top of page
Writer's pictureYasoda Pulugurtha

ఈ జన్మకీ శిక్ష చాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

''Ee Janmaki Siksha Chaalu' Written By Yasoda Puluurtha

రచన: యశోద పులుగుర్త

తనను ప్రేమించిన కల్యాణిని మోసం చేస్తాడు డాక్టర్ హరిప్రసాద్.

చేసిన పాప ఫలితం మాధవి రూపంలో అతని భార్యగా వచ్చింది.

తన తప్పుకు తగిన శిక్షను ఈ జన్మలోనే అనుభవిస్తాడు.

ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.



నిన్నటి వరకు ఆరోగ్యంగా ఆడుకుంటున్న మూడేళ్ల తరుణ్ కి హఠాత్తుగా ఏమైందో ఏమోగానీ ఈరోజు మధ్యాహ్నం అన్నం కలిపి నోట్లో పెడ్తుంటే తల తిప్పేస్తూ ఏడ్చేస్తున్నాడు.. పోనీ పాలు పడ్దామని బలవంతంగా త్రాగిస్తే కక్కేసుకున్నాడు.. నలతగా చికాకుగా ఉన్నాడు.. సాయంత్రం అయ్యేసరికి ఒళ్లు బాగా వెచ్చబడింది.. ధర్మామీటర్ తో టెంపరేచర్ చూసింది పల్లవి.. నూటమూడు డిగ్రీల జ్వరం..

పల్లవీ, మోహన్ దంపతులు. హైద్రాబాద్ కి ట్రాన్స్ ఫర్ మీద వచ్చి నెలరోజులే అయింది.. . భర్త మోహన్ ఏ..జీ ఆఫీస్ లో ఆడిటింగ్ సెక్షన్ లో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.. అతనికి అప్పుడప్పుడు ఆడిటింగ్ టూర్స్ ఉంటాయి.. అతను టూర్ మీద వెళ్లి రెండురోజులైంది.. మరో రెండురోజులు పోతేగానీ తిరిగిరాడు.. వాళ్లు ఉంటున్నది ఒక ఎపార్ట్ మెంట్ లో.. పక్క పక్క ఎపార్ట్ మెంట్లలో ఎవరు ఉంటారో ఇంకా సరిగా తెలియదు.. బాబు జ్వరానికి ఒణుకుతున్నాడు.. ఏమి చేయాలో, బాబుని ఏ డాక్టర్ కు చూపించాలో అని ఆలోచిస్తోంది.. వాచ్ మెన్ కూడా సమయానికి లేడు..

సడన్ గా కింద ఫ్లోర్ లో ఉంటున్న సావిత్రిగారు గుర్తుకొచ్చారు పల్లవి కి . ఆ అపార్ట్ మెంట్ లో దిగిన పదిరోజులకనుకుంటాను, ఒకరోజు సాయంత్రం బాబుని తీసుకుని ఆ అపార్ట్ మెంట్ ఆవరణలోనున్న పిల్లల పార్క్ కి వెళ్లింది.. అక్కడే సావిత్రిగారు పరిచయమయ్యారు.. మాటల సందర్భంలో వారి అమ్మాయి సునీత నర్సింగ్ లో డిగ్రీ పూర్తి చేసిందని, మంచి కార్పొరేట్ హాస్పటల్ లో నర్స్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తోందని, ఈలోపల ఖాళీ గా ఉండడం ఎందు కనుకుంటూ, అనుభవంకోసం ఆ వీధి చివరనున్న సంతోష్ హాస్పటల్ లో నర్స్ గా పనిచేస్తోందని చెప్పడం గుర్తొచ్చి హమ్మయ్య అనుకుంటూ బాబుని తీసుకుని ఇంటి డోర్ లాక్ చేసి ఆ హాస్పటల్ కు వెళ్లింది..

అది చిన్న హాస్పటలైనా నీట్ గా ఉంది.. ఆ హాస్పటల్ ఎంట్రన్స్ లో ఎదురుగా అందమైన నేమ్ బోర్డ్ మీద 'డాక్టర్ హరి ప్రసాద్ పీడియాట్రీషియన్' , కిందనే 'డాక్టర్ మాధవి గైనకాలిజిస్ట్' అని వ్రాసి ఉంది.. లోపలకు ప్రవేశించగానే ఒకవైపు అందమైన పూలచెట్లు, మరోవైపు పచ్చని లాన్ తో ఆహ్లాదకరంగా ఉంది.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని హాస్పటల్ లోపలకు అడుగుపెట్టింది.. ఆ హాస్పటల్ అక్కడ పెట్టి కొద్దికాలమే అయిందని సావిత్రిగారు అన్నారు.. ఏ డాక్టర్ అయితేనేమి, ఇంటికి దగ్గరలో ఉంది.. బాబుకి టెంపరేచర్ తగ్గి నార్మల్ కి వస్తే చాలు, ఎల్లుండి మోహన్ రాగానే మరో మంచి డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్లచ్చు అనుకుంది..

వెళ్లగానే హాస్పటల్ బాయ్ కనిపిస్తే నర్స్ సునీత గురించి అడిగింది పల్లవి.. ఏదో పనిమీద పర్మిషన్ పెట్టి వెళ్లారని ఆ అబ్బాయి చెప్పాడు..

హాస్పటల్ లో ఎక్కువ జనంలేరు.. తన వంతు వెంటనే వచ్చేసరికి బాబుని తీసుకుని డాక్టర్ రూమ్ లోకి వెళ్లింది..

తల వంచుకుని మొబైల్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్న డాక్టర్ హరిప్రసాద్ తలెత్తి చూడకుండానే కూర్చోమని సైగ చేసాడు..

కొన్ని క్షణాల తరువాత ఫోన్ ఆఫ్ చేసి తలెత్తి చూస్తూ అడిగాడు..

"ఏమిటమ్మా సమస్య ?"

డాక్టర్ ముఖంవైపు చూసిన ఆమె మస్తిష్కంలోకి హఠాత్తుగా ఒకరూపం మసక మసకగా రూపం దిద్దుకోసాగింది..

ఆ రూపానికి మరింత క్లారిటీ వచ్చి ఎవరో గుర్తుకు వచ్చేసరికి ఒక్కసారిగా సర్పద్రష్టలా ఉండిపోయింది పల్లవి.. కానీ డాక్టర్ మాత్రం పల్లనిని గుర్తు పట్టలేదు.. కానీ పల్లవి డాక్టర్ ను గుర్తుపట్టేసింది..

ఒక్క క్షణం బాబుని తీసుకుని అక్కడనుండి వెళ్లిపోవాలనుకుంది.. కానీ వెళ్లలేని నిస్సహాయత.. బాబు ఒళ్లు కాలిపోతోంది..

మనసు కుదుటబరుచుకుని బాబుకి జ్వరమని చెప్పింది..

బాబు వివరాలు అడుగుతూ డాక్టర్ బాబుని పరీక్షచేసి హై టెంపరేచర్ ఉందని ఇంజక్షన్ చేసి కాంపౌండర్ చేత సెలైన్ బాటిల్ తెప్పించి డ్రిప్ పెట్టారు.. బాబు మగతగా పడుకున్నాడు.. జ్వరం తగ్గుతుందని కంగారు పడనవసరంలేదని చెప్పాడు.. ఒక రెండుగంటల్లో వెళ్లిపోవచ్చని బయట సోఫాలో కూర్చోమని చెప్పాడు..

పల్లవి మనసు బాబు విషయంలో తేలికపడినా తన అక్క కల్యాణి కి జరిగిన మోసాన్ని ఎలా మరచిపోగలుగుతుంది..

తనను హరి నిజంగా గుర్తు పట్టలేదా ? లేకా నాటకమా ?

ఇంక ఆగలేకపోయింది.. "మీరు ...... మీరు హరి కదూ ? కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ లో చదివిన హరి మీరేకదూ" అంటూ ఠక్కున ప్రశ్నించింది..

తలెత్తి ఆమె వైపు చూసిన డాక్టర్, "అవును నేనే, ఇంతకీ మీరు ?"

"మీకు కల్యాణి తెలుసు కదూ..అల్లంరాజు కల్యాణి, మా అక్క.. అల్లం అల్లం అంటూ ఏడిపించేవారు .. నేను పల్లవిని.. నన్ను పల్లూ అంటూ పిలిచిన ఆ హరి మీరే కదూ ?"

"ఓ మైగాడ్, కల్యాణి తెలీకపోవడమేమిటి ? సారీ, నిన్ను గుర్తు పట్టలేకపోయాను.. దగ్గరగా పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కదా, అందుకనే పోల్చుకోలేకపోయాను..

కల్యాణి ఎలా ఉంది ? ఎక్కడ ఉంటోంది.. నీవేమిటి ఇక్కడ, మీ అబ్బాయా" అంటూ ఎడతెరిపి లేకుండా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్న అతన్ని ........

"ఫరవాలేదు, మొత్తానికి గుర్త్తొచ్చామన్నమాట" అనే సమాధానంతో అతను ఒక క్షణం మౌనంగా అయిపోయాడు..

"అప్పట్లో మీరు ఎమ్..బి..బి..ఎస్ పూర్తి చేసుకుని వెళ్లిపోయేటప్పుడు అక్కకు వాగ్దానం చేసారుట.. వెంటనే పది పదిహేను రోజుల్లో మీ పేరెంట్స్ ను తీసుకుని వచ్చి పెళ్లి విషయం మా అమ్మా నాన్నగారితో మాట్లాడతానని ..

పాపం పిచ్చి అక్క ఇంకా ఆ ఇంటి గుమ్మంలోనే పడిగాపులు కాస్తూ రాత్రీ పగలూ మీ కోసం ఎదురుచూస్తోంది.."

పల్లవి మాటలకు అతని ముఖం నల్లగా మాడిపోయింది..

"నిజమా పల్లవీ ?"

"మీరు....మీరు, మీ వాగ్దానాన్ని ఎందుకు నిలుపుకోలేకపోయారు? మా ఇంట్లోనే ఒక పోర్షన్ లో అద్దెకుంటూ అభం శుభం తెలియని మా అక్కను మీ కబుర్లతో నవ్విస్తూ ప్రేమిస్తున్నానని, చదువు అయిపోయిన వెంటనే పెళ్లిచేసుకుందామని అక్కతో మాయమాటలు చెప్పలేదా ? అక్కను ప్రెగ్నెంట్ ను చేసి మొహం చాటేసిన మిమ్మలని ఏమనాలి డాక్టర్ హరీ ?"

"ఏమిటీ, కల్యాణి నావలన ప్రెగ్నెంట్ అయిందా ? నిజంగా? ... నాకీ విషయం తెలీదు పల్లవీ.." కంగారు పడ్తూనే సమాధానమిచ్చాడు..

"నేను కల్యాణి గురించి మా అమ్మా నాన్నకి చెప్పాను.. కానీ మా పెళ్లికి వాళ్లు అభ్యంతరం చెప్పారు..నా డాక్టర్ చదువుకి అప్పుచేసి చదివించామని, డబ్బున్న అమ్మాయిని కట్నం తీసుకుని పెళ్లిచేయాలనుకుంటున్నామని చెప్పేసరికి నేను ఎదురుతిరగలేకపోయాను.. ఐయామ్ సారీ పల్లవీ!"

"మీ సమాధానం ఎలా ఉందో తెలుసా ? తప్పుచేసి ఆ తప్పుని కప్పి పుచ్చుకోడానికి డొంకదార్లు వెతుక్కున్నట్లుగా..

మీరు ఒక డాక్టర్ అయ్యుండీ ఒక అమాయకురాలిని శారీరకంగా లోబర్చుకుంటే ఆ అమ్మాయికి జరిగబోయే అనర్ధం ఏమిటో తెలియని మూర్ఖులన్నమాట.. ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయినా కూడా మీకు అవసరంలేదు కదూ ?"

డాక్టర్ హరి ప్రసాద్ కు నోటమాటరావడం లేదు.. నిజానికి అప్పట్లో డిగ్రీ మాత్రమే చదివిన కల్యాణి ని పెళ్లి చేసుకోవాలని అతను అనుకోలేదు.. ముద్ద బంతిపూవులాంటి అందమైన కల్యాణి అప్పట్లో తనని ఆకర్షించింది.. దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. తన తల్లితండ్రులకు తమ ప్రేమ విషయం చెప్పి వాళ్లను తీసుకువస్తానని భ్రమ పెట్టాడు.. తన అవసరం తీరగానే కల్యాణి ని అతని మస్తిష్కంలోనుండి పూర్తిగా తొలగించేసాడు.. పి..జి చదవడానికి మణిపాల్ యూనివర్సిటీకి వెళ్లిపోవడం, తరువాత బాగా ఆస్తిపాస్తులున్న డాక్టర్ మాధవిని పెళ్లి చేసుకున్నాడు..

ఒకవైపు తన భార్య మాధవి హాస్పటల్ కు వచ్చే టైమ్.. ఇప్పుడు పల్లవి మాటలు మాధవి చెవినపడితే పెద్ద విస్ఫోటకమే జరిగిపోతుంది.. మాధవికి నోటి దురుసుతనం ఎక్కువ.. అసలు డాక్టర్ కి ఉండాల్సిన మృదుత్వం, సహనం లాంటి లక్షణాలేవీ మాధవిలో వెతికినా కనబడవు.. ఎదుటివారు ఎవరైనా గానీ అసలు ఆలోచించకుండా మాటలనేస్తుంది. అసలే అహంభావి, అనుమానపు మనిషి అయిన మాధవి మూలాన తను ఎంత నరకం అనుభవిస్తున్నాడో బయట ప్రపంచానికి తెలియదు..

అనుకున్నట్లుగానే డాక్టర్ మాధవి వచ్చేసింది.. ఈలోగా కాంపౌండర్ బాబుకి సెల్లైన్ ఇవ్వడం పూర్తి అయిందని వచ్చి చెప్పాడు..

డాక్టర్ మాధవిని పల్లవికి పరిచయం చేస్తూ "నా మిసెస్, గైనకాలజిస్ట్" అని , "ఈవిడ పల్లవి, నేను కాకినాడలో చదువుకునే రోజుల్లో వీరింటి పక్కనే ఉండేవాడిన"ని పరిచయం చేసాడు.. పల్లవికి పలకరించాలని లేకపోయినా మర్యాదకోసం 'హలో' చెపితే డాక్టర్ మాధవి ఒక నిర్లక్ష్యపు చూపుతో పల్లవిని నిలువెల్లా పరికించి చూసింది.. చాలా గర్వంగా అతిశయంగా కనిపిస్తోంది ఆవిడ..

"మీ బాబుకి జ్వరం బాగా తగ్గింది పల్లవీ, ఈ సిరప్, టాబ్లట్స్ ఒక రెండురోజులు వాడ"మంటూ ప్రిస్క్రిప్షన్ చేతికిస్తూ ఇంక ఇంటికి తీసుకుపోవచ్చంటూ మాధవి వెనుక నిలబడి దణ్ణం పెడ్తూ చెప్పాడు..

అతను పెట్టిన దణ్ణంలో అనేక అభ్యర్ధనలు గోచరించాయి పల్లవికి..

ఇంటికి వస్తూ అనుకుంది.. "రాస్కెల్.. వాడికి అలాగే చెప్పాలి.. అప్పట్లో వీడి అకృత్యానికి పాల్పడి గర్భవతి అయిన అక్క గురించి ఇంట్లో తల్లికీ తండ్రికీ తెలిసిపోయింది..అక్క కుమిలి కుమిలి ఏడ్చింది.. వాడి అడ్రస్ తెలియదు.. కాలేజ్ లో వాకబు చేయచ్చు, కానీ ఇదంతా సవ్యంగా జరిగే పనికాదని తమ పరువే బజారున పడుతుందని అమ్మ భావించింది.. అమ్మే ఆ క్షణంలో సరైన నిర్ణయం తీసుకుని ఉండకపోతే, పాపం అక్క ఏమై ఉండేదో కదా అని అనుకోసాగింది.. ఆ సమయంలో అమ్మ అక్కా అనుభవించిన మానసిక క్షోభ తనకు తెలుసు.

అమ్మా నాన్నకి ముగ్గురూ ఆడపిల్లలే..

అక్క కల్యాణి, తను, చెల్లెలు వీణ..

పెద్ద కూతురు కల్యాణి జీవితం చిరిగిన విస్తరి అయితే మిగతా ఇద్దరాడపిల్లలకూ పెళ్లికాదని భయపడిందావిడ. ముందు చూపుతో అక్క ఏడుస్తున్నా, వద్దంటున్నానీవు నా మాట వినకపోతే చస్తానని బెదిరించి మరీ జాప్యం చేయకుండా తన స్నేహితురాలు కూతురు పెద్దాపురం హాస్పటల్ లో డాక్టర్ అని తెలిసి కల్యాణి గర్భాన్ని టర్మినేట్ చేయించింది..

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు. అలాగే ఒక నిండు జీవితాన్ని సక్రమంగా నిలబెట్టాలంటే ఈ పాపం చేయడం తప్పుకాదని భావించిందావిడ. అంతకంటే మరో మార్గం లేక..

వెంటనే అక్కకు పెళ్లిజరిగిపోయింది.. అక్క ప్రస్తుతం తన భర్త, పిల్లలతో హాయిగా చెన్నైలో సంసారం చేసుకుంటోంది..

ఈ డాక్టర్ మహాశయుడికి తను చేసిన తప్పేమిటో అనుక్షణం గుర్తొచ్చి జీవితాంతం నరకయాతన అనుభవించాలి..

అందుకే తను అలా చెప్పింది.. అక్కకు డా.. హరి ప్రసాద్ ని తను కలసిన విషయం ఎప్పుడూ చెప్పదు.. తన మనసులోనే సమాధి చేసేస్తుంది.. మోహన్ టూర్ నుండి రాగానే ఇక్కడ నుండి మరో చోటకి ఇల్లుమారిపోవాలని దృఢంగా నిశ్చయించుకుంది..

కానీ పల్లవికి తెలియని నిజం ఏమిటంటే, డాక్టర్ మాధవికి గర్భాశయ సమస్యలు వచ్చిన కారణంగా పెళ్లైన కొద్దికాలానికే ఆమె గర్భసంచీని తొలగించాల్సివచ్చిందని.. ఇంక వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదు.. ఎంత గొప్ప గైనకాలిజిస్ట్ అయినా కూడా డాక్టర్ మాధవికి పిల్లలు లేరు.. అసలే అహంభావి అయిన మాధవి తనకు పిల్లలు కలగరని తెలిసి భర్తతో మరింత శాడిస్టుగా ప్రవర్తించడం మొదలు పెట్టింది.. కానీ దేవుడు మాత్రం దయామయుడే వారి విషయములో.. చేసిన పాపానికి మరో జన్మలో శిక్ష వేయకుండా ఈ జన్మకీ శిక్ష చాలులే అని తన ఉదారతను చాటుకున్నాడు..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.



89 views0 comments

Comments


bottom of page