మిగతా బిల్లు చెల్లించి ఇంటికి చేరుకున్నాడు. అతనికి తల్లి ఎదురొచ్చి, " కాయా, పండా" అని అడిగింది. 


విసుగ్గా "నా బొంద" అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. 


అయిదు నిమిషాల తర్వాత, అతని తల్లి వచ్చి, " ఆ అమ్మాయి ఓకే అంది కదా. ఓకే అన్నందుకు బాధపడు తున్నావా? భలే వాడివి, " అని వెళ్ళిపోయింది. 


రఘుకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెకు ఫోన్ చేసాడు. 

"చెప్పండి, " అంది ఆమె. 


"రెస్టారంటులో నాకు ఒక మాట చెప్పి, ఇక్కడ ఇంకో మాట చెప్పడం తప్పనిపించలేదా?" 


“నేనేం చెప్పాను? గుర్తు తెచ్చుకుని, చెప్పండి. ”


“నాకు మంచి అమ్మాయి దొరకాలని ఆ దేవుని ప్రార్ధిస్తాను, అని అన్నారు. " 


“మీరేమనాలి నాతో? నువ్వు మంచి అమ్మాయే కదా, నా అదృష్టం అని అనాలి. అన్నారా! అలా అని వుంటే అప్పుడే, అక్కడే, ఐ లవ్ యు చెప్పి, వుండేదాన్ని. " 


రఘుకి నోట మాట రాలేదు. 


ఒక నిమిషం తరువాత, " థాంక్యూ! మీ చాతుర్యానికి, మేధస్సుకి, నేను దాసుడిని. మీ నిర్ణయాలకు కట్టుబడి వుంటాను" అని అన్నాడు. 


ఆ మాట అన్న తర్వాత, అతనికి స్పృహ వచ్చింది. 


“పెళ్ళికి ముందే ప్రేమ పరవశంలో కట్టు బానిసను అని ప్రకటించేసాను. ఆహా! ప్రేమ యెంత చిత్రమైనది, ” అని అనుకున్నాడు. 


@@@@@


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

కథనంలో కొత్తదనం. ఆధునిక పోకడలు..ప్రతిబింబించేదిలా ఉంది.

Like

K V L N swamy
K V L N swamy
5 hours ago

కథ బావుంది కథనం కొత్తగా ఉంది. ఏది ఏమైనా మన మీద ఇతరులు చూపించే ప్రేమకు మనం బానిసలం అవడం మామూలే. ఆ విషయాన్ని రచయిత చాలా చక్కగ చెప్పారు

Edited
Like

కట్టుబానిస కథ రసవత్తరంగా ఉంది

ఇంకా ఉంటే బాగుందేది అనిపించింది

Like
bottom of page