అన్నా చెల్లెలు

'Anna Chellelu' - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana
'అన్నా చెల్లెలు' తెలుగు కథ
రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రామనాధం మాష్టారు, గాయత్రీదేవి దంపతులది హైదరాబాదులో ఒక మధ్యతరగతి కుటుంబం! వారి అన్యోన్య సంసారం, ఉభయుల అన్యోన్య సహాకారంతో ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే గడిచింది. వారి భావాలకనుగుణంగానే వారిద్దరు వారికిద్దరు అన్నట్టుగా పాతికేళ్ళ కొడుకు రవికిరణ్, ఇరవై ఏళ్ల అమ్మాయి కల్యాణితో వారిదో ఆదర్శ బొమ్మరిల్లు కుటుంబం!!
అనుకూల సిటీ వాతావరణంలో పిల్లలిద్దర్నీ మంచి విద్యాబుధ్ధులతోనే పెంచగలిగారు! కిరణ్ ఇంజనీరింగు పూర్తిచేసి.. తండ్రి ఉద్యోగ విరమణకు ముందే హైదరాబాదులోనే మంచి సాఫ్ట్ వేర్ జాబులో కుదురుకుని కుటుంబ భారాన్ని పంచుకునే స్థాయికి ఎదిగాడు. చెల్లెలు కల్యాణిని కూడా ఇంజనీరింగులో చేర్చి.. చదువుకు ఆటంకం రాకుండా చదివించ గలుగుతున్నారు.
తల్లిదండ్రుల అన్యోన్యత అనురాగాలకు తగ్గట్టుగానే అన్నాచెల్లెలు అనుబంధం కూడా సాంప్రదాయ బధ్ధంగా ఒకరికొకరు ఎంతో అభిమానం ఆత్మీయంగా మెలుగు తుంటారు. కిరణ్ తోబుట్టువు కల్యాణి పట్ల ఎంతో ఆత్మీయంగా బాధ్యతగా అన్నివేళలా కంటికి రెప్పలా చెల్లెలి బాగోగులు కనిపెట్టి చూసుకుంటూ ఉంటాడు!. కల్యాణి కూడా ఇంట్లో, అన్న అవసరాలు చూస్తూ.. ఎంతో ఆత్మీయంగా, .. అడుగడుగునా చేదోడువాదోడుగా సహయంగా నిలుస్తుంది!!
వారిద్దరి అన్యోన్యత, అనుబంధం చూసి వారి ఆత్మీయతకు మురిసి పోతుంటారు తల్లిదండ్రులు. రోజూ ఉదయం స్కూటర్ పై చెల్లెలిని కాలేజీలో దించి ఆఫీసుకు వెళతాడు కిరణ్. సాయంత్రాలు మాత్రం కల్యాణి తమ ఏరియాలోనే ఉండే స్నేహితురాలు మాధురితో కలిసి సిటీ బస్సులోనే ఇంటికి చేరుతుంది.
అన్నా చెల్లెలులో ఎవ్వరు ముందు ఇల్లు చేరుకున్నా మరొకరి కోసం ఎదురుచూపులు పలకరింపుల తర్వాతే ఏదైనా! రోజూ కాలేజీకి అన్న స్కూటరుపై వచ్చే కల్యాణి అదృష్టానికి స్నేహితురాళ్ళు ఈర్ష్య పడి ఆటపట్టించడం అలవాటుగా జరిగేదే!
ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూనే రవికిరణ్ 'అమ్మా!.. చెల్లి వచ్చేసిందా? ' అంటూ వంటింట్లో అడుగు పెట్టి అక్కడ అమ్మ లేకపోయేసరికి అదే ఊపులో.. 'కల్యాణీ.. కల్యాణీ!.. అని చెల్లెలు గదిలో కెళ్ళి ఏదో చెప్పడానికి చెయ్యివేసిన కిరణ్ హఠాత్తుగా వెనుదిరిగిన మాధురిని చూసి అనుకోని సంఘటనకు సిగ్గుపడి 'సారీ!'.. అంటూ వెనుదిరిగాడు.
వెనువెంటనే వెనకే వచ్చిన కల్యాణి.. ' ఏమిట్రా.. అన్నా.. ఆ ఖంగారూ!.. ఒక్క నిమిషం ఆగు!.. పరిచయం చేస్తా.. ' అంటూ ఆపి, .. 'మాధురీ!.. వీడే.. మా అన్నయ్య.. కిరణ్.. ' అనేలోపే, .. 'తెలుసు!.. రోజూ నిన్ను కాలేజీలో దింపేటప్పుడు చూస్తూనే ఉన్నాంగా!..' అంటూ ఉత్సాహంగా బదులు పలికింది మాధురి!
అలా జరిగింది.. వారిద్దరి మొదటి సమాగమం! ఆ తర్వాత కూడా కలిసిమెలిసి తిరిగే స్నేహితురాలి ఇంటికి మాధురి తరచూ వస్తూనే ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళతో చనువు పెరిగిందేకానీ, కిరణ్ తో మాత్రం పరిచయం అప్పుడప్పుడు ఎదురుబెదుర తారసపడటం తప్ప పలకరింపులు పెద్దగా పెరిగింది లేదు! అందుకు ఆ కుటుంబ నేపధ్యం, పెద్దలు నేర్పిన కట్టుబాట్లు, .. తీరుతెన్నులు.. సంస్కారాలే కారణం!
మాధురి మాత్రం, .. స్నేహంతో కల్యాణిని, .. సంస్కారంతో ఇంట్లో పెద్దవారిని.. బాగానే ఆకర్షించింది! మాధురిలోని కలివిడి తనం, .. ఆత్మీయ కలుపుగోలు మనస్తత్వం.. నమ్రత.. పెద్దలనూ మెప్పించాయి!
కాలేజీలో చివరి సంవత్సరం ప్రాజెక్టు చేయవలసిన సమయం ఆసన్న మయింది కల్యాణికి! కాలేజీలో థీరీలో కంటె.. అవకాశమున్నవాళ్ళు ఏదైనా.. వాస్తవ విషయంపై.. పేరున్న కంపెనీ సహకారంతో పరిశోధనా విషయంగా చేస్తే.. సామర్థ్యం, విలువ పెరుగుతాయన్న కాలేజీ యాజమాన్య సూచనతో.. కల్యాణి అన్న కిరణ్ వెంటబడింది!.
తనతో పాటు తోడుగా.. మాధురికి కూడా.. చూడమని ప్రాధేయపడింది అన్నను!. చెల్లి అభ్యర్ధనను కాదనలేక పై అధికారికి తన కుటుంబ భాధ్యత అని చెప్పి.. సానుకూలంగా ఒప్పించి.. ఇద్దరికీ.. స్టూడెంట్ ట్రయినీలుగా తను చేస్తున్న సంస్తలో పర్మిషన్ తీసుకో గలిగాడు కిరణ్!
పై అధికారి సూచన మేరకు..చెల్లెలు కల్యాణిని పక్క మరో ఆఫీసరు వద్దకు, .. మాధురిని..కిరణ్ దగ్గరకు అని నిర్ణయించబడ్డారు! ఇంతకాలం పరిచయం మాత్రమే ఉన్న.. కిరణ్ కు మాధురితో ఎదురుబెదురు చర్చలు, సంప్రదింపులు, .. ముచ్చటించటంతో ఆమెను కొంచెం సన్నిహితంగానే అర్ధం చేసుకునే అవకాశం కలిగింది! పని విషయంలో శ్రద్ధ.. ఆసక్తి.. సూచనలు గ్రహించటంలో అణకువ.. చురుగ్గా పని ముగించే నేర్పు అతడికి బాగా నచ్చాయి!
ఆమె తనపట్ల కనపరిచే నమ్రత చూపిస్తున్న గౌరవభావం అతడిని ఆకర్షించాయి! దానికితోడు లంచ్ విరామ సమయంలో ముగ్గురూ కలిసి చేసే భోజన సమయంలో సాగే పిచ్చాపాటీ సంభాషణల్లో కల్యాణి చేసే సరదా పరిహసాల వల్ల బెరుకు పోయి స్నేహభావం నెమ్మదినెమ్మదిగా ఒకరిపైమరొకరికి ఇష్టం కలగడం మొదలైంది! వారిద్దరిపై ఉన్న అభిమానంతో.. వారిని గమనిస్తున్న.. కల్యాణి ప్రోత్సాహం కూడా.. తోడైంది వారికి!
పక్క కేబిన్ లో ఆఫీసర్ దగ్గర కల్యాణి కూడా ప్రాజెక్టు వర్కు విషయ సేకరణ ప్రక్రియ మొదలు పెట్టింది! అందుకు బుక్సు రిఫర్ చేయడం కోసం లైబ్రరీకి వెళ్ళి వచ్చే దారిలో ఒకరోజు వెనక నుంచి..సన్నగా పొడుగ్గా నీట్ గా ఉన్న యువకుడొకడు..' కల్యాణి గారూ! ' అని పిలిచి.. ' మీరేనా కిరణ్ గారి చెల్లెలు?.. నా పేరు అరవింద్!.. మీరు ట్రైనీగా ఉన్న సెక్షన్ లోనే జూనియర్ని!.. మీకు.. అవసరమైన సాయం అందించమని.. బాస్ నిన్ననే చెప్పారు.. ఏ అవసరాని కయినా మీరు మొహమాటం లేకుండా నన్నడగొచ్చు! ' అంటూ గలగలా మాట్లాడుతూ.. ' రండి.. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం! ' అని కాంటీన్ కు లాక్కు పోయినంత పని చేసాడు! ఆఫీసులోని మనిషినని చెప్పడంతో కాదనలేక పోయింది!
అలా మొదలైన పరిచయ ఉపోద్ఘాతం సమయం చిక్కినపుడల్లా ఏదో మిషతో మాటకలిపి.. ఆప్తమిత్రుడిలా.. చనువు తీసుకుంటూ వచ్చాడు! కల్యాణికి కూడా అరవింద్ ఎప్పుడూ సరదా కాలక్షేపం తప్పితే.. కుదురుగా కూర్చుని పనిచేస్తుండగా చూడలేదు! అదే విషయం.. అడిగితే..' నా కెందుకండీ ఈ ఉద్యోగం!.. నేనే.. త్వరలో వీలుచూసుకొని సొంతంగా.. సంస్ధ పెట్టే స్తోమత నాకుంది ' అని దర్పంగా చెప్పాడు.
ఒక రోజు సాయంత్రం ఆఫీసు నుంచి అనీజీగా ఉండి.. ముందుగా ఇంటికి వెళ్తుంటే.. అరవింద్ గమనించి.. వెంటవచ్చి.. తన కార్లో డ్రాప్ చెయ్యడానికి రెడీ అయి వచ్చాడు. మొహమాటంతో కాదనలేకపోయింది కల్యాణి. దారిలో మాటల్లో ఇంట్లోవారి విషయాలు, వాకబు చేస్తూ.. ' మీరు.. డిగ్రీ అయిన తర్వాత.. పైచదువులకా.. ఉద్యోగ ప్రయత్నమా.. లేక..' అంటూ సాలోచనగా చూసాడు కల్యాణి వంక..
అతని భావం అర్ధమైన కల్యాణి.. 'మాది మధ్య తరగతి కుటుంబం.. ఇంత వరకు చదవడం కూడా.. అన్నయ్య చలవే!.. ఆ తర్వాత ఏమిటన్నది.. పరిస్థితులే నిర్ణయిస్తాయి! ' అంది నవ్వుతూ!
'మీ లాంటివారి అవసరం నాలాంటివారి కెంతో వుంది!.. ఎలా జారవిడుచుకోగలం!' అంటూ.. శ్లేషగా నవ్వాడు.
ఇంతలో ఇల్లు చేరారు! సాదరంగా లోనికి పిలిచి మర్యాదగా అమ్మానాన్నకు పరిచయం చేసి పంపించింది కల్యాణి. తర్వాత ఖంగారు పడుతూ ఇల్లు చేరిన కిరణ్.. అరవింద్ ఇంటికి దింపాడన్న వివరం తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు!
ప్రాజక్టు పనితో పాటు ట్రయినింగు సమయం ముగిసే సమయానికి మాధురి కిరణ్ ల మధ్య, ఆత్మీయ అనుబంధం బలపడింది!, .. అదే సమయంలో అరవింద్ దర్పానికి కల్యాణి కూడా ఆకర్షణకు లోనయింది. పరీక్షల సమయం చదువుల హడావుడిలో కాలం స్తబ్దుగా గడిచిపోయింది! స్నేహితురాళ్ళిద్దరూ ఆశించిన విధంగా తృప్తిగా పరీక్షలు రాసి ముగించారు!
కల్యాణి కాలేజీ చదువు ముగియడం, .. కిరణ్ కూడా ఉద్యోగంలో మంచిగానే స్థిరపడటంతో.. పెద్దలు రామనాధం మాష్టారు, గాయత్రీ దంపతులు పిల్లలిద్దరి పెళ్లిళ్లు, వీలయితే.. కలిపి చేసేస్తే బాధ్యత తీరుతుందనే భావనతో.. ప్రయత్నాలు ప్రారంభించారు!
విషయం చూచాయగా తెలుసుకున్న కల్యాణి.. కిరణ్ తో ఉన్న సాన్నిహిత్యం, చనువుతో.. ఇంట్లో ప్రయత్నాలు వివరించి.. ముందుగా ముచ్చటించి అన్నతో.. తన ఆలోచనలు పంచుకోవాలని వారాంతం శెలవు రోజున కిరణ్ ను ఏకాంతంగా టెర్రస్ పైకి తీసికెళ్ళి ప్రస్తావన తెచ్చింది!
'అన్నయ్యా!.. అమ్మానాన్నా.. మన పెళ్ళిళ్ళ ఆలోచనలో ఉన్నార్రా!.. ఈ మధ్య నీవు కూడా.. మాధురి పట్ల ఇష్టంతో.. సానుకూల దృక్పధంతోనే ఉన్నావని తోస్తోంది! నా స్నేహితురాలని కాదుగానీ.. తను నీకు సరైన జోడీ అని ఎప్పటినుంచో నా భావన!.. నీకు ఇష్టమైతే.. మీ పెళ్లికి.. నాది కూడా పూర్తి మద్దతు! నాకు తెలిసి.. అమ్మానాన్నకు కూడా.. మాధురి అంటే మంచి అభిప్రాయమేననిపిస్తోంది!.. నువ్వు సరేనంటే.. అమ్మకు చెపుతాను!' అంటూ..
ముగించింది.
చెల్లెలి మాటలకు విస్మయంగా చూసి.. 'అయితే.. నా చెల్లి.. నాకు పెళ్ళి పెద్ద.. అన్నమాట! అయినా.. నీ పెళ్ళి చెయ్యకుండా నేనెలా చేసుకుంటాననుకున్నావు? ముందు నీకు వరుణ్ణి చూసిన తర్వాతే.. నా సంగతి!' అని తేల్చేసాడు.
'అదే అమ్మానాన్న ప్రయత్నం కూడా!.. మనిద్దరి వివాహం వీలయితే ఒకేసారి చేసెయ్యాలనే వాళ్ళ యోచనగా తోస్తోంది!.. అందుకేగా.. సానుకూలంగా.. ముందుగా.. నిన్ను సంప్రదిస్తున్నదీ!..' అంటూ.. అన్నకేసి అర్ధవంతంగా చూసి.. క్షణం ఆగింది!
చెల్లి, ఏదో.. చెప్పాలని తటపటాయిస్తోందని అర్ధమయ్యింది కిరణ్ కు. ఏమయి ఉంటుందా.. అని మనసులో పరిపరి విధాల ఆలోచనలతో సతమత మయ్యాడు. వెంటనే.. తేరుకుని చెల్లాయి ముఖం లోకి చూస్తూ.. 'ఏమి చెప్పాలనుకుంటున్నావ్?.. ఈ అన్న దగ్గర సంకోచం దేనికీ?.. పై చదువులకు వెళ్ళాలని ఉందా?..' అంటూ.. కల్యాణి మనసులో విషయం రాబట్టాలని ఎదురు ప్రశ్నలు వేశాడు.
'అదికాదన్నయ్యా!.. మీ.. ఆఫీసులో జూనియర్.. అరవింద్ గురించి.. నీ అభిప్రాయం.. తెలుసుకుందామని..' అంటూ.. నాన్చేసింది.
విషయం అర్ధమైంది కిరణ్ కు.
అన్నయ్య, .. ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమిస్తున్నాడు! చెల్లెలు.. ఆ ప్రేమకు మద్దతు తెలిపింది. చెల్లి కూడా.. ఓ అబ్బాయిని.. ఇష్టపడుతోంది!.. కానీ.. అన్నయ్య.. ఆ నిర్ణయాన్ని ఆమోదించలేక పోతున్నాడు!
చెల్లికి.. ప్రేమ మాధుర్యం, గొప్పతనమే తెలుసు! కానీ.. అన్నకు.. మగబుధ్ధి వికృతరూపమూ.. దాని పర్యవసానం.. కూడా తెలుసు!
'చూడు.. కల్యాణీ!.. అన్న మీద నమ్మకంతో నువ్వు నన్ను సంప్రదిస్తున్నావు. అన్నగా అంతకుమించిన బాధ్యతతో నేనూ ఆలోచించి చెపుతున్నాను!
ఆ రోజు మొదటిసారి అరవింద్ నిన్ను కార్లో ఇంటి దగ్గర దించినప్పటి నుంచీ అతనిని గమనిస్తూనే ఉన్నాను! పని మీద శ్రద్ధ ఉన్నవాడు, .. నిలకడైనవాడు కాదన్నది నువ్వూ గమనించే ఉంటావు! డాబు, జల్సా, సరదా కాలక్షేపంతో.. కాలం గడిపేసేవాడు, ఎంత ధనికుడైనా.. ఏ వ్యాపారంలో నైనా కూడా రాణించలేడు.
మాధురి అంటావా.. మన కుటుంబానికి పరిచితురాలు, మన అందరి అభిమానం పొందింది!. రేపు.. పెళ్ళై.. ధనిక ఇంట్లో.. మన కుటుంబ రీతి రివాజులు, పెరిగిన వాతావరణానికి భిన్నంగా ఉండే పరిస్థితుల్లో ఇమిడి.. జీవితాన్ని.. పరాధీనంగా గడపటం.. సుఖప్రదమా?.. కాస్త ఆలోచించు! అయినా.. అరవింద్ కూడా.. ఇష్టంతో సరదాగా కారులో జల్సాగా.. తిరిగినంత మాత్రాన.. అంతస్తును కాదని.. కుటుంబ పెద్దల అభీష్టానికి విరుధ్ధంగా.. ప్రేమ వివాహనికి.. నిలబడ గలుగుతాడన్న నమ్మకం.. నాకు లేదు! కొంతకాలం ఆగి చూస్తే.. అదీ తెలుస్తుంది!.. ప్రేమా ఆకర్షణకు ఎంతవరకు నిలబడి.. ఇంట్లో వారిని ఒప్పించి.. నెగ్గుకు రాగలడోనన్నది!? ఈలోగా.. నీవు మాత్రం.. ఏలాంటి చొరవ చూపొద్దని.. అన్నగా.. నా హెచ్చరిక!
త్వరలో.. మీకూ ఉద్యోగాలొస్తే.. స్వతంత్రంగా జీవించగలుగుతారు! మీరూ.. వ్యక్తులుగా బలపడతారు! స్వతంత్ర భావాలతో మీ భావి జీవితాలను నిర్దేశించు కోగలుగుతారు! మంచి జీవితాన్ని మీ అభిమతం మేరకు.. తీర్చి దిద్దుకో గలుగుతారు! పెళ్లికి తొందరపాటు నిర్ణయం తగదు! వివాహబంధం నాలుగు కాలాల పాటు పటిష్టంగా నిలవాలంటే.. పెళ్ళి అనేది.. సాంప్రదాయంగా.. అందరి మన్నన ఆశీస్సులతో జరగడం అభిలషణీయం! ' అంటూ..
తన అభిప్రాయం లోకం పోకడ వివరిస్తూ.. చెల్లి శ్రేయస్సు కోరుతూ.. నచ్చచెప్పాడు కల్యాణికి.. అన్నగా కిరణ్!
అన్న చెప్పిన.. కఠోర సామాజిక వాస్తవాల్ని.. అవగతం చేసుకుని.. అంగీకారంగా.. తల పంకించి..
మిన్నకుండి పోయిందా విజ్ఞురాలయిన చెల్లెలు!!
సమాప్తం!
గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/vsg
ముందుగా మన తెలుగు కధలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కధలను, కధకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!
నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు. నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.
వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.
ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను. స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!