top of page

హేపీ ఉమెన్స్ డే !


'Happy Womens Day' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

అమూల్య ఆఫీస్ నుండి తొందరగా ఇంటికొచ్చేసింది. ఆ రోజు మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఆఫీస్ లో అమూల్య మహిళలకు కొన్ని కార్యక్రమాలను నిర్వహించింది. అమూల్య ఒక ప్రసిధ్ది చెందిన ఐ.టి కంపెనీలో సిస్టమ్ ఎనలిస్ట్ గా పనిచేస్తోంది. ఎంతో చురుకైనది, తెలివైనది. అందరితో ధైర్యంగా మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం తో కనిపించే అమూల్య అంటే ఆఫీస్ లో అందరికీ ఇష్టమే.

కాలేజ్ రోజులలో విద్యార్ధినుల వైపు నుండి కాలేజ్ యూనియన్ సెక్రటరీ గా ఉంటూ చురుకుగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించేది. స్వతహాగా మొదటి నుండి దూసుకుపోయే స్వభావం కల అమూల్య రెండు రోజుల క్రితమే తన లేడీ కొలీగ్స్ నందరినీ సమావేశ పరచి అంతర్జాతీయ మహిళా దినోత్సం పైన చక్కని వ్యాసరచన పోటీలు నిర్వహించింది. ఈ విషయం అప్పటికే డిపార్ట్ మెంట్ అంతా పాకిపోయిన మూలాన హెడ్ ( HRD ). అమూల్యని తన కేబిన్ కి పిలిచి పోటీలలో నెగ్గిన విజేతలకు కంపెనీ తరపు నుండి చక్కని బహుమతులను కూడా స్పాన్సర్ చేస్తానని మాట ఇచ్చారు.

ఆ రోజు పనికి శెలవుని ప్రకటిస్తూ, మహిళా దినోత్సవ ఉత్సవాలను జరుపుకునేందుకు అనుమతిని ప్రకటించింది. అమూల్య ఆ సంధర్భాన్ని అవకాశంగా తీసుకుని ముఖ్యమైన HODs అందరినీ ముఖ్య అతిధులుగా ఆహ్వానించింది.

ఆఫీస్ లోని మహిళలందరూ హుర్రే అనుకుంటూ అమూల్యని పట్టుకుని ఎత్తేసారు. కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగిపోయాయి. చక్కని వ్యాస రచనలు,

కవితలు , గేయాలు, రచనలు, ఒకటేమిటి... ఆడిటోరియం అంతా ఉత్సాహంతో దద్దరిల్లి పోయింది. అమూల్య మైక్ ముందుకి రాగానే మహిళా సభ్యులంతా కరతళాల ధ్వనులతో అమూల్యను మాట్లాడమని సందడి చేసారు.

అమూల్య తన ఉపన్యాసాన్ని ఇలా కొనసాగించింది “మహిళా దినొత్సవం ఒక పుట్టుకకూ, ఒక అస్తిత్వానికి, ఒక పునరుజ్జీవానికీ, ఒక కొనసాగింపుకూ గౌరవం ఇచ్చే రోజు. నిజానికి మన భారతీయ పద్దతిలో ఎక్కువమందికి అర్థమయ్యేలా చెప్పాలీ అంటే ఇదో విజయ దశమి, మనిషి మనుగడ కోసం స్త్రీ అవసరాన్ని గుర్తించి స్మరించుకునే రోజు… భూమి మీద మనిషి అంటూ మిగలటానికి పురుషుని తో సమానంగా స్త్రీ అవసరం అన్న నిజాన్ని గుర్తు చేసే రోజు.. ఒక ఉపన్యాసం లో చెప్పాలంటే పైన చెప్పినట్టు చెప్పొచ్చు, చుట్టూ స్త్రీల ఆర్తనాదాలను వింటూనే నిద్ర లేస్తున్న మనం పొద్దున్నే కళ్ళ ముందు కనిపించిన

అమ్మకీ, భార్య కీ, సొదరికీ “విమెన్స్ డే విషెస్” చెప్పేస్తాం… మరి బస్ లో కనబడే లేడీ కండక్టర్ కీ? పొద్దున్నే మీ కాలనీ రోడ్లను శుభ్రం చేసే మునిసిపల్ వర్కర్ కీ, అన్నిటికన్నా తక్కువలో తక్కువగా 20 కేజీల బుట్ట నెత్తిన పెట్టుకొని కూరలమ్మటానికి వచ్చే అవ్వకీ ఎవరు చెబుతారు? అలాగే మనింటి పనిమనిషికి ? ఒక్కరోజు మన పనిమనిషి పనికి రాకపోతే అసహనానికి గురౌతూ, ఆమె మీద కారాలూ మిరియాలూ నూరేస్తాం.. అసలు మహిళకంటూ, ఆమె పడే శ్రమకి గుర్తింపివ్వటానికంటూ ఒకరోజుందనీ .....

ఇలా ప్రసంగం మంద్రస్థాయిలో కొనసాగిస్తుంటే......

మహిళా సభ్యుల నుండి ప్రశంసలు మిన్ను ముట్టాయి. ఆఫీస్ అధికారులు ఎంతగానో ప్రశంసించారు అమూల్యని !

అంతా ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇంటికొచ్చేసింది. ఇంటి తాళం తెరిచి లోపలికి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టి చుట్టూ పరికించి చూసింది. ఏమిటీ, తమ ఇల్లేనా అది ? అద్దంలా మెరిసిపోతోంది. ఆరోజు ఉదయాన్నే రెండు రోజుల క్రితం వైజాగ్ వెళ్లిన హర్ష తిరిగి వచ్చాడు. తను వస్తాడని తెలుసు కాబట్టి, అతనికోసం ఉదయాన్న లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేయడం ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన ఇంట్లో ఎక్కడ సామాను అక్కడ చిందరవందరగా పడి ఉంది. కిచెన్ సర్దలేదు. బెడరూమ్స్ లో బెడ్ షీట్స్ మడత పెట్టలేదు. హర్ష HSBC లో మేనేజర్

గా చేస్తున్నాడు. ఏమిటో మూడీ గా ఉంటాడు. అమూల్యకు కాస్త సహాయం చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. పైగా ఎక్కడి వస్తువులు అక్కడ పడేస్తాడు. అమూల్య ఎంతగానో చెపుతుంది, వినడు, నీకెందుకు నేను తర్వాత తీస్తానుగా అంటాడు. న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ ఇంట్లో ఇష్టం వచ్చిన చోట్లల్లా, ఇంకా చెప్పాలంటే అమూల్య ఎన్నోసార్లు బాత్ రూమ్ లో పడి ఉన్న మ్యాగజైన్స్ ని ఏరి తెచ్చేది !

నీట్ నెస్ కి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వని హర్ష ... ఈ రోజు ఇల్లంతా అద్దంలా కల కల లాడి పోతోంది. అలా పక్కకి చూసేసరికి డైనింగ్ టేబిల్ పైన ఒక స్లిప్ , దానిపైన పేపర్ వెయిట్ పెట్టి ఉంది . ఏమిటా అని చూసేసరికి... “ఏయ్ అమూ.. సాయంత్రం రెడీగా ఉండు, ఏమిటి, నోరు అలా తెరిచి ఆశ్చర్య పోతున్నావ్... సున్నాలా చుట్టిన నీ నోరు ఎంత ముద్దొస్తోందా తెలుసా? అవును, ఇల్లంతా నేనే సర్దానమ్మాయ్ ! ఎందుకా? నీ కోసం ! ఈ రోజు మీ మహిళా దినోత్సవం కదా ! ఈ ఒక్కరోజే కాదు... ప్రతీ రోజూ మనం మన ఇంటి పనిని ఫిఫ్టీ ఫిఫ్టీ గా పంచుకుందాం. ఈరోజు ఏమి చేయకు అమూ, బయటకు వెడదాం... బై” అని ఉంది స్లిప్ లో !

అంతా తమాషా, ఆశ్చర్యం.. ఇది ఎలా? వైజాగ్ లో అత్తయ్య హర్ష కి బ్రైన్ వాష్ చేయ లేదు కదా! ఎన్నో ఆలోచిస్తూనే తయారవడం మొదలు పెట్టింది !

*** *** ***

రెండు రోజుల క్రితం హర్ష, వాళ్ల నాన్నగారు అర్జంట్ గా ఏదో పొలం వ్యవహారం మాటలాడాలంటే వైజాగ్ వెళ్లాడు. మాటల సంధర్భంలో హర్ష వాళ్లమ్మగారు చెప్పారు, దీప్తి వచ్చినట్లు సుందర్ చెప్పాడని.

సుందర్, తను చిన్నప్పటి నుండి పి.జి వరకు కలసి చదువుకున్నారు. దీప్తి సుందర్ చెల్లెలు. చాలా బాగుంటుంది. తనతో ఎంతో చనువుగా ఉండేది. తమ ఇంటికి వచ్చేది తరచుగా. అమ్మతో కూడా ఎంతో చనువుగా ఉంటూ ‘ఆంటీ’ అని పిలుస్తూ తిరిగేది. తనతో ఆమె చనువుచూసి ఆమె మీద ఇష్టంతో పాటు ప్రేమను పెంచుకున్నాడు హర్ష. దీప్తి కూడా తనని ఇష్ట పడుతోందని భావించాడు.

ఇద్దరూ కలసి తిరిగారు. తనని దీప్తి ఎంతగానో కవ్వించింది. తన ప్రేమను తెలియ పరుద్దామన్న సమయంలో తను బేంక్ ఎగ్జామ్ లో పాస్ అవడం, ట్రైనింగ్ కోసం ఆరునెలలు ముంబాయి వెళ్లి పోవడం జరిగింది. తను ట్రైనింగ్ మధ్యలో ఉండగానే దీప్తికి పెళ్లి కుదిరిందని సుందర్ చెప్పడం, చాలా మంచి సంబంధం అని, అతను చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడని , దీప్తి కూడా ఇష్టపడిందని చెప్పగానే నిశ్చేష్టితుడై పోయాడు హర్ష. అంటే దీప్తి తనని ప్రేమించలేదా? అయితే తనని కవ్వించడం, తనతో ఆ చనువు.. ఓ మైగాడ్! దీప్తి అంటే తనకి ఇష్టం అలాగే ఉంది. ఎంత మరచిపోదామన్నా

మనసులో తిష్టవేసుకుని కూర్చుండి పోయింది. తను అమూల్యను పెండ్లి చేసుకున్నా కేవలం యాంత్రికంగా చేసేసుకున్నాడు. అమూల్యతో మూవ్ అవుతున్న సమయంలో హఠాత్తుగా దీప్తి గుర్తుకు రావడం తన మూడ్ అంతా మారిపోవడం... ఫలితం.. అమూల్యతో మూడీ గా గడిపేస్తున్నాడు. ముందు సుందర్ వాళ్లింటికి వెళ్లాలనుకోలేదు. ఎందుకో ఒక సారి దీప్తిని చూడాలని మనసు ఆత్రుత పడుతోంది. దీప్తికి తన మీద ఇష్టం ఉండి ఉంటుంది తప్పకుండా. ఒకసారి వెళ్లాలి, దీప్తిని చూడాలన్న ఆత్రుత నిలువనీయకుండా చేసింది. ఆ సాయంత్రం సుందర్ ఇంటికి వెళ్లాడు. సుందర్ ఆఫీస్ నుండి రాలేదు. వరండాలోనున్న సుందర్ చిన్న చెల్లెలు ‘హాయ్’ అని పలకరించి ‘అమ్మా’ అంటూ లోపల ఉన్న వాళ్ల అమ్మగారిని పిలవడం, వాళ్ల అమ్మగారితో పాటు దీప్తి కూడా రావడం హాయ్ అని పలకరించింది. అందరూ సోఫాలో కూర్చున్నారు. కుశల ప్రశ్నలనంతరం దీప్తి వాళ్ల అమ్మగారు ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్లడంతో ఆ హాలులో దీప్తి హర్ష మాత్రమే ఉన్నారు. దీప్తిలో చాలా మార్పు, అధునాతనంగా కనపడుతోంది. మునపటిలా ఆమె మాటల్లో ఆప్యాయత, స్నేహం లోపించింది. వాటి స్థానంలో ఒకలాంటి అతిశయం, గర్వం. మాటలు పొడి పొడిగాఉన్నాయి. ఈ లోగా ఆమె మొబైల్ మోగింది. అక్కడే కూర్చుని మాటలాడుతోంది. ఆమె భర్త ఫోన్ చేసాడు... హనీ, డియర్ అనుకుంటూ... ఒకటే నవ్వులు ఫోన్ లో. కనీసం తను అక్కడ ఉన్నాడన్న గ్రహింపు కూడా లేకుండా. మనసు చాలా చిన్నపోయింది. ఒక లాంటి అవమానం. ఇంక కూర్చో లేకపోయాడు, లేచి హాల్ బయటకు వచ్చేసాడు. దీప్తి చెల్లెలు కనిపిస్తే అర్జంట్ పని ఉందని, వెళ్లిపోతున్నానని, సుందర్ వస్తే నేను వచ్చి వెళ్లానని చెప్పమని బయటకు వచ్చేసాడు. ఇంటికి రాగానే హర్ష వాళ్ల అమ్మగారు అడిగారు, దీప్తిని కలిసావా, మాట్లాడావా అంటూ. ఆవిడ అలా అడగడం ఏమిటో కొత్తగా అనిపించి.. ఎందుకు అలా అంటున్నావని అడగ్గానే ఆవిడే అన్నారు, మొన్న గుడికి వెళ్లినపుడు దీప్తి, వాళ్లమ్మగారూ కూడా వచ్చారని, దీప్తి కనీసం పలకరించనైనా లేదని, తను మాటలాడితే ముభావంగా మాటలాడిందనీ, చాలా స్థితిమంతుల ఇంట

కోడలుట అని ఏమేమో చెపుతుంటుంటే ... తను వినలేక అక్కడనుండి వెళ్లిపోయాడు. అతనికి దీప్తి అవమానించిందన్న బాధ కంటే, తను అమూల్యతో ఉన్నప్పుడు దీప్తిని గుర్తుచేసుకున్నందుకు పశ్చాత్తాపంతో

బాధపడసాగాడు. ఎంత మూర్ఖుడు తను! దీప్తి పైన లేనిపోని ఆశలు పెట్టుకుని ఊహాలోకంలో విహరిస్తూ తన పక్కనే ఉన్న తన అమూల్యను నిర్లక్యం చేసుకున్నాడు. ఇంకా నయం, ఈ విషయం అమూల్యకు తెలియదు. తను కేవలం మూడీ, బధ్దకస్తుడు అని మాత్రమే భావించింది. తన కళ్లు తెరుచుకున్నాయి. తన పక్కన బంగారపు బొమ్మను పెట్టుకుని, దూరంగా మరెవరికోసమో తాపత్రయపడడం

ఛీ... .. ఎంత దిగజారిపోయానో కదా అనుకుని పశ్చాత్తాపపడ్డాడు. ఇన్నిరోజులు తన నిర్లక్ష్యపు ప్రవర్తన కు బాధ పడ్డాడు. తన అమూల్యను సంతోష పెట్టాలని ఆఘమేఘాలమీద వైజాగ్ నుంచి పరుగెత్తుకి వచ్చి వాలిపోయాడు. దాని పరిణామమే ' అమూ ' ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడం.

హఠాత్తుగా వినిపీంచిన కాలింగ్ బెల్ శబ్దానికి ఉలిక్కి పడుతూ పరుగెత్తుకుని వెళ్లి తలుపు తెరిచింది అమూల్య ! నవ్వుతూ ఫ్లవర్ బొకే తో ఎదురుగా హర్ష ! అందంగా పటియాలా డ్రస్ లో ముస్తాబైన అమూల్యను అపురూపంగా చూస్తూ... ‘హేపీ ఉమెన్స్ డే రా అమ్మూ’ అంటూ ఫ్లవర్ బొకేని ప్రేమగా చేతికి అందించాడు !

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


57 views0 comments

Comments


bottom of page