న్యాయం కావాలి!
- Divakarla Padmavathi
- Aug 24
- 6 min read
#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #NyayamKavali, #న్యాయంకావాలి, #TeluguStory, #కొసమెరుపు

Nyayam Kavali - New Telugu Story Written By Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 24/08/2025
న్యాయం కావాలి! - తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆఫీసు పని మీద కారులో బయలుదేరి, హెడ్ ఆఫీసులో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు దినకర్. అప్పటికే పది గంటలు దాటింది. దారిలో ఎక్కడైనా టీ గానీ దొరుకుతుందేమో అని చూసాడు, కానీ ఎక్కడా టీ స్టాల్ కనిపించలేదు! దార్లో అన్నీ చిన్న చిన్న ఊళ్ళే పడుతున్నాయి. ఇంటికి చేరేసరికి పన్నెండు గంటలు దాటేట్లు ఉంది! అంతవరకూ ఆకలితో ఉండాలా అని ఆలోచిస్తున్నాడు దినకర్. ఇంకొంచెం ముందుకెళ్తే దట్టమైన అడవి, అక్కడ మంచినీళ్ళు కూడా దొరకవు. ‘మంచినీళ్ళు’ అని మనసులో అనుకోగానే దాహం వేసింది అతనికి. బాటిల్లో అడుగుకి కొద్దిగా మాత్రమే నీళ్ళున్నాయి. ఆ నీళ్ళు నోట్లో పోసుకునేసరికి ప్రాణం లేచివచ్చింది. హుషారుగా గట్టిగా ఎక్సిలేటర్ తొక్కాడు. కారు వేగంగా ముందుకి దూసుకుపోసాగింది.
ఓ అరగంట ప్రయాణం చేసాక అడవి అంతమై, కొంత దూరంలో విద్యుత్ దీపాలు కనపడటంతో అక్కడ ఏదో ఊరు ఉందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నాడు. కానీ, అప్పుడే హఠాత్తుగా కారు ఆగిపోయింది. 'కారు ఎందుకు ఆగిపోయింది? పెట్రోలు ట్యాంక్ ఫుల్ చేసాడే! అదీకాక, దూరం ప్రయాణం కనుక, మెకానిక్ చేత కారు పూర్తిగా చెక్ చేయించాడు కూడా!
మరో రెండు మూడు సార్లు కారు స్టార్ట్ చెయ్యడానికి ప్రయత్నించాడు కానీ, లాభం లేకపోయింది. ఒక్క ఇంచ్ కూడా కదలనని మోరాయించింది. ఊళ్ళోకి వెళ్ళాలంటే కనీసం ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటుంది! అంతా చీకటి! ఆకాశంలో చంద్రుడు లేడు! మిణికుమిణుకు మంటూ నక్షత్రాలు మాత్రం మెరుస్తున్నాయి. తను వచ్చిన దారి నిర్మానుష్యమైనది! తనకి ఒక్కటంటే ఒక్క బండి కూడా ఎదురుపడలేదు. అందుకని, ఏ కారో, లారీయో వస్తుందని ఎదురుచూసే ప్రసక్తే లేదు!
ఈ కటిక చీకట్లో ఇక్కడ ఉండటం కన్నా, ఆ ఊరి వైపు నడుచుకొని వెళ్ళడమే ఉత్తమమని భావించాడు దినకర్. ఆ ఊళ్ళో మెకానిక్ దొరికితే కారును చూపించవచ్చు అని కూడా భావించాడు. కారు వెనక సీట్లో ఉన్న తన బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఓ పదడుగులు వేసాడో లేదో కానీ, అతని దృష్టిని ఆకర్షించింది రోడ్డుకు ఎడంపక్కన ఉన్న ఓ ఎత్తు అరుగుల ఇల్లు. ఊరికి దూరంగా, అడవికి దగ్గరగా ఎవరు అలాంటి చోట ఉంటున్నారో గానీ, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అనుకున్నాడు దినకర్.
ఆ ఇంటి సమీపానికి వచ్చిన దినకర్ కి, మెట్ల మీద కూర్చొని ఉన్న ఓ అందమైన అమ్మాయి కనిపించి ఆశ్చర్యపోయాడు. కొంపతీసి, అది దయ్యం కాదు కదా అన్న ఆలోచన మనసులో కలిగి అతని ఒళ్ళు జలదరించింది. లేకపోతే, ఇలాంటి నిర్మానుష్యమైన స్థలంలో ఒంటరి అమ్మాయి ఎలా ఉండగలదు? వెంటనే తల విదిలించాడు!
అయినా దయ్యాలేమిటి? అసలు దయ్యాలు ఉన్నాయా? అంతా భ్రమ! అంతే! అనుకుంటూ ముందుకు సాగిపోతున్న అతనికి, ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుతిరిగాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వెనుక ఓ నడి వయసు గల ఒకామె నిలబడి ఉంది.
అతను తల తిప్పగానే, "ఓ.. అబ్బాయీ! నిన్నే!.. " అంటూ ఆమె మరోసారి పిలిచేసరికి వెళ్ళాలా, వద్దా అని ఓ నిమిషం సేపు దీర్ఘంగా ఆలోచించి, చివరికి ఓ నిర్ణయం తీసుకున్నాడు. వెనుదిరిగి, ధైర్యంగా ఆ ఇంటి దగ్గరకొచ్చి, మెట్లు ఎక్కసాగాడు.
అప్పటివరకూ, పై మెట్టు మీద కూర్చున్న ఆ అమ్మాయి ఒక్కసారి లేచి నిలబడి, "వద్దు!.. నన్నేమీ చేయకు! నీకు దండంపెడతాను, నన్నేమీ చేయకు!!" అని మొహం కప్పుకొని ఏడవడం చూసి బిత్తరపోయాడు. ఎందుకైనా మంచిదని, ఒక్క అడుగు వెనక్కు వేసాడు.
ఆ అమ్మాయి వెనకనున్న ఆమె, "లోపలకి రా బాబూ! దాన్నేమీ పట్టించుకోకు! ఆ దురదృష్టకర సంఘటన జరిగిన దగ్గర నుండి దానికి అలా అనడం అలవాటైపోయింది!" అతనితో చెప్పి, "అందరూ అలాంటివాళ్ళు కాదు వందనా! నువ్వు లోపలికెళ్ళు!" అందామె.
ఆమె మాటలకు బుద్ధిగా తలూపి, ఇంట్లోకి వెళ్ళిపోయిందా అమ్మాయి. దినకర్ ఇంటి లోపలకి వెళ్ళాడు. లోపల ఓ గుడ్డి దీపం వెలుగుతూ, చీకటి పారదోలడానికి ప్రయత్నిస్తోంది. లోపల నుండి ఓ పాత కుర్చీ తీసుకువచ్చి వేసింది అతను కూర్చోవడానికి. దినకర్ కూర్చున్నాక చుట్టూ చూసాడు. బయటకి మరీ అంత పాత ఇల్లులా కనిపించకపోయినా, లోపల మాత్రం ఇల్లు చాలా భాగం శిధిలావస్థలో ఉంది. ఎప్పటివో పాత ఫోటోలు గోడకి వేళ్ళాడుతున్నాయి. అలాంటి ఇంట్లో, ఊరికి దూరంగా ఆ తల్లీ కూతుళ్ళు ఎలాంటి భయం లేకుండా, ఎలా ఉండగలుగుతున్నారో అతనికి అర్ధం కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి వాతావరణం భయం కొల్పే విధంగా ఉంది!
"బాబూ! ఆకలితో ఉండి ఉంటావు! కొద్దిసేపు ఆగు! భోజనం ఏర్పాట్లు చేస్తాను!" అని లోపలికెళ్ళి కూతురుతో ఏదో చెప్పింది.
"మీరేమీ అనుకోకపోతే ఓ మాట! ఊరికి దూరంగా ఇలాంటి చోట ఎలా ఉండగలుగుతున్నారు? మీకేమీ భయం కలగడం లేదా?" అని ఆమెను అడిగాడు దినకర్.
"భయమా! మాకా!.. " ఫక్కున నవ్విందామె. "ఆ జనారణ్యం కన్నా ఈ కీకారణ్యమే నయం! ఇక్కడున్న కౄరజంతువులు కన్నా కౄరమైనవాళ్ళు ఊళ్ళో ఉన్న జనం!" అందామె దీర్ఘంగా నిట్టూర్చుతూ.
ఆమె మొహం తీవ్రమైన విషాదంతో నిండి ఉండటం గమనించాడు దినకర్. ఓ క్షణం ఏమీ మాట్లాడలేదు దినకర్. "మీరెందుకో చాలా నిరాశగా మాట్లాడుతున్నారు. మనుష్యులందరూ ఒకేలా ఉండరు కదా!" అన్నాడతను.
"ఏం చెయ్యను నాయనా! మాకు కలిగిన దెబ్బ అటువంటింది! ఆయన ఏక్సిడెంట్లో పోయాక నేను, నా కూతురు వందన ఇద్దరమే ఈ ఇంట్లో మిగిలాము. అతనికొచ్చిన కొద్దిపాటి ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు, బయట చిన్నచిన్న పనులు చేసి వందనను చదివించాను. చదువు పూర్తైన తర్వాత, వందన ఇక్కడికి దగ్గర్లో కనిపిస్తున్న ఆ ఊళ్ళోనే టీచర్ గా చేరింది. రోజులు సవ్యంగా గడుస్తున్నాయన్న తరుణంలో అనుకోకుండా ఆ రోజు.. " అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ఆమెకు అడ్డు తగిలింది అప్పుడే అక్కడకు వచ్చిన ఆ అమ్మాయి.. వందన.
తన చేతిలో ఉన్న మంచినీళ్ళ గ్లాసు, కంచం దినకర్ ముందు పెడుతూ, "ఎందుకమ్మా! ఇక్కడికి వచ్చినవారందరికీ మన కథ చెప్తావు? ఎవరైనా ఆరుస్తారా, తీరుస్తారా?" అందామె నిరసనగా దినకర్ వైపు చూస్తూ. ఆమె కళ్ళలో కోపం ప్రతిఫలించింది దినకర్ కి.
అప్పుడు నిశితంగా చూసాడు ఆ అమ్మాయి వైపు. పాతికేళ్ళకు మించని పరువంతో, తీర్చి దిద్దిన కనుముక్కు తీరుతో చాలా అందంగా ఉందామె. ఆ కోపం ఆమె అందాన్ని మరింత పెంచింది.
"చెప్పనీవే! మన హృదయాల్లో రగులుతున్న బాధ ఎవరికి చెప్పుకోవాలి మరి!" అందామె.
ఏదో గొణుక్కుంటూ లోపలకు వెళ్ళిపోతోన్న వందనవైపు అతను కళ్ళార్పకుండా చూడటం గమనించిన, ఆమె తల్లి ఓ పొడి దగ్గు దగ్గింది. ఒక్కసారి ఉలిక్కిపడి, తన చూపు మరల్చుకొని, "ఊ.. చెప్పండి!" అన్నాడు దినకర్.
"ఆ రోజు.. వందన స్కూలు నుండి తిరిగి వస్తూండగా వెంటపడ్డారు వాళ్ళు! తననేమీ చెయ్యవద్దని ప్రాధేయపడిందామె! దుర్మార్గులు వినలేదు! అడవిలోకి తీసుకెళ్ళి దారుణంగా.. " ఆ తర్వాత ఆమె నోట మాట పెగల్లేదు. కళ్ళొత్తుకుంటూ ఏడుస్తోంది.
ఆ తల్లీ కూతుళ్ళ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందని అప్పటివరకూ తెలీని దినకర్ కళ్ళు కూడా చెమర్చాయి. అన్నం తినడానికి ఉపక్రమించబోతున్న అతను ఆగిపోయి, ఆమెవైపు సానుభూతిగా చూసాడు.
కొద్దిసేపు మౌనం తర్వాత ఆమె తిరిగి ప్రారంభించింది, "అప్పటినుండీ వందనకెవర్ని చూసినా భయమే! అందుకే నిన్ను చూసి భయపడింది!" అందామె.
"మరి.. మరి.. వాళ్ళకు శిక్ష పడలేదా!" అని అడిగాడు దినకర్.
"న్యాయం, ధర్మం డబ్బులకు అమ్ముడుపోయే ఈ రోజుల్లో వాళ్ళకి శిక్ష ఎలా పడుతుంది? న్యాయం కావాలని ప్రాధేయపడ్డా! పోలీసుల్ని, కోర్టుల్ని ఆశ్రయించా, ఎలాంటి ఫలితం లేకపోయింది. పైగా బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు ఆ దుర్మార్గులు. " అందామె కళ్ళు ఒత్తుకుంటూ.
అప్పుడే లోపలినుండి విసవిసా వచ్చింది వందన. "అవకాశం దొరికితే అందరూ అంతే! ఈయన మాత్రం.. " అంటూ కోపంగా దినకర్ వైపు చూసిందామె.
భయంకర అనుభవం కలిగిన ఆమె అలా అనుకోవడంలో తప్పు లేదు! ఆమె వైపు జాలిగా చూసాడు దినకర్. తర్వాత చూపు మరల్చుకొని ఆమె తల్లివైపు చూసాడు.
"అమ్మా! నేను ఓ పత్రికా విలేఖర్ని! టివి ఛానల్ కి కూడా వార్తలు సేకరిస్తూంటాను. నాకు బాగా తెలిసిన నిజాయితీ గల పోలీసు ఆఫీసరు ఒకడు ఉన్నాడు. నాకు వాళ్ళ వివరాలు ఇస్తే, వాళ్ళకి శిక్ష పడేట్లు చూడగలను. " చెప్పాడు దినకర్.
వింతగా అతనివైపు చూసిందామె. "ఇప్పటి వరకూ, మాతో ఇలా చెప్పిన వాళ్ళెవరూ లేరు!" అని ఆమె వివరాలు చెప్తోండగా తన డైరీలో నోట్ చేసుకొని తర్వాత, వాళ్ళకు తెలీకుండా సీక్రెట్ కెమెరాతో వాళ్ళ ఫోటోలు కూడా తీసాడు ఎందుకైనా మంచిదని.
"చూసావా వందనా! అందరు మగవాళ్ళూ దుర్మార్గులే ఉండరు! ఇప్పటివరకూ మన ఒంటరితనాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవాలని చూసిన వాళ్ళకు భిన్నమైన అబ్బాయి ఇతను తెలిసిందా!" కూతురితో అని, "చూడు అబ్బాయీ! దుర్మార్గానికి పాల్పడ్డ ఆ ఎం. ఎల్. ఏ. కొడుకు గిరి, అతని స్నేహితులకు నీ ద్వారా తగిన శిక్ష పడుతుందని ఎందుకో మాకనిపిస్తోంది!" అందామె దినకర్ తో.
"నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానమ్మా!" అంటూ కంచంలో చెయ్యపెట్టాడు దినకర్.
అప్పటివరకూ కోపంగా ఉన్న వందన మొహం ఒక్కసారి ప్రసన్నంగా మారిపోయింది. దినకర్ వైపు ఆరాధనగా చూస్తూ చేతులు జోడించిందామె.
"చాలా మంచిది నాయనా!" అందామె.
"ఊ!.. " అంటూ, అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతూ వాళ్ళ వంక చూసాడు దినకర్. ఎక్కడో మెరుపు మెరిసింది! అంతే! ఒక్క క్షణం నెత్తిమీద పిడుగుపడ్డట్లైంది అతనికి! అప్పటివరకూ అతని ఎదురుగా ఉన్న తల్లీ కూతుళ్ళిద్దరూ నీలం రంగు పొగగా మారి, క్షణంలో అదృశ్యమైయ్యారు.
భయంతో అతని నోరు పిడచకట్టుకుపోయింది. ఇంతసేపూ తను మాట్లాడింది దయ్యాలతోనా! తన ముందున్న కంచం మీద దృష్టిపడి ఉలిక్కిపడ్డాడు. ఆ కంచంలో ఓ పుర్రె, కొన్ని ఎముకలు ఉన్నాయి. చేతిలో అన్నం బదులు బూడిద ఉంది. భయంభయంగా చేయి విదిలించాడు. తను రహస్యంగా తీసిన ఫోటోలు గుర్తుకొచ్చి చూసాడు! అంతా ఖాళీగా ఉంది!
ఒక్కసారి వెన్ను జలదరించింది! పైన నల్లటి ఆకాశంలో నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తున్నాయి. చంద్రుడి జాడలేదు, బహుశా ఈ రోజు అమావాస్య ఏమో! అంటే.. చుట్టూ చూసాడు! తను ఆ ఇప్పుడు పాడుబడిన ఇంట్లో లేడు. కుర్చీ కాకుండా, ఓ బండరాయి మీద కూర్చున్నాడు. ఎక్కణ్ణుంచో హృదయ విదారకంగా నక్కల ఊళలు వినిపిస్తున్నాయి. కొద్ది దూరంలో ఏదో చితిమంట వెలుగుతూ, అంతకంతకూ పెద్దదవుతోంది!
అంటే.. అది.. అది.. శ్మశానం అన్నామాట! ధైర్యం కూడగట్టుకొని, గుండె చిక్కబట్టుకొని, లేచి నిలబడి తన కారువైపు అడుగులు వెయ్యసాగాడు. హఠాత్తుగా అతని మొహం మీద ఎవరో చరిచేసరికి కళ్ళు బైర్లు కమ్మి, కిందపడి స్పృహ కోల్పోయాడు దినకర్! అతని మొహం మీద చరచిన గుడ్లగూబ ఎగిరి వెళ్ళి దగ్గర్లో ఉన్న చెట్టు కొమ్మకి వేళ్ళాడసాగింది.
**** ***** ****
మరుసటి రోజు..
తన మీద ఎవరో నీళ్ళు చిలకరించడంతో కళ్ళు తెరిచాడు దినకర్. అతని మొహంలో తొంగి చూస్తున్నాయి ఓ అరడజను జతల కళ్ళు! "బతికే ఉన్నాడురా!" అన్నాడు అందులో ఒకడు. వాళ్ళను అలా చూడగానే, భయంతో ఓ గావుకేక పెట్టాడు దినకర్.
"భయపడకు, మేం దయ్యాలం కాము, మనుష్యులమే! నీలాంటి మనుష్యులమే!" అన్నాడొకడు.
ధైర్యం వచ్చి కూర్చోవడానికి ప్రయత్నించసాగాడు. ఒకళ్ళిద్దరు అతనికి కూర్చోవడంలో సహాయం చేసారు.
"అదృష్టవంతుడివయ్యా నువ్వు! ఇంతవరకూ రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరూ బతికి బట్ట కట్టలేదు, ముఖ్యంగా వయసులో ఉన్న మొగవాళ్ళు!" అన్నాడో ఓ ముసలి వ్యక్తి అతన్ని లేచి నిలబెడుతూ.
ప్రశ్నార్ధకంగా అతనివైపు చూసాడు దినకర్.
"అదేనయ్యా! ఆ తల్లీ కూతుళ్ళు దయ్యాలుగా మారి ఇక్కడే.. ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు! రాత్రివేళ ఎవరైనా వయసులో ఉన్న అబ్బాయి వాళ్ళకి దొరికితే మాత్రం రక్తం కక్కుకొని చస్తాడు! ఇప్పటివరకూ డజను మంది పైగా అలా మృత్యువాత పడ్డారు. ఇవాళ నువ్వొక్కడివీ ప్రాణాలతో బయటపడ్డావు! మృత్యుంజయుడివి!" అన్నాడతను.
అతనివైపు చూసాడు దినకర్, "తాతా! వాళ్ళని ఈ స్థితికి తీసుకోచ్చిన వాళ్ళ సంగతో.. " అన్నాడు.
"అదంతా ఓ పెద్ద కథ! వాళ్ళంతా పెద్దవాళ్ళు! ఆ అమ్మాయిని చంపేసారు ఆ దుర్మార్గులు. ఎం. ఎల్. ఏ. కొడుకు మరి! వాళ్ళ పలుకుబడితో కేసు మూసేసారు! వాళ్ళ భయంతో సాక్ష్యం చెప్పేందుకెవరూ వెళ్ళలేదు! న్యాయం కోసం తిరిగి తిరిగి పిచ్చిదైపోయింది పాపం ఆమె తల్లి! ఇది జరిగి పదేళ్ళు దాటింది నాయనా! అది గతం!" అన్నాడతను.
"ఆఁ.. ! పదేళ్ళైందా!.. " నోరు తెరిచాడు దినకర్. ఒక్క క్షణం నోటమాట రాలేదు. మరుక్షణం అతని పిడికిలి బిగుసుకుంది.
"నిజమే అది గతం! కానీ, వాళ్ళు ఇంకెన్నాళ్ళో తప్పించుకు తిరగలేరు! ఇప్పటివరకూ వాళ్ళకెవరూ న్యాయం చెయ్యలేదు! కానీ, త్వరలో వాళ్ళకి న్యాయం జరిగి తీరుతుంది! ఇది నా హామీ!" అంటున్న దినకర్ వైపు విస్మయంగా చూసారు ఆ ఊరివాళ్ళు.
దినకర్ మాటిచ్చినట్లుగానే, ఆ ఊళ్ళో మరో రెండు రోజులుండి ఆధారాలన్నీ సేకరించాడు. సాక్ష్యాలు, సాక్ష్యులను కూడగట్టుకున్నాడు. ఆ గ్రామస్థులు అతనికి పూర్తిగా సహకరించారు. తనకు తెలిసిన పోలీసు ఉన్నతాధికారులను కలిసాడు. ఆ కేసు విశేషాలను పత్రికలో ప్రచురించి, టివిలో ప్రసారం చేసి సంచలనం సృష్టించాడు. అధికార పార్టీ ఆ ఎం. ఎల్. ఏ. ను పార్టీ నుండి బహిష్కరించింది. నేరస్తులందరూ పట్టుబడి, జైలుకెళ్ళారు.
అటుపిమ్మట, రాత్రిపూట ఆ దారిన వెళ్ళే వారికెవరకూ ఆ తల్లీ కూతుళ్ళు మరి కనిపించలేదు!
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments