'Manasantha Nuvve 3' New Telugu Web Series
Written By Lakshmi Sarma Thrigulla
'మనసంతా నువ్వే 3' తెలుగు పెద్ద కథ
రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఇక మనసంతా నువ్వే పెద్ద కథ చివరి భాగం చదవండి
"ఏయ్ కానిస్టేబుల్! ఒక్కరిని కూడా వదిలిపెట్టొద్దు. మీరంతా పైనకు వెళ్ళండి. దొరికవాళ్ళను దొరికినట్టు పట్టుకోండి, " అంటూ పరుగున సీత ఉన్న బంగళాలోకి వెళ్ళాడు.
అటువైపు తిరిగివున్న సీతను చూసి, "చేతులు పైకెత్తు. కదిలావంటే కాల్చేస్తాను” తుపాకి సీత వీపుకు తగిలించి అన్నాడు ఎస్సై రఘు.
ఒక్క క్షణం అర్ధం కాలేదు సీతకు. "ఫ్లీజ్ మా అమ్మ చనిపోయింది. ఏం చెయ్యాలో అర్ధం కాక అలా కూర్చుండిపోయాను. నేను మీరనుకున్నట్టుగా అలాంటిదాన్ని కాను. మంచి మనసుతో నాకు సహాయం చెయ్యండి ఫ్లీజ్, "అంది. అప్పుడు చూసాడు జయమ్మ వైపు. టక్కున తుపాకి వెనక్కి తీసుకున్నాడు.
వీణమీటినట్లున్న ఆ గొంతులో ఏదో అధికారం ధ్వనించినట్టయింది.
"సారి అండి.. నేను చూడలేదు. ఉండండి.. మా కానిస్టేబులందరు మీ వాళ్ళను పట్టుకోవడానికి పైనకు వెళ్ళారు. వాళ్ళందరిని జీపులో ఎక్కించాక ఈవిడ సంగతి చూస్తాము. ఇంతలో మీరు తప్పించుకోవడానికి చూడకండి, " అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వెనక్కి తిరిగి చూసింది. ఇద్దరూ ఒకేసారి చూడడంవల్ల నాలుగుకళ్ళు కలుసుకుని విడిపోయాయి.
రఘు కళ్ళల్లో ఏదో మెరుపు మెరిసినట్టయింది. ఎంతందంగా ఉంది! అచ్చు సీతకూడా పెద్దగా అయితే సరిగ్గా ఇలాగే ఉండేదేమో.. చిన్నప్పుడు పోతపోసిన బంగారంలా ఉండేది. అవును.. సీతలాగా ఉండడమేంటి.. సీతనే కాబోలు. తన పేరడిగితే! అనుకుంటూ నోరు తెరిచాడు అడగడానికని.
"మీరు .. నువ్వు రఘు కదా! మీ నుదిటిమీద ఆ మచ్చ.. అవును మీరు మా బావ రఘునే కదా?, ” సగం అనుమానం సగం సంతోషంతో అడిగింది సీత.
"అవును. నేను రఘునే.. అంటే .. అంటే నువ్వు సీతవా? సీతా.. నిజంగా నువ్వు సీతవేనా? అవును నువ్వు నా సీతవే.. అనుకుంటూనే ఉన్నాను.. కుందనపు బొమ్మలా ఉంది, సీతకూడా ఇలానే ఉంటుందేమోనని. నా అనుమానం నిజమైంది. ఎలా ఉన్నావు సీతా? ఇన్నాళ్ళు నీ కోసం వెదుకుతూనే ఉన్నాను, నా అన్వేషణ వృధా పోలేదు. పద.. నిన్ను ముందు మీ నాన్నవాళ్ళ దగ్గరకు తీసుకవెళతాను, ” ఆనందం, ఆత్రుతతో అన్నాడు రఘు.
"బావా .. నా పిలుపు కొత్తగా ఉందికదా! చిన్నప్పుడు నిన్ను ఎప్పుడు కూడా ఇలా పిలవలేదు, మనిద్దరం ఒక దగ్గరనే పెరిగాం కానీ! నీతో నేనెప్పుడు మర్యాదగా ప్రవర్తించలేదు, నేను అందగత్తెనన్న అహంభావంతో నిన్ను అనరాని మాటలని చాలా బాధపెట్టాను. నిన్ను రెచ్చగొడితేనే కదా ఆ రోజు నా మెడలో అమ్మవారి దగ్గరున్న మంగళసూత్రం నా మెడలో కట్టావు.. నేను నాన్నకు చెపుతానేమోనని నువ్వు ఇంట్లోనుండి పారిపోయావు. ఇదంతా నావల్లనే కదా! నన్ను క్షమించగలవా బావా, " రెండు చేతులు జోడిస్తూ అడిగింది సీత.
"సీతా .. నువ్వు .. నువ్వు నన్ను బావ అని పిలుస్తున్నావా? ఇది నిజమా.. కలకాదుకదా!, " ఆశ్చర్యంగా అడిగాడు రఘు.
"ఇంకా ఎందుకు బావా చచ్చినపాము చంపుతావు, ఇప్పుడు నేను ఎవ్వరికి పనికిరాని దాన్ని, అందరూ ఉండి కూడా ఎవరికి లేని ఏకాకిని, " అంది ఏడుస్తూ.
"ఛ ఛా.. ఏమిటామాటలు సీతా, నీ కోసం అత్తా మామ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తిరిగివస్తావనన్న కొండంత ఆశతో కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అక్కునచేర్చుకునే అమ్మానాన్నలుండగా అనాథగా ఉండిపోతావా సీతా? నిన్ను మీ అమ్మానాన్నలకు అప్పచెప్పితే తప్ప నా మీద పడిన నిందను నేను తుడుపుకోలేను. నా కోసమైనా నువ్వు రావాలి. తప్పదు, " అన్నాడు రఘు.
"నువ్వన్నది నిజమే కానీ! ఇన్నేళ్ళ తరువాత అమ్మానాన్నలను కలుసుకోబోతున్న ఆనందంకంటే, నా గురించి సమాజం ఏమనుకుంటుందోనని భయం మొదలైంది బావా, ఎందుకంటే నేను ఒక వేశ్య దగ్గర పెరిగాను అంటే అందరు నన్ను ఎలా చూస్తారో తెలుసా ? పైగా నా వలన అమ్మవాళ్ళకు చెడ్డపేరు వస్తుంది. నేను వాళ్ళకు కనుపించకపోయేనా ఎక్కడో ఉన్నాను అనుకుని తృప్తిపడతారు. అది చాలు బావా నాకు నేను రాలేను, " అంది బాధపడుతూ.
"సీతా .. ఏ కన్నతల్లితండ్రులైనా కన్నకడుపు తీపిని వదిలెయ్యలేరు తెలుసా? కడుపున దాచుకుని
కంటిపాపల చూసుకుంటారు, నువ్వు అనవసరమైన ఆలోచనలు చేసి మనసు పాడుచేసుకోకు, త్వరగా బయలుదేరు సీతా.. పోదాం.. ఈ మురికికూపం నుండి బయటపడు, " తొందరచేస్తూ అన్నాడు.
పక్కున నవ్వింది సీత. "చూసావా బావా .. నువ్వే అంటున్నావు మురికికూపం అని.. బయట ప్రపంచంలో అడుగుపెట్టానంటే ఎంతమంది నన్ను ఎన్ని విధాలుగా అంటారో ఆలోచించు.. నేను పవిత్రంగానే ఉన్నాను అని నెత్తినోరు మొత్తుకున్నా, నన్ను పెళ్ళిచేసుకోవడానికి ఎవరు ముందుకురారు. ఎందుకంటే అగ్నిలో దూకిన సీతమ్మనే అనుమానించిన లోకం నేను చెప్పే మాటలు నమ్ముతారా? కాకుల్లా పొడిచే వాళ్ళమాటలకు నేను బాధపడడమే కాక అమ్మా నాన్నలను మనస్తాపానికి గురిచేసిన దాన్ని అవుతాను, " చెప్పడం ఆపింది గొంతులో ఆవేదనను అణిచిపెడుతూ.
"సీతా .. సమాజం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇన్నాళ్ళుగా నువ్వు దొరకకపోతే నీకోసం వాళ్ళేమైనా వెతికారా ? కనీసం మీ అమ్మానాన్నలకు ఓదార్పు మాటలు కూడా చెప్పకుండా, మాటలతో శూలాల్లా పొడుచుకు తింటుంటే, ఈ సమాజానికి భయపడే ఒంటరిగా దూరంగా బ్రతుకుతున్నారు, నువ్వు నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా నరంలేని నాలుకలాంటి వాళ్ళు ఈ మనుషులు. నీకు వాళ్ళందరితోటి ఎందుకు.. మేము లేమా నీకు?" అడిగాడు ఆప్యాయంగా.
"ఉన్నారు. లేరని నేనడంలేదు, నేను వచ్చానంటే అందరికి నా గురించే ఆరాలు తీయ్యడం మొదలుపెడతారు, రేపు అమ్మానాన్నలు కూడా అనుకోవచ్చు, ఇన్నాళ్ళు ఎక్కడో ఉండే ఉంటుందని అనుకుని మా బ్రతుకేదో మేము బ్రతుకుతుంటే, ఇలాంటి చోటునుండి వచ్చి నవ్వులపాలు చేస్తుందని వాళ్ళు బాధపడొచ్చు, అంతెందుకు నీ గుండెలమీద చెయ్యివేసుకుని చెప్పగలవా? నేను కళంకితను కాదని నన్ను నువ్వు పెళ్ళిచేసుకోగలవా? జాలితో కాదు మనస్పూర్తిగా చెప్పు బావా, " అంది.
"ఊహు.. నువ్వు నన్నర్ధం చేసుకున్నది ఇంతేనా? ఇన్నాళ్ళు నీకోసం పిచ్చిగా వెతుకున్నది ఎందుకోసం అనుకున్నావు.. నువ్వు పుట్టగానే నా భార్యవని అమ్మ చెబుతుండేది. అలానే నా మనసులో స్థిరపడిపోయింది.
నువ్వు నన్ను హేళన చేసినప్పుడల్లా కోపంతో ఉడికి పోయేవాడిని కాని, నిన్ను ఒక్కసారి కూడా ఒక్కమాట అనలేదు ఎందుకో తెలుసా? నిన్ను నా ప్రాణంకన్నా మిన్నగా ఇష్టపడ్డాను కనుక! నిన్నెలాగయినా ఒప్పించి నేనంటే ఇష్టపడేలా చెయ్యాలి అనుకున్నాను. ఆ రోజు కూడా ఇంట్లో ఎవరులేరు. మనిద్దరమే ఉన్నాము. నీతో ప్రేమగా మాట్లాడాలి అనుకున్నాను. నువ్వేమో నన్ను గంజిలో ఈగను తీసివేసినట్టు తీసివేసావు. తట్టుకోలేకపోయాను. ఇలానే వదిలేస్తే నువ్వు నిజంగానే నాకు భార్యగా రావడానికి ఒప్పుకోవేమోనని అలా చేసాను కానీ చాలా భయమేసింది. మామకు తెలిసిందంటే నన్ను చంపేస్తాడు అని భయపడి పారిపోయాను. ” అంటూ జరిగిన విషయమంతా చెప్పుకొచ్చాడు.
“సీతా.. నీకు నా ప్రేమ తెలియాలంటే నువ్వు నాతో రావాలి పదా, " అంటూ సీతను చెయ్యిపట్టి గబగబా తీసుకవెళ్ళాడు రఘు. రఘు వెళ్ళాక కానిస్టేబుల్ ఇంటికి తాళంవేసి రఘుకు ఇచ్చాడు.
"సీతా.. ముందు కుడికాలు పెట్టి లోపలకు రా. మొదటిసారీ వస్తున్నావు, " అంటూ తను ఉంటున్న ఇంటికి తీసుక వచ్చాడు. ఇల్లంతా చూపెడుతూ తన బెడ్ రూంలోకి నడిచాడు. లోపల అడుగుపెడుతూనే కిన్నురాలైపోయింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది.
"ఇవన్ని నా చిన్నప్పటి ఫోటోలు కదా! ఇవన్ని ఎవరు వేసారు? ఇక్కడెందుకున్నాయి,?” ఆనందంతో ఆశ్చర్యపోతూ అడిగింది.
"నీకు ఇంకా నమ్మకం కలగలేదా సీతా? ఇది నేనుంటున్న ఇల్లు. ఈ ఇంటిలో నీ బొమ్మలు నేను కాక ఇంకెవరు వేస్తారు,? నీకు తెలుసు కదా.. చిన్నప్పుడు నీ బొమ్మ వేస్తే అచ్చం నీలానే ఉందని సంతోషపడ్డావు. కానీ! వెంటనే నేను వేసానన్న కోపంతో చింపివేసావు గుర్తులేదా? నా హృదయంలో నీకొక గుడికట్టుకుని అందులో నిన్ను ప్రతిష్టించుకున్నాను సీతా..
నువ్వు నా దగ్గరకు రాకున్నా నా మనసంతా నువ్వే నిన్ను దేవతలాగా నిలుపుకున్నాను, ఈ జన్మ లో నువ్వు నాకు లభ్యం కాకపోయినా మళ్ళి జన్మంటూ ఉంటే నిన్నే నా భార్యగా ప్రసాదించమని ఆ దేవుడిని రోజు అడుగుతుంటాను" చెప్పాడు భావోద్వేగంతో.
ఆల్చిప్పలాంటి కళ్ళను రెపరెపలాడిస్తూ రఘువైపు చూసింది. పైన సౌందర్యాన్ని చూసి మురిసిపోయానే గానీ లోపలున్న అమృతకలశాన్నీ చూడలేకపోయిన ముర్ఖురాలిని నేను అనుకుంది మనసులో. గదిలో తన చిన్నప్పటి ఫోటోలన్నీ చూస్తూ ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది సీత.
"ఏమైంది అలాగే నిలబడిపోయావు? ఆ పట్టుచీర ఆ నగలు ఎవరికోసమాని అనుకుంటున్నావా సీతా?
నాకు ఉద్యోగం వచ్చాక నీ కోసమని మీ ఇంటికి వచ్చి, మీ నాన్నను ఒప్పించి నిన్ను నాదానిగా చేసుకోవడానికి అడగడానికి వచ్చే ముందు తీసుకున్నాను, కొండంత ఆశతో నా ఊపిరిలో సగభాగమైన నీ కోసం వచ్చాను, అక్కడికి వచ్చాక తెలిసింది నీ పరిస్థితి, ఇక ఆ రోజునుండి నీ కోసం వెదకని ప్రదేశంలేదు, సారీ సీతా.. నీ మనసులో ఏముందో తెలుసుకోకుండానే అన్నీ చెబుతున్నాను, ఇప్పుడు చెప్పు సీతా..నీకంటూ నేనున్నానని, " అంటూ ఆగాడు.
"బావా.. నిజంగా ఆ దేవుడు నిన్ను నాకోసమే పుట్టించాడు, ఆ రోజు నువ్వు కట్టిన తాళిని ఎగతాళి చేసాను, అది దైవసంకల్పమని ఈ రోజు తెలిసింది, ఇక నేను ఒంటరిదాన్నీ కాను బావా, నా కోసం ఆరాటపడే నీకు మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నాను నేను నీ భార్యనని, " అంటూ రఘుకాళ్ళు పట్టుకుంది.
"అయ్యో అదేం పని సీతా .. నువ్వు ఉండవలసింది అక్కడకాదు నా హృదయంలో, " సీతను లేవనెత్తి కౌగిలిలో బంధించాడు. ఆర్తిగా అల్లుకుపోయింది సీత.
ఎండిపోయిన కళ్ళనుండి ఒక్క కన్నీటిచుక్క కూడా రానంతగా మిగిలిపోయారు ప్రకాశం కామాక్షి.
తింటున్నమా పంటున్నామా తప్పితే వాళ్ళకు మరో మనషితో సంబంధంలేనట్టే ఉంటున్నారు.
కాలం ఎవ్వరికోసం ఆగదన్నట్టు తనపని తాను చేసుకుపోతునేవుంది. ఒకరికోసం ఒకరం సుమా
ఒకర్ని విడిచి ఒకరం ఉండలేము అనుకుని మనసు భరోసా చేసుకున్నారు. గుమ్మంలో అలికడైతే తలతిప్పి చూసింది కామాక్షి.
"ఎవరు మీరు .. ఎందుకోసం వచ్చారు, "అడిగింది కళ్ళజోడు పైకి జరుపుకుంటూ.
"ఎవరొచ్చారు పద్మా.. నీకెప్పుడు ఏదో ఆలాపన. ఏది నన్ను చూడనీ, "అనుకుంటూ వచ్చి.
"ఏం కావాలి మీకు.. ఏదైనా పనుందా మాతోటి? ఇలారండి.. కూర్చుండి ముందు, " కూర్చి చూపెడుతూ చెప్పాడు.
పొంగుకొస్తున్న బాధతో ఒక్కసారిగా తండ్రిని కౌగిలించుకుని బోరుమని విలపించింది.
"నాన్నా.. నేను నాన్నా నీ సీతను.. అమ్మా, " అంటూ తల్లి దగ్గరకు పరుగున వెళ్ళి గట్టిగా పట్టేసుకుంది.
"ఎవరూ .. నా సీతనా.. నిజంగా నువ్వు నా సీతవేనా? ఏమండి మన సీతనే కదా! నేను భ్రమపడడంలేదు కదా! ఏది ఒక్కసారి నన్ను గిల్లండి, నాకెందుకో ఇది కలా నిజమా అనిపిస్తుంది, ” అంది నమ్మలేనట్టు.
"అత్తా.. నువ్వు నిజమే చూస్తున్నావు. నీ కళ్ళముందుంది నీ సీతనే. నువ్వు ఇన్నాళ్ళు ఎవరికోసం ఎదురుచూసావో నీ కన్నబిడ్డ సీత, " అన్నాడు రఘు.
"ఒరేయ్ మూర్ఖుడా .. ఇన్నాళ్ళు నాబిడ్డను ఎక్కడ దాచావురా? నీలాంటి వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు మాకు కడుపుకోత కోసావు కదరా, నిన్ను ఏం చేసినా పాపంలేదు, "అంటూ పట్టలేని ఆవేశంతో రఘు మెడను పట్టేసుకున్నాడు ప్రకాశం.
"మామా.. నేను చెప్పేది విను, "అంటుంటే.
“ఏందిరా నువ్వు చెప్పేది, నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను నిలువునా పాతేసినా పాపంలేదు, చెప్పురా.. ఎందుకు చేసావు ఇలాంటి పని. తిన్న ఇంటివాసాలు లెక్కపెడతావా? నీకేం పాపం చేసామురా మమ్మల్ని ఇంత చిత్రవధకు గురిచేసావు” ఆ చెంపా ఈ చెంపా కొడుతూనే ఉన్నాడు.
"నాన్నా .. ఆగండి నాన్నా, బావను వదిలిపెట్టండి. ఇందులో బావ తప్పేమిలేదు, "అంటూ తండ్రి చేతిని పట్టుకుంది.
"నువ్వాగమ్మా, నీకేం తెలియదు, మాయమాటలు చెప్పి నిన్ను తీసుకపోయాడు. నన్నడిగితే నేను దగ్గరుండి మీ పెళ్ళి చేసేవాడిని కదా! అటు చూడు ఆ పిచ్చి తల్లి, నువ్వు వెళ్ళిపోయినాటినుండి కంటికిమంటికి ఏడుస్తూనే ఉంది, వీడ్నీ ఏంచేసినా తప్పులేదమ్మా, వీడి తల్లిపోయినప్పుడే వీడు చచ్చినా నాకు బాధ ఉండేదికాదు, " రెండుచేతులలో ముఖం దాచుకుని వెక్కిపడుతూ అన్నాడు.
"నాన్నా.. నేను చెప్పేది వినండి. మీరనుమానిస్తున్నట్టుగా బావ నన్ను తీసుకపోలేదు. బావ గనుక నన్ను ఈ రోజు కలవకపోయి ఉంటే జీవితంలో మీకు కనిపించేదాన్ని కాను, బావకు నేను దొరకక పోయుంటే నేనెప్పటికి మిమ్మల్ని చూసేదాన్నికాదు. బావ నాకోసం వెదుకుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళకు దొరికాను. నేను అదృష్టవంతురాలను, బావను ఏమి అనకండి, " అంటూ జరిగినదంతా చెప్పింది సీత.
"రఘు .. నువ్వు మా పాలిట దేవుడివిరా ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోను, " రఘు చేతులుపట్టుకుని కళ్ళకద్దుకుంటూ అడిగాడు.
"మామా.. మీరు కాదు ఋణపడింది నేను. అనాధనైన నన్ను తీసుకొచ్చినందుకు నా వలన కష్టాలుపడ్డారు. ఒకందుకు నేనే మీకు ఋణపడి ఉంటాను మామా, " అన్నాడు బాధపడుతూ.
"సరేసరే మీరు మీరు ఋణాలు పడడమేనా నాగురించి ఆలోచించేది ఉందా? నాన్నా.. నన్ను బావకిచ్చి పెళ్ళిచేసావనుకో.. నీ ఋణం తీరిపోతుంది. నన్ను పెళ్ళిచేసుకొని అమ్మా నాన్నలతో పాటు నన్ను బాగా చూసుకున్నావనుకో.. నీ ఋణం తీరిపోతుంది. ఏమంటావు అమ్మా.. నేను చెప్పింది కరక్టే కదా, "అంది తల్లి చుబుకం పట్టుకుని అడుగుతూ.
"ఇంతకన్నా మాకు కావలసిందేముంది తల్లి.. ఆ ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరుల దయతో
మీరు మళ్ళి మాకు కనిపించారు. అంతేచాలు మాకు. " అంటూ నవ్వుతూ ఆప్యాయంగా రఘును, సీతను దగ్గరకు తీసుకుంది. అందరి హృదయాలు తెరిపినపడినాయి.
॥॥ శుభం॥॥
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
swapna j • 5 days ago
Chaala bagundi attayya Katha climax chaala baga icharu madhyalo seetha raghuki dooram avtundemo Ani tension paddanu Kani climax baga icharu, superb.