ధర్మో రక్షతి రక్షితః
- Srinivasarao Jeedigunta
- Aug 25
- 6 min read
#DharmoRakshithiRakhsitaha, #ధర్మోరక్షతిరక్షితః, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Dharmo Rakshithi Rakhsitaha - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 25/08/2025
ధర్మో రక్షతి రక్షితః - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సోమేశ్ మునిసిపల్ ఆఫీసులో ప్లాన్ అప్రూవల్ అధికారిగా పనిచేస్తున్నాడు. గుమస్తాగా చేరినప్పుడు అతనికి కృష్ణవేణి తో పెళ్ళి అయ్యింది. కుర్రాడు మునిసిపల్ ఆఫీసులో ఉద్యోగం అవటం తో రేపు రెండుచేతుల డబ్బులు సంపాదిస్తాడు అని అప్పు చేసి అడిగిన కట్నం యిచ్చి పెళ్ళి చేసాడు కృష్ణవేణి తండ్రి.
మొదట్లో సోమేశ్ బుద్దిగా వున్నా తోటి ఉద్యోగులు కొందరు లంచం యిస్తేగాని పని చెయ్యకపోవడం చూసి అతను కూడా లంచాలకి అలవాటు పడ్డాడు. వసూళ్లు చేసిన అవినీతి సొమ్ములో నుంచి సగభాగం తన పై ఆఫీసర్స్ కి యిచ్చి వాళ్ళ కనుసన్నలలో వుండేవాడు.
జీతం కంటే ఎక్కువ డబ్బులు మధ్యలో తీసుకుని వచ్చి యిస్తున్న భర్తని కృష్ణవేణి ఈ డబ్బు ఎలా వస్తోంది, జీతం నెల మొదటి రోజు వచ్చింది కదా అని అడిగేది కాదు.
‘మీకేం మీ ఆయన మునిసిపల్ ఆఫీసు లో పని, తలచుకుంటే ఇల్లు కూలగొట్టించగలడు, ఎన్ని అంతస్తులు కైనా పర్మిషన్ ఇవ్వగలడు’ అంటూ పొగిడేవాళ్ళు. తన భర్త సంపాదన అక్రమంగా సంపాదన అని అనుకునేది కాదు కృష్ణవేణి. అది ఒక స్టేటస్ సింబల్ అనుకుని మురిసి పోయేది.
సోమేశ్ వర్క్ రోజు చీకటి పడ్డతరువాత మొదలు అయ్యేది. పెర్మిషన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని ఆఫీస్ అయిపోయిన తరువాత రమ్మని, బేరం మాట్లాడుకుని వాళ్ళని తన ఆఫీసర్ కి పరిచయం చేసేవాడు. ఈ సమయంలోనే బార్ కి వెళ్లడం, తాగడం అలవాటు అయ్యింది. ఇంటికి తాగి వచ్చిన భర్త తన చేతిలో డబ్బుల కట్ట పెట్టగానే భర్త తాగి వచ్చిన విషయం పట్టించుకునేది కాదు కృష్ణవేణి.
సోమేశ్ కి ప్రమోషన్ వచ్చి అదే ఆఫీసు లో అధికారిగా అయ్యాడు. చేతిలో డబ్బులు పడితే గాని ఫైల్ మీద సంతకం పెట్టేవాడు కాదు. ప్రతి శనివారం బెంగళూరు వెళ్లడం గుర్రం పందెం ఆడి డబ్బులు పోగొట్టుకోవడమే తప్పా సంపాదించటం లేదు. భార్య కృష్ణవేణికి భర్త పెడదారి పట్టాడు అనే ఆలోచన లేకుండా భర్త యిచ్చే డబ్బులు తల్లిదండ్రులకి పంపించేది తన పెళ్ళికి చేసిన అప్పులు తీర్చమని.
ఆరోజు అటెండర్ యిచ్చిన కాఫీ తాగి, గుమస్తా గుర్తు పెట్టిన ఫైల్స్ క్లియర్ చేస్తున్నాడు. తలుపు తీసుకుని లోపలికి వచ్చిన వ్యక్తి ని చూసి మొదట్లో ఏ ఏసీబీ ఆఫీసర్ ఏమో అనుకుని మనసు కంట్రోల్ చేసుకుని “ఎవ్వరు మీరు, యిలా అడగకుండా లోపలికి వచ్చారు” అన్నాడు సోమేశ్.
“క్షమించండి, యిలా బలవంతంగా రాక తప్పలేదు, నా పేరు భాస్కర్, నేను బంజారాహిల్స్ లో ఇల్లు కట్టుకోవాలి అని అవసరమైన అన్నీ డాక్యూమెంట్స్ మీ ఆఫీసులో యిచ్చి నెల రోజులు అయ్యింది. యింత వరకు ప్లాన్ అప్రూవల్ కాలేదు. ఎప్పుడు అడిగినా మీ గుమస్తా ప్లాన్ అప్రూవల్ కావాలి అంటే ఖర్చు అవుతుంది అంటున్నాడు. నేను నిజాయితీ గా బతుకుతున్నాను. అవినీతిపరులకి దూరంగా వుంటాను, అందుకే మిమ్మల్ని కలిసి మీ సహాయం కోరాలని వచ్చాను” అన్నాడు.
దానికి సోమేశ్ నవ్వుతూ “చూడండి.. జరిగితే అందరూ నీతిగా వుంటారు, కానీ మన వ్యవస్థ లో చిన్న పాముని పెద్ద పాము తిన్నట్టే మేము మీలాంటి వాళ్ళ దగ్గర వసూళ్లు చేసి మంత్రులు దాకా యివ్వాలి/ లేకపోతే మా సీట్ గల్లంతు అవుతుంది/ అందుకే అనవసరంగా నీతి నిజాయితీ అనక మా గుమస్తా చెప్పినట్టు చెయ్యండి” అన్నాడు.
బయటకు వచ్చిన భాస్కర్ ని చూసి నవ్వుతూ “ఏమన్నారు మా సార్” అన్నాడు.
“మీకు ఇది ఇవ్వమన్నారు” అంటూ చేతిలోని భగవద్గీత గుమస్తా చేతిలో పెట్టి బయటకు నడిచాడు భాస్కర్. చేతిలో పుస్తకం పెట్టి వెళ్తున్న వ్యక్తి ని చూసి ఆశ్చర్యం గా ఆ పుస్తకం తీసుకుని వెళ్లి సోమేశ్ కి యిచ్చి విషయం చెప్పాడు.
“ఈసారి మళ్ళీ ఆయన వస్తే నాదగ్గరకి తీసుకుని రా ఆయన ఫైల్ తో” అన్నాడు సోమేశ్ భగవద్గీత వంక చూస్తో.
ఆ రోజు ఎందుకో బార్ కి వెళ్ళాలి అనిపించక త్వరగా ఇంటికి చేరుకున్నాడు సోమేశ్. యింట్లో చుట్టుపక్కల ఆడవాళ్ళని కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్న భార్యని చూసి తన రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుని కుర్చీలో కూర్చొని భగవద్గీత పుస్తకం పేజీలు అటుయిటు తిరగవేసి, ‘బాబోయ్.. ఈ శ్లోకాలు ఎలా చదువుతారో’ అనుకుంటూ పుస్తకం టేబుల్ మీద పెట్టాడు.
యింతలో తన నాలుగేళ్ల కొడుకు అరుణ్ తండ్రి దగ్గరికి వచ్చి వొళ్ళో కూర్చుని తండ్రితో ఆడుతున్నాడు. కొడుకు చేతి వేళ్లు కాలి వేళ్లు నీలంగా ఉండటం గమనించి ఎందుకు అలావున్నాయో అనుకున్నాడు.
రాత్రి భార్య తో “ఈసారి డాక్టర్ గారికి చూపించు” అన్నాడు.
“ఏమో.. మనవాడు కృష్ణుడు అనుకుంటా” అంది భార్య కృష్ణవేణి.
స్మశాన వైరాగ్యం అన్నట్టుగా రెండవ రోజునుంచి మళ్ళీ మామూలు పద్ధతిగానే గుమస్తా డబ్బులు ఇవ్వడం, ఫైల్ క్లియర్ చెయ్యడం, బార్, ఇల్లు సోమేశ్ కి రివాజు అయ్యింది.
ఆ రోజు శనివారం. ఆతరువాత రెండు రోజులు ఆఫీసుకి సెలవులు వున్నాయి.
గుమస్తాని పిలిచి “ఈ రోజు పెండింగ్ ఫైల్స్ కోసం వచ్చిన వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి ఫైల్స్ క్లియరెన్స్ కి పంపించు” అన్నాడు సోమేశ్. దానితో గుమస్తా కొందరి బిల్డర్స్ కి ఫోన్ చేసి ఆఫీస్ కి రమ్మన్నాడు.
సాయంత్రం వరకు పది ప్లాన్స్ కి అప్రూవల్ యిచ్చాడు సోమేశ్. అప్పుడు గుమస్తా వచ్చి “సార్ వికాస్ బిల్డర్ వచ్చాడు” అని చెప్పి, అతని ఫైల్ సోమేశ్ ముందు పెట్టాడు.
అప్పటికే ఆరోజు వచ్చిన వసూళ్లు టిఫిన్ బాక్స్ లో సద్దుకుని బ్యాగ్ లో పెట్టుకున్నాడు. “నమస్కారం సార్” అంటూ గుమస్తా తో పాటు వచ్చిన వికాస్ బిల్డర్ సోమేశ్ టేబుల్ మీద ఫైల్స్ కింద డబ్బుల కవర్ పెట్టి “సార్, త్వరగా ఆర్డర్ ఇవ్వండి. సైట్ లో పని మొదలైంది” అన్నాడు.
“అలాగే! రేపు వచ్చి ఆర్డర్ తీసుకోండి” అని కవర్ని జేబులో పెట్టుకుని లేచాడు.
“కూర్చోండి. ఆలా వెళ్ళిపోతే ఎలా” అంటూ ముగ్గురు ఏసీబీ ఆఫీసర్స్ వచ్చి సోమేశ్, సోమేశ్ గుమస్తా దగ్గర వున్న డబ్బు స్వాధీనం చేసుకుని వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయారు.
యిదే సమయంలో కొడుకుని తీసుకుని రెయిన్బో పిల్లల హాస్పిటల్ కి వెళ్ళింది కృష్ణవేణి. డాక్టర్స్ అనేక పరీక్షలు చేసి “మీ వారితో మాట్లాడాలి, కంగారు పడక్కరలేదు, ఒకసారి మీ వారిని రమ్మనండి” అన్నాడు డాక్టర్ గారు.
భర్త సోమేశ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటికి వచ్చేసింది. ఫోన్ రింగ్ అవడంతో భర్త ఫోన్ అనుకుని ఫోన్ తీసింది.
“హలో.. ఏసీబీ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ భర్త లంచం తీసుకుంటో పట్టుబడ్డాడు” అని చెప్పారు. దానితో కొయ్యబారిపోయింది, యిప్పుడు ఏమి చెయ్యాలో తెలియక.
అంతలో కొంతమంది ఆఫీసర్స్ వచ్చి “మేము ఏసీబీ నుంచి, మీ ఇల్లు తనిఖీ చెయ్యాలి” అంటూ ఇల్లు అంతా వెతికి దొరికిన నగలు డబ్బులు లెక్కలు రాసుకుని పట్టుకుని పోయారు.
కృష్ణవేణి యింటి మీద ఏసీబీ వాళ్ళు దాడిచేసారు అని తెలిసి నిన్నటివరకు స్నేహితులు గా వున్న ఆడవాళ్లు అందరూ నవ్వుతు చూస్తోవుంటే కృష్ణవేణికి చిరాకు వచ్చింది..
మొత్తానికి పెద్ద ప్లీడర్ ని పట్టుకుని మొగుడికి బెయిల్ సంపాదించింది. “ఈ పరిస్థితి లో మీరు డాక్టర్ గారిని కలవగలరా, బాబు విషయం మాట్లాడటానికి మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు” అంది కృష్ణవేణి.
“నా విషయం యిప్పుడే తేలేది కాదు, ముందు మనం పిల్లాడి గురించి ఆలోచించాలి. రేపు వెళ్దాం” అన్నాడు సోమేశ్.
“ఒక్క ప్రశ్న. యిన్ని రోజులు మీరు సంపాదించి యిచ్చిన డబ్బులు అక్రమంగా సంపాదించినదేనా” అంది.
“కొన్ని ఉద్యోగాలలో మనం మడికట్టుకుని వున్నా పై ఆఫీసర్స్ కి మామూలు ప్రతీ నెల యివ్వాలి, వాళ్ళకి యిస్తున్నాముగా అని కొంత సొమ్ము నేనుకూడా తీసుకున్నాను” అన్నాడు.
“మరి యిప్పుడు మీ దగ్గర సొమ్ము తిన్న ఆ పై ఆఫీసర్స్ మిమ్మల్ని కాపాడలేదు ఎందుకు” అంది.
“ఈ ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు, ముందు మన ఆబ్బాయి కి ఎటువంటి అనారోగ్యం లేకపోతే చాలు, నేను జైలు కి వెళ్ళడానికి సిద్ధంగా వున్నాను. మొన్న ఒక పెద్దాయన తన ఫైల్ గురించి వచ్చి భగవద్గీత యిచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు అనిపించింది నేను నడుస్తున్న దారి మంచిది కాదు అని, కాని మాయ నన్ను మారనివ్వలేదు” అన్నాడు కళ్ళు తుడుచుకుంటో.
“యిప్పుడు మీరు సంపాదించిన డబ్బులు మొత్తం పోయాయి, మిగిలింది ఆ భగవద్గీత. మనం ఆ శ్రీకృష్ణుడు పాదాలు పట్టుకుని రోజూ భగవద్గీత పారాయణం చేద్దాం” అంది కృష్ణవేణి.
డాక్టర్ గారు సోమేశ్ కొడుకు టెస్ట్ రిపోర్ట్స్ చూసి గుండె పగిలే వార్త చెప్పాడు. “మీ అబ్బాయి హార్ట్ లో ఒక వాల్వ్ పనిచేయడం లేదు, వాల్వ్ రీప్లేస్ చెయ్యాలి, పదిహేను లక్షలు వరకు ఖర్చులు వస్తాయి” అన్నాడు.
“మళ్ళీ వస్తాము అని చెప్పి ఇంటికి చేరుకున్నారు.”
‘భగవంతుడా! ఉద్యోగం పోయింది, వున్న డబ్బులు ఏసీబీ వాళ్ళు పట్టుకుని పోయారు, యిప్పుడు యింత డబ్బు ఎలా తీసుకుని రావాలి, పిల్లాడికి వైద్యం ఎలా చేయించాలి’ అనుకున్నాడు.
భోజనం చెయ్యకుండా టేబుల్ మీద వున్న భగవద్గీత తీసుకుని కొన్నిపేజీలు చూస్తోవుండగా భక్తి యోగం లో శ్రీకృష్ణుడు చెప్పిన
"అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || ”
“వేరే ఆలోచనలు లేకుండా నిత్యమూ తనను నమ్ముకొని, తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే వుంటూ, తనను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను"
అని చదివి “అయితే స్వామి.. ఈరోజు నుంచి నా బాధ్యత నీదే, నిన్ను నమ్ముకుని భగవద్గీత పూర్తిగా పారాయణం చేసేవరకు భోజనం చెయ్యను” అని దీక్ష తీసుకుని పారాయణం చెయ్యటం మొదలుపెట్టారు భార్య భర్తలు ఇద్దరు.
తనకి తెలిసిన వాళ్ళని అప్పు ఇమ్మని అడిగాడు సోమేశ్. అతను ఏసీబీ కి పట్టుబడ్డాడు అని తెలిసి ఎవ్వరు సహాయం చెయ్యటానికి ముందుకు రాలేదు. పిల్లాడు ఆరోజు ఉదయం స్కూల్ లో కళ్ళు తిరిగి పడిపోయాడు అని తెలిసి పరుగున వెళ్లి పిల్లాడిని తీసుకుని మళ్ళీ రెయిన్బో హాస్పిటల్ కి వెళ్ళారు.
“ఆపరేషన్ త్వరగా చేయించండి, యిలా ఆలస్యం చేస్తే పిల్లాడికి ప్రమాదం” అన్నాడు డాక్టర్ గారు.
“సార్! యిప్పుడు వున్న పరిస్థితి లో నేను పదిహేను లక్షలు తెచ్చి ఆపరేషన్ చేయించలేను, ఏమైనా తగ్గించండి, చిన్నపిల్లాడిని రక్షించండి” అని వేడుకున్నాడు.
“డబ్బులు తగ్గించే అధికారం మా చేతిలో లేదు, మీరు చెప్పిన పరిస్థితి చూస్తే మాకు బాధగానే వుంది. మీరు ఒకసారి దేవుడి మీద భారం వేసి మా హాస్పిటల్ డైరెక్టర్ గారిని కలిసి మీ బాధ చెప్పుకోండి. ఆపరేషన్ చెయ్యాలిసిన స్పెషలిస్ట్ ఆయనే, మీ ఫైల్ ఆయనకు పంపిస్తాను” అన్నాడు.
ఆ డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పి డైరెక్టర్ గారు వున్న గది దగ్గరికి వెళ్లి అక్కడ తన వంతు వచ్చే వరకు కుర్చీలో కూర్చొని తనతో తెచ్చుకున్న భగవద్గీత చదువుకుంటున్నాడు.
ఒక గంట తరువాత లోపలకి రమ్మని పిలుపు రావడం తో లోపలికి వెళ్లి అక్కడ కూర్చొని వున్న డైరెక్టర్ గారిని చూసి నీరుకారిపోయాడు. ఆయన ఎవ్వరో కాదు, ఆరోజు తన యింటి ప్లాన్ అప్రూవల్ కోసం వచ్చి, అవినీతి ని ప్రోత్సహించటం నాకు యిష్టం లేదు అని భగవద్గీత యిచ్చి వెళ్లిన పెద్దమనిషి.
“రండి, గుర్తుపట్టాను. ఆలా కూర్చోండి” అన్నాడు డాక్టర్ భాస్కర్. “సోమేశ్ గారు, మీ అబ్బాయికి గుండెల్లో ఒక వాల్వ్ మార్చాలి, ఇలాంటి ఆపరేషన్స్ ఎన్నో చేసాను. మీరు మా అసిస్టెంట్ ని అడిగి డేట్ తీసుకోండి” అన్నాడు.
“సార్! ఆనాడు మిమ్మల్ని డబ్బులు యిస్తేగాని ప్లాన్ అప్రూవల్ ఇవ్వలేను అని చాలా తప్పు చేసాను. ఏసీబీ వాళ్ళు పట్టుకుని నా ఆస్తులు జప్తు చేసారు. యిప్పుడు మా అబ్బాయి కి ఆపరేషన్ కి నేను ఎంత కష్టపడ్డా నాలుగు లక్షలు కంటే ఇవ్వలేను” అన్నాడు.
“మీరు డబ్బే ముఖ్యం అని, అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బులు ఈరోజు మీ అబ్బాయి ప్రాణం రక్షణకి ఉపయోగం లేకుండా పోయాయి. ఆపరేషన్ చాలా ఖరీదుతో కూడినది. యింత తక్కువకి చెయ్యడానికి మీకు అర్హత కూడా లేదు కదా. భగవంతుడు మనల్ని ఒక అధికారిగా నియమించినప్పుడు, అది మన గొప్ప అనుకుని ప్రజల్ని పీడించటానికి కాదు కదా” అన్నాడు డాక్టర్ భాస్కర్.
“క్షమించండి, అందుకేగా శిక్ష అనుభవిస్తున్నాను. ఇహ అంతా ఆ భగవంతుడే చూసుకోవాలి” అంటూ లేచి వెళ్ళటానికి నుంచున్నాడు సోమేశ్.
అప్పుడు చూసాడు డాక్టర్ భాస్కర్ సోమేశ్ చేతిలోని భగవద్గీత.
“మీరు భగవద్గీత చదువుతున్నారా? అందులో శ్రీకృష్ణుడు ఏమన్నారు..
"అనన్యాశ్చిన్తయంతో మాం యే జనాః పర్యుపాసతే |తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || ”
అని కదా.
మీరు మా అసిస్టెంట్ ని అడిగి ఆపరేషన్ కి డేట్ తీసుకోండి మిగిలింది ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుంటాడు” అని లేచి సోమేశ్ చేతిలోని భగవద్గీత తీసుకొని కళ్ళకు అద్దుకుని మళ్ళీ తిరిగి యిచ్చేసాడు డాక్టర్ భాస్కర్.
కొన్నిరోజులలో కోర్ట్, ఏసీబీ వాళ్ళు సరైన ఎంక్వయిరీ చెయ్యలేదు అని కేసు కొట్టివేసి సోమేశ్ ని తిరిగి ఉద్యోగంలో నియమించింది.
వేరే ఆలోచనలు లేకుండా నిత్యమూ తనను నమ్ముకొని, తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే వుంటూ, తనను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను"..
-భగవద్గీత సారాంశం.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments