top of page
Writer's pictureYasoda Pulugurtha

నీతోనే నా జీవితం


'Nithone Na Jivitham' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

“ఇంతకీ ఇదే నీ చివరి నిర్ణయమా హోత్రీ ?”

“అవును వివేక్, నేను ఈ ఇంట్లో ఎడ్జస్ట్ కాలేను.. విడి కాపురం పెడ్దామంటే ససేమిరా నో అంటావు.. పెళ్లికి ముందు మాది ఉమ్మడికుటుంబం, విడిగా కాపురం పెడ్దామని అనొద్దని అంటే నేను ఒప్పుకున్నమాట వాస్తవం..

కానీ నేను ఎంతో సులువుగా నీకు మాటిచ్చేశానేకానీ, అది ఎంతటి కష్ట సాధ్యమో మన పెళ్లైన ఎనిమిదినెలలకే అర్ధమైపోయింది.. నేను పెరిగిన వాతావరణం, పధ్దతులు వేరు.. కానీ ఇక్కడ పూర్తిగా విరుధ్దం..

వచ్చీపోయే బంధువుల రష్, వారాంతరం వస్తే చాలు. మీ బామ్మనూ, తాతనూ చూడాలాని వాలిపోయే నీ అక్కా, చెల్లెలూ, మీ అత్తలూ బాబయ్యలూ ..

ఓహ్, ఒక్క క్షణం ప్రైవసీ లేదు మనకు.. నీతో ఎన్నో మాట్లాడాలాని, నీ కళ్లల్లో కి చూస్తూ నా మదిలో ఉరకలేసే ఎన్నో భావాలను పంచుకోవాలనిపిస్తుంది.. సరదాగా ఏ సినిమాకో, రెస్టారెంట్ కో వెడ్దామంటే ఇంట్లో అందరూ ఉన్నారు, తరువాత చూద్దాములే అంటావు.. మనిద్దరం ఎక్కడికైనా బయలుదేరేముందు ఇంట్లో అందరికీ చెప్పి రా అంటావు.. తొంభైయవ పడిల ఉన్న మీతాతగారికీ, బామ్మకీ కూడా చెప్పి రా అంటావు..

అసలు ఏమిటి వివేక్, ఎంతో గొప్పచదువులు చదివి, ఉన్నత ఉద్యోగం చేస్తున్న నీలో ఏ ఆధునిక భావాలంటూ లేవా? ఒకరికొకరం ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం.. ఎనిమిది నెలలకే ముఫై సంవత్సరాలు సంసారం చేసినట్లుగా విసుగొచ్చేస్తోంది నాకు..”

“అదేమిటి హోత్రీ, అలా అంటావు ? ఇక్కడ నీకు ఏదైనా కష్టం ఉందా, ఎవరివల్లనైనా ఇబ్బంది ఉందా, చెప్పు..”

“అవేమీ కారణం కాదు వివేక్.. రోజులు యాంత్రికంగా హడావుడిగా గడచిపోతున్నాయి.. కానీ, ఆ గడవడంలో ఏ మధురానుభూతులూ, స్పందనలూ లేవని చెపుతున్నాను.. నాకు ఈ జీవితం పరమ బోర్ గా ఉంది.. మనం వేరే వెళ్లిపోదాం . నీవు కాదంటే నేను నీతో కలసి ఉండలేను.. ఆలోచించుకో వివేక్.. ఒక వారం రోజుల్లో ఏ విషయమూ తేలిపోవాలం”టూ అక్కడనుండి కోపంగా బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయింది హోత్రి..

హోత్రీ వివేక్ లకు దూరపు బంధుత్వం ఉంది.. ఒక పెళ్లిలో హోత్రిని చూసాడు.. ఆమె అందం అతడిని మంత్రముగ్ధుడిని చేసింది.. డిగ్రీ తరువాత ఎన్..ఐ..ఎఫ్ ..టి లో ఫాషన్ టెక్నాలజీ చదివింది.. ప్రస్తుతం " తరుణ్ తహిలియానీ డిజైనర్స్ " కు కనసల్టెంట్ గా పనిచేస్తోంది. సొంతంగా బంజారాహిల్స్ లో ఒక డిజైనర్ బొటిక్ ను ఏర్పాటు చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నానని చెప్పింది.. వివేక్ కు చాలా నచ్చేసింది.. హోత్రి కూడా స్ఫురద్రూపి, అందగాడు, మంచి చదువు , ఉద్యోగం ఉన్న వివేక్ ను కాదనడానికి కారణం ఏమీ కనిపించలేదు.

.పెళ్లికిముందు తరచుగా కలసుకుంటూ ఒకరి భావాలు మరొకరు పంచుకోవడం, ఆ సందర్భంలో వివేక్ ఎప్పుడూ, ఉమ్మడి కుటుంబాలు, కుటుంబ విలువలు గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు.. వివేక్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములూ, ఇద్దరు అక్క చెల్లెళ్లు.. వివేక్ పైన ఒక అన్నయ్య, అక్క, తన తరువాత ఒక చెల్లెలూ, తమ్ముడూ.. అక్కకూ, చెల్లెలికీ పెళ్లిళ్లు అయిపోయాయి..

వివేక్ కు తాతగారూ బామ్మగారూ కూడా ఉన్నారు.. బామ్మగారికి ఎనభై అయిదు సంవత్సరాలు, తాతగారికి తొంభై సంవత్సరాలు.. ఆరోగ్యంగా తిరుగుతూ తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు.. అప్పటితరం మనుషులమూలాన వివేక్ బామ్మగారికి తొమ్మిది మంది సంతానం.. అయిదుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఆవిడకు.. వివేక్ తండ్రి రెండో వాడు.. ఆవిడ కొడుకులు, కూతుళ్లూ, మనవలూ మనవరాళ్లూ అందరూ వచ్చి వెడ్తూ ఉంటారు. కొంతమంది సంతానం వేరు వేరు ఊళ్లల్లో ఉన్నా, పండుగలకూ, పబ్బాలకూ అందరూ విధిగా వచ్చేస్తారు..

హోత్రి అన్నట్లు ఇల్లంతా ఒకటే సందడిగా ఉంటుంది.. బామ్మగారి తాతగారి సాంప్రదాయాలు ఇంకా ఆ ఇంట్లో రంగులీనుతూ ఉంటాయి.. అటువంటి కుటుంబంలో పుట్టిన వివేక్ భావాలు కూడా కుటుంబ విలువలతో ముడిపడి ఉంటాయి.. ఆరోజు శనివారం.. ఇంట్లో అందరూ అదే ఊరిలో బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని వెళ్లారు.. ఆరోజు హోత్రి విడికాపురం టాపిక్ తెచ్చినప్పటినుండీ ఇద్దరూ ముభావంగా ఉంటున్నారు.. ఒకటీ అరా పొడిమాటలు తప్పించి వారి మధ్య మాటలేలేవు..

హోత్రి పెళ్లికి రాలేనని తలనొప్పిగా ఉందంటూ తప్పించుకుంది.. అందరూ వెళ్లారు.. ఇంట్లో వివేక్ బామ్మ, తాతగారు ఉన్నారు.. హోత్రి కాఫీ కలుపుకుందామని వంటింట్లోకి వచ్చి కాఫీ కలుపుకుంటోంది.. ఈలోగా వివేక్ బామ్మగారు అచ్యుతవల్లిగారు హోత్రిని చూస్తూ, “ఏమ్మా! నీవు పెళ్లికి వెళ్లలేదా?” అంటూ అడిగారు.

“ తలనొప్పిగా ఉంది అమ్మమ్మగారూ, మీకు కూడా కాఫీ కావాలా” అంటూ అడిగింది..

“ వద్దులే కానీ, కాఫీ తీసుకుని ఇలా ఈ గదిలోకి రా, నీతో మాట్లాడాలం”టూ పిలిచిందావిడ..

కాఫీ కప్పుతో ఆవిడగదిలోకి వెళ్లింది హోత్రి..

“ ఇలా వచ్చి కూర్చో తల్లీ!” అంటూ ఆవిడ పక్కనే కూర్చో పెట్టుకున్నారు.. "చూడు హోత్రీ, రెండు రోజుల క్రితం నేను మధ్యరాత్రిలో మెలుకువ వస్తే లేచాను. హాలులో సోఫాలో వివేక్ ఒక్కడూ కూర్చుని ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు.. ‘ఏమిటి నాన్నా! ఒక్కడివీ ఇలా..?’ అంటే ‘నిద్రపట్టడం లేదు బామ్మా’ అంటూ తలవంచుకున్నాడు.. ఏదో విషయం ఉందనుకుని తరచి తరచి అడిగితే, అప్పుడు చెప్పాడు, నీవు వాడితో మాటలాడిన మాటలన్నీ..

చూడు తల్లీ, నేను ఎంత పెద్దదాన్నైనా, మీ ఆయనకి బామ్మనైనా మీ సంసారం విషయాలలో కలగ చేసుకోకూడదు.. కానీ, చూస్తూ చూస్తూ చిన్న పిల్లలు తప్పుగా, పొరపాటుగా ఆలోచిస్తుంటే పెద్దవాళ్లుగా మిమ్మలని సరిదిద్దడం మా కర్తవ్యం.. కళ్లెదుటే సంసారాలు విడిపోతుంటే కలగచేసుకుని మీ సంసారాన్ని చక్కదిద్దకపోతే ఇంకెప్పటకీ అవి అతకని జీవితాలే అయిపోతాయి.. నీకు నా కబుర్లు విసుగ్గా ఉన్నా ఒక్క అయిదునిమిషాలు నేను చెప్పబోయే విషయం మీద నీ దృష్టిని పెట్టు హోత్రీ..

నా కప్పుడు తొమ్మిదేళ్ల వయసు, మీ తాతగారికి పధ్నాలుగు సంవత్సరాలు.. ఉమ్మడి కుటుంబం అప్పట్లోమాది.. ప్రతీ పూటా పాతిక విస్తళ్లు లేచేవి. మా బామ్మకి నా పెళ్లి, మీ తాతగారైన నా మేన బావతో జరిపించాలని ఉండేది.. మేనత్త మేనమామ బిడ్డలం.. పెళ్లంటే ముత్యాల పల్లకి, ఊరేగింపు, మేళతాళాలూ, కొత్తబట్టలూ ఇవే ఆలోచన ఆరోజుల్లో.. నేనూ బావా కలిసే పెరిగాం.. కొట్టుకుని చచ్చేవాళ్లం.. ఇద్దరికీ పడేదికాదు.. బామ్మకు తీవ్ర అస్వస్థత కలగడంతో మా ఇద్దరి పెళ్లి జరిపించేయాలని పట్టు పట్టింది.. ఒకరోజు స్కూలుకి తయారయి వెడ్తున్న నన్ను, బావనూ ఆపేసారు.. గబ గబా తాటాకుల పందిరి వేసేసి మామిడాకులు కట్టించేసారు .. పూలదండలు వచ్చేసాయి.. నాకు తొమ్మిది గజాల బామ్మ కంచి పట్టుచీర కట్టబెట్టి ఇంట్లోని బంధువుల సమక్షంలో నాకూ బావకూ పెళ్లి జరిపించారు.. నా పెళ్లైన కొద్ది రోజులకే ఒక ఏకాదశి రోజున బామ్మగారు నిద్ర లోనే కన్ను మూసారు.

మెడలో పెద్ద పెద్ద మంగళ సూత్రాల గొలుసుతో స్కూలుకి వెళ్లేదాన్ని.. నాకు పన్నెండేళ్ల వయస్సులో స్కూల్ మానిపించేసారు.. పధ్నాలుగో ఏట కాపురానికి పంపించారు.. అత్తయ్యా వాళ్లదీకూడా పెద్ద కుటుంబమే.. చిన్నప్పటి నుండే వంట, వార్పూ, భోజనాలు వడ్డించడం, ఇంటి చాకిరీ ఇదే జీవితం.. మీ తాతతో మాట్లాడాలన్నా కుదిరేదికాదు, ఎవరేమనుకుంటారోనన్న భయం, సిగ్గు. ఇప్పటి మీ అందరిలా స్వేఛ్చ ఉండేది కాదు.. మీలాగ మాకు ఫోన్లున్నాయా, బయటకు షికార్లున్నాయా , ఏమున్నాయమ్మా అప్పట్లో..

ఒక్క రాత్రి వేళే మాకు స్వేఛ్చ. అంతవరకు నేను బావా కొట్టుకుని తిట్టుకునేవాళ్లం . అదీకాకుండా, పెళ్లిలో తలంబ్రాలు మీ తాతనెత్తిమీద నేనే ఎక్కువ పోసేసానని, అవన్నీ కళ్లల్లో పడిపోయి మంటపుట్టాయన్న కోపంతో పెండ్లిపీటలమీదే నాకు గట్టిగా తొడపాశం పెట్టాడు మా బావ.. ఆకోపం తో మేమిద్దరం రెండేళ్లు మాట్లాడుకోలేదు.. ఇంత జరిగి, శత్రువుల్లా ఉన్నా, అత్తవారింటికి వచ్చాక బావను చూస్తేచాలు సిగ్గు ముంచుకొచ్చేసేది.. పగలంతా చాకిరీ చేసాక రాత్రి గదిలోకి నిద్రపోయేందుకు వెడితే, మీ తాతగారు ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ, ‘ఏం వల్లీ! అలసిపోయావు కదూ, కాళ్లు నొక్కనా, చేతులు పట్టనా’ అని ప్రేమగా అనేసరికి అప్పటివరకు ఉన్న అలసట దూదిపింజల్లా ఎగిరిపోయేది.. ఆ రాత్రి తెల్లవారకుండా అలా నిలచిపోతే బాగుండునని అనుకునేవాళ్లం..

అలవోకగా నా బుగ్గలను తాకిన మీ తాతగారి మునివేళ్ల స్పర్శ, ఇప్పటికీ ఆ స్పర్శ తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. ఆ స్పర్శే కదా, నా మొదటి తీపి జ్ఞాపకం. ఆ తర్వాత ఆ అనుబంధమే బిడ్డలని, వారి ద్వారా మనవడు, మనవరాలు, ముని మనవళ్ళు ఇలా నా వంశాన్ని వృద్ధి చేసింది.

ఇప్పటి పిల్లలకు స్వేఛ్చ కావాలి.. కానీ తల్లీ, ఆ స్వేఛ్చ కొన్నాళ్లు బాగానే ఉండచ్చు పిల్లలు పుట్టేవరకు. కానీ కాలం గడిచేకొద్దీ ఆ స్వేఛ్చలో ఆనందం ఉండదు.. పిల్లలు మంచి వ్యక్తిత్వ వికాసం, సర్దుబాటుతత్వంతో మెలిగేందుకు అందరు కలసిమెలిసి జీవించడంలోనే సాధ్యం అవుతుంది.. ముఖ్యంగా తాత, బామ్మల పర్యవేక్షణలో పెరగడంవల్ల సాంప్రదాయంతో కూడిన జీవితం అలవడడంతోపాటు, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటుపోట్లనైనా సకుటుంబంగా సులభతరంగా ఎదుర్కొనగలం. అడపాదడపా చిన్న చిన్న కలహాలెదురైనప్పటికీ ప్రేమాభిమానాలతో కలహాలు దూరమవుతాయి.

అనుబంధాలను వదులుకోవడం చాలా సులువేనమ్మా.. కానీ అవి కావాలని అనుకున్నప్పుడు లభ్యమయ్యేవికావు.. మన కుటుంబ వ్యక్తుల అభిమానాలు కూడా మనకు సంపదలు లాంటివే.. వాటిని కాపాడుకుంటే వాటి విలువలు పెరిగి మర్రి చెట్టుల్లా విస్తరించి మనకి చల్లని నీడనిస్తాయి..

నీవు స్వేఛ్చనే కోరుకుంటే నేను వివేక్ కు చెప్పి మీ విడికాపురానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ చేయిస్తాను.. ఏడవ క్లాస్ తో చదువు ఆపేసిన ఈ బామ్మకేమి తెలుసునని అనుకుంటున్నావా హోత్రీ ? ఏడో క్లాసే చదివినా డెబ్బై సంవత్సరాల దాంపత్యజీవనపు పరిమళాన్ని ఆస్వాదించినదాన్ని.. ఉమ్మడి కుటుంబంలో బాధలూ, ఆనందాలూ రెండూ ఉంటాయి.. కాని బాధలన్నాను చూసావా, అవి తాత్కాలికమైనవి.. ఆనందాలు చేరువౌతూ బాధలను తరిమివేస్తాయి.. నీ కొకటి చెప్పనా హోత్రీ, నవ్వుకోవుకదూ ?”

“అయ్యో! నేనేమీ నవ్వుకోను, చెప్పండి అమ్మమ్మా!”

“మీ పెళ్లైన ఎనిమిది నెలలకే ముఫై సంవత్సరాలు గడిచినట్లుగా, విసుగ్గా ఉందన్నావుట మీ ఆయనతో .. కానీ నాకు నా వివాహం నిన్న మొన్న జరిగినంత లేతగా, నవ నవ లాడుతున్నట్లుగా ఉంది.. భగవంతుడు అనుగ్రహిస్తే నూరేళ్ల దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉంది తల్లీ..

భర్త అనురాగం, ప్రేమ పుష్కలంగా ఆస్వాదిస్తున్నపుడు ఇటువంటి నిరాశ ఎందుకే తల్లీ నీకు? కావాలనుకుంటే వెళ్లి విడిగా ఉండండి.. కానీ ఈ స్వల్ప విషయానికే పచ్చని సంసారాన్ని విఛ్చిన్నం చేసుకోవద్దనే నేను నీకు చెప్పాలనుకున్నాను..”

హోత్రి ఆవిడ చెప్పినవన్నీ మౌనంగా వింది. అమ్మమ్మ గారిలో ఎంతటి విజ్ఞత, సంస్కారం అని అనుకోకుండా ఉండలేకపోయింది..

ఒక నాలుగు రోజుల అనంతరం..

వివేక్ ఆఫీస్ కు వెడ్తూ, " హోత్రీ, ఈరోజు రాత్రి ఫస్ట్ షోకి నీ కిష్టమైన ఇంగ్లీష్ సినిమాకు ఆన్ లైన్ లో టిక్కట్లు బుక్ చేసాననగానే " అదేమిటి వివేక్, ఈ రోజు కౌముది వదిన వాళ్లపాప రష్మిక అయిదవ బర్త్ డేకదా, సాయంత్రం కేక్ కటింగ్, డిన్నర్ పార్టీ ఉన్నాయంటూ మనల్ని అందరినీ పిలిచిందికదా మీ అక్కయ్య.. సినిమాకు ఎలా వెడ్తాం, బాగుండదుకదా ? నేను రష్మీకి స్పెషల్ గా లెహంగా డిజైన్ చేసి మా డిజైనర్స్ తో తయారుచేయించాను కూడా..”

“ఏమో నీకు ఇటువంటి హడావుడులూ అవీ నచ్చవంటావుకదా, అయినా నీతో మాట్లాడాలి, అందుకే ఈ సినిమా ప్రోగ్రాం..”

“చూడండి శ్రీవారూ, మీరు నాతో ఏమి మాట్లాడనుకున్నారో గ్రహించేసాను.. ఇకనుండి తమరిష్టాలే నా ఇష్టాలు కూడా.. ఇక్కడ మీ అందరితోనే నా జీవితం పెనవేసుకుపోవాలని ఆశపడుతున్నాను వివేక్..

నేను అన్నమాటలకు క్షమిస్తావు కదూ ?”

“హోత్రీ, నీలో ఎంత మార్పు ? నీవు ఎక్కడ నానుండి దూరమైపోతావోనని ఎంత బాధపడ్డానో తెలుసా ?

అన్నీ అర్ధంచేసుకుని సర్దుకుపోయే మా హోత్రి లాంటి భార్య నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని..”

“నేను కూడా వివేక్, మీ బామ్మా, తాతగారు, అత్తయ్య మామయ్య లాంటి సంస్కారవంతుల ఇంటి కోడలినైనందుకు నేను మీ కంటే అదృష్టవంతురాలి”నంటూ వివేక్ కౌగిలిలో ఒదిగిపోయింది..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.




192 views0 comments

Commentaires


bottom of page