top of page

రివార్డ్

'Reward' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

వైదేహి కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టింది .

కొత్త ఇల్లు, వాతావరణం, ఇంకా తనకు ఏ మాత్రమూ అలనాటు కాని మనుషులు . భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు. అయినా వైదేహి కొత్త మనుషులతో, కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోతుంది . అందరితో కలుపుగోలుతనంగా ఉంటుంది కనుకే వైదేహీ వాళ్ల అమ్మ, కూతురిని అత్తవారింటికి పంపిస్తున్నా ఏ మాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థతపై నమ్మకం పెట్టుకుంది . వైదేహి. అత్తవారింటికి వచ్చాకా రెండు మూడు రోజులు వారింటి పద్ధతులను నిశితంగా గమనించింది .

మామగారు గవర్న్ మెంట్ ఆఫీస్ లో పని చేసి రిటైరయ్యారు. ఆడబడుచు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుకుంటోంది . మరిది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు, కామర్స్ సబ్జెక్టు తీసుకుని . వైదేహి ఆంధ్రాబేంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా చేస్తోంది. ఇంజనీరింగ్ తరువాత బేంకింగ్ పరీక్షలు వ్రాసి అందులో సెలక్ట్ అయింది. భర్త అరబిందో ఫార్మాలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు . తను ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీస్ కు బయలు దేరుతుంది.. శ్రీహరి ఎనిమిందింటికే వెళ్లిపోతాడు . ఒక పధ్దతి, ప్రణాళికా లేని సంసారంగా అనిపించింది వైదేహి దృష్టికి . అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు, ఇంట్లో ఎంత మంది భోజనం చేస్తారు, ఎంతమంది లంచ్ డబ్బా తీసుకెడతారు అన్న ఆలోచన ఉండదు ఆవిడకు.

మరుసటి రోజుకి ఏ వంట చేయాలో, ఏ టిఫిన్ చేయాలో వైదేహి పుట్టింట్లో, తల్లి ముందు రోజు రాత్రే ఆలోచించుకుని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది .ఇక్కడ అలాకాదు, ఏమి చేయాలో, ఏమి చేయమంటారో మామగారిని అడుగుతారావిడ.. ఆయనకు విసుగు . అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందర తొందరగా చేసేయ లేరు . దాని ఫలితం ఎక్కువ ఎక్కువ వండేయడం, ఎవరూ సరిగా తినీ, తినకా వండినదాంట్లో సగం అంతా వేస్ట్ అయ్యేది .వైదేహి అత్తగారితో చెప్పింది, సాయంత్రం పూట వంట తను చేస్తానని .వైదేహికి పుట్టింట్లో వంట చేయడం అలవాటే. సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త కొత్త వంటలెన్నో తెలుసుకుని మరీ చేస్తుంది . తను అమ్మ వెనుకనే తిరుగుతూ అన్నీ చూసేది, చేయడానికి ఉత్సాహం చూపేది .ఇక్కడ ఆడబడుచు అసలు వంటింట్లోకే అడుగుపెట్టదు . అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్నా చితకాలాంటి పనులేమీ చెప్పకపోవడం గమనించింది .వంటకు కావలసిన గ్రాసరీ కూడా సరిగా ప్లాన్ లేదు ఇక్కడ.. ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు పదిసార్లు మామగారిని బజారుకి పంపుతారు ఆవిడ .

ప్రతీ రోజూ ఉదయాన్నే మూడు రకాల న్యూస్ పేపర్లు.. మామగారు తప్పించితే ఎవరూ న్యూస్ పేపరు చూడనైనా చూడరు .పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చేయడం, ఎందుకు ఏమిటీ అని ప్రశ్నించకుండా .లేనిపోని ఆర్భాటాలూ, హంగులూ ఇంటి నిండా .అందుకనే ఇంతవరకూ సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు .వాళ్లుంటున్న త్రీ బెడ్ రూమ్స్ ఎపార్ట్ మెంట్ కి ఇరవై వేలు అద్దె . వైదేహి పుట్టింట్లోని పధ్దతులకూ, ఇక్కడ పధ్దతులకూ సహస్రం వ్యత్యాసం ఉందని భావించింది . ఆరోజు ఫస్ట్ తారీఖు . శ్రీహరి వైదేహిని పిలిచి ఇక నుండీ ఇంట్లో వ్యవహారాలన్నీ వైదేహినే చూసుకొమ్మని ఎవరెవరికి ఎంత ఎంత ఎమౌంట్ పేచేయాలో చెప్పాడు.. శ్రీహరి జీతం, వైదేహి జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు. నాన్నగారు వద్దన్నా ప్రతీనెల పదివేలు ఇస్తూ ఉంటారని ఆయన వినరని చెప్పాడు.. చెల్లాయ్, తమ్ముడి కాలేజ్ ఫీజులు అవీ ఆయనే చూసుకుంటారని చెప్పాడు .ఇంక నీవే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ వంటూ జోక్ చేసాడు .

"ఏం మీరు అంతా చూసుకుంటున్నారుగా హరీ, ఏమైంది సడన్ గా .అయినా నేను చూసుకోవడం ఏమిటీ ? నేను అసలుకే పిసినారి దాన్ని, ప్రతీదీ శల్యపరీక్షలు చేస్తాను, నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే ?"

" ఇంతోటి వ్యవహారానికి సమస్యలు ఏమిటి వైదేహీ ? ఏం మెయిన్ టైన్ చేయలేవా మరి ?" "అదేంకాదు, చేయలేక కాదు, మీకంటే ప్లేన్డ్ గా చేయగలను, కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది, మన ఇంటి బాగోగుల కోసమే సుమా . "

"అబ్బ..... ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా , అంతగా ఆలోచించడానికి ? నేను అమ్మా నాన్నగారికి కూడా చెప్పేసాను, ఇకనుండి ఏది కావాలన్నా వైదేహితోనే చెప్పమని, నాకు వీలవడంలేదని . నాన్నగారు, అమ్మా 'సరేలేరా, వైదేహి ఏమైనా పరాయి వ్యక్తా' అన్నారు.. నా ఏటిఏమ్ కార్డ్స్, బేంక్ చెక్ బుక్ అన్నీ నీ బీరువాలో పెట్టాను వైదేహీ .అన్నీ చూసుకో మరి" అంటూ నిద్రవస్తోందని బెడ్ రూమ్ కి వెళ్లిపోయాడు .

ఇంక వైదేహి తను అనుకున్నట్లుగా ఆచరణలో పెట్టింది.. మామయ్యగారితో మెల్లిగా మాట్లాడింది, 'మామయ్యా! మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతార'ని.. ఆయన చెప్పగానే 'మిగతావి ఎవరూ చదవనప్పుడు అనవసరం కదా మామయ్యా' అనగానే ఆయన 'అవునమ్మా, నేను హరికి రెండుమూడుసార్లు చెప్పాను కూడా, పట్టించుకోలేద'ని అన్నారాయన .నెలకొకసారి ఇంట్లో గ్రాసరీస్ ఏమి కావాలో అత్తగారిని అడిగి లిస్ట్ తయారు చేసింది.. అలాగే వాళ్లు రెగ్యులర్ గా వాడే మందులు కూడా నెలకి ఒకే సారి తెప్పించేది.. కూరగాయలు కూడా వారానికి ఒక్కసారి తెప్పించేది.. మాటి మాటికీ మామగారు సంచీ తీసుకుని వెళ్లడం తగ్గిపోయింది..

అలాగే ముందు రోజు రాత్రే ఎవరెవరు టిఫిన్ తిని వెడతారో, లంచ్ బాక్స్ ఎవరెవరు తీసుకెడతారో కనుక్కుని మర్నాడు ఏమేమి తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది.. కొన్ని కాయగూరలు ముందు రోజు రాత్రే వైదేహి తరిగి రెడీ చేసేది . సాయంత్రపు పూట వైదేహి వంట చేస్తున్నప్పుడు ఆడబడుచు శిరీషను పిలిచి సరదాగా కబుర్లు చెపుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది .రాత్రి పూట అందరూ ఒకేసారి కలసి కూర్చుని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది .ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతోందో, ఎక్కడెక్కడ అనవస ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది .ఇంట్లో చక్కని ప్రణాళికా బధ్దమైన మార్పుకి మామగారికి అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కనబడింది .

ఇంత చక్కని మార్పుకి ఎవరిలోనూ స్పందన లేదు.. వైదేహి ఒక్కోసారి ఆశ్చర్యపోతుంది.. తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవరూ స్పందించరు, చివరకు శ్రీహరి కూడా అతి మామూలుగా ఉంటారు.. చాలా సహజం సుమా అన్నట్లుగా . ఆంధ్రా బ్యాంక్ వారి కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బేంక్ ఉద్యోగులందరకూ ఇళ్లు కట్టుకోడానికి స్తలాలను కేటాయిస్తుంటే వైదేహి కూడా నాలుగు వందల గజాల స్తలానికి అప్లైచేయడం ఎలాట్ అవడం జరిగింది. ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినపుడు, 'ఆహా.. అలాగా' అనిమాత్రం అని ఊరుకున్నాడు .ఏమిటీ మనిషి ? ఏ భావోద్వేగాలూ లేవా అనుకుంది.. నన్ను మెచ్చుకొమ్మని కాదు, నేను చేసిన పని మంచిదో కాదో అన్నది ఒక చిన్న మాటద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అనుకుంది.. కొంతమంది అంతేనేమోననుకుంటూ సరిపెట్టుకుంది .

మరో రెండు సంవత్సరాలలో వైదేహి ఆడబడుచు చదువు అయిపోయింది.. ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటోంది.. మరిది సి.ఏ. కు ప్రిపేర్ అవుతున్నాడు.. ఈలోగా బేంక్ కోపరేటివ్ సొసైటీ లోని మెంబర్స్ అందరూ ఇళ్లు కట్టుకోవాలని అనుకోవడంతో వైదేహి కూడా సొంత ఇంటి నిర్మాణం పైన మొగ్గు చూపింది.. పైన మూడు బెడ్ రూములూ, కింద సింగిల్ బెడ్ రూమ్ హాల్ అండ్ కిచెన్ తో డూప్లెక్స్ హౌస్ కు ఎస్టిమేషన్ వేయించింది.. తన జీతం, శ్రీహరి జీతం పైన హౌసింగ్ లోన్ తీసుకుంటే అప్పులేకుండా ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకుని శ్రీ హరి తో చెప్పింది .

"జీతంలో ఎక్కువ భాగం లోన్ కి కట్ అయిపోతే కష్టమేమో కదా వైదేహీ" అనే సందేహాన్ని వెలిబుచ్చాడు .

"ఇల్లు మన చేతికి వచ్చాక, కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఫ్లాట్ రెంట్ ఉండదు కదా హరీ, అయినా మీకెందుకు, నేను మెయిన్ టైన్ చేస్తాను కదా" అనేసరికి నీ ఇష్టం అంటూ వైదేహి మీద వదిలేసాడు .మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ కూడా శాంక్షన్ అయింది.. వైదేహి చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే, 'అవునా' అన్నట్లు తలపంకించాడు . కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనపడలేదు.. కాని వైదేహి అంతరాత్మ మాత్రం వైదేహి భుజం తడ్తూ....చాలా మంచి పని చేస్తున్నావు వైదేహీ అంటూ అభినందించింది. ఈలోగా వైదేహి కి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది, బేంకింగ్ ఎగ్జామ్స్ కు కష్టపడి ప్రిపేర్ అయి పాస్ అయినందుకు .ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ పంచాలని స్వీట్స్ కొనుక్కుని వస్తూంటే ...... వైదేహి అంతరాత్మ వైదేహిని నిలదీస్తూ ......" పిచ్చి వైదేహీ, నీకు ప్రొమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాటం" అంటూ .......?

"అవును సుమా ...... నాకు నేనే కంగ్రాట్యులేషన్స్ చెప్పుకోవాలండీ అంతరాత్మగారూ! మరి ఏమిచేస్తామండీ" అనుకుంది మనస్సులో . ఏ భావోద్వేగం వ్యక్తపరచలేని మనుషులైనా ఇంట్లో ఎవరూ చెడ్డవారు కాదు.. తనను అభిమానిస్తున్నారు , అది చాలదా అనుకుందో క్షణం .కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది.. వైదేహి ఆడబడుచుకి ఉద్యోగం రావడం, పెళ్లి సంబంధాలు చూడడం జరుగుతోంది .ఆరోజు శ్రీ హరి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు.. భర్తను అంత ఉత్సాహంగా చూడని వైదేహి కారణమేమిటో అనుకుంది .వైదేహి శ్రీహరి కి కాఫీ అందిస్తుండగా, శ్రీ హరి చెప్పాడు, తనకు సీనియర్ సైంటిస్ట్ గా ప్రమోషన్ వచ్చిందని, జీతం కూడా బాగా పెరిగిందని .

వైదేహి అతి మామూలుగా 'ఔనా' అందేగానీ ఏమాత్రం హర్షాతిశయాన్ని వ్యక్తం చేయలేదు . "ఏమిటోయ్, ఇంత శుభవార్తకు రెస్పాన్సే లేదు రాణీగారి నుండి!" అంటున్న శ్రీహరి మాటలకు .........." ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్త లకైనా ఎవరికి వారే కంగ్రాట్యులేషన్స్ చెప్పుకోవాలండీ మహాశయా " అంటూ ఉడికించింది . "చూడండి హరీ, మీదాకా వస్తేగాని అర్ధం కాలేదు.. మీకు ప్రమోషన్ వస్తే నానుండి కంగ్రాట్స్ ను ఆశించారు.. నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు .మరి నేను ? నాకూ ప్రమోషన్ వచ్చింది, నేను అనుకున్నవెన్నో సాధించాను.. కనీసం ఒక చిన్న ప్రశంసను మీనుండి ఆశించాను.. ఎప్పుడూ నన్ను ఏ సంధర్భంలోనూ .....'యూ డిడ్ ఇట్ వైదేహీ ' అన్న ఒక్క చిన్న మాట కూడా వినలేదు .నా స్వభావమే అంత అంటారేమో .అలాగని తప్పించుకోకండి.. మీ ప్రమోషన్ కు మీ కొలీగ్స్ మిమ్మలని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా ? ఒక విధమైన ఉత్సాహం స్పూర్తి కలుగడం సహజం ఎవరికైనా. మనం కష్ట పడి చేసిన దానికి ఒక చిన్న రివార్డ్ దొరికిందన్న ఆనందం .మనుషులెప్పుడూ ఒకేలాగ ఉండకూడదు హరీ.. పెళ్లి కి ముందు గడిపిన జీవితం వేరు, భార్యగా నేను మీ జీవితంలోకి అడుగుపెట్టాకా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు.నేను కూడా.. మన ఆనందాన్ని, శ్రమని మనం ఒకరినొకరం గుర్తించుకోపోతే మరెవరు గుర్తిస్తారు హరీ ?"

" ఓ....సారీ వైదేహీ, నాకు అర్ధమైంది ఇప్పుడు , మరెప్పుడూ ఇలా జరగదు, ప్రామిస్" అంటూ వైదేహిని దగ్గరకు తీసుకున్నాడు .అనుకున్నట్లుగా ఇల్లు నిర్మాణం పూర్తి అవడం , గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు .అనుకోకుండా వైదేహి ఆడబడుచు శిరీష పెళ్లికూడా కుదిరిపోయింది . ఇంటి గృహప్రవేశం తరువాత శిరీష పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు .గృహప్రవేశం చాలా గ్రాండ్ గా జరిగింది.. ఆరోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే వైదేహి అత్తగారు వైదేహిని పిలిచి ఆమె మెడలోని నాలుగు పేట్ల చంద్రహారాన్ని వైదేహి మెడలో వేస్తూ.... ఇది నీకే వైదేహీ, నా గుర్తుగా అంటూ, వైదేహి నుదుటిని చుంబించి ముద్దు పెట్టుకున్నారు . గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్ ప్రభాకర్ అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లో సాయం చేసారు . సునంద వైదేహితో " మీరు చాలా కేపబుల్ అంటూ మావారు చాలా తరచుగా మీ గురించి చెబుతూఉంటారు వైదేహీ, మీ శ్రీహరి గారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట, నా భార్య ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్ మెంట్ ను కూడా చాలా చక్కగా బేలన్స్ చేస్తుందని, ప్లేనింగ్ లో మీకు మీరే సాటి అంటూ " .

"అదేమీ లేదు సునందా, ఇంట్లో కుటుంబ సభ్యులలో చక్కని అవగాహన ఉంటే మనలాంటి వాళ్లం ఏదైనా సాధించగల"మంటూ చిరునవ్వు నవ్వింది . ఫంక్షన్ హడావుడి అలసట అంతా తీరిపోయాకా వైదేహి మామగారు కూతురి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో వైదేహి ఒక పదిలక్షల కి చెక్కు వ్రాసి మామగారికిస్తూ......'శిరీష పెళ్లి ఖర్చులకు వాడండి మామయ్యా అంటూ ఆయన చేతిలో పెట్టింది .కోడలి మంచి మవసుకి ఆయన హృదయం పులకించి మనసులోనే ఆమెను ఆశీర్వదించారు !


రచయిత్రి ఇతర రచనలు :


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub.Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాకా పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ మా శ్రీ వారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం .

'

71 views0 comments

Comments


bottom of page