top of page
Original.png

మనకు మనమే రక్షణ

#SurekhaPuli, #సురేఖపులి, #ManakuManameRakshana, #మనకుమనమేరక్షణ, #TeluguStory, #తెలుగుకథ

ree

Manaku Maname Rakshana - New Telugu Drama Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 23/08/2025

మనకు మనమే రక్షణ - తెలుగు నాటిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

పులి, చిరుత, సింహం వంటి క్రూర జంతువులు పట్టణాల్లో కనబడవు, మనుషులు చంపేస్తారని భయం!


మనం (మనుషులం) అడవుల్లో నివసించలేము, ఎందుకంటే క్రూరమృగాలు మనల్ని చంపి తినేస్తాయని మన భయం!!


పిల్లలూ! భయం అనే అంశం పైన ఈ నాటిక.


(తెర పైకి లేస్తుంది)


అడవి ప్రాంతం! పగటివేళ. చెట్ల నీడన చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఏనుగు, ఖడ్గమృగం, నీటిగుర్రం, తోడేలు, జిరాఫీ, జింక, కోతి, ఉడుత, నక్క, గుర్రాలు మొదలగు జంతువులు సమావేశమై సుధీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. 


ఒక రోజు శాకాహార జంతువులు సమావేశమయ్యాయి. ‘క్రూర జంతువులు అడవిలో రాజ్యమేలుతున్నాయి, మనం స్వేచ్ఛగా అడవిలో తిరగాలి. ఎవ్వరికీ భయపడే అవసరం లేద’ని అనుకున్నాయి.


జింక: (బాధపడుతూ) మా మాంసం రుచిగా ఉంటుంది అని క్రూరమృగాలు ప్రతి సారి మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి, ఉత్తపుణ్యానికే బలి అయిపోతున్నాము. వేగంగా పరిగెత్తిన లాభం లేదు.


కుందేలు: (గుక్క తిప్పుకోకుండా) నువ్వే కాదు, మా వాళ్లు కూడా చాలా వేగంగా పరిగెత్తినా లాభం లేదు, పులికో, సింహానికో, చిరుతకో దొరికిపోతున్నారు. (మరింత వ్యథ వ్యక్తపరిచింది)


ఏనుగు: (శాంతంగా) మనం వేగంగా పరిగెత్తి మనల్ని మనం రక్షించుకునేందుకు దేవుడు నాలుగు కాళ్ళు ఇచ్చాడు. ఈ పరుగుల జీవితం మనకు అలవాటే. ఇప్పుడు మన రక్షణ కొరకు మార్గాలు వెతకాలి.


నీటి గుర్రం: (బద్దకంగా) క్రూర జంతువుల ఆకలి వేట యిది; పోనిద్దరూ.. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది.


కోతి: (విసుగ్గా) ఓ నీటి గుర్రమా! అప్పుడే మంగళం పాడి, స్వస్తి చెప్పకు.. నీ సోమరితనానికి సెలవు యిచ్చి, దయచేసి చురుకుగా సభలో పాల్గొంటావా? లేక పడుకుంటావా? నీ బద్దకంతో మా చురుకుదనం చంపకు!.. శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యానికి గుర్రం నిదర్శనం! వాటి సలహా తీసుకుందాము. అప్పుడు మన సమావేశం ఒక కొలిక్కి వస్తుంది. (చటుక్కున చెట్టు కొమ్మను చేత పట్టుకొని ఝుళిపించింది).


మిగతా జంతువులన్ని: భలే అన్నావు (అంటూ చప్పట్లు కొట్టారు).


కోతి పరోక్షంగా చేసిన పొగడ్త వినేసరికి సదస్సులో పాల్గొన్న తెల్ల గుర్రం, నల్ల గుర్రం, గోధుమ రంగు గుర్రాల మనసు సంతోషంగా పొంగి చెవులు కదిలించి ఒకరి ముఖం ఒకరు తృప్తిగా చూసుకున్నాయి.


నల్ల గుర్రం: నన్ను ‘బ్లాక్ బ్యూటీ - చెరగని అందం’ అని గొప్పింటి వాళ్లు నన్ను పెంచుకుంటారు. 



గోధుమ రంగు గుర్రం: రాజులు నాపై స్వారీ చేశారు. ఈ రోజుకు కూడా జాతీయ పండుగ నాడు నా స్వారీ విన్యాసాలు వుంటాయి.


తెల్ల గుర్రం: అప్పుడప్పుడు పెళ్లి కొడుకు కొద్ది సేపు నా పైన ఊరేగుతాడు.. (దోషి వలే చిన్న స్వరంతో చెప్పగానే అందరూ గొల్లున నవ్వి హేళన చేశారు). 


అవహేళన భరించలేక, ఏదో ఒకటి చేయాలనే తొందరపాటుతో “మీ కోసం నేను పులి వలే మారిపోయి ఇతర క్రూరమృగాలను భయపెట్టి మిమ్మల్ని రక్షిస్తాను. (అందరి మెప్పు పొందాలని తెల్ల గుర్రం తన శరీరంపై నల్ల చారలు పూసుకుంది. జంతువులన్ని ఆశ్చర్యపడ్డాయి).


తెల్ల గుర్రం: ఇప్పుడు చూడండి.. నా శౌర్యం! పులి లాగ ఉన్నా! చిరుత పులి లాగ ఉన్నా!! లేక బెబ్బులి లాగా ఉన్ననా?? (పాట పాడుతూ అటూ ఇటూ తలెత్తుకు పరుగెత్త సాగింది. వింతగా, వికృతంగా ఉన్న నల్ల చారల తెల్ల గుర్రాన్ని చూసి


మిగితా గుర్రాలు: నీ విచిత్రమైన కొత్త వేషానికి అభినందనలు! నువ్వు ఇలాగే ‘చారల గుర్రం’ (జీబ్రా) పేరుతో అడవిలో నివసించు, మేము ప్రజలు ఉన్న చోటుకు వెళ్లిపోతాము.


ఏనుగు: (తొండం వూపుతూ నవ్వి) విడివిడిగా ఉన్నా, కలిసి ఉన్నా మీరంతా ఒకే జాతి కుటుంబానికి చెందిన వారు.


ఉడుత: (చెంగున వచ్చి) అసలు విషయం దారి మళ్ళింది, బలమైన ఏనుగు ఎలుగుబంటి, ఖడ్గమృగం మీరంతా ముందు నిలబడి ఈ ఆపద నుండి కాపాడాలి, అని చెప్పగానే దూరాన మృగరాజు పరుగును గమనించి సమావేశం అసంపూర్తిగా వదిలి జంతువులన్నీ ప్రాణ రక్షణ కోసం గుంపుగా నిలబడి గొంతెత్తి భీకరంగా అరిచాయి.


ఏనుగు: పులి మిత్రుమా, ఆగు.. నీ పరుగును ఆపుము! నువ్వు మా అందరి వలె అరణ్య నివాసివి. మాతో కలిసి స్నేహంగా ఉండాలి. మాలో ఒకరిని వేటాడి చంపి భుజించడం న్యాయమా?


పులి: మరి నా ఆకలి తీరేదెలా? మీరైతే శాకాహారులు, ఏవో కాయలు, పండ్లు తిని బతుకుతారు. నేను మాంసహరిని, మా ఆకలి తీర్చే దారి చూపించి న్యాయం వినిపించు. నచ్చితే ఆలోచిద్దాం.


ఏనుగు: మేము నిన్ను మృగరాజు అని, ఈ అడివి రా రా రాజు అని అందలం ఎక్కించి గౌరవం ఇస్తున్నాము. నీ కర్తవ్యం మా అందరి మంచిని ఆశించాలి. మా రక్షణ కూడా నీ బాధ్యత; అన్ని జంతువులు స్వేచ్ఛగా అడవిలో తిరగాలి. ఎవ్వరికీ భయపడే అవసరం లేదని మనోధైర్యంతో మేమంతా ఉండాలి.


పులి: నువ్వు కూడా బలశాలివి, నా బదులు నువ్వు రాజ సింహాసనం తీసుకో.


ఏనుగు: నాకు అధిష్టానం అవసరం లేదు. మనందరి సంక్షేమం ముఖ్యం!


పులి: సరే, మీ ఆలోచన బాగుంది, మీలో మీరు ఆలోచించుకుని ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. ఎవరైనా మంచి సలహా ఇవ్వండి. బాగుంటే అమలు చేద్దాం. (అలిసి పోయి కూర్చుంది)


జింక: నా సలహా వింటారా? (భయంగా చెప్పింది).


కోతి: తప్పకుండా.. (ఆసక్తిగా అన్నది)


ఉడుత: త్వరగా చెప్పు మరి (ఆతృతగా అడిగింది)


జింక: మేము చనిపోయిన తర్వాత మీ వంటి క్రూరమృగాలు ఆకలి తీర్చుకోవాలి. అంతే గాని మమ్మల్ని వేటాడి చంప వద్దు!


పులి: చల్లబడిన రక్తం తాగాలా? రుచి లేని చప్పటి భోజనం చేయాలా?? (నిరాశగా అన్నది)


నక్క: మేము, రాబందులు, తోడేళ్ళు చచ్చిన ఆహారంతోనే సద్దుకుని ఆకలి తీర్చుకున్నట్లు మీరు కూడా మా వలె అలవాటు చేసుకోవాలి. కాలంతో పాటు మనమూ మారాలి! తప్పదు.. గుంపులో గోవిందా! (మెల్లిగా గిణిగింది)


జిరాఫీ: లేదంటే శాకాహారిగా మారిపో, అందరికీ మేలు జరుగుతుంది. (స్వరం పెంచింది)


పులి: (గంభీరంగా అంది) శాకాహారమా? నేనే కాదు, మా జాతిలో ఎవ్వరూ అంగీకరించరు. నన్ను ‘రాజు’ అని మర్యాద ఇచ్చి గౌరవించినందుకు మీ కోరిక మేరకు చనిపోయిన జంతు మాంసం తింటాము. కానీ ఒక్క షరతు..


ఏనుగు: (విస్తూ పోయి, పులి మాటను మధ్యలో ఆపేసింది) ఏమిటా షరతు?

 

వూపిరి బిగపట్టి జంతువులు వింటున్నాయి, అసలే పులి! ఎటువంటి కఠినమైన నిర్ణయం తీసుకొని శాసిస్తుందో అని అందరూ గుండె దడ హెచ్చి ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. 


పులి: మీలో ఎవరైనా, ఏదైనా కారణం చేత మరణించినచో వెంటనే నాకు గాని నేను కనబడకపోతే నా మిత్రులు సింహం, చిరుతకు గాని కబురు చేయాలి. మాలో ఒకరు వెంటనే వచ్చి మా గుహలోకి తీసుకెళ్లి మేమందరం కలిసి భోజనం చేస్తాము.


కోతి: నేను కొమ్మ కొమ్మను పట్టుకొని అడవి అంతా షికార్లు కొడతాను కదా, మీ కోరిక ప్రకారం చావు కబురు చల్లగా క్షణాల్లో చెబుతాను. మీ కుటుంబీకులు గాని మిత్రులు గాని చింతించాల్సిన పని లేదు. 

మరో ముఖ్యమైన విషయం! మన అరణ్యాలు క్షీణిస్తున్నాయి, చెట్లు నరికేస్తున్నారు. మనకు రక్షణ మన వృక్షాలు, గుహలు. అందుకే మనలో ఐక్యమత్యం చాలా అవసరం.



ఏనుగు: మృగరాజా! మీరు ఆజ్ఞ ఇవ్వండి, అమలు చేస్తాం (తొండం ఎత్తిపట్టి వినయంగా అంది.)


పులి: (గర్జిస్తూ అంది) మన చుట్టూ ఉన్న పచ్చని వృక్షాలు ఎవ్వరైనా నరికే ప్రయత్నం చేస్తుంటే మీలో ఎవరైనా ఒకరు నాకు అత్యవసరముగా తెలియజేయండి, వెంటనే వారి అంతు చూస్తా!


కుందేలు: రాజా.. మీ సహాయం ఇంకా కావాలి.. మనుషులు నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని, జింకలను, ఉడుతలను, అడవి పందులను మొదలుగు జంతువులను వేటాడి సంబరాలు చేసుకుంటున్నారు.


ఉడుత: అవును, ప్రతి దినం భయంతో చస్తున్నాం, మీరే ఈ మాయ వేటగాళ్లకు బుద్ధి చెప్పాలి.


పులి: మీరు అందరూ నిర్భయంగా, సంతోషంగా ఉండాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి.


నీటి గుర్రం: (హుషారుగా లేచింది) మీరు ఆజ్ఞ ఇవ్వండి మహారాజా!


తోడేలు: మీ అభయం మాకు శ్రీరామరక్ష! మీకు అన్ని విధాల సహాయం చేస్తాం, చెప్పండి రాజా.. 


పులి: మీరు అందరూ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. వేటగాళ్లు ఎవరైనా మన సంస్థానంలో అడుగు పెట్టగానే ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందజేయండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. (పులి అభయం ఇచ్చింది).


నల్ల గుర్రం: అంటే.. మనుషులను చంపేస్తారా?! పాపం.. (సానుభూతి తెలియజేసింది)


పులి: (నవ్వుతూ అంది) నా పేరు వింటేనే మీ కంటే ఎక్కువ మనుషులకు భయం! నన్ను చూస్తేనే హడలు!! చంపే వరకు వాళ్లు ఆగరు, పారిపోతారు.

జంతువులు సంతోషంగా జేజేలు పలుకుతూ నాట్యం ఆడాయి.


(తెర దించబడింది)

*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 


Comments


bottom of page