top of page

కంటేనే అమ్మ అని అంటే ఎలా? - పార్ట్ 2

#SripathiLalitha, #శ్రీపతిలలిత, #కంటేనేఅమ్మఅనిఅంటేఎలా, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Kantene Amma Ani Ante Ela - Part 2/2 - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 23/08/2025

కంటేనే అమ్మ అని అంటే ఎలా - పార్ట్ 2/2  పెద్ద కథ

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

జరిగిన కథ

డాక్టర్ రవీంద్ర, స్వర్ణ ల కుమారుడు విశ్వతేజ. స్వర్ణకు కాన్సర్ రావడంతో రవీంద్రకు, అంజలికి వివాహం జరిపించి, మరణిస్తుంది. తేజ, అంజలిని అమ్మగా అంగీకరించడు. 

ఇక కంటేనే అమ్మ అని అంటే ఎలా? పెద్ద కథ చివరి భాగం చదవండి. 


మొత్తం మీద అందర్నీ ఒప్పించి స్వర్ణ తన కళ్ళముందే రవీంద్ర చేత అంజలి మెడలో తాళి కట్టించింది. “నేను పోయాక రిజిస్టర్ పెళ్లి చేసుకోండి. నా నగలు, చీరలు అన్నీ నువ్వు తీసుకో” అన్న స్వర్ణతో


“నీ భర్తని, కొడుకుని నాకు ఇచ్చావు. నాకు ఈ నగలు వద్దు. అవి నీ కోడలి కోసం దాచుతా” అన్న అంజలితో

“నీకు ఏడాదిలో నేనే పుడతా! నా కోసం ఇది” అంటూ ఒక సెట్ ఇచ్చింది. 


తేజకి కూడా అర్థమయ్యేలా “దేవుడు నాతో కొన్నిరోజులు ఆడుకొని మళ్లీ నన్ను చిన్న పాపాయిగా చేసి అంజలి పిన్ని దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు. మరి నువ్వు ఆ పాపాయిని బాగా చూసుకుంటావా” పాపం తేజ కళ్ల నీళ్లతో తల ఊపాడు. 


అనసూయకి కూతురిది అదృష్టమా దురదృష్టమా అర్థం కాలేదు. డాక్టర్, కోటీశ్వరుడు భర్త అయ్యాడు కానీ వయసులో పెద్దవాడు, పిల్లవాడి తండ్రి. 


“స్వర్ణ పోయాక మాకు ఇంకా ఇక్కడ ఏముంది?” అని లక్ష్మీపతి వాళ్ళు వైజాగ్ బయలుదేరితే అనసూయ కూడా వాళ్ళతో వెళ్లిపోయింది. 


స్వర్ణ స్థానం తీసుకోవాలని అంజలి ఎప్పుడూ అనుకోలేదు. తన స్థానం తనకి ఉండాలని తాపత్రయపడింది. 


తేజకి అమ్మ గుర్తుంది, తల్లిని మరిపించే ప్రయత్నం కన్నా, స్వర్ణ గురించి చెప్తూ, తేజ ఆమెని గుర్తుంచుకునే ప్రయత్నం చేసేది అంజలి. 


ఇంట్లో అందరూ అంజలిని పూర్తిగా స్వీకరించారు. 


రెండేళ్ల తర్వాత అంజలికి ఆడపిల్ల పుడితే “అమ్మ వచ్చింది” అని గంతులు వేసాడు తేజ. 


తనే ‘సోనాలి’ అని పేరు పెట్టాడు. అమ్మ పేరు స్వర్ణ కదా అంటే ‘అది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్’ అన్న తేజని ప్రేమగా ముద్దు పెట్టుకుంది అంజలి. 


తమాషాగా సోనాలి కూడా తేజ అంటే విపరీతమైన ప్రేమగా ఉండేది, ఎంత ఏడుస్తున్నా తేజని చూడగానే ఆపేసి నవ్వేది. అంజలికి కూడా స్వర్ణ మళ్లీ పుట్టింది అనిపించేది. 


తేజకి అంజలి అంటే ఇష్టమే కానీ, అమ్మగా స్వీకరించలేక పోయాడు. ఎక్కువగా తండ్రితోనే మాట్లాడేవాడు. పిన్నీ’ అనే పిలుపు కూడా చాలా అరుదు. ఏదైనా కావాలంటే నెమ్మదిగా అడిగేవాడు, కొడుకుననే అధికారంతో కాదు, బతిమిలాడినట్లు ఉండేది. 


ఒకటి, రెండు సార్లు శ్యామల, తేజకి అంజలిని ‘అమ్మా అని పిలు’ అని చెప్పబోతే, అంజలి ఆపింది. 


“తేజ ఎలా పిలిచినా పర్వాలేదు. ఏ రోజు, వాడికి నేను అమ్మ స్థానం తీసుకోవచ్చు అనుకుంటే, ఆ రోజే పిలుస్తాడు” అన్నది. 


నిజానికి సోనాలి కంటే, తేజ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది అంజలి. తేజ పరీక్షలప్పుడు అతను ఎంత వరకు మేలుకుంటే, తనూ మేలుకుని టీ, బిస్కట్స్ ఇచ్చేది. 


“నువ్వు పడుకో!’ తేజా మొహమాటంగా అన్నా వినేది కాదు. 


మంచి మార్కులు వస్తే పొంగిపోయి అందరికి చెప్పేది. 

పదో క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిన తేజని “ఏం చదువుతావు?” అని రవీంద్ర అడిగితే “ఆంకాలజిస్ట్ అవుతా!” అన్నాడు. 


అలానే మెరిట్ మీద, మెడిసిన్ సీట్ తెచ్చుకున్నాడు. అందరూ “నువ్వు చదువుతున్నావా? తేజ చదువుతున్నాడా మెడిసిన్?” అని ఎగతాళి చేసినా పట్టించుకోకుండా, అంజలి, తేజాకి అన్నీ టైంకి అమర్చి, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూసేది. 


సోనాలి ఇంకా స్కూల్లోనే ఉండడం కూడా కలిసివచ్చింది. 

మెడిసిన్ అయ్యాక, మెడికల్ అంకాలజీలో ముంబైలో సీట్ వచ్చింది తేజకి. 


అంజలికి, తేజని అంతా దూరం ఎలా పంపాలి? అని ఒకటే దిగులు. 


“ఏదో ఆడపిల్లని కాపురానికి పంపుతున్నట్టు చేస్తున్నావు, వాడు చదువుకోవడానికి వెళ్తున్నాడు” అన్నాడు రవీంద్ర నవ్వుతూ. 


మొదట్లో, రెండు నెలలకి ఒకసారి వెళ్లి, హాస్టల్ దగ్గర హోటల్ లో ఉండి, తినడానికి అన్నీ ఇచ్చి వచ్చేది. ఒక ఏడాదికి కొంచెం అలవాటయింది కానీ, పరీక్షలప్పుడు మాత్రం అంజలి వెళ్లి తీరాల్సిందే. తమాషాగా తేజ కూడా, పిన్నిని పంపమని తండ్రికి ఫోన్ చేసేవాడు. 


రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు, స్నిగ్ధని పరిచయం చేశాడు. ఇద్దరూ కలిసి చదువుకునే వాళ్లు. మొదట్లోనే అంజలికి అర్థమయ్యింది, వాళ్ళది ఒట్టి స్నేహం కాదని. 


స్నిగ్ధకి తేజ అంజలిని ‘అమ్మా!’ అని ఎందుకనడు అన్నది అర్థంకాలేదు. 


తేజ, ‘అంజలి తన సవతి తల్లి’ అని చెపితే అస్సలు నమ్మలేకపోయింది. 


“మా అమ్మ కూడా ఇంత ప్రేమగా ఉండదు. ఇప్పటికీ నన్ను ఏదో దానికి తిడుతూనే ఉంటుంది. మీ అమ్మ నిన్ను విసుక్కోవడం కూడా నేను చూడలేదు. ఆవిడది నిజమైన ప్రేమ. ఎవరికోసమో ఆడుతున్న నాటకం కాదు. కన్నంత మాత్రనే అమ్మ అవదు, కృష్ణుడికి యశోద లాగా, పెంచిన తల్లి కూడా అమ్మే. 


మీ అమ్మ చనిపోయి ఇన్ని ఏళ్ళు అవుతున్నా, ఆమె మీ అమ్మగారి గురించి గొప్పగా చెప్తూనే ఉంటుంది. అంటే, నువ్వు నీ కన్నతల్లిని మరిచిపోకూడదు అనేగా! ఇంకొకరు అయితే, సవతిని గుర్తు కూడా చేసుకోరు. నువ్వు చాలా లక్కీ తేజా!” అన్న స్నిగ్ధ మాటలకి ఆలోచనలో పడ్డాడు తేజ. 


కాన్వకేషన్ కి కుటుంబం అంతా వస్తారని చెప్తే, స్నిగ్ధ తమ కుటుంబం కూడా వస్తారని చెప్పింది. 


అంజలికి కూడా ఫోన్ చేసి స్నిగ్ధ, “ఆంటీ! మీరు ముందే వచ్చేయండి. మా అమ్మవాళ్ళు కూడా వస్తున్నారు. మీరు కలుసుకోవచ్చు” అంటూ హింట్ ఇచ్చింది. 


“వాళ్ళెందుకు కలుసుకోవడం! “ అమాయకంగా అంటున్న తేజని చూసి “వాళ్ళు ఒప్పుకోకుండా మన పెళ్లి అవుతుందా ? ఏం పెంచారు ఆంటీ ఒట్టి ముద్ద పప్పు” హడావిడిగా అంటున్న స్నిగ్ధతో, “మెత్తగా ఉండే తేజకి నీలాంటి తోడే ఉండాలి. మీ నాన్నగారిని కూడా రమ్మను. అంకుల్ కూడా వస్తారు. తొందరగా మీ ఇద్దరికీ ముడి పెడితే నాకు మనశ్శాంతి” 


“మా మంచి ఆంటీ! మీరు ఎంత ఫాస్ట్, మీ అబ్బాయి అంతా స్లో, ఎలా వేగాలి. మీరు వచ్చేయండి. మనం ఫుల్ మస్తీ చేదాం” 


స్నిగ్ధ దగ్గర నుంచి ఫోన్ లాక్కుని “మీకు, సోనీకి టికెట్లు బుక్ చేశాను, నేను ఎయిర్పోర్ట్ కి కార్ తెస్తాను” చెప్పిన తేజకి, “అలాగే నాన్నా!” అని ఫోన్ పెట్టింది. 


“నీ పద్ధతి అసలు అర్థం కాదు నాకు తేజ. నేను మా అమ్మతో మాట్లాడితే ‘అమ్మా అమ్మా’ అని మేకలాగా వంద సార్లు అంటాను. నువ్వు మాత్రం, అరగంట మాట్లాడి ఒక్కసారి కూడా ‘అమ్మా అని కానీ పిన్ని’ అని కానీ అన్లేదు, నాకు నచ్చలేదు” నిజంగా కోపం వచ్చింది స్నిగ్ధకి. 


ఈ సారి తేజ ఆలోచిస్తూ ఏమీ మాట్లాడలేదు. 

అందరూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనాలిని తీసుకుని రవీంద్ర, అంజలి వచ్చారు. 


ఎయిర్పోర్ట్ కి, తేజతో పాటు స్నిగ్ధ కూడా వచ్చింది. రవీంద్ర మొదటిసారి చూడడం, కానీ స్నిగ్ధ మాత్రం ఎప్పటి నుంచో తెలిసినట్లు మాట్లాడుతుంటే, అబ్బురంగా చూసాడు. సోనాలి ‘వదినా!’ అంటూ స్నిగ్ధ వెనక తిరుగుతుంటే, రవీంద్ర అంజలి వేపు ప్రశ్నార్థకంగా చూసాడు. అంజలి నవ్వుతూ తల ఊపింది. 


అందరూ క్యాంపస్ కి వెళ్లే కూర్చున్నాక ప్రోగ్రాం మొదలుపెట్టారు. 


తేజ చెప్పినట్టు, ఒక గోల్డ్ మెడల్ కాదు, మూడు మెడల్స్ వచ్చాయి. స్నిగ్ధకి కూడా ఒక మెడల్ వచ్చింది. ఇది రవీంద్ర వాళ్ళకి సర్ప్రైజ్. 


అందరూ కొడుకుని పొగుడుతుంటే, నిజమైన పుత్రోత్సాహం వచ్చింది రవీంద్రకి. 


తన బాధ్యత సక్రమంగా నిర్వహించానని, అంజలి దేవుడికి, స్వర్ణకి, మనసులో కృతజ్ఞతలు చెప్పింది. 


డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న రవీంద్ర కుటుంబాన్ని, అందరికీ పరిచయం చేస్తున్నాడు తేజ రవీంద్ర కూడా డాక్టర్ అవడంతో, కొందరు తెలిసినవాళ్లు కూడా ఉన్నారు. 


స్నిగ్ధ, తల్లిదండ్రిని తీసుకు వచ్చి పరిచయం చేస్తూ “మా అమ్మానాన్నా! అమ్మా స్నిగ్ధ పేరెంట్స్” అలవాటుగా అన్నట్టుగా అన్నాడు తేజ. 


రవీంద్ర, తేజ వంక ఆశ్చర్యంగా చూస్తే, అంజలి అయోమయంగా చూసింది. 


‘తేజాయేనా తనని అమ్మ అని పిలిచింది’, ఆలోచనల్లో ఉండగానే తేజ ఫ్రెండ్స్ గుంపు గా వచ్చారు. 


“ఆంటీ! మా అమ్మ వలనే, గోల్డ్ మెడల్స్ వచ్చాయని ఇప్పుడు చెప్తున్నాడు, అదే ముందు చెప్పి ఉంటే మేము కూడా తేజ ఫ్లాటుకి వచ్చేవాళ్ళం చదువుకోడానికి”


నోట మాట రాకుండా తేజ వంక చూస్తోంది అంజలి. 

అంజలికి, చిన్నప్పుడు చూసిన ఆరాధన సినిమా గుర్తు వచ్చింది. అందులో షర్మిల టాగోర్ లా ఉంది ప్రస్తుతం తన పరిస్థితి. 


“స్నిగ్ధ మీ గురించి చాలా చెప్పింది. తేజని చూస్తే మీ గొప్పతనం తెలుస్తుంది, ఎంతమంచి పెంపకం. చదువు, సంస్కారం అన్నీ ఉన్నా, ఏమాత్రం అహంకారం లేని అబ్బాయి. మా స్నిగ్ధ చాలా అదృష్టవంతురాలు, మీలాంటి అత్తగారు దొరకడం” స్నిగ్ధ తల్లి ఆగకుండా మాట్లాడుతుంటే అంజలి అస్పష్టంగా “నేను తేజ కన్నతల్లిని కాను”


“ఓ! అదా! మాకు తెలుసు, స్నిగ్ధ మా దగ్గర ఏమీ దాచదు”

ఆవిడ మాట్లాడుతూనే ఉంది. 


“కంటేనే అమ్మ అవుతుందా? కృష్ణుడి తల్లి అనగానే గుర్తొచ్చేది యశోదేగా!” వెనకనుంచి వచ్చి, అంజలి మెడ చుట్టూ చేతులు వేసి, తేజ అంటుంటే, అంజలి కళ్ళల్లో ఆనందభాష్పాలు చూస్తూ “గోల్డ్ మెడలిస్ట్, నా డైలాగ్ కాపీ కొట్టాడు!” స్నిగ్ధ సంతోషంగా అంటూ, తనూ అంజలి చుట్టూ చేతులు వేసింది ఆప్యాయంగా. 


========================================================================

సమాప్తం

======================================================================== 


శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.


1 Comment


@lalithasripathi6

•1 hour ago

నా కథ ప్రచురించి యు ట్యూబ్ లో చదివినందుకు ధన్యవాదాలు ❤

Like
bottom of page