top of page

మురిపించిన అలలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి







Video link


'Muripinchina Alalu' Written By Yasoda Puluurtha

రచన: యశోద పులుగుర్త

వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒకరి పైన ఇష్టం ఏర్పడడం సహజం.

కాలక్రమం లో మరొకరితో వివాహం జరగడం కూడా పరిపాటే.

కానీ పెళ్లయ్యాక కూడా పాత బంధాన్ని వెతుక్కోవడం పొరపాటని చెప్పే కథ ఇది.

ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.



అమెరికా నాసా హెడ్ క్వార్టర్స్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్న మనోజ్ కి అర్జంట్ గా వైజాగ్ రావాల్సిన పనిపడింది.. సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నాడు వైజాగ్ రావాలని.. కానీ వృత్తిపరంగా శెలవు దొరకని కారణంగా వైజాగ్ రాలేకపోతున్నాడు.. వైజాగ్ తను పుట్టి పెరిగిన ప్రదేశం.. తన చదువు అంతా వైజాగ్ లోనే పూర్తి చేసాడు.. తల్లీ తండ్రీ ఒక సంవత్సరం తేడాలో చనిపోయి ఏడు సంవత్సరాలు దాటి పోయాయి.. వైజాగ్ లో తన తండ్రి కట్టించిన ఇంటిని అమ్మేయాలని ఎన్నాళ్లనుండో అనుకుంటున్నాడు.. మాటి మాటికీ వైజాగ్ వచ్చి ఇంటిని చూసుకోలేకపోతున్నాడు.. చెల్లాయ్ మృదుల ఆష్రేలియాలో భర్త పిల్లలతో సెటిల్ అయింది..

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే ఒకలాంటి ఉద్విగ్నత చోటుచేసుకుంది అతని లో.. వైజాగ్ అంటే పంచప్రాణాలు, అనిర్వచనీయమైన బంధం ఉండేది ఒకానొకప్పుడు.. అమ్మా నాన్నగారూ పోయినపుడు వచ్చాడు వైజాగ్.. ఊరు ఏమీ మారకపోయినా ఎక్కడ చూసినా అపార్ట్ మెంట్లే.. మనోజ్ తండ్రి కట్టించిన ఇల్లు జగదాంబా సెంటర్ లో ఉంది.. చాలా మంది బిల్డర్స్ అమ్మేస్తారా అంటూ తనకు మెసేజ్ లూ ఫోన్లూ చేస్తున్నారు.. మంచి సెంటర్లో ఉన్నమూలాన ఏ కమర్షియల్ కాంప్లెక్సో కట్టేసి డబ్బు గడించేయాలన్న కోరిక వారిది అయితే, తను పుట్టి పెరిగిన ఇంటిని అమ్మేయడానికి మనోజ్ అంతరాత్మ ఒప్పుకోకపోయినా అమ్మక తప్పని పరిస్తితిలో వచ్చాడు..

హొటల్ నోవోటెల్ లో ఎకామ్ డేషన్ బుక్ చేసుకున్నాడు.. హొటల్ కు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాకా భార్య అనుపమ కి ఫోన్ చేసాడు..

" అనూ లేండడ్ సేఫ్ లీ టుమై హోమ్ ప్లేస్.. " ......

"ఓ, నైస్ మనోజ్, మీ హోమ్ ప్లేస్ ని చూడగానే మమ్మలని మరచిపోలేదు కదా !"

"మరచిపోయాననుకుంటే నీకెందుకు ఫోన్ చేస్తాను అనూ ! అన్నట్లు బేబీ ఏమంటోంది ? నాన్న కావాలని పేచీ పెట్టడంలేదుకదా ? నీవు వేళకి మందులు వేసుకో, నేను లేనని తినడం బధ్దగించకు.. అన్నట్లు నానీ వస్తోందా ? ఏదైనా ఒంట్లో నలతగా అనిపిస్తే డాక్టర్ కు ఫోన్ చేయి అనూ. ఇంకో మూడునెలలు జాగ్రత్తగా ఉంటే నీవు కోరుకున్నట్లుగా బాబు పుడ్తాడు.."

"అలాగే మనోజ్, బేబీ అడిగితే చెప్పాను.. నాన్న ఆఫీస్ వర్క్ మీద అర్జంట్ గా వెళ్లారని తొందరగా వచ్చేస్తారని.."

"గుడ్ . ఇక్కడ నా రూమ్ కి ఆనుకుని ఉన్న బాల్కనీ నుండి నుండి చూస్తే సముద్రం ఎంత బాగా కనపడుతోందో తెలుసా ! రియల్లీ ఎమేజింగ్ వ్యూ అనూ !"

"లక్కీ యూ ఆర్ మనోజ్ ! నీ పని అయిన వెంటనే ఫోన్ చేయి.. బై ది బై ఎంజాయ్ యువర్ హోమ్ ప్లేస్.."

"ష్యూర్" అంటూ ఫోన్ పెట్టేసాడు !

అనుపమ పెళ్లైన కొత్తలో "మీ పేరంటే నాకు చాలా ఇష్టం.. మిమ్మలని ' మనూ' అనిపిలవచ్చా?" అని అడిగితే వద్దు అనేసాడు.. ' మనూ అంటూ తనని పిలిచేది ఒక్క ' చైత్ర' మాత్రమే !

బాల్కనీ లో నున్న సోఫాలో కూర్చుని ఎదురుగా చూస్తుంటే సముద్ర తరంగాలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి.. తెల్లని నురుగులతో పోటీ పడుతూ అల్లరిగా పరుగెడ్తున్న కెరటాలు చూడమనోహరంగా ఉన్నాయి.. సముద్రంలోని కెరటాలు ఒక్కో క్షణంలో ఆకాశాన్నే అందుకునేలా ఎగిసి పడతాయి, మరో క్షణం భుజాలమీద మోయలేనన్ని భాధ్యతల బరువులేవో ఉన్నాయనేలాగా కుంగిపోతాయ్.

ఆ కెరటాలను అందుకోవాలని తనూ చైత్రా పోటీపడుతూ పరుగెత్తడం గుర్తొచ్చి మనస్సు భారమైపోయిందో క్షణం.. చైత్ర గుర్తుకు రాగానే ఒకటికాదు, ఎన్నో జ్నాపకాలు మనోజ్ ని చుట్టముట్టాయి.. ఆంధ్రా యూనివర్సిటీ లో చైత్రా, తనూ ఎమ్..ఎస్..సి అప్లైడ్ ఫిజిక్స్ చదివేటప్పుడు క్లాస్ మేట్స్.. ఒకరిమీద ఒకరికి ఎడ్మిరేషన్ కలగడం అది ప్రేమగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు.. యూనివర్సిటీ లైబ్రరీలో తరచుగా కలుసుకోవడం, సబ్జక్ట్ మీద చర్చలు, భవిష్యత్ ప్రణాళికలు, విశాఖ బీచ్ లో ఆదివారం సాయంకాలం ఇసుకలో నడుచుకుంటూ ఎన్నో కబుర్లు ....చైత్ర ఎప్పుడూ గల గల మంటూ కబుర్లు చెపుతూనే ఉండేది..

" ఆ సముద్ర కెరటాలు చేసే అల్లరికంటే, నీ అల్లరే ఎక్కువ చైత్రా" అనగానే అలిగేది.. "నేనంత బోర్ గా ఉన్నానా నీ"కంటూ రోషంగా మాట్లాడే చైత్ర ను ప్రసన్నం చేసుకోడం తనకి చాలా ఇష్టంగా ఉండేది.. షీ హాజ్ సచ్ ఎ లవింగ్ పర్సనాలిటీ. ఎమ్. ఎస్. సి పూర్తి అవగానే మనోజ్ కు అమెరికాలో చికాగో యూనివర్సిలో పి..హెచ్..డి ఏస్ట్రో ఫిజిక్స్ లో అడ్మిషన్ దొరికి వెళ్లిపోయేటప్పుడు చైత్ర ఏడ్చేసింది..

" నిన్ను విడిచి ఎలా ఉండగలననుకున్నావు మనూ" అంటూ "నిశ్శబ్దం లో నీ నవ్వులు గలగల వినిపిస్తుంటే ఎలా తట్టుకోగలననుకుంటున్నావ్" బేలగా అతనివైపే చూస్తూ అడుగుతున్న చైత్రతో......

" ఏస్ట్రో ఫిజిక్స్ లో రీసెర్చ్ చేయాలనుకోవడం నా డ్రీమ్ చైత్రా! నీకు తెలుసుకదా.. రెండు సంవత్సరాలలో ఇండియా వచ్చి నిన్ను పెళ్లిచేసుకుని నాతో తీసుకుపోతా"నని "మిగతా కోర్స్ మన పెళ్లి అయ్యాకా పూర్తి చేస్తా"నని నచ్చచెప్పాడు..

మొదటి సంవత్సరం పూర్తి అవుతుండగా ఊహించని విధంగా చైత్ర తన వెడ్డింగ్ కార్డ్ మెయిల్ లో పంపింది..

కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నాన్నగారి బలవంతంమీద నా పెళ్లి కుదిరిందని, ఒప్పుకోక తప్పలేదని తనని క్షమించమంటూ వ్రాసింది.. మనోజ్ చాలా బాధ పడ్డాడు ఆ మెయిల్ చదివి.. ఆ వ్యక్తిగత కారణాలేమిటో తనకు చెప్పకూడదా అనుకుంటూ బాధపడ్డాడు.. అంతగా తనని ప్రేమించి, నీవు లేనిదే నేను బ్రతకలేను మనూ అంటూ విలపించిన చైత్ర ప్రేమలో నిజాయితీ లేదా అనుకున్నాడు.. ఒక అమ్మాయికీ అబ్బాయికీ అదే తేడా.. ఒక వ్యక్తిని అంత గాఢంగా ప్రేమించిన అమ్మాయి పరిస్తితుల ప్రాబల్యం మూలాన వేరే వ్యక్తిని పెళ్లిచేసుకోవలసి వచ్చిందని చాలా తేలికగా చెప్పేస్తుంది.. అదేవిషయం అబ్బాయి చెపితే మాత్రం నయవంచన అంటారు ..ప్రేమించి మోసంచేసాడంటారు..

ప్రేమకి విలువ ఇదేనా అనుకున్నాడు..

చాలా డల్ గా అయిపోయాడు.. తరువాత మరో ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఏమిటంటే చైత్రను పెళ్లిచేసుకున్నది ఒక పెద్ద వ్యాపార వేత్త అని, కలకత్తాలో చాలా బిజినెస్ లు చేస్తున్నాడని..

చైత్ర జ్నాపకాలు ఎడతెరిపి లేకుండా చుట్టుముట్టుతున్నా బలవంతంగా రిసెర్చ్ మీద తన దృష్టిని సారించి విజయవంతంగా పూర్తి చేసి నాసా హెడ్ క్వార్టర్ వాషింగ్ టన్ డీ..సీ లో సైంటిస్ట్ గా ఉద్యోగం సంపాదించాడు.. అక్కడే ఎమ్..ఎస్ చేసి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న అనుపమతో తన వివాహం జరిగిపోయింది.. పరిస్తితులతో కాంప్రమైజ్ అయిపోయి అనుపమ, అయిదేళ్ల కూతురు ' స్వీయ' తో జీవితం సాగిస్తున్నాడు.. మూడు నెలలలో మరో చిన్నారి బాబు తమ జీవితాలలోకి రాబోతున్నాడు..

తను ఈ ఆలోచనలలో ములిగి ఉండగా ఎవరో బిల్డర్ తనకోసం వచ్చాడని ఇంటర్ కమ్ లో హొటల్ మేనేజర్ చెపితే పంపించమన్నాడు.. కానీ డీల్ కుదరలేదు.. ఇలా నలుగురైదుగురు బిల్డర్స్ రావడం ధర ఫిక్స్ అయినా పేమెంట్ వాయిదాలలో ఇస్తామనేసరికి నో చెప్పాడు.. తను సాధ్యమైనంత తొందరగా డీల్ పూర్తిచేసుకుని, తిరుపతి లో దైవదర్శనం చేసుకుని, వెంటనే యూ..ఎస్ వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఉన్నాడు..

మనోజ్ కోరుకున్నట్లుగా మరో పెద్ద బిల్డర్ సరియైన ధరకు డీల్ కుదుర్చుకుని పేమెంట్ అంతా ఒకేసారి సెటిల్ చేస్తానని చెప్పేసరికి ' హమ్మయ్య' అనుకుంటూ రిలీఫ్ అయ్యాడు.. బిల్డర్ ఆరోజు రాత్రి తన ఇంటికి డిన్నర్ కు రావలసిందిగా మనోజ్ ను ఆహ్వానించాడు..

చక్కని విశాలమైన మూడు అంతస్తుల భవనం, నీలాల సముద్రపు అలలు కనుచూపుమేరలో పరవళ్లుతొక్కుతూ కనువిందు చేస్తున్నాయి.. మనోజ్ ను సాదరంగా ఆహ్వానించాడు ప్రకాష్ రాజు.. ఆ భవనం అంతటా రాజసం ఉట్టి పడుతోంది.. రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగంలో లో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి ప్రకాష్ రాజ్.. మనోజ్ నుండి కొన్న ఇంటిని పడగొట్టించి భార్య పేరు మీద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని అతని ఐడియా.

చైత్రా అంటూ భార్యను పిలిచాడు.. ఆ పిలుపుకే తృళ్లిపడ్డ మనోజ్, క్షణంలో తన కంటికెదురుగా కనిపించిన చైత్రను చూస్తూనే అలా మ్రాన్పడపోయి ఉండిపోయాడు.. ఎదురుగా నిలబడిన చైత్ర పరిస్తితి కూడా అదే.. ప్రకాష్ రాజ్ మనోజ్ కి నా భార్య చైత్ర అని, అలాగే మనం కొనుకున్న ఇల్లు వీరిదేనంటూ, మిస్టర్ మనోజ్ , యూ..ఎస్ నుండి వచ్చారని, నోవోటల్ హొటల్ లో బస చేసారంటూ పరిచయం చేసాడు..

ఎక్కువ మాటలు లేకుండా డిన్నర్ పూర్తి చేసారు..

చైత్ర అదే అందంతో మెరిసిపోతోంది.. కాస్త ఒళ్లు వచ్చిందేమోగానీ మరి ఏ మార్పూ లేదు.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండే ఆ చైత్రకూ, మౌనంగా గంభీరంగా ఉన్న ఈ చైత్రకూ చాలా తేడా ఉంది.. ఇల్లంతా నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది.. పిల్లల సందడి వినపడడం లేదు.. సడన్ గా ప్రకాష్ రాజ్, మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులుంటారని అడిగేసరికి తెప్పరిల్లుతూ, రిజిస్ట్రేషన్ ఫార్మాల్ టీస్ అన్నీ పూర్తి అవగానే తిరుపతి వెళ్లాలనుకుంటున్నానని ఆ తరువాత వెంటనే యూ..ఎస్ వెళ్లిపోతానని తిరిగి వైజాగ్ వచ్చే అవసరం లేదని చెపుతూ వారి ఇంటినుండి శెలవు తీసుకుని వచ్చేసాడు..

హొటల్ కు వచ్చాకా కూడా అదే పరిస్తితి లో ఉండిపోయాడు మనోజ్.. ఎక్కడో కలకత్తాలో ఉంటోందని ఎప్పుడో విన్నాడు తను.. విధి ఎంత చిత్రమైనది.. అసలు చైత్రను జీవితంలో చూస్తాననుకోలేదు.. తమ ఇంటిని కొన్నది చైత్ర వాళ్లా ! ఓ మై గాడ్ అనుకున్నాడు.. చైత్ర ఏమిటీ, అసలు తనతో ఏమీ మాట్లాడనేలేదని ఒక వైపు, మరో వైపు ఇంకా నయం, చైత్ర నా క్లాస్ మేట్ అని ప్రకాష్ తో చెప్పలేదనుకుంటూ ఆలోచిస్తున్నాడు.. అయినా పెళ్లి అయిపోయిన ఆడవాళ్లందరూ ఇలాగే ఉంటారా అని అనుకోసాగాడు..

మరుసటిరోజు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తి అయినాయి.. నాన్నగారిల్లు ప్రకాష్ పరమైంది.. వైజాగ్ తో ఉన్న బంధం ఈ ఇష్యూతో తెగిపోయింది.. మరో రెండు మూడురోజుల్లో తిరుపతి వెళ్లాలనుకుంటున్నాడు..

ఆరోజు సాయంత్రం కావస్తోంది.. ఆకాశం కారు మేఘాలతో కమ్ముకుపోయింది.. వర్షం కురవబోతుందన్న ఆనందంతో సముద్రపు అలలు ఉత్సాహంతో ఎగిసి పడుతున్నాయి.. బయటకు వెళ్లాలనుకున్న మనోజ్ రూమ్ లోనే ఉండిపోయి భీభత్సంగా పరవళ్లు తొక్కుతున్న సముద్రంవైపే చూస్తూ ఏదో ఆలోచిస్తున్న సమయంలో ........

కాలింగ్ బెల్ మోగింది.. హొటల్ సిబ్బంది ఎవరైనా వచ్చారేమోననుకుంటూ యస్ కమిన్ అనగానే ...... ' చైత్ర' !

సన్నగా పడుతున్న వర్షపు జల్లులు ఆమె వేసుకున్న పింక్ కలర్ చూడీదార్ డ్రస్ మీద చుక్కల్లా పడి మెరుస్తున్నాయి..

చైత్రను అలా చూసిన మనోజ్ స్తాణువైపోయాడు..

' లోపలకు రావచ్చా మనోజ్ '

ష్యూర్ అంటూ పక్కకు తప్పుకుని దారిచ్చాడు..

"ఎందుకు వచ్చిందీ మహాతల్లి అనుకుంటున్నావా మనూ ?"

"లేదు, నీవు వస్తావని నేను ఊహించలేదు, అందుకే ఆశ్చర్యం..

ఒకోసారి మనం ఊహించని సంఘటనలు జరిగిపోతాయి కదూ ! అసలు నిన్ను చూడలేననుకున్నాను ఎప్పటకీ.. కానీ ఎంత విచిత్రం.. మనం తిరిగి ఇలా కలసుకోవడం..నిజం చైత్రా ! ఇంతకీ ఎలా ఉన్నావు?"

"నామీద నీకు ఇంకా కోపం పోలేదు కదా మనూ ?"

"లేదు చైత్రా.. నీ పెళ్లి కార్డ్ చూసి ఆశ్చర్యపోయాను.. నీవు అలా ఎందుకు చేసావో అర్ధం కాలేదు.. నాతో నీ సమస్యలేమిటో పంచుకోవాలనిపించలేదా ?

చాలా రోజులు నిన్నే తలచుకుంటూ బాధపడిన మాట వాస్తవం.. కానీ దేవదాసుని అయిపోలేదు.. నా మనసుని నేనే ఓదార్చుకుని జీవితం తో సర్దుకుపోయాను.. నా భార్య అనుపమకి నేనంటే ప్రాణం.. మా అనురాగానికి చిహ్నం అయిదేళ్ల మా పాప ' స్వీయ' .. మరో మూడునెలలో బాబు పుట్టబోతున్నాడు అనూ కి.. "

"ఎంత అదృష్టవంతుడివి మనూ ! నీవు లేనిదే బ్రతకలేనన్న ఈ పిచ్చిది నిన్ను కాదని బ్రతికేస్తోంది.. కానీ నీ అంత సంతోషంతో కాదు.. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను.. అనుకోకుండా నాన్నగారి ఆఫీసులో ఎవరో లంచం తీసుకుంటే ఆ నేరాన్ని నాన్నగారి మీద నెట్టేయడంతో నాన్నగారిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసారు.. మాకు రావాల్సిన ఆస్తికి సంబంధించిన కేసు కోర్టు లో ఓడిపోయింది.. ఒక బాధమీద మరొకటి వచ్చేసరికి నాన్నగారు తట్టుకోలేకపోయారు.. హార్ట్ స్ట్రోక్ వచ్చి కోలుకున్నారు.. చెల్లాయి, తమ్ముడు ఇంకా చదువుల్లో ఉన్నారు.. అనుకోకుండా ప్రకాష్ సంబంధం వచ్చింది.. నన్నెక్కడో చూసిన ప్రకాష్ కి నేను చాలా నచ్చానని పెళ్లి చేసుకుంటానని, ఆర్ధికంగా మా కుటుంబాన్ని ఆదుకుంటానన్నాడు.. నేను నాన్నగారితో ఉద్యోగం చేస్తానని చెల్లి, తమ్ముడి బాధ్యత నాదని, మన ప్రేమ విషయం చెప్పినా కూడా నాన్నగారు వినలేదు.. నాన్నగారికి మరోసారి స్ట్రోక్ వస్తే ప్రమాదమని డాక్టర్ చేసిన హెచ్చరిక గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాను !

కుళ్లి కుళ్లి ఏడ్చాను, నీకు ద్రోహం చేసానని, నా బాధలు, సమస్యలు చెప్పుకుంటే ఎక్కడ నీ రిసెర్చ్ ఆపేసి వచ్చేస్తావోనని భయపడ్డాను..

నన్ను క్షమించవూ మనూ" అంటూ చేతుల్లో ముఖం దాచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న చైత్ర వైపు జాలిగా చూసాడు..

చైత్ర ప్రేమలో నిజాయతీ లేదని అపోహ పడిన తన మీద తనకే చాలా కోపం వచ్చింది.. ఏడుస్తున్న చైత్రతో, ' ఇట్స్ ఓకే చైత్రా, నాకు నీ మీద కోపం ఏమిటి ? అదంతా ఒక గతం ! లీవ్ ఇట్ చైత్రా..

ఇప్పుడు నీవు హేపీగా ఉన్నావుకదా ! ప్రకాష్ రాజ్ చాలా మంచివాడు కదూ !"

' హేపీ నా' అంటూ పేలవంగా నవ్వింది.. నేను మానసికంగా ప్రకాష్ కి దగ్గర కాలేకపోయాను.. అతని కెప్పుడూ బిజినెస్, ఆస్తులను కూడబెట్టడం తప్పించితే మరో ఆలోచన ఉండదు.. నా మూడ్ తో అతనికి పని ఉండదు.. ఎందుకంత డల్ గా ఉన్నావని కూడా అడగడు.. ఆస్తి, అంతస్తూ, సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఈ లోకం తప్ప, మరో లోకం కూడా ఉంటుందని, అందులో భార్యా, పిల్లలూ, వారి ఆనందాలూ కూడా ఉంటాయని తెలియని మనిషి.."

"మీ పిల్లల గురించి చెప్పలేదేమి చైత్రా ?"

"పిల్లలుంటే కదా చెప్పడానికి మనూ ! చెప్పానుగా ప్రకాష్ ఒక మెటీరియలిస్టిక్ పర్సన్.. ఏదో ఓ గూడు కింద కలసి బ్రతుకుతున్నామన్న మాటేగానీ భార్యా భర్తల మధ్య ఉన్న సున్నితమైన బంధానికి అర్ధం తెలియని వ్యక్తితో కలసి ఉన్నంత మాత్రాన పిల్లలు కలుగుతారా ?"

"పోనీ, నీ ప్రేమానురాగాలతో అతన్ని మార్చలేవా చైత్రా ? నీ అల్లరి, చిలిపితనం, అందమైన నీ నవ్వు అతని హృదయాన్ని కదిలించలేవా ? నీవు చేయగలవు, కానీ ఏదో కసి, కోపం నీలో పేరుకుపోయి అతన్ని దూరంగా పెట్టేస్తున్నావు.. నీతో అతను అలా మెటీరియలిస్టిక్ గా ఉండడం కూడా నీ ప్రాణానికి హాయిగా ఉందేమో ! "

మనోజ్ మాటలకు చైత్ర ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది..

"ప్రయత్నించు చైత్రా! నీ ప్రయత్నంతో అతను మారతాడని నమ్మకం ఉంది నాకు.."

"కానీ, మనూ, నేను నిన్ను ఒకటి అర్దిద్దామన్న ఆశతో వచ్చాను.. నా కోరిక తీర్చగలవా ?"

"చెప్పు చైత్రా, నేను చేయగలిగినదైతే తప్పకుండా చేస్తాను.."

"నాకు......నాకు, నీ ద్వారా సంతానం కావాలి.. నిన్ను నా హృదయంలో ఎప్పుడో భద్రంగా దాచేసుకున్నాను.. మనిద్దరికి పుట్టిన బిడ్డలో నిన్ను చూసుకుంటూ నా జీవితం గడివేస్తా"నంటూ దుఖంతో మనోజ్ కు దగ్గరగా వస్తూ అతన్ని అల్లుకుపోయింది..

బయట భీభత్సకరమైన వర్షం, అంతకంటే భీభత్సంగా రోదిస్తూ మనోజ్ గుండెల్లో ఒదిగిపోయిన చైత్రను దూరం చేయలేకపోతున్నాడు.. "ఏమిటిది చైత్రా ? తప్పు, నో, నాకిష్టం లేదు.."

"లేదు మనూ, నా కోరిక తీర్చవూ" అంటూ అతని మెడవంపులో తలదాచుకుని అతన్ని వదలనంటున్న చైత్రను బలనంతంగా దూరంచేసి ఆమె చెంప మీద గట్టిగా ఛెళ్లుమనిపించాడు..

అతను కొట్టిన శబ్దానికి సముద్రపు అలలు కూడా భయపడిపోయినట్లుగా ఒక్కసారిగా తమ ఉధృతాన్ని ఆపేసి దగ్గరకు ముడుచుకు పోయాయి..

ఊహించని పరిణామానికి చైత్ర ముఖం సిగ్గుతోకుంచించుకు పోయింది. సోఫాలో కూర్చుండి పోయి రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది..

కొన్ని క్షణాలతరువాత మంద్రమైన స్వరంతో చైత్ర పక్కనే కూర్చుని తను కొట్టిన చెంపదెబ్బపై తన చేతితో మృదువుగా రాస్తూ, "చైత్రా నీవు నాకు ఎప్పటికీ ఒక ప్రియ స్నేహితురాలివి .. ఏమీ తెలియని పసిపిల్ల లాంటి దానివి.. ఇప్పటి నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ఈ బొమ్మ నచ్చలేదు, మరో కొత్త బొమ్మ తీసుకురా నాన్నా ఆడుకుంటానని పేచీ పెట్టే నా కూతురు ' స్వీయ' గుర్తుకొస్తోంది.. నీ ఆలోచన, కోరిక అనైతికంగా ఉన్నాయి చైత్రా.. ఇష్టం లేని మనిషి అయినా కూడా ప్రేమించడం నేర్చుకుంటే ఒకరోజు ఆ మనిషే మనకి అత్యంత ప్రియమైన వ్యక్తి అవుతాడు..

లేచి ఫ్రెష్ అప్ అయి రా చైత్రా, కాఫీ వస్తుంది త్రాగుదాం" అంటూ చైత్రను ఉత్సాహ పరిచి మరికాసేపు ఆమెతో సరదాగా కబుర్లు చెప్పి సాగనంపాడు..

ఆరునెలలు కాలప్రవాహం లో కలసిపోయాయి.. ఈ ఆరునెలలో ఎన్నో ఊహించని మార్పులు..

మనోజ్, అనుపమ లకు సిద్దార్ధ పుట్టి బోర్లా పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు..

ఒకరోజు మనోజ్ కు చైత్ర నుండి మెయిల్ వచ్చింది..

" మనూ, నిన్ను చూడగలనని అసలు చూస్తానని కూడా ఊహించనేలేదు.. నీ రాక నా జీవిత అర్ధాన్నే మార్చివేసింది.. ఇష్టంలేని వ్యక్తి అయినా కూడా ప్రేమించడం నేర్చుకోమన్నావు.. ఎంత చక్కని సందేశం మనూ.. అలాగే చేసాను.. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు జీవితంలో చాలా ఇష్టమైన వ్యక్తి గా అయిపోయాడు.. నా ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నన్నే తన ప్రాణంగా చూసుకుంటున్నాడు.. నేనూ ప్రకాష్ మరో అయిదు నెలల్లో తల్లీ తండ్రీ కాబోతున్నాం.. నీవే రాకపోతే నా జీవితం అలాగే ఎడారిలా ఉండిపోయేది.. ఇప్పుడది పచ్చగా నిండుగా కళ కళ లాడుతోంది " .

ఉంటాను మనూ ! ఎప్పటకీ నీ స్నేహితురాలు చైత్ర " !

చైత్ర మెయిల్ చదివిన మనోజ్ అంతరంగపు అలలు ఆనందంతో మురిసాయి !!

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


58 views0 comments
bottom of page