top of page
Writer's pictureYasoda Pulugurtha

డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్

మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ


'Delegation Of Authorities' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

ఆరోజు శుక్రవారం! ప్రొద్దుటే పదకొండు గంటలకు లావణ్య, పావని వాళ్ల ఇంటికి వచ్చింది. పావనిని సర్ప్రైజ్ చేయాలని ముందుగా చెప్పకుండా వచ్చింది. లావణ్యను చూడగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది పావని.

"ఏమిటే! ఊరకరారు మహానుభావులు" అన్న పావని మాటలకు, " అవునే! రాకపోతే రాలేదంటూ దెప్పిపొడుస్తావు, వస్తేనేమో చెప్పా పెట్టకుండా వచ్చేసిందీ అని దెప్పుతావు” అని కోపాన్ని అభినయించింది లావణ్య! లావణ్యను ప్రసన్నం చేసుకోడానికి, వెంటనే ఒక మంచి ఫిల్టర్ కాఫీని త్రాగించింది పావని.

“ ఇంతకీ ఏమిటో తమరి రాక విశేషం?” అంటూ నాటక ఫక్కీలో ప్రశ్నించింది పావని.

“రాత్రి తమరు కలల్లోకి వస్తేనూ.. వెంటనే చూడాలని అనిపించింది” అనగానే పావనికి ఆనందంతో పాటు భలే హుషారు వచ్చేసింది, ఇంచక్కా కలసి వంటచేసుకుంటూ, భోలెడన్ని కబుర్లు చెప్పేసుకోవచ్చని. లావణ్యా, పావనీ డిగ్రీలో మంచి స్నేహితులు. లావణ్య డిగ్రీ అయిపోగానే చదువు ఆపేసింది. పావని మాత్రం ఎమ్.ఏ. సైకాలజీ చేసింది. చదువు పూర్తి అయి పెళ్లిళ్లు అయిపోయినా ఒకే ఊరిలో స్థిరపడిన మూలాన వీరిరువురి స్నేహబంధం అలా కొనసాగుతూనే ఉంది.

వంటగదిలో కూరగాయలు కోస్తూనే “ఏమిటే లావణ్యా, విశేషాలు?” అంటూ పావని ప్రశ్నించింది.

“ఆ.. ఏముందే పావనీ! అంతా హడావుడి బ్రతుకం”టూ నవ్వింది. “పొద్దున లేవడం, పిల్లలని స్కూల్ కు తయారుచేయడం, శివరాంను ఆఫీస్ కు పంపడం అంతా యధావిధిగా బిజీ బిజీ గా రోజులు గడుస్తున్నాయి. అన్నట్టు మా అత్తగారు క్రిందటి వారమే వచ్చారు ఊరినుండి” అని చెప్పింది.

“మీ అత్తగారిని కూడా తీసుకు రావలసిందే లావణ్యా!” అనగానే, “ఈసారి పిల్లలని, మా అత్తగారిని కూడా తీసుకు వస్తానులేవే! నేను ఒక గంట కూర్చుని వెళ్లిపోవాలని వచ్చాను పావనీ!” అనేసరికి..

“చూద్దాం! కాళ్లల్లో చెప్పులు పెట్టుకుని వస్తావా? నిన్ను మీ ఇంటికి ఎప్పుడు పంపిస్తానో చూడు!” అని పావని లావణ్య మీద కోపంతో ఎగిరింది.

***

లావణ్యకి ఒక మరిది, ఒక ఆడపడుచు. లావణ్య వాళ్ల మామగారు పోయి రెండు సంవత్సరాలు అయిపోయింది. లావణ్య అత్తగారు, పిల్లలందరి మధ్యా అటూ ఇటూ తిరుగుతూ, పెద్ద కొడుకు, కోడలు లావణ్య దగ్గర కూడా కొద్ది రోజులు గడపి వెడతారు. ఎక్కువ ఆవిడ లావణ్య వాళ్ళ మరిది దగ్గరే ఉంటారు. ఆవిడ అలా మరిది ఇంట్లో ఎక్కువ కాలం ఉండిపోవడం ఎందుకో లావణ్యకు అసహనంగా ఉంటుంది. ఈ విషయం లావణ్య, భర్త శివరాంతో ఎన్నో సార్లు అంది.. 'అత్తయ్య మన దగ్గరే ఉంటే బాగుంటుంది కదా!' అంటూ. దానికి శివరాం " పోనిలే, ఏమైంది ఇప్పుడు? అమ్మకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉంటుంది" అన్నాడు.

ఎందుకో లావణ్యకు ఈ విషయంలో ఆవిడ పట్ల కాస్త కోపం కూడాను. నిజానికి లావణ్య ప్రవర్తన వింతంగా ఉంటుంది. కొంచెం ఛాదస్తమనే చెప్పాలి. అన్ని పనులూ తనే చక్కబెట్టుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. లావణ్య అత్తగారు ఉన్నప్పుడు ఆవిడ సాయం చేస్తానని దగ్గరకు వచ్చినా, 'మీరు రెస్ట్ తీసుకోండి' అంటూ రానివ్వదు ! పాపం ఆవిడకు చెయ్యి కట్టేసినట్లు ఉంటుంది. ప్రొద్దుటే అయిదింటికే లేచేసి, టిఫిన్, కాఫీలు , వంట చేసి పిల్లలను లేపడం, వాళ్లను తయారుచేసి స్కూలుకి పంపడం, ఆ తరువాత భర్త శివరాం ఆఫీసుకి వెళ్లిపోయేంతవరకు ఊపిరి సలపని పనులతో ఉంటుంది. లావణ్య అత్తగారికి పావనితో కూడా చనువెక్కువే. అప్పుడప్పుడు ఆవిడ పావనికి ఫోను చేసి యోగక్షేమాలడుగుతూ ఉంటుంది కూడా.

“ఏమిటో నీ స్నేహితురాలు నన్ను ఏ పనీ చేయనీయదమ్మా. నాకు బోర్ కొట్టేస్తుంది ఇక్కడ! ఖాళీగా కూర్చోవడం నాకు నరకయాతన గా ఉంటుంద”ని పాపం వాపోతుంది ఆవిడ.

అందుకే ఆవిడ తన చిన్నకొడుకు దగ్గరే ఎక్కువ ఉంటుంది. ఈ విషయం లావణ్య కూడా ఎన్నోసార్లు చెప్పింది పావనికి ! నేను ఎంత బాగా చూసుకున్నా ఆవిడకు మా మరిది, తోటి కోడలంటేనే ఇష్టం. మా దగ్గర ఆవిడ ముళ్ల మీద ఉన్నట్లు ఉంటారు, అక్కడకు వెళ్లగానే ఆవిడ ఒక స్వేఛ్చా విహంగం అయిపోతారంటుంది.

“ఎందుకంటావ్ మరి” అని లావణ్యను అడిగింది పావని.

" ఎక్కువగా అభిమానించినా కష్టమేమోనే, నా ప్రేమలో నిజాయితీ లేదని అనుకోవచ్చుగా” అంటుంది. ఈమాట కూడా అంది “మా తోటికోడలు గురించి నీకు అది వరకు కూడా చెప్పానేమో కదే! నిజానికి చాలా బధ్దకస్తురాలు. పొద్దుట లేట్ గా లేస్తుంది, పాపం మా అత్తగారే అన్నీ చేస్తారు. టిఫిన్, కాఫీలు, వంటపని అంతా మా అత్తగారే చూసుకుంటారం"టూ చెప్పింది లావణ్య.

"నేను ఇక్కడ మా ఇంటిలో ఆవిడ చేత ఏమీ చేయించను. పాపం పెద్దావిడ కదా అనుకుని విశ్రాంతిగా ఉండమంటాను. అయినా కూడా మా మరిది దగ్గరే స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటార"ని వాపోయింది. దాన్ని అలా చూసేసరికి జాలనిపించింది పావనికి ! ఎంత అమాయకురాలు ఇది. 'ఆవిడను కూర్చోపెట్టి విశ్రాంతి ఇవ్వాలనుకుందిగాని, అదెంత పనిష్మెంటో ఆవిడకది' అని అర్ధం కావడం లేదు. ఆ మాటే లావణ్యతో అంది పావని.

" చూడు లావణ్యా! నీవు ఆవిడకు రెస్ట్ ఇవ్వాలనుకోవడం తప్పుకాదు. కాని ఆవిడకు అది ఒక పనిష్మెంట్ లా అనిపిస్తుంది. నీ దగ్గర స్వేఛ్చలేదు ఆవిడకు. ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు ! నీవు వంట చేసిపెడితేనే తినాలి ఆవిడ. ఆవిడకు మీ ఇంట్లో తనకంటూ ఏమీ ఇష్టాలు, ఆలోచనలు లేకుండా చేసేసావు. ఆవిడ సలహాలు, సంప్రదింపులు నీకు అవసరంలేదు. నీకు ఇష్టమైనట్లు, వండుతావు. ఆవిడను సాయం అడగవు. ఆవిడకు అదెంత ఇబ్బందిగా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఆ వయస్సులో ఆవిడకు ఇవన్నీ బాధ కలిగి ఉంటాయి. ఖాళీగా కూర్చుని తింటున్నానన్న భావనకూడా కలగడం సహజం. ఆవిడకు ఓపిక ఉంది. పనిలో నీవు సతమైపోతుంటే నీకు ఏదో కాస్త సాయపడాలన్న తాపత్రయం ఉంది. ఎప్పుడైనా గాని మీ అత్తగారి వయస్సులో ఉన్నవారికి 'ఇది నా ఇల్లు, వీళ్లందరూ నా పిల్లలు, నేను లేకపోతే వారికి ఇబ్బంది' అనే భావం వాళ్లు కోరుకుంటారే లావణ్యా! అంతేగాని, ఎవరో అతిధిని చూసినట్లుగా టైమ్ కి కాఫీ, టిఫిన్, భోజనం పెట్టేస్తూ, ఆవిడకు రెస్ట్ ఇచ్చేస్తున్నట్లుగా గొప్పగా ఫీల్ అయిపోతున్నావే గాని, ‘అత్తయ్యా! కాస్త ఆ కూర చేయరూ, ఈ పచ్చడి ఎలా చేస్తే బాగుంటుంద’నో, ‘ఈ కాయగూరలు కోసి ఇవ్వగలరా’ అనో , అలాగే మిగతా కుటుంబ విషయాలలో కూడా ఆవిడను కలుపుకుంటూ, సలహాలడుగుతూ , సంప్రదిస్తూ ఉంటే ఆవిడకు ఒకరకమైన సంతోషం. ఆవిడ పెద్దరికానికి మీరు ఇస్తున్న గౌరవానికి ఆవిడ మనసు ఎంత సంతోషపడుతుందో ఊహించావే?” అని అడిగింది పావని !

ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది లావణ్య ! నిజానికి లావణ్య అత్తగారు, ఆవిడ చిన్న కొడుకు దగ్గరకు వెళ్లగానే ఆ ఇంటిల్లిపాదీ ఎంతో రిలీఫ్ గా ఫీల్ అవుతారుట. హమ్మయ్య అమ్మ వచ్చేసిందని, ఆవిడ చిన్న అబ్బాయి తనకి ఇష్టమైన వంటలన్నీ తన తల్లితో వండించుకోవడం, అలాగే చిన్న కోడలు కూడా ప్రతి చిన్న విషయానికీ ‘అత్తయ్యా! ఇది ఎలా’ అంటూ అడగడం, ‘ఏమి కూరలు తెప్పించమంటార’ని అడగడం, ఆ రోజు ఏవంట చేసుకుందామని వగైరా లాంటివి. ‘అత్తయ్యా! మీరు పెడితేనే ఆ చిన్నది అన్నం బాగా తింటుందని, కాస్త అన్నం తినిపించరూ అని గారంగా అడగడం..ఇవన్నీ ఆవిడకు ఒక రకంగా మానసిక ఆనందాలు పంచుతున్నాయి. రాత్రి ఆవిడ చిన్న కొడుకు ఆవిడ దగ్గర కాసేపు కూర్చుని అతని ఆఫీసు ముచ్చట్లు, స్నేహితులు, బంధువుల గురించి ముచ్చటిస్తూ ఉంటాడు ! ఇవన్నీ ఆవిడకు సంతోషాన్నివ్వడమే కాకుండా, ఒక మంచి కాలక్షేపంగా ఉంటుంది ! అంతేకాకుండా ‘నా అవసరం వీళ్లకు ఎంత ఉందో కదా!’ అనుకుంటూ ఫీల్ అవడం ఆవిడకు సహజమే కదా.. ఆ వయస్సులో వాళ్లకు అంతకంటే ఏమికావాలి? వాళ్లను ప్రతీ విషయంలోనూ కలుపుకుంటూ , సలహా సంప్రదింపులు చేస్తూ ఉంటే ఆ కళ్లల్లో కనిపించే ఆనందానికి వెలకట్టలేము !

లావణ్యకు ఇవన్నీ చెప్పింది పావని ! “అవునా! నేను ఇవన్నీ ఊహించలేదే పావనీ ! ఆవిడను సుఖపెట్టాలన్న తాపత్రయమే గాని, నీవు చెప్పేంతవరకు నాకు సరిగా అర్ధం కాలేదే ఇవన్నీ. పాపం అత్తయ్యకి నా ప్రవర్తన కష్టం కలిగించి ఉండడం సహజమే కదూ” అంటూ వాపోయింది !

“మొత్తానికి సైకాలజీ స్టూడెంట్ వి అన్పించుకున్నావ్ పావనీ” లావణ్య మెచ్చుకుంది తన స్నేహితురాలిని !

“అవునౌను, నేను చదివిన చదువు ఏ ఉద్యోగానికీ, సద్యోగానికి ఉపయోగించకపోయినా, ఇలా అందరి మనోభావాలని చదువుతూ, నీలాంటివారికి, మా ఆయనలాంటి వారికి పాఠాలు చెప్పడానికి పనికివస్తోంది! మా ఆయన ఏమంటారో తెలుసా లావణ్యా? ‘సైకాలజీ చదివిన అమ్మాయి అంటే ఏమోలే అనుకున్నాను ! ఒక్క చూపులో నా మనస్సునంతా చదివేస్తావు , నా మనస్సులో ఏమైనా దాచుకోవాలని ప్రయత్నం చేసినా దానిని బయటకు తోడేసేవరకు ఊరుకోవు పావనీ’ అంటారు” అని చెప్పగానే ఫక్కున నవ్వుకున్నారు మిత్రురాళ్లిద్దరూనూ !

"ఉండు ఒక్క క్షణం పావనీ" అంటూ పావని చూస్తుండగానే లావణ్య తన అత్తగారికి ఫోన్ చేసింది, " అత్తయ్యా! లంచ్ కి రాను. పావని లంచ్ చేయందే వదలనంటోంది. తరువాత అదీ నేనూ కలసి కాస్త షాపింగ్ చేయాలి. సాయంత్రం వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. పిల్లలు పూరీ కూర చేయమవ్నారు రాత్రికి ! సాయంత్రం కాస్త గోధుమ పిండి కలిపి ఉంచేయండి అత్తయ్యా, నేను రాగానే పూరీలు వేస్తాను ! అలాగే బంగాళా దుంపల కూర చేసేయండి. సారీ మీకు పని కల్పుస్తున్నానేమో కదూ ! అదేమీ లేదంటారా ? ధాంక్స్ అత్తయ్యా ! నా పని అవగానే వచ్చేస్తాను. పనిమనిషి లక్ష్మి వస్తుంది. ఎవరం చూడకపోతే తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకుపోతుంది. దగ్గరే ఉండి కాస్త చూస్తారు కదూ ! పావని మిమ్మలని అడిగానని చెప్పమంది. మీ అత్తగారిని కూడా తీసుకురావచ్చుకదా అంటూ కోప్పడింది. నేను అసలు పావనిని చూసిన వెంటనే వచ్చేయాలని అనుకున్నాను అత్తయ్యా, అందుకనే మిమ్మలని వస్తారా అని కూడా అడగలేదు ! కాని పావని బలవంతం పెట్టేసింది, ఉండక తప్పలేదు ! ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి, ఉంటాను అత్తయ్యా” అని ఫోన్ పెట్టేసింది.

పావని చెప్పిన పాఠాన్ని అమలులో పెట్టింది లావణ్య !

“హమ్మయ్య..ఇప్పుడు మనసుకి హాయిగా ఉందే పావనీ ! నీవు నాతో అసలు సంగతి చెప్పాక భలే గిల్టీగా అనిపించిందే” అని లావణ్య అనగానే, “ఇప్పుడు సంతోషంగా ఉందికదా లావణ్యా, అయితే ఈ సంతోషంలో లంచ్ ఎందుకే, కడుపు నిండిపోలేదూ!” అని సాగతీస్తే.. “అబ్బ ఉండవే తల్లీ! ఆకలి దంచేస్తోంది. నీ వంట తిని ఎన్ని రోజులైందే బాబూ! నడు” అంటూ వంటింట్లోకి లాక్కుని వెళ్లింది లావణ్య.

నాలుగు రోజుల తరువాత లావణ్య నుండి ఫోన్ పావనికి !

'మా అత్తగారి ముఖం ఆనందంతో వెలిగిపోతోంద'ని, 'హుషారుగా ఉన్నారు పావనీ' అంటూ !

“ఏమిటీ విశేషం?” అని పావని అడిగిన ప్రశ్నకు నాలుగు రోజుల్లో వెళ్లాల్సిన ఆవిడ ప్రయాణం వాయిదా వేసుకున్నారని, మెల్లిగా వెళ్తాను, తొందరేముందంటున్నారే అని చెబుతూ.. చిన్న పిల్లలా సంబరపడిపోతూ “ఇదంతా నీవలనే పావనీ, జ్ఞానోదయం చేసావ”ని మెచ్చుకుంది !

ఇందులో తను చేసింది ఏమీలేదనిపించింది పావనికి!

" డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్ " .. బాధ్యతలను పంచడం!

ఇంట్లోని మన పెద్దవారిని పక్కన పెట్టేయకుండా వారిని కూడా ప్రతి విషయంలోనూ కలుపుకుంటూ, వారి అనుభవాలకు కూడా విలువ ఇస్తూ, చిన్న చిన్న బాధ్యతలను సరదాగా పంచుతూంటే కుటుంబంలోని వ్యక్తుల మధ్య సమస్యలు రావని చెప్పడమే ! ఇటువంటి సున్నితమైన విషయాలకు పావనిలా సైకాలజీ చదవాల్సిన అవసరంలేదు !

మన ఆలోచనా దృక్పధాన్ని పరిస్థితులకు అనుగుణంగా కాస్తంత మార్చుకుంటే చాలు !

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.



రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాకా పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ మా శ్రీ వారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


116 views0 comments

Comments


bottom of page