జోక్స్ - 2


Jokes Published By manatelugukathalu.com


1) " అన్నయ్యకు మతిమరుపు ఎక్కువని కారం పొడి తెమ్మని చెబుతూ, గుర్తుండటానికి చేతిలో పిడికెడు కారంపొడి ఇచ్చిపంపడం మంచిదయిందా .... జ్ఞాపకం పెట్టుకొని తెచ్చారా వదినా" అడిగింది పక్కింటావిడ.

"మరచిపోయారు కానీ , రోడ్లో ఎవడో రౌడీ వెధవ కత్తి చూపెట్టి ఒక అమ్మాయిని బయపెట్టుతుంటే మా అయన వాడికంట్లో కారంపొడి చల్లగానే అందరూ ఒక్కసారిగా ఆ రౌడీని పట్టుకొని ఉతికేశారట . కారంపొడి చేతులో ఎందుకు తీసుకొనివచ్చావని అక్కడివారడిగితే గుర్తురాక బుర్ర గోక్కున్నాడట " అంది.

*** *** ***

2 ) “కంప్యూటర్ జాతకం ఏమని సమాధానమిచ్చింది"

“ అమ్మాయి అబ్బాయి పాన్ కార్డు జాతకాలు బాగా కలిసిందట,పెళ్ళైతే వారికీ డబ్బే డబ్బు ...

కానీ ఆధార్ కార్డు జాతకాలు సరిగ్గా కలవలేదు .పెళ్ళైతే వారికీ గొడవలే గొడవలు “ *** *** ***

3) " పబ్ లో వారందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తే, జడ్జిగారు అందరినీ పబ్ కు ఎందుకెళ్లావని అడిగారా. అందరిలా నీవూ ఒక అబద్దం చెబితే, నీవు అందరికన్నా పెద్ద అబద్దం చెప్పావంటూ నీకు పెద్ద శిక్ష వేసారా. నీవేమని చెప్పావు "

"అంబిలి తాగడానికి పబ్ కు వెళ్ళనని చెప్పాను "

*** *** ***

4) “మీ పీ టీ మాస్టర్ మీకు ఎటువంటి గేమ్స్ నేర్పించారు " అడిగాడు అధికారి

“వీడియో గేమ్స్ "తరగతి పిల్లలందరూ ఒక్కసారిగా సమాధానమిచ్చారు.

*** *** ***

5) “స్వర్గంలో టూ వీలర్స్ నడపడం నిషేదించారా ...పెట్రోల్ ధర పెరిగినందుకా” “ అందుకు కాదు . నడవడం మరచి ఎప్పుడూ వెహికల్స్ లో వెళ్లడం వలన చాలామందికి చక్కర వ్యాధి వచ్చిందట “

*** *** ***

6) “నీవు గవర్నర్ అయితే మంత్రుల పదవీ ప్రమాణాన్ని రద్దు చేస్తావా ... ఎందుకూ” “చాలా మంది మంత్రులు అలా నడచుకోవడం లేదుగా “

*** *** ***

7) " యువరానర్ నా క్లయింట్ హంతకుడు కాడు. అతని చేతిలోని కత్తిని ఆమె బలవంతంగా తీసుకొని తన వీపులో తానే పొడుచుకొని చనిపోయింది "

"ఇంకొక్కమాట మాట్లాడావంటే నీకు జైలు శిక్షావిధిస్తాను "లాయర్ వైపు చూస్తూ కోపంగా అన్నారు జడ్జి

*** *** ***

8) "మనిషి నవ్వడంవలన గుండె వేగంగా కొట్టుకోవడం తగ్గుతుందన్నారు .పెట్రోల్ ధర తగ్గాలంటే ? "

"మీ కేసు మంత్రిగారికి ఫార్వర్డ్ చేస్తాను వెళ్లి అడగండి "అంటూ సమాధానమిచ్చాడు డాక్టర్.

*** *** ***

9) " నిదురపోవడానికి ముందు పావుగంట నడవాలని చెప్పారు . మా ఆఫీసులో నడవడానికి స్థలం లేదు డాక్టర్ “

"మీరున్న సీటులోంచి లేచి నిలబడి అక్కడే మెల్లగా జాగింగ్ చెయ్యండి”


పంపినవారు: ఓట్ర ప్రకాష్ రావు


ప్రచురించిన తేదీ: 01/05/2022

-------------------------------------------------------------------------------------------------------------------------------

10) కోవై సరళ: ఏమండీ! మర్చిపోయారా! ఈ ఉగాదికి నాకు మామిడి పిందెల హారం చేయిస్తామన్నారు... (గోముగా అడిగింది)

బ్రహ్మానందం: ఇదిగో...తెచ్చానే తీసుకో...పండగ చేస్కో! (అన్నాడు జాలీగా హారం పైకి విసిరేస్తూ) కోవై సరళ: ఇదేంటి? నేనడిగింది బంగారు హారం... మామిడి పిందెలను దారంతో కుట్టింది కాదు..( కోపంగా)

బ్రహ్మానందం: ఓ రోజు సుస్తిగా ఉంది.. ఏదైనా పండ్ల రసం తెమ్మంటే నువ్వేం తెచ్చావే?చింతపండు రసం! పైగా చింతపండు మాత్రం పండు కాదా... అని సెటైర్ ఒకటి! చూడు ఇది మాత్రం హారం కాదా?

కోవై సరళ: !!!?

*** *** ***

11) సూర్యుడు: చూసావా చంద్ర... పగలు నేను, రాత్ర నువ్వు సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నామా?అసలు మన కష్టం గుర్తించే వాళ్ళే లేకుండా పోయారు. మనకిదేం ఖర్మయ్యా!

చంద్రుడు: మరీ అంత బాధ పడకు సూర్య! వాళ్ళచేతుల్లో చూసావా.. వాటిని మొబైల్స్ అంటారు. ఇంతకు మునుపు వాళ్లకు చీకటైతే నిద్ర వచ్చేది. ఇప్పుడు మొబైల్ డాటా అయిపోతేగాని నిద్ర పోవాలన్న ఆలోచన రాదు. వాళ్ళను అని ఏం లాభం... ఆ మొబైల్ ఫోన్ కనిపెట్టిన వాణ్ణి అనాలి. ప్చ్.....!!

*** *** ***

12) వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు తన లీవ్ ముగించుకొని మరుసటి రోజు యధావిధిగా ఆఫీస్కి వెళ్లాడు. తన సీట్లో కూర్చోబోతుంటే ప్యూన్ వచ్చి "మేనేజర్ గారు రమ్మంటున్నారు" అని చావు కబురు చల్లగా చెప్పి వెళ్ళాడు.

మళ్లీ ఏం కొంప మునిగింది అని కాళ్ళలో వణుకు ప్యాంట్ కింద దాచుకుంటూ మేనేజర్ రూంలోకి వెళ్ళాడు.

తనకేసి ఎగాదిగా చూస్తున్న మేనేజర్ ను చూస్తూ "వీడి ముఖం మండ! వీడు... వీడి చిల్లీ ఫేసు... కాస్త చిల్ గా ఉండొచ్చు కదా! " అనుకున్నాడు మనసులో..,

"ఏమయ్యావెంకీ! లీవ్ పెట్టే ముందు రోజే నాకు ఇన్ ఫార్మ్ చేయాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలి" కోపంగా అరుస్తున్న బాస్ అరుపుకి ఈ లోకంలోకి వచ్చి, "సారీ సార్! మా ఆవిడకి వంట్లో బాగాలేదు. ఇంటిపనికి , వంటపనికి లీవ్ పెట్టక తప్పలేదు" అంటూ మెల్లిగా నసిగాడు వెంకీ.

"నేను అడుగుతున్నదేంటీ, నువ్వు చెప్తున్నదెంటీ? అయినా ఆడంగిలా ఇంటిపని, వంట పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? పోనీ..నీ ఖర్మ చేసావే పో... ఆ తర్వాతైనా నీ పనులన్నీ అయ్యాక, ఆఫీస్ అవర్స్ తర్వాతనైనా నాకు కాల్ చేసి చెప్పాలన్న ఙ్ఞానం లేదా?" అంటూ అరిచాడు మరింత కోపంగా!

"అదే విషయం చెబుదామని మార్నింగ్ మీకు కాల్ చేశాను సార్! కానీ, మీరు బట్టలు ఉతుకుతున్నారని, తర్వాత కాల్ చేయమని మేడం గారే చెప్పారండి " అంటూ అమాయకంగా అంటున్న వెంకీని తెల్లబోయి చూడటం తప్ప పాపం! మేనేజర్ మాత్రం ఏం చేయగలడు. ��������!!?

*** *** ***

ప్రచురించిన తేదీ: 16/05/2022

పంపినవారు: పద్మావతి తల్లోజు

-------------------------------------------------------------------------------------------------------------------------------

13) వంద జంటలు విడిపోకుండా కలిపి "జిగురు రత్న"అవార్డుకు ఎంపికయ్యాడు లాయర్ బంక గుర్నాథం.

"కనీసం ఈ రోజైనా మీ విజయ రహస్యమేంటో చెప్పాల్సిందే..."అంటూ పట్టుబట్టారు జర్నలిస్టులు.

"ఏముందండీ!నేను అందరి లాయర్లలా ఆర్నెల్లు కలిసి వుండండి... లాంటి రొటీన్ డైలాగులు చెప్పను. ఒక్కరోజు మీ భార్యను షాపింగ్ తీసుకెళ్ళండి. క్రెడిట్, డెబిట్ కార్డులు పాస్ వర్డ్స్ తో సహా ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయండని చెబుతాను. ఆ సూత్రంతో విడాకుల కోసం నా దగ్గరికి వచ్చిన ఏ ఒక్క జంట ఇప్పటి వరకు విడిపోయింది లేదు" కళ్ళెగరేస్తూ గర్వంగా చెప్పాడు గుర్నాథం. హాట్స్ ఆఫ్ టూ యు... బంక గుర్నాథం!

������

*** *** ***

14) "మా ఆవిడతో వేగలేకపోతున్నా... సుబ్బారావ్! మానసిక ప్రశాంతతకు మెడిటేషన్ ఎలా చేయాలో నాకు నేర్పుతావా?" అని అడిగాడు అప్పారావు, యోగా చేస్తున్న తన ఫ్రెండ్ సుబ్బారావును.

"మొదట ప్రశాంతంగా కళ్లు మూసుకోవాలి. శ్వాస మీదే మన ధ్యాస ఉంచాలి. అలా పది నిమిషాలు గడిచాక.. నెమ్మదిగా కళ్ళు తెరిచి... ఆ తర్వాత మీ భార్య ఏం చెబితే అది వినాలి. అప్పుడే నీకు మానసిక ప్రశాంతత" అని కూల్ గా చెప్పడం ముగించాడు సుబ్బారావు.

*** *** ***

15) హాస్య కవిత


అంతర్జాలంలో పరిచయమై ఆలుమగలుగా మారాలనుకున్న ఇద్దరి ప్రేమకథ ఇది. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా.. అనేంతగా ఉన్న ఊరును, కన్నవాల్లను వదిలేసి ఋతువులెన్ని మారినా, ఎవరు తమను కాదన్నా ఏకమైన ప్రేమలా, ఎడబాటులేక ఐకమత్యంగా ఉండాలనుకున్నారు.

ఒకసారి ఏకాంతంలో కలుద్దాం ఓకేనా.. అడిగాడు అబ్బాయి..

ఔను..కలుద్దాం అంది అమ్మాయి!

అందగత్తె స్థానంలో అరవై ఏళ్ల బామ్మని

కండలవీరుడుకాక, కాటికి వెళ్ళే ముసలోన్ని చూసి ఖంగుతిన్నారిద్దరూ...!

అంతర్జాలం ఏమి గతి పట్టించిందంటూ...వగచి ,

ఇలాంటి ఘరానా మోసగాళ్లను నమ్మొద్దంటూ

మంచి జ్ఞానోపదేశాన్ని అంతర్జాలంలో పొందుపరిచారు!!

*** *** ***

16) "ఒసేయ్ కాంతం! పప్పులో ఉప్పు వేసావా? ఉప్పులో పప్పేసావా" అంటూ ఒళ్ళు మండి అరిచాడు హాల్లో టీవీ చూస్తూ భోజనం చేస్తున్న రామారావు.

"ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు" అంటూ టీవీ లో బాలయ్య బాబు డైలాగ్,

"ఏంటి గొంతు లేస్తుంది" అని కాంతం అరుపు.. రీమిక్స్ లో ఒకే సారి వినిపించాయి రామారావుకి.

పై ప్రాణాలు పైనే పోయాయి.

"ఏం లేదు బంగారం! పప్పు ఇంత బాగా చేయడం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను అంతే!" అంటూ..గబగబా అన్నం గొంతులో కుక్కేసి, బ్రతుక జీవుడా...! అనుకుంటూ అక్కడి నుండి పారిపోయాడు రామారావు.

ప్రచురించిన తేదీ: 17/05/2022

పంపినవారు: పద్మావతి తల్లోజు

-------------------------------------------------------------------------------------------------------------------------------

17) పార్క్ లో ఓ ప్రేమ జంట కబుర్లు...

"రాజ్! నీ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో చెప్పవా?" అంటూ బుంగమూతి పెట్టి అడిగింది స్వీటీ.

"నాకు గుడ్ హ్యాబిట్స్ లెక్క లేనన్ని ఉన్నాయి బంగారం! కాకపోతే బ్యాడ్ హ్యాబిట్ ఒక్కటే ఉంది" అన్నాడు రాజ్ ఒకింత గర్వంగా .,

"హో...సో స్వీట్! మచ్చుకు ఒక్కోటి చెప్పవా రాజ్! ప్లీజ్ .."అంటూ అడిగింది స్వీటీ మరింతగా గారాలు పోతూ..,

"గుడ్ హ్యాబిట్ వచ్చేసి ఇంతందమైన నిన్ను, అంతే అందంగా ప్రేమించటం.."

"మరి బ్యాడ్ హ్యాబిట్...!?"ఆనందంతో లోలోపల తబ్బిబ్బవుతూ..,

"అబద్ధాలాడటం"అని నిజం చెప్పేసి తర్వాత నాలుక్కర్చుకున్నాడు రాజ్!

*** *** ***

18) భార్య: (కోపంగా)పాలు పొంగి పోయాయి. ఏం చేస్తున్నారు? వాసన తెలియడం లేదా? కొంపదీసి కరోనా గానీ వచ్చి చచ్చిందా ఏంటి? (అదే రోజు మధ్యాహ్నం భార్య సీరియల్ చూడటంలో మునిగి పోయింది. కూర మాడి పోయింది.)

భర్త: (మరింత కోపంగా) నా మీద ఊరికే అరవడం కాదు. ఇప్పుడు నువ్వు చేసిందెంటి? భార్య: అయితే, మీకు వాసన తెలుస్తోంది అన్నమాట. హమ్మయ్య! మీకు కరోనా సోకిందనుకొని ఎంత కంగారు పడిపోయానో.., (అని తాపీగా సీరియల్ చూడటంలో మునిగిపోయింది.)

*** *** ***

19) హాస్య కవిత

మతి మరుపు మనిషితో పడ్డాను ప్రేమలో

ప్రేమలో పడ్డాక కానీ తెలియలేదు కష్టమేంటో

కష్టమెంటో తెలిసినా తనపై ఇష్టం పెరిగింది

పెరిగింది ప్రేమని ఇంట్లో చెప్పి ఒప్పించా పెళ్లికై

పెళ్ళికై కొన్న పంచెను కట్టుట మరిచెను మా వారు

మా వారిని చూసి పగలబడి నవ్విరి బంధువులు

బంధువుల నవ్వుల తడబాటులో ముళ్ళు మరిచెను

మరిచి మూడు ముళ్ల స్థానంలో రెండేసి మురిసెను

మురిపాల కాపురంలో ఇలా మరిచిన వెన్నొన్నో

ఎన్నెన్నో మరిచినా సర్దుబాటు చేసుకున్నా ప్రేమతో

ప్రేమతో ఈ రోజు స్పెషలెంటనీ అడిగా ఓ రోజు

రోజులన్నీ ఒకటే స్పెషల్ రోజు ఏంటని అడిగాడు

అడిగాడు మర్చిపోయి అనుకొని చెప్పా పుట్టినరోజనీ

పుట్టినరోజని చెప్పినా కనీసం విషెస్ చెప్పడం మరిచాడు

మరిచాడు ఆ టైంలో నా చేతిలో ఉన్న అట్లకాడను

అట్లకాడే కాదు... అన్నీ గుర్తుంటున్నాయిప్పుడు!!

ప్రచురించిన తేదీ: 19/05/2022

పంపినవారు: పద్మావతి తల్లోజు

-------------------------------------------------------------------------------------------------------------------------------

35 views0 comments