'Chesukunnavariki Chesukunnantha' written by Yasoda Pulugurtha
రచన : యశోద పులుగుర్త
అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన అశ్విని తాళం తెరుచుకుని తమ ఫ్లాట్ లోనికి అడుగుపెట్టింది..
ఆఫీస్ నుండి రాగానే తనకోసం ఎన్ని పనులు ఎదురుచూస్తున్నా, వాటివైపు చూడకుండా ముందస్తుగా వంటగదిలోకివెళ్లి పొద్దుటే ఫిల్టర్ తీసి ఉంచుకున్న చిక్కని కాఫీ డికాషన్ తో కాఫీ తయారుచేసుకుని కాఫీ కప్పునిండా పోసుకునివచ్చి హాలులో సోఫాలో రిలాక్స్ అవుతూ కాఫీత్రాగడం అంటే అశ్వినికి చాలా ఇష్టం . భర్త రవికాంత్ ఎప్పుడూ ఆమెను జోక్ చేస్తూ అంటాడు, " నీకేమోయ్, చక్కగా బేంకింగ్ అవర్స్ అయిపోగానే బేగ్ సర్దుకుని వచ్చేసి హాయిగా నీ కిష్టమైన కాఫీను ఉఫ్ ఉఫ్ మంటూ ఊదుకుంటూ తాగగలవు. నీ కాఫీ వాసన అక్కడ మా ఆఫీస్ లో నా సీట్ దగ్గరకు గాలిలో తేలిపోతూ వచ్చేస్తుంది.. అప్పుడనుకుంటాను, అమ్మాయిగారు కమ్మని చిక్కని కాఫీను ఆస్వాదిస్తూ తాగున్నారని. .
దేనికైనా పెట్టిపుట్టాలి అశ్వీ” అంటూ ఆటపట్టిస్తాడు.. భర్తమాటలు గుర్తొచ్చి పెదవులపై చిరుదరహాసం మెరిసింది . ఇంకో అరగంటలో పని మనిషి వస్తుందనుకుంటూ విడిచిన బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసే నిమిత్తం లేచి పనిలో పడింది .
అశ్విని రవికాంత్ ల పెళ్లి అయి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
రవికాంత్ ఐ..బి..ఎమ్ లో సిస్టమ్ ఎనలిస్ట్ గా జాబ్ చేస్తున్నాడు.. అశ్విని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం లో ఉండగా కేంపస్ సెలక్షన్ లో ఐ..టి జాబ్ వచ్చినా రిజక్టె చేసి బేంకింగ్ పరీక్షలు వ్రాసి పాస్ అయి బేంక్ ఆఫ్ బరోడాలో పని చేస్తోంది.. ఈరోజు రవి ఫోన్ చేసి ఇంటికి రావడం కాస్త లేట్ అవుతుంది అశ్వీ , డిన్నర్ టైమ్ కల్లా వచ్చేస్తానన్నాడు.. రవి మార్నింగ్ లంచ్ ఆఫీస్ కెఫ్టీరియాలో తినేస్తాడు.. ఈవినింగ్ డిన్నర్ మాత్రం ఇంట్లో తినాల్సిందే .
అశ్విని వంట చాలా బాగా చేస్తుంది. ఇటు తెలుగు సాంప్రదాయ వంటలే కాకుండా అటు నార్త్ ఇండియన్ వంటకాలు, మరెన్నో కొత్త కొత్త వంటలు చాలా ఇష్టంగా చేస్తుంది.. అశ్విని చేసే వంకాయ పచ్చిపులుసు, దానికి జతగా చేసే కంది పచ్చడి, చేమదుంపల వేపుడంటే రవికి మహా ఇష్టం . ఆ రోజు ఆఫీస్ కబుర్లు చెప్పుకుంటూ కొసరి కొసరి వడ్డిస్తూంటే అశ్విని తో కలసి డిన్నర్ చేయడాన్ని ఇష్టపడతాడతను.. అందుకనే ఫ్రెండ్స్ బలవంతం చేసి సరదాగా హోటల్ కి వెడదామన్నా, ఎక్కువగా ఇంట్లోని డిన్నర్ ని మిస్ చేసుకోడు .
అశ్విని రవికాంత్ లది పెద్దలు కుదిర్చిన పెళ్లే . రవికాంత్ తల్లితండ్రులకు ఒక్కడే కొడుకు . రవి తండ్రి భీమవరం హైస్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.. వారికి పెళ్లి అయిన పదిసంవత్సరాలకు రవికాంత్ పుట్టాడు.. భీమవరంలో సొంత ఇల్లూ, పొలాలూ కూడా ఉన్నాయి వారికి.. రవికాంత్ కు పెళ్లి అయ్యాక, అశ్విని అత్తగారిని మామగారిని భీమవరం నుండి వచ్చేసి తమ దగ్గరే ఉండమని బలవంతం చేసినా, పుట్టి పెరిగిన ఊరుని, ఇంటిని వదలలేక అప్పుడప్పుడు వస్తూ, వచ్చినప్పుడల్లా నెలా, రెండు నెలలు కొడుకు కోడలి దగ్గర ఉండి వెడతారు.. అశ్విని నెమ్మదితనం, అణుకువ ఆ దంపతులను ఆనందపెడ్తుంది..
అంత చదువుకుని ఉద్యోగం చేస్తున్నా, ఆప్యాయంగా పిలుస్తూ, గౌరవంగా చూసే కోడలంటే కొడుకు కంటే ఎక్కువగా ఇష్టపడతారా దంపతులు.. " నీవొచ్చి నాకు పోటీ అయిపోయావ్ అశ్వీ! నామాట కంటే నీ మాటకే ఎక్కువ విలువిస్తారు అమ్మానాన్నా” అంటూ, " ఏంమాయ చేసావే అశ్వినీ” అంటూ కూనిరాగం తీస్తూ ఒకటే ఉడికిస్తాడు రవి.
“చూడత్తయ్యా! నేనేవో మాయలూ మంత్రాలతో మిమ్మలని లోబరుచుకున్నట్లు మీ ముద్దులకొడుకు అభియోగం” అంటూ అత్తగారి దగ్గర గారాలుపోతుంది అశ్విని..
“నా బంగారుతల్లిని ఏమన్నా ఊరుకోనురా రవీ” అంటూ ఆవిడ అశ్విని ని సముదాయిస్తారు.
అశ్వినికి రవికాంత్ కంటే ముందు చాలా సంబంధాలు వచ్చాయి.. కొంతమంది అబ్బాయిలు షరతులు పెడ్తూ మాట్లాడుతుంటుంటే కోపం వచ్చేది .
పెళ్లి అయ్యాక జాబ్ మానేయాలని, తన తల్లితండ్రులను బాగా చూసుకోవాలని కొందరంటే, మరికొందరు విడి కాపురం అంటూ పెళ్లైన వెంటనే తమని తల్లి తండ్రులనుండి విడదీయకూడదంటూ బోల్డన్ని అర్ధాలు వచ్చే మాటలు మాట్లాడేవారు . అశ్వినికి ఇటువంటి షరతులతో కూడుకున్న వివాహ వ్యవస్తపై కోపం ముంచుకొచ్చేది..
తను ఉద్యోగం చేయాలని కోరుకుని, ప్రొఫెషనల్ కోర్స్ చదివింది . పెళ్లైతే తన అభిరుచులను , ఆశయాలను ఎందుకు చంపేసుకోవాలి ? తను చేయగలిగినంతకాలం ఉద్యోగం చేస్తుంది.. పెళ్లీ ముఖ్యమే. అంతకంటే ముఖ్యమైనది తన ఆశయ సాధన. అందుకే అశ్విని తల్లి తండ్రులు పెళ్లి విషయంలో కూతురికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా తను కాంప్రొమైజ్ అవలేకపోయింది .
ఆ తరువాత రవికాంత్ తనని చూసుకోడానికి వచ్చినపుడు, ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినపుడు, రవికాంత్ తో పెళ్లికి ఓకే అనుకునే ముందు అశ్విని రవికాంత్ తో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పింది.. రవికాంత్ ఏమీ షరతులు లాంటివి పెట్టలేదు.. అశ్విని అభిరుచులను తను గౌరవిస్తానని, కెరీర్ విషయంలో తన ప్రోత్సాహం, సహకారంఎప్పటకీ ఉంటాయని మాటిచ్చాడు.. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన అశ్వినికి మానవతా బంధాలు, వాటివిలువలు గురించి బాగా తెలుసు..
అందుకే ఆమె అత్తగారి కుటుంబంపట్ల , వారివైపు బంధువుల పట్ల చాలా ఆదరంగా ఉంటుంది.. నేను ఉద్యోగస్తురాలినన్న అహం ఆమెలో ఎక్కడా కనపడదు.. అన్ని పనులూ ఒక పధ్దతి ప్రకారం చేసుకుంటూ, ఎక్కడ వస్తువులు అక్కడే పొందికగా సర్దుకుంటూ , దేనికీ హైరానాపడకుండా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుతుంది .
ఆ రోజు ఆదివారం.. మధ్యాహ్నం లంచ్ అదీ చేసాక రవికాంత్ ‘కాసేపు పడుకుంటాను అశ్వీ’ అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు
అశ్విని హాలులో సోఫాలో కూర్చుని ఈ టీవీలో ఏదో బ్లాక్ అండ్ వైట్ తెలుగు మూవీ చూస్తోంది.. తన కిష్టమైన పాత మూవీ, మంచిమనసులు .
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది..
ఎవరో వచ్చారనుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.. ఆ వచ్చినది ఒక యువకుడు.. “రవికాంత్ ఉన్నాడాండీ” అని అడిగే అతన్ని చూడగానే ఇతన్ని ఎక్కడో చూసినట్లుగా ఉందే అనుకుంటూండగా, అతను కూడా అశ్వినిను చూస్తూండగా అతని ముఖం మ్లానమైంది..
అశ్వినికి ఉన్నట్టుండి ఒక్కసారిగా మెదడులో మెరుపుమెరిసింది..
" ఇతను......ఇతను...... వంశీకృష్ణ....."
అతనూ ఆమెను అలాగే చూస్తూ అచేతనంగా నిలబడిపోయాడు .
కాసేపటికి తేరుకుంటూ “నేను ......నేను రవికాంత్ కోసం వచ్చా”నంటూ కాస్తంత తడబాటుగా అడుగుతుండగా .....
గుమ్మం బయట నిలబడి ఉన్న అతన్ని లోపలకు పిలవాలనిపించ లేదు అశ్వినికి. ఏమీ మాట్లాడకుండా గిర్రున వెనక్కి తిరిగి లోపలికి వెళ్లి పోయింది .
రవిని లేపింది ‘ఎవరో వచ్చా’రని . రవి బయటకు వచ్చి చూసేసరికి అతను అలాగే గుమ్మం బయట నిలబడే ఉన్నాడు..
అతన్ని చూడగానే " హలో నీవా వంశీ ! కమిన్ " అంటూ ఆదరంగా అతనికి కరచాలన చేస్తూ లోపలికి ఆహ్వానించాడు .
‘ఏమిటీ ఇలావచ్చావ’నగానే, “ఏదో పనిమీద ఇటువస్తూ, నీవు ఉండేది ఇక్కడే కదా, ఉంటావో లేదో అని ప్రయత్నించాను.. అందుకనే ఫోన్ చేయలేదు వచ్చేముం”దంటూ సమాధానమిచ్చాడు .
“ఉండు. ఒక్క క్షణం” అంటూ లోపలికి వెళ్లి అశ్వినికి కాఫీ తయారుచేయమని చెప్పి వచ్చాడు.. ఇద్దరూ ఆఫీస్ సంగతులు మాట్లాడుకుంటుండగా అశ్విని ట్రేలో కాఫీ, స్నాక్స్ పట్టుకుని వచ్చింది.. " నా భార్య అశ్విని , బేంక్ ఆఫ్ బరోడాలో వర్కింగ్” అనిచెపుతూ “నా కొలీగ్ అండ్ ఫ్రెండ్ వంశీకృష్ణ, రెండునెలల క్రితమే బెంగుళూర్ ఆఫీస్ నుండి ఇక్కడకు ట్రాన్సఫర్ అయి వచ్చాడ”ని పరిచయం చేసాడు..
వంశీ ‘హలో’ అంటూ విష్ చేస్తుండగా, అశ్విని నెమ్మదిగా అక్కడనుండి లోపలకు వచ్చేసింది .
ఆరోజు రాత్రి డిన్నర్ టైమ్ లో " అదేమిటి అశ్వీ , నా ఫ్రెండ్ ను అలాగే బయటే నిల్చోపెట్టాసావ్, లోపలకు రమ్మని పిలవద్దా" ?
" అతను నీ ఫ్రండా, ఓహో నాకుతెలియదులేమరి.
ఎప్పుడూ అతనిగురించి చెప్పలేదుగా నీవు ?”
“అవును అశ్వీ” అంటూ రవికాంత్ వంశీకృష్ణ గురించి చెపుతుంటే, అశ్విని " అతను నాకు తెలుసు రవీ” అనగానే….
“అవునా, ఎలా అశ్వినీ ? నీకు తెలుసున్నా నాకు చెప్పకపోవడం భలే ఆశ్చర్యంగా ఉందే ! “
“అవును రవీ, ఒకప్పుడు అతనితో నాకు ఎంగేజ్ మెంట్ అయి...... చివరకు పెళ్లి కేన్సిల్ అయింది.. ఆ సంఘటన అతన్ని చూడగానే గుర్తుకొచ్చింది.. జీవితంలో అతన్ని తిరిగి చూస్తానని అనుకోలేదు..
నేను నీకు మన పెళ్లిముందు చెప్పలేదా రవీ, నాకు ఒకతనితో ఎంగేజ్ మెంట్ అయిందని, కాని అతను పెట్టిన షరతులు నాకు నచ్చక పెళ్లి కాన్సిల్ చేసుకున్నానని .”
“ఆ అవును !”
“అతనే ఇతను రవీ “.
“ఓ.... ఆ మహాశయుడేనా ఈ వంశీ కృష్ణ?”
“అవును రవీ . ఎందుకో అతన్ని లోపలకు పిలవాలనిపించలేదు. అలాగే గుమ్మం బయట నిలబెట్టేసాను ! అప్పట్లో అతను అన్న మాటలు నాకు ఎప్పటికీ అలాగ గుర్తొస్తూనే ఉంటాయి . ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేడో అనుకుంటాను .
నన్ను చూసుకోడానికి మొదట పెళ్లిచూపులకని వచ్చిన ఈ మహాశయుడు ముందర ఏమీ మాట్లాడలేదు.. బాగానే మాట్లాడాడు..
బాగానే మాట్లాడుతున్నాడు, విశాల దృక్పధం ఉన్న మనిషే అనుకుని మా పేరెంట్స్ కు నా అంగీకారం తెలియచేసాను .
వెంటనే ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది .
ఆ తరువాతనుండీ అతను నా మీద ఏదో అధికారం వచ్చేసినట్లుగా మాట్లాడడం మొదలు పెట్టాడు..
అప్పుడు నేను బేంక్ లో ఉద్యోగంలో చేరిన కొత్తరోజులు .
ముందస్తుగా చెప్పా పెట్టకుండా తరచుగా అమ్మా వాళ్లింటికి వచ్చేసి నాకోసం ఎదురుచూసేవాడు..
నేను ఆఫీస్ నుండి రావడం చూసి తన వాచ్ వైపు చూసుకుంటూ, " అదేమిటీ, అయిదున్నరకల్లా వచ్చేయాలికదా నువ్వు, పైగా ఆఫీస్ కూడా దగ్గరే, స్కూటీమీద వెళ్లొస్తావ్, ఇంత ఆలస్యం ఎందుకైందంటూ" సంజాయిషీలాగ అడిగేవాడు.. నామీద ఏదో అధికారం ఉందన్నట్లుగా..
అలాగే ఒకరోజు ముందు చెప్పకుండా ఒకసాయంత్రం వేళ మా ఇంటికి వచ్చాడు .
బేంక్ హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ డే సమీపిస్తున్న మూలాన పని ఎక్కువ ఉండి ఇంటికిరావడం ఆలస్యం అయిపోయింది .
నేను ఇతను అలా వస్తాడని ఊహించలేదు, వచ్చేసరికి నాకోసం అసహనంగా కోపంగా ఎదురుచూస్తున్నట్లుగా కనిపించాడు . నేను నవ్వుతూ పలకరించినా ముభావంగా సమాధానం ఇవ్వసాగాడు !
" ఏం ఫ్రెండ్స్ తో తిరగడానికి వెళ్లావా?” అని అడిగాడు ..
తెల్లబోయాను క్షణం సేపు !
ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల పట్ల అతనికి సదభిప్రాయం లేదంటూ, వారికి కేరక్టరే ఉండదంటూ మాట్లాడాడు.. పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ తో చెట్టా పట్టాలేసుకుని తిరగడం ఫాషన్ అనుకుంటారుట.
పెళ్లి చేసుకున్నా వారి లవర్ బాయస్ ను మరచిపోరని, మళ్లీ వాళ్లకు మెసేజ్ లు, చాటింగ్ లూ చేస్తూ వాళ్లతో అదే ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తారని, భర్తలకు మాత్రం మా క్లాస్ మేట్, కొలీగ్ అంటూ చెపుతూ ఉంటారని అన్నాడు.. ఆఫీస్ లో బాస్ లతో క్లోజ్ గా ఉంటూ, వాళ్లని ఎట్రాక్ట్ చేసుకుంటూ కెరీర్ గ్రాఫ్ లో పైపైకి దూసుకుపోతారట . పెళ్లి అవగానే నన్ను ఉద్యోగం మానేయమన్నాడు . ఆడవాళ్లు స్వేఛ్చగా, స్వతంత్రంగా ఉండడం అతనికి నచ్చదుట . ఒక మంచి గృహిణిగా ఉంటే చాలట..
నాకు చాలా కోపం వచ్చింది ! " ఛ......ఎంత అసభ్యకరంగా మాట్లాడాడనిపించింది " ! ఉద్యోగం చేసే స్త్రీలు మంచి గృహిణులుగా ఉండరన్న అతని అభిప్రాయంపట్ల ఏవగింపు కలిగింది..
ఎంగేజ్ మెంట్ అయిపోయిందన్న ధైర్యంతో, నేనేదో తన సొత్తు అయిపోయినట్లు మాట్లాడుతున్నాడు, పెళ్లి అయితే నా పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించాను.. నేను నా ఆలస్యానికి వివరణ ఇవ్వదలచుకోలేదు .
వెంటనే చెప్పేశాను, " నీకూ నాకూ సరిపడదని, మన పెళ్లి జరగదని" .
మా అమ్మా నాన్నగారికి ఎవరో తెలుసున్న మిత్రులద్వారా వచ్చింది అతని సంబంధం.. బాగా చదువుకున్నాడు, పెద్ద ఐటీ కంపెనీ లో ఉద్యోగం, మంచి కుటుంబం అని అమ్మా నాన్నగారు వప్పించారు నన్ను . కాని అతని సంస్కారం, బుధ్ది ముందరే తెలిసింది కాబట్టి ఐయామ్ సేవ్డ్ ! పెళ్లి అయ్యాక తెలిసుంటే........ఓ మైగాడ్ అంటూ భయంతో గుండెలమీద చేతులేసుకుంటూ మాట్లాడుతున్న అశ్విని తో రవికాంత్ ,
" ఒక్క క్షణం అశ్వినీ ........నీకు ఈ విషయం తెలియదు కదూ" ?
అయినా నీకు ఎలా తెలుస్తుందీ, నీవు ఈ విషయం మన పెళ్లికి ముందరే చెప్పినా ఎవరో ఆ మహాశయుడు అని అనుకున్నానేతప్ప, అతనే ఈ వంశీకృష్ణ అని ఇప్పుడు నీవు చెపితేకానీ నాకు తెలియదుకదా..నేను ఆ ఇష్యూని పూర్తిగా మర్చిపోయాను.
జస్ట్ రెండునెలల అయిందనుకుంటా, బెంగుళూర్ ఆఫీస్ నుండి మా ఆఫీస్ కు ట్రాన్స్ ఫరై వచ్చాడు.. నాతో క్లోజ్ గా మాట్లాడుతాడు.. ఒకరోజు మాటల సంధర్భంలో నేను అతనిగురించి అడిగితే అప్పుడు నాతో అన్నీ చెప్పుకున్నాడు .
" పాపం వంశీకృష్ణ , ఐ పిటీ హిమ్!”
“ఎందుకు పిటీ, ఆ యూస్ లెస్ ఫెలో మీద ?”
“పాపం అతని భార్య అతని పెళ్లైన ఆర్నెలలకే అతన్ని విడిచి వెళ్లిపోయిందట ! “
“ఏం......ఇతని స్వభావం నచ్చకనా ?”
“కాదు, ఆ అమ్మాయి ఎంప్లాయీ కాదుట, ఉద్యోగం చేసే అమ్మాయిని వద్దనుకున్నాడుట . కేవలం సాధారణ డిగ్రీ చదివిన అమ్మాయి చాలనుకుని పెళ్లి చేసుకున్నాడుట..
కానీ చూసావా అశ్వినీ .......... వివాహం చేసుకోవడంలో తన ఇష్టప్రకారమే చేసుకున్నా అతని వైవాహిక జీవితం చివరకు ఒక అపశృతిగా మిగిలిపోయింది !”
“అబ్బ...... ఊరికే సస్పెన్స్ లో పెట్టక త్వరగా చెప్పు రవీ” .
“డిగ్రీ చదివేటప్పుడు ఆ అమ్మాయికి తన ఫ్రెండ్ అన్నతో లవ్ ఎఫైర్ ఉండేదట.. అతన్నే పెళ్లాడాలనుకుందిట .ఆ అమ్మాయి పేరెంట్స్ కి ఆ అబ్బాయితో పెళ్లి చేయడం ఇష్టంలేక ఆమె ప్రేమవ్యవహారాన్ని దాచిపెట్టి ఆ పిల్లకు వంశీతో పెళ్లి చేసారుట .. పెళ్లైనా ఆ అమ్మాయి తన ప్రియుడ్ని మరచిపోలేక, వంశీతో సంసారం చేయలేక, ఒక రోజున ఇతనికి ఒక లెటర్ వ్రాసిపెట్టి ఆ ప్రియుని దగ్గరకు వెళ్లిపోయిందిట.. పాపం ఇదంతా ఒకరోజు నాతో చెప్పుకుని బాధపడ్డాడు” అంటూ నిట్టూర్చాడు .
“ఏమో! అతను చెప్పిన విషయం నేను నమ్మను.. భార్యను అనుమానంతో వేధించి ఉండచ్చు.. ఆ అమ్మాయి ఇతని టార్చర్ ను భరించలేక ఇతన్ని వదిలేసి వెళ్లిపోయి ఉండచ్చు.. అలా చెప్పలేక సింపతీ గైన్ చేయడానికి అల్లిన కట్టుకధ రవీ..
అనుమాన స్వభావం ఉన్న వ్యక్తి తాటి చెట్టుకింద పాలు తాగినా కల్లే అనుకుంటాడు . నా దృష్టిలో ఆ అమ్మాయి మంచి పనే చేసిందనిపిస్తోంది .
చూసావా రవీ, చదువుకున్న ఆడవాళ్ల పట్ల అతనికి సదభిప్రాయంలేదు. ఆడవాళ్లు స్వేఛ్చగా, స్వతంత్రంగా ఉంటే సహించని మనస్తత్వం.. పక్కా గృహిణిగా తలవంచుకుని సంసారం చేయాలి అతనికి.. పైకి ఎంత ఆధునికంగా, అందంగా కనిపించినా, స్త్రీల పట్ల ఒకలాంటి తేలిక భావం, ఇంకా బూజుపట్టిన భావాలే.
అతని ఆలోచనలూ అభిప్రాయాలూ సరియైనవి కావు రవీ . కొంతమంది తాము చాలా తెలివైన వాళ్ల మనుకుంటూ ప్రతీదీ భూతద్దంలో చూసుకుంటూ ఆచితూచి ప్రవర్తిస్తారు.. కానీ వాళ్లే బోల్తాపడ్తారు..అటువంటివాళ్లల్లో ఈ వంశీకృష్ణ కూడా ఒకడు.. విశాలమనస్తత్వం లేని మనుషుల జీవితాలు ఇలాగే అవుతాయి .
''చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ'' అని ఊరికే అనలేదు”.
“నిజమే అశ్వినీ, కానీ.... పాపం వంశీ......
అతని గురించి నీద్వారా నాకు అంతా తెలిసిపోయిందన్న భావనతో అతని పరిస్తితి ఎంత ఎంబ్రాసింగ్ గా ఉంటుందో కదా అని ఆలోచిస్తున్నా .రేపు నా ముఖం ఎలా చూడాలా అనికూడా బాధపడుతూ ఉండొచ్చు .”
“అది నిజమే రవీ, అతనికి జరిగిన అనుభవాలు వలన అతనికి ఇప్పటికైనా జ్నానోదయం కలగాలి. ఇటువంటి వ్యక్తులలో మార్పువస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది రవీ . ఏమంటావ్ ?”
“ఏమనగలను అశ్విని గారూ! తమరు చక్కని ఉపన్యాసం ఇస్తూ బల్లగుద్ది మరీ చెపుతుంటుంటే ఇంకా అలాగే వినాలనిపిస్తోంది”.
“ఇంక వదిలేయ్ రవీ అతని ప్రస్తావన. ఈ ఆదివారం సాయంత్రం నీతో ఆహ్లాదంగా గడుపుదామనుకున్నాను. పానకంలో పుడకలా వచ్చి మన ఆనందాన్ని పాడుచేసాడు మీ ఫ్రెండ్” అంటూ అలకముఖం పెట్టింది..
“జీవితంలో ఇవన్నీ కామన్ అశ్వీ . వాటినే గుర్తు పెట్టుకుంటూ బాధపడిపోకూడదు . ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోవాలి మన ఆనందాన్ని వెతుక్కుంటూ..”
“ఆహా...... అంతేనంటారా శ్రీవారూ ?
అయితే మన ఆనందం ఇంకో ఏడునెలల్లో మన ఇంట్లో ప్రవేశబోతోందీ అని చెపితే నాకేమి ఇస్తారట?” నడుంమీద రెండుచేతులూ వేసుకుని భర్త కళ్లల్లోకి చూస్తూ మాట్లాడుతున్న అశ్విని ముఖంలో వింత వెలుగు.. ఆ సంధ్యాసమయంలో పచ్చని ఆమె ముఖం ముద్దమందారంలా సోయగాలు విరజిమ్ముతోంది..
“అంటే, అర్ధం అయ్యేలా చెప్పు అశ్వీ, ఎప్పుడూ సస్పెన్స్ లో ఉంచుతావ్ ! ఇప్పుడు ఆనందంగానే ఉన్నాం కదా ?”
“ఏయ్ మొద్దూ...... ఇంకా అర్ధం కాలేదా ? నీకు కంప్యూటర్ లాంగ్వేజ్ లో చెపితేగానీ అర్ధంకాదు, నాకేమో బేంకింగ్ లెక్కలే వచ్చుమరి .. మన ఇంటికి చిన్నారి బాబో పాపో...... అంటే తమరు తండ్రి కాబోతున్నారు మహాశయా!”
“వావ్ అశ్వీ ...... " ఇంతటి శుభవార్తని ఇలా నెమ్మదిగా చెప్పడమా? ఎలా చెప్పాలో తెలుసా” అంటూ అశ్వినికి దగ్గరగా వస్తున్న రవి తో .......
“సినిమాలో లాగనా ? అంటే నీవు నన్నెత్తుకుని గాలిలో గిర గిరా తిప్పేస్తూ......” సిగ్గుతో అశ్విని కళ్లుదించుకుంది..
“ఎలా చెప్పాలో తరువాత చెబుదువుగాని , నీకిష్టమైన బొబ్బట్లు చేసాను, వేడిగా ఉన్నాయి తెస్తానుండు రవీ” అంటూ వంటింట్లోకి వెళ్లబోతున్న అశ్విని నడుంచుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కుంటూ...... “ఎక్కువ పనిచేస్తూ అలసిపోకు అశ్వీ, నీ పనుల్లో నన్నూ షేర్ చేసుకోనీయవూ” అంటూ ఆమె పెదాలను మృదువుగా చుంబించాడు..
“ఈ విషయం అత్తయ్యకీ మామయ్యకూ ఫోన్ చేసి చెప్పు రవీ” అంటూ కిచెన్లోకి వెళ్లింది..
అశ్విని చెప్పిన శుభవార్తకు అతని హృదయం ఆనందంతో నిండిపోయింది.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి. మానస వీణ సొంత ఇంటి కల మమతలూ - అనుబంధాలు అపర్ణ రివార్డ్ కురువింద డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్ పరిణితి తరాలూ - ఆంతర్యాలూ నీతోనే నా జీవితం హేపీ ఉమెన్స్ డే !
మా బామ్మ మాట బంగారు బాట
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
Comentários