top of page
Original_edited.jpg

మైత్రి 

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #Maithri, #మైత్రి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

ree

Maithri - New Telugu Story Written By - Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 20/08/2025

మైత్రి - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


“అసలు ఎందుకు ఇలా చేశావు?. ” ఫోన్ ఎత్తగానే ఆ మాటే వినిపించింది. 


“నాకు ఇష్టం లేదు. ” సమాధానం ఇచ్చింది. 


“ఇలా వదులుకోవడానికేనా రాత్రి పగలు కష్ట పడ్డావు?. నువ్వు మెచ్చిన సైంటిస్ట్ ఉదోగ్యం కదా, పైగా ఇస్రో లో. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?. ఎంతమందికి వస్తుంది ఇలాంటి అవకాశం, అదృష్టం?. ” అసహనంతో మాట్లాడుతున్నాడు భర్త రామచంద్ర. 


“ఇప్పుడు ఎందుకో నాకు ఈ ఉద్యోగమే నచ్చింది.. ”అని అంది మైత్రి. 


“ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో, నా మాట విను. ” నచ్చజెప్పటానికి చూసాడు రామచంద్ర. 


“మీరు ఎన్ని చెప్పినా వ్యర్ధం. నిర్ణయం తీసుకోవడం జరిగి పోయింది. ” ఖచ్చితంగా చెప్పింది మైత్రి. 


“సరే నీ ఇష్టం” అని ఫోన్ పెట్టేసాడు రామచంద్ర కోపంతో.. 


మళ్ళీ వెంటనే ఫోన్ మ్రోగింది, చూసే సరికి తండ్రి కృష్ణారావు ఫోన్ చేస్తున్నాడు. వేగంగా ఫోన్ ఎత్తి, “హల్లో నాన్న చెప్పండి!. ఎలా వున్నారు?. ” అని అడిగింది మైత్రి. 


“తల్లి!, మరొక్క సారి ఆలోచించుకో. నీ నిర్ణయం కారణంగా నీ భవిష్యత్తు ప్రమాదం లో పడనుంది. ఇన్నాళ్లంటే ఏదో ఉద్యోగం చేయాలని అక్కడ వున్నావు. మరి ఇప్పుడు నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వచ్చింది కదా. మరి ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?. ఒకసారి నేను చెప్పేది విను తల్లి. ” బుజ్జగిస్తూ చెప్పాడు.. 


“నాన్న!, అందరికీ ఎన్ని సార్లు చెప్పాలి?. నా నిర్ణయం ఇదే. నేను ఈ ఉద్యోగంలోనే వుంటాను. ” అని మరొక్క సారి మైత్రి చెప్పడం తో, మరో మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు తండ్రి. 

 

 ********


మైత్రి ఎం. టెక్ పూర్తిచేసి, ఇస్రోలో ఉద్యోగమే ధ్యేయంగా సన్నద్ధత అవుతుంది. అనుకోకుండా ఒక రోజు తన కాలేజీ ప్రిన్సిపాల్ రవి కనిపించారు. రవికి మైత్రి అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆమె చాలా తెలివైనది. నాయకత్వ లక్షణాలు మెండుగా ఆమెలో వున్నాయి. ఆమె ప్రొఫెసర్ గా వస్తె పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని అతని ఆశ. తన ప్రతిపాదన ఆమెతో చెప్పాలని, 


“ఎలా వున్నావు అమ్మ?” అని నవ్వుతూ అడిగాడు రవి.. 


“బాగానే వున్నాను సర్, మీరు ఎలా వున్నారు?. ” చిరునవ్వు చిందిస్తూ అంది మైత్రి 


“నాకేం బాగానే వున్నాను తల్లి. సరే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు?.. ”


తన గురించి పూర్తిగా చెప్పింది.. 


“ఓహ్, మంచి నిర్ణయం. అయితే అప్పటి వరకు నువ్వు మా కాలేజీ లో ప్రొఫెసర్గా చేస్తావా?. ” అడిగాడు రవి. 


రవి ప్రస్తావనకు సందిగ్ధంలో పడింది. బాగా ఆలోచించి కొంత సమయానికి సరే అని ఒప్పుకుంది. 


“మంచిది తల్లి, నువ్వు నా ప్రస్తావనకు అంగీకారం తెలపడం చాలా ఆనందంగా వుంది. నువ్వు ఏమంటావో అనుకున్నాను”


“మీరు అడిగిన తర్వాత ఎలా కాదనగలను సర్. ” అని నవ్వుతూ అంది మైత్రి. తనకు కూడా కొత్త ప్రొఫెసర్ గా కొత్త అనుభవం కలుగుతుందని, రవి ప్రస్తావనకు లేదు అని చెప్పలేదు. 


తాను ఉద్యోగం లో చేరింది. రోజులు చకచకా సాగిపోతున్నాయి. తన వృత్తి కూడా సాఫీగా సాగిపోతుంది. అయితే ఇంజనీరింగ్ విద్య అభ్యసించడానికి వచ్చిన విద్యార్థుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు తమ జీవితం బాగుండాలని కలలు కనేవాళ్ళు, కొందరు కలలు కంటూ చెడు వ్యసనాలకు బానిసలు అయినవాళ్ళు ఇలా పలురకాల తారస పడుతుంటారు. మా హీరో గొప్ప, మా హీరో గొప్పని కొత్తగా ఫ్యాన్ వార్లు అక్కడ జరగడం కొత్తేమీ కాదు. కొందరి చేష్టలు మైత్రి ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఆమెనే కాదు ఆమెలాంటి వారిని చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. 


చాలా మందిని తనకున్న నేర్పుతో వాళ్ళలో పరివర్తన తీసుకు వచ్చింది. కానీ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న అర్జున్ మాత్రం చాలా అల్లరి చేస్తున్నాడు. గ్రూపులుగా తన క్లాస్ మేట్స్ ను విడగొట్టి ప్రొఫెసర్ పాఠాలు చెప్తుంటే వెనుక నుండి బెలూన్ ను పేల్చడం. కేకలు వేయడం వంటివి చేస్తూ ఉన్నాడు. అతనికి నచ్చజెపడానికి చూసింది మైత్రి. కానీ, అతని అల్లరి ఆగలేదు. ఇంకా హద్దులు మీరి ప్రవర్తించడం మొదలు పెట్టాడు. వ్యక్తిగతంగా కామెంట్ చేయడం మొదలు పెట్టాడు. ఇలాంటి పరాభవం తనకు ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. ఆ వయసులో అల్లరి చేయడం మామూలే. కానీ అర్జున్ ఆ అల్లరి స్థాయిని దాటి పోయాడు. ఇక ఉపేక్షించే పని లేదని ప్రిన్సిపల్ తో విషయం చెప్పి అర్జున్ ను సస్పెండ్ చేయించింది. అర్జున్ అది తనకు జరిగిన అవమానంగా భావించి మైత్రి మీద కోపం పెంచుకున్నాడు.


పరిస్థితి అర్దం చేసుకున్న రవి, “అర్జున్ మంచి, చెడు ఆలోచించే స్థాయిని దాటి పోయాడు. ఇతని వలన మైత్రి కి ప్రమాదముంది కనుక వాళ్ల అమ్మగారిని పిలిచి మాట్లాడాలి. ” అని నిర్ణయం తీసుకొని, అర్జున్ అమ్మగారిని ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. 

ఈ విషయం మైత్రి కి కూడా చెప్పాడు. 


మరుసటి రోజు అర్జున్ అమ్మ గారైన సావిత్రి కళాశాలకు చేరుకుంది. ఆమె అక్కడ వుండడం చూసిన అర్జున్ ఆమె దగ్గరకు వేగంగా వెళ్ళి, ఆమె అక్కడ వుండడానికి కారణం ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. 


“ప్రిన్సిపాల్ గారు రమ్మని చెప్పారు రా. ఏదో నీ గురించి మాట్లాడాలని అన్నారు. ” చెప్పింది ఆమె. 


“ఈ ప్రిన్సిపాల్ మొత్తం చెప్పేస్తాడు. అలా అయితే అమ్మ నన్ను ఇంటిలోపలికి రానివ్వదు. ” అని తనలో అనుకొని, ఏవో మాటలు చెప్పి ఆమెను అక్కడ నుండి పంపే ప్రయత్నం చేస్తున్నాడు. 


దూరం నుండి ఇదంతా గమనిస్తూనే వుంది మైత్రి, “చూస్తుంటే ఆమె అర్జున్ తల్లిలా వున్నారు?. నిన్న చెప్పారు కదా ప్రిన్సిపల్ సర్, అర్జున్ అమ్మ గారికి ఫోన్ చేశానని. అర్జున్ కు విషయం తెలిసి ఆమెను ఇక్కడ నుండి పంపించడానికి చూస్తున్నాడు. ” అని అనుకొని అక్కడకు చేరుకుంది.. 


“నమస్కారం అమ్మ!, మీరు అర్జున్ అమ్మగారు కదా?. ”అని అంది మైత్రి. 


“అవును అమ్మ, మీరు?. ”ఆశ్చర్యంతో మైత్రి వైపు చూస్తూ అడిగింది సావిత్రమ్మ. 


“నేను అర్జున్ కు పాఠాలు బోధించే ప్రొఫెసర్ ను. సర్ పిలిచారు అనే కదా మీరు వచ్చారు. రండి నాతో పాటు. ”అంది మైత్రి. 


“సరే “అంటూ మైత్రిని అనుసరించింది సావిత్రమ్మ. 


ప్రిన్సిపాల్ క్యాబిన్ లోపలికి చేరుకున్నారు. 

“సర్!, అర్జున్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. ”అని చెప్పింది మైత్రి. 


సావిత్రమ్మ వైపు చూసి, “నమస్కారం అమ్మ, కూర్చోండి. ”అని తన ఎదురుగా వున్న కుర్చీ చూపిస్తూ అన్నాడు రవి. 


కాస్త అయోమయంగా చూస్తూ కుర్చీలో కూర్చొని, “సర్, నన్ను రమ్మనడానికి కారణం. ”అడిగింది సావిత్రమ్మ. 


“మీ సమయాన్ని నేను వృధా చేయలేను. నేరుగా విషయానికి వచ్చేస్తున్నాను. మీ అబ్బాయి అర్జున్ ప్రవర్తన రోజు రోజుకి దారుణంగా తయారు అవుతుంది. అతనికి చాలా సార్లు చెప్పి చూశాం. సస్పెండ్ కూడా చేశాం. ఇన్ని చేసినా అతనిలో పరివర్తన రావడం లేదు. అతనిలో ఆవేశం తప్పించి. పైగా అదుగో ఆ మేడం గారిని మీరు చాలా బాగున్నారు మేడం అని అన్నాడు. గురు స్థానంలో వున్న ఆమెతో అలా మాట్లాడటం ఎంతవరకు సబబు, మీరే చెప్పండి. ” అని జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. 


అవన్నీ విని ఒక్కసారిగా ఆమెకు కన్నీళ్లు వచ్చాయి. వాటిని తుడుచుకుంటూ, 

“సర్, వాడు బుద్దిగా చదువుకుంటున్నాడు అనుకున్నాను. ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ వుండడు. వాడు ఇలా తయారు అవుతాడు అనుకోలేదు. నేను వాడి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేక పోతున్నాను. ” బాధతో పలికింది. 


“మీరే అలా అంటే ఎలా మేడం?. అతను మీ అబ్బాయి, అతని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ”


“సర్, నా భర్త నాకు దూరమయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది. అతను రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేను కుట్టు మిషన్ తొక్కుతూ జీవితం గడుపుతున్నాను. నలుగురికీ ఆ కుట్టు మిషన్ నేర్పించి నా జీవితం నెట్టుకు వస్తున్నాను. ఈ మధ్యనే ఒక కంపెనీ పని కుదిరింది, నా పూర్తి సమయం దానికి కేటాయించడానికి సరిపోతుంది. అవన్నీ సక్రమంగా జరిగితే వాడి చదువుకు మా బ్రతుక్కి సరిపడ సొమ్ము దొరుకుతుంది. వాడు బాధ్యత తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు. ” వాపోతూ అంది సావిత్రమ్మ. 


ఆమె జవాబుకి రవికి, మైత్రి కి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. కొంత సమయం ఆలోచనలో పడ్డారు. 


“మా ప్రయత్నం మేము చేస్తాము అమ్మ. అప్పటికి కూడా అర్జున్ మారక పోతే అతన్ని కాలేజీ నుండి తొలగించాల్సి వుంటుంది. ” అని అన్నాడు రవి. 


మరో మాట మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది సావిత్రమ్మ. 


అప్పటి వరకు ప్రిన్సిపాల్ క్యాబిన్ బయట కాపలా కాస్తూ వున్నాడు అర్జున్. సావిత్రమ్మ బయటకు రావడం తో, వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. కొడుకుని చూడగానే ఆమెకు కోపం వచ్చింది. కానీ అక్కడ అందరూ వున్నారని చూసి, కొడుకు చెయ్యిని పట్టుకొని అక్కడ నుండి వేగంగా లాక్కొని పక్కకు తీసుకు వెళ్ళింది. 


“ఏమిటిరా నువ్వు చేస్తున్న పని?. నీకు ఎన్ని సార్లు చెప్పాను, అయినా నువ్వు మారడం లేదు. ” కోపంతో కొడుకు మీద చెయ్యి ఎత్తింది. 


మళ్ళీ తనని తాను సముదాయించుకుంటూ, ”నిన్ను కొట్టి లాభం లేదు. ఎదిగిన పిల్లాడు మీద చేయి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీ జీవితం నీ ఇష్టం. మంచిగా మార్చుకుంటావో, లేక చెడగొట్టుకుంటావో” అంటూ మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోయింది సావిత్రమ్మ. 


“ఎప్పుడూ వుండే దండకమే కదా, ఈరోజు కొత్త ఏమిటి” అని తనలో అనుకుంటూ, తల్లి మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు అర్జున్. 


ఆ తర్వాత రోజు అర్జున్ ఇంటికి వెళ్ళింది మైత్రి. ముందు రోజు ఆమెను చూసి వుండడం కారణంగా సావిత్రమ్మ మైత్రిని గుర్తు పట్టింది. 


“మేడం!, మీరా?. లోపలికి రండి, ” అని పిలిచింది సావిత్రమ్మ. 


“మీతో మాట్లాడాలని, మీ గురించి తెలుసుకోవాలని వచ్చాను.” నవ్వుతూ అంది మైత్రి. 


“నా గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఏమి వుంటుంది మేడం. చితికిన బ్రతుకులు, గాడి తప్పిన బ్రతుకులు. అదుగో ఆ వ్యక్తి ఈరోజు ఉండుంటే నాకు ఈ బాధ వుండేది కాదు.” అని ఎదురుగా వున్న తన భర్త ఫోటో ను చూపిస్తూ అంది సావిత్రమ్మ. 


ఎదురుగా వున్న ఆ ఫోటో ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ వుండి పోయింది మైత్రి. కొంత సమయానికి తేరుకొని, “ఇతను అర్జున్ వాళ్ళ నాన్నగారా?.” అని అడిగింది. 


“అవును తల్లి, అతనే. అతను ఉన్నప్పుడు మా బ్రతుకులు ఎంతో బాగుండేవి. అతను మాకు ఎప్పుడు అయితే దూరం అయ్యారో, అప్పటి నుండి మాకు బాధలు ఎక్కువ అయ్యాయి. అర్జున్ కూడా ఇలా తయారు అయ్యాడు. ” వాపోతూ చెప్పింది ఆమె. 


బాధపడుతున్న సావిత్రమ్మ ను ఓదార్చి, 

“అమ్మ, మీరేమీ బాధపడకండి. మీ అబ్బాయిని మార్చే బాధ్యత నాది. ” అని సావిత్రమ్మ కు మాట ఇచ్చి అక్కడ నుండి బయలుదేరింది మైత్రి. 

 

 *********


తర్వాత నుండి ఎలాగైనా అర్జున్ ను మంచి మార్గంలో నడిచేలా చేయాలనుకుంది. ఎన్నో విధాలుగా చెప్పి చూసింది. కానీ, అర్జున్ ప్రవర్తన లో ఎటువంటి మార్పు లేదు. నెల రోజులు గడిచాయి. ఒక ఆలోచన చేసి ప్రిన్సిపాల్ గారి సహాయం తో, ముఖ్యంగా అర్జున్ వెనుక తిరిగే బ్యాచ్ ను టార్గెట్ చేసింది. వాళ్ల తల్లితండ్రులను పిలిపించి, వాళ్ళతో వివరంగా మాట్లాడింది. 


“మీ పిల్లలు భవిష్యత్తు మీ చేతిలోనే వుంది. మేము చెప్పి చూశాం, కానీ వాళ్ళు ఇంకా కొంత మారాల్సి వుంది. ముఖ్యంగా ఒక వ్యక్తిని వీళ్లు సపోర్ట్ చేస్తున్నారు. దాని కారణంగా లేనిపోని గొడవలు వస్తున్నాయి. ఇలానే సాగితే మీ పిల్లలు దారి తప్పుతారు. వాళ్ళు సక్రమంగా లేకపోతే మీకే ఇబ్బంది కలుగుతుంది. లేడీ ఫ్యాకల్టీ ఎవరూ కూడా పాఠాలు చెప్పడానికి ముందుకు రావడం లేదు. మీ కూతురే ఒక ప్రొఫెసర్ అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మీరేమి చేస్తారు?. ” తల్లి తండ్రులు కూడా ఆలోచించే విధంగా అక్కడ పరిస్థితులు వాళ్ళకు చెప్పింది. 


మైత్రి చెప్పింది విని కాసేపు ఆలోచనలో పడిన తల్లితండ్రుల. తర్వాత, అక్కడ జరిగిన సంఘటన లు తెలుసుకొని, 

“మా పిల్లల మంచి కోసం మీరు ఆలోచిస్తున్నారు. మీకు మేము సహాయంగా వుంటాము మేడం. ఆ అర్జున్ తో స్నేహం చేయకుండా వీళ్ళను కట్టడి చేస్తాం. వీళ్ళు ఇక్కడకు వచ్చి బుద్దిగా చదువుకుంటున్నారని అనుకున్నాం. కానీ ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసి సిగ్గు పడుతున్నాం. మేము కూడా వాళ్ళకు హెచ్చరిక ఇస్తాం. ” అని మైత్రి కి సపోర్ట్ చేశారు. 


ఆ మరుసటి రోజు నుండి అర్జున్ వెనుక గ్రూప్ లా తిరిగే వ్యక్తులు ఎవరూ కూడా అతని వెనుక వెళ్ళలేదు. అతను ఎవరిని పిలిచినా వాళ్ళు వెళ్ళడం లేదు. పైగా ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడటం లేదు. అర్జున్ కు విసుగు పుట్టింది. బయట తిరిగాడు. అక్కడ కూడా ఎవరూ అతనితో మాట్లాడటం లేదు. వారం రోజులు గడిచాయి, అర్జున్ పరిస్థితి దారుణంగా తయారు అయింది. ఎవరూ కూడా అతనితో మాట్లాడకుండా బాయ్ కట్ చేశారు. ఎందుకో అతని కళ్ళలో నీరు తిరుగుతున్నాయి. 

కాలేజీ బయట వున్న చెట్లు కింద వేసి వున్న సిమెంట్ బల్ల మీద కూర్చొని బాధపడుతూ వున్నాడు. 


“ఏంటి గ్యాంగ్ లీడర్!, ఇక్కడ కూర్చొని భాదపడుతున్నావా?” అక్కడ చేరుకున్న మైత్రి అంది. 


ఒక్కసారిగా ఆమె వైపు చూసి, ఏమీ అనకుండా తలదించుకున్నాడు. 


“చెప్పాను కదా అర్జున్, గురువు తలుచుకుంటే ఏదైనా చేయగలరని, గురువు స్థానం లో వున్న వాళ్ళకు గౌరవం ఇవ్వాలని, ఇన్నాళ్ళు నీ వెంట తిరిగే వాళ్ళు ఏమైయ్యారు?. వాళ్ళు తల్లి తండ్రులు చెప్పడం తో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ల ను చూసైనా నీకు బుద్ధి రాలేదా?, వాళ్ళు వాళ్ళ తల్లితండ్రులకు ఎంత గౌరవం ఇస్తున్నారో?. మరి నువ్వు?. ” అర్జున్ లో ఆలోచనలు కలిగేలా ప్రశ్నించింది. 


అర్జున్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వున్నాడు. 


“అర్జున్!, నేను నీకు ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను. అది ఒక మనసున్న వ్యక్తి చేసిన సహాయం. అలాగే జీవితం కోసం ఆరాట పడుతూ, భవిష్యత్తు కు బంగారు బాటలు వేసుకోవాలని తపన పడుతున్న ఒక యువతి కథ. 


అది ఢిల్లీ యూనివర్సిటీ నుండి వచ్చిన ప్రకటన, నానో టెక్నాలజీ మీద ఏదైనా ఒక అంశం తీసుకొని పోస్టర్ ప్రజెంటింగ్ ఇవ్వాల్సి వుంటుంది. దానికి ప్రైజ్ మనీ ఎంతో తెలుసా అక్షరాల లక్ష రూపాయిలు. అయితే ఆ పోటీ మొత్తం భారత దేశం నుండి ఏ కాలేజీ వాళ్ళు అయినా పాల్గొనవచ్చు అని వుంది. ఆ యువతి కాలేజీ వాళ్ళు ఆమె ప్రతిభ ను గుర్తించి, ఆమె సాధించగలదు అన్న నమ్మకం తో, ఆర్దికంగా సహాయం చేసి ఢిల్లీకి పంపించడానికి సిద్దం అయ్యారు. అలాగే పంపించారు. ఆ యువతి కూడా ఆత్మ విశ్వాసం తో బయలుదేరింది. 


ఢిల్లీ చేరుకుంది. తనకు ఆ మహానగరం కొత్త. ఆ యూనివర్సిటీ కు వెళ్ళాల్సిన బస్ అప్పుడే వెళ్ళిపోయింది. అక్కడ వున్న ఎంక్వైరీ వాళ్ళను అడిగితే ఇంకో బస్ బయలుదేరడానికి పదిహేను నిముషాలు పడుతుందని చెప్పారు. సమయం తక్కువ వుందని, ఆమె అక్కడ నుండి వేగంగా వెళ్ళి ఆటో మాట్లాడుకొని యూనివర్సిటీకి బయలుదేరింది. అయితే ఆ ఆటో వాడు ఆమె ను ఏదో చేయాలని దురుద్దేశం తో రాంగ్ రూట్ లోకి పోనిచ్చాడు. ఆమె అప్పటికి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసిన కారణంగా అతను వెళుతున్న రూట్ సరైంది కాదని తెలుసుకోగలిగింది. అతన్ని ఆటో ఆపమని చెప్పంది అతను పట్టించుకోకుండా పోనిస్తుంటే 'సహాయం చేయండి' అని గట్టిగా అరుస్తుంది.


కొంత సమయానికి ఆ ఆటో వాడు ఒక ప్రాంతం లో ఆటో ఆపాడు. వెంటనే ఆటో దిగి అతడ్ని నెట్టి ఆమె పరుగుతీసింది. ఆ ఆటో వాడు ఆమెను వెంబడించాడు. రెండు అడుగులు వేసే సరికి ఆమెకు ఒక వ్యక్తి తారస పడ్డాడు. ఆమెను ఆపి ఆమెకు ధైర్యం చెప్పాడు. అతను కూడా తెలుగు వ్యక్తి కావడం తో ఆమె లో కంగారు కాస్త తగ్గింది. అక్కడకు కొందరు పోలీసులు కూడా చేరుకున్నారు. ఆమె 'హెల్ప్.. హెల్ప్' అని అరవడం తో, అతను ఆమె ప్రమాదంలో వుందని చూసి, ఆమెను రక్షించాలని అంత రిస్క్ చేసి, చివరికి ఆమెను కాపాడగలిగాడు. ఒకవేళ అతను రావడం ఆలస్యం అయివుంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యేది. ” అని చెప్పింది మైత్రి. 


అంతా విని ఆమె వైపు చూసాడు అర్జున్. 


“అర్జున్!, ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు కదా. నీకు ఒక నిజం తెలియాలి. ఆ రోజు ఆ అమ్మాయిని కాపాడింది మీ నాన్న గారు. ఎంత మంచి మనసు వుంటే అంతలా రియాక్ట్ అవుతారు. ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే. చూడు అర్జున్ మీ నాన్న గారు నాకు మరొక జన్మ ప్రసాదించారు. అలాంటి తండ్రికి కొడుకైన నువ్వు ఎంత బాధ్యతగా నడచుకోవాలి. అతనికి ఇంకెంత మంచి పేరు తీసుకురావాలి. పోనీ పేరు తీసుకు రాకపోయినా పర్వాలేదు చెడ్డ పేరు మాత్రం తీసుకు రావద్దు.


చూడు అర్జున్! నీ గురించి నేను ఇంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు. కానీ మీ తండ్రి గారికి నేను ఏమి అవుతానని నన్ను కాపాడారు. కేవలం మానవత్వమే కదా అతన్ని నన్ను కాపాడేలా చేసింది. ఇప్పుడు కూడా ఆ మానవత్వమే నన్ను నిన్ను మనిషిలా మార్చమని చెప్పింది. మీ నాన్న కు ఒక మంచి కొడుకు లా ఉండమని, మీ తల్లికి ఆసరాగా ఉండమని చెప్పింది. నేను చెప్పాల్సింది చెప్పాను అర్జున్. ఇక నీ ఇష్టం” అని అంది మైత్రి చివరిగా. 


అర్జున్ కళ్ళలో నీరు తిరుగుతున్నాయి, మౌనంగా తల దించుకుంటూ వున్నాడు. చీకట్లు కమ్మిన తన మెదడు పొరల్లో నుండి విజ్ఞాన వెలుగేదో ఊపిరి పోసుకోవడం మొదలవుతుంది. 


మైత్రి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్దపడింది. అడుగు ముందుకు వేయబోయే సరికి, ఎదురుగా ఆమె భర్త రామచంద్ర నిలబడి వున్నాడు. 


“మైత్రి, ఇన్నాళ్ళు నిన్ను చాలా తిట్టుకున్నాను. వచ్చిన ఉద్యోగం ఎందుకు వదులు కున్నావని, కానీ ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయి తో చెప్పింది విని నిజం తెలుసు కున్నాను. స్వార్థం తో నిండిపోయిన ఈ రోజుల్లో, నువ్వు మాత్రం నీకు సహాయం చేసిన మనిషి గురించి ఆలోచించావు. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ”అని అంటూ ఆమె చెయ్యి పట్టుకొని క్షమాపణ చెప్పాడు రామచంద్ర. 


“ఏవండీ నేను ఇక్కడికి ప్రిన్సిపాల్ సర్ వినతి మీద వచ్చాను. ఇక్కడ నాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. నేను వీటన్నిటినీ వదిలేసి వచ్చేద్దామనుకున్నాను. సరిగ్గా ఆ సమయానికే నాకు నేను కోరుకున్న ఉద్యోగం వచ్చింది. కానీ అప్పుడే నాకు అర్జున్ తండ్రి ఎవరన్నది తెలిసింది. అంత తెలిసిన తర్వాత దారి తప్పిన అర్జున్ ను అలా వదిలేయడం మంచిది కాదనిపించింది. అందుకే అతనిలో పరివర్తన కలిగే వరకు నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మీతో కఠినంగా మాట్లాడాను నన్ను క్షమించండి. ” అని అంది. 


“మైత్రి, నువ్వు చేసింది కరెక్ట్. నేనే నిన్ను అర్థం చేసుకో లేకపోయాను. నువ్వు ఇక్కడ ప్రొఫెసర్ గా వుండడమే కరెక్ట్. ఇలాంటి విద్యార్ధుల భవిత బాగుండాలి అంటే మీలాంటి గురువులు అవసరం. ” అన్నాడు రామచంద్ర. 


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page