'Marina Manasulu' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 15/06/2024
'మారిన మనసులు' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
భ్రమరాంబ-నీలకంఠ నిలయం...
ఆ.. ఆ.. ఆ... ఇదే బాబు ఇదే.. ఇదే! ఆపు.. ఆపు. ఆపై.... !" ప్రహరీ గోడపై ఉన్న గ్రానైట్ ఫలకపైని అక్షరాలు చదివి, ఆటోలో నుండి బయటకు తొంగిచూస్తూ, ఆపకపోతే దూకేసేలా కేకలు పెట్టింది అరవయ్యేళ్ళ అనసూయమ్మ.
"అరే! అనసూయా…. ! నువ్వేనటే అదేంటే చెప్పా పెట్టకుండా వచ్చేసావు. " ఆశ్చర్యానికి ఆనందం మేళవించి కెవ్వుమన్నంత పని చేసింది భ్రమరాంబ.
"సరే అయితే. మా ఇంటికెళ్ళిపోయి, ఈసారి నీకు చెప్పొస్తానే భ్రమరక్కాయ్... !" అంటూ వెనుతిరుగుతున్న అనసూయ భుజంపై ఒక్క చరుపు చరిచి పెద్దగా నవ్వుతూ…
"ఏం మారలేదే నువ్వు. సంతోషించాం గానీ. రారా! చెబితే ఎవరినైనా పంపేదాన్నిగా స్టేషన్ కూ…! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకూ…! ఐదేళ్ళు గా నువ్వా తీర్థయాత్రల్లో బిజీ అయిపోతివి. ఈసారి వదిలేదే లేదు. నెల రోజులైనా నాదగ్గర ఉండాల్సిందేనేవ్... !" చెల్లి బ్యాగును అతిధుల గది లోని టీపాయ్ పై ఉంచుతూ నవ్వుతూ అంది భ్రమరం.
"నెల్రోజులు కాదు గానీ... పదిరోజులుంటానే అక్కాయ్!" ప్రేమగా చూస్తూ అంది.
అనసూయమ్మ, భ్రమరాంబ అక్కా చెల్లెళ్ళు.
అనసూయమ్మ, తన నలభయ్యవ ఏటనే భర్తను కోల్పోయినా, మంచి ఆస్తిపాస్తులున్న కుటుంబం కావడంతో ఇద్దరాడపిల్లలను చక్కగా చదివించి, తన యాభయైదేళ్ళు పూర్తయ్యే లోపే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసింది.
ఆ తరువాత... ఇక భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలన్నీ దర్శించటమే పనిగా పెట్టుకుంది ఇన్నేళ్ళూ....
ఇక భ్రమరాంబ, అనసూయమ్మ కంటే మూడేళ్లు పెద్దది.
ఆమె భర్త ఊర్లో వ్యవసాయం, సిటీలో రియలెస్టేటు వ్యాపారంతో బాగానే సంపాదించినా, డెబ్బయ్యేళ్ళ వయసులో ఇప్పటికీ ఆ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటూ బిజీగా ఉంటాడు.
వాళ్ళ ఇద్దరు కొడుకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఐదేళ్ళ క్రితం ఒకరికి, నాలుగేళ్ల క్రితం మరొకరికీ పెళ్ళిళ్ళు చేసారు.
స్నానం, అల్పాహారం అయ్యాక తీరికగా గదిలో కూర్చున్నారు అక్క, చెల్లెళ్ళు.
“ఇప్పుడు చెప్పవే అక్కాయ్! ఏంటి సంగతులు!? అత్తరికం వచ్చేసాకైనా సుఖంగా ఉన్నావా!? ఐదేళ్ల క్రితందాకా మీ అత్తగారి ఆధ్వర్యంలోనే అన్నీ నడిచేవి. ఆమె కనుసన్నల్లోనే సకలం నడిపించేదానివి కదా!" అంది అనసూయమ్మ.
"మా అత్తగారి మాట నేనేనాడు జవదాటలేదే. నచ్చినా నచ్చకపోయినా. ఆయన కూడా ఆమె చివరిక్షణం వరకూ అమ్మ మాటే వేదం అన్నట్టుండే వాడు. ఇక నాకు మా అత్తకులా గంభీరంగా పనులు చెప్పి చేయించటం చేత కాదు. కాబట్టి నా అత్తరికం, మా కోడళ్ళరికం కథేంటో నువ్వే చూసి చెప్పాలే!" చిన్నగా నవ్వింది భ్రమరాంబ.
ఇంతలో పెద్ద కోడలు గది గడపలోకి వచ్చి నుంచుని,
" అత్తయ్యా!" అని ఏదో చెప్పబోయి.....
"ఓ.... మీ చెల్లెలు వస్తుందన్నారు ఈవిడేనా!? నమస్తే ఆంటీ!" నవ్వుతూ అని, భ్రమరాంబ వైపు తిరిగి...
"నేనివాళ మా పిన్ని కూతురి శ్రీమంతానికి వెళ్తా అని చెప్పాగా అత్తయ్య మీకు!? ఆర్యన్ లేస్తే స్నానం చేయించి వెళ్ళేదాన్ని... వాడు లేవట్లే. మరో అరగంటలో వాడి స్కూల్ బస్ వస్తుంది. వంటైంది కదా!? మీ అబ్బాయికి బాక్స్ సర్దేస్తారుగా!? సరే... టైమౌతోంది. క్యాబ్ కూడా వచ్చేసింది. బై అత్తయ్యా... !" అన్నీ తనే చకచకా మాట్లాడేసి, భ్రమరాంబ సమాధానం కోసం చూడకుండా, ఫోన్ చూసుకుంటూ... వడవడిగా వెళ్ళి పోయింది.
తన వైపే విస్మయంగా చూస్తున్న చెల్లితో...
"నా పెద్దకోడలు. వరూధిని. " అంది భ్రమరాంబ.
ఇంతలోనే వంటింట్లో నుండి కెవ్వుమన్న కేక, ఆ వెంటనే ధబ్బుమని గిన్నె పడిన పెద్ద శబ్ధం.
అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ వయసు మర్చిపొయి ఒక్క పరుగులో కిచెన్ చేరారు.
"ఓ.... షిట్. లేస్తూనే తలబద్దలౌతుంటే, కాస్తంత కాఫీ తాగుదామనుకున్నాను. ఆ కాడ లూజ్ గా ఉంది. ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరసలు. నాకోమాట చెబితే, ఆఫీసులో నుండైనా ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చేదాన్నిగా!? కాఫీ అంతా చీర మీద ఒలికిపోయింది. ఇప్పుడిది మార్చాలి. ఆఫీస్ లో మీటింగ్. టైమైపోతోంది. పాపాయ్ ఇంకా లేవలేదు. కేర్ టేకర్ షీలా వచ్చేటైమైంది. నేను బయల్దేరుతా అత్తయ్యా!" అంటూ అత్త పక్కన మరో శాల్తీ ఉందని కూడా గుర్తించకుండా కిచెన్ నుండి హడావిడిగా వెళ్ళిపోతున్న కోడలి వైపు విరక్తిగా చూసింది భ్రమరాంబ.
"హ్మ్.... అర్థమైందే అక్కాయ్ నీ పరిస్థితి. " జాలిగా చూస్తూ అంది అనసూయమ్మ.
భారంగా నిట్టూరుస్తూ...
వంగని నడుముతో తంటాలు పడుతూ, నేలపైనా, షల్ఫుల పైన, వస్తువులపైనా పడిన కాఫీ మరకలు తుడుచుకుంటున్న తన అక్కను చూస్తూ...
'లాభంలేదు, మరో పదిరోజులు పట్టినా, ఈ మనుషుల్ని దారికి తేవాలి. మా అమాయకురాలి పరిస్థితితులు చక్కదిద్దే ప్లాన్ ఆలోచించాలి. ' అనుకుంది అనసూయమ్మ.
#####
మర్నాడు పొద్దుటే పెద్దకోడలు వరూధిని నిద్ర లేచి వంటింట్లోకి వచ్చేసరికి వంటింట్లో ఏ హడావుడీ లేదు..
హు, ఇంకా ఈవిడ గారు లేవలేదా ? అనుకుంటూ సింక్ వైప్ దృష్టి సారించేసరికి రెండు కాఫీ కప్పులు కనపడ్డాయి..
ఓ, అక్కా చెల్లెలు కాఫీలు తాగేసారన్నమాట అనుకుంటూ హాల్ లోకి వచ్చేసరికి హాలు మధ్యలో ఉయ్యాల బల్లపై కూర్చుని ఇద్దరక్కాచెల్లెళ్లు చిన్ననాటి సంగతులు ఏవో ముచ్చటించుకుంటూ నవ్వేసుకుంటున్నారు..
అనసూయమ్మ వరూధిని వైపు చూడనే చూసింది..
ఏమ్మా వరూధినీ, నేనేదో గెస్టు ననుకుంటూ నాకోసం ప్రత్యేకంగా ఏవో చేసేయాలని హైరాన పడకు.. మీరందరూ తినేవే నేనూ తింటాను.. ఏమంటావే అక్కాయ్” అనేసరికి, “నీ మొహం, నీవు గెస్టు వేమిటే అనసూయా ?”
“అత్తయ్యా నిన్న శ్రీమంతం ఫంక్షన్ లో చాలా అలసిపోయాను.. నీరసంతో కాళ్లు తెగలాగేస్తున్నాయి.. ఇలా పొద్దుటే స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే హడావుడిలో ఇలా కబుర్లాడుకుంటుంటే ఎలాగ ?”
“అయ్యో, అక్క పాపం అన్నీ చేయబోతుంటే నేనే ఆపేసానమ్మూ వరూధినీ, ‘కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందన్నట్లు’. మా వరూధిని పనిమంతురాలని, అన్నీ క్షణాల్లో చక చకా చేసేస్తుందని నిన్నటి నుండి నీ గురించి తెగమెచ్చుకుంటోంది అక్క.. ఇంటి కోడళ్లు అలా చక చకా పనులు చేసుకుంటుంటే చూడాలని ఉబలాటపడతాను.. రావే అక్కాయ్, ఈ పూటకి ఇద్దరం కలసి తలో పనీ చేసేద్దాం", అంటూ అక్కతోబాటూ వంటింట్లోకి నడిచింది అనసూయ..
ఈలోగా రెండో కోడలు వసుధ వచ్చి కాఫీ కలుపుకోవడం చూసిన అనసూయ "అమ్మాయ్ నాకూ ఒక కప్పు కాఫీ ఇస్తావూ? నీవు కాఫీ చాలా బాగా కలుపుతావని మా అక్క ఒకటే చెపుతోంది.. ఇందాకటి నుండి చూస్తున్నాను, నీవు లేచి కాఫీ ఎప్పుడు కలుపుతావో” ననేసరికి లోపల ఎంతో అసహనంగా ఉన్నా మౌనంగా కాఫీ కలిపి అందించిన వసుధ తో “నిన్ను కష్టపెట్టలేదుకదా” అనేసరికి జవాబివ్వకుండా అక్కడనుండి వెళ్లిపోయింది..
మర్నాడు వరూధిని పొద్దుటే లేచివచ్చి వంటిట్లో పనులు చేయడం ప్రారంభించింది.. అత్తగారి చెల్లెలు ఉంది, బాగుండదనుకుంటూ..
భ్రమరాంబ గానీ, అనసూయగానీ అటువైపు తొంగిచూడలేదు..
రెండురోజులు గడిచేసరికి వరూధినికి చాలా అసహనంగా అనిపించింది.. తానొక్కర్తీ పొద్దుటే లేచి వంటింట్లో కష్టపడుతున్నానన్న చికాకు, అత్తగారి చెల్లెలి ఎదురుగా అత్తగారిని శాసించలేని అసహాయత.
ఫ్రెండ్సు కిట్టీ పార్టీలు, షాపింగ్ లు అని పిలుస్తున్నా మనస్సు పెట్టలేకపోతోంది..
అప్పుడే అటువచ్చి కాఫీ కలుపుకుంటున్న వసుధతో, " నీవూ నాకు హెల్పె చేయొచ్చుకదా వసుధా" ? నేనే అన్నీ చేయాలంటే నా వల్ల కావడంలే”దనేసరికి వసుధకి కోపం ముంచుకొచ్చేసింది..
" చూడక్కా, నేనూ మీ మరిదీ ఉదయం మా ఆఫీస్ కెఫ్టీరియాలోనే తినేస్తాం కదా".. మా కోసమేమైనా కష్టపడుతున్నావా?”
" అంటే మీరు తినకపోతే నీవు హెల్పె చేయకూడదా?”
" నాకెలా కుదురుతుంది.. ఆఫీసుకి రెడీ అవ్వాలి.. నీవు హౌస్ వైఫ్ వే కదా" అనేసరికి ఇరువురి మధ్య పెద్ద రాధ్దాంతమే అయింది..
“నేను పనీపాటా లేకుండా కూర్చుంటున్నాననా నీ ఉద్దేశం” అంటూ తోటికోడలమీద ఎగిరిపడింది..
“ఫ్రీగానే ఉన్నావు కదా అంటే అంత సీరియస్ గా తీసుకుంటావెందుకు అక్కా ?”
వీరిద్దరి చర్చలు వింటూన్న భ్రమరాంబ ఆగలేక లేవబోయింది.. ఆవిడకు ఇటువంటి గొడవలంటే చాలా భయం.. అమాయకురాలే కాకుండా లౌక్యం అంటే ఏమిటో తెలియనిది.. అనసూయ ఆపేస్తూ "ఎందుకే అక్కా అంతభయం, అయినా నీవెళ్లి ఏంచేస్తావు? ‘నేను చేస్తానులే చాకిరీ మీరు వెళ్లండమ్మా’ అని చెప్పడానికా? వద్దు అక్కా, వాళ్ల మధ్యకు వెళ్లడం సబబుకా”దంటూ ఆపేసింది..
మరో వారంరోజులు తోటికోడళ్ల మధ్య చిరాకులూ ఎత్తిపొడుపులతో గడచిపోయాయి.. అనసూయ ఆ మాటలేమీ పట్టించుకోవద్దని అక్కగారికి గట్టిగా చెప్పింది..
ఊరినుండి వచ్చిన ఈ శాల్తీ ఎప్పుడు కదుల్తుందో, మళ్లీ అత్తగారు పనిలోకి ఎప్పుడు దిగుతారో, అసలుకే చాకిరీ ఎక్కువైపోయిందని వరూధిని గొణుగుళ్లు ఎక్కువైనాయి..
ఒకరోజు రాత్రి భోజనాలు అయినాకా అనసూయ అక్క కోడళ్లిద్దరితోనూ చెప్పింది..
“మా అక్కను నాతో తీసుకువెళ్లాలనుకుంటున్నాను. నిన్న మా బావతో చెపితే సరే నన్నాడు.. నాతో కొంత కాలం ఉంటుంది. మీ మావగారు ఇక్కడ పనులు పూర్తి అయ్యాకా అక్కడకే వస్తానన్నారు.. వసుధా! నాకూ మా అక్కయ్యకూ ఆన్ లైన్ లో మా ఊరికి ట్రైన్ టికెట్లు బుక్ చేయమ్మా" !
“ఇప్పుడు ఉన్న ఫళంగా అత్తయ్యను తీసుకెళ్లమేమి”టంటూ ఇద్దరికోడళ్లూ అభ్యంతరం చెప్పారు..
“అంటే మీకు చాకిరీ చేసేవాళ్లు దొరకరనా” అంటూ అనసూయ తీక్షణంగా ప్రశ్నించేసరికి బదులు ఇవ్వలేకపోయారు..
“చూడండమ్మా మీ కుటుంబ విషయాలలో కలగ చేసుకోకూడదు, నిజమే. కాని మీ అత్తగారు, నడుం సహకరించలేకపోయినా, మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నా చిన్న పిల్లలా మీకు చాకిరీ చేస్తోంది.. అదే మీ అమ్మ అయితే మీరు ఇలా చేయించేవారా ? మీ ఇంటి ప్రహరీ గోడపై చెక్కిన భ్రమరాంబా-నీలకంఠ నిలయం అన్న బోర్డును రోజుకు వందసార్లు చూస్తున్నారు కదా?
మీకు ఆ పాలరాతి ఫలకం పై బంగారురంగు అక్షరాలు మిల మిలలు మాత్రమే కనపడుతున్నాయి.. ఆ ఇంటి కోసం మీ అత్తగారు మామగారు ఎంత కష్టపడ్డారో తెలుసా ? వారి ప్రతీ స్వేద బిందువుతో తయారయిందీ భవంతి..
చూడు వరూధినీ, మీ మావగారు ఎప్పుడూ బిజినెస్, వ్యవసాయం అంటూ తిరుగుతున్నా మీ అత్తగారు మీ భర్తలను చిన్నతనంలో కళ్లల్లో వత్తులేసుకుంటూ మరీ పెంచి ప్రయోజకులను చేసింది.. ఏడవ నెలలోనే పుట్టిన మీ ఆయన దక్కుతాడా లేదా అనుకుంటూ బెంగటిల్లుపోతూ తిండికూడా తినకుండా అహర్నిశలూ వాడిని కంటికి రెప్పలా చూసుకుంటూ కాపాడుకుంది.. వసుధా, మీ ఆయనకి చిన్నప్పుడు ఫిట్సు వస్తూ ఉండేవి.. అనేక వైద్యాలు చేయిస్తూ ఆరోగ్యవంతుడిని చేయడానికి ఎంత కష్టపడిందో తెలుసా..
కొడుకులూ, కోడళ్లు మనవల మధ్య హాయిగా ఆనందంగా గడపాల్సిన అక్క ఇలా ఓపిక లేకపోయినా దీనంగా మీకు చాకిరీ చేయాలసిన అవసరం లేదు.. ఏమనుకుంటున్నారు మా భ్రమరక్క గురించి ?
తలచుకుంటే అది మహారాణిలా కూర్చుని మిమ్మలనందరినీ శాసించవచ్చు..
కానీ దాని తత్వం కాదది.. మిమ్మలని తన వాళ్లనుకుంటూ అహర్నిశలూ మీ కోసం శ్రమిస్తోంది.. దాని అమాయకత్వం, మంచితనం మీకు లోకువైపోయిందా ?
అక్కా బావ మా ఊరు వచ్చేస్తారు.. అక్కడే ఓ ఇల్లు కట్టుకుని హాయిగా స్వతంత్రంగా ఉంటారు.. నేను వాళ్లను చూసుకుంటాను.. అది చెపుదామనే పిలిచాను..”
కోడళ్లిద్దరి ముఖంలో నెత్తురుచుక్క లేనట్లు పాలిపోయింది.. ఏమీ మాట్లాడలేనట్లుగా అక్కడనుండి వెళ్లిపోయారు..
అదేమిటే అనసూయా, నేను నీతో వచ్చేయడమేమిటే ? నేను లేకపోతే ఇక్కడ క్షణం గడవదు.. పిల్లలు బెంగపడిపోరా ?
చూడు భ్రమరక్కా, వాళ్లల్లో మార్పు రావాలని నీవు ఆనందంగా ఉంటే చూసి సంతోషపడాలని నేను తాపత్రయపడుతుంటే నీవేమిటే మరీ అంతగా భయపడతావేమిటే వాళ్లకు ? నీకేమి తక్కువే పిచ్చి అక్కా ?”
“భయం కాదే అనసూయా, పిల్లలే నా బలహీనత.. వాళ్లను విడిచీ ఎక్కడకూ రాను.. వాళ్లతోనే నా జీవితం..”
అక్కమాటలకు తెల్లబోయింది..
మరునాడు పొద్దుటే వసుధ వరూధిని కంటే ముందే లేచేసింది..
చక చకా కాఫీ కలిపి అత్తగారికీ పినత్తగారికీ అందించి వాళ్ల దగ్గరే కూర్చుని ‘కాఫీ ఎలా ఉంది అనసూయత్తా’ అంటూ అభిమానంగా అడిగింది..
“చాలా బాగుందమ్మా.. ఏంటీ పెందరాళే లేచిపోయావు ?”
“ఇంక రోజూ ఇలాగే లేస్తాను అత్తయ్యా.. నేను అక్కా నిర్ణయించుకున్నాం, ఇద్దరం కలసి పనిపాటలు చేసుకోవాలని.. మా అత్తగారిని శ్రమ పెట్టకూడదని..”
ఈలోగా వరూధిని కూడా అక్కడకు వస్తూ, “వసుధా! పెసలు గ్రైండర్ లో వేసేయనా ? పెసరట్లు నేను పోస్తాను.. ఉప్మా నీవు చేస్తానన్నావుగా, అన్నీ రెడీ చేసాను..”
“ఆ వస్తున్నానక్కా, అత్తయ్యనూ, అనసూయత్తనూ వెళ్లనీయకుండా ఆపేద్దాం అన్నావుకదా రాత్రి..”
“అవును అన్నాను..”
“వాళ్లు ఎక్కడకూ వెళ్లరు వసుధా.. మనం ఇలా కలసి మెలిసి పనిచేసుకుంటుంటే మనలని చూస్తూ ముచ్చటపడిపోతూ మేము ఎక్కడకీ వెళ్లం, ఇక్కడ మీతోనే ఉంటాం అంటారు చూడు..”
“అత్తయ్యా పెద్దవారు మీరు.. మీకు ఇవ్వాలసిన గౌరవం ఇవ్వకుండా మీ చేత చాకిరీ చేయించుకుంటున్నాం.. మమ్మలని క్షమించం”డంటూ ఇద్దరూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు..
“అనసూయత్తా, మీకు మేమిద్దరం బుుణపడి పోయి ఉంటాం.. కోడళ్లు అంటే ఎలా ఉండాలో చక్కగా తెలియచేసారు..
“మీరు నన్ను అంతగా పొగడనవసరం లేదమ్మా.. చదువుకున్న పిల్లలు, సంస్కారవంతంగా ప్రవర్తించమనే నా సలహా.. ఇంతకీ మా కోడళ్లు ఒట్టి కబుర్లు తోనే కడుపునింపుతారా ? ఏవీ కమ్మని వేడి వేడి పెసరట్లూ, ఉప్మా” అంటూ అక్కడ వాతావరణంలో నవ్వులు పూయించింది అనసూయమ్మ..
***
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments