top of page

పాణిగ్రహణం - 3


'Panigrahanam - 3' New Telugu Web Series(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో..

ఇంటికి వచ్చిన భర్త ముభావంగా ఉండటం గమనించి కారణం అడుగుతుంది హంస మంజీర.

తన మేనమామ కొడుకు సమీర్, భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు చెబుతాడతను.

సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.

గతం గుర్తుకొస్తుందతనికి.


ఇక పాణిగ్రహణం ఎపిసోడ్ 3 చదవండి.


సాగర మేఖలను చూసుకోటానికి పెళ్ళి వారు వచ్చారు.

తండ్రి లేడు కాబట్టి.... తల్లి రాకూడదనే ఆచారం ప్రకారం.... మేనమామా భార్య వచ్చారు. వస్తూ ఓ పురోహితుణ్ణి వెంటబెట్టుకు వచ్చారు.


ఇటువైపూ తండ్రిలేడు, విరూపాక్ష, పిన్నీ, బాబాయ్ వచ్చారు మాట్లాడటానికి.

పిల్లవాడి మేనమామ, "పిల్ల బాగుంది, చదువుకుంది. ఉద్యోగస్థురాలు.... ఇంకేం! శుభస్యశీఘ్రం. అయ్యగారూ! జాతకాలు సరిపోయాయంటారా?" అడిగాడు.


"అంటే.... అన్నీ బాగున్నాయి కానీ,

జాతకాలలో కొద్దిగా లోటుంది. " నీళ్ళు నమిలాడు పంతులుగారు.

"మా రోజుల్లో ఇవన్నీ చూసి చేసారామా పెళ్ళిళ్ళూ... ఇవాళారేపూ ఇదో వంక వచ్చేసింది. జాతకాలు కలవలేదు అనీ.... "

మేనమామ పెళ్ళాం దీర్ఘాలుతీసింది.


"జాతకాలు కలవకపోవటం ఏం లేదండీ... చిన్న లోపం అంతే!... పేరు మార్చితే సరిపోతుంది " పంతులుగారు పంచాంగం తిరగేసాడు.


విరూపాక్ష బాబాయ్ విరూపాక్ష ను బయటికి తీసుకుపోయి...

"పిల్ల, ఉద్యోగం... మిగతా లాంఛనాలు నచ్చినాయ్ కాబట్టి.... పేరు మార్చమని చెబితే పోలా! మనం మాత్రం ఇంతకన్నా మంచిసంబంధం తేగలమా ?ఆలోచించు విరూ! " అన్నాడు.


"నాన్న ఉంటే ఏం చేసేవాడో తెలీదు. అక్కకూ ఓ అభిప్రాయం ఉంటుందిగా... అడిగీ....

"అక్కా! ఓ సారి ఇలావస్తావా?"

వచ్చింది.


"విన్నావుగా! అతను నచ్చాడా? పేరు మార్చుకోటం ఇష్టమేనా? మేమేదో పెళ్ళి సంబంధాలు చూడటానికి కష్టపడి పోతామని.... రాజీ పడవద్దు. నీ కిష్టమయితేనే! బలవంతమేం లేదు. " చెప్పాడు.


"మన మధ్యతరగతి కుటుంబాలలో, ఇంతకన్నా మంచి ఎక్కువ ఆశించటం... అందులోనూ.... నాన్నని పోగొట్టుకున్న

మనం.... నాకిష్టమే.... "


"మన:స్ఫూర్తిగా చెబుతున్నావా అక్కా!"


"వంక పెట్టటానికి వేరే ఏం కనబడలా? పేరు మారిస్తే ఏమవుతుందిలే! సర్టిఫికేట్ లలో నాన్న పెట్టిన పేరే ఉంటుందిగా! "


ఇష్టమేనని చెప్పాక... చక్కగా పేరు మిళింద అని మార్చారు.

మేఖలకి సంబంధం కుదిరింది. పెళ్ళిశుభలేఖలు పంచటానికి వెళ్ళిన విరూపాక్ష మరోశుభవార్త మోసుకొని వచ్చాడు. "హంసమంజీరకూ సంబంధాలు చూస్తున్నారట. బాబాయ్ చెప్పాడు. త్వరలోనే మనకూ... శుభలేఖ వస్తుందిలే!... అంటూ....


"పిల్లవాడూ "

"ఇంజనీరింగ్ కాలేజిలో లెక్చరర్ ట. "


"పోన్లేరా! మీనాన్నగారుంటే ఎంత సంతోషించేవారో!... నీకూ కంపెనీ హెచ్. ఆర్ గా ఉద్యోగం వచ్చేటట్లుంది. అన్నీ శుభవార్తలే... " ఆనందపడింది విరూపాక్ష తల్లి.


"అవును! అటు హంసమంజీర, చెల్లెలూ సుగాత్రీ బాగానే చదువుతోందనుకుంటా! పిల్లలంతా ఓ దారయితే... మనందరికీ సంతోషమే కదా! "


సంతోషంతో పెళ్ళి ఏర్పాట్లు మెుదలయ్యీయి.

"పీటలమీద బాబాయ్ పిన్నీ కూర్చుంటారు. కన్యధార వాళ్ళేపోస్తారు. వాళ్ళకి బట్టలూ మిగతా ఏర్పాట్లు చూడరా విరూ! మీ నాన్నలేని లోటు.... తెలీకుండా... చేయరా!"


"అలాగేనమ్మా! నువ్వు ప్రశాంతంగా ఉండు. అన్నీ బాబాయ్ నడిగి, చక్కగా జరిపిస్తాగా "


పెళ్ళిలో భటువు, ఉత్తర జంధ్యాలూ, వెండిచెంబు పెట్టాలని తెచ్చారు.


ఐతే పెళ్ళితర్వాత భటువు ఎలాగూ పెళ్ళి కొడుకు పెట్టుకోడు కాబట్టి... కొంచెం పలచగా చేయించారు.


కన్నెధార పోసేటప్పుడు... వేలికి ఉన్న భటువు తీసి, "ఇదిగోండి" అని మెత్తగా దగ్గరకు ఉండలా నలిపిన భటువును పీటలమీద ఎదురుగా ఉన్న పినమామగారి చేతిలో పెట్టాడు, పెళ్ళికొడుకు... అవాక్కయి చూస్తున్నారంతా!


ముక్కున వేలేసుకున్నారు ఈ పని చేసింది స్వయానా పెళ్ళి కొడుకే, గనుక ఏమీ అనలేకపోయారు.

విరూపాక్షకి మాత్రం ఈ వ్యవహారం అపశకునంలా తోచింది. ఐనా పీటలమీద మగపెళ్ళివారిని ఏమనగలరు?


సాగరమేఖలను ఢిల్లీ పంపేసారు కాపురానికి. అత్తగారు కూడా ఢిల్లీ చేరింది.

అత్తా, భర్తతో... సుఖంగానే సాగింది మేఖల కాపురం.... కొత్త పేరు మిళింద అని భర్త తప్ప ఎవరికీ గుర్తులేదు. మరిచిపోయారు.


సాగర మేఖల ఇద్దరు ఆడపిల్లల తల్లి ఐంది. ఆపరేషన్ చేయించాలంటే.... తిట్టి, శాపనార్ధాలు పెట్టీ, మూడో కాన్పుకోసం చూడమంది అత్తగారు.


మూడోసారి మగపిల్లాడు

హమ్మయ్యఅనుకున్నారు గానీ....

తల్లినీ, భార్యనూ ముగ్గురు పిల్లలనూ పెంచి పోషించటం, భర్తకు తలకు మించిన భారమైన, భర్త.....

"నిన్నూ నీ పిల్లలనూ, కూచోబెట్టి మేపటం నావల్లకాదే!"

అని తరచూ అనటాన్ని గమనించిన సాగరమేఖల....

"ఏమండీ! నేనూ జాబ్ కి వెడతానండీ. " అంది.


"నువ్వా!మరి ఇల్లూ? "

"పిల్లలు స్కూల్ కి వెళ్ళేవయసేగదండీ! వాళ్ళపనులు వాళ్ళుచేసుకుని వెళ్ళటం నేర్పుతానండీ... ఇక ఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోగలనండీ! అత్తయ్యగారూ పెద్దవారవుతున్నారు. మందులకి, పిల్లల ఫీజులకీ కలిసి వస్తుందండీ "


ఉద్యోగం చేయటానికి భర్తను, అత్తనూ ఒప్పించి, బాధ్యతల బ్యాగ్ భుజానికి తగిలించుకుని, ఆఫీసుకు వెళ్ళింది.

అన్నీ సవ్యంగా జరిగితే.... ఇకదైవమెందుకు?

ఆఫీసర్ రుక్మాంగద కు సాగరమేఖల పనితీరు... ఏకాగ్రత... క్రమశిక్షణ వచ్చాయి. ఏ పనైనా నిజాయితీగా చేస్తుండే మేఖలమీద.... తెలియని అభిమానం ఏర్పడింది.

ఏపనినైనా "మేఖలగారూ" అని ఆమెకే చెప్పడం... మాటిమాటికి ఆమెనే రూమ్ లోకి పిలవటం... అర్ధరాత్రి దాకా, పనిచేయించు కోవటం.... తాను కూడా పనినెపంతో.... ఆఫీసులోనే ఉండిపోవటం..


ఆదివారాలుకూడా.... పనినెపంతో.... ఫోన్ చేసి పిలిపించటం.... ఇవన్నీ అందరూ గమనిస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా అత్తగారు.


"అర్ధరాత్రి దాకా ఆఫీసులో ఏంపనీ? ఆదివారం కూడా ఏంపనీ? " అని నిలదీస్తుంటే అటు ఆఫీసరుకూ చెప్పలేక, ఇటు అత్తగారికీ చెప్పలేక సతమతమై పోతోంది.


భర్త కూడా "ఆ ఉద్యోగం మానేయ్... వాడెవడూ అర్ధరాత్రి కూడా!తోముతున్నాడు..... ఆఫీసుపనేనా?! ఇంకేదైనా?! "


"ఏమండీ! ఇంకో ఉద్యోగం చూసుకునేవరకూ చేస్తానండీ.... మీ ఒక్కరి సంపాదనతో.... ఇల్లుగడవాలంటే!.... ఎన్ని అవసరాలుంటాయ్!? కొత్తగా చీటీలూ కడుతున్నాంగా! అవన్నీ ఎలాగండీ? " సర్ధిచెప్పాలనే చూసింది.


అటు ఆఫీసు పని ముగించుకుని, ఇటు ఇంటికికావాల్సిన సరుకూ, సరంజామా కొనుక్కుని, ఓ వైపు పిల్లల అవసరాలకు, అత్తగారి మందులూ, మాకులూ, మెుత్తం

సమకూర్చుకుని వచ్చేసరికి, చాలా రాత్రి లేటయిపోయేది.

వీటిలో ఏఒక్కటి తెమ్మన్నా భర్త...

"నువ్వు ఆఫీసునుండి అటేగా వచ్చేదీ! నువ్వే తేవచ్చుగా " అనేవాడు.


ఇంత మానసిక ఒత్తిడిలో ఈ ఉద్యోగం అవసరమా? అనిపించినప్పుడల్లా... కళ్ళముందు పిల్లల భవిష్యత్తు, ఎన్నో అవసరాలు కళ్ళముందు కదలాడేవి.

ఇంతచేసినా… భర్త అత్తగారి మాటలకు మనసు గాయపడేది.

ఓ రోజు భర్త తప్పతాగి ఇంటికి వచ్చాడు.

"ఎప్పుడూ లేనిది ఇందేంటండీ ఈ అలవాటూ! "


"నీలాంటి పెళ్ళాం ఉంటే ఏ మెుగుడైనా ఇంతే!.... మీ బాస్ కి నీఅందాలన్నీ చూపించావా? నీ చుట్టే తిరుగుతున్నాడూ!?”


"ఏమండీ! నేను ముగ్గురు పిల్లల తల్లినండీ! నాకు అందాలేంటండీ?! "


"ఛీ... నోర్ముయ్! అలా బయటికి వెళ్ళానో లేదో! మీ ఆఫీసులో పనిచేసే సరోజ మెుగుడు ఏం కూసాడో తెలుసా? నేనునీతో బిజినెస్ చేయిస్తున్నానుట. ఇంతకన్నా దారుణమైన మాట ఉంటుందా? సరోజ తన భర్తతో ఏమీ చెప్పకపోతే, అతను నాతో అలాఎందుకు అంటాడుచెప్పూ! "


మేఖల చెంప ఫెళ్లుమని పగిలింది. కళ్ళు సాగరమే అయ్యాయి.

ఎర్రబడిన కళ్ళతోనే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటానికి వెళ్ళింది.

ఆఫీసర్ " అయ్యో!అదేంటండీ మీలాంటి

టాలెంటెడ్ పర్సన్ ఉద్యోగం మానేస్తే, మాకు

ఎంత బాధగా ఉంటుంది? " బాధపడ్డాడు.


కన్నీళ్ళు ఆపుకోలేక పోయింది. కళ్ళుతుడుచుకుంది.

"అయ్యో!మేఖల గారూ! ఏమైనా ఇబ్బందా?

అంటూ ముందుకు వంగాడు.


ఫ్లాష్ వెలిగింది. ఎవరో ఫొటో తీసారు.

కంగారుపడి బయటికి రాబోతే తలుపు బయట లాక్ చేసిఉంది.


===========================================

సశేషం


===========================================

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Link


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

97 views2 comments
bottom of page