top of page

అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధం


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"రమ్యా! రెడీనా? నా ఆఫీసుకి టైమవుతోంది. త్వరగా తెములు. నిన్ను కాలేజీకి డ్రాప్ చేయడంకాదుగానీ, నీ మూలాన నాకు ఆఫీసుకి ఆలశ్యం అవుతోంది." పెద్దగా అరిచాడు విజయ్ తన చెల్లెలు రమ్యని.

"వస్తున్నా అన్నయ్యా! " అంటూ వచ్చి అతని స్కూటర్ మీద కూర్చుని తల్లితండ్రులకు 'బై' చెప్పి వెళ్లింది రమ్య.

వాళ్లు వెళ్లినవైపే చూస్తూ ఉండి లోపలికి వెళ్లారు రామయ్య, సుశీల. లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయిన రామయ్య భార్య సుశీల, కూతురు రమ్య, కొడుకు విజయ్ లతో స్వంత ఇంట్లో ప్రశాంతజీవితం గడుపుతున్నారు.

డిగ్రీ పూర్తి చేసిన విజయ్ బాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. రమ్య ఇంటర్ చదువుతోంది. ప్రతిరోజూ చెల్లెలిని కాలేజీవద్ద దింపి తను ఆఫీసుకి వెళతాడు విజయ్.

విజయ్ అంటే రమ్యకు చాలా ప్రేమ. విజయ్ కు కూడా అంతే. ప్రతి సం… తన అన్నకు రాఖీ కట్టి అతని ఆశీర్వాదము తీసుకోందే రమ్య మనసు ఊరుకోదు. ఆ అన్నా చెల్లెళ్లను చూస్తే చూడముచ్చటగా ఉంది అనుకుంటారు అందరూ.

వాళ్లిద్దరి ఐకమత్యాన్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు రామయ్యదంపతులు. రోజులు గడుస్తున్నాయి. ఇంటర్ మంచిమార్కులతో పాసయి ఇంజనీరింగ్ లో చేరింది రమ్య . రోజూ సాయంత్రం ఆఇంట్లో అందరూ ఒకచోట చేరి హాయిగా నవ్వుతూ, తుళ్లుతూ సంతోషంగా కబుర్లు చెపుతూ గడుపుతారు.

క్రమేణా విజయ్ బాంకులో పరీక్షలు వ్రాసి ఉన్నతమైన పోస్ట్ సాధించాడు. అతనికి పెళ్లి సంబంధాలను చూస్తూంటే స్వాతి బాగా నచ్చింది రామయ్య దంపతులకు. స్వాతి కూడా వేరొక బాంకులో ఉద్యోగం చేస్తున్న చాలా మంచి పిల్ల. తల్లి తండ్రులకు ఏకైక కూతురు అయినా బాధ్యతలను తెలియచేస్తూ చాలా క్రమశిక్షణగా పెంచారు వాళ్ల తల్లితండ్రులు.

స్వాతి విజయ్ లకు కూడా ఒకళ్లనొకళ్లు నచ్చడంతో ఒక శుభముహూర్తమున ఇరువైపులా పెద్దలు తాంబూలాలను పుచ్చుకోవడం , ఆ తర్వాత నెలలోనే వారిరువురికి వివాహం జరిగింది.

స్వాతి విజయ్ తో కాపురానికి వచ్చింది . స్వతహాగా తెలివైన, చురుకైన స్వాతి అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆ ఇంటిలో అందరి మనసులను అతి త్వరలోనే ఆకట్టుకుంది. స్వాతి, విజయ్ లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. తోబుట్టువులు లేని స్వాతికి రమ్యతో స్నేహం మరింత ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలుగచేస్తోంది. ముఖ్యంగా ఆ అన్నాచెల్లెళ్ల మధ్యన ఉన్న ప్రేమానురాగాలు స్వాతిని మరింత ముగ్ధురాలిని చేస్తోంది.

రెండు సం…తర్వాత స్వాతి గర్భవతి అవడంతో ఆ ఇంట్లో అందరూ సంతోషించారు. నెలలు నిండి సుఖప్రసవం జరిగి స్వాతి పండంటి మగబిడ్డను కన్నది. వాడికి 'రోహిత్ ' అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. క్రమేణా రోహిత్ పెరిగి పెద్దవుతూ తన ముద్దు ముద్దు మాటలతో, ఆటపాటలతో సందడి చేస్తున్నాడు. రమ్య ఇంజనీరింగ్ పూర్తయి మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరింది.

కొంతకాలానికి రమ్య తన సహోద్యోగి శేఖర్ తో ప్రేమలో పడింది. అతను కూడా ఆమెను మనస్ఫూర్తిగా ఇష్టపడడంతో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందామనుకునుకున్నారు. చిన్న నాడే తండ్రిని కోల్పోయిన శేఖర్ ను అతని తల్లి పార్వతమ్మ కష్టపడి పెంచి చదివించింది. శేఖర్ కూడా కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సాధించాడు. అతను ఏనాడూ తల్లి మాటను జవదాటలేదు. తల్లి అంటే ప్రేమ, గౌరవాభిమానాలు ఎక్కువ. రమ్యను ప్రేమించానన్న విషయాన్ని చెప్పగానే పార్వతమ్మ సంతోషంగా వాళ్ల పెళ్లికి అంగీకరించింది.

రమ్య ఇంట్లో కూడా శేఖర్ తో ప్రేమ విషయాన్ని చెప్పగానే అతన్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పడంతో ఒక రోజున శేఖర్ ను ఇంటికి తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో అందరికీ పరిచయం చేసింది. తరచూ శేఖర్ వాళ్ల ఇంటికి వెళ్లడంతో అతని మాటతీరు‌ , కలుపుగోలుతనం, పెద్దలంటే వినయం మొ… లక్షణాలు నచ్చడంతో వాళ్ల పెళ్లికి రమ్య పెద్దలు అంగీకరించారు.

ఒక శుభముహూర్తమున శేఖర్ కు‌, రమ్యకు వివాహం జరిగింది. రమ్య శేఖర్ తో కాపురానికి వచ్చింది. తన కలుపుగోలుతనం, మాటకారితనంతో అత్తగారితో అతి త్వరలోనే కలిసిపోయింది రమ్య. రమ్య, శేఖర్ లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. రోజూ ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లి వస్తూ వారాంతాలలో భర్తతో తన పుట్టింటికి వెళ్లి వాళ్లతో కాసేపు సంతోషంగా గడిపివస్తోంది రమ్య. రోజులు హాయిగా గడుస్తున్నాయి.

ఒక రోజున రామయ్య గారు బాగా అస్వస్థతకు గురవడంతో ఆయన్ని హాస్పిటల్ కు తీసికెళ్లాడు విజయ్. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి ' మైల్డ్ హార్ట్ఎటాక్' వచ్చిందని, తగిన మందులిచ్చి బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పి ఇంటికి పంపించారు. విషయం తెలిసి పరుగున రమ్య, శేఖర్ తో వచ్చి తండ్రిని పలకరించి ఆయనతో కాసేపు గడిపి వెళ్లింది. ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు.

చూస్తూ ఉండగానే రాఖీ పండుగ వచ్చింది. రమ్య రాఖీని తీసుకుని పుట్టింటికి వచ్చి విజయ్ కు కట్టి అన్నా, వదినల దీవెనలను తీసుకుంది. విజయ్ ప్రేమగా చెల్లెలికి పట్టుచీర, స్వీట్లు ఇచ్చాడు. ఆరోజు వాళ్లతో సరదాగా గడిపి తన ఇంటికి వెళ్లింది రమ్య. పండగలకు, పబ్బాలకు ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు మాములే. రమ్య తన పుట్టింటివాళ్లతో సన్నిహితంగా గడపడము‌, ఆ అన్నాచెల్లెళ్ల మధ్య సఖ్యత నచ్చకపోవడంతో క్రమేణా పార్వతమ్మలో మార్పు వస్తోంది. ఆవిడ ఏదో ఒకవిధంగా రమ్య, విజయ్ ల మధ్య మనస్పర్థలు తేవటానికి చేసే ప్రయత్నంలో ఏదో ఒకటి రమ్య పుట్టింటి వాళ్ల మీద వేలెత్తి చూపుతూ శేఖర్ కు చెప్పడం జరుగుతోంది. మొదట్లో శేఖర్ ఆవిడ మాటలను పెడచెవిన పెట్టినా క్రమేపీ అతనికి అవి మనసులో పడుతున్నాయి. ఇది గమనించిన రమ్య సుతరాము ఇష్టపడక ఇద్దరితో అది తప్పని వాదించింది.

తల్లి మాటను జవదాటని శేఖర్ ఆవిడ మాటల ప్రభావానికి లోనయ్యాడు. శేఖర్ మనస్తత్వం లో క్రమేపి మార్పు వస్తోంది. శేఖర్, రమ్యల మధ్యన మనస్పర్థలు రాసాగాయి. రమ్య శేఖర్ తో ఏకాంతంగా కూర్చుని ఇంట్లో పరిస్థితిని వివరించి పార్వతమ్మ మాటలను నమ్మద్దని చెప్పింది. కానీ తల్లి చెప్పుడు మాటల ప్రభావంతో అతను రమ్య మాటలను పెడచెవిన పెట్టాడు. తమ మధ్యన మనస్పర్థలు క్రమేపీ అవే సర్దుకుంటాయని రమ్య చాలా ఓర్పుగా ఉంటోంది కానీ ఏనాడూ తన వాళ్లకు చెప్పలేదు.

ఒకనాడు రామయ్యగారికి మరలా గుండెపోటు వచ్చి నిద్రలోనే శాశ్వతంగా కన్నుమూశారు. జరిగింది తెలిసి ఆఘమేఘాలమీద రమ్య భర్తతో వచ్చి కడసారిగా తండ్రిని చూసి విలవిలలాడింది. కాసేపటికి తనని తాను నిబ్బరించుకుని తల్లినీ‌, అన్నను ఓదార్చింది. జరగవలసిన కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగాక భర్తతో తన ఇంటికి వచ్చింది రమ్య.

కాలం గడుస్తోంది. శేఖర్ విజయ్ తో కూడా ముక్తసరిగా ఉంటున్నాడు. పార్వతమ్మ, శేఖర్ లు రమ్యను వాళ్ల పుట్టింట్లో వాటాకోసం వాళ్ల అన్నను అడగమని వత్తిడి చేయసాగారు. కానీ రమ్యకు ఆ పని ఇష్టం లేదు. అడగనని ఎదురుతిరిగింది. దాని వలన తనకు, తన వాళ్లకు గొడవలొస్తాయని, ముఖ్యంగా తన అన్నతో మనస్పర్థలు వస్తాయని, అది తనకిష్టంలేదని ఎంతగానో చెప్పింది. దాని వలన శేఖర్, రమ్యల మధ్యన గొడవలు పెద్దవయి మనస్పర్థలు రాసాగాయి.

చివరికి శేఖర్ ఒత్తిడితో బలవంతంగా తన అన్నవద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరించి ఆస్తిలో తన వాటాని అడిగింది రమ్య. విషయం తెలిసి చాలా బాధపడ్డాడు విజయ్. " ఒకేతల్లి కడుపున పుట్టాం. ఒకే తండ్రి పెంపకంలో పెరిగాం. కష్టం, సుఖం పంచుకున్నాం. ఈరోజు

ఓ మూడోవ్యక్తి కారణంగా మనమధ్య వైరం సృష్టించుకుందామా!? " అని విజయ్ చాలా ఆవేదనతో రమ్యను అడిగాడు. ఆ మాటలకు చలించిన రమ్య చాలా బాధతో తన అన్నను హత్తుకుంది. రమ్య మనసును ఎరిగిన విజయ్ కళ్లు కూడా చెమర్చాయి.

తన చెల్లెలు భర్త ఒత్తిడి వలననే ఆస్తిలో వాటా అడిగిందని అర్థం చేసుకున్నాడు విజయ్. చెల్లెలిని సముదాయించి చెల్లి సంసారాన్ని సరిదిద్దాలని రమ్యను తీసుకుని శేఖర్ ఇంటికి వెళ్లి వాళ్లతో మాట్లాడి సర్దిచెప్ప ప్రయత్నంచేశాడు. కానీ ఆ తల్లీకొడుకులకు అవి చెవికెక్కలేదు. చివరకు రమ్య కాపురంలో గొడవలు ఎందుకని విజయ్, స్వాతిలు, సుశీలమ్మ ఒక నిర్ణయానికి వచ్చారు. లాయరు సమక్షంలో తమ ఆస్తిలో సగభాగాన్ని రమ్య పేరున వ్రాయించి ఆ కాగితాలను సిధ్ధంచేశాడు విజయ్.

ఆరోజు రాఖీ పండుగ. విజయ్ కు రాఖీ కట్టాలని రాఖీని తీసుకుని రమ్య తన అన్నవద్దకు వెళ్లబోగా శేఖర్ వెళ్లొద్దని రమ్యని వారించాడు. చెల్లి వస్తుందని ఎదురుచూసిన విజయ్ శేఖర్ స్వభావం తెలుసుకనుక తనే వాళ్లింటికి వెళ్లాడు. అన్నను చూసి రమ్య ఆనందంగా ఎదురెళ్లి హత్తుకుని ఆదరంగా అతన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లి మర్యాదలుచేసి అన్నకు రాఖీ కట్టి అతనికి నమస్కరించింది. సంతోషంతో రమ్యను మనసారా దీవించి ప్రేమగా హత్తుకున్నాడు విజయ్. రమ్యకు రావలసిన ఆస్తికాగితాలను ఆమెకు ఇచ్చేశాడు. అది చూసి పార్వతమ్మ, శేఖర్ లు ఆనందించారు కాని భర్త వత్తిడితో తను చేసిన పనికి రమ్య మనసులో చాలా కుమిలిపోయింది.

"ఇంక ఇరుకుటుంబాల మధ్యన ఏ గొడవలు, మనస్పర్థలు రాగూడదని, ఎప్పటిలాగే మా అన్నాచెల్లెళ్ల మధ్యన ప్రేమానురాగాలు కలకాలం కొనసాగాలని" శేఖర్ ను కోరాడు విజయ్. అంగీకారంగా తలూపాడు శేఖర్. కాసేపు తన చెల్లెలితో సంతోషంగా గడిపి తన ఇంటికి వచ్చాడు విజయ్. తన అన్నను చూసి గర్వంగా పొంగిపోతూ " అంత ప్రేమానురాగాలు చూపే అన్న తనకు దొరకడం తన అదృష్టమని, తామిద్దరి మధ్య ప్రేమానుబంధం చెరగకుండా కలకాలం కొనసాగాలని " మనసులోనే ఆ భగవంతుడికి నమస్కరించింది రమ్య.

సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు."మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


41 views0 comments
bottom of page