top of page

మౌన మంత్రం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Mouna Manthram' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

నీరజ, సుమిత్ర లు ప్రాణ స్నేహితురాళ్ళు.

పిల్లల పెళ్లి విషయమై ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి.

కానీ నీరజ మౌనాన్ని వీడి క్షమించమని అడగడంతో వారి మధ్య ఏర్పడ్డ దూరం తొలగిపోతుంది.

ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.


తలవంచుకుని సీరియస్ గా పనిచేసుకుంటున్న నీరజ, 'హలో' అనే పలకరింపుకు తల ఎత్తి చూసింది. ఎదురుగా సుమిత్ర.. ఒకప్పటి తన ప్రాణ స్నేహితురాలు. కానీ కొద్దికాలంగా ఇరువురి మధ్య మాటల్లేవు, ఒకరికొకరు ఎదురుపడినా తలతిప్పేసుకుంటూ వెళ్లిపోతున్నారు.. అటువంటి పరిస్తితిలో సుమిత్ర ఇలా తన సీట్ దగ్గరకు వచ్చి పలకరించడంతో ఆశ్చర్యపోతూ, ఆప్యాయంగా "రా సుమీ", అంటూ కుర్చీ చూపించి కూర్చోమంది.


సుమిత్ర నిలబడే, 'మా మేఘకు పెళ్లి కుదిరిం'దంటూ శుభలేఖ నీరజ చేతికి అందించేసి గబ గబా వెళ్ళబోయింది.


నీరజ ఆమెను ఆపేస్తూ , "ఓ.. కంగ్రాట్స్ సుమీ! ఎవరా అబ్బాయి?" అని అడిగింది.

ఆమెకు సమాధానం ఇవ్వడం ఇష్టంలేనట్లుగా, " ఏం? నీ కొడుక్కి చేసుకోనంత మాత్రాన నా కూతురికిక పెళ్లే కాదనుకున్నావా ? ఎవరో అంతకు తగ్గబొంతలే. రావాలనుకుంటే రా" అని చెప్పి వచ్చినంత వేగంగా వెనుతిరిగి వెళ్లి పోయింది.


సుమిత్ర సమాధానానికి నీరజ మనసు చాలా ఖేద పడింది. సుమిత్ర కోపానికి, అసహనానికి తన దగ్గర మౌనం తప్ప సమాధానంలేదు. తను సమాధానం చెప్పినా సుమిత్ర కన్విన్స్ అవదు, అందుకే తాను మౌనం వహించింది.


నీరజ, సుమిత్ర.. ఒకే ఆఫీసులో పాతిక సంవత్సరాలనుండి కలసి పనిచేయడమే కాదు, అంతకంటే ఎక్కువ వారిమధ్య నున్న స్నేహబంధం. సుమిత్ర కూతురు మేఘ, అలాగే నీరజ కొడుకు ఆకాష్ ఇంటర్ వరకు ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. మేఘ కంటే ఆకాష్ ఒక సంవత్సరం సీనియర్. ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఆకాష్ చదువులో బ్రిలియంట్. ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్సు టెస్టు లో టాప్ రేంక్ తెచ్చుకుని ఏఐఐఎమ్ఎస్ , న్యూ ఢిల్లీ లో ఎమ్బిబిఎస్ లో చేరిపోయాడు.

మేఘ ఇంటర్ తరువాత హైదరాబాద్ లోనే ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరింది. ఆకాష్ కాలేజ్ శెలవల్లో వచ్చినపుడు, ఇద్దరూ కలుసుకుని తమ స్టడీస్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు.. అయిదు సంవత్సరాల కోర్సు పూర్తి అవగానే ఆకాష్ కు అక్కడే పీజీ లో అడ్మిషన్ దొరికింది..

మేఘ కేంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చి చేరిపోయింది.. నీరజకు మేఘను ఆకాష్ కు చేసుకోవాలని, మేఘ తన ఇంటి కోడలుగా రావాలన్న కోరిక చాలా ఉండేది. తరచుగా సుమిత్రతో " నేను కోరుకున్నట్లు జరిగితే మనం వియ్యపురాళ్లం అవుతాం కదే " అని అనడంతో సుమిత్ర మనసులో కూడా ఆ కోరిక బలంగా రూపుదిద్దుకోసాగింది..


ఆరోజు ఆదివారం .. ఆకాష్ వచ్చాడని తెలిసి మేఘ అతన్ని కలవాలని వెళ్లింది. ఆకాష్ కు తనే ముందుగా లవ్ ప్రపోజ్ చేయాలనుకుంది.. వెళ్లిన రెండుగంటల్లో తిరిగి వచ్చేసింది.. ముఖం అంతా ఎర్రగా కందగడ్డలా అయిపోయి ఉంది. బాగా ఏడ్చినట్లుగా ఆమె కళ్లే చెబుతున్నాయి. వస్తూనే తన గదిలోకి వెళ్లిపోయి తలుపులు వేసేసుకుంది. సుమిత్రకు అర్ధం కాలేదు. ఎంత పిలిచినా తలుపులు తీయలేదు.


మేఘ ఆకాష్ ను ప్రేమించింది.. అతనికి కూడా తనమీద ప్రేమ ఉందనుకుంది.. కానీ తన మనసులోని విషయం ఆకాష్ కు చెప్పాలనుకునే తరుణంలో అతని మాటలు ఆమె మనసున శరఘాతంలా తగిలాయి. ఆకాష్ ఢిల్లీలో తన క్లాస్ మేట్ రోషిణీను ప్రేమించానని, గుజరాతీ అమ్మాయని, చాలా తెలివైనదని ఇద్దరూ పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు.. అంటే, ఆకాష్ కు నిజంగా తనపట్ల ఇష్టంలేదా? మరి అయితే అతను చూపిన చనువు తనని చూడగానే అతని కళ్లల్లో మెరిసే మెరుపులకు అర్ధమేమిటి? తనను ఎంతగా కవ్వించేవాడు ? రాత్రి అంతా కూర్చుని తనతో చేసే చాటింగులు, మెసేజ్ లకు అర్ధం ? నీవు జీన్స్ టాప్ లో కంటే సల్వార్ సూట్ లో నీలి మేఘ మాలలా ఉంటావనేవాడు.. నీ పెదాలమీద నవ్వు తారకల్లాగ మెరుస్తోందనేవాడు.. ఇదంతా ట్రాషా? ఎంత భ్రమపడింది ! నిజానికి తను తొందరపడి నోరుజారలేదనుకుంటూ ఒక్కక్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే బై చెప్పి వచ్చేసింది..


ఎప్పుడో రాత్రి ఏడుగంటలకు తలుపుతెరిచిన మేఘ తల్లిని కౌగలించుకుని బావురమని ఏడ్చేస్తూ ఆకాష్ ను తను ప్రేమించిన సంగతి , కానీ ఆకాష్ తన క్లాస్ మేట్ ను ప్రేమించినట్లు, ఆమెనే పెళ్లిచేసుకోబోతున్నట్లుగా చెప్పాడని చెప్పింది. సుమిత్ర నిశ్చేష్టిత అయింది.. నీరజకు అంతా తెలిసే తన దగ్గర ఈ విషయం దాచలేదుకదా అని అనుమానపడింది. మేఘ అంటే అంత ఇష్టం ఉన్న నీరజ, మేఘను కోడలిగా చేసుకోవాలనుకున్నది.. కొడుక్కి తన అభిప్రాయాన్ని చెప్పి ఆ మాత్రం ఒప్పించలేకపోయిందానన్న ఒకలాంటి కోపం, అసహనం మొదలైనాయి.. దాని ఫలితమే నీరజతో ముభావంగా ఉండనారంభించింది.

సుమిత్ర మౌనాన్ని అర్ధం చేసుకున్న నీరజ ఆకాష్ ప్రేమ విషయం తనకి కూడా ఈ మధ్యనే తెలిసిందని, ఆకాష్ కు ముందునుండీ మేఘ పట్ల పెళ్లిచేసుకోవాలనే అభిప్రాయం లేదని చెప్పాడన్న సంగతి సుమిత్రకు చెప్పాలనుకుంది.. కానీ సుమిత్ర తనని ఆమడదూరంలో పెట్టేసి, తనని సూదుల్లాంటి చూపులతో చూడడం జరిగేసరికి మౌనంగా ఉండిపోయింది..

ఆకాష్ చేసుకోబోయే రోషిణీ దేశ్పాండే ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన అజిత్ దేశ్పాండే గారి ఒక్కగానొక్క ముద్దుల కూతురు.. ఆయన ముఖేష్ అంబానీగారి పలు వ్యాపార సంస్థలలో ముఖ్య వాటాదారుడు కూడా.. రాజకీయ పలుకుబడి ఉన్నవాడు.. పెళ్లయ్యాకా కూతురినీ అల్లుడినీ పైచదువులకు లండన్ పంపించి, ఆ తరువాత న్యూఢిల్లీ లో ఒక కార్పొరేట్ హాస్పటల్ కట్టించి కూతురికీ అల్లుడికీ గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయనకోరిక.. రోషిణీ ఆకాష్ ల డెస్టినేషన్ వెడ్డింగ్ జైపూర్లో అంగరంగవైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి..

కొడుకు వెడ్డింగ్ కార్డు సుమిత్రకు ఇస్తూ, మనసులో ఏమీ పెట్టుకోకుండా పెళ్లికి రావే, నీకోసం ఏర్పాట్లు చేయిస్తానంటే రానని నిక్కచ్చిగా చెప్పేస్తూ, " ఓహో ఇప్పుడు అర్ధమైంది మా మేఘ ను నీ కొడుక్కి ఎందుకుచేసుకోవడంలేదో, ఆస్తీ అంతస్తూ లేవనేగా" ? అంటూ నిష్టూరమాడింది.. నీరజ అసలు సంగతి చెప్పాలనుకున్న ప్రతీసారీ పుల్లవిరుపు మాటలంటూ తన మనసుని బాధ పెట్టే సుమిత్రకు తను వివరణ ఇచ్చినా సుమిత్ర అర్ధం చేసుకోదని, దానిమూలంగా సమస్యలు మరింత జటిలమౌతాయేమోనని భయపడేది.. పెళ్లికి మేఘ మాత్రమే వెళ్లింది.. వెళ్లకపోతే తనేదో బాధతో కుమిలిపోతున్నానని అనుకుంటారని, అదీగాక ఆకాష్ పదే పదే తన పెళ్లికి రాకపోతే ఊరుకోనని అనేసరికి తను ఒక్కర్తీ వెళ్లి వచ్చేసి నెల రోజులు మూడీగా అయిపోయింది.. ఆ తరువాత ఆకాష్ పట్ల తన ప్రేమను తన మనసులోనే సమాధి చేసేసింది..

మేఘకు వెడ్డింగ్ గిఫ్ట్ గా డైమండ్ రింగ్ కొనాలనుకుని జ్యూయెలరీషాపుకు వెళ్లిన నీరజకు అక్కడ సుమిత్ర తారసపడింది.. నీరజను చూడగానే ముఖం తిప్పుకుంది.. తన షాపింగ్ అయిపోయినా సుమిత్ర షాపింగ్ అయ్యేవరకూ నిరీక్షించి, సుమిత్రను గట్టిగా పట్టుకుని బలనంతంగా పక్కనే ఉన్న కాఫీషాపుకు తీసుకువెళ్లింది..


ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.. నీరజే మాట్లాడింది ముందు.. " చూడు సుమీ మాట, మౌనం బొమ్మా బొరుసులాంటివి. రెండువైపులా పదునున్న కత్తివంటివవి. అహాన్ని పక్కన పెట్టేసి మాటలు కలుపుకొంటే, మన జీవనయాత్రా పథమంతా పూలపుంత అవుతుంది.. నేను ఎన్నోసార్లు నా మనసులోని మాటలను నీకు చెప్పాలని ప్రయత్నించినా, నేనంటే అసహనంగా, కోపంతే మండిపడే నిన్ను చూసి చెప్పడానికి జంకేదాన్ని.. అసలు నేను చెపుతున్న మాటలు నమ్ముతావో లేదోనన్న సంధిగ్ధత.. ఎన్నాళ్లిలా దాగుడుమూతలు ?

బంగారు బొమ్మలాంటి మేఘకు ఏదో అంతకు తగ్గ బొంత కుదిరిందంటావా? ఆ అంతకతగ్గ బొంతగాడెవరో నాకు తెలీదనుకోకు..

వాడికి ఏ అమ్మాయి నచ్చకపోతుంటే " ఓరి వెధవాయీ, మేఘ అనే బంగారు బొమ్మను ఒకసారి చూడంటూ వాడిని నేనే పంపాను.. అర్ధం అవలేదుకదూ సుమీ? మేఘకు కాబోయే భర్త మా పెదనాన్న కూతురి కొడుకు.. అంటే మా చెల్లెలి కొడుకు ప్రదీప్.. ఐఐటీ లో టాపర్, ఆతరువాత యూఎస్ లో ఎమ్ ఎస్ చేసి అక్కడే అమెజాన్ లో పని చేస్తున్న వాడికి మేఘ గురించి చెప్పాను.. మా చెల్లెలికి నీ ఫోన్ నంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమన్నాను.. ఆకాష్ పెళ్లప్పుడు మా చెల్లెలు సుధ, దాని భర్తా అమెరికాలో ప్రదీప్ దగ్గర ఉన్నందువలన పెళ్లికి రాలేకపోయారు.. మా సుమిత్రను నేనే సర్ ప్రైజ్ చేస్తానని మేఘ గురించి నేనే చెప్పానన్న విషయం నీకు చెప్పద్దని మా సుధ నుండి మాట తీసుకున్నాను.. మేఘ లాంటి బంగారు తల్లి ఎందుకు నచ్చదు ఎవరికైనా ? మేఘను చూసి ఎగిరి గంతేసాడు మా ప్రదీప్. పెళ్లి కుదిరింది..


నేనే కుదిర్చానని ఏదో గొప్పగా నీకు చెప్పాలని కాదు సుమిత్రా ! మేఘ నా ఇంటి కోడలు కాలేకపోయిందని చాలా బాధపడ్డాను.. ఆస్తీ అంతస్తూ కి ప్రలోభపడిపోయానని మాట్లాడావు.. ఆకాష్ తన ప్రేమ విషయం మాకు సడన్ గా చెప్పాడు.. రోషిణీని చేసుకుంటే లండన్ పైచదువులకు వెళ్లగలను, అలాగే రోషిణి తండ్రి కట్టించి ఇచ్చే పెద్ద హాస్పటల్, హోదా వస్తాయంటూ ఇవన్నీ మీరు ఏర్పాటుచేయగలరా అంటూ సవాలు విసిరాడు.. వద్దురా , మన మేఘను చేసుకో, చక్కని పిల్ల, కష్టసుఖాలు తెలుసున్న అమ్మాయంటే, నాకు మేఘ కేవలం ఒక స్నేహితురాలు మాత్రమే, ఆమె మీద ఆ ఉద్దేశం లేదంటూ మామాట కాదన్నాడు..

ఏం చేయగలమే, పిల్లలను కంటాముకానీ వాళ్ల తలరాతలను కాదుగా . వాళ్ల ఇష్టాన్ని , భవిష్యత్ ను కాదనేహక్కు మనకు ఉందా చెప్పవే ? వాడి పెళ్లి బిలియనీర్ గారి అమ్మాయితో జరిగినందుకు నాకు ఒరిగేదేమిటే సుమిత్రా ? వాడు కోట్లకు పడగలెత్తే ఇంటికి అల్లుడయ్యాడని మాకు లేసమాత్రం సంతోషం కూడాలేదు.. వాడికీ మాకూ మధ్య దూరం పెరిగిపోయింది.. అదే ఆర్ధిక వ్యత్యాసం.. రోషిణీకి, ఆ అమ్మాయి తండ్రికి డాక్టర్ గా మా ఆకాష్ , వాడి తెలివితేటలూ నచ్చాయి కానీ వాడి తల్లితండ్రులమైన మేముకాదు. పక్కా వ్యాపరస్తులుకదా !

అర్ధమైందనుకుంటాను.. మేఘ ఆకాష్ కు భార్య కాలేకపోయినా మంచి మనసున్న ప్రదీప్ కు భార్య కాబోతోంది. ఒక విధంగా ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది.. అంతా మన మంచికే జరిగిందనుకుంటున్నాను..


ఇన్నాళ్లూ నా మనసులోనే కొట్టుమిట్టాడుతున్న నా ఆవేదనంతా నీతో చెప్పుకోవాలన్న నా తపనకు, చెప్పలేని నా నిస్సహాయతకు మధ్య ఉక్కిరిబిక్కిరయిపోతూ మౌనమంత్రం పాటిస్తూ వచ్చాను.. 'ఇంతేనా నా ప్రాణమైన సుమీ నన్ను అర్థం చేసుకుంది' అనుకుంటూ బాధపడని క్షణంలేదు. అవసరమైన సమయాల్లో నోరు విప్పకుండా మౌనమంత్రం పఠించడమూ అనర్థదాయకమే. ఎందుకంటే మన మధ్య దూరం ఇంకా ఇంకా పెరిగిపోతూ మొత్తానికి మన బంధమే శాశ్వతంగా తెగిపోతుంది.. అందుకే నిన్ను గట్టిగా కదలనీయకుండా పట్టేసుకుని ఇన్నాళ్లూ నా మనసులో కొండలా పేరుకుపోయిన నా వ్యధనంతా నీకు చెప్పేసాను.. ఇంక సుమిత్రగారు ఏ శిక్ష వేసినా భరిస్తా"నని తలవంచేసరికి , నీరజను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది సుమిత్ర..


"నీరూ, నీ ఇంటి కోడలుగా నీ ఇంట్లో మా మేఘ కాలుపెడుతుందని మురిసిపోయాను.. ఎప్పుడూ అదే ధ్యాస నాకు.. నా కోరిక తీరనందుకు నేనే అంతగా కృంగిపోతే, ఆకాష్ ని ఎంతగానో ప్రేమించిన మేఘ దుఖాన్ని చూస్తూ తట్టుకోలేకపోయాను.. తల్లిగా నీ కొడుక్కి ఆ మాత్రం నచ్చ చెప్పుకులేకపోయావా అని ఆవేశపడ్డాను.. కానీ నీ మాటల్లో ఎంతో నిజం ఉందే నీరూ ! పిల్లల ఇష్టాన్ని భవిష్యత్ ని కాదనే హక్కు తల్లి తండ్రులకు లేదనే మాట అక్షర సత్యం.. నీవేమిటో నీ మనస్సేమిటో నాకు తెలిసినా నీకు దగ్గరవడానికి నా అహం అడ్డొచ్చింది.. క్షమించవే, ఇన్నాళ్లు నిన్ను దూరంచేసుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నా"నంటూ నీరజను అల్లుకుపోయింది ప్రేమతో .

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.51 views0 comments

Comments


bottom of page