top of page
Original.png

 జననీ జన్మభూమిశ్చ..

#ParupalliAjayKumar, #పారుపల్లిఅజయ్కుమార్, #జననీజన్మభూమిశ్చ, #JananiJanmabhumischa, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Janani Janmabhumischa - New Telugu Story Written By Parupalli Ajay Kumar

Published In manatelugukathalu.com On 25/08/2025

జననీ జన్మభూమిశ్చ - తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో నా మొబైల్ రింగయ్యింది. కంపెనీ ఆర్థిక విషయాలు, భవిష్యత్తులో అనుసరించవలసిన వ్యూహాలు వంటి కీలక అంశాల గురించి చర్చిస్తున్న నేను ఒక్కక్షణం మొబైల్ వంక చిరాకుగా చూసి ఎవరు ఫోన్ చేస్తున్నారో కూడా చూడకుండా కాల్ కట్ చేశాను. 


నిమిషం వ్యవధిలోనే మొబైల్ మరోసారి మోగింది. ఈసారి వీడియో కాల్ వస్తున్నది. ఎవరు చేస్తున్నారో చూశాను. ఇండియా నుండి బాబాయ్ చేస్తున్నాడు. భృకుటి ముడి వేస్తూ మొబైల్ చేతిలోకి తీసుకుని, “సారీ! వన్ మినిట్” అని డైరెక్టర్స్ కు చెప్పి ప్రక్క గదిలోకి నడిచి సెల్ ఆన్ చేశాను. 


“బాబాయ్, ఈ టైంలో ఫోన్ చేశావు. ఏమిటి విషయం?” అడిగాను. 


“వాసూ, వదిన ఒక్కసారి నిన్ను చూడాలని వుంది అని అంటే ఫోన్ చేస్తున్నారా. ” అటునుండి బాబాయ్ అంటుండగానే

“బాబాయ్, నేను ముఖ్యమైన మీటింగ్ లో వున్నాను. మీటింగ్ అయ్యాక నేనే ఫోన్ చేస్తాను. అమ్మతో చెప్పు. ” అంటూ బాబాయ్ చెప్పేది వినకుండా కాల్ కట్ చేసి, మొబైల్ ఆఫ్ చేసి మీటింగ్ రూంలోకి నడిచాను. మీటింగ్, ఆ తరువాత లంచ్ పూర్తయి అందరూ వెళ్ళేసరికి మధ్యాహ్నం మూడు దాటింది. 


‘గత కొన్నేళ్ళుగా తను పనిచేసే సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరగడంతో అమ్మకాలు, లాభాలు ఊపందుకున్నాయి. తనకు కంపెనీ CEO గా ప్రమోషన్ వచ్చింది. ఇటీవల కాలంలో తమ కంపెనీకి పోటీగా కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. బిజినెస్ పరంగా మార్కెట్ లో పోటీ ఎక్కువయింది. వ్యాపార శత్రువులు ఎక్కువయ్యారు. ఒత్తిడి ఎక్కువయింది. ఇవన్నీ తట్టుకుని విజయం సాధించాలి. ’ అని ఆలోచిస్తుండగా బాబాయ్ ఫోన్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. మొబైల్ ఆన్ చేశాను. ఈ టైమ్ లో బాబాయ్ నిద్రపోతూ వుంటాడు, రాత్రికి కాల్ చేద్దాం అనుకుంటుండగా వాట్సప్ లో బాబాయ్ మెసేజ్ కనిపించింది. 


‘వాసూ, నువ్వెంత బిజీగా వుంటావో మాకు తెలుసు. కానీ అమ్మతో కూడా మాట్లాడలేనంత బిజీగా వుంటావని అనుకోలేదురా. వదినకు హార్ట్ ఎటాక్ వచ్చి ఆసుపత్రిలో వుంది. బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు. రెండురోజుల నుండి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ బిజీ అని వస్తున్నది. మెసేజ్ పెట్టాను. నువ్వు చూసుకోలేదో, చూసి కూడా మిన్నకున్నావో తెలియదు. 


మీ అమ్మ చావుబ్రతుకుల మధ్య పోరాడుతూ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని కలవరిస్తుందిరా. నవమాసాలు మోసి, కని పెంచి నిన్ను ఇంతవాడిని చేసిన అమ్మతో రెండు నిమిషాలు మాట్లాడలేకపోతున్నావా? ఇప్పుడు నువ్వు మాట్లాడలేకపోతే ఆ బాధ, దిగులుతోనే మీ అమ్మ ప్రాణం పోయేలా వుంది. బైపాస్ సర్జరీకి డేట్ నిర్ణయించారు. ఎల్లుండి ఉదయం చేస్తారు. ఈ లోపున నీకు తీరిక చిక్కితే ఒకసారి ఫోన్ చేయి. నేను 24 గంటలు హాస్పిటల్ లోనే వుంటున్నాను. ’


మెసేజ్ చదువుతుంటే నా గుండె బరువెక్కినట్లు అనిపించింది. కంపెనీ వ్యవహారాలతో బిజీగా ఉండి మూడు రోజులనుండి వాట్సప్ మెసేజ్ లు చూడలేదు. 


కలత చెందిన మనసుతో వెంటనే బాబాయ్ కి వీడియో కాల్ చేశాను. నా ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నాడేమో మొదటి రింగుకే ఫోన్ ఎత్తి “హలో! వాసూ. ” అంటూ పలికాడు. 


“బాబాయ్, అమ్మ ఎలా వుంది? అమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చిన విషయం నాకు తెలియదు. నేను ఫోన్ తీయకపోతే సుజాత కు ఫోన్ చేసి చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదు?” అన్నాను బాధగా. 


“నీకు చాలాసార్లు ఫోన్ చేశారా! బిజీ అని వచ్చింది. మెసేజ్ లు కూడా పంపారా! మొన్న సుజాతకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పానే. నీకు చెప్పలేదా?”


బాబాయ్ చెప్పేది వింటుంటే నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కావడంలేదు. మౌనమే నా సమాధానమయింది. 


“సరే అవన్నీ మనం తరువాత మాట్లాడుకుందాం. ఇదుగో మీ అమ్మకు ఫోన్ ఇస్తున్నా. మాట్లాడు.” అన్నాడు బాబాయ్. 


ఫోన్ స్క్రీన్ పై అమ్మ ముఖం చూసి నివ్వెరపోయాను. మూడు నెలల క్రితం అమ్మను వీడియో కాల్ లో చూశాను. అప్పటి రూపానికి, ఇప్పుడు చూసే రూపానికి అస్సలు పోలికే లేదు. ఒక్కసారిగా పదేళ్లు పైబడినట్లుగా వృద్ధాప్య ఛాయలు విపరీతంగా కనపడుతున్నాయి. అమ్మ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు చిహ్నాలుగా నుదురు మీద ముడతలు కనిపిస్తున్నాయి. ముఖంలో అలసట, నీరసం తాండవిస్తున్నాయి. మొబైల్ స్క్రీన్ పై నన్ను చూడగానే ముడుచుకు పోయిన ఆ చిన్ని కళ్ళల్లో వెలుగులు విరజిమ్మాయి. ఎండిపోయిన పెదవులపై చిరుదరహాసం తొణికిసలాడింది. 


“వాసూ! బాగున్నావా నాన్నా! ముఖం ఏమిటి, నీరసంగా కనపడుతున్నది. ఇంకా అన్నం తినలేదా?” అంటూ పలుకరించేసరికి నా గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం కన్నీళ్ల రూపంలో బయటకు ఉరికింది. 


నేను అడగాల్సిన మాటలు అమ్మే నన్ను అడుగుతున్నది. కారుతున్న కన్నీటిని తుడుచుకోకుండా అమ్మను అలానే చూస్తుండిపోయాను. అమ్మ పలకరింపులో అదే ప్రేమ, అదే ఆప్యాయత. ఇన్ని రోజులు నేను ఫోన్ చేయలేదనే కోపం గానీ, అలక గానీ మచ్చుకైనా కనపడలేదు అమ్మలో. 

నా కోసం, నా చదువు కోసం, నా ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడ్డ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో వుంటే ఈ సమయంలొ నేను తన ప్రక్కన లేకపోవడం అమానుషం అనిపించింది. 


“అమ్మా! నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఎల్లుండి ఉదయానికల్లా నీ ప్రక్కనే వుంటాను.” అన్నాను. 


ఆ మాట వినగానే అమ్మ ముఖంలో వెన్నెల విరిసింది. 

"నిజంగా వస్తావా?" అమ్మ ఆనందంతో చూస్తూ అడిగింది. మళ్ళీ వెంటనే

"నీకక్కడ అర్జెంటు పనులేమన్నా వుంటే రావద్దులేరా" అంది. 


"లేదమ్మా. నేను తప్పక వస్తాను" అని నమ్మకంగా అనేసరికి ముడతలు తేలిన అమ్మ ముఖంలో సంతోష తరంగాలు నాట్యమాడాయి. 


పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుమూల పల్లెటూర్లో పుట్టిన నేను చదువులో బాగా రాణించడం చూసి నాన్నను ఒప్పించి, వున్న పొలం అమ్మి అమ్మ నన్ను ఇంజనీరింగులో చేర్పించింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో బెంగుళూరులోని మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ పని చేస్తున్న కాలంలో సహ ఉద్యోగిని సుజాత, నన్ను ఇష్టపడింది. కులం కారణంగా నాన్నకు ఈ సంబంధం అంతగా నచ్చకపోయినా అమ్మ పూనుకుని మా పెళ్ళి జరిపించింది. 


మా పెళ్ళి జరిగిన కాలంలోనే తెలుగు నేలపై అమెరికా వ్యామోహం ఒక మహమ్మారిలాగా నలుదిశలా విస్తరించ సాగింది. అమెరికా అంటే ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా అందరూ భావించేవారు. అక్కడ చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, కొత్త జీవితం ప్రారంభించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుండేవారు. 

అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండేవి. కాబట్టి, మెరుగైన జీవితం కోసం అమెరికా వెళ్లాలనే ఆలోచన చాలా మందిలో ఉండేది. 


‘మా అబ్బాయిని ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాను. చదువు పూర్తి చేసుకుని అక్కడే జాబ్‌ చేస్తున్నాడు. మా అమ్మాయికి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశాను. వారికి పుట్టబోయే బిడ్డకు అమెరికా సిటిజనే’ అంటూ చాలా కుటుంబాలు గర్వంగా, గొప్పగా చెప్పుకోవడం చూసి మిగిలిన వారుకూడా తమ పిల్లలను అదే బాట పట్టించాలని ఉవ్విళ్లూరారు. 


మా నాన్న కూడా మమ్ములను అమెరికా వెళ్ళమని ప్రోత్సహించాడు. వున్న కొద్ది పాటి ఆస్తినీ మా అమెరికా ప్రయాణం కోసం అమ్మాల్సి వచ్చింది. అయినా మేము అమెరికా వెళుతున్నందుకు అమ్మా, నాన్న సంతోషించారే కానీ కించిత్తు బాధ పడలేదు. మా పెళ్ళి నాటికే సుజాత అన్నయ్య అమెరికాలో స్థిరపడ్డాడు. 


అమెరికాలో వున్న మెరుగైన జీవన ప్రమాణాలు, మంచి ఉద్యోగ అవకాశాలు, అక్కడ సంపాదించే డాలర్లు.. ఇవన్నీ నన్ను కూడా అమెరికాపై మోజుపడేలా చేశాయి. సుజాత అన్నయ్య సాయంతో నేనూ, సుజాత అమెరికా విమానం ఎక్కేసాము. 


అమెరికా వెళ్ళిన మొదట్లో నేను డబ్బు సంపాదన పనిలో బిజీగా వుంటే ఇంటి వ్యవహారాలు సుజాత చూసేది. నా మెతక స్వభావం వల్ల కుటుంబపరంగా ముఖ్యమైన నిర్ణయాలన్నీ తనే తీసుకోవడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా నేను సుజాత చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయాను. 


కొద్దికాలం అమెరికాలో జాబ్ చేసి ఎంతో కొంత సంపాదించుకుని ఇండియా తిరిగి రావాలనే నా నిర్ణయాన్ని సుజాత మొదట్లో అంగీకరించినా, తరువాత దాన్ని తోసిపుచ్చింది. 


నా నిర్ణయాన్ని కాదన్నదని సుజాత మీద కొద్ది రోజులు కినుక వహించాను. అయితే అప్పటికే నేను అమెరికా జీవితానికి అడిక్ట్ అయ్యాను. మన దేశంలో ఏ ఆఫీసులో నైనా ఏ పని జరగాలన్నా ఎదురయ్యే లంచగొండి అధికారులు, ఎక్కడా ఏ విధమైన రూల్స్ పాటించని జనం, శుభ్రత లేని రోడ్లు, కొంచెం కూడా సివిక్ సెన్స్ లేని వారిని చూసీ చూసీ వున్నాను కాబట్టి ఇండియా పోవాలని నేనూ పెద్దగా పట్టుపట్టలేదు. 


నాన్న చనిపోయినప్పుడు ఓ నెలరోజులు నేను ఒక్కడినే వెళ్ళి కార్యక్రమాలన్నీ నిర్వహించి వచ్చేశాను. పిల్లలకు పరీక్షలు అనే వంకతో సుజాత రానేలేదు. 

మాట వరుసకు అడిగినట్లు అమ్మను అమెరికా రమ్మని అడిగాను. 


“అక్కడ నేను ఉండలేనురా. ఇక్కడ మీ నాన్న మసలిన ఇంట్లోనే నేనుంటాను. మన చుట్టాలందరూ ఈ ఊరిలోనే వున్నారు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. 


నువ్వు నా గురించి దిగులు పడవద్దు. సంవత్సరానికోసారి నువ్వూ, కోడలు పిల్లలతో వచ్చి వెళుతూ వుండు. అదే చాలు నా జీవితానికి” అని అమ్మ. 


అమ్మను అమెరికా తీసుకువచ్చినా అక్కడ ఇమడలేదు అని ఆలోచించి నేను ఊర్లోనే వున్న బాబాయ్ కి అమ్మను జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి అమెరికా వచ్చేసాను. 


క్రమక్రమంగా నా భావాలు, ఆలోచనలు అన్నీ మారి పోయాయి. అమెరికాలో వుంటున్న అనేక మంది తెలుగు వారిని గమనించాక నాకు అర్థమైంది ఏమిటంటే అందరూ ఇండియాను పొగుడుతారు. గొప్పగా చెపుతారు. కానీ తమ మాతృదేశానికి చుట్టపు చూపుగా అతిథుల్లాగానే వెళతారు. వస్తారు. 


అంతే కానీ అమెరికాను వదిలేందుకు ఇష్టపడరు. దానికి ఏవేవో కుంటి సాకులు చెపుతారు. అమెరికా వ్యామోహాన్ని, బలహీనతను వదులుకోలేక చివరికి నేనూ అలానే తయారయ్యానా అనిపించింది. 


నాకు ఇండియా పోవాలని వుంది కానీ, సుజాత అందుకు ఒప్పుకోవడం లేదు అని నా మనసుకు నేనే నచ్చచెప్పుకునేవాడిని. 


నా వికృత ఆలోచనలకు నాకే ఒక్కోసారి భయమనిపించేది. మానసిక బానిసత్వం అనేది మనుషులను తమ ఆలోచనలు, భావాలు, చర్యలపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. బయటి శత్రువుల కన్నా లోపల వున్న శత్రువులే ఎక్కవ ప్రమాదకారులు. మన ప్రతికూల ఆలోచనలు, భయాలు, బలహీనతలే మనకు నిజమైన శత్రువులు అని ఎప్పుడో, ఎవరో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.

 

ఈ రోజు అమ్మను అలా చూశాక నన్ను నేను నియంత్రించు కోలేక పోయాను. దుఃఖంతో మనసంతా భారంగా తయారయింది. ఇన్ని సంవత్సరాలుగా నన్ను పట్టి పీడిస్తున్న బలహీనతను అధిగమించాల్సిన సమయం ఆసన్నమైందనిపించింది. నేను చేయాల్సిందేమిటో నాకు అవగతమైంది. 


వెంటనే అతికష్టం మీద రాత్రి ఫ్లైట్ కు ఇండియాకు టికెట్ బుక్ చేసుకుని ఇంటికి వచ్చి సుజాతకు చెప్పాను. 


“ఇప్పుడు అంత అర్జంటుగా ఇండియాకు ఎందుకు?” అంటూ సుజాత ఆశ్చర్యంగా చూసింది. 


“అమ్మ ఆసుపత్రిలో వుందని నీకూ తెలుసు. అయినా నువ్వు నాకు చెప్పలేదు. మొన్న బాబాయ్ ఫోన్ చేశాడనే విషయం కూడా చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు?” కోపంగా అడిగాను. 


“మర్చిపోయాను. ప్రతీ నెలా డబ్బులు పంపిస్తూనే వున్నాంగా. ఇప్పుడు నువ్వు పోయి చేసేదేం వుంది.” అంది తాపీగా. 


ఆ క్షణంలో సుజాత నా కళ్ళకు నా సహచరిలా అనిపించలేదు. శత్రువులా గోచరించింది. రెండు చెంపలు వాయించాలనిపించేంత ఆవేశం వచ్చింది. నన్ను నేను నిగ్రహించుకుంటూ

“నా కన్నతల్లి అక్కడ చావుబ్రతుకుల మధ్య పోరాడుతూ నాకోసం కలవరిస్తూ వుంది. ఈ సమయంలో నేను అమ్మ పక్కనే వుండాలి. అందుకే వెళ్తున్నాను.” సుజాతను చూస్తూ అన్నాను. 


బెడ్ రూంలోకి వెళ్ళి సూట్ కేస్ సర్దుకున్నాను. 


“ఎల్లుండి అన్నయ్య వాళ్ళ అమ్మాయి బేబీ షవర్ ఫంక్షన్ వుంది. మనం దగ్గరవుండి అన్నీ చూసుకోవాలి. వారం రోజుల్లో మన రాహుల్ గ్రాడ్యుయేషన్ డే వుంది. పదిరోజుల్లో మీ కంపెనీ వార్షికోత్సవం కూడా వుందని చెప్పావు. మర్చిపోయావా? ఇక్కడ ఇన్ని పనులు పెట్టుకుని ఇప్పుడు ఇండియా వెళుతున్నానని చెపుతావా? నీకేమైనా పిచ్చిపట్టిందా?” సుజాత గట్టిగా అరుస్తోంది. 


మొదటి సారిగా సుజాత అరుపులను ఖాతరు చేయకుండా “నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. దట్స్ఆల్ ” అంటూ సూట్కేస్ తీసుకుని ఎయిర్ పోర్ట్ కు బయలుదేరాను. 

 

హైదరాబాదులో విమానం నుంచి దిగీదిగగానే మోకాళ్ళ మీద వంగి

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’

అనుకుంటూ నేలను ముద్దాడాను. 


  ************************

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page