top of page

మనసు - మార్పు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

https://youtu.be/qEe8YQ1BRfc

'Manasu Marpu' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త


బాబును చూసుకోవడానికి ఉద్యోగం వదులుకోమని భార్యతో చెబుతాడు ప్రణవ్.

అందుకు అంగీకరించదు సాహితి.

ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వస్తాయి.

చివరికి ఏమైందనేది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.


“నీకు ఎన్ని సార్లు చెప్పాలి సాహితీ , కొన్నాళ్లు నీ ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వమని.. బాబుని అలా ఆయా మీద వదిలేసి నీవు ఉద్యోగం చేయకపోతేనేమీ ? నీవు జాబ్ చేస్తే గానీ గడవనట్లు లేదు కదా ?”


“నీవు ఎన్ని చెప్పు ప్రణవ్, నేను నా ఉద్యోగాన్ని ససేమిరా మానను.. ఉద్యోగం మాని వంటింటి కుందేల్లా బ్రతకడం నా వల్లకాదు.. అయినా నీకేమిటీ ఇబ్బంది ? మన బాబు అక్షిత్ ను, నా ఉద్యోగాన్ని బాగానే బేలన్స్ చేసుకుంటున్నాను కదా !

అయినా చూస్తున్నాను, నేను ప్రెగ్నంట్ నని తెలిసినప్పటినుండి ఉద్యోగం మానేయ్ మంటూ ఒకటే పోరు పెడ్తున్నావు.. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నానని జలస్ నీకు ..”


“నాకు జెలస్ ఏమిటీ ? నీవంటే కనసర్న్, అలాగే బాబు ఆయా పెంపకంలో పెరగడం ఇష్టం లేదు కాబట్టీ చెపుతున్నాను.. నేనేదైనా నీ మీద ప్రేమతో చెపితే ఎందుకలా అర్ధం చేసుకుంటావు సాహితీ ?” కొంచెం కోపంగానే అన్నాడు ప్రణవ్..


“నిజంగా నామీద కన్ సర్న్ ఉందనుకుంటే నన్ను ఎంకరేజ్ చేయి, సర్దుకుందాములే అని చెప్పు.. అంతేగానీ ఇలా మాటి మాటికీ నా ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడకు.. నీవు ఎన్ని చెప్పినా నా ఉద్యోగాన్ని మానుకోలే”నంటూ అక్కడనుండి కోపంతో వెళ్లిపోయింది సాహితి..


ప్రణవ్ ఆమె వెళ్లినపైపే నిశ్చేష్టితుడై చూడసాగాడు..


సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సాహితి ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లైనాక అత్తవారింటికి వచ్చింది.. ప్రణవ్ కు ఒక అన్నయ్య, చెల్లెలు. చెల్లెలికి పెళ్లైపోయింది.. వదిన ఉద్యోగం చేయదు.. బి..ఎస్..సీ మేధమెటిక్స్ గ్రూప్ తో కాలేజ్ పస్ట్ వచ్చింది.. చాలా తెలివైనది.. ఇంట్లోనే టెన్ట్ క్లాస్, ఇంటర్ విద్యార్ధులకు మేధ్స్ లో ట్యూషన్స్ చెపుతూ తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన పిల్లలను చాలా కేరింగ్ గా చూసుకుంటుంది..


సాహితికి అహంభావం ఎక్కువ. అత్తవారింట్లో అందరూ ఉన్నారే, ఏమైనా అనుకుంటారేమోనన్న ఊహే లేకుండా శని ఆదివారాల్లో గది తలుపులు మూసుకుని పదిగంటలవరకూ పడుకుంటుంది.. ఇంట్లో ఉన్నంతసేపూ షార్ట్స్, టీషర్ట్స్ వేసుకుని తిరుగుతుంది.. అందరితో కలసి సరదాగా లంచ్ చేయడం, కూర్చుని మాట్లాడడం లాంటివి చేయదు.. లంచ్ కు పిలిస్తే నేను తరువాత తింటానంటూ తప్పించుకుంటుంది.. ఎప్పుడో మధ్యాహ్నం మూడుగంటలకు ఒక్కర్తీ ప్లేట్ లో పెట్టుకుని తన బెడ్ రూమ్ లో కుర్చీలో కూర్చుని తింటుంది.. చాలాసార్లు ప్రణవ్ మందలించాడు అది పధ్దతికాదని..

ఇది మరీ బాగుంది ప్రణవ్, నాకు ఆకలేసినప్పుడు తింటానుకానీ, ఒకరికోసం తినడం నా స్వభావంకాదు..


ఇంట్లో నాన్నా వాళ్లూ ఉన్నారు బాగోదు, అందరిలోకి వచ్చేటప్పుడు ఆ షార్ట్స్, టీషర్ట్స్ వేసుకోద్దని, ఇంట్లో నలుగురు సమక్షంలో మన డ్రెస్సింగ్ విధానం ఎంబ్రాసింగ్ గా ఉండకూడదన్న ప్రణవ్ మాటలకు....


" అదేమిటి ప్రణవ్, నీవేనా ఇలామాట్లాడుతున్నావ్? లేకపోతే మీ అమ్మగారు గానీ నిన్ను చెప్పమన్నారా?” అంది.


“మధ్యలో మా అమ్మను బ్లేమ్ చేయడం ఏమిటి సాహితీ ? మా పేరెంట్స్ ఎవరి వ్యక్తిగత విషయంలోనూ తలదూర్చరు.. అదివాళ్ల సంస్కారం.. మనమే కాస్తంత ఒళ్లుదగ్గర పెట్టుకుని ప్రవర్తించడం మంచిది..”


“నా ఇష్టం ప్రణవ్, నాకు నచ్చిన దుస్తులు నా కంఫర్ట్ బులిటీ ప్రకారం వేసుకుంటాను. ఈ విషయం లో ఇంక తర్కం అనవసర”మంటూ రోషంగా అక్కడనుండి వెళ్లిపోయింది..


ఎవరిమాటా వినని భార్యపట్ల అసహనం ఉన్నా ఏమీచేయలేకా మౌనం వహించాడు ప్రణవ్..


సాహితికి మూడోనెల ప్రెగ్నన్సీ అని తెలిసేసరికి ఇంట్లోఅంతా ఆనందపడ్డారు.. ప్రణవ్ తల్లి సరస్వతమ్మగారు సాహితిని అడిగారు, ‘నీకిష్టమైనవి ఏమిటో చెప్పమ్మా, మొహమా పడకుండా, చేసిపెడతా’ననేసరికి ముఖం ముడుచుకుంది..


ఆ రోజు రాత్రి ప్రణవ్ తో, ‘ఏమిటీ మీ వాళ్లంతా చంద్రమండలం ఎక్కినంతంగా అందరూ హడావుడి చేస్తున్నారు, నాకీ ఆర్భాటాలవీ ఇష్టం ఉండవు ప్రణమ్, మీ అమ్మగారికి చెప్ప’మంటూ ప్రణవ్ మీద ఎగిరిపడింది.. అయినా కూడా సరస్వతమ్మగారు ఏవో స్వీట్లవీ ప్రత్యేకంగా చేసి మరీ కోడలిచేత తినిపించారు.. ఎంత అహంకారి అయినా సాహితంటే ప్రణవ్ కు చాలా ఇష్టం.. తను తండ్రి కాబోతున్నందుకు సాహితిని మరీ అపురూపంగా చూసుకుంటున్నాడు..

‘అంతదూరం ఆఫీస్ కు వెళ్లి పనిచేయలేవు సాహితీ, కొన్నాళ్లు ఉద్యోగానికి బ్రేక్ తీసుకో’మంటూ బ్రతిమాలుతున్నా వినేదికాదు..


“అవును ప్రణవ్ కష్టంగానే ఉంది.. అందుకనే మా ఆఫీస్ కు దగ్గరలోనున్న ఫ్లాట్ కి వెళ్లిపోదా”మని ప్రణవ్ మీద ఒత్తిడితెచ్చి చివరకు సాధించి అత్తవారింటి నుండి బయటకు వచ్చేసేలా చేసింది.. వద్దంటూ బ్రతిమాలిన ప్రణవ్ ప్రయత్నాలన్నీ వృధా అయినాయి..

ఇంట్లో వంటకు వంటమనిషినీ, పనిమనిషినీ పెట్ట్టుకుని ఆఫీస్ కు వెళ్లి వస్తూ ఉండేది..

డెలీవరీకని పుట్టింటికి బెంగుళూర్ వెళ్లి పండంటి మగ బిడ్డను ప్రసవించింది.. బాబుకి 'అక్షిత్' అని పేరు పెట్టుకున్నారు.. ఆరునెలలు బాబుకోసం శెలవు పెట్టుకుని బెంగుళూర్ లో తల్లిగారింటనే ఉండిపోయింది.. శెలవు తరువాత డ్యూటీలో చేరడానికి తయారయిన సాహితినే చూస్తూ......


“మరికొంత కాలం ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వు సాహితీ, బాబుని , ఉద్యోగాన్నీ రెండింటినీ బేలన్స్ చేయలే”వంటే ఇంతెత్తున ఎగిరింది..

“ఎప్పుడూ నా ఉద్యోగమే నీకు పెద్ద సమస్యలా అడ్డుగా కనపడుతుంది ప్రణవ్.... నా కొలిగ్స్, స్నేహితులందరూ నానీ ను పెట్టుకుని మేనేజ్ చేసుకుంటుంటే నీవేంటి అలాగ మాట్లాడతావ్? పోనీ నానీ సంరక్షణలో వద్దంటే, బాబుని మా అమ్మ దగ్గర బెంగుళూర్ లో వదిలేస్తాను, ఆవిడ పెంచుతుంది.. వీలైనపుడల్లా వెళ్లి చూసొద్దాం” అనగానే ప్రణవ్ కు పట్టరాని ఆగ్రహం కలిగింది..

“ఇక్కడే ఉంటున్న మా తల్లితండ్రులు నీకు పనికిరారు.. అమ్మావాళ్లని మనతో ఉంచుకుంటే మన అక్షిత్ ను చూడరా ? అమ్మకి ఒక్కమాట చెపితేచాలు ఆఘమేఘాలమీద పరుగెత్తుకు వస్తుంది తన మనవడికోసం.. ఎక్కడో బెంగుళూర్ లో మీ అమ్మ దగ్గర ఉంచుతానంటున్నావ్.. నీవసలు ఒక తల్లివేనా” అంటూ అక్కడనుండి కోపంగా వెళ్లిపోయాడు..


మొత్తానికి బాబు ను చూసుకోడానికి ఒక ఆయాను కుదిర్చింది సాహితి..

బాబు పెరిగి పెద్దవాడౌతున్నాడు.. రెండో ఏడు వచ్చింది..


ఒకరోజు ప్రణవ్ మధ్యాహ్నం తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేసాడు.. తన దగ్గరున్న డూప్లికేట్ కీ తో మెయిన్ డోర్ తెరచుకుని లోపలకు వచ్చేసరికి ఆయా సోఫాలో పడుకుని హాయిగా నిద్రపోతోంది.. నిద్రలేచిన అక్షిత్ మంచం మీద కూర్చుని అదే పనిగా ఏడుస్తున్నా ఆయా అలాగే నిద్రపోతోంది.. ప్రణవ్ వెంటనే బాబు దగ్గరకు వెళ్లి ఎత్తుకున్నాడు.. వాడి డైపర్ నిండిపోయి ఉంది ..

కోపాన్ని నిగ్రహించుకోలేక ‘ఆయా!’ అంటూ గట్టిగా పిలిచేసరికి ఉలిక్కిపడ్తూ లేచింది.. ఎప్పుడూ ఆ వేళకు రాని సార్ ను చూడగానే భయపడిపోయింది..

" సార్ తలనొప్పిగా ఉంటే టాబ్లట్ వేసుకున్నానని నిద్రపట్టేసిందని" సంజాయిషీ ఇచ్చింది..

అలాగే మరొకసారి బాబుకి జ్వరం వస్తే ఏ టైమ్ కు ఏ డ్రాప్స్ వేయాలో చెప్పినా కూడా సరిగా వేయలేదు, బాబుకి జ్వరం తగ్గక రెండురోజులు బాధపడ్డాడు.. ఒకసారిలాగే సడన్ గా వచ్చి చూస్తే సోఫాలో హాయిగా పడుకుని టీవీ చూస్తోంది. అక్షిత్ ఒకమూల కూర్చుని బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాడు.. ముద్దు ముద్దు మాటలు వాడిచేత పలికిస్తూ ఆటలాండిచాల్సిన వయసులో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు.. తనైనా అప్పుడప్పుడు అక్షిత్ ఎలా ఉన్నాడో చూద్దామనుకుంటూ ఎర్లీగా వచ్చేస్తాడుకానీ, సాహితికి ఆఫీస్ కు వెడితే బాబు ధ్యాస ఉండదు..


ఒకసారి బాబుని పీరియాడికల్ చెక్ అప్ కు తీసుకువెళ్లారు భార్యా భర్తలు.. డాక్టర్ బాబుని పరీక్షచేసి బాగా ఎనిమిక్ గా ఉన్నాడని, సరిపడ వెయిట్ లేడని, తగినంత కేర్ తీసుకోపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి రక రకాల వైరల్ ఇన్ ఫెక్షన్స్ సోకవచ్చని , తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించాడు..


“చూసావా సాహీ, ఆయాల మీద వదిలేస్తే పిల్లలు ఇలాగే పాడైపోతారు.. మళ్లీ అడుగుతున్నాను, అక్షిత్ ఆరోగ్యం ముఖ్యం మనకు.. వాడికోసమైనా నీవు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి..”


“అదేమిటి ప్రణవ్, పిల్లలన్నాకా ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు సహజం.. ఈ ఆయా కాకపోతే మరో ట్రైన్డ్ ఆయాను పెట్టుకుందాం. ప్రాజక్ట్ మేనేజర్ ని అయ్యాను.. ఎంతో ఫ్యూచర్ ఉన్న నేను సడన్ గా ఉద్యోగం మానేయడమేమిటీ? ఎంతో మంది వర్కింగ్ విమెన్ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకోవడంలేదా? నేనొక్కదాన్నే అన్నట్లు మాట్లాడతావేమిటి ? అయినా మాటి మాటికీ నా ఉద్యోగ ప్రస్తావన తెచ్చి నేను మానేసేవరకు నీవు ఊరుకునేటట్లు లేవు.. ‘ఐ నో ప్రెటీ వెల్ యు ఆర్ జెలస్ ఆఫ్ మీ’ అనగానే ప్రణవ్ కోపంతో తనను తాను నిగ్రహించుకోలేక సాహితి చెంపమీద ఛెళ్లుమనిపించాడు.. వెంటనే బాబుని అందుకుని వేగంగా అక్కడనుండి బాబుని తీసుకుని బయటకు అడుగులేసాడు..


అది చూసిన సాహితి , " బాబుని ఎక్కడకు తీసుకెడుతున్నావ్ ప్రణవ్” అంటూ వెనక పడింది" ..

"భయపడకు, మా అమ్మావాళ్లదగ్గరకు కాదులే!”


“మరి.. మరి ..ఎక్కడకు ప్రణవ్ ? “


“అనాధ పిల్లలున్న చోటికి , లేదా ఏ రైలు పట్టాలమీదో పడేస్తే నీకు వీడి పీడ ఉండదు.. హాయిగా ప్రాజక్ట్ మేనేజర్ ఏమి ఖర్మ, నీ కెరీర్ లో సీఈవో వరకు దూసుకుపోవచ్చు.. “

“ఆగు ప్రణవ్” అంటూ ప్రాధేయపడుతూ ఏడుస్తూ వెంటపడుతోంది..


“నన్ను ఆపకు సాహితీ, వీడిని ఎక్కడో వదిలేసిగానీ తిరిగిరాను, రాత్రికి సంబరంగా పార్టీ ఏర్పాటు చేసుకుందా”మంటూ బాబుని తీసుకుని వేగంగా బయటకు వచ్చేసాడు..

ప్రణవ్ కి పంతం ఎక్కువే, తను అనుకున్నది చేస్తాడనుకుంటూ భయంతో వణికిపోతూ ఏడ్చేస్తు వెంటనే ఒక నిర్ణయానికి వస్తూ ఫోన్ అందుకుంది..

బాబుని తీసుకుని రోడ్ మీదకు వచ్చేసాడు ప్రణవ్.. మనసంతా కకావికలం అయిపోయింది..


సాహితి తను తల్లి కాబోతోందని చెప్పినప్పుడు తను ఎంతగానో సంబరపడ్డాడు.. పిత్రోత్సాహంతో పులకించిపోయాడు.. సాహితి ఉద్యోగం చేస్తేగానీ గడవని స్తితి కాదే తమది.. అయినా ఆమెకు అంత పంతమేమిటి? కొన్నాళ్లు బ్రేక్ తీసుకోమంటే వినదు.. పోనీ ఊళ్లోనే ఉన్న అమ్మ నాన్నగారిని పిలిపిస్తానంటే వాళ్లంటే విముఖత్వం..

తమ కలలపంట, వరాలపంట ఇంత బరువైపోయాడా?


పిల్లలు పుట్టక ఎంతోమంది స్త్రీలు తపించిపోతున్నారు.. పిల్లల కోసం లక్షలు ఖర్చు పెడ్తున్నా కొందరికి సంతాన యోగం కలగడంలేదు.. అసలు తాము ఎవరికి పుట్టామో తెలియని కొంతమంది పసిపిల్లలు అనాధాశ్రమంలో పెరుగుతున్నారు.. అన్నీ సమృధ్దిగా ఉన్న అక్షిత్ లాంటి పిల్లలు, వాడికి తాతా బామ్మా ఉండీకూడా, ఇలాగ ఆయాలు, పనిమనుషుల పెంపెకాలలో పెరుగుతూ మాతృత్వపు అనుభూతులకు దూరమౌతున్నారు. తల్లితండ్రులు చేసిన పొరపాట్లకు చివరకు శిక్ష అనుభవించేది పసిపిల్లలే.. ప్రణవ్ హృదయం అక్షిత్ ను చూడగానే ద్రవించిపోయింది.. వాడిని దగ్గరగా తీసుకుంటూ, గులాబీపూవులాంటి వాడి బుగ్గలను స్పృశిస్తూ, " నిన్ను వదులుకుంటానురా చిట్టి తండ్రీ, నేను ఉద్యోగం కొంతకాలం బ్రేక్ తీసుకునైనా నిన్ను చూసుకోనూ" ...... అనుకుంటూండగా అతని మొబైల్ రింగైంది.. ఒకవైపు చేతుల్లోనుండి జారిపోతున్న అక్షిత్ ను పైకి లాక్కుంటూ ఫోన్ ఎత్తాడు..


సాహితి అనుకుని రెస్పాండ్ అవకూడదనుకుని చూసేసరికి అమ్మనుండి ఫోన్..


“ఒరేయ్ ప్రణూ, వాడిని ఎక్కడకి తీసుకుపోతున్నావురా ? ఒక్క క్షణం నా మాట వింటావా?”


అంటే....అంటే.... అమ్మకు తెలిసిపోయిందా ?

సాహితి చెప్పిందన్నమాట..


“ప్రణూ, నేను నాన్న బయలదేరి ఒక గంటలో మీ దగ్గరకు వస్తున్నాం.. అక్షిత్ ను మేము చూసుకుంటామురా.. ఇప్పుడే సాహితి ఏడుస్తూ ఫోన్ చేసి విషయమంతా చెప్పింది..

అత్తయ్యా, నన్ను క్షమించండి మీరు ఇక్కడకు వచ్చేయండి వెంటనే అంటూ..

అక్షిత్ కోసం ఉద్యోగం మానేస్తాను, నేను ఫోన్ చేసి చెబితే మీ అబ్బాయి నా మాటను నమ్మరు.. మీరు చెప్పండత్తయ్యా అంటు భోరున ఏడుస్తోందిరా.. ఏదో పాపం ఉద్యోగం మీద ఆకాంక్షే కానీ, కన్నతల్లి కి బిడ్డమీద మమకారం ఎందుకుండదరా ? ఇంక అక్షిత్ ను మేమే చూసుకుంటాంరా ప్రణవ్.. సాహితిని ఇంక బాధపెట్టకు.. తిరిగి వచ్చేయి,”


అనగానే ప్రణవ్ మనసు ఆనంద తరంగాలతో నిండిపోయింది.. చేతిలోనున్న అక్షిత్ వైపు మురిపంగా చూస్తూ ఇంటివైపుకు మరలుతూ " బంధాలకు కొత్త అర్ధాన్ని చెప్పేది మీరే రా కన్నా" అనుకున్నాడు .

ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్లూగా నిశ్చింతగా తండ్రి చేతుల్లో ఒదిగిపోయి తండ్రిని చూస్తూ నవ్వులు కురిపించాడు అక్షిత్..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

మౌన మంత్రం

తోడబుట్టినవాడు

ఈ జన్మకీ శిక్ష చాలు

అత్త ఒడి

శుభవార్త

వచ్చెను కనవే ఆమని

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి

ప్రేమకు ఆవలి తీరం

ఒక ఇల్లాలి కధ

తీరం చేరిన కెరటం

చేసుకున్నవారికి చేసుకున్నంత

మానస వీణ

సొంత ఇంటి కల

మమతలూ - అనుబంధాలు

అపర్ణ

రివార్డ్

కురువింద

డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్

పరిణితి

తరాలూ - ఆంతర్యాలూ

నీతోనే నా జీవితం

హేపీ ఉమెన్స్ డే !

మా బామ్మ మాట బంగారు బాట


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.108 views0 comments
bottom of page