'Mathruhrudaya Mahatthu' New Telugu Story
Written By Chennuri Sudarsan
రచన: చెన్నూరి సుదర్శన్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అది ఎర్రగట్టు పోలీసు స్టేషన్.. హసన్ పర్తి.
రాజశేఖరం ఎస్సై సెల్ ఫోన్ ఆన్ చేసి సమయం చూసాడు. దాదాపు ఎనిమిది కావస్తోంది. బయట అంతా ప్రశాంతంగా ఉంది. శీతాకాలం..
జనసంచారం లేక అర్థరాత్రి అయిందన్న అనుభూతి కలుగుతోంది. ‘ఈరోజు డ్యూటీ ప్రశాంతంగా ముగిసినట్టే.. ఈరోజు ఏంటి? ప్రతీ రోజు ప్రశాంతంగానే ముగుస్తోంది. ఈ స్టేషన్లో చేరి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. కనీసం కీసులాడుకునే కేసు గూడా నమోదు కాలేదు. ఊరి గట్టు మీది గట్టమ్మ తల్లి చల్లంగా చూస్తుందనే ప్రజల నమ్మకం.. ’ అనే ఆలోచన ముఖం కవళికలను మార్చబోయింది.. పెదవులు విచ్చుకో బోతున్నాయి.
అంతలోనే ఆగమన్నట్టు అతని ఆరవస్మృతిపథం హెచ్చరించింది.
‘నిజమే.. ఈ ఉద్యోగమే అంత. పోలీసు నిఘంటువులో విశ్రాంతి అనే పదమే లేదు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. కాసేపు శారీరక విశ్రాంతి దొరుకుతుందేమో! గాని మానసిక ప్రశాంతతకు పోలీసులు నోచుకోలేదు’ అని మనసులోకి రాగానే.. చిరునవ్వుతో తన గది నుండి బయటకు వచ్చాడు రాజశేఖరం.
అతణ్ణి చూడగానే స్టేషన్ కాపలాదారుడు కనకయ్య కడక్ సలాం చేసాడు. రాజశేఖరం జాగ్రత్త అన్నట్టు చేతితో సంజ్ఞ చేస్తూ స్టేషన్ మెట్లు దిగుతుంటే.. ఒక అమ్మాయి పరుగెత్తుకుంటూ రావడం.. కంట పడింది. చటుక్కున ఆగిపోయాడు.
“పోలీస్ అంకుల్.. ” అని వెక్కి, వెక్కి ఏడువసాగింది. ఆయాసంతో గొంతు నుండి మాట పెకలడం లేదు. ఎంతో ప్రయాస పడుతూ.. “కాపాడండి” అనగలిగింది.
ఆమె ఏడుపు తారాస్థాయికి చేరింది. కనకయ్య పరుగు, పరుగున వచ్చి అమ్మాయిని చూసి గుర్తుపట్టాడు.
“సార్.. ఈ అమ్మాయి అనంతయ్య కూతురు” అంటూ అమ్మాయి వైపు తిరిగి “నీ పేరు నీరజ కదమ్మా” అడిగాడు ఆప్యాయంగా.
అవును అన్నట్టుగా తలూపింది. ఆమె ఎదలో ఏదో భయమావహించి కంపించి పోతోందని గ్రహించిన రాజశేఖరం ‘భయపడకు’ అన్నట్టు నీరజ భుజం తట్టుతూ.. తన గదిలోకి తీసుకు వెళ్ళాడు. కుర్చీలో కూర్చోవడం లేదు.
“ఫరవాలేదమ్మా.. కూర్చో.. ” అంటూ మరో మారు ధైర్యం చెప్పి కూర్చోమన్నాడు.
“ఇప్పుడు చెప్పు నీరజా.. ఎందుకు భయపడుతున్నావు. ఎక్కడి నుండి పరుగెత్తుకుంటూ వస్తున్నావు” అని అడుగుతూ.. నీరజ వంక పోలీసు చూపులకు పదును పెట్టాడు రాజశేఖరం. బహుశః టీనేజీ లోకి అడుగు పెట్టినట్టుగా కనబడుతోంది. తల చెదిరి, కుడి బుగ్గపై గాటు.. అర్థమయ్యింది.
“భయపడకు నీరజా.. కాపాడండి అంటూ పరుగెత్తుకుంటూ వచ్చావు. తప్పకుండా కాపాడుతాను. నువ్వు నా కూతురులాంటి దానివి ” అంటూంటే ఈమధ్యనే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అతని కూతరు జ్ఞప్తికి వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. కర్చీఫ్ తో కళ్ళు ఒత్తుకుంటూ.. భరోసా ఇచ్చాడు రాజశేఖరం.
నీరజ కాస్త తమాయించుకుంది. తను ఆపద నుండి తప్పించుకొని పరుగెత్తుకుంటూ వచ్చి పోలీసు స్టేషన్ చేరుకోవడం.. రాజశేఖరం ధైర్య వచనాలు ఆమెను నోరు విప్పేలా చేసాయి. తల వంచుకునే.. పెదవులు వణకుతుంటే.. ఒక్కొక్క పదం నెమ్మది, నెమ్మదిగా..
“ఊరి నుండి నీ బావ వచ్చాడు. హోమ్ వర్క్ చేయిస్తాడు. ఈ రాత్రికి అక్కడే పడుకోవాలి.. అంటూ నన్ను గది లోకి పంపింది అమ్మ. అతనెవరో నాకు తెలియదు పోలీస్ అంకుల్. ఎప్పుడూ చూడనే లేదు. నేను అక్కడ పడుకోనని ఏడ్చినా వినలేదు. బయట గడియ పెట్టింది” అంటుంటే నీరజ కన్నీటిబొట్లు నేల మీద జల, జలా.. రాలసాగాయి. గొంతు తడారి పోయింది.
నీళ్ళ గ్లాసు అందించాడు రాజశేఖరం. గుక్కెడు తాగి మళ్ళీ చెప్పసాగింది.
నీరజ. “వాని చేష్టలు నాకు భయమేసింది. సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూపిస్తూ.. నన్ను తన పైకి లాక్కున్నాడు. బాత్ రూమ్ వెళ్తానని ఇంటి వెనుకాలకు వెళ్లి తప్పించుకొని పారి పోయి వచ్చాను” అంటూ రెండు అరచేతులు గుండెలకు హత్తుకుని వణక సాగింది.
“భేష్ నీరజా.. ! నీలా ధైర్యంగా ఎదురించిన అమ్మాయిలను నేనింత వరకు చూడ లేదు. ఇక నీకు వచ్చిన భయమేమీ లేదు. నేను చూసుకుంటాను. వాడెవడో.. మీ అమ్మ ఎలాంటిదో.. అన్నీ కనుక్కుంటాను.. మీ అమ్మ పేరు ఏం పేరు? ”
“ఆదెమ్మ పోలీస్ అంకుల్”
మౌనంగా తలూపుతూ.. “ఫోర్ నాట్ టూ.. ” అంటూ పిలిచాడు.
రాజశేఖరం. అలా కానిస్టేబుల్ నంబరుతో పిలవడం కద్దు. తన రిలీవర్ రాగానే డ్యూటీ అప్పగించిన కనకయ్య పరుగెత్తుకుంటూ వచ్చాడు.
“కనకయ్యా.. మనం నీరజ ఇంటికి వెళ్దాం. జీపు తీయి” అని హుకుం జారీ చేసాడు.
***
రాజశేఖరం సూచనల మేరకు అనంతయ్య ఇంటికి కాస్త దూరంలోనే జీపు ఆపాడు కనకయ్య. జీపు దిగి అనంతయ్య ఇంటికి దారి తీస్తుంటే.. మధ్య, మధ్యలో నీరజకు ధైర్యంచెబుతూ.. అతణ్ణి అనుసరించాడు రాజశేఖరం.
అనంతయ్య ఇంట్లో నీరజ గురించి ఘర్షణ పడుతున్నట్టు ఘాటైన మాటలు వినవస్తున్నాయి. తలుపు మీద లాఠీతో టక, టకా బాదాడు రాజశేఖరం.
అనంతయ్య, ఆదెమ్మలు ఉలిక్కి పడ్డారు. భయం, భయంగా తలుపు తీసాడు అనంతయ్య. అతని వెనుకాలే ఆదెమ్మ. పోలీసులను చూడగానే.. కొయ్యబారి పోయారు.
“నీరజా.. ఈమేనా! నిన్ను బావ దగ్గరికి పంపించింది” అంటూ అడిగాడు రాజశేఖరం. అవునన్నట్టుగా తలూపింది నీరజ.
“సర్.. వాడు నిజంగానే మా మేనల్లుడు మనోహరు. నీరజ చూడ్డం ఇదే మొదటి సారి. వాడు పిల్లను ఏమన్నాడో ఏమో..! భయపడి పారి పోయాడు” అని అంటూండగానే.. లోపలి గదిలో నుండి గబుక్కున ఒకడు బయటకు వచ్చాడు.
“సార్.. నేను వీళ్ళ మేనల్లుడను కాను. అమ్మాయి బోణి నీదేనంటూ ఎర చూపారు. ఒక రాత్రికి రెండు వేలని రేటు కుదుర్చుకొని వచ్చాను. ఇంట్లో అయితే పోలీసుల రైడింగ్ ఉండదని నమ్మకంగా భరోసా ఇచ్చారు. నాకూ కొత్త.. అమ్మాయిని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియదు. అమ్మాయి భయపడి పారి పోయింది. అదుగో ఆ అమ్మాయే” అంటూ నీరజను చూపాడు మనోహరు.
అనంతయ్య, ఆదెమ్మలు కళ్ళు తేలేయడం.. పోలీసులు తాను చెప్పేది నమ్ముతున్నారని గ్రహించిన మనోహరు గొంతు పెంచాడు.
“సార్.. వీళ్ళది ఇదే వ్యాపారమనుకుంటాను” అంటూ పూర్తిగా అనంతయ్య, ఆదెమ్మల వ్యవహార శైలి చెబుతూ.. నేరం సాంతం వారి మీదనే మోపాడు. తనకిదే మొదటి అనుభవమని.. క్షమించి వదిలేయమన్నట్టు ప్రాధేయపడ్డాడు.
“ఇదంతా ఇక్కడ తేలే విషయం కాదు” అంటూ కనకయ్యను చూశాడు రాజశేఖరం. అతని చూపులు అర్థం చేసుకున్న కనకయ్య బయటకు పరుగెత్తాడు. జీపు తీసుకు వచ్చి అందరినీ ఎక్కించాడు. నీరజను తనతో బాటుగా ముందు కూర్చుండ బెట్టుకొని తదుపరి కార్యక్రమానికి ప్రణాళికలు రచించసాగాడు రాజశేఖరం.. జీపు రయ్యిన స్టేషన్ వైపు దూసుకు వెళ్ళింది.
***
మరునాడు ఉదయం ఇంటి నుండి నీరజను తీసుకొని స్టేషన్ కు వచ్చాడు రాజశేఖరం. నీరజను తన ఆఫీసు గదిలో కూర్చోబెట్టాడు. ఒక లేడీ కానిస్టేబుల్ ను తీసుకొని నేరుగా అనంతయ్య, ఆదెమ్మలు ఉన్న లాకప్ లోకి వెళ్ళాడు. ఎస్సైని చూడగానే గజ, గాజా వణకుతూ.. ఇద్దరూ లేచి నిలబడ్డారు.
తనదైన శైలిలో లాఠీని గాలిలో ఊపుతూ.. ఆదెమ్మను కోపంగా ఒక చూపు చూసాడు.
“సిగ్గులేదు.. (పోలీసు తిట్టు) కన్నబిడ్డను పడుపువృత్తి లోకి దించుతావా? నువ్వేందిరా” అంటూ అనంతయ్యను చూస్తూ.. “బిడ్డ సంపాదిస్తే కూర్చొని తిందామని చూస్తున్నావా” అని లాఠీతో బెదిరించాడు రాజశేఖరం.
“నీరజ మాబిడ్డ కాదు సర్” అన్నాడు అనంతయ్య. ఆ మాటతో పౌచ్ లో ఉన్న రివాల్వార్ పేలినట్టు ఫీలయ్యాడు రాజశేఖరం.
“నిజం సర్. ఆదెమ్మ, నేను రాత్రంతా బాగా ఆలోచించి.. ఇక ఇలాంటి వృత్తి మానేద్దామని నిర్ణయించు కున్నాం. కల్లాకపట మెరుగని పిల్లల జీవితాలు నాశనం చేద్దామనుకున్న మాకు ఏ శిక్ష పడ్డా అనుభవిస్తాం. అందుకే నిజం చెబుతాను” అంటూ కన్నీళ్లు పెట్టుకోసాగాడు.
రాజశేఖరం లాఠీ కొసను అనంతయ్య గడుమ కింద పెట్టి ముఖాన్ని లేపాడు.. ఏమిటా నిజం చెప్పుమన్నట్టు.
అనంతయ్య రెండు చేతులూ ప్రాధేయ పూర్వకంగా జోడించి చెప్పసాగాడు. కళ్ళ నుండి నీళ్ళు ధారాళంగా కారుతూనే ఉన్నాయి.
“సార్.. మా స్వగ్రామం విజయవాడ దగ్గర చిన్న పల్లె. ఏడేండ్ల కిందట నాగులు అనే వాడు ఈ అమ్మాయిని అమ్ముతానని తీసుకు వచ్చాడు. ఆ సమయంలో అమ్మాయి స్పృహ లేకుండా ఉంది. అడిగితే.. అమ్మాయి మగత నిద్ర పోవాలని ఇంజక్షన్ ఇచ్చానన్నాడు. ప్రాంతాలను, పరిసరాలను మరచిపోవాలని.. దాదాపు మూడు నెలలు ఇలాగే ఇంజక్షన్లు
ఇచ్చుకుంటూ తిప్పానన్నాడు. అమ్మాయికి మరో గంటలో మెళకువ వస్తుందని అంత వరకు ఇక్కడే ఉండి డబ్బు తీసుకు వెళ్తానని భరోసా ఇచ్చాడు.
నాగులు అన్నట్టుగానే మరో గంటలో కోలుకుంది. మీ అమ్మా, నాన్న వద్దకు తీసుకు వచ్చాను.. అంటూ అమ్మాయిని మా ఆదెమ్మ చేతిలో పెట్టాడు. ఆదెమ్మను చూడాగానే అమ్మాయి ముఖం వికసించినట్టుగా కనబడింది. నాగులు డబ్బులు బేరమాడి తీసుకు వెళ్ళాడు. ఈ రహస్యం ఎవరికీ తెలియ గూడదని ఆదెమ్మ సలహాతో ఇక్కడికి వచ్చాం. అమ్మాయికి నీరజ అని పేరుపెట్టి పెంచుతున్నాం. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతోంది. గట్టమ్మ తల్లి ఊరికి రావడం పొరబాటయ్యింది” అంటూ తమ వృత్తాంతం క్లుప్తంగా వివరించి తల పట్టుకున్నాడు.
అతని వెనుకాలే రెండు చేతులు జోడించి కూర్చున్న ఆదెమ్మ.. “సార్ ఇందులో మా వారి తప్పేమీ లేదు. మా కులవృత్తి కాపాడుకోవాలని నేనే నీరజను మనోహరు దగ్గరికి పంపాను. ఏ శిక్ష అయినా నాకే వేయండి” అంటూ రాజశేఖరం కాళ్ళ మీద పడింది.
“శిక్షలు వేసేది నేను కాదు. న్యాయస్థానం.. మా పని మిమ్మల్ని కోర్టుకు అప్పగించడం వరకే. చాలా తప్పు పని చేశారు. ఎవరో తెలియని ఒక అమ్మాయిని కొనడం నేరం.. వ్యభిచారంలో దింపడం మహానేరం. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది” అంటూ సిబ్బందిని తీసుకొని బయటకు వచ్చాడు.
“కనకయ్యా.. నువ్వు నీరజను తీసుకొని వెళ్లి గట్టమ్మ అనాధాశ్రయంలో చేర్పించు” అని పురమాయించాడు రాజశేఖరం.
“ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయిస్తే నేను వచ్చి సంతకం పెడతాను. ఇంతలో మనోహరును కోర్టుకు అప్పగించి వస్తాను”
***
కోర్టు పని పూర్తి కాగానే నేరుగా గట్టమ్మ అనాధాశ్రయానికి వెళ్ళాడు రాజశేఖరం. నీరజ ఇంకా ఆఫీసు ఆవరణలోనే ఉండడం ఆశ్చర్య పోయాడు.
జీప్ పార్కు చేసి దిగి వస్తుంటే.. కనకయ్య, ఆశ్రమ మేనేజరు రమణయ్య వడి, వడిగా ఎదురు వచ్చారు.
“సార్.. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసాను. కాని ఒక ఖాళీ నింపాల్సి ఉంది. ఆశ్రమ నియమావళి ప్రకారం.. అమ్మాయి ఆధార్ కార్డు కావాలి. అడిగితే కనకయ్యగారు వెళ్లి కనుక్కొని వచ్చారు.. కార్డు తీయలేదట. మీకోసమే చూస్తున్నాం. మీరు వచ్చాక నిర్ణయం తీసుకుందామని. అమ్మాయిని తీసుకొని ఆధార్ సెంటర్ కు వెళ్ళి కార్డు తీయండి. కార్డు వచ్చే వరకు నీరజను ఆశ్రమంలోనే గెస్ట్ గా ఉంటుంది” అంటూ వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు రమణయ్య.
‘నిజమే ఎవరి నిబంధనలు వారికుంటాయి. ఆధార్ కార్డు ఎలాగూ అవసరమే.. ’ అని మనసులో అనుకుంటూ కనకయ్యకు జీపు తీయమన్నాడు. నీరజను తీసుకొని ఆధార్ ఆఫీసుకు బయలుదేరారు. ఆధార్ సెంటర్ లో వాస్తవం బయటపడే సరికి నిర్ఘాంత పోయాడు రాజశేఖరం.
అమ్మాయి పేరు శ్యామల. తండ్రి కిషన్. ఆధార్ కార్డుకు జతపర్చిన ఫోన్ పనిచెయ్యడం లేదు. లిప్తకాలం ఆలోచించి ఆధార్ కాపీ తీసుకొని ఆఫీసు నుండి బయటికి వచ్చారు. శ్యామల తన వివరాలు తెలుసుకొని కన్నీరు పెట్టుకోసాగింది. ఆమెను చూస్తుంటే రాజశేఖరం, కనకయ్య పోలీసు గుండెలు.. అయినా కరిగి పోయాయి.
ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా శ్యామలను ఊరడిస్తూ జీపు ఎక్కించాడు రాజశేఖరం. తనూ ప్రక్కనే కూర్చుంటూ.. కనకయ్యకు భోజనం చెయ్యాలి అన్నట్టు ఇషారా చేసాడు. కనకయ్య జీపును ఒక హోటల్ ముందు ఆపాడు.
హోటల్లో భోజనం చేస్తూ.. “శ్యామలా.. నిన్ను మీ అమ్మా, నాన్న దగ్గరికి తీసుకు వెళ్తాను” అన్నాడు రాజశేఖరం.
శ్యామల ముఖం విప్పారింది. ఆమె మోము చూసి కనకయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. తన బాల్యం గుర్తుకు వచ్చింది. ఎవరికైనా భూతల దేవతలంటే.. తల్లిదండ్రులే. కదా!.
“సర్.. మిమ్మల్ని రైల్వే స్టేషన్లో దింపాలా” అడిగాడు కనకయ్య.
“నో.. ముందు షాపింగ్ చేద్దాం. శ్యామలకు డ్రెస్సులు కొందాం. రేపు ఉదయం మన ప్రయాణం. స్టేషన్ వెళ్లి కమీషనర్ గారికి ఫోన్ చేస్తాను. విషయం వివరించి అనుమతి తీసుకుంటాను. తరువాత మా ఇంటికి వెళ్దాం. రేపు అనంతయ్య, ఆదెమ్మలను కోర్టుకు తీసుకు వెళ్ళమని టూ నాట్ ఫోర్ కు చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మాట్లాడుతాను” అంటూ ప్రణాళికలను వివరించాడు రాజశేఖరం.
***
మరునాడు ఉదయమే కాకతీయ ఫాస్ట్ పాసింజర్ లో శ్యామలను తీసుకొని హైద్రాబాదు చేరుకున్నారు. శ్యామల ఆధార్ కార్డు లోని చిరునామా చెప్పి ఆటో ఎక్కారు. శ్యామల హృదయంలో అలజడి రేగుతోంది. కళ్ళు పెద్దవిగా చేసుకొని పట్నమంతా విస్మయంగా చూడసాగింది. బోరబండ రాగానే ఆమె కళ్ళల్లో వెలుగులు కనబడ్డాయి.
‘లిటిల్ బడ్స్’ పాఠశాల కనబడగానే.. “ఆపండి ఆటో అంకుల్.. ఆపండి” అంటూ అమితమైన సంతోషంతో కేక పెట్టింది. రాజశేఖరం డ్రైవర్ భుజం తట్టే సరికి రోడ్డు పక్కకు ఆగింది ఆటో. చటుక్కున కిందకు దూకింది శ్యామల.
“పోలీస్ అంకుల్.. మా స్కూల్” అంటూ రాజశేఖరంకు చూపిస్తూ.. మైదానంలోకి పరుగు తీసింది. రాజశేఖరం విస్తుపోయాడు. తనకు పూర్వస్మృతులు జ్ఞప్తికి వస్తున్నాయని.. శ్యామల కేసు పరిష్కారం కాబోతోందని.. రాజశేఖరం చెవిలో సంబ్రంగా ఊదసాగాడు కనకయ్య.
శ్యామల మైదానంమంతా తిరుగుతూ.. ఒక దగ్గర ఆగి పోయి.. కళ్ళు మూసుకొని ఆలోచనలో పడింది. రాజశేఖరం దగ్గరికి వెళ్లి.. “ఏమయ్యిందమ్మా.. ఏమాలోచిస్తున్నావ్.. ” ఆశ్చర్యంగా అడిగాడు.
“పొలీస్ అంకుల్.. ఇక్కడికి ఒకాయన వచ్చి మీ అమ్మ పిలుస్తోందని నన్ను కార్లో తీసుకు వెళ్ళాడు. ఇప్పుడు నాకు కొంచెం, కొంచెం గుర్తుకు వస్తోంది”
“వెరీ గుడ్. మీ ఇంటికి వెళ్దాం. ఇంకా అన్నీ గుర్తుకు వస్తాయి” అంటూ వచ్చి ఆటో ఎక్కారు.
రాజశేఖరం చెప్పిన చిరునామా ముందు ఆటో ఆగింది. డ్రైవర్ కు డబ్బులిచ్చి పంపించేసాడు కనకయ్య. రాజశేఖరం శ్యామలను తీసుకొని గేటు తెరచి లోనికి వెళ్తుంటే.. కుక్క భౌ.. భౌ.. మని ఎవరో వచ్చారన్నట్టుగా అరిచింది. ఇంట్లో నుండి ఒక పెద్దావిడ వచ్చి ఎవరు మీరు.. ఎవరు కావాలి అన్నట్టుగా చూడసాగింది.
“అమ్మా.. కిషన్ గారున్నారా” అడిగాడు రాజశేఖరం.. పక్కన శ్యామల ఉద్వేగంగా ఇంట్లోకి తొంగి, తొంగి చూస్తోంది.
“కిషన్ ఎవరో నాకు తెలియదు” అంటూ పెదవి విరిచింది. “మేము ఈ ఇంట్లో నాలుగేండ్ల నుండి అద్దెకుంటున్నాం”
“సార్.. ప్రక్కింటి వారిని అడిగి చూద్దాం.. ఇంటి ఓనర్స్ అయితే తెలిసి ఉంటుంది” సలహా ఇచ్చాడు కనకయ్య.
“అడుక్కోండి” ముక్తసరిగా జవాబిచ్చి లోనికి వెళ్లి పోయిందావిడ. గభాల్న తలుపులు మూసేసుకుంది.
‘అంతేలే సిటీలో మానవ సంబంధాలు, గౌరవ మర్యాదలు మంట కలిసి పోతున్నాయ’ని మనసులో అనుకుంటూ బయటికి వచ్చాడు రాజశేఖరం. శ్యామల బిక్కముఖమేసి అనుసరించింది. సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందని వగచుకుంటూ అడుగులు భారంగా వేయసాగాడు రాజశేఖరం. శ్యామల ఉత్సాహమంతా నీరుగారి
పోయింది. కనకయ్య తల సుతారంగా గోక్కోసాగాడు ఏంచేద్దామన్నట్టు.
అదృష్టం కలిసొస్తే.. వెదుక పోయిన తీగ కాలికి తగులుతుందన్నట్టు.. ఇస్త్రీ చేసిన బట్టలమూట నెత్తిన పెట్టుకుని వస్తున్న ఒకావిడ శ్యామలను చూడగానే.. భుజం మీద చెయ్యి వేసి ఆపింది. శ్యామల చిరు కోపంతో విదిలించుకుంది. ఏమిటన్నట్టు ఎగాదిగా చూశాడు రాజశేఖరం.
“అయ్యా.. ఈమె పేరు శ్యామల కదా.. !” ఆశ్చర్యంగా అడిగింది. “కిషన్ బిడ్డ. ఎంత పెద్దగయ్యిందీ” అంటూ దీర్ఘం తీసింది. ముందుగా వెళ్తున్న కనకయ్య చటుక్కున వెనుదిరిగి పరుగులాంటి నడకతో వచ్చాడు.
“అవునమ్మా.. కిషన్ బిడ్డనే.. కిషన్ ఇంటికి వెళ్ళి అడిగితే.. ఎవరో తెలియదన్నదావిడ” అంటూ ఆత్రంగా అడిగాడు కనకయ్య.
“కనకయ్యా.. ముందు ఆవిడ తల మీది భారం దించు” అన్నాడు రాజశేఖరం.
“ఫరవా లేదయ్యా.. నేను దించుకుంటా. పెద్ద బరువేమీ లేదు. మాకు అలవాటేగా” చిన్నగా నవ్వుతూ.. మూట దించుకుంటుంటే కనకయ్య సాయం చేసాడు.
“అయ్యా.. మీరెవ్వలు? శ్యామలకు ఏమవుతారు? ” అంటూ ప్రశ్నలు కురిపించింది మడేలమ్మ.
“మేము పోలీసులం. మా పెద్ద సారు” అంటూ రాజశేఖరంను చూపించాడు కనకయ్య. “శ్యామలను చూడక చాలా రోజులయ్యిందా!.. ” అడిగాడు. పోలీసులం అనగానే మడేలమ్మకు విషయం అర్థమయ్యింది.
“అవును సార్. నేను కిషన్ ఇంటి చాకలి దాన్ని. శ్యామలను ఎవరో.. !” అని చేతి వేళ్ళ గీతలను లెక్కేసుకుని.. “ఏడేండ్ల కిందట ఎత్తుకు పోయిండ్లు. పాపం.. ! కిషన్ శ్యామల మీద మానాది పెట్టుకొని మల్ల ఏడాదికే కాలం చేసిండు. కిషన్ భార్య భారతమ్మ ఇక్కడ ఉండబుద్ధి గాక పెద్ద బిడ్డను తీసుకొని తల్లిగారింటికి పోయింది”
“ఇల్లెక్కడ” ఉద్వేగంగా అడిగాడు రాజశేఖరం.
“ఇక్కడ కాదు సార్.. హుజూరాబాదు. ప్రతాపోల్ల వాడ అని చెప్పింది”
రాజశేఖరం, కనకయ్య ఒకరి ముఖం మరొకరు తెల్లబోయి చూసుకోసాగారు.
“కిషన్ అత్తగారిల్లు అంటే ఎవరైనా చెబుతారట” అంటూ మరో తీయని మాట అందించింది మడేలమ్మ.
“శ్యామలా.. ఈమెను గుర్తు పట్టావా.. ” అడిగాడు రాజశేఖరం. లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతూ.. పెదవి విరిచింది శ్యామల.
“సరేనమ్మా.. మంచి సమాచారమిచ్చావు” అన్నాడు రాజశేఖరం.
“అయ్యా.. తప్పకుండా శ్యామలను భారతమ్మ ఒడికి చేర్చండి. మీకు పుణ్యముంటది” అని రెండు చేతులు జోడించి దండం పెట్టింది. బట్టల మూట నెత్తిన ఎత్తుకొని ముందుకు సాగింది.
ఇంతలో కనకయ్య వస్తున్న ఆటోను ఆపాడు.
“సార్.. ఎటు తిరిగి మళ్ళీ మనం మన ప్రాంతానికే పోతున్నాం.. ప్రతాప్ వాడలో నాకు స్నేహితులున్నారు” అని శ్యామల దిగులును మాయం చేసే ప్రయత్నం చేస్తూ.. ఆటో ఎక్కాడు కనకయ్య.
***
హుజూరాబాదు బస్ స్టాండులో బస్సు దిగే చేరేసరికి సాయంత్రం దాదాపు అయిదయ్యింది. “ప్రతాప్ వాడ దగ్గరే సర్.. నడుద్దాం” అని కనకయ్య ప్రతాప్ వాడకు దారి తీస్తూ..
“శీతాకాలం కదా.. ! తొందరగానే కనుమసక అవుతుంది” నడకలో కాస్త వేగం పెంచాడు.
ప్రతాప్ వాడలో నడుస్తుంటే అంతా వీరిని ఆశ్చర్యంగా చూడసాగారు.
శ్యామలను చూస్తూ.. ‘ఈ పిల్ల వరమ్మ మనుమరాలు మాదిరిగానే ఉంది’ అని ఒకరు.. ‘ఔను భారతమ్మ బిడ్డనే ‘ అని మరొకరు ముక్కు మీద వేలేసుకొని చూడసాగారు. రాజశేఖరం మనసు తేలిక పడసాగింది..
“శ్యామలా.. వాళ్ళను గుర్తు పడుతున్నావా? ” అడిగాడు కనకయ్య. తల అడ్డంగా ఊపింది. కాని వాడ అంతా తనకు తెలుసు అన్నట్టుగా ఆమె ముఖకవళికలను చదువసాగాడు కనకయ్య.. ఎంతైనా పోలీసు కదా!
కిషన్ అత్తవారిల్లు సులభంగా తెలుసుకోగలిగారు. గేటు తట్టేసరికి..
ఇంట్లో నుండి శ్యామల అమ్మ, అమ్మమ్మ ఇంకా తాతయ్య బయటకు వచ్చారు. కనుమసక సమయంలో.. రాజశేఖరం, శ్యామల, కనకయ్య.. వారి వెనకాల దాదాపు మరో పది మంది వరకు ఆ వాడ జనాన్ని చూసి కొయ్యబారి పోయారు.
“కిషన్ అత్తవారిల్లు ఇదే కదా.. ! భారతమ్మ ఉందా” అంటూ ఆరా తీశాడు కనకయ్య.
వాళ్ళు చెప్పడానికి తటపటాయిస్తున్నారని గమనించిన రాజశేఖరం..
“చూడండి.. నేను ఎర్రగట్టు పోలీసు స్టేషన్ అమీన్ సాబ్ ను. ఒకరింట్లో ఈ అమ్మాయి దొరికింది” అంటూ విషయమంతా చెప్పాడు. భారతమ్మ ఇంటి ముందు లైటు వేసి పరీక్షగా చూస్తూ..
“భారతమ్మను నేనే. శ్యామలా.. !” అని పిలుచుకుంటూ.. పరుగు, పరుగున వచ్చి శ్యామల బుగ్గలపై ముద్దులు పెట్టింది. శ్యామల బిత్తర చూపులు చూడసాగింది.
“శ్యామలా.. మీ అమ్మ, అమ్మమ్మ ఇంకా అదుగో అతను తాతయ్య. గుర్తుపట్టావా” అంటూ కనకయ్య అడుగుతుంటే.. భారతమ్మ ఆనందభాష్పాలు వరదలయ్యాయి. అధిక సంతోషంతో శ్యామలను హృదయానికి హత్తుకుంది. ప్రపంచంలో మాతృహృదయానికి మహత్తరమైన శక్తి ఉంది. ఆ స్పర్శలోని ఆత్మీయత అనిర్వచనీయం. అది అనుభవించే కన్న బిడ్డకే తెలుస్తుంది అన్నట్టు శ్యామల ఒక్క సారిగా.. “అమ్మా” అంటూ భారతమ్మను పెనవేసుకు పోయింది.
శ్యామల అమ్మమ్మ, తాతయ్యలు ఇద్దరినీ చుట్టేసుకున్నారు. ఆ దృశ్యం చూస్తూ..
వచ్చిన వారంతా కన్నీటి మయమయ్యారు. శ్యామల తాతయ్య ఇంట్లో నుండి రెండు కుర్చీలు తెచ్చి పందిరి కింద వేసాడు. కూర్చోండని రెండు చేతులూ జోడించాడు.
రాజశేఖరం కూర్చుంటూ.. “శ్యామల ఎలా తప్పి పోయింది” అంటూ భారతమ్మను అడిగాడు. “మీ అమ్మాయే అని మాకు రుజువు కావాలి కదా!” అని సందేహాన్ని వెలిబుచ్చుతూ.. కనకయ్య వంక చూసాడు. అర్థం చేసుకున్న కనకయ్య ఫైలు ఓపెన్ చేసాడు.
“సార్.. మేము హైదరాబాదు బోరబండలో ఉండే వాళ్ళం. అప్పుడు శ్యామల లిటిల్ బడ్స్ బడిలో మూడవ తరగతి చదువుతోంది. అ రోజు బడి నుండి వచ్చి.. మళ్ళీ ఐదు గంటలకు ట్యూషన్ క్లాసు ఉందని వెళ్ళింది. రాత్రి ఏడయినా.. అమ్మాయి ఇంకా రాలేదేమని బడికి వెళ్ళాను. శ్యామల రాలేదని ట్యూషన్ సార్ అనగానే నా గుండె ఆగి పోయింది. మా అయన, ఆయన దోస్తులు అంతా వెతికారు. బడి మైదానం గుండా ఒక కారు వెళ్ళిందని తెలిసిందట. కాని కారు నంబరు చూసిన వారు లేరు” అంటుంటే భారతమ్మ కళ్ళు జలపాతాలయ్యాయి.
కాసేపటికి తేరుకొని.. “సార్.. శ్యామల మీద రందితో మా ఆయన మరుసటి సంవత్సరం కాలం చేసాడు. నాకిక అక్కడ ఉండబుద్ది గాక.. మా పెద్దమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చాను. శ్యామల నా బిడ్డ అని ఎలా రుజువు చేసుకోవాలి” అంటూ మళ్ళీ భోరుమంది.
“పోలీస్ అంకుల్.. మా అమ్మనే.. నాకు గుర్తుకు వచ్చింది. అమ్మమ్మ, తాతయ్యనే.. కొంచెం.. కొంచెం.. ” అంటూ కళ్ళు చిన్నగా మూసి.. తల వంచి సుతారముగా గోక్కోసాగింది.
ఏదో జ్ఞప్తికి వచ్చిన వాడిలా శ్యామల తాతయ్య ఇంట్లోకి వెళ్లి ఆధార్ కార్డు తెచ్చిచ్చాడు. రాజశేఖరం క్షుణ్ణంగా దానిని పరిశీలించి కనకయ్యకిచ్చాడు. కనకయ్య తన ఫైల్లో ఉన్న కార్డుతో పోల్చి రెండూ ఒకటే అన్నట్టుగా తలూపాడు. తాను రికార్డు చేసిన కాగితాల మీద భారతమ్మ సంతకం తీసుకున్నాడు. ప్రతాప్ వాడ పెద్దలతో సాక్షి సంతకాలు
తీసుకున్నాడు.
“భారతమ్మా.. నీ బిడ్డను నీకు అప్పగించాం. విధి విచిత్రం. ఒకే ప్రాంతంలో ఉన్నా తల్లీ, బిడ్డలు కలుసుకోడానికి ఇంత కాలం పట్టింది. దేనికైనా కాలం కలిసి రావాలి. శ్యామలా.. బై..” అంటూ లేచాడు రాజశేఖరం.
“థాంక్స్ పోలీస్ అంకుల్.. “ అంటూ రాజశేఖరం కాళ్ళను చుట్టేసుకుంది శ్యామల. ఆమె కళ్ళు కన్నీటి కడవలయ్యాయి.
రాజశేఖరం కళ్ళు తన బిడ్డ జ్ఞాపకాలతో మళ్ళీ చెమర్చాయి.
***
చెన్నూరి సుదర్శన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
గణితశాస్త్ర ఉపన్యాసకుడిగా దాదాపు 26 సంవత్సరాలు విద్యా బోధన చేసాను. దాదాపు రెండు సంవత్సరాలు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలందించి 2010లో పదవీ విరమణ పొందాను.
తెలుగు సాహిత్యం మీద మమకారంతో.. విద్యార్థి దశనుండి పెయింటింగ్స్ చేయడం.. కవితలు, కార్టూన్లు, కథలు రాయడం అలవాటు ఉన్నా విద్యాబోధన మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేవాణ్ణి. ‘ఎమ్సెట్ ప్రశ్నావళి-సాధనలు’ అనే గ్రంథాన్నిఆంగ్ల, తెలుగు మాధ్యమాలలో రాసాను. జె.పి.పబ్లికేషన్స్ వారు ముద్రించారు.
పదవీ విరమణ అనంతరం తిరిగి సాహిత్యం మీద నిర్విరామంగా కృషి చేస్తున్నాను. 2012 మార్చిలో ‘ముంబై ఒన్’ పక్ష పత్రికలో ‘అమ్మ మనసు అమూల్యం’ మొదటి కథ అచ్చయ్యింది. ఆ స్ఫూర్తితో రచనలు వేగవంతం చేసాను. నేటి వరకు దాదాపు 230 కథలు, 150 కవితలు, 200 కార్టూన్లు, రెండు నవలలు వివిధ పత్రికల్లో వచ్చాయి. కథలకు బొమ్మలు గీసుకుని, డిటిపి చేసుకుని పది పుస్తకాలు అచ్చు వేయించుకున్నాను. పాఠకులకు ఉచితంగా పంచుతున్నాను.
నా గ్రంథాలు:
ఝాన్సీ, హెచ్.ఎం.(కథా సంపుటి)
జీవన చిత్రం (ఆత్మకథ)
జీవనగతులు(కథా సంపుటి)
ప్రకృతిమాత(పిల్లల కథలు)
మహా ప్రస్థానం(కథా సంపుటి)
రామచిలుక (పిల్లల కథలు)
అమ్మ ఒడి (కథా సంపుటి)
రామబాణం (పిల్లల కథలు)
జర్నీ ఆఫ్ ఏ టీచర్ (నవల)
చెన్నూరి సుదర్శన్ కథలు(కథా సంపుటి)
‘అనసూయ ఆరాటం (నవల), జీవన చక్రం (నవల), ఆత్మకథ రెండవ ముద్రణ.. రాబోతున్నాయి.
మెప్పుకోలు:
రాష్ట్ర బెస్ట్ టెలిఫోన్ ఆపరేటర్ (1977), రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డు (2008), గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం, ఐతేభారతిచంద్రయ్య సాహిత్య పురస్కారం, గుర్రం జాషువా జయంతి సందర్భగా తెలుగు అకాడెమీ వారిచే ‘కవలల కలవరం’ కథకు సన్మానం, యాదగిరి ఛానెల్ ‘సాహితీ సౌరభాలు’ కార్యక్రమంలో ఇంటర్వ్యూ, సి.ఎం. ఆర్ ఛానల్ లో ‘పోటువ’ కథ సమీక్ష ప్రసారం.. ఇంకా పలు కథలకు, కార్టూన్లకు బహుమతులు.
2016 -17 లో శ్రీ వాకాటి పాండురంగ రావు స్మారక జాగృతి కథా పురస్కారం లో ద్వితీయ బహుమతి లభించింది.
చెన్నూరి సుదర్శన్ • 2 days ago
కథ నేను రాసిందే అయినా.. కథ వింటుంటే చక్కని అనుభూతి కలిగింది. ధన్యవాదాలు
Durga Mohan Rao K V • 1 hour ago
కథ, కథనం బాగున్నాయి