top of page

మనో నేత్రం


'Mano Nethram' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'మనో నేత్రం' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“రాఘవా !” పిలిచారు తండ్రి రామమూర్తి.. కొడుకు గొంతు సవరింపు విని..

“రండి..” కోడలు కాత్యాయని ఆహ్వానం.. తన పతిదేవుడు రాఘవయ్యను చూచి..

రాఘవ వరండాలో ప్రవేశించాడు.


కుడివైపున వున్న అరుగుపై వాలుకుర్చీలో రామమూర్తిగారు వున్నారు. వారికి చూపు పోయింది. వయస్సు డెబ్బై ఎనిమిది.


ఐదేళ్ల క్రిందట పొలంలో ఉండగా పెద్ద వురుములు, మెరుపులతో వచ్చిన గాలీవానలో ఆయన ఇరుక్కున్నారు. క్షణాల్లో.. నిముషాల్లో.. గంటల్లో.. ఆ ప్రకృతి విచిత్ర వైపరీత్యంగా మారిపోయింది. కొంత సమయం తర్వాత అంతా మూమూలే.. ప్రశాంతత..


కానీ.. ఆ భీకర వాతావరణ ప్రభావం.. పిడుగులు.. మెరుపుల వికటాట్టహాసం.. కారణంగా రామమూర్తికి కనుచూపు పోయింది.. కొడుకు.. రాఘవయ్య.. ఇద్దరు డాక్టర్లకు చూపించాడు.. ఒకరు ఆపరేషన్ చేస్తే.. చూపు రావచ్చు.. రాకపోవచ్చు.. గ్యారంటీ లేదన్నారు.. మరొకరు ఎవరైనా నేత్రదానం చేస్తే.. ‘రీ ప్లాంటేషన్ ఆఫ్ ఐ’ తో చూపు వస్తుంది అన్నారు.

ఇరువురు డాక్టర్ల స్టేట్ మెంట్లు విన్న రామమూర్తిగారు..


“నాయనా !.. రాఘవా !.. నేను ఈ వయస్సులో.. ఆ హాస్పటల్స్ లో ఆపరేషన్స్.. చికిత్సలు.. వాటిని.. తట్టుకోలేను. ఆ దైవానుగ్రహంతో.. నా ధర్మాలు అన్నింటిని పూర్తి చేశాను.. మీ అమ్మ సంవత్సరం క్రింద వరకు నాకు సాయంగా వుండింది. మన సంసార నాటకంలో తన పాత్ర ముగిసిందని గౌరి.. నా ఇల్లాలు తాను నాకన్నా ముందుగా వెళ్లిపోయింది. నాకు అండగా ప్రస్తుతంలో వున్న నీ భార్య నా కోడలు కాత్యాయని.. నా ముద్దుల మనుమరాలు శాంతి.. మనుమడు మురళి వున్నారుగా !.. నాకు ప్రస్తుతం ఫరవాలేదు.. కాబట్టి నాకు చూపు కరవైన విషయంగా నీవు బాధపడవద్దు.. అంతా.. అంటే అన్ని బాధ్యతలను ముగించుకొన్న వాణ్ణి.. తిరుగు పయనం ఎపుడైనా కావచ్చు.. దానికి నేను ఆనందంగా సిద్ధం.. ఈ విషయంలో నేను ఆ సర్వేశ్వరుడుని కోరుకొనేదేమిటో తెలుసా!.. చిత్రమైన రోగాలతో మంచంపాలు చేసి.. నరకయాతనను.. నాకు.. నావారికి.. నావలన కలిగించకుండా.. ఇదిగో వున్నాడు అరె లేచిపోయాడా!.. అనే రీతిలో నా కథను ముగించమని ప్రతి నిత్యం.. నేను ఆ దైవాన్ని వేడుకొంటున్నాను..” రామమూర్తి చెప్పడం ఆపాడు..


తండ్రిని కొన్ని క్షణాలు పరీక్షగా చూచి రాఘవయ్య ఇంట్లోకి నడిచాడు. వారు హైస్కూలు హెడ్ మాస్టర్. గత సంవత్సరమే ఆ ప్రమోషన్ వచ్చింది. వారికి ఆవూరు సొంత వూరు.. ఆరు ఎకరాల భూమి.. రెండు ఎకరాల మెట్టతోట.. బావి.. పంపుసెట్టు.. వున్నాయి.


నిత్యావసరాలకు కావాల్సినవన్ని ఆ తోటనుండి లభిస్తాయి. యదార్థం చెప్పాలంటే రాఘవయ్యకు ఎలాంటి చింతా లేదు.. తండ్రిగారికి చూపు లేదనే ఒక్కవిషయంలో తప్ప.

కూతురు శాంతి టెన్త్.. కొడుకు మురళి సెవెంత్ చదువుతున్నారు.


కానీ.. ఇల్లాలు.. కాత్యాయని.. కాస్త.. అదోరకం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. తనమాటే గెలవాలనే రకం.. ఆ విషయంలో అపుడపుడూ.. ఏమీ చేయలేక.. ఎవరితోను చెప్పుకోలేక.. తప్పును ఒప్పుగా భావించి.. తను రాజీపడి బ్రతకవలసి వస్తుంది.


కాత్యాయని తప్పుడు నిర్ణయాన్ని ఎదిరించే దానికి తనకు భాష.. సామర్థ్యం లేక కాదు.. తన ఆక్షేపణతో కాత్యాయని రెచ్చిపోతుంది. శోకాండాలు పెడుతూ ఏడుస్తుంది. ఎంత నచ్చచెప్పినా వినదు.. కొన్ని రోజులకు గాని మామూలు మనిషి కాదు. ఆ సమయంలో ఆమె చూపుల్లో చూపులు కలపలేని అసమర్థుడు రాఘవయ్య. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందనే మొరటు సామెత ఇలాంటి వారి వలననే ఏర్పడిందేమో !..


స్కూలు నుండి శాంతి.. మురళీలు వచ్చారు. ఆనందంగా నవ్వుతూ వారు.. తాతయ్యను సమీపించి.. ప్రీతిగా పలకరించారు..వారి చేతులను తన చేతులతో తాకి ఆనందించారు. ఈ సన్నివేశం రామమూర్తిగారికి ఎంతో ఆనందం.

* * *

యావత్ ప్రపంచాన్ని.. చైనా నుండి బయలుదేరిన మహా పిశాచి.. కరోనా చుట్టుముట్టింది. జనం పండుటాకుల్లా అన్ని దేశాల్లోను రాలిపోయారు.. పోతున్నారు..


స్కూళ్లు.. కాలేజీలు.. బస్సులు.. రైళ్లు.. విమానాలు.. మాల్స్.. సినిమాహాల్స్.. అన్నీ మూసివేశారు. లాక్ డౌన్ ప్రకటించారు. నాలుగు దఫాలుగా సాగింది ఆ కట్టుబాటు. అయినా వ్యాధి నియంత్రణకు రాలేదు. సరైన మందు (వ్యాక్సీన్) ఆ మహమ్మారి నాశనానికి రాలేదు. జన మరణాలు తగ్గడం లేదు.. డాక్టర్లు నర్స్ లు స్వచ్ఛంద సేవా దళాలు వ్యాధి పీడితుల రక్షణకు పాటుబడుతున్నారు.


కలియుగ వరదుడు.. శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి.. వెంకన్న.. బాలాజీ.. ఆలయం మూతబడింది.. అలాగే అన్ని ఆలయాలు..


వున్నంతలో ఆనందంగా సాగిపోతున్న జన జీవన సరళికి అంతరాయం కలిగింది.

పెద్దలమాట.. వేదవాక్కు.. విన్నవాడికి కటువుగా.. నమ్మశక్యంగా లేకపోయినా.. కాలగతిలో ఆయా సమయం ఆసన్నమైనపుడు ఆమహనీయుల మాటలు నిజమని.. గుర్తుచేసుకొంటారు. వారే మన సద్గురువులు శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు.. వారి జననం బనగానపల్లె (కర్నూలుజిల్లా).


ఈనాటి ఈ ఉపద్రవాన్ని గురించి వారు వారి కాలజ్ఞాన తత్వాలలో మూడువందల ఇరవై ఏడు సంవత్సరాలకు పూర్వమే వ్రాశారు. సంసారజీవితాన్ని సాగించిన రాజయోగి వారు. కందెమల్లయ్యపల్లి (కడప జిల్లా)లో జీవ సమాధి అయినారు..(1610 టు 1693).


ప్రస్తుతంలో కరోనా రీత్యా.. ఎవరి ఇళ్లల్లో వారు వుండటం.. వున్నదాన్ని తినడం.. సంతృప్తిగా దైవధ్యానాన్ని చేసుకోవడం.. అందరి కర్తవ్యంగా మారిపోయింది. అరవై పైని పెద్దలు.. పది సంవత్సరాల లోపు చిన్నపిల్లలు.. కొన్ని నిబంధనలు.. పాటించవలసినదిగా వైద్యుల.. నిపుణుల సందేశం.


ప్రాణంమీది తీపి అందరికీ వుంటుంది. భయం అన్నది అందరికీ ఒకటే.. ఒక వైపు ప్రభుత్వ సిబ్బంది.. డాక్టర్లు.. నర్స్ లు వ్యాధి నిరోధక చర్యలు సాగిస్తునే వున్నారు. సంవత్సరంగా దాదాపు.. ఆ మహమ్మారి దేశ ప్రజలను.. ప్రగతిని నాశనం చేసింది.


రాఘవయ్య తన ఇంటి పరిసర ప్రాంతవాసులకు.. ఇరుగుపొరుగువారికి.. తమ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవసర సహాయం.. సూచనలు ఇస్తున్నారు.


తిరుమల ఆలయం ఓపెన్ అయిన వార్త.. శ్రీ వెంకటేశ్వరస్వామివారిని నిత్యం దర్శించే భక్తుల సంఖ్య వివరాలు టీవీ వార్తల మూలంగా అందరకీ అవగాహన కలుగుతోంది..

పాపం!.. డెబ్భైఅయిదు సంవత్సరాల రామమూర్తిగారి మనస్సున ఒకే ఒక ఆశ..


‘పాదయాత్రలో తిరుపతి సప్తగిరులను ఎక్కి స్వామివారి ఆలయ ప్రవేశం చేసి చేతులు జోడించి ఆ సర్వాంతర్యామికి నమస్కరించాలన్నది..’


కళ్లు వుండగా ప్రయత్నించాడు.. కుదరలేదు.. కళ్ల సమస్య.. అర్ధాంగి వియోగం.. ఆ ఆశ.. మనస్సున అలాగే మిగిలి పోయింది. ఇప్పుడు గుర్తుకు వస్తూవుంది.. వెళ్లలేనా.. ఆ ప్రాంతంలో తిరుగలేనా?.. అనే ప్రశ్న !..


‘ప్రయత్నే.. ఫలి’ అనే సమాధానం.. మనస్సున ప్రతిధ్వని..

ఆ రెండు ప్రశ్నలు వారి మస్తిష్కంలో కదను త్రొక్కుతున్నాయి. ఆ సంగ్రామ వేదనను భరించలేక తన మనోభావాన్ని కొడుకు రాఘవయ్యకు చెప్పాలని నిర్ణయించుకొన్నాడు రామమూర్తి.

* * *

మనుమరాలు శాంతి కాఫీ గ్లాసుతో వరండాలోకి వచ్చి తాతగారిని సమీపించి..

“తాతయ్యా !..”

“ఏమ్మా!..”


“కాఫీ..” చిరునవ్వుతో వారి చేతిని తన చేతిలోకి తీసుకొని గ్లాసును అందించింది.

యదార్థంగా చెప్పాలంటే వారికి చూపు పోయిననాటి నుంచి.. వారికి కావాల్సినవి అమర్చేది శాంతి ఒక్కటే..


దీనికి కారణం.. తన చిన్న వయస్సులో తాతయ్య తనను ఎలా చూచుకొనే వాడన్నది ఆమెకు బాగా జ్ఞాపకం..


ఆమెకు పాలు అంటే ఎంతో ఇష్టం.. సన్నగా నాజూగ్గా.. తెల్లగా దొరసానిలా వుండేది శాంతి..

ఆవు పొదుగు నుండి పాలను శాంతి నోటికి కరిపించి తాగించేవాడు. పచ్చిపాలు (కాచనివి) ఆరోగ్యానికి.. బిడ్డల ఎదుగుదలకు ఎంతో మంచిది. నాలుగు ఆవులు రెండు బర్రెలు ఆ యింట వుండేవి. ఏదోఒకటి పాలు ఇస్తూ వుండేది. అందువలన ఆ యింట పాలు పెరుగుకు ఏనాడు లోటు లేదు.


ఆ పశువులు ఇప్పటికీ వున్నాయి. వాటి సంరక్షణకు ఒక పాలేరును కళ్లు పోయినప్పటినుంచి ఏర్పాటు చేసుకొన్నాడు రామమూర్తి. బయట పొలం.. తోట వ్యవహారాలను అతనే చూచుకొంటాడు.. పేరు సాంబుడు..

“చిన్నమ్మా !.. పాలు..” చెప్పాడు సాంబుడు..


శాంతి అతని చేతిలోని పాల చెంబును అందుకొంది. వంటింటి వైపుకు వెళ్లి చెంబును తల్లికి అందించి వరండాలోకి వచ్చింది..

“ఒరే సాంబా !..” పిలిచాడు రామమూర్తి..

“ఆ.. పెద్దయ్యా !.. సెప్పండి..”


“ఒరే.. దగ్గరకు రా !..”

సాంబుడు రామమూర్తిని సమీపించాడు.

“అయ్యా !.. చెప్పండి..”


“ఒరే.. తిరుపతికి వెళ్లాలని వుందిరా !.. నన్ను తీసుకొని వెళతావా !..”

“అయ్యా ! కరోనా కాలం.. అంతా లాక్ డౌన్లు.. మూతికి మాస్కులు.. మనిసికి మనిసికి దూరం.. గందరగోళంగా వుంది కదయ్యా ఇపుడు..” విచారంగా చెప్పాడు సాంబుడు.


“అవన్నీ.. నిజమే !.. కానీ మనం వెళ్లబోయేది స్వామి సన్నిధికి.. వారిని తలచుకొని బయలుదేరితే.. అంతా వారే చూచుకొంటార్రా !.. భయం ఎందుకు ?..” చిరునవ్వుతో చెప్పాడు రామమూర్తి.


“అయ్యా !.. నాకు భయం.. నా గురించి కాదయ్యా.. మీ గురించి.. తమరికి వయస్సు పెరిగింది కదయ్యా !..” అనునయంగా చెప్పాడు సాంబుడు.


బయటకు వెళ్లివచ్చిన కుమారుడు రాఘవయ్య సాంబుడి.. సంభాషణను.. విన్నాడు..

“ఏమిట్రా సాంబా విషయం ?..” అడిగాడు రాఘవయ్య.

విషయం తనకు తెలిసివున్నా.. సాంబుడి నోట వినాలని అడిగాడు.

సాంబుడు రామమూర్తిగారు తనతో చెప్పిన తిరుపతి యాత్రను గురించి నసుగుతూ.. రాఘవయ్యకు వినిపించాడు.


అంతా విని.. రాఘవయ్య తండ్రి ముఖంలోకి వికారంగా చూచాడు. ‘ఈ వయస్సులో కంటి చూపులేని ఈయనకు తిరుపతి యాత్ర చేయాలని ఆశ.. ఏం మనిషో.. ఏం తత్వమో !..’ మనసున విసుక్కొని సాంబు వైపు చూచి.. “రేయ్ !.. వెళ్లి నీ పని చూసుకో ఫో!..” కసిరినట్టు చెప్పాడు. అసహనంగా వేగంగా ఇంట్లోకి వెళ్లిపోయాడు.


రామమూర్తికి కళ్ల లోపమే తప్ప.. చెవులు బాగా వినిపిస్తాయి. వారు తన ఇంట్లో.. వాకిట ముందు కర్రసాయంతో నిర్భయంగా నడవగలరు. వారికి అంతా లెక్క.. వరండా చివరి మెట్టు దగ్గరనుండి వీధి వాకిలికి.. బావిదగ్గరకు.. ఇంటి వెనుకవున్న తులశమ్మకోట.. పశువుల కొట్టం దగ్గరికి.. అవి తాగే నీటి తొట్టి దగ్గరికి.. అడుగుల లెక్కతో ఫ్రీగా కర్రపోటుతో నడవగలరు. కొడుకు సాంబుడికి ఇచ్చిన సందేశంతో అతని తత్వం.. తన తిరుపతి ప్రయాణంపై ఎలా వున్నదీ అర్థం అయింది.


‘అవును మనం వచ్చిన పని అయిపోయింది. మనమీద ఆధారపడి ప్రస్తుతం ఎవరూ లేరు.. కొడుకు.. కూతురు వారి.. పిల్లలు పెద్దవారైనారు.. జీవిత భాగస్వామి జాగ్రత్తలు చెప్పి విడిచి వెళ్లిపోయింది.. ప్రస్తుతం ఏదైనా నోరుతెరిచి కొడుకును అడిగితే.. అతని మనస్సున చేయాలనే భావన కలిగినా.. కోడలు దాన్ని ఆక్షేపించి.. కొడుకును మందలిస్తుంది. ఆ బెదిరింపుతో వాడు.. (కొడుకు) తనతో రెండు మూడు రోజులు మాట్లాడటం మానేస్తాడు.. కారణాలురెండు.. ఒకటి మాట్లాడితే తండ్రి చెప్పేది వినవలసి వుంటుంది. తండ్రి కాబట్టి కాదనలేడు. తండ్రి మాటను నెరవేర్చడం ఇల్లాలికి ఇష్టం లేదు.. తండ్రి కోర్కెను ఆమె మాటను కాదని తీరిస్తే.. ఎడమొఖం.. పెడమొఖం.. కాకులు గద్దలతో పోల్చి సూటిపోటి మాటలు.. జీవితాన్ని దుర్భరం చేయడం.. భార్య కాత్యాయని వంతు.. ‘అందుకే రాఘవయ్య ఆమెతో చాలా క్లుప్తంగా సంభాషణతో నటిస్తూ వుంటాడు..

* * *

రాఘవయ్య.. వారి ఇల్లాలు కాత్యాయని.. ఆమె చిన్నాన్నగారి కుమారుడి వివాహం విషయంగా కొడుకు మరళితో కలసి వూరికి వెళ్లారు. రెండుమూడు రోజుల తర్వాత తిరిగివస్తారు. ఇంట్లో వున్నది.. రామమూర్తి.. మనుమరాలు శాంతి.. ఇంటి వంట మనిషి శేషమ్మ.. పాలేరు సాంబుడు..

సాంబుడి మనస్సున ఓ కోరిక.. చిన్నయ్యగారు.. చిన్నమ్మగారు ఇంట్లో లేని కారణంగా.. పెద్దయ్యగారు.. రామమూర్తి గారిని తిరుపతి తీసుకొని వెళ్లి.. వాళ్లు తిరిగి వచ్చేలోపల రావచ్చు కదా అనే ఆలోచన..


పెద్దయ్యగారు రామమూర్తిని, సాంబుడు సమీపించాడు.

“అయ్యగారూ !..”

“ఆ.. చెప్పు సాంబా !..”.


“మనం.. మీరు కోరుకొనే రీతిగా.. తిరుపతికి వెళ్లి వద్దామా.. సామీ !..”

“సాంబా.. నీవు అన్న పనిని చేయగలవా ?..”


“మీరు సరే అంటే.. మనం ఈ రాత్రికే బయలుదేరి తెల్లారేసరికి తిరుపతి చేరొచ్చు సామీ !..’

“ఒరే.. సాంబా !..”

“చెప్పండయ్యా !..”

“నా మనుమరాలు.. శాంతిని పిలుస్తావా !..

“అలాగే అయ్యా !..


ఇంట్లోకి తొంగి చూచి.. “చిన్నమ్మగోరూ !.. తాతయ్యగారు పిలుస్తుండారమ్మా !..’’

తన గదిలో చదువుకొంటున్న శాంతి.. హాల్లోకి వచ్చి.. సాంబు ముఖంలోకి చూచింది.

“చిన్నమ్మా !.. తాతయ్యగోరు పిలుస్తుందారమ్మా!..”


శాంతి వరండాలో ప్రవేశించి రామమూర్తిగారిని సమీపించి వారి చేతిపై తన చేతిని వుంచి..

“తాతయ్యా !.. ఏంకావాలి ?..” ఆప్యాయతతో నిండిన పలుకు..

“అమ్మా !.. శాంతీ !..”

“చెప్పండి.. తాతయ్యా !..”

“అమ్మా.. నాన్నా వాళ్లు ఎపుడు వస్తారమ్మా !..”


“తాతయ్యా !.. ఈరోజు ఆదివారం కదా !.. బుధవారం పెండ్లి.. గురువారం సాయంత్రానికి వస్తారు తాతయ్యా !..”

“ఓహెూ.. అలాగా !..”

“అవును తాతయ్యా !..”

“అమ్మా!..”

“ఏంటి తాతయ్యా !..

“నేను తిరుపతికి వెళ్లొస్తానమ్మా !..”


“తాతయ్యా !..” ఆశ్చర్యంతో అంది శాంతి.

“అవును తల్లీ !.. వెళ్లిరావాలని వుందమ్మా !..”


“మరి.. నీకు తోడూ !..”

“చిన్నమ్మా !.. నేను ఎలతానమ్మా !.. తాతయ్యను జాగ్రత్తగా తీసుకెళ్లి.. అంతే జాగ్రత్తగా తీసుకొస్తానమ్మా !..” అనునయంగా చెప్పాడు సాంబుడు.


శాంతి ఆలోచించసాగింది.. తాతయ్యకు తిరుపతికి వెళ్లాలని వుంది.. అమ్మా నాన్నలు అంగీకరించరు. నాన్న ఓకే అన్నా అమ్మ అంగీకరించదు. కారణం.. ఆమెకు తాతయ్య అంటే అభిమానం.. ప్రేమ రెండూ లేవు.. ఆ విషయం నాకు తెలిసినట్టే నాన్నగారికి తెలుసు. ఆయన అమ్మ మాటను కాదనలేరు. ఆ కారణం నాన్న ఏనాడు తాతయ్యను తనతో తిరుపతి తీసుకొని వెళ్లడు.. కాబట్టి.. తాతయ్య కోరిక తీరాలంటే.. ఇదే తగిన సమయం..

“తాతయ్యా !..” మెల్లగా అంది శాంతి.


“చెప్పు తల్లీ !..”

ఈ రాత్రికి నేను.. మీరు.. మన సాంబన్నా తిరుపతికి వెళదాం తాతయ్యా !.. మీతో నేనూ వస్తాను.. ఇపుడు మీకు ఆనందమేగా!..” చిరునవ్వుతో చెప్పింది శాంతి.


రామమూర్తిగారి వదనంలో ఎంతో ఆనందం..

“అమ్మా శాంతీ !.. నీవూ నాతో వస్తావా ?..”


“అవును తాతయ్యా !..” సాంబు వైపుకు తిరిగి.. “సాంబన్నా.. నేనూ మీతో వస్తాను. మనం ముగ్గురం వెళదాం..”

“తల్లీ !.. నీవూ వస్తావా !.. చాలా చాలా సంతోషం తల్లీ!.. మీరూ మాతో వస్తే చాలా.. చాలా.. బాగుంటుందమ్మా..” ఆనందంగా చెప్పాడు సాంబడు.


“అమ్మా !.. నేను బస్సు డిపోకెల్లి మూడు టిక్కెట్లు తీసుకొస్తాను తల్లీ !..”

“ఆ.. ఆ.. వుండు..”


ఇంట్లోకి వెళ్లి తాను దాచుకొన్న డబ్బాను తెరచి ఆరువందలు చేతికి తీసుకొని వరండాలోకి వచ్చింది శాంతి.


“సాంబన్నా !.. ఇదిగో డబ్బు.. కాస్త ముందు సీట్లు చూడు.. సరేనా !..”

“అలాగే తల్లీ !.. అయ్యా !.. నేను టిక్కెట్లు కొనేదానికి ఎల్లొస్తా..” ఎంతో ఆనందంగా చెప్పాడు సాంబుడు.


“సరేరా !.. జాగ్రత్త..”

“ఆ.. ఆ.. అట్టాగే !..” సాంబుడు వెళ్లిపోయాడు.

“అమ్మా శాంతీ !..”

“చెప్పండి.. తాతయ్యా !..


“నీకూ నాతో రావాలనిపించిందా తల్లీ !..’’

“అవును తాతయ్యా !.. నా తాతయ్యకు తోడుగా నేను వెళ్లితే అందులో నాకు ఆనందం.. ఎంతో ఆనందం..” నవ్వుతూ చెప్పింది శాంతి.


రామమూర్తి ఆమెను దగ్గరకు రమ్మన్నారు. శాంతి వారిని సమీపించింది. వంగి వారి ముఖంలోకి చూచింది.


ఆ తాతయ్య ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నాడు. ఆమె నొసటన ముద్దుపెట్టాడు.

‘నా తల్లి మనస్సు బంగారు.. సర్వేశ్వరా !.. తండ్రీ శ్రీనివాసా!.. మా అమ్మను చక్కగా కాచి రక్షించు తండ్రీ. తనకు అన్నివిధాలా తగిన జీవిత భాగస్వామిని సమకూర్చి.. ఆమె భావిజీవితం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్టు ఆనందమయంగా.. నిండు నూరేళ్లు సర్వ సౌభాగ్యాలతో.. పండంటి బిడ్డలకు తల్లిగా.. అత్తమామల అభిమాన పుత్రికగా (కోడలు) వర్థిల్లుగాక !..’ తన కుడిచేతిని ఆమె తలపై వుంచి ఆ తాతయ్య తన మనుమరాలిని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. వారి ఆనంద భాష్పాలు శాంతి తలపై రాలాయి.

* * *

రాఘవయ్య..కాత్యాయని వెళ్లిన వివాహం జరుగలేదు.. కట్నకానులక విషయంలో పెండ్లికూతురు తండ్రి మాట తప్పాడని.. పెండ్లికొడుకు తండ్రి అర్థాంగి, బంధుజాలం.. పెండ్లికూతురు తండ్రి తమ్మునిమీద విరుచకపడి.. నానా మాటలు అని.. పెండ్లికొడుకుని పెండ్లిపీటల మీదనుంచి లాక్కొని వెళ్లిపోయారు.


ఇలాంటి సంఘటనలు నేటి సభ్యసమాజంలో అక్కడక్కడా.. అపుడపుడూ జరుగుతునే వున్నాయి. కారణం అత్త గారి స్థాయికి చేరిన ఆ ‘అమ్మ’ కాబోయే కోడలిని.. తన ఇంటికి రాబోయే పనిమనిషిలా చూడటం వలన.. తన కూతురికి ఒక న్యాయం.. కొడుక్కి మరో న్యాయం అనే వ్యతిరేక భావాలు కలిగియుండుట వలన.. మొగవారిని గొంతు విప్పి ధర్మాధర్మాలను గురించి మాట్లాడేదానికి అవకాశాన్ని ఇవ్వకపోవడం వలన.. ధన దాహం వలన జరుగుతున్నాయి.

శాంతి..రామమూర్తి.. సాంబుడు తిరుపతి ప్రయాణానికి సర్దుకొన్నారు. వారి బస్సు రాత్రి పదిన్నరకు. ఐదున్నరకల్లా తిరుపతికి చేరుతుంది.


మరో అరగంటలో ముగ్గురూ బయలుదేరాలి..

రాఘవయ్య కారు ఇంటి ఆవరణలో ప్రవేశించింది. కాత్యాయని.. మురళి.. రాఘవయ్య కారునుంచి దిగారు.


ఆ సమయంలో అక్కడవున్న సాంబడిని చూచి..

“ఏరా !.. ఈ సమయంలో ఇక్కడ వున్నావ్ ?..” ఫుల్ షర్టు.. పంచ.. పైపంచతో నీట్ గా తయారైన సాంబణ్ణి చూచి ఆశ్చర్యంతో ఆ ప్రశ్న అడిగాడు రాఘవయ్య.


కాత్యాయని.. మురళి.. ఇంట్లోకి వెళ్లిపోయారు. వచ్చేదార్లోనే హెూటల్లో భోంచేసి వచ్చారు. కాత్యాయని చీరను విప్పి నైటీ తగిలించుకొని మంచంపై వాలిపోయింది. మురళిగాడు తన గదికి వెళ్లి మంచాన్ని కరచుకున్నాడు.

సాంబడు తెలివైనవాడు.


“అయ్యా.. కొంచెం పనిమీద నేను అది అత్తారి వూరికి ఎల్లి రావాలయ్యా.. పెద్దయ్యతో సెప్పినా.. పోయిరారా అన్నారు.. తమరొచ్చిండ్రు.. అత్తారి వూరుదాకా ఎల్లొస్తానయ్యా !..” ఎంతో వినయంగా చెప్పాడు సాంబడు.


నూట ఏభై కిలోమీటర్లు డ్రయివ్ చేసిన రాఘవయ్యకు ఒళ్లు అలసటగావుంది. సాంబూని ఎగాదిగా చూచి..

“సరే వెళ్లిరా!.. రేపు సాయంత్రానికి రావాలి!..” గట్టిగా చెప్పాడు రెండవ పదాన్ని.


“అట్టాగే సామీ !..” అన్నాడు సాంబడు.

వరండాలో తన వాలుకుర్చీలో కూర్చొని దుప్పటి కప్పుకొని వున్న తన తండ్రిని చూచి..

“నాన్నా.. పొద్దుపోయిందిగా!.. పడుకోకూడదూ!..” అన్నాడు.


“ఆ.. ఆ..” మెల్లగా అని “అవునురా !.. పెండ్లి ఏమయింది?.. అపుడే వచ్చేశారు ?..” సందేహంగా అడిగాడు రామమూర్తి.


“మా రాకతోనే మీకు అర్ధం అయిందిగా !.. ఆ పెండ్లి జరగలేదు.. కట్నం విషయంలో తగాదైందా.. మొగ పెళ్లివారు వెళ్లిపోయారు..” అంటూ వేగంగా చెప్పి లోనికి వెళ్లిపోయాడు రాఘవయ్య.


అందంగా అలంకరించుకొని తాతయ్య ప్రక్కన కూర్చున్న కూతురును చూచి ‘మా అమ్మ.. అందాల బొమ్మ’ అనుకొన్నాడు. శాంతి తండ్రి వెనకాలే ఇంట్లోకి వెళ్లిపోయింది.


సాంబడు రామమూర్తిని సమీపించి ‘‘వెళ్లొస్తా సామీ !..” అంటూ మెల్లగా చెప్పి వెళ్లిపోయాడు. రాఘవయ్య.. కాత్యానీ.. మురళీ రాకతో వారి తిరుపతి ప్రోగ్రాం అగిపోయింది.

* * *

రామమూర్తిగారు మంచంపై వాలిపోయారు. శాంతి తనగదిలో మంచంపై శయనించింది.. సాంబుడు తన పూరిగుడెశలో ఈతాకుల చాపపైన విచారంగా పడుకొన్నాడు.

మౌనంగా వున్న సాంబుడి ముఖంలోకి వాడి ఇల్లాలు రంగమ్మ చూచింది.


సాధారణంగా రోజూ ఆ సమయంలో సాంబుడు తన ఇల్లాలిని దగ్గరకు తీసుకొని.. ‘నీ కురులు.. నీ ముక్కు.. నీ కళ్లు.. నీ నోరు.. నీ చెవులు.. నీ నడుము..’ అని అన్ని భాగాలను గురించి తనకు తోచిన వుపమానాలను చెప్పి రంగికి కితకితలు పెట్టి తన గుండెకు రంగిని గట్టిగా హత్తుకునేవాడు. రంగి పరవశంతో సాంబుడికి అతుక్కు పోయేది.


కానీ.. ఈరోజు..

వెల్లికిలా పడుకొని వున్న సాంబుడి కళ్లల్లో కన్నీరు.


గుడిశలో చీకటి.. ఓ మూల చిన్న కిరోసిన్ దీపం..

ఆ నీలినీడల్లో రంగి సాంబుడి చెక్కిళ్లపై కళ్లనుండి జారిన కన్నీటిని చూచింది. తన చేత్తో వాటిని తాకింది.. వేడిగా తగిలాయి తన చేతి వ్రేళ్లకు.


“అయ్యా !..”

సాంబుడు పలకలేదు..


అతని హృదయంపై తట్టి..“అయ్యా !.. నిన్నే.. ఏంది అంత పరాకైన ఆలోచన ?..”

సాంబు లేచి కూర్చున్నాడు. రంగికూడ లేచి కూర్చొని అతని ముఖంలోకి సూటిగా చూచింది.

“అయ్యా !.. ఎందుకా కన్నీరు ?..”


విచారంగా నవ్వాడు సాంబుడు.

“జవాబు సెప్పయ్యా !.. నీవు ఏడుస్తా వుంటే నాకూ ఏడుపు వస్తావుంది !..” విచారంగా చెప్పింది రంగి.


“రంగీ !..”

“బావా !..”


“పెద్దయ్యగారు.. నన్ను ఒక కోరిక కోరిండే..”

“ఏంటది బావా ?..”


“చెప్పానుగా.. తిరుపతి తీసుకెళ్లమని అడిగిండని !..’’

“అవును ”

“అది ఆగిపోయింది కదే !.. పాపం అయ్యగారు ఎంతగా బాధ పడతావుండడో !.. నాకు చాలా.. చాలా.. బాధగా వుంది రంగీ.. చిన్నయ్యగోరోళ్లు రాకుండ వుంటే ఈ పాటికి బస్సులో తిరుపతి వైపు పోతా వుండేవాళ్లం కదే !..”


“అవునయ్యా !.. నువ్వే చెబుతావుంటవు కదా !.. ఏదీ మన సేతుల్లో లేదని.. అంతా ఆ పయ్యోడి ఆటేనని.. ఆయనకి ఇష్టం లేనట్టుంది. అందుకే పయనం ఆగిపోనాది..”


“అవునే.. ఆ ఎంకన్నకు వారి కొండకి మా రాక ఇష్టం లేనట్టేనే!..” వేదాంతిగా చెప్పాడు.. కొన్ని క్షణాల తర్వాత..

“రంగీ !..”


“చెప్పు బావా !..”

“నా బాధ ఎందుకో తెలుసా !..”


“తెలుసు.. పెద్దయ్యను తిరుపతికి తీసుకుపోలేక పోయానే అని !..”

“అవును.. అదే నా బాధ !.. పాపం.. పెద్దయ్యగోరు ఎంతగా బాధ పడుతుండారో !.. వారు గుర్తుకువస్తే.. మనస్సు పిండినట్టువుతుండాదే..”


“బావా !.. ఇందులో నీ తప్పు ఏమీ లేదుగా !.. అయ్యగారిమీద నీకున్న అభిమానం.. నీకు అలా అనిపిస్తూ వుండాది !.. బాధ పడకు.. వూరుకో అయ్యా.. పడుకో..నాకు నిద్ర వస్తావుంది..” రంగి చాపపై వాలిపోయింది.


మౌనంగా రామమూర్తిగారిని తలచుకొంటూ సాంబుడు రంగి ప్రక్కన వాలిపోయాడు.

శాంతి..

రామమూర్తిగారి ముద్దుల మనుమరాలు..

మంచంపై వాలిందేకాని నిద్రరావటంలేదు..


తన నాయనమ్మ..తాతయ్యల జ్ఞాపకాలు.. తన చిన్నతనం నాటి మధురస్మృతులు..

మొట్టమొదటిగా ఆడపిల్ల పుట్టినందుకు.. ఆ బిడ్డ తాత నానమ్మలు ఎంతగానో మురిసిపోయారు.. ఆమెకు జరుపవలసిన నామకరణం.. అక్షరాభ్యాసం.. పెద్దమనిషి అయాక జరగవలసిన వేడుకలు.. అన్నింటినీ ఎంతో ఘనంగా జరిపించారు రామమూర్తి వారి సతీమణి గౌరి.. గౌరి సంవత్సరం క్రింద.. విషజ్వరంతో చనిపోయింది. రామమూర్తి ఎంతగానో బాధపడ్డారు. ఐదేళ్లుగా వారికి చూపు కరవు..


ఎందరో వారివద్దకు సలహాలకు వస్తారు. వచ్చినవారికి మంచి జరిగేలా.. వారికి నయవచనాలను చెప్పి ఇలా చేసుకొంటే మీకు మంచిది అని చెప్పి వారిని ఆనందంగా సాగనంపడం రామమూర్తిగారి నైజం. ఇవి అన్నీ శాంతికి తెలిసిన విషయాలు.. తాతయ్య.. ఎపుడూ ఎవరినీ ఏదీ యాచించలేదు. పదిమందికీ తనకు తెలిసినంతలో మంచే చేశారు.


వారికున్న చిన్న కోరిక.. తిరుపతి తిరుమల వెంకన్న దర్శనం. నేను వారితో వస్తానంటే.. వారి ముఖంలో ఎంతో ఆనందం.. ఆ క్షణంలో నేను చూచిన ఆ ఆనందాన్ని.. వారి ముఖంలో నాయనమ్మ చనిపోయాక ఏనాడూ చూడలేదు.. కానీ.. అనుకొన్న ప్రకారంగా తిరుపతికి అమ్మా.. నాన్నల ఆకస్మిక రాకతో పోలేక పోయాము. పాపం.. తాతయ్య ఎంతగా బాధ పడిపోతున్నారో.. అమ్మా నాన్నలను నేను ఎదిరించలేను. తాతయ్యను నేను తిరుపతికి వారికి తెలియకుండా తీసుకొని వెళ్లలేను. మంచి అవకాశం వచ్చింది.. అమ్మా నాన్నల రాకతో అది తలక్రిందులయింది..


పాపం.. తాతయ్య ఎంతగా బాధపడుతున్నాడో !.. ఆయనకు కళ్లువుండి వుంటే.. ఎవరి సహాయం అవసరం లేకుండా వారే వెళ్లి తిరుమల వెంకన్నను దర్శించి వచ్చివుండేవారు కదా !..”

ఆ దేవుడు తాతయ్యకు కళ్లు లేకుండా ఎందుకు చేశాడో !.. ఈ వయస్సు వారు ఆ దైవ విషయంలో ఒక తీరని కోర్కెతో బాధ పడాలా!.. నో.. నో..


నాన్నను నేను రేపు అడుగుతాను.. నేను తాతయ్య.. తిరుపతికి వెళ్లి ఆ ఏడుకొండలదేవుని దర్శించి వస్తామని.. నాన్న నా కోర్కెను కాదనరు.. కానీ అమ్మ.. అభ్యంతరం చెప్పవచ్చు.. తప్పక చెబుతుంది..


ఆ మహాతల్లికి తాతయ్య నాయనమ్మలంటే ఎపుడూ ఇష్టం లేదు. అదే తన అమ్మా నాన్నలు వచ్చారంటే.. వారికి చేసే మర్యాదలు.. రకరకాల వంటకాలు చేసి తినిపించడాలు.. పోయేటపుడు కొత్తవస్త్రాలు.. తన ఇష్టం.. అదే నాయనమ్మ తాతయ్యల విషయంలో పూజ్యం.. ఎంతో సహనంతో అమ్మ ఆగడాలను భరించిన నాయనమ్మ వెళ్లిపోయింది. ఉన్నది తాతయ్య ఒక్కడు.. ఆయనకు వేరే ఎవరూ లేరుగా.. వారి వారసులమైన నాన్నా.. నేను.. నా తమ్ముడే వారి కోర్కెలను తీర్చాలి. అంది మాధర్మం.. నేను నా ధర్మ నిర్వహణకు రేపు నాన్నగారితో మాట్లాడతాను. వారుకూడ కాదంటే.. ఎదిరించయినా సరే.. తాతయ్యను తిరుపతికితీసుకొని వెళతాను.. వారి కోర్కెను తీరుస్తాను.. అనుకొంది శాంతి.


రామమూర్తిగారు మంచంపై వాలిపోయారు.

వారి మనస్సున మూగ బాధ.. గత అనుభవాలలో జయాపజయాలు.. ఆనందం.. విషాదం.. చీకటి.. వెలుగు.. తాను చూచిన.. భరించిన డెబ్భై ఐదు సంవత్సరాల గత జీవిత జ్ఞాపకాలు.. సంకల్ప వికల్పాలు.. అన్నీ గుర్తుకు వచ్చాయి..


తను తిరుపతి వెళ్లి స్వామి దర్శన సంకల్పం ఈ జన్మలో ఇక తీరదనే నిర్ణయానికి వచ్చాడు. క్రింద తిరుపతినుంచి తిరుమలకు 12 కిలోమీటర్లు.. 3550 మెట్లు.. పద్మాసనం వేసుకొని ఎన్ని మెట్లో అన్నిసార్లు మహత్తరమైన ‘ఓం శ్రీమన్నారాయణాయ’.. మంత్ర జపాన్ని స్థిరంగా జపమాలతో చేశారు.


మనస్సు చల్లబడింది. తన గదిలో గోడకు వున్న ఆ కలియుగవరదుని ఫొటో సమీపించి దాన్ని చేతికి తీసుకొని కళ్లకు అద్దుకొన్నారు.

వారి మనో నేత్రం.. తెరచుకొంది.. ఆ దృష్టికి శ్రీమన్నారాయణుడు.. ఏడుకొండలవాడు.. శంఖు చక్రాలతో ఇరువైపులా తన దేవేరులతో గోచరించాడు. మనస్సుకు తనువుకు ఎంతో పరవశం..

ఆ చిత్రపటాన్ని.. కాదుకాదు శ్రీమన్నారాయణుని తన హృదయంపై వుంచుకొని మంచంపై వాలిపోయారు.


‘తండ్రీ!.. ఈ జన్మకిదిచాలు.. బాధ్యతలన్నింటినీ ముగించాను. నా భాగస్వామిని నీ సన్నిధికి చేర్చుకొన్నావు.. నాయందు దయచూపించి.. నన్ను నీ సన్నిధికి చేర్చుకో తండ్రీ.. నన్నూ నీ సన్నిధికి చేర్చుకోరా నా తండ్రీ.. చేర్చుకో !.. చేర్చుకో !.. ఆర్తిగా అంటున్న రామమూర్తిగారి స్వరం ఆగిపోయింది.


తాతయ్య స్థితిని చూడాలని వచ్చిన శాంతి.. వారు శ్రీమన్నారాయణునితో మాట్లాడిన మాటలను అన్నింటినీ విన్నది. అయోమయ స్థితిలో తాతయ్యను సమీపించింది. వెల్లికిలా పడుకొని ఎదపైశ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిరూపాన్ని వుంచుకొని.. నిశ్చింతగా చిరునవ్వుతో నిద్రిస్తున్న తాతయ్యను చూసింది శాంతి.


వారిని తాకి చూచింది. శరీరం చల్లగా వుంది. ముక్కుదగ్గర శ్వాసను చూపుడు వ్రేలితో చూచింది. ఆమె అనుమానం నిజం అయింది.

అంతవరకు.. హృదయంలో సుళ్లు తిరుగుతున్న ఆవేదనతో.. “తాతయ్యా.. తాతయ్యా” అంటూ భోరున ఏడుస్తూ రామమూర్తిగారి హృదయంపై వాలిపోయింది.


ఆమె ఆర్తనాదం.. ఆ ఇంట్లో మారు మ్రోగింది.. ముందు రాఘవయ్య.. వెనుక కాత్యాయని.. మురళి.. రామమూర్తిగారు వున్న గదివైపుకు పరుగెత్తారు.

* * *

//సమాప్తి //

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


37 views0 comments

Comments


bottom of page