top of page

మార్పు - పార్ట్ 2
'Marpu Part 2/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 26/12/2023

'మార్పు - పార్ట్ 2/2' తెలుగు పెద్ద కథ

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


ఒంటరిగా ఉన్న తల్లిని తమ దగ్గరకు తీసుకోని వస్తానంటాడు శేఖర్.

అంగీకరించదు భార్య పద్మ. కనీసం కొద్దిరోజులైనా ఉంచుకొని పంపిద్దామంటే సరేనంటుంది. 

తల్లితో పాటు అత్తగారిని కూడా పిలిపిస్తాడు.

తన నెక్లెస్ కనపడక పోవడంతో అత్తను అనుమానిస్తుంది పద్మ.   


ఇక మార్పు పెద్దకథ చివరి భాగం చదవండి..


పద్మ చెంప చెళ్ళుమనిపించాడు శేఖర్. అనుకోని ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయింది పద్మ. ఏనాడు తన మీద చెయ్యి చేసుకోని భర్త తన మీద చెయ్యి చేసుకునేసరికి కోపం తట్టుకోలేకపోయింది. సర్రున పూజ గదిలోకి వెళ్ళి బరబరా అత్తను ఈడ్చుకువచ్చింది. 


“చెప్పు, నా నెక్లెస్ ఎక్కడ దాచావో చెప్పు, నీ దొంగబుద్ది బయటపడదనుకున్నావు. చేసేంత చేసి ఏమి తెలియనట్టు దేవుడి ముందు కూర్చోగానే పెద్ద భక్తురాలివి అనుకుంటున్నావు. చెప్పు మర్యాదగా.. ఎక్కడ దాచి పెట్టావో చెప్పు. లేకపోతే పోలీసులను పిలుస్తాను, ” అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరెగిరిపడుతూ ఒకచేత్తో చెంపమీద రాసుకుంటూ అత్తమీద అరుస్తుంది. 


“ఏంటి పద్మ, నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు. బాబు శేఖర్.. ఇదేం మాట్లాడుతుందో నాకు చెప్పరా, ” భయంతో వణికిపోతూ అడిగింది కొడుకును. 


“నువ్వుండమ్మా .. ఏయ్ పద్మ మర్యాదగా మా అమ్మకు క్షమాపణ చెప్పు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు, ” అంటూ మళ్ళి చెయ్యెత్తాడు భార్యమీదకు. 


“నాయన ఆగు, ఆవేశపడకు. నేను చెప్పేది విను. ఆ నెక్లెస్ ఎక్కడికి పోలేదు. నా దగ్గరనే జగ్రత్తగా ఉంది. ముందు మీరు కోపం తగ్గించుకోండి, విషయం చెబుతాను, ” అంటూ అల్లుడు కూతురు మధ్య వచ్చినిలబడింది రుక్కమ్మ. 


ఒక్కసారిగా చల్లబడిపోయింది పద్మ. అర్థంకానట్టుగా అత్త వైపు చూసాడు శేఖర్. భయంతో వణికిపోయినా భారతమ్మకు విషయం అర్థమై కూర్చిలో కూర్చుంది నిదానంగా. 


“అమ్మా! నువ్వు నువ్వు నా నేక్లెస్ తీసావా, ” తడబడతూ అడిగింది తల్లిని నమ్మలేక. 


“అవును పద్మ.. నీ నెక్లెస్ నా దగ్గరనే భద్రంగా ఉంది అంటే అది మీ అత్తగారి చలువ. ఆమె గనుక చూసి తియ్యకపోతే నీ రవ్వలనెక్లెస్ తో పాటు నీ కొడుకును దొరకబట్టుకుంది

మీ అత్త. అర్థం కాలేదు కదూ.. పిల్లలను ప్రేమ చెయ్యాలి కానీ మితిమీరిన ప్రేమ ఎంత కొంపముంచుతుందో నిన్ను చూసాక అర్థమైంది, నువ్వు చెప్పు ఒదిన, ” అంది రుక్కమ్మ వియ్యంకురాలితో. పద్మకు నోటమాట రావడంలేదు నోరు తెరుచుకుని అలానే చూస్తుండిపోయింది అత్తను. 


“ఆ రోజు మనోజ్ ఎక్కడికో వెళ్లడానికి తయారవుతున్నాడు. వెళ్ళేముందు నా గదిలోకి వచ్చి నా పరుపుకింద దాచుకున్న నీ రవ్వల నెక్లెస్ తీసి బ్యాగులో పెట్టుకోవడం నేను చూసాను. వాడు బాత్రూంకోసమని వెళ్లాడు. నాకు అనుమానం వచ్చి వాడి బ్యాగు తెరిచి చూసాను. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ధగధగమెరుస్తున్న దాన్ని తీసి పరుగున 

వెళ్ళి ఇదిగో మీ అమ్మగారికిచ్చాను. వాడు బ్యాగు తీసి చూడలేదు. ఉందిలే అనుకున్నాడేమో వెళ్ళిపోయాడు.


వచ్చాక చూసారా వాడి ముఖం.. నవ్వు మరిచిపోయిన వాడిలా ఉంటే, మీరేమో ఒంట్లో బాగాలేదని వాడిని అపురూపంగా చూస్తున్నారు. నీ కొడుకుకు నా మీద అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది లేకపొయ్యుంటేనా తల్లిలాగా నా గొంతు పిసికేసేవాడేమో, ” అంది. 


“అత్త.. నన్ను క్షమించు నేను తప్పు చేసాను, ” అంటూ చెంపలు టపటప కొట్టుకుంది. 


“అవునమ్మా.. పద్మ నిన్ను అవమానించింది క్షమించమ్మా, ” అడిగాడు తల్లిని. 


”ఛ ఛ నేను క్షమించడమేంటి, పిల్లలను అతి గారాబంతో మనమే చెడగొడతాము, చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు, పిల్లలను ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి, వాళ్ళు ఎంత పెద్దవాళ్లయిన మన చూపు వాళ్ళమీద ఉండాల్సిందే, వాళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు గదా అని వాళ్ళడిగినదల్లా చేస్తుంటే ఇలాగే ఉంటుంది, ఇవాళ వాడి అవసరానికి ఇంట్లో ఉన్న వస్తువును ఎవరికి తెలియకుండా కాజేద్దామనుకున్నాడు, ఇదే అలవాటు రేపు బయట కూడా చెయ్యాలనిపిస్తుంది.


 అప్పుడెంత ప్రమాదంలో పడుతాడో అర్ధంచేసుకోండి, నేను చూసాను కాబట్టి వాడికి తెలియకుండా వాడి బ్యాగులోనుండి తీసి మీ అమ్మకు ఇచ్చాను, పొరబాటున అది నా దగ్గర దొరికితే నన్నే దొంగ అనుకునే ప్రమాదం ఉందని తెలుసు, ” అంది కోడలివైపు చూస్తూ. 


“అవునమ్మా .. అతి గారాబం చేసి వాళ్ళడిగిందల్లా ఇస్తున్నాము. పైగా పిల్లలు కాలేజీకి వచ్చారు. వాళ్ళకు ఏమైనా ఖర్చులుంటాయని ప్రతినెలా పాకెట్ మని ఇస్తూనే ఉన్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోలేకపోయాము. మా పెంపకం చాలా బాగుందని మురిసిపోయామే గాని ఇలా తయారవుతారని తెలుసుకోలేకపోయాము. మా పనుల్లో మేము బిజీగా ఉంటున్నాము. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, చెప్పిన మాట చక్కగా వింటారు అని ఆనందపడినాము. మా వెనక ఇంత జరుగుతున్నా కనిపెట్టలేదంటే మేము తల్లితండ్రులుగా ఓడిపోయినట్టే. ఆ దేవుడు బుద్ది పుట్టించాడు కాబట్టి పద్మ వద్దంటున్నా నిన్ను నేను తీసుకవచ్చాను. మా కళ్ళు తెరిపించడానికి నువ్వు వచ్చావు అమ్మా, నువ్వు ఇంకెక్కడికి పోనవసరంలేదు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే మంచి చెడు తెలుస్తుందని ఊరికే అనలేదు.ఎవ్వరికి ఇష్టమున్నా లేకున్నా నువ్వు నాతోపాటే ఉండాలి, ” భార్య వైపు కోపంగా చూస్తూ తల్లితో అన్నాడు శేఖర్. 


“అత్తయ్యా .. మీ అబ్బాయేకాదు నేను చెబుతున్నాను, ఇక నుండి మీరు మాతోపాటే ఉంటూ మమ్మల్ని మా పిల్లలను మంచి నడవడికతో ఉండేలా మీరే చూసుకోవాలి, నా కొడుకు చేసినా పొరపాటు వలన నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నా కుటుంబం మాత్రమే ఉండాలి అనుకున్న నాకు తగిన శాస్తి జరిగింది. తల్లి తండ్రులుగా వాళ్ళకు చదువు డబ్బు సమకూరుస్తున్నాము, కాకపోతే నిశితంగా వాళ్ళమీద దృష్టిపెట్టాలన్న ధ్యాస మాకులేదు. పెద్దవారుగా మీరు అన్నీ గమనించగలరని మిమ్మల్ని చూసాక అర్ధమైంది, నా తప్పును మన్నించండి, ” అంది మరోసారి. 


“పద్మ.. ఏంటమ్మా ఇది నీ పిల్లలు చెడిపోతే నాకు మాత్రం బాధ ఉండదనుకున్నావా? వాళ్ళు నా వంశాంకురం మీకు చెడ్డపేరు వస్తే నాకు వచ్చినట్టు కాదా చెప్పు, సరే జరిగిందేదో జరిగిపోయింది నాకు మాత్రం అక్కడెవరున్నారని మీతోపాటే నేను ఇక్కడే ఉంటాను సరేనా, కానీ ఈ విషయం వాడికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా మనమే వాణ్ణి మార్చుకుందాము సరేనా, ” అంది కోడుకు కోడలితో. 


“అంతే కాదు పద్మ.. నన్ను కూడా ఇక్కడే ఉండడానికి తీసుకవచ్చాడమ్మా మా అల్లుడు, ” అల్లుడివైపు చూస్తూ చెప్పింది రుక్కమ్మ. 


“అమ్మా నువ్వు చెబుతున్నది నిజమా.. ఏమండి మీ మంచి మనసును అర్థం చేసుకోలేక మిమ్మల్ని బాధపెట్టాను నామీద కోపంగాలేదు మీకు, ” అడిగింది భర్తను. 


“అదేమిటి పద్మ .. నీమీద కోపం ఎందుకుంటుంది, ఇద్దరం గొడవలు పడినా ఒకరినొకరం అర్థం చేసుకోవాలి, అంతే గానీ కోపంతో సాధించేది ఏం ఉంటుంది చెప్పు, అయినా ఇప్పుడు 

నువ్వు మారిపోయావు నాకు అది చాలు, ” అన్నాడు భార్యతో. 


“నానమ్మ .. నాది తప్పయిపోయింది ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను, నువ్వు చూసావు కాబట్టి నా దొంగతనం బయటపడింది. లేకపోతే ఆ డబ్బుతో నేను విచ్చలవిడి ఖర్చు పెట్టేవాడిని. నా స్నేహితులందరు నన్ను మెచ్చుకుంటుంటే పొంగిపోవాలనుకున్నాను. వాళ్ళడిగిందల్లా చేద్దామనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను, దాన్ని ఏదైనా షాపులో అమ్మి డబ్బులు తీసుకుందామని. నా బ్యాగులో చూసాను. కనిపించలేదు, నా స్నేహితులతో చెప్పాను. అప్పుడందరూ నన్ను తిట్టిపోసారు. నేను చాతకాని దద్దమ్మనని, నావి అన్ని వట్టి మాటలేనని. నేను కాదంటే ఇంకెవరినన్నా డబ్బులు అడిగా వాళ్ళం అన్నారు. నాకు తల కొట్టేసినట్టయింది. నేను డబ్బులు తేలేదని నాతో ఎవ్వరు సరిగా మాట్లాడడం లేదు. నాకు అప్పుడనిపించింది నానమ్మా.. ఛీ వాళ్ళకోసమా నా తల్లి నగ తెచ్చాను.. డబ్బులుంటేనే వీళ్ళకు నా స్నేహం కావాలి, ఛీ ఛీ తప్పు చేసాను ఇప్పుడు మా అమ్మకు ఏ ముఖం పెట్టుకుని చెప్పాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోతున్నాను, 

ఇంతసేపు మీరు మాట్లాడుకున్నది విన్నాక నన్ను కూడా మీరు క్షమిస్తారని వచ్చాను

ముఖ్యంగా నానమ్మా నువ్వు, ” అంటూ నానమ్మ ఒడిలో తలపెట్టుకుని చిన్న పిల్లవాడిలా ఏడవసాగాడు కిరణ్. 


“కిరణ్ ఏమిట్రా ఇది.. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, నిన్ను అందరం క్షమించినట్టే ఇంకెప్పుడు తప్పుడు పనులు చెయ్యకూడదని నీ మనసులో గట్టి నిర్ణయం 

చేసుకో సరేనా, ” అంటూ మనవడి తల నిమిరింది ఆప్యాయంగా. 


వాళ్ళిద్దరిని అలా చూస్తూ

తృప్తిగా నవ్వుకున్నారు పద్మ, శేఖర్. 


========================================================================

సమాప్తం

========================================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 

37 views0 comments

Comments


bottom of page