కలువ
- Malla Karunya Kumar
- Aug 22
- 8 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #Kaluva, #కలువ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

Kaluva - New Telugu Story Written By - Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 22/08/2025
కలువ - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
"ఒకసారి రుచి చూస్తే మళ్ళీ వదలవు. పదికి ఇరవై.. వందకు రెండువందలు. రిస్క్ అన్న మాట లేదు. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి ఆడుతుంటారు. లక్షల్లో చేతులు మారుతుంటాయి. ఎటువంటి మోసం లేదు.."
స్నేహితుడు రఘు చెప్పిన మాటలు తన మస్తిష్కంలో తాండవం చేస్తుండడం తో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు భూషణ్. మెల్లగా చీకట్లు పోయి వెలుతురు సమీపిస్తోంది!.
"భగవంతుడా!, ఈ రోజు నాకు మంచి లాభం చేకూర్చు” అని దేవుడ్ని వేడుకుంటూ, తన రెండు చేతులూ పాముకొని వాటిని చూసి కళ్ళకు అద్దుకున్నాడు. ఇంతలో ఎదురుగా శబ్ధం రావడం తో అటువైపుకు చూసాడు. ఎదురుగా ఒకామె పొడవాటి కర్ర కు కట్టిన చీపురు పట్టుకొని ప్లాట్ ఫాం పక్కన పడి వున్న చెత్తను తుడుస్తూ కనిపించింది. సూర్యుడు కంటే ముందే నిద్ర లేచి, రోజూ అక్కడ చెత్తను తుడుస్తూ వుంటారు ఆ కార్మికులు వాళ్ళే పారిశుధ్య కార్మికులు.
"ఛీ, ప్రొదున్నే ఈ దర్శనం ఏమిటి? మొత్తం ప్రోగ్రాం బెడిసి కొట్టేలా వుంది. ఈ చీపురు, ఆ మనిషి. ప్రొదున్నే ఈమె ను చూసాను.. ఏమి నష్టం వస్తుందో ఏమిటో?” అని అసహనంతో ఆమెను తిట్టుకుంటూ వున్నాడు భూషణం.
ఎవరితో నాకు సంబంధం లేదు.. నా పనే నాది అన్నట్టుగా ఆమె ఏకగ్రమైన తన పని తను చేసుకుంటుంది. వస్తూ, పోతూ వున్న జనాలతో ఆ బస్ స్టేషన్ కిటకిటలాడుతుంది. అంతకు ముందు తన స్నేహితుడు చెప్పిన మాటలు తనను కుదురుగా వుండనిచ్చేవి కావు. ఇప్పుడు అవన్నీ తనకు కలిగిన కోపానికి ఆవిరి అయిపోయాయి.
విసుక్కుంటూ వెళ్ళి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని వచ్చాడు. ఇంతకు ముందు కన్నా జనాలు రద్దీ ఎక్కువ అయ్యింది. కూర్చోవడానికి వేసి వున్న ఇనుప కుర్చీలు అన్నీ జనాలతో నిండిపోయి వున్నాయి. వేరేవేరే ప్రదేశాలకు బయలుదేరుతున్న బస్సులు గురించి అనౌన్స్ మెంట్ చేస్తున్నారు. అలా చూస్తూ, నడుస్తూ ముందుకు వెళ్తూ ఒక స్తంభం దగ్గర కూర్చోవడానికి ఖాళీగా వుండడం తో అక్కడ ఆగి కూర్చున్నాడు. తన మొబైల్ తీసి టైం చూసాడు..
‘ఏమిటి సమయం అవుతున్నా రఘు ఇంకా రాలేదు. ఒక ఫోన్ కూడా లేదు’ అని అనుకుంటూ, ఫోన్ తీసి రఘు కు ఫోన్ చేసాడు. ఈ నెంబర్ ను ప్రస్తుతం చేరుకోలేము అని సమాధానం వచ్చింది.
‘వీడు ఎప్పుడూ ఇంతే.. ముందు చాలా మాటలు చెప్తాడు. తర్వాత అడ్రెస్సులే ఉండవు’ అని ఒక నిట్టూర్పు తీసాడు..
ఇంతలో ఒకామె జనాలను బెదర గొడుతూ, "ఏ జరగండి! జరగండి.. ఏ బాబు ఏమిటి ఆ నీళ్ల బాటిల్ ఇక్కడే పడేసావు?.. తీసి ఆ తొట్టెలో వెయ్యి” అని గట్టిగా అరవడం తో ఆ వ్యక్తి భయంతో ఆ బాటిల్ తీసి చెత్త తొట్టెలో వేసాడు.
మిగతా వారిని బెదరగొడుతూ ఆమె ఆ ప్లాట్ ఫారం తడిపిన వస్త్రం కట్టిన కర్రతో తుడుస్తూ వస్తుంది..
ఆమెను చూసిన భూషణం, "మళ్ళీ ఈమె ఎంట్రీ ఏమిటి? చూస్తుంటే ఇంతకు ముందు కనించిన ఆవిడ కంటే ఈమె ప్రమాదకరంగా వుంది. కేకలుతో అందరినీ బెదర గొడుతూ వుంది.. మనుషులంటే ఈమె కు లెక్కేలేదు. అసలు ఇలాంటి వాళ్ళను చూస్తూనే నాకు అసహ్యం” అని అనుకుంటూ, మళ్ళీ తన ఫోన్ చూసాడు.. రఘు ఎపుడు ఫోన్ చేస్తాడా అని. కానీ, రఘు ఫోన్ చేయలేదు.
ఇంతలో ప్లాట్ ఫామ్ తుడుస్తూ భూషణం దగ్గరకు కూడా ఆమె చేరుకుంది. భూషణం ఆమెను ఏమీ అనకుండా అక్కడే కూర్చొని వున్నాడు. ఆమె కూడా భూషణం ను ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటుంది. కనీసం జరుగు అని చెప్పకుండా భూషణం కాలుకు తగిలిస్తూ ఆ తడిపిన గుడ్డ కర్రతో ఆ ప్రదేశం శుభ్రం చేస్తుంది.. ఆ కర్ర తన కాళ్లకు తగలడం తో, ఆమె వైపు చూడటం కూడా ఇష్టం లేని భూషణం, ముఖం పక్కకు తిప్పుకొని, "ఏ, ఏమిటి ఇక్కడే తుడుస్తున్నావు? పైగా కాళ్లకు ఆ కర్ర తగిలిస్తూ.. " కోపంతో అరిచాడు భూషణం..
"ఏమిటయ్యా గట్టిగా అరుస్తున్నావు?.. నువ్వే పక్కకు పో.. " గట్టిగా సమాధానం ఇచ్చింది ఆమె..
"ఎంత పొగరు నీకు.. ?" అంటూ ఆమె వైపు చూసాడు..
"అవునయ్య నాకు పొగరే. అయితే ఏమిటంటే?” ఉరుముతూ అంది ఆమె..
ఆమె ముఖం చూడటం రెండో సారి, ఆమెను చూస్తూ, ఆమె మాటలు వింటున్నాడు. కానీ, సమాధానం చెప్పడం లేదు భూషణం.
‘ఈమెను ఎక్కడో చూసినట్టు వుంది! తెలిసిన ముఖంలా కనిపిస్తుంది!. ఎక్కడ, ఎక్కడ?..’ అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి,
‘ఆ! గుర్తుకు వచ్చింది.. ఈమె, ఆమె ఒకరే కదా?. చాలా ఏళ్ళు అయిపోయాయి. కానీ ఆమె ముఖం నేను మరిచిపోలేను’ అని మళ్ళీ సందిగ్ధ పడుతూ, ఆమె చేతి వైపు చూసాడు. ఎడమ చేతి మీద ఒక రోజా పువ్వు పచ్చబొట్టు వుంది ఆమె కు.. అది చూసి నిర్ధారించుకొని,
"నువ్వు కలువలమ్మవు కదా.. ” అని ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ అడిగాడు.
అంతవరకు చిచ్చు బుడ్డిలా మండిపోతున్న ఆమె. ఒక్కసారిగా ఆగి. కాసేపు ఎగాదిగా భూషణం వైపు చూసి, “నా పేరు మీకు ఎలా తెలుసు?.. ఎవరు మీరు?.." ఇంతకు ముందు వున్న కఠినత్వం వదిలి సౌమ్యంగా అడిగింది..
"నువ్వు రామప్ప కూతురు కలువలమ్మవే కదా?.. నా పేరు భూషణం!. మరిచిపోయావా?. అప్పుడు యూనివర్సిటీ లో డిగ్రీ చదవడానికి వచ్చి మీ వీధిలో ఒక రూం లో అద్దెకు వుండేవాడిని.. మీ కుటుంబం తో నాకు బాగా పరిచయం, గుర్తుకు వచ్చానా.. " మొత్తం వివరించిన తర్వాత అడిగాడు..
భూషణం చెప్పింది విని ఆశ్చర్యంతో చూస్తూ, కొంత సమయానికి, "ఓహ్! అన్నయ్య, నువ్వా?.. మనిషివి ఎంతలా మారిపోయావు!.. బాగున్నావా?.. ఇక్కడ ఏమిటి నువ్వు?” అడిగింది చిరునవ్వుతో..
"చిన్న పని మీద ఇక్కడకు రావాల్సి వచ్చింది. అది సరే, నువ్వు ఏంటి ఇక్కడ?. అది కూడా ఇలాంటి పని చేస్తూ!.. మీ అమ్మానాన్న ఎలా వున్నారు?.." అడిగాడు భూషణం..
"వాళ్ళు నన్ను వదిలి చాలా కాలం అయ్యింది అన్నయ్య.. " ముఖం దించుకుంటూ చెప్పింది.
మాట విని కాస్త దిగ్భ్రాంతికి గురయ్యాడు భూషణం..
"అన్నయ్య! నువ్వు చాలా రోజులకు కనిపించావు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమిటో?. మా ఇంటికి రాకూడదు. “ అడిగింది ఆమె. ఆమె అలా అడగడం తో సందిగ్ధం లో పడ్డాడు..
భూషణం ఏమీ మాట్లాడక పోవడం తో, "ఏమిటి అన్నయ్య!, నన్ను, నా వాలకం చూసి, మా ఇంటికి రావడానికి ఆలోచిస్తున్నావా?” అంది ఆమె.
ఈ మాటలు తన కుంటి ఆలోచనలకు గొడ్డలి వేటు లా తగిలాయి. ఒక్కసారిగా తన సందిగ్ధత వీడుతూ,
"అయ్యో అమ్మ!, అలా ఎందుకు అనుకుంటావు?.. నేను నిన్ను అలా ఎందుకు చూస్తాను?. నా స్నేహితుడు రఘు తో పని వుండడం కారణంగా ఇక్కడకు వచ్చాను. అతని ఫోన్ అవ్వడం లేదు.. అతను వస్తె అతని తో వెళ్ళాలి. అందుకే ఆలోచిస్తున్నాను. " అని అన్నాడు భూషణం.
"మా ఇల్లు దగ్గరే అన్న. అతను వస్తె ఫోన్ చేస్తాడు కదా, అప్పుడు వెల్దువు గాని, " అని ప్రాధేయ పడుతూ అడిగింది కలువలమ్మ. ఆమె అభిమానానికి, కాదనలేక పోయాడు..
మరొకసారి రఘుకు ఫోన్ చేసాడు. ఇప్పుడు కూడా అలానే వస్తుంది. ఇక లాభం లేదు అనుకొని కలువలమ్మ ఇంటికి వెళ్ళడానికి సిద్దం అయ్యాడు.
భూషణం తన ఇంటికి వస్తున్నాడు అని ఆనందంతో ఉప్పొంగిపోతూ, దారంతా ఏవో మాటలు చెప్తూ ముందుకు కదులుతుంది. అతను ఆమెను అనుసరిస్తున్నాడు. ఒక పావుగంట తర్వాత ఒక ప్రాంతానికి చేరుకున్నారు. చూడటానికి ఆ ప్రాంతం గందర గోళంగా వుంది. పెంకుటిల్లు, పూర్తిగా నిర్మాణం కానీ డాబా ఇల్లు దర్శనం ఇస్తున్నాయి. ఒక పెంకుటిల్లు ముందుకు చేరుకొని.. "ఇదే అన్న నా ఇల్లు.. లోపలికి రా.. " అని తలుపు తెరుస్తూ అంది. ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ లోపలికి వెళ్ళాడు భూషణం..
"అన్న! నువ్వు ఇక్కడే వుండు నీకు తాగడానికి జ్యూస్ తీసుకు వస్తాను” అని నవ్వుతూ అని, అక్కడ వున్న కుర్చీ భూషణం కు ఇచ్చింది. వద్దు అని చెప్పాలి అనుకున్నాడు. వద్దు అంటే ఆమె బాధపడుతుంది అని సరే అని అన్నాడు..
ఆమె అక్కడ నుండి కదిలింది. చుట్టూ పరికించి చూస్తూ వున్నాడు. తనకు తగిన రీతిలో ఆ ఇల్లు శుభ్రంగా పేర్చి వుంది. అక్కడ కూర్చొని ఏవేవో ఆలోచనల్లో పడ్డాడు భూషణం. మెల్ల మెల్లగా తన కాలేజీ రోజుల్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి..
***
భూషణం డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి అయ్యింది. యూనివర్సిటికి దగ్గర వుండాలని అక్కడే వున్న ఊర్లో రూం అద్దెకు తీసుకున్నాడు. భూషణం కుటుంబం ఆర్దికంగా ఉన్నతి స్థితి కలిగి వుండడం తో డబ్బుకి ఎటువంటి లోటు వుండేది కాదు. తనకు ఆ చుట్టు పక్కల వున్న మనుషులు అంటే అంత నచ్చేది కాదు. ఎవరితోనూ మాట్లాడే వాడు కాదు. అలాంటి భూషణం కు తను అద్దెకు ఉంటున్న వీధిలో రామప్ప తో పరిచయం ఏర్పడింది.
మొదటి ఏదో మాట్లాడాలని మాట్లాడే వాడు. కానీ రామప్పతో కూడా మాట్లాడటం భూషణం కు ఇష్టం వుండేది కాదు.
రామప్ప అతని భార్య కాంతం కూలి పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళు. వాళ్లకు పుట్టిన ఏకైక కూతురు కలువలమ్మ.. రామప్ప ఆర్దికంగా ఉన్నతి స్థితి కాకపోయినా, పేరుకు మాత్రం గొప్ప వ్యక్తి. అతనుకు అందరూ చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు. అది చూసి భూషణం ఆశ్చర్యపోయాడు.
అప్పటి నుండి రామప్ప కు భూషణం కు గట్టి పరిచయం ఏర్పడింది. కలువలమ్మ కూడా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించేది. అందరూ ఆమెను కలువ అని పిలిచే వారు. అలా ఒకరోజు భూషణం పక్కవూరి అమ్మాయికి ప్రేమ లేఖ ఇచ్చాడని తెలిసి ఆమె కుటుంబ సభ్యులు భూషణం ను పట్టుకుపోయి, కొట్టారు.. అతన్ని ఎంతకీ వదలలేదు. విషయం తెలిసి రామప్ప అక్కడకు వెళ్లి వాళ్ళతో మాట్లాడి భూషణం ను విడిపించుకొని వచ్చాడు.
"బాబు! ఇక్కడ వున్నవాళ్ళు మంచి, చెడు ఆలోచించరు బాబు. వాళ్లకు పరువు ముఖ్యం. నేను రావడం క్షణం ఆలస్యం అయితే నీ ప్రాణానికి ఎంత ప్రమాదం?. ఇలాంటి ప్రేమలు మనకు వద్దు బాబు. హాయిగా చదువుకో. ఇంకో సారి నువ్వు ఇలాంటి వాటి జోలికి వెళ్లనని నాకు మాట ఇవ్వు.. ” అని రామప్ప భూషణం దగ్గర మాట తీసుకున్నాడు.
ఆ రోజు నుండి భూషణం రామప్పను మరిచిపోలేదు.. ఒక్కసారిగా ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకోగానే తన కళ్ళ వెంబడి నీరు కారాయి.
"కలువలమ్మ కూడా చాలా తెలివైనది, బాగా చదివేది.. కానీ ఈ రోజు ఆమె ఇలాంటి స్థితిలో వుండడానికి కారణం ఏమిటి?" అని ఆలోచనలో ఉన్నాడు భూషణం.
ఇంతలో కలువలమ్మ అక్కడకు వచ్చింది, అన్నయ్య అని పిలుస్తూ, చేతిలో వున్న జ్యూస్ గ్లాస్ భూషణం కు అందించి.. "అన్నయ్య, నా కొడుకు.. తొమ్మిదో తరగతి చదువుతున్నాడు” కొడుకును చూపిస్తూ అంది కలువలమ్మ.
జ్యూస్ తాగడం పూర్తి చేసి, "అమ్మ!, నువ్వు ఈ పరిస్థితిలో వుండడానికి కారణం ఏమిటి?. అసలు ఏమి జరిగింది?” అని అడిగాడు భూషణం.
"నువ్వు వెళ్లిపోయిన చాలా సంవత్సరాలు వరకు బాగానే వుంది అన్నయ్య. తర్వాత నాన్నకు అనారోగ్యం చేసింది. అతను మంచం పట్టాడు.. తాను బ్రతికి వుండగానే నా పెళ్లి చూడాలని, అదే తన చివరి కోరికని చెప్పాడు. అమ్మ తనకు తెలిసిన వాళ్లకు చెప్పి ఓ సంబంధం చూసింది. నా పెళ్లి అయ్యింది.
ముందు మంచి వాడిలా నటించిన అతని నిజ స్వరూపం తర్వాత నాకు తెలిసింది. అతను ఒక తాగుబోతు, తిరుగుబోతు. పెళ్లి సంబంధం తెచ్చిన వాళ్లకు ఈ విషయం తెలిసే మోసం చేసి ఈ పెళ్లి చేశారు. సర్లే నా ఖర్మ ఇలా రాసి వుందని అనుకొని, అతన్ని మార్చుకోవాలనుకొని ప్రయత్నం చేశాను.. కానీ, అతను నా మాట వినేవాడు కాదు. నన్ను కొట్టే వాడు.. తర్వాత కట్నం, కట్నం అని హింసించాడు.
అక్కడకు సంవత్సరానికి నాన్న నాకు దూరం అయిపోయారు. అమ్మ కూడా అక్కడికి సంవత్సరం కు దిగులుతో చనిపోయింది. నేను ఒంటరి అయ్యాను. నా కష్టం చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఆ సమయంలోనే నేను గర్భవతి అయ్యానని తెలిసింది. నాకు భయం పట్టుకుంది. నాకు పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏమిటని?..
మా అత్త మామలకు పరిస్థితి వివరించాను. కానీ, వాళ్ళు మాకు సంబంధం లేదని నన్ను వెళ్లగొట్టారు. కొన్ని రోజులు తర్వత ఆయన తప్ప తాగి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఆ క్షణం నుండి నేను దిక్కులేని దానిలా రోడ్ల వెంబడి తిరిగాను. నన్ను ఆదరించే వాళ్ళే లేరు. చివరికి ఈ ప్రదేశం కు చేరుకుంటే ఒకామె నన్ను చేరదీసి, నాకు ఈ పని వచ్చేలా చేసింది.
నా బిడ్డ కోసం బ్రతికాను. ఇప్పటికి వాడికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాను. ఈ పని చేస్తే జనాలు చులకనగా చూస్తారని తెలుసు, కానీ బ్రతుకు తెరువు కోసం తప్పలేదు. కొందరు ఆడిన మాటలకు నా మనసు కఠినంగా మారింది.
అందుకే నేను జనాలు మీద అరుస్తున్నాను. జనాలు కూడా కొంత మంది డబ్బుకే విలువ ఇస్తారు అన్నయ్య. మనిషికి విలువ ఇవ్వరు. " చెప్తూ, ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంది. ఆమె గురించి విని భూషణం లో చాలా బాధ కలిగింది..
"అయ్యో అంత మంచి తండ్రికి పుట్టిన ఈమెకు ఈ గతి పట్టిందా. తన బిడ్డ కోసం ఇంతలా కష్టపడుతుందా. ఇంతకు ముందు కలువ ను చూసి ఎవరో అనుకొని, పారిశుధ్యం చేస్తున్న వాళ్ళను ఎంత అసహ్యించు కున్నాను. అప్పుడు నాకు తెలియక కలువ ను కూడా అసహ్యంగా చూసాను. తర్వాత ఆమె ఎవరు అని తెలుసుకున్నాక నాలో భావన మారింది. ఎంత దౌర్భాగ్యపు బుద్ది నాది.. " అని తనని తాను తిట్టుకుంటూ లోలోపల కుమిలిపోయాడు.
"వీళ్ళ నాన్నల బాధ్యత లేకుండా వుండకూడదు అని.. వీడికి మంచి, చెడూ చెప్తూ పెంచుతున్నాను.. వీడు నా బాధ అర్థం చేసుకుంటే అదే చాలు” అని అంది కలువలమ్మ. ఆమె మాటలు విని ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు భూషణం..
"మీరు ఈ వ్యసనం మానేస్తే మంచిది అండి, కష్టమైన మనకు తప్పదు.. ఎందుకంటే ఇప్పటికే మీరు లాస్ అయ్యి మళ్ళీ తేరుకున్నారు. ”ఎప్పుడూ తన భార్య చెప్తూ వుంటుంది.
"నీకు ఎందుకు, నీ డబ్బులు నేను ఖర్చుపెట్టడం లేదు కదా” కఠినంగా సమాధానం ఇవ్వడం భూషణం నైజం..
"నాన్న, నేను మీ దగ్గరకు వస్తాను. మీతో కొన్ని రోజులు వుంటాను. నా కొడుకు కూడా మీ దగ్గరకు రావాలని సరదా పడుతున్నాడు” కొడుకు తరచూ ఫోన్లో ఈ మాట అంటుంటాడు..
"వద్దు, రావద్దు.. ఇక్కడకు వచ్చి ఏమిచేస్తావు.. " కొడుకును రానివ్వకుండా అడ్డుకుంటాడు. ఎక్కడ తన పనికి అడ్డుపడతారో అని.
ఇవన్నీ గుర్తుకు వచ్చి, "నిజంగా నేను నా కుటుంబం గురించి పట్టించుకుంటున్నానా. ఎప్పుడూ నా ఎంజాయ్ కోసం ఊర్లు పట్టుకొని తిరగడం తప్పా. వచ్చిన లాభాన్ని ఇలా వ్యసనాలకు తగలేయ్యడం. ” అని తనలో అనుకుంటూ, చివరికి ఒక నిర్ణయం కు వచ్చాడు..
వెంటనే తన దగ్గర వున్న బ్యాగ్ తీసి, అందులో వున్న పది లక్షలు తీసి,
"అమ్మ!, ఇవి తీసుకో, నీ కొడుకు పేరు మీద డిపాజిట్ చేసుకో. భవిష్యత్తులో పనికి వస్తాయి. ” అని ఆమెకు ఇవ్వబోయాడు భూషణం..
"అయ్యో వద్దు అన్నయ్య!, నేను కష్టపడి నా బిడ్డను పోషించుకోగలను. "
"ఏంటి తల్లి అన్నయ్య ఇస్తే కూడా వద్దని అంటున్నావా?.. నువ్వు వద్దు అంటే ఈ అన్నయ్య బాధపడతాడు కదా.. ” అని అన్నాడు భూషణం.
"అయ్యో అన్నయ్య, మీరు అలా అంటే ఎలా?. సరే మీకు అంతగా ఇవ్వాలి అనిపిస్తే.. ఒకామెకు ఇవ్వండి. ఆమెకు ఇస్తే నాకు ఇచ్చినట్టే. "
కాసేపు ఆశ్చర్యంతో చూస్తూ, "ఎవరమ్మా ఆమె?. ” అడిగాడు.
"రండి అన్నయ్య చూపిస్తాను.. " అని తనతో పాటు తీసుకు వెళ్ళింది..
చివరకు ఒకామె దగ్గరకు చేరుకొని, “అన్నయ్య, ఈమె చంద్రమ్మ, ఈమె భర్త నాలాంటి పని చేస్తూ వుండేవాడు. ఒకరోజు ఎవడో నిర్లక్ష్యంగా కారు నడిపి, పనిలో వున్న అతని మీదకు కారు పోనిచ్చాడు. ఆ ప్రమాదం లో అతను మరణించాడు. అప్పటి నుండి కూతురు, కొడుకు బాధ్యత చంద్రమ్మ మీద పడింది. కూతురుకు మంచి చదువు చదివించాలి అనుకుంటుంది. చంద్రమ్మ కూతురు కూడా ఇంటర్ పూర్తి చేసింది. బాగా చదువుతుంది. ఇక ఉన్నత చదువులు చదవాలని ఆమె కోరిక. ఈమెకు ఆ డబ్బు ఇవ్వు అన్నయ్య. ” అని అంది కలువలమ్మ.
కలువలమ్మ మాటలు విని భూషణం కళ్ళలో నీరు తిరిగాయి.
"ఇంత డబ్బు ఇచ్చిన ఆమె తీసుకోలేదు. పైగా తన తోటి వారు ఆపదలో వున్నారని తెలిసి వాళ్లకు సహాయం అందించమని చెప్పింది. ఇంతటి మంచి మనసున్న వ్యక్తి నాకు పరిచయం అయినందుకు చాలా సంతోషం. ” అని తనలో అనుకుంటూ, చంద్రమ్మకు ఆ డబ్బును అందించాడు. కృతజ్ఞత పూర్వకంగా చంద్రమ్మ భూషణం వైపుకు చూసి, ఆ డబ్బు తీసుకొని నమస్కారం చేసింది చంద్రమ్మ..
"ఎన్నో సార్లు డబ్బులు కోల్పోయాను. జూదం ఆడి, బాధపడ్డాను. కొన్ని సార్లు గెలిచాను. ఆనందం వచ్చేది కానీ, ఎక్కువ సేపు నిలబడేది కాదు. ఇప్పుడు మాత్రం ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆనందం అంటే ఇదేనేమో, నలుగురు బ్రతుకులో వెలుగు చూడటం. నేను వ్యర్థం చేసిన సొమ్ము ఇక్కడ కొన్ని జీవితాల్లో వెలుగు నింపుతుంది అని ఇప్పుడే తెలిసింది. " అని భూషణం తనలో అనుకున్నాడు.
కలువలమ్మ ముఖం కూడా వెలిగిపోతుంది.. ఆ ప్రదేశం ను ఇంతకు మునుపు చూసిన భూషణం కు కాస్త ఇబ్బంది కలిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రదేశం అంటే గౌరవం కలిగింది. ఎందుకంటే ఆ ప్రదేశం లో కలువలమ్మ వుంది కదా. ఆమె ఎక్కడ వుంటే అక్కడ సంతోషం, జ్ఞానం ప్రసరిస్తాయి. ఆమె జ్ఞానం ప్రసరించే కలువలా వెలుగొందుతుంది.. తనలో వున్న చెడు దృష్టిని తీసేసి, మంచి దృష్టిని ప్రసాదించిన జ్ఞాన కలువలా ఆమె కనిపిస్తూ వుంది.
“అన్నయ్య! మా లాంటి పారిశుధ్య కార్మికులది చాలా కష్టమైన పని అన్నయ్య. ధూళిలో, దుర్వాసనలో పనిచేయాల్సి వస్తుంది. ఆరోగ్యాలు కూడా ఇబ్బంది పడతాయి ఇలాంటి పని చేస్తే. మా లాంటి వారి శ్రమ వలనే కదా, అక్కడ వైరస్లు, మిగతా క్రిములు వ్యాప్తి చెందకుండా వుంటాయి. మా పని పట్ల, మా పట్ల ఎందుకు అన్నయ్య అంత చిన్నచూపు” సూటిగా అడిగింది కలువ.
“అయ్యో తల్లి, నన్ను క్షమించు. ఇక మీదట నేను ఎవరినీ కించపరిచి చూడను. నీకు మాట ఇస్తున్నాను.” అని అన్నాడు భూషణం తన తప్పు తెలుసుకుని.
భూషణం మాట విని సంతోషం తో చిరునవ్వు చిందించింది కలువ.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
Comments