top of page

కంటేనే అమ్మ అని అంటే ఎలా? - పార్ట్ 1

Updated: Aug 23

#SripathiLalitha, #శ్రీపతిలలిత, #కంటేనేఅమ్మఅనిఅంటేఎలా, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Kantene Amma Ani Ante Ela - Part 1/2 - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 21/08/2025

కంటేనే అమ్మ అని అంటే ఎలా - పార్ట్ 1/2  పెద్ద కథ ప్రారంభం

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

“అంజలీ! విశ్వతేజ ఫోన్ త్వరగా రా!” ఫోన్ స్పీకర్ లో పెట్టి పిలిచాడు డాక్టర్ రవీంద్ర. 


“గుడ్ న్యూస్, నాకు ఎంఎస్ లో బంగారు పతకం వచ్చింది, వచ్చే నెలలో కాన్వకేషన్, మీకు టికెట్స్ బుక్ చేశాను” కొడుకు విశ్వతేజ చెప్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది అంజలి.


“ఇంత మంచి రోజు చూడకుండానే, దేవుడు నిన్ను తీసుకెళ్లాడు, ఈ సంతోషమంతా నన్ను అనుభవించమని నువ్వు నాకు వరమిచ్చావు స్వర్ణక్కా!” తేజ గదిలోని స్వర్ణ ఫోటోని చూస్తూ అనుకుంది అంజలి.


వెంటనే లక్ష్మీపతిగారికి ఫోన్ చేసి ఆయనకి, శ్రీలక్ష్మి, అనసూయలకి శుభవార్త చెప్పింది “మన తేజ బంగారు పతకం గెలుచుకున్నాడు” అంజలి ఆనందంగా చెప్తే, “వాడు నీ కొడుకు కదమ్మా! నీ పెంపకంలో గొప్పవాడయ్యాడు” ఆనందంగా అన్నారు వాళ్ళు.


“ఈ రోజు స్వర్ణ ఉంటే ఎంత సంతోషించేదో” అనసూయ అంటే, “మన స్వర్ణ అక్కడే ఉందికదా” అన్న శ్రీలక్ష్మి మాటలకి అవునన్నట్లు తలూపారు లక్ష్మీపతిగారు.


తేజ విజయం గురించి, అందరికీ సంతోషంగా ఫోన్లు చేసి చెప్తున్న కోడలిని చూస్తూ,

“అంజలీ! మాకు భోజనం పెట్టేదుందా? నీలాగానే ఆనందంతో ఉబ్బిపోయి కడుపు నింపుకోమంటావా?” నవ్వుతూ అంది శ్యామల.


“అయ్యో అత్తయ్యా! ఈ హడావిడిలో పడి టైం చూడలేదు నేను. ఒక్క నిమిషంలో మీకు భోజనం పెడతాను” అంటూ వంటింట్లోకి పరిగెత్తింది.


“ఒట్టి పిచ్చి పిల్ల!” శ్యామల నవ్వుతూ అంటే,

“పిచ్చిది కనకనే తనకంటే వయసులో పదేళ్లు పెద్దవాడిని, పిల్లవాడి తండ్రిని పెళ్లి చేసుకొని, సొంత తల్లికంటే ఎక్కువగా చూస్తోంది” శ్యామల భర్త రామ్మోహన్ అన్నాడు. 


భోజనాలు అయ్యాక రామ్మోహన్, శ్యామల రూమ్ లోకి వెళ్లారు. రామ్మోహన్ నిద్ర పోయాడు కానీ శ్యామలకి నిద్ర పట్టలేదు. ఆలోచనలు వెనక్కి వెళ్లాయి.


రామ్మోహన్, శ్యామలకి ఒక కొడుకు,ఒక కూతురు. రామ్మోహన్ హైకోర్టు జడ్జి. మంచి హోదా, ఆస్తితో పాటు చక్కని భార్య, రత్నాల్లాంటి పిల్లలు.

ఈ కుటుంబాన్ని చూస్తే బంధుమిత్రులలో గౌరవంతో పాటు చిన్న అసూయ కూడా ఉండేది. కూతురు శ్రీదేవి, భర్త రాజేష్, ఇద్దరు పిల్లలతో బెంగళూరులో ఉంటుంది.


కొడుకు డాక్టర్ రవీంద్ర. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుని బాగా పేరు, డబ్బు సంపాదిస్తున్నాడు. రవీంద్రకి మంచి కుటుంబాల నుంచి తమ కూతుర్లని ఇస్తామని, కట్నంతో పాటు ఆస్తి కూడా ఆశ చూపించారు.


చివరికి వైజాగ్ లో పెద్ద అడ్వొకేట్ అయిన లక్ష్మీపతి, శ్రీలక్ష్మిల ఏకైక కుమార్తె స్వర్ణతో రవీంద్ర వివాహం జరిగింది. స్వర్ణ పేరుకి మాత్రమే కాదు, మనిషి బంగారు రంగుతో, తీర్చిదిద్దిన కనుముక్కు తీరుతో కళ్ళు తిప్పుకోలేని అందగత్తె.


పెళ్ళిలో స్వర్ణ నగలమీద క్విజ్ లు నడిచాయి. వజ్రాల నెక్లెస్ ఖరీదా, డైమండ్ జడ ఎక్కువ రేటా, వడ్డాణం ఎంత ఉంటుంది? వగైరా వగైరా. ఎర్రటి కంచిపట్టు చీర నిండా జరీతో నేసిన తామర పూలు, అంచుల వెంబడి జరీ ఏనుగులు ఒంటినిండా నగలతో అందగత్తె అయిన స్వర్ణ నడిచి వస్తున్న లక్ష్మీదేవిలా ఉంది. పెద్దవాళ్లు రామ్మోహన్, శ్యామల లను చూసి అసూయపడితే, వయసు కుర్రాళ్ళు రవీంద్ర అదృష్టానికి కుళ్లుకున్నారు. మగపెళ్ళివారికి లక్ష్మీపతి గారు చేసిన మర్యాదలు ‘నభూతో న భవిష్యతి’ అన్నట్టు ఉన్నాయి.


“ఇంత డబ్బులో పెరిగింది, బాగా పొగరుగా ఉంటుంది, నాలుగు రోజుల్లో వేరే కాపురం పెట్టదా?” అనుకున్న అందరి ఆలోచనలు అబద్ధం చేస్తూ, స్వర్ణ మెట్టింట్లో అందరికీ తల్లో నాలిక లాగా ఉండేది.


రవీంద్ర జీవితం పూలనావలా సాగిపోతోంది. మనసెరిగిన భార్య, డాక్టర్ గా మంచి పేరు, రెండుచేతులా సంపాదన, దేనికీ లోటు లేకుండా ఆనందంగా గడిచిపోతోంది.


పెళ్లైన రెండేళ్లకి విశ్వతేజ పుట్టాడు. దౌహిత్రుడు పుట్టాడని లక్ష్మీపతి ఆనందానికి హద్దులు లేవు. తల్లి అందం, తండ్రి తెలివి, పుణికి పుచ్చుకుని తేజ అందరికీ ముద్దు బిడ్డ అయ్యాడు.


తేజ పుట్టాక దాదాపు అయిదేళ్ళయినా మళ్లీ గర్భం రాలేదు స్వర్ణకి.


ఈ మధ్య బాగా నీరసంగా ఉండడం, చిన్న పనికే అలసిపోవడం, విపరీతమైన నడుం నొప్పితో బాధ పడుతోంది. మాత్రలు వాడినా తగ్గలేదు.


ముందు జనరల్ పరీక్షలు చేయించిన రవీంద్రకి, రిపోర్ట్స్ కొంచెం తేడాగా అనిపించాయి.


అనుమానం వచ్చిన రవీంద్ర, స్వర్ణని గైనిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు. ఆవిడ అన్ని పరీక్షలు చేసి, బ్రెస్ట్ క్యాన్సర్ అని అనుమానపడి, ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఆయన మరికొన్ని పరీక్షలు చేయించాడు.


స్వర్ణ రిపోర్ట్స్ చూసిన ఆయన “బ్రెస్ట్ క్యాన్సర్, నాలుగో స్టేజిలోఉంది, ఇప్పటికే ఎముకలకి కూడా పాకింది, కీమో తప్ప వేరే దారి లేదు. అది కూడా ఎంతవరకు పని చేస్తుందో తెలీదు. ఏ వైద్యం అయినా మహా అయితే, ఆరునెలలకు మించి బతకదు” అని చెప్పాడు.


‘తను డాక్టర్ అయిఉండి, భార్య ఆరోగ్యం పట్టించుకోలేక పోయానా?’ అని రవీంద్రకి గుండె పగిలిపోయింది. రామ్మోహన్, శ్యామల హతాశులయ్యారు. ఒక్కసారిగా కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.


ఈ విషయం విన్న లక్ష్మీపతి, శ్రీలక్ష్మి కుంగిపోయారు. “ఒక్కగానొక్క కూతురికి ఈ జబ్బు ఏమిటి?” అని ఏడుస్తూ హైదరాబాద్ వచ్చేసారు. రోజు రోజుకీ కృశించిపోతున్న స్వర్ణని చూస్తే అందరికీ దుఃఖం ఆగడంలేదు.


లక్ష్మీపతి కూతురు ఉన్నంత కాలం తమ దగ్గరే ఉంటే మంచిదని, స్వర్ణని హైదరాబాద్ లోని తమ ఫ్లాటుకి తెచ్చారు. తేజ అయిదేళ్ల పిల్లాడు, స్కూల్ కి వెళ్తున్నాడు, చాలా హుషారుగా ఉండే వాడిని చూసుకునే ఓపిక స్వర్ణకి లేదు. స్వర్ణ కోసం ఒక నర్స్ ని పెట్టారు. ఇంతమందికి అన్నీ చూసుకోవడం శ్రీలక్ష్మికి కష్టం అయేసరికి, వెంటనే అనసూయకి ఫోన్ చేశారు. 

ఆవిడ శ్రీలక్ష్మికి పిన్ని కూతురు. భర్త పోతే, కూతురు అంజలిని పెట్టుకుని లక్ష్మీపతిగారి దగ్గరే ఉంటుంది. ఆర్థికంగా తక్కువలో ఉన్న అనసూయని, శ్రీలక్ష్మి ఆదుకుంది. తమ ఇంట్లో వెనకాల ఉన్న రెండుగదులు ఉండటానికి ఇస్తే, అనసూయ, శ్రీలక్ష్మికి ఇంట్లో సాయం చెయ్యడమే కాక, వీరికి తెలిసిన వాళ్ళ ఇళ్లలో వంటలు, పండగలకి పిండివంటలు చేసి ఇవ్వడం లాంటివి చేస్తూ, అంజలిని డిగ్రీ చదివించింది. ప్రస్తుతం అంజలి ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తోంది.


లక్ష్మీపతిగారింట్లో ఏ అవసరమైనా అనసూయ, అంజలి అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. శ్రీలక్ష్మి అనసూయకి ఫోన్ చేసి విషయం చెప్తే “మేము ఇద్దరం వచ్చి కొన్ని రోజులు మీకు సాయంగా ఉంటాం” అంది అనసూయ.


ఇరవైఅయిదేళ్ళ అంజలి చామనఛాయ, పెద్ద కళ్ళు, పెద్ద జడతో చూడడానికి సామాన్యంగా ఉన్నా, ఆమె నడవడిక చూసిన వాళ్ళకి, అందం కంటే, మనసుకి ఆనందంగా అనిపిస్తుంది.


చదివిన డిగ్రీకి, ఉన్న ఊళ్లో వచ్చిన ఉద్యోగం చేస్తూ, తల్లీ కూతురు గడుపుతున్నారు. ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసే తాహతు లేదు. అంజలి పెళ్లి కూడా గంతకి తగ్గ బొంతతో, శ్రీలక్ష్మి సాయంతోనే చెయ్యాలని అనసూయ ఆశ.


శ్రీలక్ష్మి, స్వర్ణ కంటే అయిదేళ్ళ చిన్నదైన అంజలిని చిన్న కూతురిలా చూసేది. స్వర్ణ తన స్నేహితులకి అంజలిని చెల్లిగానే పరిచయం చేసేది. ఇద్దరూ కలిసి సినిమాలకి, షాపింగ్ లకి స్వర్ణ బైక్ మీద తిరిగేవారు.


ఇప్పుడు కీమో ట్రీట్మెంట్ తో జుట్టు ఊడిపోయి, చిక్కి శల్యమై మంచానికి అతుక్కుపోయిన స్వర్ణని చూసి కళ్లనీళ్ల పర్యంతమైంది అంజలి.


అంజలి వచ్చాక తేజ పోషణ తానే తీసుకుంది. వాడిని తయారు చెయ్యడం, స్కూలుకి పంపడం, నర్స్ ఉన్నా స్వర్ణ అవసరాలు కూడా చూసేది. తేజ స్కూల్ నుంచి వచ్చాక కాసేపు ఆడుకోవడానికి తీసుకెళ్లి హోమ్ వర్క్ చేయించి పడుకోబెట్టేది. కానీ తేజ మాత్రంలేస్తూనే తల్లి దగ్గరికి పరిగెత్తేవాడు. “నువ్వే రెడీ చెయ్యి, నువ్వే అన్నం పెట్టు” అని గొడవ చేసే వాడు.


ఆ టైంలో స్వర్ణకి గుండె పిండినట్టయ్యేది.

స్వర్ణకి. రోజురోజుకీ తన పరిస్థితి తెలుస్తోంది. ఏదో వైద్యం చేసినా ఎక్కువ రోజులు బతకదు. తనకి ఏమైనా అయితే, రవీంద్రకి ఏడాది లోగా ఇంకో అమ్మాయిని ఇస్తామని, ఆడపిల్లల తల్లితండ్రులు పోటీ పడతారు. కానీ తన కొడుకు గతి? తల్లీతండ్రికి డబ్బుకి లోటు లేకపోయినా వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళమీద పిల్లల భారం మోపడం న్యాయం కాదు.


తను ఉండగానే, తనలోటు తెలియకుండా రవీంద్రని చూసే భార్యని,తేజని బాగా చూసుకుని వాడిని తీర్చిదిద్దే ఒక తల్లిని వెతకాలి.ఇదే ఆలోచన స్వర్ణని వేధిస్తోంది. ఈ మధ్య అంజలిని చూస్తే ఆ ఆలోచన ఒక రూపు దిద్దుకుంటోంది.


అప్పటినుంచి అంజలిని ఆ దృష్టిలో పరిశీలనగా చూడడం మొదలుపెట్టింది.


తేజ తనని వదలలేక పోవడం తల్లిగా తనకి తృప్తిగా ఉన్నా, అంజలి సంరక్షణలో బావున్నాడని స్వర్ణకి సంతోషంగా కూడా ఉంది.


పెళ్లికాని ఒక అమ్మాయి, చిన్నపిల్లాడిని అంత ఓర్పుగా, ప్రేమగా చూస్తుంది. తేజ ఒకోసారి బాగా మొండికేస్తాడు, అంజలిని సరిగ్గా అన్నం కూడా తిననివ్వడు.


ఒకోసారి నిద్ర కూడా పోనివ్వకుండా రాత్రంతా ఏడుస్తాడు. అపుడు కూడా, వాడిని విసుక్కోకుండా నిద్ర పుచ్చుతుంది. వాడికి, తల్లి ఎక్కువ రోజులు బతకదని తెలిసిపోతోందేమో, అందుకే అలా మారాం చేస్తున్నాడు అనిపిస్తుంది.


తన మనసులోని మాట తల్లితో అంటే సరిగ్గా అర్థం చేసుకోదు, అదే తండ్రి అయితే, ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడని, ఆయనతో తన మనసులోని మాట చెప్పింది.


“నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు తల్లీ! నీకు తగ్గి, మామూలుగా నీ భర్తతో హాయిగా కాపురం చేస్తావు “ అన్నారు ఆయన.


“పిచ్చి నాన్నా! మీరు నన్ను ఇంకా మీ చిన్నారి స్వర్ణ అనుకుంటున్నారు. నేను కిందటిసారి డాక్టర్ ని స్పష్టం గా అడిగాను. నాకు ఆట్టే సమయం లేదు, ఈ లోగా నా భర్తకి, కొడుకుకి నా లోటు తెలియకుండా చూసుకునే అమ్మాయిని చూసి, నేను పెళ్లి చేస్తే ఈ జీవితాన్ని హాయిగా ముగిస్తాను. నాకు అందుకు అంజలి సరైంది అనిపిస్తోంది” అంది భారంగా స్వర్ణ.


“రవి ఒప్పుకుంటాడా!” 


“నేను ఒప్పిస్తాను” ధైర్యంగా అంది.


మర్నాడు “అత్తగారికి ఫోన్ చేసి తలుపులు వేసుకుని ఏమి మంతనాలు చేసింది?” అని శ్రీలక్ష్మి అడిగితే తండ్రి, కూతురు ఇద్దరూ మాట్లాడలేదు.


ఆ తర్వాత, శ్యామల కూడా తరచూ రావడం మొదలుపెట్టింది.


రవీంద్రకి, స్వర్ణ ఆలోచన శ్యామల చెప్పడంతో, అతను కూడా అంజలిని గమనించాడు.


భార్యకి ఇలా అవడం బాధగా ఉన్నా “తల్లి లేని పసివాడిని ఎలా పెంచాలి? ఇంకో పెళ్లి చేసుకుంటే తనకి భార్య వస్తుంది, కానీ ఆమె తన కొడుకుకి తల్లి అవగలదా? అలా అని జీవితనటం పెళ్లి లేకుండా గడపలేడు” రవీంద్ర మధనపడుతున్నాడు.

ఎక్కువ సమయం తీసుకోకుండానే, రవీంద్ర ఒప్పుకున్నాడు. ఇంకా అంజలి ఒప్పుకోవాలి.


ఒకరోజు శ్యామల వెళ్తూ, “తేజని రెండురోజులు ఉంచుకుని పంపుతాను” అని తీసుకెళ్లింది.


“ఏడుస్తాడేమో అత్తయ్య గారు. ఈ మధ్య బాగా మొండిగా అయ్యాడు. వాడు మిమ్మల్ని విసిగిస్తాడు” అంది అంజలి.


“రేప్పొద్దున్న నీకు పెళ్లై అయితే, వీడిని కూడా అత్తగారింటి తీసుకెళ్తావా ఏంటి?” నవ్వుతూ అని వెళ్తున్న శ్యామల మాటలు, చెంప పెట్టులా అనిపించాయి అంజలికి.


“అవును వాడు తన కొడుకు కాదు! ఎందుకు అంత ప్రేమ పెంచుకుంది వాడి మీద” కళ్ళలో నీళ్లు వచ్చాయి అంజలికి.


అప్పుడే స్వర్ణ నెమ్మదిగా అంజలిని పక్కన కూర్చోమని,

“వాడిని ఎప్పటికీ నీ కొడుకుగా చూసుకోగలవా అంజలీ !” స్వర్ణ మాటలకి బిత్తరపోయింది.


“నేను నీ బీదతనాన్ని ఆసరా చేసుకొని అనడంలేదు. నేను పోయాక, నా భర్తకి భార్య దొరుకుతుంది కానీ, నా కొడుకుని ఇంత ప్రేమగా చూసే అమ్మ దొరకదు. ఇలా రెండో పెళ్లి వాడిని, పిల్లలున్న వాడిని చేసుకోమని అడగడం తప్పే, నా తర్వాత రవీంద్ర గురించి, కొడుకు గురించి, ఎలా అనే బాధతో నా ప్రాణం పోవడం లేదు.

నా భర్తని, కొడుకుని ఒక మంచి అమ్మాయికి అప్పచెపితే, నేను ధైర్యంగా ప్రాణం వదులుతాను” ఏడుస్తూ అన్న స్వర్ణ మాటలకి అంజలి కూడా ఏడ్చేసింది. 


“అక్కా! నీకేం కాదు” 


“అందరూ అదే పాట.. దేవుడి పిలుపు రోజూ వినిపిస్తోంది, కానీ నేనే ఇంకొక్కరోజు అంటూ ఆపుతున్నాను” నీరసంగా అంది స్వర్ణ.


నిజమే ఇంట్లో అందరికీ తెలుస్తోంది స్వర్ణకి ఎక్కువ సమయం లేదని.

“నువ్వు ఆలోచించుకో అంజలీ. రవి, బంగారం. నేను ఇంకోళ్లకి అప్పగించలేను”


“నాకు ఒక్కటే కోరిక ఉంది అక్కా. నా కడుపున ఒక బిడ్డ పుట్టాలి, ఆ కోరిక తీరుతుందంటే నాకు సరే!” అంది అంజలి.

 “నీకు వాగ్దానం చేస్తున్నాను నీ లోటు తెలియకుండా పిల్లలని పెంచుతాను”


“ఓస్ అంతేనా. వచ్చే ఏటికి నేను నీ కడుపున పుడతాను, నిన్ను వదులుతాను అనుకున్నావా? నువ్వు వాళ్ళని ఎలా చూస్తున్నావో రోజూ చూడద్దా!”


ఇంత బాధలోనూనవ్వుతూ మాట్లాడిన స్వర్ణ ని చూసి “ఇంత మంచి అమ్మాయికి ఇంత తక్కువ ఆయుర్దాయం ఎందుకు ఇచ్చాడు దేవుడు” అని ఏడ్చింది అంజలి.


========================================================================

ఇంకా వుంది..


======================================================================== 


శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.


Comments


bottom of page