Nanna New Telugu Story
written By G. Satyanarayana Rao
రచన : జి.సత్యనారాయణ రావు
“వంటింట్లో ఏదో శబ్దం, లేచి అదేదో కాస్తా చూసిరండి" అంటూ భర్త సిద్దార్ధను లేపింది, సుశీల. “ నీదో పెద్దగోల” అంటూ, కళ్ళు నులుముకొంటూ వాచ్ చూసుకొన్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట. ఈ సమయంలో ఏంటని వంటింటివైపు నడిచాడు సిద్దార్ధ. వంటింటి లైటువేసి చూశాడు. దేనికోసమో వెతుకుతున్న నాన్నను చూసి “ఏంటినాన్నా.... ఏంచేస్తున్నావు ఈసమయంలో? వంటింట్లో నీకేం పని? కళ్ళు సరిగా కనపడనప్పుడు,నీ రూంలోనే చావచ్చుకదా! అసలు ఇక్కడికెందుకు వచ్చావో ముందది చెప్పు” అంటూ తండ్రి వెంకటస్వామిని ఇంచుమించు అరచినంత పనిచేసి నిలదీశాడు, సిద్దార్ధ.
అంతలోనే, కోడలు సుశీల, పదిహేనేళ్ళ మనవడు నరేష్ పన్నేండేళ్ళ మనవరాలు సౌమ్య అక్కడికి వచ్చారు. కొడుకు,కోడల్ని, పిల్లల్నిచూసి, కొంత కంగారుపడ్డాడు వెంకటస్వామి. నాన్న తాతను ఏదో తిడుతున్నాడని పసిగట్టిన ఆ చిన్ని ప్రాణాలు, వాళ్ళ తాతకు చెరోపక్క బాడీగార్డ్స్‌మల్లె నిలబడ్డారు బెరుగ్గానే.
“అయ్యో! నెయ్యంతా నేలపాలు చేశారు, ఈయన గారు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే వుంటారు, మీ అన్నగారేమో హైదరాబాద్ లో, మీ చెల్లెలు ఢిల్లీలో సెటిలైపోయారు, ఈ దరిద్రాన్నేమో మనకొదిలేశారు" అంటూ భర్త కోపానికి ఆజ్యం పోసింది సుశీల.
“అసలెందుకొచ్చావంటే, చెప్పకుండా ఆలా నుంచునేవున్నావు, నీకు సిగ్గుగాలేదా!" అంటూ ఇంచుమించు నాన్నఅనే ఇంగితం మరిచి, వెంకటస్వామి మీదికి పోసాగాడు సిద్ధార్ధ.
“ఏమీలేదురా! కాస్త అకలిగావుంటే ఓ రెండు బిస్కెట్ల కోసమని వచ్చాను, దానికోసం మిమ్మల్నెందుకు లేపాలని...." అంటూ చెప్పలేక చెప్పి సంజాయిషీ ఇచ్చుకొన్నాడు కొడుకుతో వెంకటస్వామి. ఇది గమనించిన నరేష్, సౌమ్యలు వాళ్ళ తాతకు నాన్నకు మధ్యలో నిలబడ్డారు.
అదే ఆదనుగా, “వచ్చారు పెద్దమనుషులు, పొండి, పోయి పడుకోండి " అంటూ నాన్నమీది కోపాన్ని పిల్లల మీద చూపించాడు సిద్ధార్థ. ఇక చేసేదేమీలేక, వాళ్ళ తాతనే చూస్తూ, వెళ్ళి నిద్రపట్టకపోయినా పడుకొన్నారు నరేష్ సౌమ్యలు.
“ఈ దరిద్రాన్ని ఏదోఒకటి చేయకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు మీరు ఏమైనా చేసుకోండి" అంటు రుసరుసలాడుతూ పడగ్గదిలోకి వెళ్ళిపోయింది సుశీల.
గోడ ఆసరాతో తన రూం చేరుకొన్న వెంకటస్వామి, చీకట్లోనే మంచంమీద కూర్చొన్నాడు. కొడుకు మరలా వచ్చి కరెంటు ఖర్చంటాడేమోనని, లైటు కూడా వేసుకోలేదు. చీకట్లోనే, ఎదురుగా వున్న తన భార్య భారతి కనిపించీ కనిపించని ఫోటోవైపు చూస్తూ తన పాతరోజులను గుర్తుకు తెచ్చుకోసాగాడు.
వెంకటస్వామి ఓ మామూలు రెతు కుటుంబంలో పుట్టాడు. ముగ్గురు అన్నదమ్ముల్లో చివరివాడు.
పెద్దవాళ్ళిద్దరూ, వ్యవసాయంలో నాన్నకు సహాయంగా వుండిపోయారు. ఇంట్లో ఒకరైనా బాగా చదివి సమాజానికి సేవచేయాలని వాళ్ళనాన్న కోరిక. అంతేకాక తనను ఓ మంచి ఉపాధ్యాయుడిగా చూడాలని ఆయన తపన. నాన్న కోరికమేరకు, అన్నల సహకారంతో వెంకటస్యామిని,చదువు వరించింది. ప్రోత్సాహం, పట్టుదల వుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. వెంకటస్వామి విషయంలో అదే నిజమయింది. ఎం.ఎ.బి.యెడ్ చేసి ప్రభుత్వ టీచర్‌గా, ఉద్యోగం సంపాదించి వాళ్ల నాన్న కోరిక తీర్చాడు.
ఇక ఆలస్యమైతే బాగుండదని,వాళ్ళ బంధువుల అమ్మాయి భారతితో వెంకటస్వామి వివాహం జరిగిపోయింది. భారతి వచ్చిన వేళావిశేషమో లేదా ఇంకేదోగాని, వెంకటస్వామికి ప్రమోషన్‌తో ట్రాన్స్‌ఫర్ వచ్చింది. తనకెలాగూ ఉద్యోగం వుంది కనుక, వున్న పొలాన్నీ, ఇంటినీ, తన ఇద్దరు అన్నలకు ఇచ్చేయమన్నాడు. అన్నలిద్దరూ, అలా వద్దని ఎంత వారించినా,తను నాన్నను ఒప్పించి, ఆస్తులను అన్నల పేర రిజిష్టర్ చేయించేశాడు వెంకటస్వామి. భారతికి, భర్త చేస్తున్నది చాలా సరైనదనిపించినందున, ఏమీ ఎదురు చెప్పలేదు.
కాలగమనంలో వెంకటస్వామి కుటుంబంలో మరో ముగ్గురు సభ్యులు వచ్చిచేరారు. అందులో మొదటివాడు రాజేష్, రెండోవాడు సిద్దార్ధ ముచ్చటగా మూడోది వాళ్ళ ముద్దల కూతురు ప్రణీత. భర్త తన పనుల్లో బిజీగా వున్నందున, పిల్లల బాగోగులన్ని ఎక్కువగా భారతి చూసుకొనేది.
దేవుడు ప్రతి పనిని, ఫలానావారే చేయాలని నియమం పెట్టుకొన్నాడేమో. వెంకటస్వామి పనితనాన్ని అతని అనుభవాన్ని గుర్తించి, పభుత్వం వెంకటస్వామిని, హైస్కూల్ హెడ్యాష్టర్‌గా ప్రమోట్ చేసింది. దాంతో పాటుఅదే సంవత్సరం బ్యాంకులో పనిచేస్తున్న పెద్దకొడుకు రాజేష్‌కు, కూతురు ప్రణీతకు సంబంధాలు కుదరడము, వెంటనే పెళ్ళిళ్ళు జరగడము చకచకా జరిగిపోయాయి.
అదే సంవత్సరం వెంకటస్వామిని ప్రభుత్వం 'ఉత్తమ ఉపాధ్యాయుడి'గా ఎంపిక చేయడమూ, రాష్ట్రపతి చేతులమీదుగా సన్మానము, అవార్డు అందుకోవడము జరగిపోయాయి. అంతలోనే రెండోకొడుకు సిద్ధార్ధ బ్యాంకు ఉద్యోగంలో చేరడమూ జరిగిపోయింది. ఇంకేముంది, భారతి అన్న ధనుంజయ అదేఅదనుగా తన కూతురు సుశీలను సిద్ధార్ధకు చేసుకోమని వచ్చి వెంకటస్వామిని, భారతిని అడగాడు. భారతి పుట్టింటి మమకారాన్ని కాదనలేక పోయింది. పైపెచ్చు సిద్ధార్ధ కూడా సరే అనడంతో, ఆ పెళ్ళి తంతుకాస్తా జరిపించేసారు వెంకటస్వామిదంపతులు. సిద్ధార్ధ విజయవాడలో కొత్తకాపురాన్ని కొత్తగా ప్రారంభించాడు.
మార్చు కొన్నిసార్లు ఆనందాన్నిస్తే మరికొన్నిసార్లు ఏదో తెలియని వెలితినిస్తుంటుంది. పిల్లలందరికి పెళ్ళిళ్ళై ఉద్యోగరీత్యా ఎవరికి వారుగా వెళ్ళిపోవడం వల్ల, భారతికి అంతా ఖాళీగా అనిపించ సాగింది. బడినుండి వచ్చిన భర్తతో అదే విషయాన్ని చెబుతూ కన్నీరు పెట్టుకొంది భారతి.
“అరె, ఏంటి చిన్న పిల్లలా?నీవు మీ వాళ్ళందర్నీ వదిలేసి వచ్చినట్లే, మన పిల్లలూ, వాళ్ళవాళ్ళ బ్రతుకు తెరువుకొద్టీ వెళ్ళారు, ఇందులో బాధపడాల్సిందేముంది...” అని భార్యను సముదాయించాడు వెంకటస్వామి. ఎంతైనా టీచరు కదామరి!
కాలగమనంలో వెంకటస్వామి భారతీల ముగ్గురు పిల్లలకు, పిల్లలు కలిగారు. అందులో ముగ్గురు
మనవళ్ళు, ముగ్గురు మనవరాండ్రు.
“మనిషి జీవితంలో ఏ మలుపు ఏ తీరాలకు తీసుకెళుతుందో ఓ అంతుబట్టని విషయం. వెంకటస్వామికి ఇక ఐదు సంవత్సరాలు సర్వీసు వుందనగా, ఫలితాల్లో కాస్త వెనుకబడ్డ ఓ హైస్కూల్‌కు, మంచిఫలితాలను ఆశించి, తాను ఇంతకు మనుపు టీచరుగా పనిచేసిన పాఠశాలకే ప్రధానోపాధ్యాయుడిగా ట్రాన్స్‌ఫర్ వచ్చింది.
పిల్లలు సమయానికి రాలేనందున, భార్యభర్తలిద్దరు బడి పిల్లల తలిదండ్రుల సహాయంతో, అవసరమున్నంత లగేజీతో ఆ ఊరు చేరిపోయారు. పరిచయమున్న ఊరు అయినందున, సర్దుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేకపోయింది. ఇక వెంకటస్వామికి పనే పరమాన్నం. ప్రభుత్వము ఆసించినట్లే తోటి ఉపాధ్యాయుల సహకారంతో, తన సర్వీసులో చివరి ఐదు సంవత్సరాలు, తన పాఠశాలకు పదోతరగతి విద్యార్థుల్లో వందశాతం ఉత్తీర్ణతతో, జిల్లాలోనే తన పాఠశాలను నెంబర్‌వన్ స్థానంలో ఉంచగలిగాడు. అందరి ఉపాధ్యాయుల్లాగానే, వెంకటస్వామి కూడా బడి పిల్లల ఉత్తీర్ణతను, తన ఉద్యోగం చివరిరోజుల్లో తన పాఠశాలకు మంచిపేరు రావడాన్ని చూసి, మురిసిపోయాడు, మనసు ఆనందంతో పొంగిపోయింది.
“ఏదైనా ఒకటి ప్రారంభమైతే, దానికి ముగింపుకూడా వుండాల్సిందే, అది ధర్మం కూడా. వెంకటస్వామి ఉద్యోగం కూడా ఏదో చిన్న పల్లెలలో ప్రారంభమైంది. మనిషి జీవితానికి ముగింపు ఏ రోజో తెలియదుకాని, ప్రభుత్వ ఉద్యోగికి, ఉద్యోగిగా తన చివరి పనిదినం మాత్రం ముందుగానె తెలిసిపోతుంది. ఇదీ ఓకంగామంచిదే. మానసికంగా ముందుగానే సిద్ధపడిపోవచ్చు. వెంకటస్వామి జీవితంలోకూడా, ప్రభుత్వ ఉద్యోగిగా ఆరోజు రానే వచ్చింది. అరోజు తన పిల్లలుంటే బాగుండేదనుకొన్నారు వెంకటస్వామి దంపతులు.
కానీ , కారణాలేమైనా ఎవరూ రాలేకపోయారు. ముందుగా వేసుకొన్న ప్రణాళిక ప్రకారం, పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, వెంకటస్వామి "రిటైర్మెంట్ ఫంక్షన్” కు భారీగానే ఏర్పాట్లు చేసేశారు. అరోజు బడి వాతావరణం మొత్తం ఓపండగలా మారిపోయింది. వేదిక సిద్ధమయింది, బ్యాండుమేళము, ఒకటేంటి అన్నీ సిద్ధమయ్యాయి. ఉదయం పదిగంటలకు ముందే, పాఠశాల సిబ్బంది,పదో తరగతి పిల్లలు, వెంకటస్వామి ఉంటున్న ఇంటికి వెళ్ళి మాష్టారు దంపతులను సాదరంగా ఆహ్వానించారు. తన చివరి పనిదినం ఇంత ఆర్భాటంగా వుంటుందని, వెంకటస్వామి వూహించనేలేదు. సిబ్బంది ఆహ్వానానికి వెంకటస్వామి దంపతుల్లో ఎక్కడో కొంత గుబులు,బుగులు. అన్నింటినీ తమాయించుకొంటూ,అందరితోపాటు బడి ఆవరణంలోకి వచ్చి, అక్కడి ఏర్పాట్లన్నీ చూసి, కొంత ఆశ్చరానికి లోనయ్యాడు
వెంకటస్వామి.
రావాల్సిన వారందరూ అప్పటికే వచ్చి వుండడంవల్ల, కార్యక్రమాన్ని డ్రిల్ టీచర్ “తిమ్మప్ప
ప్రారంభిస్తూ, వెంకటస్వామి దంపతులను వేదిక మీదికి ఆహ్వానించాడు. తర్వాత సన్మానంలో భాగంగా ప్రార్థన, ఆ తర్వాత పూలదండలతో,శాలువాలతో సన్మానాలు, మొమెంటోలు అలాఅలా కార్యక్రమాలు జరిగిపోయాయి.
పాఠశాల సిబ్బంది, బడిపిల్లలు వెంకటస్వామితో వారికున్న అనుబంధాన్ని, వారు నేర్చుకొన్న పాఠాలు, సభలో పాలుపంచుకొన్నారు. చివరిగా వెంకటస్వామిని ప్రసంగిచవలసిందిగా కోరారు ఆర్గనైజర్ తిమ్మప్ప టీచర్.ఎన్నోఏళ్ళు ధారాళంగా, ఎన్నో వందలమంది పిల్లలకు పాఠాలు చెప్పిన వెంకటస్వామి గొంతు, మొదటిసారి కొంత మూగబోయింది. సమావేశమంతా ఒకటే నిశ్శబ్దం. అందర్నీ ఓసారి కలియచూసి మాట్లాడ్డం మొదలు పెట్టాడు వెంకటస్వామి. అంతే, ఒకటే చప్పట్లు, కళ్ళుమూసి ఆ చప్పట్ల ఆనందాన్ని తనివితీరా అనుభవించి, చప్పట్ల శబ్దం ఆగిన తర్వాత ఉపాధ్యాయుడిగా తన చివరి మాటలు ప్రారంభించాడు వెంకటస్వామి.
“సభకు నమస్కారం. నాతోటి ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బందికి నా నమస్కారాలు, పిల్లలందరికి నాఆశీస్సులు. ముందుగా నేను మానాన్నకు చాలా రుణపడివుంటాను. మానాన్న కోరికే, నన్ను ఉపాధ్యాయుణ్ణి చేసింది. తర్వాతివారు నా అన్నలు. నాచదువులకోసం వారు వ్యవసాయదారులుగా వుండి, నాకు ఎంతో సహకరించారు. వారికి నా నమస్కారాలు. నిజం చెప్పాలంటే, నేను నాముగ్గులి పిల్లల్ని పెద్దగా పట్టించుకొన్నది లేదు. అందుకే నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చిన నా భార్య భారతికి నేనెంతో రుణపడి వుంటాను . ఇక నాఉద్యోగం గురించి చెప్పాలంటే చాలావుంది. “మానాన్న చెప్పేవాడు, మనం ఎవరినుంచేనా ఓ రూపాయి తీసుకొన్నామంటే, దానికి జవాబుగా రూపాయి పదిపైసల పని చేయాలని.
ఆ స్పూర్తే నన్ను ముందుకు నడిపించింది. నా సహ ఉపాధ్యాయులవల్ల, పిల్లలద్వారా నేను నాకు తెలియని ఎన్నో విషయాల్ని నేర్చుకొన్నాను. ఇది వాస్తవం. నిజంగా నాకు వచ్చిన "అవార్డులన్నీ వారికి చెందాల్సినవే.
చివరిగా నేనుకోరేది ఒకటే, మీకు దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, తెలియనివి అడిగి తెలుసుకోండి, మిమ్మల్ని మీరుగా తీర్చిదిద్దుకోండి. ఇంతాగా నన్ను నా భార్యను ఆదరించిన మీ అందరికీ పేరుపేరునా నా అభినందనలు. శెలవామరి ." అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు.
మరలా ఓసారి చప్పట్లు మారుమ్రోగాయి. అందరి బోజనాల తర్వాత వెంకటస్వామిని, భారతిని ఇంటిదాకా సాగనంపి వచ్చారు పాఠశాల సిబ్బంది.
“కారణంలేకుండా ఏ సంఘటనైనా జరగదనుకొంటా. ఉద్యోగవిరమణ సమావేశంనుండి ఇంటికి చేరుకొన్న తర్వాత భర్తకు ఓమాంచి కాఫీ అందించింది భారతి. అంతటితో ఆగకుండా గతంలోని ఎన్నో సంఘటనలను గుర్తుచేసుకొంటూ ఏకధాటిగా మాట్లాడుతూనే వుంది. అసలే అంతగా మాట్లాడని తన భారతి, నిద్రకూడా మానేసి, ఎవేవో కబుర్లు చెబుతుంటే, మాస్టారుకు ఒకింత ఆశ్చర్యం, ఒకింత ఆనందం.
“ఎమేవ్ నిద్రపోవా"అన్న భర్త మాటలకు అడ్డుతగులుతూ “వుండండి, నన్ను మాట్లాడనివ్వండి. రేపటినుండి మీకు నిజంగా 'క్రొత్త జీవితం ప్రారంభం' ఇక నాకు రేపటినుండి రెస్ట్. మీరే అన్నీచేయాలి. అంతేకాదు ఇక మీరు 'స్టూడెంట్' అంటూ ఎంతగానో నవ్వించి నవ్వించి, నిద్రలోకి జారుకొంది భారతి. భార్య వాలకానికి ఆశ్చర్యపోయిన వెంకటస్వామి తనూ నిద్రకు ఉపక్రమించాడు.
'వానరాకడ ప్రాణంపోకడ తెలీదు' అని ఓనానుడి. పనుల్లేనప్పుడు నిద్ర రాకపోడము, పనులున్నప్పుడు అతిగా నిద్ర రావడమూ ఓ విచిత్రమే. మరుసటి రోజునుండి బడికి పోవాల్సిన పనిలేదని తెలిసినా, వెంకటస్వామికి తొందరగానే మెలుకువ వచ్చింది. పడుకొన్న భారతిని లేపలేదు. అమె గతరాత్రి కోరుకొన్నట్లు, ఆమెకు రెస్ట్ ఇవ్వాలని, ముఖం కడుక్కొని కాఫీచేసి, రెండు గ్లాసుల్లోపోసి, భార్యకు సర్ప్రైజ్ ఇవ్వాలని పడగ్గదివైపు నడిచాడు. కాఫీగ్లాసులు టేబుల్ మీద పెట్టి ఏమండీ బారతీ మేడంగారూ, లేవండి మీకోసం వేడివేడి కాఫీ రెడీ అంటూ భార్యను లేపే ప్రయత్నం చేశాడు వెంకటస్వామి. భార్య లేవక పోయేసరికి 'మేలుకొని సరదాగా నటిస్తుంద'నుకొని మఖంమీది దుప్పటిని తొలగించాడు.
అప్పటికీ మాట్లాడక పోవడంవల్ల “లేలే. మాంచి కాఫీ, నీకోసమే చేశా .'అంటూ భార్య వైపు చూశాడు వెంకటస్వామి. ఆమెనుండి ఏలాంటి రెస్పాన్స్ లేకపోయేటప్పటికి “ఏంటీ ఈ మనిషి, ఎంత పిలిచినా లేవడంలేదే! ఎమైనా సుస్తీ చేసిందేమో' అని నుదుటి మీద చేయిపెట్టి చూసిన వెంకటస్వామికి, నుదురు చల్లగా వుండేసరికి, కాస్త కంగారుగా “భారతీ!భారతీ !"అంటూ మనిషిని కుదిపి చూశాడు. మొత్తం శరీరం చల్లగా వుండేసరికి, మాష్టారుకు ఏమీ పాలుపోలేదు. గాబరాగా పక్కింటి వాళ్ళను పిలచాడు. వాళ్ళు కొంతమంది టీచర్లకు కబురు పెట్టారు. అంతలోనే జనం పోగయ్యారు. తోటి టీచర్లు డాక్టర్‌తో సహా వెంకటస్వామి ఇంటికి వచ్చారు. అందరూ డాక్టరుకు దారి వదిలారు.
భారతిని పరీక్షించిన డాక్టరు, మౌనంగా బయటికి రావడంతో, గుమికూడిన
అందర్లోను ఒకటే ఆందోళన. వెంకటస్వామితో, తక్కిన టీచర్లతో డాక్టరు ఆన్నాడు “అయామ్ సారీ,
ఆమె నిద్రలోనే చనిపోయారు”
వెంకటస్వామి మనసు మొద్దుబారి పోయింది. కొందరు వెంకటస్వామిని ఓదారుస్తున్నారు. పక్కింటివారు “కాస్త కాఫీ త్రాగండి మాష్టారుగారూ" అంటున్నారు. వెంకటస్వామికి అంతా ఓ కలలాగా వుంది. కొంత తనను తాను సముదాయించుకొని, పిల్లలకు ఫోన్లు చేసి, విషయాన్నితెలిపి తొందరగా వచ్చేయండన్నాడు. ఉపాధ్యాయులు వెంకటస్వామికి తోడుగా వుండిపోయారు.
మరుసటిరొజు మధ్యాన్నానికల్లా కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు వచ్చారు. అఫ్పటికే భారతి చివరి మజలీకి అంతా సిద్ధంగా వున్నందున, అందరి కడపటి చూపు తర్వాత, జరగాల్సిన వాటిని సాంప్రదాయంగా జరిపించేశారు. కూతురు ప్రణీత మాత్రం, తండ్రిని కనిపెట్టుకొని కూర్చొంది. ఇక తక్కిందంతా ఒకటే నిశ్శబ్దం.
“పుట్టుకకైనా, గిట్టుటకైనా కాలానికి కనికరముండదుకదా" భారతిలేని మొదటిరోజు వెంకటస్వామికి
మొదటిసారి అనుభవానికి వచ్చింది. ఎందరున్నా, ఏదో తెలియని వెలితి. ఇవేవీ పట్టని, వెంకటస్వామి పరివారం, పక్కింటివాళ్ళు పంపిన టిఫిన్లువేసి, కాఫీ తాగుతూ, ఏవో కబుర్లలో వుండిపోయారు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి, వెంకటస్వామితో, తోటి టీచర్లతో చర్చించి, చివరిరోజు కార్యానికి వచ్చేలాగా మాట్లాడుకొని, కొడుకులు, కోడళ్ళు, అల్లుడు వెళ్ళిపోయారు. కూతరు ప్రణీత నాన్నకు సహాయంగా వుండిపోయింది.
“మనిషి మనసును చదవడం బహుశా ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదేమో. కూతురు నిజంగానే తనమీది ప్రేమతో వుండిపోయిందని అనుకొన్నాడు పిచ్చి తండ్రి వెంకటస్వామి. నాన్నకు సేవలు చేస్తూనే, అమ్మ నగలమీద ఓ కన్నేసింది. నాన్నతో పదేపదే మాట్లాడి, భారతికి చెందిన గాజులు, ఇంకా ఇతర ఆభరణాలు మొత్తంగా ఓ ఇరవై తులాల బంగారాన్ని సర్దేసింది.
అప్పటికిగాని తన కూతురు ఎందుకు తనతో ఉండి పోయిందో అర్ధంకాలేదు పిచ్చి తండ్రికి. చూసేలోపే పదోరోజు వచ్చేసింది. ఆరోజు ఉదయాన్నే ముందుగా అనుకొన్నట్లే వెంకటస్వామి గుంపు వచ్చి చేరింది. కాకుంటే ఈసారి, పిల్లల్తోసహా అందరూ వచ్చేశారు. “రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు వయసొచ్చిన తర్వాతేగాని, పసివయసులో ఆవేవీ వుండవుకదా. వచ్చీరాగానే, తాత చుట్టూ పిల్లలందరూ చేరిపోయారు. అది వెంకటస్వామిని, ఈలోకానికి తీసుకొచ్చింది. తాతను తమతోటే రావాలని అందరూ పట్టుపట్టారు. అరోజు సాయంత్రనికి అన్ని కార్యక్రమాలు ముగిశాయి.
వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. పోయేముందు, వెంకటస్వామి శిష్యురాలు,దూరపు బంధువుల అమ్మాయి, తననే ఆదర్శంగా చేసుకొని టీచరుగా కొలువు చేస్తున్న భార్గవి మాష్టార్నిఅలా పక్కకు పిలిచి “మాష్టరుగారూ ! నేను మీకు చెప్పగిలిగినంత దాన్ని మాత్రం కాదు. కాకుంటే నాకు మీకు చెప్పే అవకాశం రాదేమోనని ఓవిషయం చెప్పాలనుకొన్నాను. అదేమిటంటే, మీ కుడిభుజమైన అమ్మగారు ఇప్పుడు మీతో లేరు. ఇక సర్దుబాటొక్కటే మార్గము. మీ కోడళ్ళు ఏమిచేస్తే అదే కడుపు నిండా తినడం నేర్చుకోండి. దేనికీ పేర్లు పెట్టకండి.
మీరెప్పుడు రావాలనుకొంటే, అప్పుడు మాయింటికి యదేఛ్చ గా రావచ్చు. నేను చెప్పింది తప్పైతే నన్ను క్షమించండి" అంటూ, మాష్టారు సమాధానంకోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. భార్గవి వెళ్ళినవైపే అలా చూస్తుండి పోయాడు వెంకటస్వామి. ఇక అరోజు రాత్రి కాస్త సందడిగానే గడిచింది.
“టిఫిన్ రెడీ, అందరూ రావాలని", కోడళ్ళిద్దరూ హాల్లో కూర్చొని పిలిచారు. ఉష్మా చెట్నీ అందరికీ సర్వ్ చేసారు. కుర్చీలో కూర్చొన్న వెంకటస్వామికీ ఓ ప్లేట్ అందించారు. అందరూ తిన్న తర్వాత, పిల్లలందర్ని బయట ఆడుకోమని చెప్పి “నాన్నా మీతో కొంత మాట్లాడాలి" అంటూ మొదలు పెట్టాడు పెద్దకొడుకురాజేష్. “ఇక మీరు ఒక్కరే ఇక్కడ ఏం చేస్తారు?మన భూములను, ఇళ్ళను పంచేసుకొందాము. ఇక మీ పీ.యఫ్. అందరికీ సమానంగా మీరెలగూ ఇచ్చేస్తారు. ఇవన్నీ ఎప్పుడైనా జరగాల్సిందే కదా" అంటూ, నాన్నఅవసరం లేకనే, తనే పంపకాలన్నీ తేల్చేశాడు. ఇక వెంకటస్వామిని సిద్దార్థతో వుండేలాగా నిర్ణయించాడు.
కాకుంటే, మీ పెన్షన్ డబ్బు వాడి ఖాతలో జమ అయ్యేలాగా సర్దితే సరిపోతుంది. ఇంత కాలము పిల్లలకు మాష్టారు పాఠాలు చెబితే, ఇప్పుడు పిల్లలు మాష్టారుకు పాఠాలు చెబుతున్నట్లుంది పరిస్థితి. ఈ నిర్ణయాల తర్వాత ఓ వారంరోజుల్లో పంపకాలన్నీ ముగించేశారు. వెంకటస్వామి గుడ్డలన్నీ ఓ సూట్‌కేస్‌లో సర్దారు సిద్ధార్థ పిల్లలు. వాళ్ల అవ్వ గుర్తుగా, భారతి ఫోటో ఒకటి, అందులోనే పెట్టారు. వెంకటస్వామి కొత్త జీవితంసిద్ధార్ధ ఫ్యామిలీతో విజయవాడకు వెళ్ళడంతో మొదలయింది.
సిద్ధార్థ, సుశీలలు తాము అనుకొన్న ప్రకారం, త్రీబెడ్‌రూం అపార్ట్‌మెంట్, బ్యాంక్‌లోన్ తీసుకొని కొనేసి సుశీల పేరున రిజిష్టర్ చేయించడం జరిగిపోయాయి. అందులో ఓ రూం వెంకటస్వామికి కేటాయించారు. బ్యాంక్ లోన్‌కు వెంకటస్వామి పెన్షన్ షూరిటీగా మారింది. ప్రతినెలా వెంకటస్వామి పెన్షన్ నుండి ఈ.ఎమ్.ఐ. కట్టేలాగా బ్యాంకు వారితో ఆగ్రిమెంట్ కుదుర్చుకొన్నారు. అది పోగా మిగిలిన పెన్షన్ డబ్బు, ప్రతినెలా సిద్ధార్ధ ఏదో కారణంతో వాడేసుకోవడం మొదలయింది. మెల్లగా వెంకటస్వామి అన్నింటికీ, కొడుకు కోడలు మీద
అధార పడాల్సిన పరిస్థితి వచ్చింది.
తన రూంలో చీకట్లో ఎదురుగా వున్న తన భార్య 'భారతి'కనిపించీ కనిపించని ఫోటోవెపు చూస్తూ, ఇలాంటి పరిస్థితి తన భారతికి తప్పినందుకు లోలోన చాలా సంతోషించాడు వెంకటస్వామి. తాతగారి పరిస్థితిని గమనించిన మనవడు నరేష్ తాతను పార్క్‌కని తీసుకెళ్ళి ఓ ఓల్టేజ్ హోంను చూపించాడు.
తాతతో నరేష్ అన్నాడు “తాతా నీకు మాఇంట్లో సరిగా తిండి పెట్టడంలేదు. అమ్మ వంట మాకోరకం, మీకోరకం చేయడం రోజూ నేను, చెల్లి గమనిస్తున్నాము. మేమేమైనా మాట్లాడితే, తిడుతున్నారు. అంతేకాక కొడుతున్నారు. ఇవన్నీ మీదాకా రావడంలేదు. మీరు ఒప్పుకొంటే అమ్మ నాన్నలమీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకొన్నాము,నేను చెల్లి. అది మంచిది కాదంటే, మీరు ఈ ఓల్డేజ్ హోంలో చేరిపొండి. ఇక్కడైనా కడుపునిండా తినవచ్చు.
ఇక మానాన్నకు, అమ్మకు మీ పెన్షన్ డబ్బులు ఇవ్వకండి.వీలైనప్పుడు నేను, చెల్లి వస్తుంటాము అన్నమనవడి మాటలకు ఆశ్చర్యపోయాడు వెంకటస్వామి.
“ఏం తాతా ఆలోచిస్తున్నారు?" అన్న మనవడి మాటలకు ఏంచెప్పాలో తెలియక “అది కాదురా, నేను ఇలా ఓల్డేజ్ హోంలో చేరితే , మీ అమ్మ నాన్నలు నామోషీగా ఫీలవుతారేమో" అన్నాడు. "అదేంకాదు తాతా, మిమ్మల్ని సరిగా చూడని వారే, నామోషీగా ఫీలవ్వాలి.
నేను పెద్దయ్యాక, మీరు నాదగ్గరే వుంటారు. నాకు మీరు కావాలి. అప్పటిదాకా మీరు ఈ ఓల్డేజ్ హోంలో ఉండండి."
మనవడి ఆప్యాయతకు మనసులోనే సంతోషించి, ఓల్జేజ్ హోంలో చేరిపోయాడు వెంకటస్వామి.
తనకు ఇద్దరుండేందుకు వీలున్న గదిని కేటాయింపబడింది. తాతను గదిలో కూర్చోబెట్టి “తాతా నేను వెళ్ళి మీ లగేజి తీసుకొస్తాను, మీరు వస్తే మరలా వాళ్ళు ఎవేవో మాట్లాడడం నాకు నచ్చదు అంటూ వెళ్ళి జరిగిన విషయాన్ని ఆమ్మాన్నాలకు చెప్పి, వెంకటస్వామి గుడ్డలు, వాళ్ళ అవ్వ భారతి ఫోటో అన్నీ సర్దుకొని, ఆటోలో సౌమ్యతోపాటు వచ్చి, అన్నీ తనే సర్జిచ్చాడు నరేష్.
తాతా మనవళ్ళు సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. ఓల్జేజ్ హోం గేట్‌దాకా వచ్చి, నరేష్, సౌమ్యలను సాగనంపాడు వెంకటస్వామి.
చిన్న విల్లాడెనా, జీవితానికి సరిపడే పాఠం చెప్పాడు, ఆనుకొన్నాడు వెంకటస్వామి. మనవడు చెప్పినట్లే బ్యాంకుకు వెళ్లి మేనేజర్ ని కలిసి విషయం వివరించి, ఇకనుండి, తన పెన్నన్ మొత్తం తన ఖతాకు జమ అయ్యేలాగా మార్పు చేయించాడు. దానితో పాటు, తనకే పాఠం చెప్పిన పిల్లలిద్దరి పేర్లపై ఆర్.డి. ఖాతాలు ప్రారంభించాడు. ఎంతైనా తాతకదా! ఇప్పుడు, వెంకటస్వామి ఎక్కిన ఆటో, ఓల్టేజ్ హోం వైపు పరుగు తీసింది. ఆటోలో పోతున్న వెంకటస్వామికి, స్పీడుగా వెనక్కి వెళుతున్న చెట్లను, ఇళ్ళను చూసి, అతనిలోని కుర్రాడు, ఆనందంతో ఎగిరి గెంతులేయసాగాడు.
***
Comments