top of page
Writer's pictureRadha Oduri

మరోజన్మ ఇద్దరికీ


'Marojanma Iddariki' written by Oduri Radha

రచన : ఓడూరి రాధ

చిట్టి తల్లి కాలేజీ నుంచి వచ్చింది.

నాన్న సుదీప్ కూతురి దగ్గర కూర్చుని అన్నం తినిపిస్తున్నాడు.

అమ్మ రమణి ఆల్బమ్ లో ఫొటోలు చూస్తూ " చిట్టీ! చూడు ఎంత అందంగా ఉన్నావో! చిన్నప్పుడు. మీ అమ్మమ్మ కూడా ఉంటే ఎంత బాగుండునో కదా! అంటూ అమ్మమ్మ తో ఉన్న ఫొటో చూపించింది. చాలా సార్లు చూసింది ఆ ఫోటో. ఒక్కసారి గా గతంలోకి వెళ్ళింది.


రోడ్డు మీద వాహనాలు దుమ్ము రేపు కుంటూ పోతున్నాయి. ఎర్రటి ఎండలో ఆ దుమ్ము కూడా ఎండ వేడిలో కలిసిపోయి చుర్రుక్కు పుట్టిస్తోంది.

వాకిట్లో కూర్చుని అమ్మ కోసం ఎదురుచూస్తున్న ఆరేళ్ళ చిట్టి చుర్రున తగులుతున్న వేడిని కూడా లెక్క చేయకుండా ఆశగా ,దీనంగా ఎదురుచూస్తోంది. పాల బుగ్గల పై కన్నీటి చారలు, మెరిసే కళ్ళల్లో దిగులు, అమ్మ కోసం ఆరటపడుతోందని చూడగానే తెలిసిపోతుంది. అరుగు మీద కూర్చుని చిట్టి చిట్టి చేతి వ్రేళ్ళతో ఒకటి, రెండు, మూడు… పది, పదకొండు అని లెక్కపెట్టి.. పరుగెత్తుకుంటూ అమ్మమ్మ మీనాక్షమ్మ దగ్గరకు వెళ్ళింది.

"అమ్మమ్మా! అమ్మమ్మా! " అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళింది.తన చిట్టి చిట్టి పాదాల్లో ఆరాటం కనిపిస్తోంది.

"ఏం చిట్టీ! ఏం కావాలి "అంటూ ఒళ్ళోకు తీసుకుంది.

" మరే అమ్మ ని మన ఊర్లో వదిలి పదకొండు రోజులయ్యింది కదా! "

"అవును! చిట్టీ! " అంటూ తన గుండెలకు హత్తుకుంది. "మరి పది రోజుల తర్వాత అమ్మ మన దగ్గరకు వస్తుందన్నావు కదా! మరి రాలేదేంటి అమ్మమ్మా? " అంటూ బిక్క మొహంతో అమ్మమ్మ మెడను చుట్టుకుపోయింది.


మీనాక్షమ్మ కి దుఃఖం పొంగుకొస్తోంది' ఏమని చెప్పను! చిట్టి తల్లి కి!? ఎలా చెబితే అర్థం అవుతుంది!? ఆడి పాడే వయసు తల్లి తండ్రులతో. అలాంటి పిల్లకి ఇంత కష్టమా!?'

మీనాక్షమ్మ చిట్టి తల నిమురుతూ "చిట్టీ! నువ్వు బడి కెళ్ళి బాగా చదువుకుంటే అప్పుడు నీకు సెలవులు ఇస్తారు కదా! అప్పుడు మనమే అమ్మ దగ్గరకు వెడదాం సరేనా!"

"అంటే! అమ్మకి నేను బాగా చదువుకోవాలని ఇలా చేస్తుందా!? "

"మరి! నువ్వు బాగా చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది కదా! "

అమ్మమ్మ అలా అనేసరికి తనకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొని,

"మరి! నన్ను చూడకపోతే అమ్మ కి బాధ కలగదా!? అడిగింది రెప్ప వెయ్యకుండా.


మీనాక్షమ్మ దుఃఖాన్ని అదుపులో పెట్టుకుని, గుండె దిటువు చేసుకుని చిట్టి తల్లి కళ్ళల్లోకి చూస్తూ.. "చిట్టీ! మీ ఊరిలో మంచి స్కూల్స్ లేవు కదా! నిన్ను చదివించాలంటే డబ్బులు కావాలి. అందుకే అమ్మ నాన్న అక్కడ నీకోసం కష్టపడి డబ్బులు సంపాదించి పంపుతారు".

"నేను కూడ పనిచేసి నిన్ను చదివిస్తాను. బడికి సెలవులు వచ్చినప్పుడు మనం ఊరు వెడదాం సరేనా! "

చిట్టి తల్లి బాధ తో కూడిన ఆనందంతో ఒప్పుకుంది.

రోజులు గడుస్తున్నాయి.

మెుదట్లో బాగా ఏడ్చిన చిట్టి మెలమెల్లగా చదువులో పడిపోయింది ఆనందంగా అమ్మ కోసం.

వేసవి సెలవులు వచ్చాయి.

"అమ్మమ్మా! పద వెడదాం మా అమ్మ దగ్గరకు" అంటూ కాళ్ళకు చుట్టుకుపోయింది.

మీనాక్షమ్మ నవ్వుతూ చిట్టి తల్లిని దగ్గరకు తీసికొని " అలాగే పదరా!వెడదాం! " అంటూ బట్టలు కూడా సర్ది ప్రయాణం అయ్యారు. ఇద్దరూ బస్సులో ప్రయాణం అయ్యారు.

చిట్టి తల్లి అమాయకంగా, అమ్మని చూస్తున్నానన్న ఆనందంతో, అమ్మమ్మ ఒళ్ళో తల పెట్టుకొని నిద్ర పోతోంది. మీనాక్షమ్మ కళ్ళ వెంట కన్నీరు.

'దీనికి ఎలా అర్థం అవుతుంది. చిట్టి స్కూల్ నుంచి వచ్చేసరికి, దీని నాన్న తాగి అమ్మ ని కొడితే! దెబ్బలు తాళలేక చనిపోయింది. వాడు జైల్లో ఉన్నాడు'.

'దీనికి ఎక్కడ తెలిస్తే ఏమవుతుందోనని దహన సంస్కారాలు చేసి ఇది స్కూల్ నుంచి ఇంటికి రాబోతుంటే అటు నుంచి అటే నా ఇంటికి తెచ్చుకున్నాను'.

'ఇంక నేను ఎక్కువ కాలం బతకను. అందుకే దీనిని దత్తతకి ఇస్తున్నాను'.

దీనికి మంచి రోజులు వస్తాయి. ఎంతో ఇష్టంగా అడిగారు దీనిని.

బస్సు ఆదోనిలో ఆగింది.

అక్కడ చిట్టి తల్లి కోసం కొత్త అమ్మ, నాన్న, నానమ్మ ఎదురుచూస్తున్నారు.ఆదమరచి నిద్ర పోతున్న చిట్టి ని వదలలేక వదలలేక వారి దగ్గర వదిలి వెళ్ళింది మీనాక్షమ్మ దుఃఖంతో.

చిట్టి తల్లిని వారి దగ్గర వదిలి వెళ్ళిన మూడు రోజులకు మీనాక్షమ్మ తన కూతురి దగ్గరకు వెళ్ళిపోయింది.

జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి 'పెంచిన తల్లిలో ఇంతటి మమకారం ఉంటుందా! ' అనుకుంటూ అమ్మ రమణి కి గట్టిగా ముద్దు పెట్టి అమ్మ ఒళ్ళో పడుకుంది.

కంటేనే అమ్మ అంటారా!!?

***అయిపోయింది***


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం : రాధ ఓడూరి

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్‌.కామ్‌ చేసాను పెళ్ళి తరువాత కొన్ని సంవత్సరములు ఉపాధ్యాయవృత్తి చేపట్టాను. మా చిన్నమ్మాయి పుట్టాక పూర్తిగా నా ఉపాధ్యాయ వృత్తి కి స్వస్తి చెప్పి పిల్లల పెంపకంలో నిమగ్నమైనాను. ముఖ పరిచయం లని ఫేస్‌ బుక్‌ అన్నయ్య ఇచ్చిన ప్రేరణ తోనే కథలు, కవితలు రాస్తున్నాను.గత రెండుసంవత్సరముల నుంచి విరామ సమయాలలో కథలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. నేను బహుమతులను నగదురూపంలో అందుకున్నాను. లక్ష్యం: నా కథల ద్వారా సమాజంలోని ప్రతీ వ్యక్తి కీ పాజిటివ్‌ ఆలోచనలు ఏర్పడాలని. అలా రాసిన కథలలో "మరోజన్మ ఇద్దరికీ" మీ ముందుకు తీసుకువచ్చాను. నా కథలని ఆదరిస్తారని తలుస్తూ, ఇకపై మరింత విలువైన కథలని మీ ముందుకు తెస్తాను.



95 views0 comments

Comments


bottom of page