top of page

తోడబుట్టినవాడు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Thodabuttinavadu' Written By Yasoda Pulugurtha

రచన: యశోద పులుగుర్త

ఆడపిల్లకు పుట్టింటి వారి ఆదరణ... ముఖ్యంగా తోడబుట్టినవారు చూపే అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తన అక్క మీద తమ్ముడు చూపే ప్రేమను చాలా చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు


ఆరోజు ఆదివారం.. మూర్తి ఆఫీస్ కు శెలవు.. అతను యూనియన్ బేంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.. హాలులో ఈజీ ఛైర్ లో రిలాక్స్ గా వాలి న్యూస్ పేపర్ చదువుకుంటున్న మూర్తి కాలింగ్ బెల్ శబ్దానికి మెయిన్ డోర్ తెరవడానికి కాస్త బద్దకించాడు.. భార్య స్రవంతి వంటింట్లో హడావుడిగా ఉంది.. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నకొడుకు కార్తీక్, ఇంటర్ రెండవసంవత్సరం చదువుతున్న కూతురు అక్షర వారి గదుల్లో వారి క్లాస్ ఎసైన్ మెంట్స్ చేసుకోవడంతో బిజిగా ఉన్నమూలాన తనకే లేవక తప్పలేదు.. డోర్ తెరవగానే అక్క సుజాత, దాని రెండో కూతురు శైలజ నిలబడి ఉన్నారు..

అక్కను చూడగానే సంతోషం నిండిన స్వరంతో “రండి అక్కా లోపలకు, నీవు వస్తున్నట్లు నిన్న రాత్రి స్రవంతి చెప్పింది. బావగారూ, ఆదిత్య కూడా వస్తే బాగుండేదికదా” అంటూ వారిని లోపలకు ఆహ్వానించాడు..

“రమ్మనమన్నానురా మూర్తీ.. మీ బావగారికి బధ్దకం ఎక్కువ.. ఆదివారం వస్తే ఇంట్లోనే ఉండిపోతారు.. వారానికి వచ్చే ఒకే ఒక శెలవు రోజు హాయిగా ఇంట్లోనే గడపాలంటారు.. ఆదిత్య ఏదో ప్రాజక్ట్ రెండురోజుల్లో సబిమిట్ చేయాలట.. ఫైనల్ ఇయర్ కదా.. .. మరోసారి వస్తానని మామయ్యకు చెప్పమ్మా అన్నాడు.. ఇదిగో ఈ శైలూ రెండురోజుల నుండి మామయ్య ఇంటికి ఎప్పుడు వెడదామా, అక్షరతో కబుర్లు చెప్పుకోవాలని తెగ హడావుడి పడుతోంది.. మా అత్తగారిని ఈ పూటకు కాస్త వంట పని చూసుకోమని చెప్పి వచ్చాను.. నీకు తెలియనది ఏముంది మూర్తీ” అంది సుజాత

ఆమెను స్రవంతి “బాగున్నారా వదినా” అంటూ ఆప్యాయంగా పలకరించింది..

అక్క కూతురు వైపు చూస్తూ ' ఏం శైలూ, బాగా చదువుకుంటున్నావా’ అని అడిగే సరికి చదువుతున్నానని సమాధానమిస్తూ ' అక్షర కోసం లోపలికి వెళ్లిపోయింది..


అక్క కుటుంబం మియాపూర్ లో ఉంటారు.. బావగారు హైటెక్ సిటీ లో ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నారు.. అక్క పెద్ద కూతురికి వివాహం అయిపోయింది.. కూతురూ అల్లుడూ పూనే లో ఉంటారు.. తరువాత ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కొడుకు ఆదిత్య, బిబిఏ మొదటి సంవత్సరం చదువున్న అఖరిది శైలజ.. బావగారిది అంత పెద్ద ఉద్యోగం కాకపోయినా పిల్లలని కష్టపడి చదివిస్తున్నాడు.. ఒక అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నారు..

అక్క వచ్చినప్పుడల్లా సొంత ఇల్లు కట్టుకోలేకపోయామని చెబుతూ బాధపడ్తూనే ఉంటుంది.. ఇంకో నాలుగైదు సంవత్సరాలలో ‘మీ బావగారు రిటైర్ అయిపోతారురా మూర్తీ, ఒక టూ బెడ్ రూమ్ ఫ్లాట్ కూడా కొనుక్కోలేకపోయా’మని వాపోతూ ఉంటుంది. రిటైర్ మెంట్ తరువాత పెన్షన్ కూడా రాని ఉద్యోగం బావగారిది.. అక్కది పెద్ద సంసారం, బాధ్యతలు ఎక్కువ .. అక్క అత్తగారికి బావగారు ఒక్కరే కొడుకు మూలాన తరచుగా వచ్చి పోతుండే బావగారి ఇద్దరు అక్కలూ, చెల్లెలూ , బంధువులతో హడావుడిగా ఉంటుంది వారిల్లు ఎప్పుడూ..

మూర్తి తల్లితండ్రులిరువురూ సంవత్సరం వ్యత్యాసంలో కాలం చేసి దగ్గరగా ఎనిమిది సంవత్సాలు దాటిపోయింది.. తండ్రి హెచ్ ఎమ్ టీలో పని చేసి రిటైర్ అయ్యేనాటికి కూతురు సుజాతకు పెళ్లి జరిపించడం, అలాగే మూర్తి చదువు పూర్తిచేసుకుని బేంక్ లో ఉద్యోగం సంపాదించాడు.. ఇరవై అయిదు సంవత్సరాలనుండి మూర్తి బేంక్ లో పనిచేస్తున్నాడు.. బేంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లో ప్లాట్ కొనుక్కుని బేంక్ లోన్ తీసుకుని సదుపాయంగా ఉండే ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాడు.

ఆ కాలనీలో .. తండ్రి సర్వీస్ లో ఉండగా హెచ్ ఎమ్ టీ కి నాలుగైదు కిలోమీటర్లు దూరంలో చవకగా స్తలాలు అమ్ముతున్నారని తెలిసి ఒక రెండువందలమంది ఎంప్లాయీస్ అందరూ కలసి స్తలాలు కొనుక్కున్నారు అప్పట్లో.. భవిష్యత్ లో ఇళ్లు కట్టుకోవచ్చని.. మూర్తి తండ్రి కూడా ఒక అయిదువందలు గజాలు స్తలం కొన్నాడు.. అప్పట్లో ఆ స్తలం విలువ అయిదు వేలు మాత్రమే.. కానీ అయిదువేలకు తగ్గ ఉద్యోగాలు కావు వారివి ఆరోజుల్లో . ఆ స్తలం కొనడానికి భార్య నాలుగుపేటల చంద్రహారాన్ని తాకట్టుపెట్టి ఆ స్తలం కొన్నాడు.. చాలా కాలం ఆ స్తలాలు కొన్న చోట ఏమీ డెవలప్ మెంట్ లేక ఇల్లు కట్టుకునే స్తోమతు లేక ఆ స్తలాన్ని అలాగే వదిలేసాడు.. తండ్రి చనిపోయేముందు ఆ స్తలాన్ని మూర్తికి ఇచ్చేసాడు.. అప్పట్లో అడవిలా ఉండేది అక్కడంతా.. తరువాత కాలగమనంలో చుట్టుపక్కలంతా సడన్ గా డెవలప్ అవడం జరిగే సరికి మూర్తి చొరవ తీసుకుని కొంత డబ్బు ఖర్చు పెట్టి తన ప్లాట్ ను డెవలప్ చేసుకున్నాడు.. ఈ విషయంలో మూర్తి చాలా రకాలుగా కష్టపడ్డాడు.. ఇప్పుడు చుట్టుపక్కలంతా ఇళ్లూ, కార్యాలయాలూ వచ్చేసి దాని ధరకూడా అనూహ్యంగా పెరిగింది..

అక్క వచ్చినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో ఆ స్తలం గురించి ఆరాగా అడుగుతూ ఉంటుంది.. అక్కకు మంచి కట్నం ఇచ్చి ఉన్నంతంలో పెళ్లి బాగా చేసాడు నాన్న.. అమ్మ చనిపోయాకా అమ్మ బంగారం అంతా అక్కకే ఇచ్చేసాడు.. అక్క ఆ స్తలంలో భాగం కోసం ఆశపడుతోందేమోనన్ను అనుమానం కలుగుతూ ఉంటుంది మూర్తికి.. అమ్మా నాన్నా చనిపోయినా ఇంటి ఆడపడుచుగా చాలా ఆదరంగా చూస్తాడు అక్కని.. అడపాదడపా ఖర్చుకులకు ఉంచుకో అక్కా అంటూ కొంత డబ్బుని చేతిలో పెడుతూ ఉంటాడు.. అక్క పెద్ద కూతురు పెళ్లికి ఫంక్షన్ హాల్, భోజనాల ఖర్చు అంతా తనే భరించాడు.. తనకి అక్క అంటే ఎంతో ప్రేమ , జాలి ఉన్నాయి.. కానీ అక్కకే, తన ఇంటిని చూసినా తన పిల్లలను చూసినా ఒకలాంటి ఈర్ష్య.. వీడికేమీ, బేంక్ మేనేజర్ , మంచి ఆదాయం సొంత ఇల్లు ఉన్నాయనే భావనలో మాటల్లో ఒకలాంటి దెప్పుళ్లు మూర్తి గ్రహించకపోలేదు..

హాయిగా సాగిపోతున్న జీవితంలో చిన్న చిన్న అపశృతులన్నట్లుగా........

ఒకరోజు సాయంత్రం బేంక్ నుండి ఇంటికి బైక్ లో వస్తున్న మూర్తి రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ అత్యంత వేగంగా వచ్చి మూర్తి బైక్ ను గుద్దుకుంటూ పోయింది.. ఒళ్లు గగుర్పొడిచే సంఘటన.. మూర్తికి భయంకరమైన దెబ్బలు తగిలినా హెల్మట్ ఉన్న కారణంగా తలకి తీవ్ర గాయమేమీ అవలేదు . రెండుకాళ్లూ, కుడిచేతికీ బాగా దెబ్బలు తగిలాయి.. ఒక కాలికి మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.. ఆరునెలలవరకూ మంచం మీద నుండి లేచీ నడవలేక పోయాడు..

తమ్ముడికి జరిగిన ఘోర ప్రమాదానికి సుజాత వెక్కి వెక్కి ఏడ్చింది.. తమ్ముని పట్ల అపారమైన ప్రేమ పొంగి ప్రవహించింది.. తమ్ముడి అదృష్టాన్ని చూసి తను ఈర్ష్య పడినందుకే ఇలాగే జరిగిందా ? తన దిష్టే తమ్ముడికి తగలలేదుకదా అని ఏడ్చింది బాగా.. .

అప్పుడప్పుడు సూటీపోటీ మాటలు అన్నాకూడా తమ్ముడు గానీ, మరదలు గానీ తనని వీసమెత్తు మాట అనుకుండా ఎంతో అభిమానంగా చూసేవారు.. తమ్ముడు తనకి ఎంతగానో ఆర్ధికంగా సహాయపడ్డాడు.. తమ్ముడూ క్షమించరా అని మనసులో పదే పదే వేడుకుంది..

మూర్తి పూర్తిగా ఆరోగ్యం పుంజుకుని బేంక్ కు వెళ్లి వస్తున్నాడు.. ఒక ఆదివారం మూర్తిదంపతులు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నామని అక్క కుటుంబాన్ని రమ్మనమని పిలిచారు..

వ్రతం అదీ పూర్తి అయ్యాకా భోజనాలు చేసాకా అందరూ హాల్ లో కూర్చున్నారు.. మూర్తి, అక్కగారిని బావగారిని పక్క పక్కనే కూర్చోమని చెప్పి అక్కకు పట్టుచీర బావకు పట్టు పంచెలతో బాటూ ఒక దస్తావేజు పత్రాన్ని అక్కా బావల చేతికిచ్చాడు.. బట్టలు సరేరా మూర్తీ, ఈపత్రాలేమిటంటూ సుజాత తమ్ముడిని అడిగింది..


“అక్కా, ఇల్లు కట్టుకో లేకపోయామంటూ ఎప్పుడూ బాధ పడేదానివి..అవునా ?”

“నిజమేరా మూర్తీ ! అయితే ?”

నాన్నగారిచ్చిన అయిదు వందల గజాల ప్లాట్ ని సగం నాకుంచుకుని మిగతా సగం స్తలంలో మీరుండడానికి నివాసయోగ్యంగా రెండు బెడ్ రూమ్ లూ, హాలూ, కిచెన్ తో ఇల్లు కట్టించాను .. నా ఏక్సిడెంట్ ముందరే మొదలు పెట్టించాను.. కానీ ఇదిగో మధ్యలో పని ఆగిపోయి ఇప్పటకి పూర్తి అయింది .. ముందరే చెపితే వద్దంటావు కదా అక్కా, అందుకనే పూర్తి అయ్యాక చెప్పి నిన్ను సర్ ప్రైజ్ చేయాలనుకున్నాను. ఆ ఇల్లు నీ పేరుమీద రిజిష్ట్రేషన్ చేయిస్తాను.. వెంటనే మంచిరోజు చూసుకుని గృహప్రవేశం చేసుకుని దిగిపోండక్కా”.

“ఒరేయ్ మూర్తీ, ఏమిట్రా ఇదంతా ? నీవు ఇల్లు కట్టించి నా కివ్వడమేమిటిరా ?

నీ ప్రేమాభిమానాలు చాలురా నాకు” అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది సుజాత.

“అక్కా! నేను ఒక్కడినీ సంతోషంగా ఉంటే చాలా చెప్పు? నీవు కూడా ఆనందంగా కళకళ లాడుతుంటుంటే మేము మరింత బాగుంటాం అక్కా” అన్నాడు మూర్తి.

ఈ లోగా స్రవంతి కూడా “తీసుకోండి వదినా” అంటూ ఆప్యాయంగా సుజాత భుజం మీద చేయివేస్తూ, మీ తండ్రిగారిచ్చారని భావించండంటూ బ్రతిమాలింది..

చూడు మూర్తీ! నీవు మంచి మనసుతో నీ అక్కకు ఇల్లు కట్టించి ఇస్తున్నావు.. నీ మంచితనాన్ని స్వీకరించగలిగే అర్హతగానీ సంస్కారంగానీ నాకు లేవురా..”

“అక్కా! అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు.. నేను నీకు ఇస్తున్నది చాలా తక్కువ.. మా ఇంటి ఆడపడుచుగా నీకు మరింత ఆనందాన్ని పంచి పెట్టగలిగే శక్తి భగవంతుడు మాకు కల్పించాలని కోరుకుంటున్నాను.. మమ్మలని ఆశీర్వదించండి” అంటూ అక్కా బావగారి పాదాలకు దంపతులిరువురూ పాదాభివందనం చేసారు..

“ఏమోయ్ మూర్తీ, అడగకుండా నీవు మాకు ఇలా బహుమానాలు ఇచ్చేస్తుంటే తీసుకోడానికి చాలా మొహమాటంగా ఉందోయ్.. నా రిటైర్ మెంట్ అయ్యాక కొంత సొమ్ముని నీకు ఇచ్చేస్తాను.. కాదనకు మూర్తీ” అంటూ రాజశేఖర్ మూర్తి చేతులు పట్టుకుని అభిమానంగా అన్నాడు..

“బావగారూ, తిరిగి ఇవ్వడం ఏమిటి ? ఆ ఆలోచనను మానుకోండి.. మీ సొంత ఇంట్లో మీరు హాయిగా ఉండండి.. నా కివ్వాలనుకున్న డబ్బుని మీ పోస్ట్ రిటైర్ మెంట్ లైఫ్ కి ప్లాన్ చేసుకోం”డంటూ సున్నితంగా బావగారికి సమాధానమిచ్చాడు..

“ఒరేయ్ తమ్ముడూ, నీ హృదయ సంస్కారం చాలా గొప్పదిరా, నీలాంటి తమ్ముడున్నందుకు గర్వపడుతున్నా”నంటూ తమ్ముడిని దగ్గరకు తీసుకుంది సుజాత..

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

ఎవరికెవరు ఈలోకంలో

శతాక్షి


రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


236 views0 comments

Comments


bottom of page