top of page

మనమే ముఖ్యం


'Maname Mukhyam' New Telugu Story

Written By Jidigunta Srinivasa Rao

'మనమే ముఖ్యం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“రండి రండి.. మీకోసమే ఎదురుచూస్తున్నాము” అన్నాడు తన కూతురి మామగారికి అంటే తన వియ్యంకుడికి ఎదురు వెళ్తూ విశ్వం గారు. “అదేమిటి? మేము వస్తున్నట్టు మీకు ముందుగానే తెలిసిందా, ఎదురు చూస్తున్నాము అంటున్నారు” అన్నాడు రంగనాథం గారు. “లేదు తాతయ్యా , ఉదయం మా చెట్టు మీద కాకి ఒక్కటే కావ్ కావ్ అని అరుస్తోవుంటే మా బామ్మ, ఈ పాడు కాకి యిలా అరుస్తోంది, ఎవ్వరు వస్తారో ఏమిటో అంది” అన్నాడు విశ్వం గారి మనవడు. ఆ పిల్లాడి మాటలకి మొహం మాడిన రంగనాథం గారు, “ఏ టాక్సీ.. వుండు వెళ్లిపోకు, స్టేషన్ కి పోదాం” అన్నాడు. “పిల్లాడి మాటలని పట్టించుకోకండి బావగారు, మీ చెల్లెలు అన్నది మీ గురించి కాదు, మీరు మాకు వి ఐ పి” అన్నాడు రంగనాథం గారి చేతిలో పెట్టె తీసుకుని. ‘బాల వాక్కు బ్రమ్మ వాక్కు అంటారు కదా.. అందుకే నా గురించే అని అనుమానం వచ్చింది. మీకు తెలుసుగా.. కోర్టులో కేసు హియరింగ్ వుంది అని ప్లీడర్ గారు చెప్పటం తో వెంటనే బయలుదేరి వచ్చాను” అన్నాడు లోపలికి వచ్చి. బయట జరిగిన విషయం తెలియక జానకమ్మ గారు నవ్వుతూ బయటకి వచ్చి, “బాగున్నారా అన్నయ్య గారు, వదినగారిని కూడా తీసుకుని రావలిసింది” అంది. ‘చాల్లేవమ్మా, పొద్దున్న ఎవరు తగలడుతున్నారో అని అన్న నోటితో ఎలా వదినగారిని కూడా తీసుకుని రావలిసింది అని అడుగుతున్నావు’ అని అనుకున్నాడు మనసులో రంగనాథం. “మీకు కోర్టు కేసులు వున్నాయి అని మా అమ్మాయి ఎప్పుడు అనలేదు బావగారు” అంటూ కాఫీ కప్ చేతికి యిచ్చి, “మా అమ్మాయి అని కాదుకాని మీ కోడలు అత్తయింటి గుట్టు బాగా కాపాడుతుంది” అంది వెర్రిబాగుల జానకమ్మ . ఆమెకి ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో తెలియదు. నోటికి వచ్చింది వాగడమే. “మీ అమ్మాయి చెప్పకపోయినా, మా వెధవ, మామగారికి అంటే మీకు చెప్పకుండా ఉండడు కదా” అన్నాడు రంగనాథం. విషయం దారితప్పుతోంది అని గ్రహించి, విశ్వం గారి కొడుకు సుబ్బు, “మామయ్యగారు.. ఈ రోజు రాత్రి సెకండ్ షో కి మంచి మనసులు సినిమా కి వెళ్దాం” అన్నాడు. “ముందు ఆ టైముకి నాలుగు మెతుకులు మా చెల్లెలు వండి పెడితే అలాగే వెళ్దాం. ఏమిటో యిక్కడే అతుక్కు పోయారు వంటగదిలోకి వెళ్లకుండా” అన్నాడు జానకమ్మ ని చూస్తో. “భలే గుర్తు చేసారు అన్నగారు, ఈ మధ్య రాత్రి పూట మీ బావగారే వంట చేస్తున్నారు, అందుకే మర్చిపోయాను. పరవాలేదు.. ఈ పూట నేనే చేస్తాలెండి” అంటూ వంటగదిలోకి నడిచింది. వేడి వేడి పెసరట్లు తిని, సుబ్బు, రంగనాథం సినిమాకి బయలుదేరారు. “నన్ను కూడా రమ్మంటే వస్తాను” అన్నాడు విశ్వం. “ముగ్గురు వెళ్తే టికెట్స్ దొరకవు, మీరు హాయిగా పడుకోండి” అన్నాడు రంగనాథం ముందుకి కదులుతూ. పాత సినిమా అవడంతో జనం ఎక్కువ లేరు. హల్ దగ్గరికి చేరుకోగానే రంగనాథం ఫోన్ లో మాట్లాడుతో వున్నాడు. ‘టికెట్స్ తీసుకోవలిసి వస్తుంది అని బాగానే ప్లాన్ చేసాడు మామయ్య’ అనుకుని, సుబ్బు వెళ్లి రెండు టికెట్స్ తీసుకుని, ‘టికెట్స్ తీసేసుకున్నా మామయ్యగారు, యిహ ఫోన్ జేబులో పెట్టేసుకోండి’ అన్నాడు. “నువ్వు ఎందుకు తీసుకున్నావోయ్, చిన్న పిల్లాడివి, వెధవది హోటల్ లో బిల్లు యిచ్చే సమయానికి కూడా యిలాగే ఎవ్వరో ఒకరు ఫోన్ చేసి నిలబెట్టేస్తారు” అన్నాడు రంగనాథం. “ఎవ్వరిస్తే ఏముంది మామయ్యగారు, కావాలంటే విశ్రాంతి టైములో కూల్ డ్రింక్స్ మీరు కొనండి. దానికేముంది?” అన్నాడు సుబ్బు. ‘ఆ తండ్రికి తగ్గ కొడుకే, కూల్ డ్రింక్స్ కి పెట్టాడు’ అనుకున్నాడు రంగనాథం. సినిమా రసపట్టు లో వుండగా విశ్రాంతి యిచ్చారు. సుబ్బు కూల్ డ్రింక్స్ వైపు వెళ్తో వుంటే, “సుబ్బూ! నాకు ఫ్రూటీ తీసుకో, రెస్ట్ రూంకి వెళ్లి వస్తాను” అని వెళ్లిన రంగనాథం సుబ్బు డబ్బులిచ్చి కూల్ డ్రింక్స్ తో బయటకి వచ్చినప్పుడు, మెల్లగా రెస్ట్ రూమ్ నుంచి బయటకి వచ్చి, “షాప్ అతనికి ఎంత యివ్వాలి?” అన్నాడు జేబులో నుంచి పర్సు తీసి. “వందరూపాయలు మామయ్యా, ఏ బాబూ.. సార్ దగ్గర కూల్ డ్రింక్స్ డబ్బులు తీసుకో” అని అరిచాడు సుబ్బు. ‘చిక్కాను’ అనుకుంటూ వెళ్లి వందరూపాయలు యిచ్చి, సుబ్బు పక్కన కూర్చుని, “నువ్వు యిచ్చేసావనుకున్నాను, సరిగ్గా గుర్తుకు తెచ్చుకో.. నువ్వు ఇవ్వలేదుగా” అని ఆడిగాడు నాగభూషణం లా. “మీరు యిస్తానన్న తరువాత నేను ఎలా యిస్తా మామయ్యా, మా నాన్న నాకు చెప్పింది అదే, పెద్దవాళ్ళ మాటకు ఎదురు చెప్పకు” అని అన్నాడు సుబ్బు. సినిమా అయిన తరువాత యింటికి వస్తో, “మామయ్యగారూ! మీరు ఏదో కోర్ట్ పని మీద వచ్చాను అన్నారు, అది ఏమిటో చెప్పితే నేను చేయగలిగిన సహాయం చేస్తాను” అన్నాడు. “ఎంతైనా మీ నాన్న కంటే నువ్వే మర్యాద తెలిసినవాడివి, నీకు సుబ్బు అని పేరు పెట్టడంతోనే, మీ నాన్న అంబాసిడర్ కారు యుగం లో భావాలు వున్నవాడు అనిపిస్తుంది” అన్నాడు రంగనాథం. “లేదు మామయ్యగారూ! నా పేరు సాయిరాం సుబ్రహ్మణ్యం. నేను పుట్టిన తరువాత నాన్న జడ్జి అయ్యారు, అందుకే నన్ను ప్రేమతో సుబ్బు అని పిలుస్తారు” అన్నాడు. “ఏమిటీ.. మీ నాన్నగారు జడ్జిగా రిటైర్ అయ్యారా, మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ లో చేసి రిటైర్ అయ్యాను అంటే, ఏదో గుమాస్తాగా చేసి వుంటారు అనుకున్నాను. ఆలా ఎలా వుంటున్నారయ్యా! చిన్న ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా , పెద్ద ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను అని గొప్పలు చెప్పుకునే కాలం లో ఎంత అణుకువ మీ నాన్నగారికి” అన్నాడు రంగనాథం. “మా తాతగారు తహసీల్దార్ ఉద్యోగం చేసి అక్కడ లంచాలు యివ్వటం పుచ్చుకోవడం నచ్చక, ఉద్యోగం మానేసి బ్యాంకు ఉద్యోగం లో చేరారు. తన పిల్లలకి తిండి లేకపోతే అడుక్కుని తిన్నా తప్పులేదు కానీ అవినీతి పనులు చేసి డబ్బులు సంపాదించకూడదు అన్నారు. నీకు భగవంతుడు ఆధికారం యిచ్చింది, యితరులకు సహాయం చేయడానికి, నిన్ను నువ్వు పొగుడుకోవడానికి కాదని చెప్పి, మా నాన్నని, బాబాయ్ ని ఆ విధంగా పెంచారు. అందుకే మా యింట్లో అందరం ఆడుతో పాడుతో ఆనందంగా వుంటాము” అన్నాడు. మాటలలోనే ఇల్లు వచ్చేసింది. తనకి యిచ్చిన గదిలోకి వెళ్తూ హాల్ లో సామాన్య వ్వక్తి లా పడుకుని వున్న విశ్వం గారిని చూసి, మనసులోనే నమస్కారం చేసుకుని పడుకున్నాడు రంగనాథం. ఉదయం లేచి పనులు పూర్తి చేసుకుని, “బావగారూ! అలా మా ప్లీడర్ గారి దగ్గర కి వెళ్లి వస్తాను. భోజనం బయట చేస్తాను. సాయంత్రం ట్రైన్ కి బయలుదేరి వెళ్ళాలి” అన్నాడు రంగనాథం. “అదేమిటి బావగారూ! భోజనం బయట తినడం ఏమిటి, ఎంత లేట్ అయినా మేము మీకోసం ఎదురు చూస్తాము. ప్లీడర్ గారి దగ్గర పని అవగానే ఫోన్ చేస్తే, మన సుబ్బు వచ్చి తీసుకొని వస్తాడు” అన్నాడు విశ్వం. “కోర్టులో పనులు అంత త్వరగా అవ్వవు కదా బావగారూ, మీరు భోజనం చేసేయండి, నేను ఆటో పట్టుకుని వచ్చేస్తాను” అని వెళ్ళిపోయాడు రంగనాథం. వియ్యంకుడికి రామరాజ్ పట్టు బట్టలు, వియ్యపురాలుకి పట్టు చీర, జాకెట్, కూతురు అల్లుడికి బట్టలు రెడీ చేసి పెట్టుకున్నారు విశ్వం దంపతులు. సాయంత్రం నాలుగు గంటలకు యింటికి వచ్చిన రంగనాథం కి వేడి వేడి పకోడీ, బందరు లడ్డు పెట్టి, కాఫీ యిచ్చింది జానకమ్మ. ఆరుగంటలకి “నన్ను స్టేషన్లో దింపుతావా సుబ్రహ్మణ్యం” అని అడిగాడు సుబ్బుని రంగనాథం గారు. “ఒక్కసారి ఆలా ఈ కుర్చీలో కూర్చోండి బావగారూ” అని బట్టల పాకెట్స్ రంగనాథం చేతిలో పెట్టి కాళ్లకు దణ్ణం పెట్టబోయారు విశ్వం దంపతులు. మధ్యలోనే విశ్వం గారి భుజం పట్టుకుని ఆపేసి, “మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటి బావగారూ” అన్నాడు రంగనాథం. “ఆడపిల్ల ని యిచ్చిన వాడిని, మీ కంటే వయసు లో చిన్నవాడిని. నన్ను మీరు దీవించడం తప్పుకాదు బావగారూ” అన్నాడు విశ్వం. “బావగారూ నిన్నటి వరకు నేను మగపిల్లవాడి తండ్రిని అనే గర్వం వుండేది, కానీ నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిని అని మర్చిపోయాను. రాత్రి సినిమా హలులో సుబ్బు మీ గురించి చెప్పినది విన్నతరువాత, నాకు జ్ఞానోదయం అయ్యింది. మనం ఒక అమ్మాయి ని కోడలుగా తెచ్చుకుందామని నిర్ణయం తీసుకున్న తరువాత, యిహ అందరం ఒక్కటే. మగ పిల్లాడి తండ్రి లేదు ఆడపిల్ల తండ్రి లేదు. అందరం ఒక్కటే. ఒకరికోసం ఒకరు వున్నామని అనుకోవాలి. భగవంతుడు ప్రతీ కుటుంబంలోను ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడిని యిచ్చినప్పుడే తల్లిదండ్రులకి ఒక వైపు గొప్ప అనుకునే లోపు కూతురు వైపు నుంచి మొట్టికాయలు పడతాయి అని బుద్ది వస్తుంది. మా తమ్ముడు అంటాడు.. నా పిల్లలకి పెళ్లిళ్లు కానంత వరకు మా అన్నయ్యా, వదినగారు, పిన్ని, బాబాయ్ నాకు కావలిసిన వాళ్లలో మొదటి వరసలో వుంటారు, నాకు వియ్యంకుడు వాళ్ళు వచ్చిన తరువాత వాళ్లే ముఖ్యం అనేవాడు. మాకు మీ యింటి లక్ష్మిదేవిని కోడలుగా పంపించి మీరే వున్నతం గా వున్నారు” అన్నాడు రంగనాథం. “మీరు , మా అమ్మయి, మనవడు సుబ్బు తో కలిసి సంక్రాంతి పండగకి ఒక వారం ముందు రండి, మా పల్లెకు వెళదాం” అని చెప్పి స్టేషన్ కి బయలుదేరాడు రంగనాథం. శుభం

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
39 views0 comments

Comentarios


bottom of page