top of page

లేడీ టాక్సీడ్రైవర్

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #లేడీటాక్సీడ్రైవర్, #LadyTaxiDriver, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Lady Taxi Driver - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 24/09/2025

లేడీ టాక్సీడ్రైవర్ - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మాసిన గడ్డాన్ని వారం రోజులుగా తీయకుండా పంజాగుట్టలో మహలింగం పరధ్యానంగా నడుస్తూ వెళ్తున్నప్పుడు, వరసకు మామైన మంగరాజు ఎదురయాడు అనుకోకుండా... మేనల్లుడి దీనావస్థకు కంగారు పడ్డాడు. విషయం ఏమిటని అడుగుతూ ప్రక్కనే ఉన్న ఇరానీ టీ షాపు లోకి మహలింగాన్ని తీసుకువెళ్ళాడు మంగరాజు. 


ఇద్దరూ టి కప్పులు చేతిలోకి అందుకుని కాస్తంత చప్పరించిన తరవాత అడిగాడతను- “మరీ అంత డీలాగా కనిపిస్తున్నావు.. ఏమైందిరా? లవర్ బాయ్ లా రొమాన్సులో గాని బొక్క బోర్లా పడ్డావా ఏమిటి!” 


మహలింగం తల అడ్డంగా ఆడించాడు అదేమీ కాదన్నట్టు..

“మరేమిటి? మాచెల్లికి గాని సుస్తీ చేసిందా?”


మళ్లీ అదేవిధంగా తలాడించబోయి ఆగిపోయాడు మహలింగం- సర్దుకుంటూ బదులిచ్చాడు- “ఉద్యోగం యెగిరి రోడ్డున పడ్డది మామా! నేను పనిచేస్తూన్న మెకాని క్ షాపు ని భళ్లున మూసేసి గుర్గాం వెళ్లి పోయాడు మా సేఠ్. ఇంట్లో పరిస్థితేమో, చెప్పలేనంత టైట్ గా ఉంది మామయ్యా! మా బాబేమో- అదేదో ఫ్యాక్టరీ యూనియన్ గొడవల్లో అనవసరంగా తలదూర్చి మేనేజిమెంట్ వాళ్ళ కోపానికి లోనై ఊడిగం పోగోట్టుకున్నాడు. ప్రమీల పెద్దమనిషై నాలుగు సంవత్సరాలు కావస్తూంది. కమలేమో.. పోయిన నెలే మూలన కూర్చుంది. ఇదంతా చూస్తుంటే— పరిస్థితి గోరు చుట్టుపై రోకటి పోటులా తయారయింది మామా!” 


ఆ మాటవిని మంగరాజు ముఖం చిట్లించాడు- “ఇలా గందర గోళం పడిపోతున్నవాడివి— ఊద్యోగం పోయిందని నాకొక మాట చెప్పొద్దూ!” 


దానికి మహలింగం నిదానంగా కారణం చెప్పాడు- “అలాగే చెప్దును మావా! కాని మొన్నామధ్య అత్తయ్య ఫతేనగర్ సంతలో కనిపించి చెప్పింది- అవేవో స్టాప్ యూనియన్ గొడవల వల్ల నీకు కూడా ఉద్యోగం ఊగిసలాడుతూందని. కేసు సరాసరి లేబర్ కోర్టుకెళ్ళిందని.. అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాను? ” 


ఈసారి దీర్ఘంగా ముఖం పెట్టి చూసాడు మంగరాజు- “నువ్వూ నేనూ ఒక్కటట్రా! నాకు నాలుగు రెక్కలు- ఎప్పుడూ రెండు చేతుల్లోనూ నాలుగు వ్యాపారాలుంటాయి. ఎస్టేట్ బ్రోకర్ కి అసిస్టెంటుని- ఇటు చూస్తే చీటీ వ్యాపారం చేసే చిట్టిరాజుకి పార్టనర్ని. ఇంకా ఉందిగాని.. అదంతా ఇప్పుడెందుకు గాని- నీ విషయం వేరు నావిషయం వేరని చెప్పబోతున్నాను. అందుకే— నీకు ఆ మెకానిక్ షాప్ వర్క్ తప్ప మరేదీ తెలియదాయె.. వ్యాపారంలోకి దూరడమంటే గోళీకాయలాట కాదు. చిత్తయిపోతావు. అంచేత—”


అంచేత- అన్నట్టు ప్రశ్నార్థకంగా ఆతృతగా చూసాడు మహలింగం మామ వేపు. 

అప్పుడు మంగరాజు చదరంగపు చాప విప్పాడు- “నాకు తెలిసిన ఒక లేడీ టాక్సీ డ్రైవర్ ఉంది. ఆమె మూడు సంవత్సరాల ముందు మహదేవి అన్నపేరుతో క్యాబ్ కంపెనీ ఆరంభించింది. బ్యాంకు లోనుతో బాటు మా వద్ద చీటీ కొట్టే- దానితో క్యాబ్ కంపెనీ తెరిచింది. కాని ఆవిడతో పెద్ద తంటా..” 


అప్పుడు మరింత ఉత్కంఠత నిండిన గొంతుతో అడిగాడు మహలింగం- అదేమిటని. 

మంగరాజు కొనసాగించాడు- “ఆమెమో-అవివాహితస్త్రీ. ఒక విధంగా చూస్తే ఫెమినిస్ట్ కూడాను. ఆడాళ్లకు మాత్రమే క్యాబ్ లు నడిపే అవకాశం ఇస్తుంది. అలాగని చెడ్డదేమీ కాదు- దిక్కూ ముక్కూ లేని ఆడాళ్లను సహితం చేరదీసి ట్రైనింగు ఇప్పించి ఉద్యోగంలో చేర్చుకుంటుంది. మరైతే— మగాళ్ళను మాత్రం చేర్చుకోదు. ముఖ్యంగా పెళ్లికాని అబ్బాయిల పట్ల విముఖత మరీను-. పెళ్లిచేసుకోకుండా తిరిగే వాళ్ళందరూ జులాయిలని తలపోస్తుంది“ 


“అలాగైతే ఎలా మామా? ” 


“అలాగన్నానని మరీ దిగాలు పడిపోతే ఎలాగోయ్! వేయి దారిద్ర్యాలకు లక్ష విద్యలు- ఇప్పటికిప్పుడే మెంటలీ స్టడీ ఐపో— రెడీ ఐపో—

నీవు పెళ్ళయి ఇద్దరు బిడ్డల తండ్రివి- కొడుకు పేరు కుమార్- కూతురి పేరు- విమల- నీ సొంతూరేమో- పాలమూరు” 


ఆమాట విన్నంతనే మహలింగం గొంతున పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది “నాకు పెళ్లయిందని చెప్పి- సరాసరి నేను పాలమూరు నుండి వస్తున్నానంటే నమ్మించడం నిజంగా కష్టమే మామా! ” 


“అదంతా నీకెందుకోయ్! ఆపత్సమయాలలో అబద్ధం ఆడవచ్చంటారు తెలిదూ? మరచిపోయావేమిటి కమ్మటి మన తెలుగు పద్యం- “వారి జాక్షులందు వైవాహిక ములందు— బ్రాణ విత్త మానభంగంమందు..బొంకవచ్చు” ఒక విధంగా ఉద్యోగ వ్యవహారమూ అంతే! ఏమీ ఆలోచించకుండా దేనికీ తెగించకుండా ఏనో తానోగా చెప్పేస్తానేంటి? ఎలాగని అడక్కు- నీకు వారానికి ఒక సారి సరాసరి పాలమూరు నుంచి.. అదీను నీ భార్యా బిడ్డలనుంచి ఉత్తరం అందుతుంది, దానిని నీకు కాబోయే లేడీ బాసే అందుకుంటుంది. ఆ తరవాత దానిని ఆమే చేతులార నీకందిస్తుంది సరేనా!?”


 ”మహలింగం తలాడించాడు. “వారిజాక్షులందు- వైవాహికములందు..-“మనసునే మననం చేసుకోసాగాడు. 


ఇక విషయానికి వస్తే మహదేవి అవివాహిత. వయసు పాతికేళ్లు దాటాయి. పెళ్ళీడు వచ్చేటప్పటికి ఇంట్లోని పెద్దలు పలు ఊళ్ళ సంబంధాలు చూసారు- మాట్లాడారు. కాని అనుకున్నవి కొన్ని— అనుకోనివి మరికొన్ని అవాంతరాలు అడ్డువచ్చి అర్ధాంతరానే సంబంధాలు బెడిసికొట్టి ఆమెకు పెండ్లంటేనే విరక్తి కలిగించేలా పరిస్థితులు దాపురించాయి. 


తన కాళ్లపైన తనే నిలుచుని నిలు ద్రొక్కుకోవాలని నలుగురికి ఆసరా ఇచ్చి తనేమిటో నిరూపించుకోవాలని తీర్మానించింది. తదనుగుణంగా డ్రైవింగ్ నేర్చుకుని క్యాబ్ కంపెనీ ఆరంభించింది. తనది ఆడజన్మ కదా- తనవల్ల ఏదీ జరగదు- జరగబోదని తలపోస్తూ మూలన కూర్చుంటే జీవితం ఏమవుతుంది? చేతి వ్రేళ్ళ సందునుండి చల్లగా జారి కారిపోయే సలిలమవుతుంది. 


అవకాశాలు రావు, అందిపుచ్చుకోవాలి. ఇదీ మహదేవి సిధ్ధాంతం ఇకపోతే— మహదేవికి మంగరాజంటే గౌరవం. అతణ్ణెప్పుడు ఎక్కడచూసినా ఆప్యాయంగా ‘బాబాయ్’ అంటూ మనసార పలకరిస్తుంది. ఇంకా చెప్పాలంటే— తను ధైర్యంగా చీటీ కొట్టెటప్పుడు తనకు సహకరించి బ్యాంక్ లోనుకి సహితం షుయారిటీ ఇచ్చిన పెద్దమనిషి అతడు. అతడి మాటను ఎలా కాదనగదలదు?


 అందులో మహలింగం అతడికి మేనల్లుడాయె..అందుచేత కిమ్మనకుండా ఇద్దరు బిడ్డల తండ్రినని చెప్పుకుంటూ అఫిడవిట్ ఇచ్చుకున్న మహలింగాన్నితన క్యాబ్ కంపెనీలో ట్రైనింగ్ జాబ్ ఇచ్చింది. అలాగని ఆషామాషీగా ఇవ్వలేదు. షరతులు పెట్టింది.


 అనవసరంగా అక్కడున్న లేడీ క్యాబ్ డ్రైవర్లతో కబుర్లాడకూడదు. అవసరం ఏర్పడ్డా అవధికి మించిన రీతిన మాట్లాడకూడదు. ముఖ్యంగా వాళ్ళెవరూ పిలవకుండా తానే దూకుడుగా ఆడ ఉద్యోగుల మధ్యకు చొచ్చుకు పోకూడదు. వాళ్ల మధ్యకు దూసుకు వెళ్ళి భోజనాల పంక్తిలో కూర్చోకూడదు. 


అన్నిటికీ గంగిగోవులా తలాడించి ఉద్యోగం స్వీకరించాడతడు. అలా ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగంలో చేరిన మూడవరోజే పోస్ట్ మ్యాన్ మహదేవి బల్లపైన ఉత్తరం పడేసి వెళ్ళిపోయాడు. ఆమె దానిని అప్రయత్నంగా అందుకుని చూసింది. పాలమూరు పోస్టల్ మార్కుతో వచ్చిందది. అతడి భార్య వ్రాసుంటుందనుకుంటూ మహలింగాన్ని పిలిచి ఉత్తరాన్ని అందిచ్చింది, అతడి ముఖకవళికల్ని గమనిస్తూ— అతడి ముఖం ఉన్నపళాన వెలిగిపోతూంది. 


వెలిగి పోతూన్నఅతగాడి ముఖం చూసి సన్నగా నిట్టూర్పొకటి విడిచింది మహదేవి తనకు తెలియకుండానే..కాని మరుక్షణం తమాయించుకుంది. ఖర్చుల వోచర్లను చూడసాగింది; అదంతా తనకెందుకులే అనుకుంటూ—ముఖం తిప్పేసుకుంటూ.. 


జీబ్రాకి దూరపు చూపు అధికం అన్నట్టు ఆడాళ్ళకు సహజంగానే అనుమానపు చూపులధికం. ఒకరోజు డాబామీద నుంచి ఉత్తరం అందుకోవడానికి డాబాపైనుండి దిగి వచ్చిన మహలింగం వేపు లాంగ్ రేంజ్ మిస్సాయిల్ విడిచింది-“మీరు ఆదివారం పూట జరిగే పంజాగుట్ట సంతకు వస్తుంటారా మహలింగం? ”


అతడు తడుముకోకుండా ఔనన్నాడు-

“మరి మీతోబాటు వచ్చి న ఆఇద్దరమ్మాయిలెవరు? అలా కారులో వెళ్తున్నప్పుడు చూసినట్టు గుర్తు..”


అతడికి గొంతున గతుక్కుమన్నట్లని పించింది. మరీ జాప్యం చేస్తే బాగుండనుకుంటూ అన్నాడు-“ఔనండీ! మా చెల్లెళ్ళండీ! ”


“ఆశ్చర్యముగా ఉన్నదే మహలింగా! పాలమూరు నుంచి పంజాగుట్ట సంత చూడటానికి ఇంతదూరం వచ్చారా మీ సిస్టర్స్? ”


“అబ్బే! అది కాదు మేడమ్. ఊరంతా చూపించడానికి తీసుకు వచ్చాను” 


అది విని అలాగా-అన్నట్టు తలూపుతూ అందామె-“ఇంతవరకూ వచ్చిన మీ సిస్టర్స్ ఇద్దర్నీ ఓపారి మన కంపెనీ వేపు తీసుకు వస్తే నేను కూడా పలకరిద్దును కదా—చుట్టూ తిరిగి రావడానికి నా కారు ఇచ్చి పంపించి ఉందును కదా! ”


అతడలాగే తలూపుతూ-మరొకమారు ఆమె పెద్దమనసుని గుర్తుంచు కుంటానని చెప్తూ ఉత్తరాన్ని చేతిలో పదిలపర్చుకుంటూ కదలబోయాడు. 


మరొక మిస్సాయిల్-“అన్నట్టు మీ సిస్టర్స్ ఇద్దరూ ఇంకా ఇక్కడే ఉన్నారా—పాలమూరు వెళ్లిపోయారా! ” 


ఈసారి అతడికి నిజంగానే ఒళ్లు మండుకొచ్చింది. ఏమిటీ క్వశ్చనింగ్—పోలీసు ఇంటరాగేషన్ లా..ఏది ఏమైతేనేమి గనుక—ఇప్పటికి తనేదో చెప్పాలిగా—“ఇప్పుడు మా బంధువులింట్లో ఉన్నారండీ ఇద్దరూ— రెండు మూడురోజుల్లో బస్కెక్కించి పంపించేస్తానండీ! ”


అంటూనే అతడిక ఆగలేదు విసురుగా షెడ్ లోకి వెళ్లిపోయాడు.  ఆరోజు మహదేవి ఏదో మంచి మూడ్ లో ఉన్నట్టుంది. ఎవరో కొత్త లేడీ ట్రైనీకి బండితోలే మెళకువలు నేర్పుతున్నప్పుడు మహలింగాన్ని వెతుక్కుంటూ అక్కడకి వచ్చిందామె; రెండు చేతుల్లోనూ రెండు కప్పుల టీ ఉంచుకుని. 


ఒక కప్పు అతడికి అందిస్తూ మరొక కప్పు సిప్ చేస్తూ లేడీ ట్రైనీని అక్కణ్ణించి కదలి వెళ్లమని సైగ చేస్తూ అడిగింది-“మీరు గొప్ప ఆంజనేయ స్వామి భక్తులటగా! మొన్న మాటల సందర్భాన మంగరాజు బాబాయి చెప్పారు. అంతేకాదు— మీరు పగటి పూటకూడా ఆంజనేయ దండకం చదవడం నేను చూసాను. మీరు నిజంగానే హనుమంతు భక్తులే— కాని ఒకటి..” అని ఆగిందామె. 


అంటే- మరొక వాడైన నిప్పులు చెరిగే మిస్సాయిల్ సిధ్దం చేస్తుందన్నమాట.. “నిజమేనండీ! చిన్నప్పట్నించీ నాకు ఆంజనేయుడిపట్ట దైవభక్తి మిక్కిలిగా ఉందండి. ఇక మీరేదో అడగబోతున్నట్టున్నారు— అడగండి“


“అబ్బే, మరేమీ లేదు మహలింగా— నేను విన్నంతలో— ఆంజనేయస్వామితో బహ్మచారులకు మాత్రమే అంతటి మమేకం ఉంటుందని... మరి మీరేమో—“ 


ఈసారి మహలింగం మనసు బుస్సుమంది. చూపు కస్సుమంది. తనకు నిజంగానే వివాహం కాలేదే అనుకో— ఆవిడ కేమిటంట? అతడికి ఈసారి ఎంత కసిగా కోపం వచ్చిందంటే- అదే కసితో ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకీ అందుకుని కసిదీర పెదవుల్ని ముద్దులతో నింపాలనిపించింది. 


“అదేమిటి అలా ఉన్నపళాన ఊరకుండిపోయారు! ” 


“అబ్బే! మరేమీ కాదండి. ఇంత గొప్ప విషయాలు మీకెలా తెలుస్తున్నాయో కదానని అబ్బురపడుతున్నాను. అదిగో అక్కడ— మీ బల్లపైన ఫోను రింగవుతున్నట్లుంది—” 


“మీరు వర్రీ అవకండి. మా లేడీ అసిస్టెంటు అందుకుంటుంది. మరొకటి చెప్పాలనుకుంటున్నాను— మొన్నొకరోజు నేను అటు వెళ్తున్నప్పుడు మెయిన్ బజారు రోడ్డమ్మట వెళ్తున్నప్పుడు టైలర్ ట్రైనింగ్ స్కూలునుండి మీ చెల్లెళ్లిద్దరూ దిగివెళ్తున్నట్టు న్నారు— మళ్లీ వచ్చారేమిటి పాలమూరు నుండి—“


ఆమాట విన్నంతనే తెల్లబోయి వెంటనే తేరుకున్నాడు మహలింగం.. “అబ్బే! వాళ్లయి ఉండరండీ! వాళ్లిద్దరూ పాలమూరు ఎప్పుడో వెళ్లిపోయారు కదూ! ఐనా వాళ్ళను మీరు ఒక్కసారేగా చూసారు” 


“ఔను కదూ— నేనెవర్నో చూసి మీ చెల్లెళ్లనుకున్నానేమో! నేనే ఏదో మూడ్ లో ఉండి పొరపడి ఉంటాను మీరు అబధ్ధాలాడేవారు కారని నాకు తెలియదూ.. అన్నట్టు- మీ ఆవిణ్ణి ఎప్పుడు తీసుకు వస్తారు ఊరు తిప్పడానికి..” అని రాగాలాపన చేస్తూ అత డి చేతిలోని ఖాళీ కప్పును విసురుగా లాక్కుని వెళ్లిపోయింది లేడీ బాస్. 


అతడికిప్పుడు కత్తిపైన సాము చేస్తున్నట్లుంది. గొంతు న తడి ఆరిపోయింది. కోటి విద్యలు కూటికొరకే అన్నట్టు— ఉపాధి కోసం ఎన్ని అబధ్ధాలు చెప్పవలసొస్తుంది! వెంటనే వెళ్లి ఆంజనేయ స్వామి దండకాన్ని అందుకున్నాడు— ఉద్యోగం ఊడిపోకుండా చూడు మహాప్రభూ-అనుకుంటూ..


అన్ని రోజులూ అన్ని అవకాశాలూ ఏదో ఒక రోజున ఒక కొలిక్కి రావల్సిందేగా— వాటికవే తేలిపోవలసిందేగా..! అదేగా ప్రకృతి ధర్మం! ఎదురు చెప్పలేని— గిలగిల తన్నుకున్నా విప్పుకోలేని బోనులో తనను ఇరికించింది మహదేవి. పల్నాటి రాచరిక రాజకీయాలలో చేయితిరిగిన నాగమ్మ సహితం దిమ్మతిరిగి పడిపోవాలేమో ఈమె ముందు! దసరా పండుగ ముందు అందరికీ బోనస్ డబ్బులు పంచిపెడుతూ తయారు చేసుకున్న పట్టిక ప్రకారం చెరొక స్వీట్ బాక్స్ అందిస్తూ చివరన మహలింగాన్ని మాత్రం ఉండమంది. 


పొదల మధ్య తచ్చాడే కుందేలులా కదిపింది. “ఇంట్లో అన్నిటికీ నేనే కదా పెద్దానిని— అంచేత వీలున్నా లేకున్నా పెద్దరికం నేనే వహించాలి. ఇప్పుడు నాకొక ఇక్కట్టయిన పరిస్థితి ఎదురైంది. ఆంజనేయ భక్తుడివి కదా- అంచేత మీ మాట సహాయం తీసుకోవాలనుకుంటున్నాను. మీకేమీ ఆక్షేపణ లేదుకదా! ” 


“నోమేడమ్. నాట్ ఎటాల్! చెప్పండి వింటాను” 


ఇది నిజంగా మెచ్చుకోలా— లేక కబడ్డీ ఆటలా కాలు లాగి పడేయటానికి ప్రణాళి కా పథక రచనా! ఆలోచిస్తూ కళ్ళు మిటకరిస్తూ వినడానికి సిధ్ధమయాడతను. 


“మరేమి లేదు మహలింగా! నాకు ఇద్దరు తమ్ముళ్లున్నారు. ఒకడు నా తోడబుట్టువు- మరొకడేమో మా బాబాయి కొడుకు. ఇద్దరికీ అమ్మాయిలు వెతకాలనుకుంటున్నాం. కాని గడుగ్గాయిలిద్దరూ కరుకైన కండీషన్లు రెండు పెట్టారు. వాటిని తలచుకుంటే కంపరం కలుగుతుందనుకో—“ 

“చెప్పండి చెప్పండి. ఆసక్తికరంగా ఉంది” 


“ఏమి ఆసక్తిలో— అన్నీను ఆకతాయి వేషాలు కాకపోతే.. మొదటిది -ఇద్దరికీ ఒకేసారి పెళ్లి జరగాలి. అమ్మాయిలిద్దరూ ఒకే ఇంటి కి చెందిన వాళ్లయి ఉండాలి. అంటే— అచ్చు మీచెళ్ళల్లలాగ అన్నమాట”


ఆ మాట విన్నంతనే మహలింగం కళ్లు ఫెళ్లున మెరిసాయి. “ఇదేమీ పెద్ద సమస్యే కాదు మేడమ్.. మా ఊళ్లోనే అటువంటి సంబంధాలు పెక్కు ఉన్నాయి మేడమ్” 


“మీ ఊళ్ళో అంటే..పంజాగుట్టలోనా! ” 


“అబ్బే! మా ఊరు పాలమూరు కదండీ! అక్కడ..” 


“ఔను కదూ! మతిమరుపు.. మర్చేపోయాను సుమా! కాని మహలింగం— అన్నదమ్ములిద్దరూ మేటర్ అంతటితో ఆపలేదు. మరొక కిరికిరి లేవదీసారు. ఇక్కడే అందరూ చిక్కుల్లో పడ్డారు నాతో సహా—“ 


“చెప్పండి చెప్పండి- విషయం అంతా మంచి రసకందాయంలో పడినట్లుంది” 


“మీకేమి— మీరు థర్డుపార్టీయేకదూ— మీకలాగే తోస్తుంది. చిక్కులొచ్చి పడ్డది నాకు కదా! ” 


“మీరు మరీ వర్రీ అవకండి మహదేవీ! మనసుంటే మార్గం ఉండదూ— చెప్పండి“

 

 “నాకు పెళ్లయితే గాని ఇద్దరూ పెళ్లి పీటలపైన కూర్చోనంటున్నారు. ఇప్పుడు చెప్పండి నేనేమి చేసేది? ” 


నిశ్శబ్దం! గాఢమైన నిశ్శబ్దం. “అదేమిటి అలాగుండిపోయారు మహలింగా! సలహా ఇవ్వడం అంటే— ఇదేనా! నిశ్శబ్దంగా ఉండి పోవడమా! ”


అప్పుడతను కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అన్నాడు“ఇది కూడా అంతపెద్ద సమస్య కాదేమో! ”

ఎలా- అన్న ట్టు కళ్ళెత్తి చూసింది మహదేవి. 


“మీరేదో కారణంతో వైరాగ్యం పెంచుకుంటున్నట్టున్నారు గాని- ఊఁ అంటే వందమంది రారూ! ” 

“వస్తారు. ఎందుకు రారు. కాని నాకు నచ్చొద్దూ! ఈ కాలపు మగాళ్లలో దగుల్బాజీలు- అబధ్ధాలు చెప్పేవారు కోకొల్లలు. అటు వంటి వాళ్లను తలచుకుంటేనే ఒళ్ళంతా గగుర్బొడుస్తుంది. అందుకేగా- ఇన్నాళ్లూ పెళ్లి వద్దని ఇలా ముసుగేసుకుని కూర్చున్నదీ! ” 


అతడికి క్షిపణి వంటి వార్త చేరింది. తాక వలసిన చోట తాకింది. ఇక మొహమాటాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవితమూ తన ఇద్దరు చెల్లెళ్ల జీవితాలూ తారుమారయి పోతాయి. ఇంతకు మించి మరీ సిగ్గుతో వెనుకంజ వేస్తే తను బుగ్గయిపోతాడు— అతడిక చుట్టు ప్రక్కలెవరున్నారన్నది చూడలేదు. ఎమోషనల్ గా లేచి మహదేవి రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకున్నా డు-


“నన్ను క్షమించు మహదేవీ! నేను పెక్కు అబధ్ధాలు చెప్పి నీ వద్ద ఉద్యోగంలో చేరిన మాట వాస్తవమే— కాని— అదంతా ఎవరికీ హాని చేయాలన్న దురుద్దేశ్యంతో మాత్రం కాదు. మాది పెద్ద కుటుంబం. ఉపాధి కోసం అలా చేసాను. కాని ఇదంతా మా మామ మంగరాజుగారి మాట ప్రకారమే చేసాను. కావాలంటే— ఇప్పుడే పిలిచి అడగండి. అంతా బైటకొస్తుంది” 


“మేటర్ అది కాదు మహలింగా! నీగురించిన రహస్యమంతా నాకు చెప్పి వెనుకనుంచి కథ నడిపించిందీ ఆయనే! అంటూ లేచి నిల్చుంది మహలింగం బాస్ మహదేవి; అతడందించిన చేతుల్ని అలానే పట్టుకుంటూ— మనసుని మనసుతో పెనవేసుకుంటూ-


ఇక కారు షెడ్డులోనే కాదు— జీవితంలో కూడా ఆమేనేమో అతడికి నిజమైన బాస్! 


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree





Comments


bottom of page