top of page

అపర్ణ

'Aparna' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

ఆ రోజే అపర్ణ భర్త పనిచేసిన ఆఫీస్ లో అటెండర్ గా చేరబోతోంది. భర్త రామకృష్ణ యాక్సిడెంట్ లో చనిపోయిన మూలాన డిపెండెంట్ గా అపర్ణకున్న అర్హతలు, కంపెనీలో రిక్వైర్మెంట్ ను బట్టి అపర్ణను అటెండర్ గా తీసుకుంటున్నారు. భర్త ఆకస్మిక మరణంతో కృంగిపోతున్న అపర్ణకు ఉద్యోగం చేయాలని ఏమాత్రం ఇష్టంలేదు. భర్త చాటునే ఇన్నాళ్లూ సంసారం చేసింది. కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే పాస్ అయింది. భర్త బ్రతికి ఉన్నప్పుడు అపర్ణను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా బి.ఏ చదవమని ప్రోత్సహించేవాడు. తనూ చదవాలనే అనుకుంది. ఇంతలో ఈ దుర్ఘటన జరగడంతో, ఉన్న ఒక్క పిల్లవాడినీ ప్రయోజకుడిని చేయడానికైనా తను గడపదాటక తప్పదు. వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నసంస్థకు బిక్కు బిక్కుమంటూ బెదురుచూపులతో ఎపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని భర్త పనిచేసిన ఆఫీస్ కు వెళ్లింది. అన్ని ఫార్మాల్టీస్ పూర్తి అయిన తరువాత ఆమెకు వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్ దగ్గర అటెండర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఆ డిపార్ట్ మెంట్ ఇన్ ఛార్జ్ పేరు దివాకర్. అపర్ణ ఆయనకు రిపోర్ట్ చేయగానే, ఆమె వివరాలడుగుతూ, అపర్ణ భర్త చనిపోయినందుకు సంతాపం చెప్పాడు. అపర్ణ ముఖం వైపే చూస్తూ చాలా జాలి చూపిస్తూ మాట్లాడసాగాడు . అసలే భయంగా, బెరుగ్గా చూస్తూ, మాటిమాటికీ తల దించుకుంటూ సమాధానం ఇవ్వసాగింది అపర్ణ. ఆ సెక్షన్ లోని మిగతా ఉద్యోగులందరికీ ఆమెను పరిచయం చేసాడు . అపర్ణ చూడడానికి కళగా ఆరోగ్యంగా ఉంటుంది.

'అరె, ఈ అమ్మాయి భర్త చనిపోయాడా పాపం!' అనేవిధంగా, నిరాశగా బాధగా కనిపించదు పైకి చూసేవారికి. కాని ఆమె అంతరంగం భర్త జ్ఞాపకాలతో తల్లడిల్లిపోతోంది. కళ్లనిండా కాటుక, బొట్టు పెట్టుకుంటుంది. అసలే పెద్దవైన ఆమె కళ్లు కాటుక పెట్టుకోవడంతో మరింత పెద్దగా కనిపిస్తాయి. ముఖం కళ కళ లాడుతూ ఉంటుంది. ఆమె వైపే పదే పదే చూస్తూ ఆమె చేయాల్సిన పనులు గురించి చెపుతూ, ఏ సందేహం ఉన్నా మిగతా కొలీగ్స్ ను కూడా సంప్రదించమని అదోలా ఆమె వైపే చూస్తూ చెప్పాడు .

అపర్ణకు ఏమిటో భయంగా అనిపించింది. తను జాబ్ చేయగలనా అనుకుంది .అక్కడ వాతావరణం అంతా ఎంతో ఇబ్బందిగా ఊపిరాడనట్లు అన్పించసాగింది. అపర్ణ భర్త రామకృష్ణ ఎప్పుడు ఆఫీస్ గురించి చెప్పినా, సహోద్యోగులందరూ ఎంతో ఆత్మీయంగా ఒకే కుటుంబంలా ఉంటామని చెబుతూ ఉండేవాడు. కానీ ఇదేమిటి ఇలాగుంది ? తనకి చూపించిన సీట్లో కూర్చున్నా ఆ ఆఫీసర్ ఏమిటో తన వైపు పదే పదే చూస్తున్నాడు. కేవలం తన భ్రమా ? ‘చూద్దాం కొన్నిరోజులు’ అనుకుంటూ తనకు తనే ధైర్యం చెప్పుకుంది . ఒక నాలుగురోజులు నెమ్మదిగా గడిచాయి . తన పని ఫైల్స్ అన్నీ ఎక్కడివక్కడ నీట్ గా సర్దడం, ఆఫీసర్ దివాకర్ ఏ ఫైల్ అడిగితే అది అందివ్వడం, లెటర్స్ డిస్పాచ్ సెక్షన్ కు అందచేయడం, వచ్చిన కరస్పాండెన్స్ లెటర్సన్నీ ఏఏ ఫైల్స్ లో ఏమేమీ ఫైల్ చేయాలో దివాకర్ అసిస్టెంట్ శేఖర్ అపర్ణకు చెప్పాడు. లెటర్ రిఫరెన్స్ నంబర్ లో ఫైల్ నంబర్ కూడా ఉంటుంది, కాబట్టి ఆ రిలవెంట్ ఫైల్స్ లో జాగ్రత్తగా ఫైల్ చేస్తూ ఉండాలని చెప్పాడు. కాన్ఫిడెన్షియల్ లెటర్స్ మటుకు దివాకరే సెపరేట్ గా ఒక ఫైల్ లో పెట్టుకుంటాడు. ఆ ఫైల్ అతని అధీనంలో మాత్రమే ఉంటుంది. అపర్ణ చాలా అణుకువుగా ఉంటూ మెల్లిగా తన పనిని గ్రేస్ప్ చేసుకోసాగింది . అపర్ణ చదువుకోకపోయినా ఆమెకు గ్రహింపుశక్తి, జ్ఞాపక శక్తి అమోఘం. రామకృష్ణ అపర్ణను ఆటపట్టిస్తూ ఉండేవాడు, " నిన్ను మీవాళ్లు ఎక్కువ చదివించి ఉంటే ఇందిరాగాంధీని మించిపోయి ఉండేదానివి, ఇప్పుడే ప్రతీ విషయాన్నీ కూలంకషంగా చర్చిస్తూ ఎప్పుడో జరిగినవి కూడా భలే గుర్తు చేస్తూ, నన్ను డమ్మీని చేస్తావు అప్పూ” అనేవాడు.

పనిచేసుకుంటున్నా మాటి మాటికీ భర్త గుర్తొచ్చినప్పుడల్లా కళ్లు తడి అవడం, గబుక్కున ఎవరైనా చూస్తున్నారేమోననుకుంటూ జేబు రుమాలుతో తుడుచుకుంటూ ఉండేది. మధ్య మధ్యలో దివాకర్ అపర్ణను ఏదో ఫైల్ తెమ్మనమని చెపుతూ ఫైల్ ను అందుకుంటూ ఆమె చేతులను తాకేవాడు. మొదట్లో అసంకల్పితంగా తగిలిందేమోనని భావించేది. కాని పెళ్లి అయి, దాంపత్య జీవితాన్ని నిండుగా భర్తతో పంచుకున్న అపర్ణకు అది కావాలని తనను తాకుతున్నాడని గ్రహించలేనంత అమాయకురాలు కాదు. కానీ ఎలా దాటాలి ఈ విపత్కర పరిస్తితిని ? ఇంకా కొత్తగా ఉంది, ఎవరికి చెప్పుకోవాలి తన సమస్యను ? అతనా ఎన్నో సంవత్సరాలనుండి ఒక ఉన్నతమైన పదవిలో పనిచేస్తున్నాడు. తనా, చాలా చిన్న ఉద్యోగిని,పైగా కొత్తగా చేరింది. ఫలానా ఆఫీసర్ ఇలా ప్రవర్తిస్తున్నాడని చెపితే నమ్మితే ఫరవాలేదు, నమ్మకపోతే తననే ఎక్కువ అనుమానించే పరిస్తితి రావచ్చు. భర్త చనిపోయాడు, వయస్సులో ఉంది, ఆఫీసర్ ను వలలో వేసుకుంటోంది అని తిరిగి ఆ ఆరోపణ తనమీదకే వస్తే? అరిటాకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి అరిటాకు మీద పడ్డా ఆకుకే నష్టం అన్నసామెత ఊరికే అనలేదు పెద్దలు. హమ్మో... తనకెలాంటి అపఖ్యాతి వచ్చినా తను తట్టుకోలేదు, ఆత్మహత్యే శరణ్యం. ఇలా అపర్ణ ఆలోచనలు సాగిపోతున్నాయి.

అపర్ణకు ఏమీ ఉత్సాహంగా ఉండడంలేదు. బలవంతంగా ఒక బలిపశువులా ఆఫీస్ కు వస్తోంది.అతన్నెదురుకోవడం అంత తేలిక కాదని అపర్ణకు స్పష్టంగా తెలుసు. అందుకే సాధ్యమైనంతవరకు బిజీగా ఉంటూ, తనకు తను గిరిగీసుకుంటూ ముక్తసరిగా ఉంటోంది. మెల్లిగా రోజులు నెలలుగా గడచిపోతున్నాయి. ఒకసారి దివాకర్ కు ‘సి ఎమ్ డి’ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ఎంప్లాయీస్ కు ఏదో స్పెషల్ వెల్ ఫేర్ ఫండ్ కోసం అదివరలో ‘సి ఎమ్ డి’ కి రిక్విజిషన్ పెట్టుకుంటే, ‘సి ఎమ్ డి’ గారు ఆ ఫండ్ ను అప్రూవ్ చేస్తూ, ఒక లెటర్ వ్రాసి సంతకం చేసి దివాకర్ కు పంపారు. అది హైలీ కాన్ఫిడెన్షియల్ లెటర్. ఆ ఎప్రూవల్ లెటర్ ఉంటేనే ఆ ఫండ్ ఆ ఇయర్ బడ్జట్ లో సేంక్షన్ అవుతుంది. కోట్ల రూపాయల విలువైన ఫండ్.పైగా ఆ ఫండ్ కోసం యూనియన్ చాలా ఫైట్ చేసి ‘సి ఎమ్ డి’ చేత ఓకే చేయించింది. ఆ లెటర్ వెంటనే కావాలని, తమ ఆఫీస్ కాపీ ట్రేస్ అవడంలేదని బడ్జెట్ ఎలొకేషన్ కు ఆ లెటర్ బోర్డుకు పంపాలని ‘సి ఎమ్ డి’ పీ.ఏ ఫోన్ చేసి, ఆ లెటర్ స్వయంగా తమ ఆఫీస్ కు వచ్చి అందచేయమని ఇనస్ట్రక్షన్స్. దివాకర్ తెగ వెతికేస్తున్నాడు ఫైల్సన్నీ. అతని అసిస్టెంట్లుకూడా వెతుకుతున్నారు. నిజానికి దివాకర్ అటువంటి లెటర్స్ అన్నీ తనే స్వయంగా తన కాన్ఫిడెషియల్ ఫైల్ లో ఫైల్ చేసుకుంటాడు. దివాకర్ కు చాలా టెన్షన్ గా ఉంది. ఆ లెటర్ కనబడడం లేదు. ఎమ్ డి గారు బాంబే టూర్ లో ఉన్నారు. ఆ లెటర్ బోర్డ్ కు పంపకపోతే ఈ సంవత్సరం ఆ ఫండ్ శాంక్షన్ కాదు. ఎందుకు శాంక్షన్ కాలేదంటూ బోల్డన్ని ఆరాలు, ఎన్ క్వైరీలు, చివరకు యూనియన్ తనమీద ద్వజమెత్తడం, తన అసమర్ధతకు తనని సస్పెండ్ చేయడం... దివాకర్ కు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అదికేవలం తనకు సంబంధించిన విషయమే, తన ఉద్యోగుల నెవరినీ బ్లేమ్ చేయలేని పరిస్తితి. అపర్ణను ఎవరూ ఏమీ అడగలేదుకానీ, ఏదో ఎమ్ డి ఎప్రూవల్ లెటర్ అని, వెల్ ఫేర్ ఫండ్ కు సంబంధించినదని, ముఖ్సమైన లెటర్ కోసం హడావుడి పడుతున్నారని మాత్రం గ్రహించింది . అందరూ ‘బోర్డ్ కు పంపాలిట, బడ్జట్ శాంక్షన్ కోసం’ అని మాట్లాడుకోవడం వింటోంది. తటాలున అపర్ణకు గుర్తుకొచ్చింది. ఒక పదిరోజుల క్రితం దివాకర్ తనకు చాలా పేపర్లు ఇస్తూ ఫైలింగ్ చేయమన్నాడు. అన్ని పేపర్లకీ రిలవెంట్ ఫైల్స్ దొరికాయి కానీ ఒక లెటర్ ను ఏ ఫైల్ లో ఫైల్ చేయాలో తెలియక చటుక్కున ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేసి అందులో ఫైల్ చేసేసింది. దాని ఇంపార్టన్స్ ఆమెకు అంతగా అర్ధం కాకపోయినా ఆ లెటర్ మీద ఎమ్. డీ సంతకం, ఎర్ర సిరాతో ‘అప్రూవ్డ్’ అని వ్రాసి ఉండడం మాత్రం చూసింది. అసలు ఆ లెటర్ తన దగ్గరకు రాకూడదు, అంటే దివాకర్ తనకు ఇవ్వకూడదు . కానీ పొరపాటున అన్నిపేపర్లతోబాటూ అది తన చేతికి వచ్చేసింది. తను మామూలుగా వేరే ఫైల్ లో ఫైల్ చేసేసింది . వెంటనే సీట్లోంచి లేచి ఫైల్స్ కింద ఎక్కడో పెట్టిన ఆ కొత్త ఫోల్జర్ ను తీసి చూసింది. ఎమ్ .డి గారి లెటర్ అందులో కనిపించింది. అది అవునో కాదోననుకుంటూ దివాకర్ దగ్గరకు వెళ్లి, " సర్ ఈ లెటర్ చూడండి ఒకసారం”టూ ఫోల్డర్ అతని చేతికిచ్చింది. ఆ లెటర్ చూసిన అతని ముఖంలో ఆశ్చర్యానందాలు. ఫుల్ ఎక్సైజ్ మెంట్ కు లోను అవుతూ ఎక్కడ దొరికిందని అడగడంతో అపర్ణ జరిగిన సంగతి చెప్పింది. సరిగా వినీ వినకుండా ఆ లెటర్ తీసుకుని ఎమ్. డీ ఆఫీస్కు పరుగెత్తాడు. ఆయన అటు వెళ్లగానే ఆ సెక్షన్ లోని అందరూ అపర్ణను అభినందించడమే. చక్కగా జాగ్రత్తగా ఫైల్ చేసి సరియైన సమయానికి గుర్తుచేసుకుని ఇచ్చినందుకు. దివాకర్ ఆ లెటర్ని ఎమ్. డి పి.ఏ కు ఇవ్వడం, ఆ పీఏ దానికి జిరాక్స్ కాపీలు తీసి ఒకటి దివాకర్ కు ఇచ్చి, ఆ ఒరిజనల్ లెటర్ బోర్డ్ కు ఫార్వర్డ్ చేసాడు. హమ్మయ్య... దివాకర్ లో ఎంతో రిలీఫ్. తిరిగి తన సీట్ కు వస్తూ ఆత్మపరిశీలన చేసుకున్నాడు. ఇది తన తప్పే, తన అజాగ్రత్తే. అయినా కూడా ఒక చిన్న అటెండర్ ఎంతో బాధ్యతగా ప్రవర్తించి ఆ లెటర్ ను సేఫ్ గా దాచి, గుర్తుపెట్టుకుని సమయానికి తనకి అందచేసింది . లేకపోతే తనే స్తితిలో ఉండేవాడో ? అమాయకంగా, అణుకువుగా ఎప్పుడూ తలవంచుకుని తన పనిని చేసుకుపోయే అపర్ణ కళ్లముందు కనబడింది. తను ఆ అమ్మాయిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చాలా వేధించాడు. భర్తలేడు, ఆమెను లొంగదీసుకోవచ్చనుకున్నాడు. పాపం ఆ అమాయకురాలు తనని సివియర్ క్రైసిస్ నుండి కాపాడింది. అతనిలో పశ్చాత్తాపం కలగడం ప్రారంభించింది. మౌనంగా వచ్చి సీట్ లో కూర్చున్నాడు. అప్పటికే ఆఫీస్ అవర్స్ అయిపోతున్నమూలాన అందరూ ఎవరికి వారు సర్దుకుంటూ తమ సీట్లను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు. అపర్ణ, ఫైల్స్ ఉన్న బీరువాలకి తాళాలు వేస్తోంది .

మెల్లిగా “అపర్ణ గారూ” అంటు పిలిచాడు దివాకర్.

అసలే దివాకర్ అంటే భయపడే అపర్ణ ఇప్పుడు పిలుస్తున్నాడేమిటి అనుకుంటూ బెదురుగా వచ్చి నిలబడింది . ఆ పరిసరాల్లో ఎవరూలేరు.

“ అపర్ణగారూ, చాలా ధాంక్స్ అమ్మా. ఈరోజు మీరు చేసిన మంచి పనిని నేను జీవితాంతం గుర్తుపెట్చుకుంటాను. మీకు చాలా బుుణపడి ఉన్నాను అపర్ణగారూ. ఇన్నాళ్లూ మీతో నా అసభ్య ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి అపర్ణగారూ, నా వలన మీకు ఎటువంటి సమస్యా ఉండదు ఇంక . మీరు నిశ్చింతగా ఉండొచ్చు అపర్ణగారూ.... ఐ ప్రామిస్ యూ” అంటూ ఆమెకు అభయమిచ్చాడు.

“సరే సర్” అంటూ తలవంచుకుని అపర్ణ తన బేగ్ ను తీసుకుని అక్కడనుండి వచ్చేసింది . ఇంటికి వస్తున్న అపర్ణకు భర్త ఎప్పుడూ తనతో అనే మాటలు గుర్తొచ్చి కళ్లు చెమర్చాయి. " ఏదేనా సమస్య రాగానే మనం పరిష్కారం ఆలోచించటం మానేసి, విచారించటం ప్రారంభిస్తాం అపర్ణా, సముద్రం ఎంత పెద్దదైనా, నీళ్ళని లోపలికి రానివ్వకపోతే పడవ మునగదు. అలాగే సమస్య ఎంత పెద్దదైనా, మనసులోకి రానివ్వకపోతే బాధ ఉండదంటూ ఎంతో ధైర్యాన్ని చెప్పే భర్త తన పక్కన లేడుకదా అనుకుంటూ బాధగా నిట్టూర్చింది.

***సమాప్తం ***



రచయిత్రి ఇతర రచనలు :

234 views0 comments
bottom of page