top of page

మనసులో మిగిలిపోయిన ప్రశ్న


'Manasulo Migilipoyina Prasna' New Telugu Story Written By Singaraju Sreenivasa Rao


'మనసులో మిగిలిపోయిన ప్రశ్న' తెలుగు కథ


రచన: సింగరాజు శ్రీనివాస రావు


సరిహద్దు మీద పోరు రణరంగంగా మారింది. శత్రుదేశానికి దీటుగా భారతసైన్యం ఎదురొడ్డి నిలిచింది. ప్రతి ఒక్క సైనికుడు పోరాటయోధుడై వైరి జనాన్ని చీల్చి చెండాడుతున్నాడు. సలీం తన నలుగురు బృందాన్ని తీసుకుని పడమటి దిక్కుగా నడిచాడు. అక్కడికి శత్రుసేన బంకరు కనుచూపుమేరలో కనిపిస్తున్నది. తమ దగ్గరున్న ఆయుధాలతో ఆ బంకరును కూల్చడం పెద్ద కష్టమేమి కాదు. అదే లక్ష్యంగా కదులుతున్నారు ఆ బృందం. ఎలాగైనా ఆ బంకరును కూల్చగలిగితే శత్రువుల యొక్క దృష్టిని అటువైపు మరల్చవచ్చు. అప్పుడు తూర్పు వైపునుంచి మరొక బృందం మరో స్థావరాన్ని ఆక్రమించి శతృవులలో కొంత భయోత్పాతాన్ని సృష్టించవచ్చు. అటువంటి పథకరచన చేసి తమను ఇటువైపుకు పంపాడు కమాండరు జ్యోతిసింగ్. అందరిలోకి సీనియర్ అయిన సలీమును నాయకుడిగా చేసి, అతనికి తోడు ముగ్గురిని పంపాడు.


నేలమీద పాకుతూ శబ్దం చేయకుండా కూతవేటు దూరానికి చేరారు నలుగురు. అంతే ఒక్కసారిగా బాంబులతోను, తుపాకులతోను బంకరును పేల్చివేశారు. లోపల మందుగుండు సామగ్రి అధికంగా ఉన్నదేమో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ క్షణాలమీద మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి వీళ్ళున్న వైపుకు రాసాగాయి. అంతే వెనుతిరిగి తమ స్థావరాలవైపుకు పరుగు లంఘించుకున్నారు నలుగురు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఒక తుపాకిగుండు నేరుగా వచ్చి సలీం కటిభాగానికి పైన పొత్తికడుపులోకి దూసుకుపోయింది. అబ్బా అంటూ పడి పొర్లికింతలు పెడుతూ వంద అడుగుల దూరం ఆ గుట్టలను కొట్టుకుంటూ జారిపోయాడు. ఎవరు కాల్చారా అన్నదాన్ని ఆలోచించకుండా రక్తం కారుతున్న సలీమును చేతులమీద వేసుకుని మెరుపు వేగంతో పరుగెత్తుకుని వచ్చి తమ స్థావరానికి చేరి డాక్టరును పిలిపించి బుల్లెట్ తీయించి కట్టుకట్టించారు.


పూర్తి అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు సలీం.


"డాక్టర్.. సలీంకు ఎలా ఉన్నది?" అప్పుడే వచ్చిన కమాండర్ అడిగాడు.


"కండిషన్ చాలా క్రిటికల్ గా ఉన్నది. వెంటనే వాళ్ళ దేశానికి పంపి పెద్ద ఆసుపత్రిలో చేర్పించండి. ఇతనిది భారతదేశం కనుక ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించండి. కిడ్నీ నుంచి బుల్లెట్ దూసుకెళ్ళిన కారణంగా పరిస్ధితి తీవ్రంగా పరిణమించింది. ప్రత్యేక విమానంలో తరలించండి" చెప్పాడు డాక్టర్.


"ఓకె సర్. వీళ్ళ ఆపరేషను విజయవంతం కావడంతో శతృసైన్యం తమ దిశను మార్చుకుని వేగాన్ని తగ్గించింది. వాళ్ళు తిరిగి కోలుకునే లోపు సలీంను ఢిల్లీ తరలిస్తాను" అని డాక్టరుకు ధన్యవాదములు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కమాండర్.


********

ఇప్పటికి ఆసుపత్రిలో సలీంను చేర్చి పదిరోజులు దాటింది. కానీ ఎటువంటి పురోగతి అతని ఆరోగ్యంలో కనిపించలేదు. డాక్టర్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సలీంలో మార్పు తీసుకురాలేకపోయారు. అతని ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించసాగింది. మూత్రపిండం పూర్తిగా దెబ్బతినడం, బుల్లెట్ వేగానికి ఊపిరితిత్తులు శక్తిహీనం కావడంతో అతడిని రక్షించడం కత్తిమీద సాముగా మారింది డాక్టర్లకు. మరీ రెండు రోజుల నుంచి ఊపిరి కూడ సరిగా అందకపోవడంతో వెంటిలేటరు మీద ఉంచి, శ్వాస అందిస్తున్నారు డాక్టర్లు.


అక్బరుకు కంటిమీద కునుకులేదు పదిరోజుల నుంచి. తనకు వారసుడిగా తన కొడుకును మిలటరిలోకి పంపాడు అతను. తనకంటే మంచి ర్యాంకులో రాణిస్తూ చలాకీగా ఉండే కొడుకు ఈరోజు ఇలా అచేతనంగా మంచంమీద పడివుంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. అతనిలో ఒకటే వ్యథ, తన బిడ్డ బ్రతుకుతాడో, లేదోనని. పోనీ వేరే ఏదైనా మంచి ఆసుపత్రికి తీసుకెళితే బాగుంటుందని అతని ఆలోచన. కానీ అది చాలా పెద్ద తతంగం. ఆ విషయం అక్బరుకూ తెలుసు. అయినా ఇక్కడి కంటే మెరుగుగా ఉండే అవకాశాలు తక్కువ. అందుకే అ అల్లామీద భారంవేసి కొడుకు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా యని కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నాడు.

ఇంతలో కాంపౌండరు ఒకతను ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు వచ్చాడు. అంతే..


ఆదుర్దాగా లేచి "బాబు.. సలీంకు స్పృహ వచ్చిందా" ఎంతో ఆశగా అడిగాడు అక్బర్.


"కష్టంగా ఉంది భయ్యా. వెంటిలేటరు మీద ఉంచారు. ఏ క్షణమైనా ఏదైనా కావచ్చు" చెప్పాడతను.


నిరాశపడిపోయాడు. వెంటిలేటరు దాకా వస్తే మనిషి బ్రతకడం చాలా కష్టమని అక్బరుకు తెలుసు. అందుకే దిగులుపడి పోతున్నాడు. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అలాగే దిగాలుపడి కూర్చున్నాడు.


"నాన్నా! ఏమన్నారు డాక్టర్లు? " అంటూ వచ్చి తండ్రి భుజంమీద చెయ్యివేశాడు అక్బరు చిన్నకొడుకు కరీమ్.


అక్బరుకు నోటమాట రాలేదు. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. పరిస్థితి అర్థమయింది కరీమ్ కు. తండ్రిని భుజంతట్టి ఓదారుస్తున్నాడు. కానీ తండ్రి కన్నీటి ప్రవాహాన్ని ఆపలేకపోతున్నాడు.


*******

తన కొడుకు తనకు దక్కకుండా పోయాడని విలపించాడు అక్బర్. ధరణి తల్లి రక్షణకోసం తన ప్రాణాలనే పణంగా పెట్టి పోరాడి వీరమరణం పొందాడని మనసు తేలికపరుచుకున్నాడు. సకల భారతావని వేనోళ్ళ పొగిడింది. సలీం వంటి దేశభక్తుని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు కదలాలని, ఇంటికొక్క సిపాయి ఉదయించాలని మంత్రులు, రాజకీయ నాయకులు వీధి వీధికి ఉపన్యాసాలు పెట్టి, అక్బరును కూడ పిలిచి సన్మానాలు చేశారు. లాంఛనంగా కొంత సొమ్ము ఎక్స్ గ్రేషియాగా ప్రకటించి యథాప్రకారం చేతులు దులుపుకుంది ప్రభుత్వం.


కానీ కరీమ్ మనసు మాత్రం అన్న మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నది. సలీంకు మంచి వైద్యం అందించివుంటే బ్రతికేవాడని, అతని మనసు చెబుతున్నది. ఎప్పుడూ చదివే వార్తే అయినా, ఈ సందర్భంలో అతనిలో కొత్త ఆలోచనలకు బీజం పోసింది. దీనికి సమాధానం ఎవరు చెబుతారు. ఎవరూ చెప్పరని తెలుసు. కాదు చెప్పలేరని తెలుసు. అయినా అడగాలి. ఎప్పుడు? ఎక్కడ? అదే ఆలోచన అతడి మనసును తొలిచేస్తున్నది.


"కరీమ్. రేపు అమరావతిలో సలీం మరణానికి సంతాపంగా సభ జరుపుతున్నారట. మనలను కూడ ఆహ్వానించారు. నాకు వచ్చే ఓపికలేదు. నువ్వు వెళ్ళిరా" వచ్చి చెప్పాడు తండ్రి అక్బర్.


'వెళతాను. సమాధానం లేని ప్రశ్నే అయినా ప్రశ్నించడానికయినా వెళతాను' అనుకున్నాడు కరీమ్.


******


సంస్మరణ సభ ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. మంత్రులు అయిదారుగురు సభలో ప్రసంగించారు. సలీంను కన్నవారు అదృష్టవంతులని, అతను పుట్టిన గుంటూరు గడ్డ ధన్యమైనదని పొగిడారు. తమ ప్రభుత్వం సలీం చేసిన సేవలను గుర్తించి విజయవాడలో అరవై గదుల స్థలాన్ని వారి కుటుంబానికి ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. చివరిగా కరీమ్ వంతు వచ్చింది.


"వేదిక మీద ఆసీనులయి వున్న పెద్దలకు, విచ్చేసిన ప్రజానీకానికి నా నమస్కారములు. నా కుటుంబం వారసత్వంగా దేశసేవకోసం తరానికొకరిని మిలటరీలోకి పంపుతున్నాము. మా తాతగారి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. దానికి మేమెంతో గర్విస్తున్నాము. మాలాగే ఎన్నో కుటుంబాలు నిస్వార్థంగా దేశసేవలో తమవంతు పాలుపంచుకుంటున్నాయి. కానీ ఎందుకో సైనికుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయనిపిస్తున్నది. ఈ సందర్భంలో ప్రభుత్వాలకు నాదొక సూటిప్రశ్న.


"చిన్న చిన్నవ్యాధుల చికిత్సల కోసం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కాదని ప్రజాధనంతో మెరుగైన చికిత్స పేరుతో విదేశాలకు తరలిపోతారు ప్రజానాయకులు. కేవలం వారి పదవీకాలం అయిదు సంవత్సరాలు. వీరు ప్రజలకోసం సేవచేస్తున్నారని, అది వారికి మనమిచ్చే కనీస సదుపాయమని మీరనవచ్చు. దేశసరిహద్దులలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతూ సంవత్సరాల కాలాలు మంచుకొండల మధ్య గడుపుతూ దేశాన్ని రక్షించే సిపాయికి ఆర్మీ ఆసుపత్రులలో తప్ప విదేశాలకు వెళ్ళి చికిత్స చేయించుకునే అవకాశాలు లేవా? ఒక దేశభక్తుడు ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉండి కూడ, ప్రభుత్వపు అనుమతి లేక అర్ధాంతరంగా రాలిపోవలసినదేనా? రాజకీయనాయకునికి ఒక న్యాయం, దేశాన్ని రక్షించే సిపాయికి మరొక న్యాయమా? దయచేసి ఆలోచించండి.


ప్రజల రక్షణ కోసం నిలిచిన మనిషి, ప్రాణాపాయస్థితిలో ఉంటే, అతడి ప్రాణం నిలపడానికి విదేశాలలో చికిత్స ప్రజాధనంతో చేస్తే అందులో తప్పేమిటి? ఏమో నా అన్నకు విదేశాలలో మెరుగైన వైద్యం అందిస్తే బ్రతికేవాడేమో? ఇది నా మనసులో మిగిలిపోయిన ప్రశ్న. బహుశా ఇది సమాధానం లేని ప్రశ్నే కావచ్చు. కానీ బాధితుడిగా నేను ప్రభుత్వాన్ని సంధించవలసిన ప్రశ్న. తప్పయితే మన్నించండి. కానీ సాధ్యాసాధ్యాలను పరిశీలించండి. సెలవు" మనసులోని మాటలను సూటిగా చెప్పి దిగిపోయాడు కరీమ్.


ఎందరి మనసులలోనో ప్రశ్నగా మిగిలిపోయిన ప్రశ్న పతాకశీర్షికగా పత్రికలకు ఎక్కింది.

అవును.. నిజమైన దేశభక్తులకు ఆ వసతి కల్పిస్తే ఏమవుతుందనే ప్రశ్న సగటు ప్రజానీకం మెదడులో మొలిచింది.


******** ******** *******


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


57 views0 comments

Kommentare


bottom of page