top of page

ఒక ఇల్లాలి కధ




'Oka Illali Katha' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

“ఏయ్ బావా ?”

“ఇదేమి పిలుపే తాయారూ, ఎప్పుడూ లేనిది? ఎవరైనా వింటే…” అంటూ కంగారుగా నలువైపులా చూస్తున్న ఆంజనేయులి వైపే చూస్తూ పకా పకా నవ్వింది మంగతాయారు...

“ఏం? మరదిలిని కోరి చేసుకుని, బావా అని పిలిస్తే తప్పేమిటి మహాశయా ? పోనీలెండి. శ్రీవారూ అంటూ పిలుస్తాను…”

‘శ్రీవారూ’ అన్న పిలుపుకి ఆంజనేయులు ముఖం మతాబులా వెలిగింది...

“ఆ శ్రీవారూ! ఇంతకీ చెపుదామనుకున్నది ఏమిటంటే మన ఎదురింటి పిన్నిగారు వాళ్లింట్లో పనసకాయలు కాసాయంటూ ఇదిగో ఈ కాయ మనకిచ్చారు పాపం. ఎంత అభిమానమో కదాండీ ? నేనెప్పుడో చెప్పానుట, మీరు పనసకాయ కొట్టి, చక్కగా సన్నని పెసరబద్దల్లా పొట్టు చెక్కి, ఆవపెట్టి కూరచేయడంలో మిమ్మలని మించినవారు లేరని.. చిన్నప్పుడు మీ ఇంట్లో పనసపొట్టు మీరే చెక్కి కూరవండేవారని, ఆ ఊళ్లో ఎవరింట్లో పనసకాయలు కాసినా మీ దగ్గరకే వచ్చి పొట్టు చెక్కించుకునేవారని.. ఆ మాట గుర్తు పెట్టుకుని వచ్చి ఇచ్చి వెళ్లారండోయ్. ఎదురింటి పిన్నిగారికిపనసపొట్టుకూర వండడం రాదట. ‘మీవారు బాగా వండుతారని చెప్పావు కదా తాయారూ, మీ బాబాయికి తెగ ఇష్టం పనసపొట్టు కూరంటే.. మీరు సగం కూర అట్టిపెట్టుకుని మరోసంగం నాకు పంపుతావుకదూ’ అంటూ తెగ మొహమాటం పడిపోయారు పిన్నిగారు” ఏదో చంద్రమండలం ఎక్కినంత ఆనందంగా మాట్లాడేస్తోంది తాయారు. .

ఆమాటలన్నీ వింటూన్న ఆంజనేయులు “అబ్బ, తాయారూ! నేను పనసకాయ పొట్టు చెక్కి కూరొండుతానని అందరికీ టాంటాం వేసి చెప్పడమేమిటే మొద్దూ ? రేపటినుండి ఈ విషయం తెలిసి మన ఇంటిముందు పనసకాయలతో క్యూ కడతారేమో చూడు…”

“కట్టనీయండి, మీకెలా ఉన్నా నాకు గర్వకారణమే సుమా, బాగా వండి నా పరువు నిలపండి బావా! నా బుజ్జికదా…” అంటూ గోముగా నాకేసి చూసి, ఇంకొంచం ఎఫెక్ట్ కోసం ప్రేమగా, సుతారంగా నా భుజంమీద చెయ్యివేసింది. అదేదో టన్ను బరువులా అనిపించింది నా ప్రాణానికి.

అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెద్ద పనసకాయ నన్ను చూస్తూ చిద్విలాసంగా నవ్వుతున్నట్లే అనిపించింది. . పెళ్ళయిన కొత్తలో ఏదో ఒక బలహీన క్షణంలో అలా వాగి వుంటాను. ఇప్పుడది నా పీక్కి చుట్టుకుంది. అయినా మా ఆవిడ జ్ఞాపకశక్తి అమోఘం. దాసోహం అవక తప్పదు అనుకున్నాను.

మంగతాయారుని ఇష్టపడి చేసుకున్నాను... మేనరికం వద్దురా వెధవాయ్ అంటున్నా, సన్నని బంగారు తీగలాంటి తాయారు, చెంపకు చారిడేసి కళ్లు, నల్లని త్రాచుపాములాంటి పొడవైన జడ, అంతకుమించి సన్నని నడుముతో బాపూ బొమ్మలా ఒయ్యారులు ఒలకపోస్తూ, కవ్విస్తూ నన్ను కట్టిపడేసింది.

మా ఆవిడ మాటే నా మాటగా, ఒకే బాటగా ఎంతో అన్యోన్యంగా, అంతా అసూయపడేలా బతికేస్తున్నాము.

మేము బైటకి వెడితే చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని చూసి ఎంత ముచ్చటైన జంట అని మురిసి పోతుంటారు. ఆడవాళ్ళంతా .

పది సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయి ఆ ఊహల్లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్న నన్ను తాయారు పిలుపు వాస్తంవంలోనికి తెచ్చిపడేసింది. .

“ఆ, ఏమిటి తాయారూ, ఎందుకు పిలిచావు ?”

“నేను పదోక్లాస్ మాత్రమే చదివానని ఎప్పుడూ ఎగతాళి చేస్తారుగా ?”

“నేను ఎగతాళి చేసానా ? పదోక్లాసే చదివినా ప్రపంచాన్ని మొత్తం చదివేయగలిగే సత్తా ఉందే నీలో. . నీకు నీవేసాటి. . నీ తెలివేటలు పోస్ట్ గ్రేడ్యుయేషన్ చదివిన వాళ్లల్లో మచ్చుకువెతికినా కనపడవు…”

“నిజంగానా బావా ?”

“నిజమేనే నా ముద్దుల మరదలా !”

అలా అంటూంటే తాయారు కళ్ళు మిలమిలా మెరిశాయి. నా కళ్ళముందు నక్షత్రాలు కనిపించాయి. తప్పదు, భార్యలను ఇలా మెచ్చుకోకపోతే చాలా కష్టం... అయినా ఏ మాటకి ఆ మాటే చెప్పాలి... పదో క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం లో చదివిన తాయారు నాలెడ్డ్ అమోఘం. ఇంగ్లీష్ పేపర్ ను ఆమూలాగ్రం చదివేస్తుంది. ప్రధానమంత్రి ఏ దేశ పర్యాటనలో ఉన్నాడో, ఐక్యరాజ్య సమితి సమావేశాలు, కేబినట్ సమావేశాలు, లోక్ సభలో ఆమోదంలో ఉన్న బిల్లుల గురించి, అంతరిక్షయాత్రలూ, రాకెట్ ప్రయోగాల గురించి టక టకా మాట్లాడేయగలదు. . ఏ విషయాలోనైనా చొచ్చుకుపోయి అనర్గళంగా మాట్లాడేయగలదు.. తనే తాయారు ముందు తెల్లముఖం వేసేస్తాడు. చివరకు డిమేట్ అకౌంట్ తన పేరు మీద తెరిపించుకుని స్టాక్ ట్రేడింగ్ మొదలుపెట్టింది.. ఏ స్టాక్ లో డబ్బుని ముదుపుచేస్తే లాభాలను పొందగలమో వగైరా అన్నీ ఆకళింపు చేసేసుకుంది.

“ఏమో నండీ, మొన్నామధ్య ఆ వీధి చివర సుశీలమ్మగారి కోడలు నన్ను అడిగింది, మీరేమి చదివారు ఆంటీ అని.. ‘టెన్త్ క్లాస్’ అని చెప్పగానే అప్పటినుండి నన్ను చూసి ముఖం తిప్పుకుంటుంది. అయినా ఒకటి మాత్రం నిజమే శ్రీవారూ! చదువుకున్న ఆడవాళ్ళు మా చదువుకోని స్త్రీలను చూసినంత హీనంగా మీ చదువుకున్న మగాళ్లు చదువుకోని పురుషులను చూడరు” .

“హమ్మయ్య! మా మగాళ్లు గొప్పవారని మెచ్చుకుంటున్నావు మొత్తానికి”.

ఆరోజు ఆఫీసునుండి వస్తూనే దిగాలుగా వచ్చిన భర్తను చూడగానే తాయారు అడిగింది, కారణమేమిటని. .

“కోవిడ్ కారణంగా కంపెనీ లాస్ లో ఉందని కొంతమంది ఉద్యోగులను తొలగించారు. వారిలో నేనూ ఒకడిని తాయారూ” అంటూ దిగాలుగా మాట్లాడుతున్న భర్త వైపే చూస్తూ, మరేమీ ప్రశ్నించకుండా లోపలికి వెళ్లి వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది...

“మరో ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు తాయారూ !”

“ఎప్పుడొచ్చినా ఫరవాలేదు, ముందా ఏడుపు ముఖాన్ని మార్చేసి నవ్వు ముఖంలోనికి రండి. ఇవన్నీ జీవితంలోని ఆటుపోట్లే. . రాకుండా ఉంటాయా చెప్పండి.. దిగులు పడ్తూ కూర్చుంటే పోయిన ఉద్యోగం రాదుకదా మహాశయా, నేను లేనూ ? మీకు మరో ఉద్యోగం వచ్చేవరకు భేష్షుగ్గా బ్రతకగలం.

మీరు, నేను గా ఉన్న మనల్ని మనంగా మార్చేసిన ఈ పది సంవత్సరాల కాలంలో ఒకరికొకరు తోడుగా నీడగా జీవితం సాగించిన వాళ్లం. మీ కష్టాలూ నావే, సుఖాలూ నావే... మళ్లీ ఆ రోజులూ వస్తాయి, ఉద్యోగమూ వస్తుంది..

ఆ. . . . . . కిందటి సంవత్సరం కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ రెండువేల పాయింట్లు పడిపోయిందని, ముదుపుచేసే మంచి సమయమని చెప్పి బ్రతిమాలితే మీరు ఒక అరవై వేలిచ్చారు.. నా దగ్గర దాచుకున్న మరో పదిహేను వేలు కలిపి పెట్టుబడి పెట్టాను. ఈమధ్య మార్కెట్ జోరందుకుని మన పెట్టుబడి మూడు లక్షల పై చిలుకకి ఎగబ్రాకింది. ఆ డబ్బుతో స్వగృహ ఫుడ్స్ పెడదాం. ఇప్పుడు కరోనా కష్టకాలంలో వంట చేసుకోలేక చాలా మంది అవస్తలు పడుతున్నారు కదా, అలాగే పాపం సీనియర్ సిటిజన్సు కాకుండా ఎవరైనా వండి ఇస్తే కాస్త వెరైటీగా రుచిగా తినాలనుకునేవారికి వారికి ఫుడ్ సప్లై చైద్దాం. . చక్కగా అరటి పువ్వు ఆవకూరలూ, పనస పొట్టు కూరలూ, దూటకూర , ఆవపులుసులూ చేయడంలో మీరు స్పెషలిష్టులు కూడా నయ్యే.. ప్రస్తుతం అటువంటి కూరలే తినమంటున్నారాయే డాక్టర్లు కూడా... ఇమ్యూనిటీ పెరుగుతుందని…

చిన్నా చితక ఫంక్షన్లకు బయట స్వీట్ షాపుల్లా స్వీట్లు కొనడానికి జనాలు భయపడుతున్నారు. . ఏదో మా బామ్మ పుణ్యామాంటూ, ఆరోజుల్లో బామ్మ పక్కనే కూర్చుని, కుంపట్లో ఇత్తడి మూకుట్లో ఆవిడ చేసే రక రకాల స్వీట్లు చూసి నేర్చుకున్నదాన్ని. నేను స్వీట్లూ అవీ చేస్తాను. . ఆంజనేయులూ స్వగృహఫుడ్స్ అనే పేరుతో మన వంటల గురించి వెబ్ సైట్ ఓపెన్ చేస్తాను.. పైగా మన కాలనీలో అందరికీ నేను తెలుసును. ఒక్కళ్లకి చెపితే చాలండీ, వర్డ్ ఆఫ్ మౌత్ కమ్యూనికేషన్ ను మించిన ప్రచార సాధనం ఉందా చెప్పం”డంటూ తనెదురుగా నిలబడి మాట్లాడుతున్న తాయారు వైపు అప్రభితుడై చూడసాగాడు ఆంజనేయులు. .

ఎంతో అమాయకంగా, ముగ్ధగా పైకి కనిపించే తాయారులో ఎన్ని అసాధారణమైన తెలివితేటలు ! ఇవన్నీ ఎలా తెలుసు తాయారుకి !

మా తాయారు ఏదైనా అనుకోవాలేగానీ ఆచరణలో పెట్టడానికి వెనకాడదు...

ఆంజనేయులూ స్వగృహఫుడ్స్ మంచిరోజు చూసి ప్రారంభోత్సవం చేసారు. .

ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. .

ప్రతీరోజూ మెన్యూ తయారుచేసి వెబ్ సైట్ లో పెట్టేసరికి కరోనా సోకి ఆరోగ్యం పుంజుకుంటున్న వారికి ఆ వంటలు చూసి నోటిలోనుండి లాలాజలం ఊరిపోతోంది. వంటల్లో ఆంజనేయుల వేసే పోపు ఘుమ ఘుమలు ఆహారప్రియుల నాసికాపుటాలను తహతహలాడిస్తున్నాయి.

స్టౌ మీద బూర్లెమూకుడులో బాదుషాలు నూనెలోవేయించి చిల్లుల చట్రంలోంచి పైకిదేవుతున్న తాయారు ముఖంలో చెక్కుచెదరని చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ద్యోకతమవుతోంది ఆంజనేయులుకి. ప్రతీ సమస్యకూ పరిష్కారం ఉంటుందని, కష్టాలు వచ్చినపుడు కృంగిపోకూడదంటూ తనకు ధైర్యాన్ని చెప్పే తాయారులాంటి ఇల్లాలుని తాను పొందినందుకు ఆంజనేయులు మనస్సు గర్వంతో పొంగిపోయింది !!

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.




109 views0 comments
bottom of page