top of page

అత్త ఒడి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి


Video link

'Attha Odi' Written By Yasoda Puluurtha

రచన: యశోద పులుగుర్త

చిన్నప్పుడే తల్లితండ్రులకు దూరం అయిన మేనకోడలు ఆర్యను కంటికి రెప్పలా పెంచింది రాగ మాలిక.

తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసింది.

ఆర్య కూడా కష్టమైనా, సుఖమైనా అత్తతోనే పంచుకుంటుంది. అత్త ఒడిలో సేద తీరుతుంది.

ఆత్మీయ బంధాలను తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు."అమ్మా, ' ఆర్య' ని విజయనగరం బస్ ఎక్కించి ఇప్పుడే వచ్చాను.. తనకి బోర్ గా ఉంటోందని, ఇక్కడ ఉండలేకపోతున్నానని నిన్నరాత్రి అంతా ఏడ్చి గోలచేసింది.. మరో అరగంటలో నీ దగ్గరకు చేరుకుంటుం"దని చైతన్య ఫోన్ చేసి చెప్పాడు తల్లి రాగమాలికకి..


'ఆర్య' రాగమాలిక కోడలే కాదు, మేనకోడలు కూడా ..

ఆవిడ కొడుకు చైతన్య వైజాగ్ షిప్ యార్డ్ లో మెరైన్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.. ఇద్దరికీ పెళ్లై ఒక సంవత్సరం కూడా పూర్తికాలేదు..

"అత్తా! నాకు బోర్ గా ఉంటోందిక్కడ.. నీవూ మామయ్య కూడా వచ్చేయం"డంటూ ఆర్య ఒకటే నస పెడ్తుంది ప్రతీరోజూ ఫోనులో.

"అది ఎలా కుదురుతుందే ఆర్యా! మీ మామయ్యకు ఇంకా అయిదేళ్ల సర్వీస్ ఉంది.. నీవే అలవాటు చేసేసుకోవాలమ్మా" అన్నా వినదు..

"వైజాగ్ కు విజయనగరం దగ్గర కదా" అని అటూ ఇటూ పరుగెడ్తుంది కానీ, అదే దూరంగా ఎక్కడో చైతన్య పనిచేస్తుంటే ఏమి చేసేదో మొండిపిల్ల అనుకుంటూ ముసి ముసిగా నవ్వుకుంటుంటే, "అత్తా!" అంటూ గాలి దుమారంలా వచ్చేసిన ఆర్య మేనత్త మెడ చుట్టూ చేతులేస్తూ అల్లుకుపోయింది..

"ఏమిటే పిల్లా, ఇలా అస్తస్తమానూ వచ్చేస్తుంటే చైతూకి భోజనం ఇబ్బంది కాదూ ?"


"అత్తా! నీవెప్పుడూ నీ కొడుకు గురించే బాధపడ్తావు కానీ నా గురించి...... అస్సలు....అస్సలు... ఒక్క క్షణమైనా ఆలోచిస్తావా? అయ్యో పాపం పిచ్చి పిల్ల.. ఒక్కర్తీ, చైతన్య పొద్దుటే ఆఫీస్ కు వెళ్లిపోతే సాయంత్రం ఎప్పుడో వస్తాడు, ఎంత ఒంటరిగా అల్లల్లాడిపోతోందోనని?"


అలా మాట్లాడుతూనే గబ గబా వంటింట్లోకి వెళ్లిపోయి తను కాఫీ కలిపేసుకుని, అత్తకు కూడా వేడి వేడి కాఫీ కప్పులో పోసి చేతికిస్తూ, "ముందు కాఫీ తాగి అప్పుడు నన్ను తిట్టు అత్తా" అంటూ బుంగమూతి పెడ్తూ, రాగమాలిక ఎదురుగా కూర్చుంటూ " ఏం చేయను అత్తా, అక్కడ ఉంటే నిన్ను మిస్ అవుతున్నాను, ఇక్కడ ఉంటే 'పాపం చైతూ ఒక్కడూ ఉన్నాడుకదా. వెళ్లిపోవాలనిపిస్తుం'దంటూ అమాయకంగా మాట్లాడుతున్న ఆర్య వైపు ప్రేమగా చూసింది.. ఆర్య తనకి అలా కాఫీ అందిస్తుంటే చిన్నతనంలోని ఆ అమ్మాయి రూపం కళ్లముందు కదలాడింది. తొమ్మిదేళ్ల ఆర్య బుట్టబొమ్మలాంటి ఫ్రాక్ వేసుకుని , బాబ్డ్ హెయిర్ తో తన వెనుకే అత్తా అత్తా అంటూ తిరుగుతూ " అత్తా నేను కలుపుతాను కాఫీ , నీవు కూర్చో" అంటూ కాఫీ కలిపి చేతికి అందించేది.


" వద్దు తల్లీ చిన్నపిల్లవి , గేస్ స్టౌ దగ్గర పనిచేసే వయస్సురాలేదు నీకంటూ" తనే చేయనిచ్చేది కాదు..

'అత్తా నీవు ఫ్రాక్ వేసుకోవెందు'కని, 'నీవు వేసుకున్న రెడ్ కలర్ డ్రస్ లో భలే క్యూట్ గా ఉన్నా'వంటూ, 'మెడలో అన్ని చెయిన్స్ వేసుకున్నావెందుకూ, నుదిటి మీద ఆ రెడ్ డాట్ ఎందుకు పెట్టుకున్నా'వంటూ కూతూహలంగా ప్రశ్నలు వేస్తూ ఉండేది..

"దీన్ని చీర అంటారమ్మా" అంటే, 'చీరా!' అంటూ చిలకపలుకుల్లా పలికేది.. 'నాకూ వేయవూ' అంటూ అడిగేది.. అప్పటి ఆర్య గుర్తొచ్చి రాగమాలిక పెదవులపై దరహాసం మెరిసింది..


ఆర్య అమెరికానుండి తన దగ్గరకు వచ్చేనాటికి దాని వయస్సు ఎనిమిది సంవత్సరాలు .. అది రెండేళ్ల వయసులోనే తల్లి ప్రేమకు దూరమైంది.. అమెరికాలో స్తిర పడిన తన తమ్ముడు వేణు ఒక అమెరికన్ యువతిని ప్రేమించి పెళ్లిచేసేసుకుని అసలు ఇండియావైపు చూడడమే మానివేసాడు.. తన తల్లీ తండ్రీ అనారోగ్యంతో ఉన్నారని కబురు చేసినా రాలేదు.. చివరకు అమ్మా నాన్నా వాడిమీద బెంగతో చివర వరకూ తలచుకుంటూ చనిపోయారు..


ఒకరోజు ఉన్నట్టుండీ హఠాత్తుగా తమ్ముడు ఒక పాపను తీసుకుని తనింటికి వచ్చేడు..చాలా సంవత్సరాల తరువాత చూసిన తమ్ముడిని పోల్చుకోలేకపోయింది ముందు.. నేనక్కా వేణూ నంటూ చెప్పేవరకూ.. తమ్ముడితో ఆ అమెరికన్ యువతి రాలేదు.. వస్తూనే అక్కగారిని పట్టుకుని దుఖించసాగాడు..


" ఏమైందిరా వేణూ , నీ భార్య ఏదీ " ? అంటే జవాబివ్వలేక తలవంచుకున్నాడు..


'ఈ పాప నీ కూతురా' అంటే ఔనంటూ తల ఊపాడు..

'నేను మోసపోయానక్కా.. అన్నీ పోగొట్టుకుని ఇండియా వచ్చేసా'నంటూ విలపించసాగాడు.. 'అసలు ఏమి జరిగిందో చెప్పరా' అనేసరికి చెప్పడం మొదలు పెట్టాడు..

'అక్కా1 నేను పెళ్లి చేసుకున్న సోఫియా కి అంతకమునుపే మరొక అమెరికన్ యువకునితో సంబంధం ఉంది.. నా ఉద్యోగం, హోదా, డబ్బుని చూసి ప్రేమించింది.. పాప పుట్టాక తెలిసింది సోఫియా ఎటువంటిదో ! అమ్మా నాన్నగారినీ చూడడానికి ఇండియా వెళ్లకూడదంటూ షరతులు పెట్టింది.. అందుకనే అమ్మా నాన్ననూ ఆఖరి దశలో నైనా చూడలేని నిస్సహాయుడిని అయిపోయాను.. నన్ను తన గుప్పెట్లో పెట్టుకుంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది.. నేను శాడిస్టునని తనను గదిలో బంధించి రోజూ కొడుతున్నానని పోలీస్ రిపోర్ట్ ఇస్తే జీవితాంతం జైలుశిక్ష అనుభవిస్తావని బెదిరిస్తూ నేను సంపాదించిన ఆస్తినంతా తన పేరు మీద వ్రాయించుకుని, డివోర్స్ కి డిమేండ్ చేసి, రెండేళ్ల ఆర్య ని నాకు వదిలేసి వెళ్లిపోయిందంటూ చెప్పాడు.. బేబీ ని చూసుకుంటూ ఆరేళ్లూ అక్కడే అలాగే ఉండిపోయాను.. కానీ నావల్ల కావడంలేదక్కా.. బేబీ అక్కడే ఉంటే అమెరికన్ వాతావరణం లో పెరిగి పెద్దదై సోఫియాలాగే అయిపోతుందేమోనని భయపడ్తూ వచ్చేసానక్కా.' అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసాడు.. అంతవరకూ తమ్ముడిమీడ ఉన్న కోపం మంచులా కరిగిపోయి తమ్ముడిని ఓదార్చింది.


.

ఒకరోజు తను నిద్రలేవగానే చూసేసరికి తమ్ముడు లేడు.. ...."

'అక్కా, ఏమిటో మనసు అశాంతితో నలిగిపోతోంది.. అమ్మా నాన్నగారిని ఎంతగానో క్షోభ పెట్టాను.. నాకీ శిక్ష దేవుడు విధించడం న్యాయమే అనిపిస్తోంది.. నాకు ప్రశాంతత కావాలి.. దొరుకుతుందేమో చూస్తాను.. ఎక్కడికి వెడ్తానో నాకే తెలియదు.. ఒక గమ్యం అంటూ లేదు.. ఈ సంసార బంధాలు, బాధ్యతల పట్ల ఇఛ్చ, వ్యామోహం లేవు నాకు.. ఇంక తిరిగి రాలేకపోవచ్చు .. బేబీ ని నీకప్పగించేస్తున్నాను.. తల్లివైనా తండ్రివైనా దానికి అన్నీ నీవే.. నీ దగ్గర అది ఆనందంగా క్షేమంగా ఉంటుందన్న నమ్మకం ఉంది.. దానిపేరు మీద ఉన్న ఆస్తికి నిన్నే గార్డియన్ ను చేసి లీగల్ గా అన్ని ఫార్మాలటీస్ పూర్తి చేసిన డాక్యుమెంట్లు నా సూట్ కేస్ లో ఉన్నాయి.. ఫలానా లాయర్ గారిని కలిస్తే అన్ని వివరాలూ తెలుస్తా"యంటూ వ్రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు..


ఎనిమిదేళ్ల ఆర్యకు ఊహ వచ్చింది.. నాన్న కోసం ఏడుస్తూ ఉండేది.. దాన్ని దగ్గరకు తీసుకుని ప్రాణప్రదంగా ఒక కన్నతల్లిలా గుండెల్లో పొదవుకుంది.. నాన్న ఇంకరాడని, ఎక్కడకో వెళ్లిపోయాడని అర్ధం చేసుకుంది ఆ పసిపిల్ల. స్కూలూ , ఆ తరువాత కాలేజ్ లో డిగ్రీ పూర్తిచేసింది.. అత్త నే చూస్తూ ఇక్కడ పధ్దతులూ, సాంప్రదాయాలకూ అలవాటు పడిపోయింది.. అత్త మామయ్య అంటే ప్రాణం.. అత్త కొడుకు చైతన్య అంటే మరీ ఇష్టం. . అమెరికాలో ఒంటరిగా పెరిగిన ఆర్య ఇక్కడ మనుషుల ఆత్మీయత, ప్రేమానురాగాల మధ్య ఒక పరిపూర్ణమైన తెలుగింటి అమ్మాయిలా మారిపోయింది..


ఆర్య డిగ్రీ పూర్తి చేసిన నాటికి చైతన్య ఇంజనీరింగ్ పూర్తి చేసి వైజాగ్ షిప్ యార్డ్ లో మంచి ఉద్యోగంలో స్తిరపడ్డాడు.. మేనకోడలికి బయట సంబంధం చేయాలనిపించలేదు.. తల్లీ తండ్రీ లేని పిల్ల, అమెరికాలో పుట్టిన ఆర్య పెళ్లి అయి అత్తవారింటికి వెడ్తే దాని జీవితం ఎలా ఉంటుందోనన్న భయం ఒకవైపైతే , మేనకోడలిని పెంచి పెద్ద చేసిన మమకారంతో దాన్ని వదిలి ఉండలేకపోవడం మరో కారణం.. ఒకరోజు చెతన్యనూ, ఆర్య నూ దగ్గర కూర్చోపెట్టుకుని తన అభిప్రాయాన్ని చెపుతూ వాళ్ల ఇష్టమేమిటో కూడా తెలుసుకుని ఇద్దరికీ పెళ్లి చేసేసింది రాగమాలిక..


పెళ్లి అయ్యాక చైతన్యతో వైజాగ్ వెడ్తున్నప్పుడు ఆర్య అత్తను కౌగలించుకుని కళ్లనీళ్లు పెట్టుకుంటూ " నేను నీ దగ్గరే ఉంటానత్తా" అనేసరికి అలా కాదని నచ్చ చెప్పి , బుజ్జగిస్తూ పంపిస్తూ " ఏమంత దూరమే తల్లీ , కావాలంటే ప్రతీ నాలుగురోజులకీ వచ్చేయ్" అని చెప్పిందని అత్తమాటను తూచాతప్పకుండా పాటిస్తూ, " చైతన్యతో అత్తేగా నాలుగురోజులకొకసారి వచ్చేయమందంటూ" పోట్లాడి, వప్పించేసి వచ్చి అత్త ఒళ్లో వాలిపోతుంది.

"అత్తా! ఏమాలోచిస్తున్నావూ, నేను వంట చేయనా" అని ఆర్య అంటుంటే వాస్తవానికి తిరిగివచ్చిన రాగమాలిక " ఏమిటే ఆర్యా ఇంతదాకా గమనించనేలేదు నిన్ను అలా నీరసంగా ఉన్నావేమిటీ " అసలు సరిగా తింటున్నావా, లేదా అంటూ ఆప్యాయంగా అడిగేసరికి , ఆ అమ్మాయి బుగ్గలు సిగ్గుతో ఎర్రకలువలే అయ్యాయి..

సిగ్గు సిగ్గుగా గారంగా " అత్తా మరి నాకేదో అనుమానంగా ఉంది, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లవూ" అంటూ అత్త ఒడిలో ముఖం దాచేసుకుంది .

"అదేమిటే ఆర్యా, మరి చైతూకి తెలుసా ఈ విషయ"మనగానే ,

" ఊహూ, లేదత్తా, ముందుగా నీకే చెప్పాలనిపించింది.. అమ్మ లేదుగా, అమ్మకంటే ఎక్కువైన మా అత్తకు ముందుగా ఈ ఆనందాన్ని పంచేదామ్మని పరుగెత్తుకు వచ్చేసా"నంటూ అత్త ఒడిలోకి చిన్న పిల్లలా ఒదిగిపోతూ కళ్లనీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న ఆర్య వైపు సంభ్రమంగా చూసింది..

"నేను లేనా బంగారు తల్లీ , ఈ సమయంలో ఆ కన్నీళ్లేమిటే పిచ్చిపిల్లా" అంటూ ప్రేమగా ఆర్య బుగ్గలను ముద్దాడింది..


డాక్టర్ చెప్పిన శుభవార్తకు రాగమాలిక హృదయం పరవశించింది.. తన చిన్నారి మేనకోడలు తనని నాన్నమ్మని చేస్తున్నందుకు.. తల్లికి దూరమైన ఒకనాటి పసికందు, తండ్రి బ్రతికి ఉన్నాడో, లేడో , ఎక్కడ ఉన్నాడో తెలియదు, అటువంటి పసిపిల్ల తన సంరక్షణలో ఒక పరిపూర్ణమైన యువతిగా తయారయి , ఒక మాతృమూర్తి స్తానాన్ని పొందబోతోంది.. ఈ సమయంలో తన తమ్ముడే దగ్గర ఉంటే కూతురిని చూసుకుంటూ ఎంత మురిసిపోయేవాడో ననుకుంటూ, తమ్ముడు తిరిగి రావాలని మనసారా భగవంతుడిని ప్రార్ధించింది..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.210 views0 comments

Comments


bottom of page