'Manthra Thanthrala Mayala Marati' New Telugu Story
Written By Nallabati Raghavendra Rao
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రైలు బోగీలో నుంచి అతి కష్టం మీద కిందకు దిగాడు చింతపిక్కల రామకుటుంబం. 90 ఏళ్ళకు దగ్గర పడుతున్నా.. గట్టిపిండం. తన కంచుకంఠం ఒక్కసారి నిమురుకున్నాడు.
సమయం సాయంత్రం ఆరు గంటలు దాటి ఏడు గంటలకు దగ్గర కాబోతుంది.. వెలుతురు, చీకటి కలగలిపిన దోబూచుల వాతావరణం!
సన్నగా జల్లు పడుతోంది. తన చంకలో ఉన్న కాకి రంగు గోతాంలాంటి సంచిలో నుండి.. దళసరి రగ్గులాంటి గుడ్డ పైకి తీశాడు. నెత్తిమీద నుండి కప్పి, ఎడంభుజం మీదనుండి చుట్టూ తిప్పాడు. రైలు పట్టాలకు అడ్డంగా దిగి.. అటు ఇటు పరికించి గబగబా నడుచుకుంటూ అవతల రోడ్డు కి వెళ్ళాడు.. తల పైకెత్తి చూసాడు.. దూరంగా నీలంరంగు మేడ.. అదే అదే.. అడ్రస్ సుఖంగానే దొరికినందుకు తనలో తానే.. 'ఇ హే హే' అని నవ్వుకున్నాడు.
అతికష్టంగా బురదలో నడుచుకుంటూ.. చిన్న గా దగ్గుకొంటూ.. నీలంరంగు మేడ సమీపించాడు.
అందమైన గేటు.. గేట్ కి అటుఇటు పొడవాటి అశోకవృక్షాలు.
"అమ్మాయీ.. అమ్మాయీ".. గట్టిగా పిలిచాడు. ఎవరూ తలుపు తీయకపోవడంతో దబదబా బాదాడు.
సత్యసుందరి తలుపు తీసింది.
"నేనమ్మా.. నన్ను 'చిరాకు' అంటారు.. సత్య నారాయణమూర్తి గారి ఇల్లు ఇదే కదమ్మా"
"అవునండి ఇదే.. కాళ్లు కడుక్కోండి. నాన్న గారు మీరు వస్తారని చెప్పారు..”అంది సత్యసుందరి.
"అమ్మానాన్న అర్జెంట్ పని మీద అమలాపురం వెళ్లారట కదా.. నాకు ఫోన్ చేసి.. కొన్ని విషయాలు చెప్పారులే. నీతో మాట్లాడి అన్ని విషయాలు నన్ను తెలుసుకోమన్నారు. తెలుసుకునేది ఏముందమ్మా.. మామూలు రామాయణమే, మామూలు భారతమే!" అంటూ తను కప్పుకున్న దళసరి రగ్గులాంటి గుడ్డ ను మడిచి తన గోతాం లో పెట్టాడు.
మాసినగడ్డం.. గారపళ్ళు.. పిచ్చుకగూడు లాంటి తల.. ఈ ఆకారంలో ఉన్న అతడిని చూడగానే ఏవగింపు కలిగింది సత్యసుందరికి. కొరియన్ సోఫా ఉన్నా, ప్లాస్టిక్కుర్చీ చూపించి కూర్చోమంది.
"వద్దమ్మా తల్లి.. పెద్ద వయసు కదా.. ఇలా నేల మీద కూర్చున్నాను అనుకో.. చాలా సుఖంగా ఉంటుంది. కాళ్ళు చాపుకోవచ్చు, కావలసినప్పుడు బాచీమఠం వేసుకోవచ్చు. అది కొరియన్ సోఫా లాగా ఉంది.. చాలా ఖరీదు ఉంటుందటమ్మా.. నువ్వు మాత్రం ఆ కొరియన్ సోఫాలో కూర్చో.. చిట్టితల్లీ.
"నీ పేరు సత్యసుందరి కదమ్మా.. ఎంత లక్షణంగా ఉన్నావు తల్లీ.. ముఖ్యంగా.. అందరిలా మధ్యపాపిడి కాకుండా ఎడమచెవి దగ్గర పాపిడి తీసావు చూడమ్మా.. అది నీ ముఖానికి చాలా అందం వచ్చింది రా..
నాకు ఎక్కడా ఈ స్టైలు కనబడలేదు.. !. సరే, నా గురించి ముందుగా రెండంటే రెండే రెండు ముక్కలుచెప్పి.. అసలు విషయానికి వస్తాను.. నా పేరు చింతపిక్కల రామకుటుంబం.. షార్ట్ కట్ లో అందరూ 'చిరాకు' అని పిలవడం మొదలు పెట్టారు.. ఇదేదో చాలా గమ్మత్తుగా వెరైటీగా ఉంటుందని నేను సర్దుకు పోతున్నాను.
ఇప్పుడు బ్రీఫ్ కేసులు వాడుతున్నారు గానీ చిట్టి తల్లీ.. ఈ గోతాం అంత సుఖం ఇంకేమీ లేదమ్మా. " అంటూ.. తన గోతాంలో నుంచి కొన్ని సర్టిఫికెట్లు, మరికొన్ని ఆల్బమ్స్ తీసి.. పైన పెట్టాడు.
"అమ్మాయి.. నువ్వు.. కాఫీ టీ మజ్జిగ ఏమీ ఇస్తానని అడగలేదు నన్ను.. అవసరం లేదమ్మా! నాకు అలాంటి మంచి అలవాట్లు లేవు.. ఎటొచ్చి చుట్టపీక మాత్రం
నా ఆరో ప్రాణం అంటే నమ్ము. అందులోనూ బంకచుట్ట అంటే మరీ చచ్చి పడతానమ్మా.. "
"ఏం తీసుకుంటారు?"
"అబ్బబ్బే వద్దురా.. వద్దురా. ఏదైనా తాగినా తిన్నా.. తిండి లేక ఇలా తిరుగుతున్నాడు అనుకుంటారు.. మీ అమ్మమ్మ ఉంది చూసావూ.. ఇదిగో ఈ స్టీల్డబ్బాలో నిమ్మకాయరసం కలిపి ఇస్తుంది.. ఆవిడ పిచ్చి.. నేను ఇంకా చాలా కాలం బ్రతకాలంట.. మనవాళ్ల కుటుంబాల్లో సమస్యలన్నీ పెద్దమనిషిగా పరిష్కరించాలంటే నేను కలకాలం బ్రతికి బట్ట కట్టాలట!.. ఎలా కుదురు తుందమ్మా.. ఎప్పుడు బకెట్టు తన్ని పడేస్తానో.. ఎవరికి తెలుసు?..
సరే ఇదంతా చిరాకు గోల నీకు ఎందుకు కానీ.. ఇప్పుడు చెప్పమ్మా.. వైజాగులో మీ అత్తగారి ఇంటి దగ్గర సంవత్సరం క్రితం అసలు.. అసలు ఏం జరిగింది.. ఏం జరగబట్టి నువ్వు వాళ్ల మీద కోపపడి రైలు బండి ఎక్కి ఒంటరిగా పుట్టింటికి వచ్చావు ?.. అంతలా రావలసిన భయంకర పరిస్థితి నాకు వివరంగా చెప్పమ్మా.. ఈ ముసలిముండా కొడుకు నీకేం ఉపకారం చేస్తాడు అని సందేహించకు తల్లి.. " 'చిరాకు' నేల మీద బాచీమఠం వేసుకుంటూ అన్నాడు.
"చాలాచాలా చెప్పాలి మీకు.. జరిగిన సంఘటనలు.. మరుపు రావడం లేదు. గుండెలోంచి తన్నుకొస్తు న్నాయి.. మనసు రగిలిపోతుంది. ఒకసారి ఏం జరిగిందంటే.. " ఉక్రోశం భళుక్కున కక్కబోయింది సత్య సుందరి.
"ఉండమ్మా.. పిచ్చిముండాకొడుకుని.. ఇవన్నీ నీకు చూపించలేదు కదా.. ఈ పని పూర్తిచేద్దాం. మన వాళ్లు అందరూ కలిపి మన తెలుగు రాష్ట్రాలు మొత్తం మీదా నాకు 49 సన్మానాలు చేశారు అమ్మాయి.. నీ సమస్య పరిష్కరించ గలిగాను అనుకో.. మీరు కూడా నాకు సన్మానం చేశారు అనుకో.. ఆహా.. అలాగని నేను సన్మా నాల పిచ్చివాడిని కాదు అమ్మాయి..
అలాగనిసమస్య పరిష్కరించినందుకు డబ్బులు తీసుకునే మదపిచ్చి నాకు అసలులేదు.. ఏదో చచ్చేలోపు కొంచెం మంచి పనులు చేద్దామని.. ఇప్పుడు.. చస్తే ఎవరూ రావడంలేదమ్మా.. కనీసం పెళ్ళాం కూడా ఏడవడం లేదు.. అలా కాదు అమ్మాయి నా గురించి 100 మంది రావాలి 100 మంది ఏడవాలి.. అదీ.. నా సంకల్పం.
నా నిర్ణయం 'తప్పు'.. అంటావా?మళ్లీ ఇంకో 'సోది'.. ఇదే నమ్మా నాతో వచ్చిన చిరాకు.. సరే ఈ ఆల్బమ్ చూడు.. పూలదండ లతో ఎలా మెరిసిపోతున్నానో.. ఈ సర్టిఫికెట్స్ చూడు.. నా గొప్పతనం నీకే తెలుస్తుంది. " అంటూ అవన్నీ చూపించి గోతాంలో పెట్టాడు చిరాకు.
"అమ్మాయి.. మీ అమ్మమ్మ అంటుంది.. నేను.. జాగ్రత్తగా ఉండాలి అంట.. !ఆవిడ పిచ్చి కాక పోతే.. నేను చచ్చేలోపు అన్ని అనుభవించేశాను అమ్మాయి.. ముగ్గురు కూతుళ్లకు ఘనంగా పెళ్లిళ్లు చేశాను.. ఇద్దరు కొడుకులు పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు.
"అన్నట్టు.. ఇప్పటి వరకు నేను డీల్ చేసిన వ్యవ హారాలు అన్ని.. అన్నీ సక్సెస్ తల్లి.. ఒక్కటంటే ఒక్కటి ఫెయిల్యూర్ అవ్వలేదు. నేను ఆస్తి తగాదాలు తీరుస్తాను.. సరిహద్దు తగాదాలు తీరుస్తాను.. యాక్సి డెంట్ సమస్యలు కూడా రాజీ చేసి పెడతాను..
ముఖ్యం గా భార్యభర్తల గొడవలు తీర్చడంలో.. అలాగే ఓల్మొత్తం.. కుటుంబ సమస్యలు కూడా తీర్చ డంలో ఎక్స్పర్ట్ నమ్మా.. ఇదిగో.. మనలో మనమాట నువ్వు ఎవరికైనా నా గురించి రికమండ్ చెయ్యొచ్చు తల్లి.. ఎలాగోలాగా చచ్చేలోపు సెంచరీ కొట్టాలి.. అనేది ఈ ముండా కొడుకు తాపత్రయం..
చూద్దాం".. 'చిరాకు' తన స్టీల్ డబ్బాలోని నిమ్మరసం కొంచెం తాగుతూ ఓరగా సత్యసుందరి వైపు చూస్తూ.. ఆగాడు. ఆమె ముఖంలో నుంచి అగ్గిమెరుపులు బయ టకు వస్తున్నట్టు గ్రహించాడు.
"కాస్త తమాయించుకుని ప్రశాంతంగా చెప్పు తల్లి.. ఆ.. ఇప్పుడు సావధానంగా చెప్పమ్మా.. అసలు వైజాగ్ లో.. మీఅత్తగారి ఇంటిదగ్గర.. ఏం జరిగింది ? మీ అత్తగారు ఎలాంటిది???" భృకుటి ముడిచి సత్యసుందరి వైపు.. చూస్తూ అడిగాడు 'చిరాకు. '
"మా అత్తగారు అస్సలు మంచిది కాదు.. ప్రతి దానికి.. " ఆవేశంగా ఆయాసంగా ఆతృతగా చెప్పుకు పోతుంది సత్యసుందరి.
"ఆగమ్మా ఆగాగు ఆగు ఆగు తల్లి.. ఇక్కడేనమ్మా కథ మొదలవుతుంది.. ఈ అత్తగార్లు ఉన్నారు చూశావు.. వీళ్ళు ఉత్తి చాదస్తపు అల్లరి పిడుగులమ్మా.. ఈ అత్తగార్ల సమస్యలు ఈనాటివి కాదమ్మా.
సతీసుమతి, సతీ సక్కుబాయి, సతీసులోచన, సతీ అరుంధతి.. వాళ్లు.. వాళ్లు పడ్డారు తల్లి.. అసలైన కర్మ !!
"ఈ అత్తగార్లు తాము పట్టిన కుందేటికి మూడు కాదమ్మా ఒకటే కాలు అంటారు.. మనం తల ఆడించాలి.. తందానతాన.. అనాలి.. తిమ్మినిబెమ్మిని చేస్తారు.. బెమ్మిని తిమ్మిని చేస్తారు.. మనం నోరు ఎత్తకూడదు.. మన వాళ్లందర్నీ 24 గంటలు తిడుతూ ఉండాలి.. వాళ్ల వాళ్ళు వెధవలు అయినా పొగుడుతూ ఉండాలి.. వాళ్ళు పాటించే మూఢనమ్మకాలు,
చాదస్తాలు మనమూ నేర్చుకుని.. చావాలి.. అలాగైతే కాపురం.. మహదానందంగా.. సాగిపోతుందమ్మా.. !!!
ఛీ.. ఛీ అలాంటి బ్రతుకు బ్రతికే కన్నా.. ఉరిపోసుకు చావడం మంచిది తల్లి.. కిరసనాయిలు పోసుకొని అంటించుకోవడం మంచిది తల్లి.. నిద్రమాత్రలు మింగి చావడం బెటర్.. రైలు చక్రాలక్రింద తల పెట్టుకుని చావడం చాలా చాలా ఉత్తమం.. ముసలి ముండా కొడుకుని ఇన్నిన్ని మాటలు అనేస్తున్నాను అని అనుకోకమ్మా.. నీలా అష్టకష్టాలు పడ్డ వాళ్ళు చెప్పిన డైలాగులు అన్నీ విన్న మీదట.. నాకు వాగుడు అలవాటై పోయింది తల్లి..
నాకు 'చిరాకు' అనే పేరు తీసేసి.. 'వాగుడుకాయ' అనే పేరు పెట్టిన సంతోషిస్తాను. పోతే పోయింది నిండు నూరేళ్లు బతుకు ఎవరు భరించగలరు అమ్మాయి ఈ విధానం..
"అత్తగారికి ఏదో హోదా ఇవ్వాలట.. అత్తగారికి హక్కులు ఉంటాయట.. మాయదారి ముదనష్టపు హక్కులు.. వయసు వచ్చాక ఓ మూలన 'కృష్ణా రామా ' అని పడి ఉండొచ్చుకదా.
ఏ.. పెత్తనం ఆవిడే తీసుకోవాలా? కోడలికి కాపురానికి వచ్చిన మర్నాడే తాళాలు ఇచ్చేసి పెత్తనం కూడా ఇవ్వొచ్చుకదా.. అలా ఇవ్వరు.
తమ ఆచారవ్యవహారాలు, పూజాపునస్కారాలు, పడికట్లు.. నా మొఖం.. నా శ్రాద్ధం.. అన్ని.. అత్తగారు చెప్పినట్టు కోడలు అలవాటు చేసుకోవాలట. ఏ.. కోడలు చెప్పినట్టు అత్త గారు అలవాటు చేసు కుంటే కొంపలు మునిగి పోతాయా ??? వీలు కుదరక పోతే కోడలు బట్టే అత్తగారు మారాలి. కోడలు చెప్పినట్లు చేతులు కట్టుకు వినాలి.. అలా నేర్చుకోవాలి.. అలా చేయరు.. ప్రపంచ యుద్ధం తీసుకొచ్చేస్తారు.
కూతురు కే కాదు కోడలికి కూడా.. ' గారం'.. ఇవ్వడం ఈ అత్తగార్లు నేర్చుకుంటేనే.. ఈ సమాజం బాగుపడుతుంది.. అంతవరకు ఇదిగో ఇలాగే ఏడుస్తుంది..
ఆవిడ అడుగులకు మడుగులొత్తాలట.. తల్లిలా అత్తగారిని ప్రేమించాలట.. గౌరవించాలట.. కాళ్ళకి దండం పెట్టాలట!!ఎందుకు పెడతారమ్మా.. కోడలు ఎందుకు పనికిరానిదా?అటున్న సూర్యుడు ఇటు పొడిచిన.. తల్లి అత్త అవ్వదు.. అత్త తల్లి అవ్వదు!!! వాళ్ళ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసినంత మాత్రాన.. అణిగి మణిగి.. తాబేలులా బ్రతకాలా???? వాళ్ళ అబ్బాయిని నీకు ఇవ్వకపోతే అసలు నీకు పెళ్లి కాదా అంట!!!! అక్కడినుంచి సంవ త్సరం క్రితం ఇక్క డకు వచ్చేసి.. చాలా మంచి పని చేసావమ్మా నువ్వు.. శభాష్.. !!
"ఇలా నీలా.. పుట్టింటికి వచ్చేయడము అనేది ఉంది చూసావూ.. ఇది.. నీలాంటి, కోడళ్ళు అందరికీ ఆదర్శ ప్రాయ మైన పనమ్మా.. సర్దుకుపోవడం.. శాంతంగా బ్రతకడం.. అత్త మామలను భర్తను రోజూ గౌరవిస్తూనే జీవిత మంతా గడిపేయడం.. ఎవరు చెప్పారమ్మా ఈ పిచ్చి విధానాలు.. అసలు మన పెద్దలు అందర్నీ లైనుగా నుంచోపెట్టి కొరడాతో చితక బాదాలమ్మా ఇలాంటి పిచ్చి విధానాలు ఏర్పాటు చేసినందుకు.. నేనైతే అసలు ఒప్పుకోను తల్లి.. ఇప్పటికైనా మించి పోయింది లేదు అక్కడికి వెళ్లి మీ అత్తగారికి ఇంత పచ్చగడ్డి పెడతాను.. దాంట్లో కాస్త సున్నం కూడా కలుపుతాను.. అప్పుడు గాని ఆవిడకు బుద్ధి రాదు..
"నువ్వు ఇక్కడకు వచ్చేసిన కొత్తలో మీ ఆయన గారు నిన్ను తీసుకెళ్లడానికి వచ్చారట.. ఆ తర్వాత మీ మామయ్యగారు కూడా రెండసార్లు నిన్ను తీసుకెళ్ల డానికి ప్రయత్నించారట.. నువ్వు 'ససేమిరావెళ్ళను' అన్నావట!.. నీ మొగుడు నే ఇక్కడకు వచ్చేయమన్నావట.. లేదంటే వేరే కాపురం పెట్టమని అన్నావట.. !
ఆ నోటా ఈ నోటా నాకు తెలిసిందిలే కూతురా. ఈ రకంగా కోడళ్ళు మసలుకుంటే.. అత్తగార్లు అందరి కీళ్లుఒంగితీరతాయమ్మా.. కట్టు కున్నోడు కూడా నీ దారిలోకివచ్చి తీరతాడు. భలే వంచావమ్మా వాళ్ళ బుర్రకాయలు.. ఇలా బిగుతుగా ఉంటేనే.. మనకు గౌరవం ఉంటుంది.. లేకుంటే మనల్ని ఇంకా అణగదొక్కేస్తారు.. వద్దమ్మా.. నువ్వు అసలు అక్కడికి వెళ్లొద్దు.. ఏ నీ అత్త మామలు కొడుకు లేకుండా బ్రతకలేరా.. ??నేర్చుకోవాలి.. ఒకరి మీద ఆధారపడి బ్రతక కూడదు.. అని జాగ్రత్త పడాలి. అయినా.. వృద్ధా శ్రమాలు లాంటి అవకాశాలు ఇప్పు డు చాలా ఉన్నాయమ్మా.. చింత లేదు.
కొడుక్కి పెళ్లిముహూర్తం ముందురోజు నాటికే దగ్గర లో ఉన్న అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాల లిస్టు సేకరించు కొని ఉండాలమ్మా.. నేటి తల్లిదండ్రులు. వాళ్లే తెలివైన వాళ్ళు.. ఏమో నీ కొడుక్కి పెళ్లి అయ్యేసరికి ఇంకా ఎలాంటి సులభమైన కొత్త కొత్త విధానాలు వస్తాయో.. చూద్దాం!
"ఇక్కడ విషయం ఏమిటంటే.. జీవితాలు నాశనం అయిపోవడం కాదు తల్లి.. సమా జంలో మీ నాన్నగారు తలెత్తుకు ధైర్యంగా తిరిగేలా నువ్వు చేశావు చూడు.. ఇదమ్మా.. ఇదీ కుటుంబం పరువు ప్రతిష్టలు నిలబెట్టడం అంటే.. మనలో మనమాట.. ఎప్పటికైనా ఇదే నీ కుటుంబం గాని 'అది' ఎలా అవుతుంది.. ?
మీ ఊరు ఏది అని ఎవరైనా అడిగితే.. మీ అమ్మ గారి ఊరు పేరే చెప్పాలి కానీ మీ అత్త గారి ఊరు చెప్ప కూడదమ్మా.. ఈ విషయా లన్నీ మీ అమ్మానాన్నలు నీకు చెప్పి పంపితే.. నీ సమస్య ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఉండేదికాదు. చిన్న పిల్లవు.. బాగా చిన్న పిల్లవు 28 ఏళ్లు ఉండొచ్చు..
మరో విషయం.. నాన్నగారుచెప్పారు.. నువ్వు చాలా కష్టపడి పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసేవట కదా.. బాగా అర్థం చేసుకో బిడ్డ.. అర్థంఅయ్యే వుంటుందిలే.. అర్థం కాక ఏమవుతుంది.. నా పిండాకూడు!!!..
"నేను కూడా నీలా పట్టు వదలను. నేను వాళ్ల అంతు చూస్తాను.. అవసరం అయితే భర్త, అత్తమామలు.. ముగ్గురు మీద పోలీస్ కేసు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తాను.. కోర్టు కీడుస్తాను. పదేళ్లు పట్టినా పర్వాలేదు.. మనం మాత్రం ఒక అడుగు కిందకి దిగడానికి వీలు లేదు.. ఆడవాళ్లకు ఇప్పుడు చట్టాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వాట్లను ఉపయో గించుకుందాం.
అసలు నీ మాట వినకుండా నేనే మాట్లాడుతున్నాను అని అనుకోకమ్మా.. నువ్వు బాణం దెబ్బతిన్న పెద్దపులి వి. నీ మనసులో ఏముందో నాకు తెలుసమ్మా.. అంతా నాకు వదిలేయ్. ఈ చిరాకు కు కోపం రానంతవరకే.. వచ్చిందంటే పిచ్చిముండా కొడుకైపోతాడు..
అమ్మాయి.. సత్యసుందరి.. నేను కరెక్ట్ గానే మాట్లా డుతున్నాను కదా.. లేదూ.. ఏదన్నా వెటకారంగా మాట్లాడినట్టు నీ కనిపిస్తుందా.. ??? అబ్బే
నాకసలు వెటకారాలు, వేళా కోళాలు చాతకరావమ్మా.. ముక్కుసూటి మనిషిని.. అసలు.. నేనంటే ఎవరికీ పడదమ్మా.. చెప్పింది విన్నట్టే విని.. చాటు గుంట తిట్టుకుంటారు.. "
చిరాకు ఊగిపోతూ మాట్లాడేసి గోతాం లో ఉన్న స్టీల్డబ్బా తీసుకుని.. నిమ్మరసం గడగడా తాగి జేబులో నుంచి రింగవుతున్న సెల్ఫోన్ ని తీశాడు.. తీస్తూ.. సత్యసుందరి వైపు చూశాడు.. ఆమె తల వంచుకుని మౌనంగా తన కాలి బొటన వేలు గోరుతో అందమైన గ్రానైట్ ఫ్లోర్ మీద గీత పెట్టడానికి ప్రయత్నిస్తుంది.
"సత్య.. సత్య.. సత్యసుందరి కదమ్మా నీ పేరు.. ఈ సెల్ కట్టి పడేస్తాను.. నీ విషయం మొదలు పెట్టు బంగారు తల్లి.. ".. అంటూ ఆగాడు చిరాకు.
"ఫర్వాలేదు మీరు మాట్లాడండి.. " తల పైకెత్త కుండానే అంది సత్యసుందరి.
"మొఖం నీరసంగా ఉన్నట్టుంది.. లోపలికి వెళ్ళి కొంచెం టీ తాగి వస్తావా.. "
"అవసరం లేదు. మీరు మాట్లాడండి.. "
"నేను మాట్లాడేది ఏముంది తల్లి.. పనికిరాని ఫోన్ లు.. సరైన పనిలో ఉన్నప్పుడే హలో పొలో అంటారు.. ఉత్తప్పుడు ఒక్కడు మాట్లాడడు. ఈ ఫోను ఎవడు కనిపెట్టాడో కానీ ఇది ప్రాణాలు తీస్తుంది, ప్రాణాలు పోస్తోంది.. " అంటూ 'చిరాకు'.. చిరాకుగా సెల్ఫోన్ ఆన్ చేశాడు.
"హలో.. ఈశ్వరరావుగారా.. ఎవరో అనుకున్నాను. కంగారు పడకండి సార్.. మీ తమ్ముడుగారి అమ్మాయి వెంకటలక్ష్మి కాపురం విషయం గురించే కదా మీరు మాట్లాడేది. కంగారు పడకండి.. నాగురించిమీకు తెలుసుకదా.. ఏ వ్యవహారమైనా నేను మూడు అధ్యా యాలలో చక్కబెట్టేస్తాను.
అది కూడా ఒకే ఒక సిట్టింగ్ సరిపోతుంది.. ఎవరికో కానీ రెండో సిట్టింగ్ పడదు అంతే.. సమస్య క్లియర్.. మీ తమ్ముడు గారి అమ్మాయిది ఇప్పటికే ఒక అధ్యాయం పూర్తయిపోయింది.. బండి గాడిలో పడినట్టే.. నేను గుడివాడ లో ఉన్నాను.. చాలా ముఖ్యమైన వ్యవహారం చక్కబెట్టడానికి వచ్చాను ఎంత రాత్రయినా ఇంటికి వెళ్ళి పోవాలి.. అరగంటకు ఓ ట్రైన్.. ఫర్వాలేదు.. "
".. .. "
"విషయం ఏమిటంటే.. ఎదుటివారికి ఉన్నది మనకి కూడా ఉండాలి.. అనేటటవంటి కుత్సితపు బుద్ధి.. ఎదవ ఏడుపు.. మీ తమ్ముడు గారి అమ్మాయిది.. ఈ ముదనష్టపు లగ్జరీల గురించి తాత్కాలికమైన సంతోషాలు, సుఖాలు, ఆనందాల గురించి.. నిండు నూరేళ్ల బతుకును నాశనం చేసుకుంటున్నారండి ఈనాటి పిచ్చిపిల్లలు.. వాళ్లను పూర్తిగా అనడానికి వీలు లేదు.. మీ పెద్దల పెంపకం అలా ఏడ్చింది మరి!! తప్పు కదా..
మీ అమ్మాయి అత్త వారికి 50 లక్షల రూపాయల బిల్డింగ్ ఉంది.. ఇంకా కొద్దిపాటి పొలం కూడా ఉంది. కానీ తన కొలీగ్ లలిత తో ప్రతిసారీ ఈ దిక్కుమాలిన ఫోన్లలో మాట్లాడు తూ.. వాళ్లకు కారు ఉంది అని తెలుసుకొని.. వాళ్లకు ఉన్న హోదా మనకు లేకపోవడం ఏమిటి.. ??? అన్న పిచ్చి ఆలోచనతో.. అనవసరంగా భర్తతో అత్తమామలతో గొడవ పెట్టు కుంటుంది.. మీ వెంకటలక్ష్మి.. తప్పుకదా..
ఇదేమైనా బాగుందా చెప్పండి ఈశ్వరరావు గారు. లలిత వాళ్ళు.. బాగా లేనివాళ్ళు అద్దె ఇంట్లో గడుపుతున్నారు. కానీ ఆ అమ్మాయి భర్త అవుట్ డోర్ కంపెనీ మేనేజర్ కనుక.. కారు అవసరం కనుక కారు ఉంది. మీఅమ్మాయి భర్తకు కారు అవసరం లేదు.. అతనిదిబిజినెస్.. అవసరమైతే సరదాగా కొంటాడు.. అవసరం లేదనుకుంటే కొనడు. అప్పటి వరకూ ఆగాలి.. లక్ష రూపాయల కారు గురించి.. కాపురం పాడు చేసుకుని ఇంటికివచ్చింది..
జీవితం నాశనమై పోయినా ఫర్వాలేదు కానీ.. కారు కొంటేనే ఈఅమ్మాయి కాపురానికి వెళ్తుందట.
"ఈశ్వరరావు గారూ.. ఆశ ఉండొచ్చు.. అత్యాశ కూడా ఉండొచ్చు.. కానీ 'దురాశ' ఉండ కూడదు.. అట్లాగే.. కోరికలు ఉండొచ్చు.. మితిమీరిన కోరికలూ ఉండొచ్చు.. కానీ.. ఆ పిచ్చికోరికలు కాస్తా.. 'గుర్రాలై' పోకూడదు!!!! ఇక్కడ నాలుగు 'ఆశ్చర్యం' మార్కులు పెట్టాలి గుర్తు పెట్టుకోండి.. మనుషులు పుట్టిన దగ్గర నుండి ఉన్నటువంటి శాస్త్రాలనే చెబుతున్నాను
కానీ.. నేనేదో స్పెషల్గా 'సరికొత్తకథ' చెప్పటం లేదండోయ్ ఈశ్వరరావుగారూ.. మిమ్మల్ని నా ట్రాక్లోకి లాగే ప్రయత్నం చేయడంలేదు. ఆ పిల్లకి కాస్త బుద్ధి, అట్లాగే ఎక్కడైనా దొరికితే కాస్త ఎండిపోయిన పచ్చిగడ్డికూడా పెట్టండిమరి. మిగిలితే మీరు, మీ తమ్ముడు కూడా తినండి.. నేను ' వద్దు ' అనను..
పైగా మీ తమ్ముడు గారి అమ్మాయి.. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందటండి!!. ఛీ.. పనికిరాని చదువులు చదువుతున్నారు.. ఉబుసుపోని చదువులు చదువు తున్నారు.. నాకే కనక.. సెంట్రల్ లో విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే మొత్తం ఈ దిక్కు మాలిన చదువులు అన్ని డిస్మిస్ చేసిపాడేస్తాను..
"కాస్త సంస్కారం.. కొంచెం మమకారం.. ఇంకొంచెం ప్రేమ, అభిమానం.. మరికాస్త ఓర్పు, నేర్పు.. ఇంకాస్త ప్రపంచ జ్ఞానం.. ఎవరూ పరిచయం లేని కొత్త ఇంట్లో ప్రవేశించాక ఒక అమ్మాయి మొగుడు తో అత్తమామలతో ఏ విధంగా ప్రవర్తించాలి.. ఇవి మాత్రమే నేర్పేలా చట్టసవరణ తీసుకువచ్చి పడేస్తాను..
"మీ అమ్మాయి మొగుడు తో విడాకులకు కూడా సిద్ధం అయిపోయిందండి బాబు.. విడాకులు అంటే బీడీ కట్ట మాదిరి చవక అయిపో యాయి కదా.. వెంటనే ఇంకొకరిని పెళ్లి చేసే సుకోవటం. సమాజం ఇలా బ్రష్టుపట్టిపోయింది. మీ పెద్దలకు బుద్ధి జ్ఞానం అసలు లేదు.. ఆ అమ్మాయి నోట్లో కాస్తంత ఎండిపోయిన పచ్చ గడ్డి పెట్టి.. 14 చీవాట్లు పెట్టి.. అత్తగారి ఇల్లే నీకు సరైనది.. పుట్టింటికి రాకు అని బయటకు గెంటి పడేస్తే బాగుండును. అలిగి అత్తవారి ఇంటి దగ్గర నుంచి వస్తే.. ఆరు నెలలు మీ నెత్తిమీద పెట్టుకున్నారు..
మీలాంటి వాళ్ళవల్లే కాపురాలు కూలి పోతున్నాయి.. ఇదిగో ఈశ్వర రావుగారు.. నేనసలే మంచి ముండా కొడుకుని కాదు.. మళ్లీ నేను ఎంటర్ అయ్యే లోపున వ్యవహారం చక్క పెట్టుకోండి. లేదంటే నేనే పెద్ద మనిషిగా మీ మీ అందరి మీద కంప్లైంట్ ఇవ్వ వలసి వస్తుంది. బీ కేర్ఫుల్.. మళ్లీ నాకు ఫోన్ చేయకండి.. "
"చిరాకు" కసితో కూడిన అసహనంతో ఊగి పోతూ సెల్ ఆఫ్ చేసి తన గోతాంలోకి విసిరి కొట్టాడు. కాసంత నిమ్మరసం తాగి.. సత్యసుందరి వైపు ఓరగా చూశాడు.. ఆమె కొంచెం బుర్ర పైకెత్తి 'చిరాకు' వైపు కంపరంగా చూసింది
"సత్యసుందరమ్మా.. నేను అసలు చాలా మంచో డునమ్మా.. ఈ ప్రజలే నా బుర్రపాడు చేసేస్తున్నారు. అంతా విన్నావు కదా.. ఇప్పటి పిల్లలకు.. ఎదుటి వారికి ఉన్నది మనకి ఉండాలి అన్న ఏడుపు.. జీవితానికి ఒక గోల్ పెట్టు కొని.. అది సాధించడం కోసం.. ప్రస్తుత సుఖమయ జీవితం నాశనం చేసుకోవడం.. పెద్దలను గౌరవించక పోవడం.. ఎదుటివారు చెప్పింది పూర్తిగా వినకపోవడం.. ఇదమ్మా.. ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్!!!
"అనవసరపు వెధవ ఫోన్ సంభాషణ తో నీ టైంపాడు చేశాను తల్లి.. నా పుణ్యకాలం కాస్తా అయిపోయింది కూడా.. అమ్మానాన్న వస్తే మళ్ళీ రెండు రోజుల్లో వస్తాను అని చెప్పమ్మా.. రాత్రి 12గంటల లోపు ఇంటి కి చేరకపోతే మీ అమ్మమ్మతో పెద్ద గొడవ అయిపో తుంది! ఇదిగో తల్లి నువ్వు నాకు చెప్పాలనుకున్నది పూర్తిగా గుర్తు పెట్టుకొని.. సిద్ధంగా ఉండు తల్లి..
"ఆఖరుగా ఇంకొక్కమాట చెపుతాను వింటావా.. అదేనమ్మా రోజులు. అసలు బాగుండ లేదు. కంగారు పడి నువ్వు మీ అత్తవారి ఇంటికి మాకు ఎవరికీ చెప్పకుండా సడన్గా వెళ్ళిపో మాకు. రేపు నీ పుట్టిన రోజు అని కూడా తెలి సింది తల్లి నాకు. నీకు ముందు గానే అడ్వాన్సు అభినందనలు.. ఇదిగో.. ఈ రాత్రికి ట్రైన్ ఎక్కేసి తెల్లవారేసరికి అక్కడికి వెళ్ళిపోయి.. వాళ్లు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసి.. నీ మీద వాళ్లకు ఉన్న కొద్దిపాటి కోపం పోయేలాఅక్కడే బర్త్ డే చేసేసుకుందామని..
తద్వారా నీ సమస్యను నీ అంతట నువ్వే క్లియర్ చేసేసుకుందామని.. రేపటి నుంచి కొత్త జీవితం మొదలు అయిపోతుందని.. ఇదిగో చూడు.. ఇలాంటి పిచ్చిపిచ్చి అయోమయపు ఆలోచనలతో.. మీ ఇంటికి అదేనమ్మా మీ అత్తవారి ఇంటికి.. వెళ్ళిపోయె ఆలోచన చేసావు.. అనుకో..
నువ్వు పూర్తిగా బురద గుంటలో పడ్డట్టే.. ఊబిలో కూరుకు పోయి నట్టే. రోజులు అస్సలు బాగుండలేదు సత్య సుందరి.
"నేను మార్గాలన్నీ క్లియర్ చేస్తాను కదా.. మూసుకు పోయిన దారులు ఆన్ని తెరిపించి నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. గుడివాడ లో మన సచ్చిదానంద సిద్ధాంతి గారు ఉన్నారు కదా.. ఆయన చేత వర్జ్యం, దుర్ము హూర్తం.. ముఖ్యంగా.. యమగండం ఏమాత్రం లేనటు వంటి నిఖార్సైన ముహూర్తం పెట్టించుకుని.. ఇంటి దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరి పిస్తా నుకదా.. అదమ్మా నాస్టైల్.. అంతవరకూ ఏసీ రూమ్స్ ఉన్నాయి కదా మీకు.. అందులో డబుల్ కాట్ స్లీప్వెల్ పరుపు మీద వెల్లకిలా పడుకొని.. ఏ టెన్షన్ లేకుండ చక్కగా.. ఎంచక్కా యూట్యూబ్చూడమ్మా..
రోజులు అలా అలాఅవే గడిచిపోతాయి.. సంవత్సరం ఈజీగా గడిచిపోయిందా.. రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు.. అలా అలా కాలం గడచి పోవడం పెద్ద గొప్పేమీ కాద మ్మాయి.. మన గురించి కాల చక్రం ఆగుతుందా.. ఈ కాలచక్రానికి నట్టులు లూజు అయినా టైటు అయినా తిరగటం మానదు బిడ్డా!!!! "చిరాకు బుజ్జగిస్తున్నట్లు చెప్పాడు సత్యసుందరి కి.
"సరేనండి మీరు ఎన్ని గంటలకు బయలు దేరు తారు??? మీకు డబ్బు ఏమైనా కావాలా??" సత్య సుందరి పైకి నిలబడాలని ప్రయత్నిస్తూ.. ' చిరాకు' వైపు ఆయాసంగా ఆవేశంతో కూడిన చూపు చూస్తూ కోపంతో అడిగినట్లుగా అడిగింది.
"కోప్పడకమ్మా.. వెళ్ళిపోతాను.. వెళ్ళిపోతాను ఇదిగో.. గోతం పూర్తిగా సదురుకున్నాను కదా. మళ్లి.. ఇదిగో మళ్లీ ఫోన్ రింగ్.. డుర్రు డుర్రు డుర్రు డుర్రు మంటూ గోల.. ఫోన్ రింగ్.. ఈ ఫోన్ ల గోల ఎక్కువై పోయింది.. పనిచేసుకో నివ్వరు.. మాట్లాడు కోనివ్వరు.. ఒక్కసారి ఫోన్లో మాట్లాడు కుంటా నమ్మా. ఇందాక లా గంటన్నర మాట్లాడను.. ఒక్క నిమిషంలో ముగించేస్తాను..
"హలో.. ఎవరండీ.. చక్రధరరావుగారా.. విజయనగరం నుంచే కదా.. మీ అమ్మాయి కేసు రెండవ అధ్యాయం కూడా పూర్తి అయిపోయింది. మూడవ అధ్యాయం వెంటనే మొదలు పెడతాను. నేనిప్పుడు గుడివాడలో సత్యనారాయణమూర్తి గారి ఇంటి దగ్గర ఉన్నాను.. రెండు రోజుల్లో వైజాగ్ వచ్చి.. అక్కడ ఓ అత్తమామలకు ఎండిపోయిన పచ్చిగడ్డి పెట్టి.. అట్నుంచి అటు మీ విజయ నగరం వస్తాను.. కంగారు పడకండి.. ఉంటాను. " 'కంగారు' సెల్ ఆఫ్ చేసి మరింత చిరాకుగా తన గోతాంలోకి విసిరికొట్టాడు.
పైకిలేచి గుమ్మం వరకు వెళ్ళాడు.. మళ్లీ వెనక్కు వచ్చాడు.
‘చిరాకు' ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడు.. అని చూస్తున్న సత్యసుందరి అతను వెనక్కి తిరిగి.. లోపలికి వచ్చినా తలపైకెత్తి చూడలేదు.. అతని పాదాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోవాలి అన్నది ఆమె అభిప్రాయం గా అతని పాదాల వైపు చూస్తూ ఉండిపోయింది.
"అమ్మాయి.. మళ్లీ వెనక్కివచ్చి ఇక్కడ కూర్చుండి పోయాను.. అని తప్పుగా భావించకమ్మా.. ట్రైను కి ఇంకా కొద్ది సమయం ఉంది.. ఇప్పుడు వెళ్లినా ఉసూరుమంటూ ప్లాట్ఫామ్ బల్ల మీద కూర్చుని ఏడాలి.. మరో అరగంటలో వైజాగ్ వెళ్లే ఎక్స్ప్రెస్ట్రైన్ వస్తుంది.. బండి చాలా ఖాళీగా ఉంటుంది. చాలా స్పీడ్గా కొడతాడమ్మా.. తెల్లారేసరికి వైజాగ్ వెళ్లిపోతుంది.. అది బయలు దేరితేనేకానీ.. నేను వెళ్ళవలసిన ప్యాసింజర్ ట్రైన్ రాదు.. అందుకని టైంపాస్ చేస్తున్నాను బిడ్డ. ఈ లోపులో అతి ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. అది చెప్పకుండా వెళితే నేను వచ్చి నందుకు సార్థకత ఏర్పడదు.
"విషయం ఏమిటంటే.. నువ్వు నిలబడే ఉన్నావ్ అమ్మా.. కూర్చోరాదు.. "
"పర్వాలేదు త్వరగా అదేమిటో చెప్పి మీరు త్వరగా వెళ్ళండి.. నాకు వేరే పని ఉంది.. ".. సత్యసుందరి ఇంచుమించు బొంగురు పోయిన కంఠంతో మాట్లాడి నట్టుగానే అంది
"రైల్లో ఆ మధ్య.. ఓ అమ్మాయి తారస పడిందమ్మా. వయసు 18 ఏళ్లు ఉండొచ్చు. అంటే నీ కన్నా 10 ఏళ్ల చిన్నది. ఆ అమ్మాయి తో మాటలు కలుపుతూ..
"పాపా మీది ఏ ఊరు".. అన్నాను..
"మా ఊరు విజయవాడ " అంది.
"సరే మీ అత్తవారు ఊరు ఏది?" అని అడిగాను.
" చెప్పాను కదా అంది. "
"అదే.. కాస్త వివరంగా చెప్పు పాపా".. అని గుచ్చి గుచ్చి అడిగాను..
దానికి ఆఅమ్మాయి ఏమందో తెలుసా..
"తాతగారు.. నాకు పెళ్లి అయ్యింది.. అప్పటి నుండి మా అత్తవారి ఊరే నా ఊరు అవు తుంది కదా.. మా అమ్మగారి ఊరు నాకు ఇక పరాయి ఊరే అవుతుంది కదా.. వయసులో పెద్దవారు అయ్యుండి ఆ మాత్రం మీకు అర్థం కావడం లేదా..” అంటూ నా నోట్లో ఇంత ఎండి పోయిన పచ్చిగడ్డి పెట్టింది.
"వింటున్నావా తల్లి సత్యసుందరి.. అటువంటి అమాయకపు ఆడవాళ్లవల్లనేనమ్మా.. నీలాంటి గడుసు అమ్మాయిల సంసారజీవితాలకి గండి పడుతుంది.
"ఇంకా ఏమందో తెలుసా.. తాతగారు.. నాకు తల పోటు వస్తే ఎక్కడో కాకినాడ లో ఉన్న నా తల్లి దండ్రులు వచ్చి.. నాకు తలపోటు టాబ్లెట్ తెచ్చి ఇవ్వరు కదా.. తక్షణం నా బాగోగులు చూసేది.. నా అత్తమామ లే కదా.. అంటే.. వాళ్లే కదా నాకు ప్రత్యక్ష దైవాలు.. ".. అంది తల్లి.
"ఆ.. ఆ దెబ్బతో నాబుర్ర గిర్రున తిరిగిందమ్మా..
నా బుర్ర ఎక్కడ పెట్టుకున్నాను.. చూసుకుంటే నాకే అర్థం కాలేదు.. ఇంతకీ ఆ అమ్మాయి పదవ తరగతి ఫెయిల్ ఆట!.. మరి ఆ బుర్రకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు అర్ధం కాలేదు.. ? ఆ అమ్మాయిని చూసి 'నీలాంటి అంగర తింగర పిల్లలు ఈ భూప్రపంచం మీద బతకలేరు.. ' అని మాత్రం నేను మనసులో అనుకున్నాను తల్లి..
ఇదిగో.. ఏదో ఆ వంక పెట్టి ఇలా నిన్ను తిడుతున్నాను అని.. అపార్థం చేసుకోమాకు. నిజంగా నేను తిట్టింది ఆ అమ్మా యినే. అంటే.. ఆ అమ్మాయి స్వభావం ప్రకారం మంచైనా చెడైనా.. వాళ్లతో సర్దుకు పోయే మనస్తత్వంతోనే.. జీవితం గడపడం.. ఈ స్పీడ్ యుగంలో, ఈ కంప్యూ టర్ కాలంలో ఎలా కుదురుతుందమ్మా.. తల్లి సత్య సుందరి?.
నాన్సెన్స్.. ఏదో సమయం గడపడం గురించి చెప్పాను కానీ.. ఈ సన్నివేశం తాలూకు సారం అసలు నీకు పనికిరాదమ్మా.. ఇదో పనికి రాని పనికిమాలిన చిట్టచివరిఅధ్యాయం!.. నేను చెప్పడం అయిపోయింది తల్లి.. నాకు టైం కూడా కా వస్తుంది.. బయటకు పోయానంటే ఇక మళ్లీ వెనక్కు.. నువ్వు బతిమాలి పిలిచినా రానమ్మా.. అంత మొండిఘటం నేను”
"లాస్ట్ అండ్ ఫైనల్ గా.. నేను చెప్పేది ఏమి టంటే సమస్య పరిష్కారం కోసం.. నేను సామ దానబేధ దండోపాయాలు ఉపయోగించను తల్లి.. బామాలి.. భయపెట్టి.. చెయ్యను తల్లి.. ఏమిటో నా ముఖం మీద ఏమి రాసిపెట్టి ఉందో.. నేను ఫీల్డులోకి దిగే సరికి.. రెండు పక్షాల వాళ్ళు ఒక రాజీకి వచ్చేసి సెట్ అయిపోతు న్నారు బిడ్డ.. !!?? నా చరిష్మా అలా వెలిగి పోతుందమ్మా.. 'అద్భుతం'.. జరుగుతుంది.. 'మహాద్భుతం!!".. జరుగుతుంది!!!!"
చిరాకు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాడు. దబ్బున రెండు తలుపులు పెద్ద శబ్దంతో మూసు కున్నాయి.. అతను ఏమాత్రం కంగారు పడలేదు.. ఎందుకంటే అలాగే జరుగుతుందని అతనికి ముందే తెలుసు కనుక!!
బయట ఇంకా చిన్నగా తుంపర పడుతోంది. తన చంకలోని కాఖీ రంగు గోతంలాంటి సంచి నుంచి దళసరి రగ్గులాంటి గుడ్డ బయటకు తీశాడు.. నెత్తి మీద నుండి కప్పి ఈసారి కుడి భుజం మీద నుంచి చుట్టూతిప్పాడు.. వడివడి గా నడుస్తూ.. బురద నీటిలో కూడా.. చాలా దూరం నడిచి.. రైలు పట్టాలు దాటి గబగబా అటువైపు కు వెళ్ళి పోయాడు. స్టేషన్లో పెద్దగా జనం లేరు.. ఖాళీ బల్ల మీద కూర్చుని.. పొడ వాటి బంకచుట్ట తన ఎడమ పక్క జేబీలోనుండి తీసి అంటించాడు.. పొగ గుప్పుగుప్పున వస్తుంది..
అర్ధగంటలో..
అద్భుతం!.. జరగాలి.. మహాద్భుతం!!.. జరగాలి..
జరుగుతుందా!!!!!????? జరగాలి.. జరగాలి.. జర గాలి.. ఖచ్చితంగా జరిగి తీరాలి!
''ఓo ఫట్.. హాo ఫట్.. ఫటాఫట్!! '' గొణుక్కున్నాడు చింతపిక్కల రామకుటుంబం అలియాస్ చిరాకు.
కాసేపటికి వైజాగ్ వెళ్లే ఎక్స్ప్రెస్ వచ్చి ప్లాట్ ఫామ్ మీద ఆగింది.. అప్పటికే టికెట్ తీసుకున్న వాళ్ళందరూ బిలబిలమంటూ ఎక్కే సారు. ప్లాట్ఫామ్ ఇంచుమించు నిర్మానుష్యంగా ఉంది.
'చిరాకు'.. బల్లమీద కూర్చుని స్టేషన్ మెయిన్ గేటు రోడ్డు మీదే దృష్టి పెట్టాడు.. కాళ్లకు అంటుకున్న బురద దురద పెడుతున్నా అతనికి ఏమీ అనిపించడం లేదు.. 'కొద్దిసేపట్లో వైజాగ్ ఎక్స్ప్రెస్.. బయలు దేరబోతున్న అనౌన్స్మెంట్' కూడా వచ్చేసింది.. !!!!
చిరాకు బంకచుట్ట పొగను గుప్పుగుప్పున వదులుతూ కళ్ళు పూర్తిగా మూసుకుని చాలా సేపు అలాగే ఉండి తెరిచాడు.. అతని దృష్టి స్టేషన్ మెయిన్ గేట్ దగ్గర అప్పుడే వచ్చి ఆగి ఉన్న పసుపు రంగు ఆటో మీద పడింది.. అందులో నుండి రెండు భుజాలకు బరువైన బ్యాగులతో ఒకామె దిగింది. ఏమాత్రం ఆయాస పడకుండా పరుగు పరుగున స్టేషన్లోకి వచ్చి.. కంగారుగా టికెట్ కౌంటర్ లో డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకుని.. ప్లాట్ ఫామ్ మీద కదల బోతున్న వైజాగ్ ఎక్స్ప్రెస్ దగ్గరకు గబగబా వచ్చేసింది..
దట్టమైన చుట్టపొగలోంచి ఆమె ఆకారం 'అస్పష్టంగా' కన బడుతుంది.. 'చిరాకు' కు.. !. కానీ ఆమెమాత్రం ఖచ్చితంగా ఎడమ చెవి దగ్గర పాపిడి తీసుకున్నావిడే!!! అప్పటికే ట్రైన్ ఒక జెర్క్ ఇచ్చి కదిలింది.. ఆమె రెండు బ్యాగ్లను బోగిలోకి గిరాటుపెట్టి.. డోర్ రాడ్ పట్టుకొని.. అతి బలవంతంగా బోగి లో రెండు అడుగులు పెట్టి.. ఒక్క ఉదుటున పైకి ఎక్కేసింది.. ఎక్స్ప్రెస్ ఒక్కసారి చాలా స్పీడ్ అందుకుంది..
పెద్దగా కూత వేసుకుంటూ.. !
చింతపిక్కల రామకుటుంబం అలియాస్.. 'చిరాకు'.. నోట్లోంచి బంకచుట్టను తీయకుండా ఆకాశం వైపు ముఖం పెట్టి.. ' ఇ హే హే '.. అంటు గట్టిగా నవ్వేసాడు.. ఇంకా నవ్వుతూనే ఉన్నాడు..
అలా నవ్వుతూనే ఉన్నాడు!!!!
**
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comentarios