top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

మకాం మార్చేయాలి


'Makam Marcheyali' New Telugu Story



(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

రమణారావు, సుజాతలకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.

దంపతులిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటు పిల్లలిద్దరిని చదివించుకుని, అమ్మాయికి పెళ్లిచేసి అమెరికాకి పంపించారు.

కారణం ఏమిటో తెలియదు కాని, కొడుక్కి అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా, ఇండియాని, తల్లిదండ్రుల ని వదిలి వెళ్లనని, తనకి తగిన మంచి ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రుల దగ్గరే వుండిపోయాడు. ఆ తండ్రికి కొడుకు, కూతురు అంటే చాలా ప్రేమ. అయితే బయటపడేవాడు కాదు. ఆ తల్లికి పిల్లలంటే ప్రాణం.

కొడుకు పెళ్లి జరిగినా కూడా తన తల్లిదండ్రులతోనే వుండేవాడు. కోడలు కూడా ఆ యింట్లో కలిసి పోయింది.

అక్కడ కూతురుకి కొడుకు పుట్టాడు. కొన్నాళ్ళు రమణారావు, సుజాత లు అమెరికా వెళ్లి కూతురు అల్లుడు దగ్గర వుండి మనవడి కి ఆరు నెలలు వచ్చే వరకు వుండి, ఇండియా తిరిగివచ్చారు. అయితే మనవడు అలవాటు అయిన రమణారావు కి బెంగ మొదలైంది. రోజూ మనవడి గురించి, వాడి నవ్వుల గురించి మాట్లాడుతు వుండేవాడు. పోనీ మళ్ళీ అమెరికా వెళ్దాం అనుకుంటే చేస్తున్న ఉద్యోగాలు అడ్డుగా వున్నాయి.

ఒకరోజు సుజాత భర్తకి ఫోన్ చేసి శుభవార్త చెప్పింది, మన యింట్లో కూడా మనవడో మనవరాలో పుడతారని. యింటికి వచ్చిన తల్లిదండ్రుల కి కొడుకు శ్రీధర్ సిగ్గుపడుతూ, “నాన్నా! మీరు మీ మనవడిని అమెరికాలో వదిలి వచ్చేసారని దిగులు పెట్టుకున్నారుగా, ఆ దిగులు త్వరలో తీరుతుంది. మమ్మల్ని దీవించండి” అని అన్నాడు.

రోజులు యిట్టే గడిచిపోయాయి. కోడలు పండంటి మనవరాలిని ఇచ్చింది. అదే సమయానికి అమెరికా నుంచి కూతురు, అల్లుడు, మనవడు కూడా వచ్చారు. ఇల్లంతా సందడి సందడిగా వుంది. రమణారావు మనవడిని ఒక పక్కన, మనవరాలిని ఒకపక్కనా పడుకోపెట్టుకుని తెగ సంతోషపడటం చూసి రమణారావు కూతురు, కొడుకు తెగ మురిసిపోయేవాళ్లు.

“నాన్నా! నువ్వు మమ్మల్ని మా చిన్నప్పుడు ఎలా పెంచావో తెలియదు కాని, యిప్పుడు నువ్వు మా పిల్లలతో యింత సంతోషంగా వుండటం బట్టి మమ్మల్ని కూడా అంతా ప్రేమగానే పెంచావని తెలుస్తోంది” అంది రమణారావు కూతురు.

సెలవు అయిపోవడం తో కూతురు అల్లుడు మనవడిని తీసుకుని తిరిగి అమెరికా వెళ్లిపోతో వుంటే రమణారావు మనవడిని వదలలేక వాళ్ళతో అమెరికా వెళ్ళిపోదామాని అనుకున్నాడు, అయితే యిక్కడ మానవరాలి బోసినవ్వులకి లొంగిపోయి, ఇంతే జీవితం అనుకుని సరిపెట్టుకున్నాడు.

ఈ విషయం లో సుజాత మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. నిమిత్త మాత్రం గా వుండేది. తను రామాయణం పుస్తకం చదువు కుంటున్నప్పుడు ఎవ్వరు మాట్లాడించినా విసుగుకునే సుజాత అమెరికా నుంచి ఫోన్ రాగానే పుస్తకం పక్కన పెట్టి పరుగున వచ్చేది మనవడిని చూడాటానికి.

అక్క కొడుకు అంటే ఇండియా లో వున్న తమ్ముడికి, తమ్ముడి కూతురు అంటే అమెరికాలో వున్న అక్కగారికి విపరీతమైన ప్రేమ.

రోజులు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కొన్నిరోజులు గడిపి వెళ్ళేటప్పుడు విచారంగా వెళ్ళాడం, పిల్లలు దగ్గరనుండి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు విచారంగా రావడం జరుగుతోంది.

రమణారావు, సుజాతలు ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయారు. ఇంతలో కొడుకు శ్రీధర్ కి ముంబైయ్ లో మంచి ఉద్యోగం రావడం తో భార్య ని, కూతుర్ని తల్లిదండ్రుల దగ్గర వదిలి తను ముందుగా ముంబై వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నాడు.

“అబ్బాయి, సొంత ఇల్లు, వున్న ఉద్యోగం వదిలి యిప్పుడు అంత దూరం వెళ్లడం ఎందుకు?” అని అన్న తండ్రికి ముంబైలో జాబ్ పెద్దది అని, దానిలో మంచి భవిష్యత్ వుంటుంది అని చెప్పి, తండ్రి ని ఒప్పించి ముంబై వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తరువాత అక్కడే మంచి ఇల్లు తీసుకుని, తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, “నాన్నా మనం అందరం ముంబై వెళ్ళిపోదాం, యిక్కడ ఇల్లు అద్దెకు యిచ్చి” అన్నాడు.

కొడుకు మాటలకి, “చూడు, నీకు ఫ్యూచర్ అంతా ముందే వుంది అని అంత దూరం వెళ్ళిపోయావు. ఏ ఫ్యూచర్ లేని మేము ఈ ఊరు వదిలి రాలేము. నలభై సంవత్సరాలనుండి ఇక్కడే వున్నాము. అప్పుడప్పుడు మేము ముంబై వచ్చి రెండు నెలలు నీతో వుంటాము. నువ్వు సంతోషం గా నీ భార్య పిల్లలని తీసుకుని వెళ్ళు. మాకు యింకా ఒంట్లో ఓపిక వుంది. ఓపిక లేనినాడు నీ దగ్గరికి ఎలాగో రాక తప్పదు” అన్నాడు.

“సరే మీ యిష్టం. మీరు ఎప్పుడు వచ్చేద్దాము అనుకున్నా అప్పుడు నాకు తెలియచేయండి. నేను వచ్చి సామాన్లు ఒక గదిలో పడేసి, ఇల్లు అద్దెకు యిచ్చి వెళ్ళిపోదాం” అని చెప్పి వెళ్లిపోయారు.

భార్య తో చివరికి “మళ్ళీ మనమిద్దరమే మిగిలాము, ఏమిటో ఈ జీవితం.. పిల్లలు తమ భవిష్యత్ వెతుకుంటూ వెళ్లిపోవడం, ముసలి తల్లిదండ్రుల మిగిలిపోవడం.. నాకు పెన్షన్ రాకపోతే, మనం కూడా వాళ్ళతోనే వెళ్లిపోయే వాళ్ళం. మన మిద్దరం మన డబ్బుతో బ్రతకగలం అనే ధీమా తో పిల్లలని వదిలి ఉండిపోయాము” అని బాధ పడుతున్న రమణారావుని ఓదార్చింది సుజాత.

రెండేళ్లు బాగానే జరిగింది. ఒకరోజు ఉదయం లేస్తో సుజాత విపరీతంగా కడుపునొప్పి అని చెప్పటం తో అక్కడకి దగ్గరలోనే వున్న హాస్పిటల్ లేడీ డాక్టర్ కి చూపించాడు రమణారావు.చిన్న ఆపరేషన్ అర్జెంటుగా చేయాలి, హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలి అని చెప్పడంతో, కొడుకు కి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

“మీరు కంగారు పడకండి, డాక్టర్ గారు చెప్పినట్టు అడ్మిట్ చేయండి, మేము రెండు గంటలలో మీ దగ్గర వుంటాము” అని చెప్పాడు తండ్రికి శ్రీధర్.

హాస్పిటల్ వాళ్ళు అడిగిన డబ్బు కట్టి భార్యని అడ్మిట్ చేసాడు. విచిత్రం.. తను యింత కంగారు పడుతున్నా, సుజాత ఏమాత్రం కంగారు పడకుండా బేడ్ మీద పడుకుని, “యిప్పుడు పిల్లాడిని కంగారు పెట్టి ఎందుకు పిలిచారు? చేతిలో డబ్బు చూసుకోవాలి, ఆఫీసులో సెలవు దొరకాలి” అంది.

దీనినే తల్లి హృదయం అంటారేమో! నెలకి రెండు లక్షలు సంపాదించుకునే కొడుకు దగ్గర డబ్బు వుందో లేదో అని, ముప్పై వేలు పెన్షన్ వచ్చే భర్త మాత్రం డబ్బు వున్నవాడు అని అనుకోవడం..

డాక్టర్ గారు వచ్చి “సాయంత్రం ఆపరేషన్ చేస్తాము, భయపడకండి, రెండు రోజులు హాస్పిటల్ వుంటే చాలు” అంది.

అన్నట్టుగానే పన్నెండు గంటలకల్లా విమానం లో బయలుదేరి, కొడుకు, కోడలు, మనవరాలు వచ్చేసారు హాస్పిటల్ కి.

“మామయ్యగారూ! అత్తయ్య దగ్గర నేను వుంటాను. మీరందరూ యింటికి వెళ్లి భోజనం చేసుకుని రండి” అంది కోడలు.

రమణారావుకి షుగర్ కూడా పడిపోతున్నట్టు అనిపించి, సరే అని, కొడుకు, మనవరాలి తో ఇంటికి బయలుదేరాడు.

ఆపరేషన్ అయ్యింది. మూడు రోజులు వుంచుకుని డిశ్చార్జ్ చేసారు. ఒక పదిహేను రోజులు కదలకుండా విశ్రాంతి తీసుకుంటే చాలు అని రెండు లక్షల బిల్లు వేశారు. రమణారావు జేబులోనుంచి కార్డు తీసి ఇవ్వబోతోవుంటే, ‘వుండండి డాడీ.. నేను యిస్తాను’ అని శ్రీధర్ డబ్బు కట్టేసి తల్లిదండ్రులని ఇంటికి తీసుకుని వచ్చాడు. వీళ్ళు వచ్చే లోపుగా కోడలు అత్తగారి మంచం సర్ది, అన్నీ అందుబాటులో వుండే విధంగా సిద్ధం చేసి వుంచింది.

నాలుగు రోజులతరువాత, కొడుకు వచ్చి, “నాన్నా! నాకు సెలవు లేదు, ఆఫీస్ కి వెళ్ళాలి. మీ కోడలు, మనవరాలు యిక్కడ వుంటారు, అమ్మకి తగ్గే వరకు. నేను రేపు బయలుదేరి వెళ్తాను” అన్నాడు.

“వద్దు రా, వాళ్ళని యిక్కడ వదిలేస్తే నీకు అక్కడ భోజనం యిబ్బంది అవుతుంది, నేను అమ్మని చూసుకోగలను. వంట వచ్చు కాబట్టి యిబ్బంది లేదు” అన్నాడు రమణారావు.

“సరే అయితే.. యింకో పదిరోజులు తరువాత మళ్ళీ వస్తాము. ఈలోపు మీకు యిబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. తనని వెంటనే పంపుతాను” అన్నాడు. తల్లికి కూడా విషయం చెప్పి, “తెల్లారే లేచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, యిహ పడుకుంటాం” అని వాళ్ల గదిలోకి వెళ్లిపోయారు.

బెడ్ లైట్ వేసి తనుకూడా భార్య పక్కన నడుము వాల్చాడు రమణారావు. మాగన్నుగా నిద్ర పడుతోవుంటే, ‘తాతా..’ అంటూ మనవరాలు వచ్చింది. ‘యింకా మెలుకువగా వున్నావా, దా.. నా దగ్గర పడుకో’ అని కొద్దిగా జరిగి మనవరాలు ని పక్కన పడుకోపెట్టుకున్నాడు.

“తాతా! నాన్న ఏడుస్తున్నాడు, బామ్మని, నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నాందుకు. ‘డబ్బే జీవితం అనుకుని తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి పోవాలిసివస్తోంది. పోనీ తాతయ్య ని బామ్మని రమ్మంటే, మాకు అక్కడ తోచదు అని యిక్కడ వుండిపోయారు’ అని అమ్మతో చెప్పి ఫీల్ అవుతున్నాడు” అంది మనవరాలు.

ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు రమణారావు. ‘అవును.. అసలు కన్న కొడుకు ని వదిలి మేమిద్దరం యిక్కడ ఎవరికోసం వున్నాము? మా వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు వుండి, ఒకరిని ఒకరు నెలలతరబడి చూసుకోవడం లేదు. ఫోన్ లో మాట్లాడుకునేదానికి, పిల్లలని వదిలి యిలా ఒంటరిగా ఎందుకు వుండాలి. 70 సంవత్సరాలు వచ్చాయి, ఎన్నాళ్లు ఉంటామో తెలియదు. వున్నన్నాళ్ళు కొడుకు తో ఉంటూ చివరి రోజులు వాళ్ళని చూసుకుంటో కాలం గడపక ఈ ఆజ్ఞతవాసం ఎందుకు. రండి డాడీ అని ప్రాధేయ పడే కొడుకు, కోడలు ఈ కాలం లో ఎంతమంది కి దొరుకుతారు’ అనుకుని, మనవరాలు తో చెప్పాడు, ‘మీ నాన్నని పిలుచుకుని రా’ అని.

“తాతా! నేను నీకు చెప్పాను అని నాన్న నన్ను తిడతాడు” అంది మనవరాలు.

“తాతయ్య పిలుస్తున్నాడని చెప్పు, ఏమనడు వెళ్ళు” అన్నాడు.

కంగారు గా “ఎందుకు పిలిచారు డాడీ?” అంటూ వచ్చిన కొడుకుని చూసి, “ఏమిలేదు. యిలా నా కాళ్ల మీద కూర్చో, నొప్పులుగా వున్నాయి” అన్నాడు రమణారావు.

“నా బరువుకి కాళ్ళు విరిగిపోతాయి, మీరు యింకా నన్ను చిన్నపిల్లాడు అనుకుంటే ఎలా, నొక్కుతాను, కళ్ళు మూసుకొని పడుకోండి” అన్నాడు.

“లేదు, కూర్చో! కొడుకు ఏ తండ్రికి బరువు కాదు. అలాగే తండ్రి కూడా..” అన్నాడు.

“ఏదైనా కొత్త కథ రాస్తున్నారా?” అంటూ మెల్లిగా తండ్రి కాళ్ళ మీద కూర్చున్నాడు శ్రీధర్.

కొడుకు చెయ్యి పట్టుకుని, “అబ్బాయీ! రెండు మూడు నెలలలో ఈ యిల్లు అద్దెకు యిచ్చేసి, నీ దగ్గరికి పర్మనెంట్ గా వచ్చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. యిక్కడ నుంచి ఈ సామాను, అవి ముంబై పంపించే ఏర్పాటు నీకు వీలున్నప్పుడు మొదలుపెట్టు” అన్నాడు.

“నిజమా!” అన్నాడు.

“అవును, నిజమే” అన్నాడు కొడుకు మోహంలో ఆనందం చూస్తో.

శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













52 views0 comments

Comentarios


bottom of page