top of page

నీళ్ల కోసం



'Neella Kosam' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 22/04/2024

'నీళ్ల కోసం' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అంకుల్! మాకు నీళ్లు రావడం లేదు” అన్నాడు పై పోర్షన్ లో అద్దెకు వున్న కుర్రాడు. 

“వారం రోజులైంది ట్యాంక్ కోసం డబ్బు కట్టి. యింతవరకు రాలేదు నాయనా, ఉదయం మునిసిపల్ వాళ్ళు వదిలిన నీళ్లు పావుగంట లోనే అయిపోయాయి” అన్నాడు యింటి యజమాని కృష్ణారావు. 


“మరి ఎలా అంకుల్, అద్దెకు యిచ్చినప్పుడు యిరవై నాలుగు గంటలు నీటి సప్లై వుంటుంది అన్నారు, ఏదో ఒక రోజు అంటే సద్దుకోగలం, ఏదో చూడండి” అంటూ వెళ్ళిపోయాడు అద్దెకున్న కుర్రాడు. 


“ఎవ్వరు.. అద్దెకున్న అబ్బాయా, వారం రోజులనుండి మనం కూడా బాధ పడుతున్నాము గా, అయినా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వుంది అంటారుగా. ఒక్క వాటర్ ట్యాంక్ తెప్పించలేక పోయారు” అంది సుగుణ. 


‘ఆ పేరు ఎలాపెట్టారో తెలియదు గాని ప్రతిదానికి నా మీద పడిపోతుంది’ అనుకున్నాడు కృష్ణారావు. 


“ఇన్ఫ్లుయెన్స్ వుంటే నీళ్ల ట్యాంకులు, పెట్రోల్ ట్యాంకులు తెప్పించటానికి కాదు” అన్నాడు ఫోన్ అందుకుంటూ.


తను గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, సీఎం ఆఫీస్ లో పనిచేసే కాజా అనే సెక్రటరీ వుండేవాడు. అతనికి ఫోన్ చేసి, ‘నీళ్ల ట్యాంక్ వారం క్రితం బుక్ చేసినా యింతవరకు రాలేదు’ అని, ‘ప్రస్తుతం టిష్యూ పేపర్లు డిమాండ్ పెరిగిపోయింది, ఎలాగైనా ఒక ట్యాంకర్ నీళ్లు పంపించ’మని ఆడిగాడు. పాత స్నేహం గుర్తుంచుకుని, కాజా ‘అడ్రస్ పెట్టండి ఒక గంటలో ట్యాంకర్ వస్తుంది, ఒకటి చాలా రెండు పంపనా’ అన్నాడు. 


“పుణ్యం ఉంటుంది రెండు పంపించండి” అని చెప్పి, బయట వున్న రెండు సంపులు, గోడకి అనించి వుంచిన మూడు పెద్ద డ్రమ్ముల మూతలు తీసి, పెళ్ళానికి చెప్పాడు వాటర్ వస్తోంది యింకో గంటలో అని. 


అనుకున్నట్టే ఒక గంట తరువాత హారన్ వాయుంచుకుంటో రెండు వాటర్ ట్యాంకర్లు వచ్చి యింటి గుమ్మం ముందు ఆగాయి. 


అరగంటలో మొత్తం రెండు సంపులు మూడు పెద్ద డ్రమ్ములు, నాలుగు బకెట్స్ నింపేసారు ట్యాంక్ డ్రైవర్స్. 


బిల్లు డబ్బుతో పాటు యిద్దరు డ్రైవర్స్ కి చెరో అయిదు వందల రూపాయలు ఎక్కువ యిచ్చాడు కృష్ణారావు. 


అందులో ఒక డ్రైవర్ తన ఫోన్ నెంబర్ యిచ్చి, “సార్! ఎప్పుడు నీళ్లు అవసరం అయినా నాకు ఫోన్ చెయ్యండి, గంటలో ట్యాంకర్ తీసుకుని వస్తాను” అన్నాడు. 


కృష్ణారావు యింటి కుడి ఎడమ యిల్లు వాళ్ళు ఆశ్చర్యం గా చూసి “మాకు ఒక్క ట్యాంకర్ కి దిక్కులేదు, మీకు రెండు ట్యాంకర్లు ఎలా వచ్చాయి, మీరు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసారా” అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసారు. “అబ్బే లేదండి.. తెలిసినవాళ్ళు పంపించారు” అన్నాడు కృష్ణారావు. 


“మాకు చుక్క నీరు లేదండి. హోటల్ నుంచి భోజనం తెప్పించుకుని తింటున్నాము. కలికాలం కాకపోతే ఈ నీటి కరువు ఏమిటో” అన్నాడు పక్కింటి రమణారావు గారు నిండుగా వున్న కృష్ణారావుగారి వాటర్ డ్రమ్ములు వంక ఈర్ష్యగా చూస్తో. 


“ఈ పనివాళ్ళ తో పడే దానికంటే హోటల్ భోజనమే నయ్యం అండి” అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణారావు. 


ఉక్కపోత తో నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు. కింద ఏదో చప్పుడు వినిపించడంతో తొంగి చూసాడు. పక్కింటి రమణారావు గారు ఒక పైపు తన డ్రమ్ములో వేసి నీళ్లు లాగి తమ సంపులో పోసుకుంటున్నాడు. ఓరినీ అసాధ్యం కూలా అనుకుంటూ మెల్లగా కిందకి దిగి వచ్చి పైపుని పట్టుకుని గట్టిగా లాగేసాడు కృష్ణారావు. అటువైపున దడేలు మని మనిషి కింద పడ్డ సౌండ్ వచ్చింది. పైపు తీసుకుని లోపల పెట్టి వెళ్లి పడుకున్నాడు. 


తెల్లారిన తరువాత చూస్తే డ్రమ్ములో సగం నీళ్లు తగ్గిపోయి వున్నాయి. ముసలాడిని అడుగుదాం అని అనుకున్నాడు కృష్ణారావు, అయితే భార్య వారించడం తో మానేసి, ఎందుకైనా మంచిది అని డ్రమ్ము మూత మీద రాయి పెట్టి వచ్చాడు. 


ఎందుకైనా మంచిది అని అర్ధరాత్రి లేచి చూసాడు రమణారావు ఇంటివైపు, చడిచప్పుడు లేదు. పైపు లాగేసానుగా బుద్దివచ్చి వుంటుంది అనుకుంటూ పడుకున్నాడు. 


“ఏమండోయ్! రెండో వాటర్ డ్రంలో చుక్క నీరులేదు, మీరు తెల్లవారి జామున మోటార్ వేసి పైకి ఎక్కించారా” అని అరుస్తున్న అరుపులకి కిందకి దిగి వచ్చి చూస్తే డ్రంలో అడుగున ఒక చెంబుడు నీళ్లు మాత్రమే వున్నాయి, 


సంప్ మూత తెరిచి చూసాడు. సంపులో నిండానే వున్నాయి. “అంటే ఏ తెల్లవారిజామునో పక్కింటి ఆయన నీళ్లు లాగేసి వుంటాడు” అన్నాడు భార్యతో. 


“పైపు గొట్టం మనదగ్గరే వుంది కదండీ, ఎలా నీళ్లు లాగుంటాడు” అంది కృష్ణారావు భార్య. 


“యింకోటి కొనుక్కుని వుంటాడు లే, యిహ మనం తెల్లవార్లూ మెలుకువగా వుండాలిసిందే” అన్నాడు కృష్ణారావు. 


“ఎందుకైనా మంచిది మేడ మీద అద్దెకున్న కుర్రాడిని కూడా ఈ రెండురోజులు మెలుకువగా వుండమనండి, అసలే ఆ రమణ గార అబ్బాయి బలవంతుడు కూడాను” అంది కృష్ణారావు భార్య. 


తెల్లవారి జామున ఏదో మోటార్ సౌండ్ వినిపించి కిందకి దిగి వచ్చాడు కృష్ణారావు. అదే సమయానికి మేడమీద అబ్బాయి కూడా కిందకి వచ్చి “అంకుల్! పక్కింటి ఆయన మోటార్ పెట్టి మన సంప్ లో ని నీళ్లు లాగేస్తున్నాడు” అంటూ మోటార్ కి వున్న పైప్ ని పట్టుకొని బలంగా లాగాడు. మోటార్ తో సహా వచ్చి కృష్ణారావు సంప్ దగ్గర పడింది. మోటార్ తీసి లోపల దాచి పడుకున్నాడు. 


కాఫీ తాగుతోవుంటే పక్కింటి రమణారావు గారి అబ్బాయి వచ్చి “అంకుల్! రాత్రి మా మోటార్, దొంగలు ఎత్తుకు పోయారు, మీ యింటి దగ్గర పడేసారా” అని ఆడిగాడు. 


“అవును, ఆ దొంగ వెధవలు మంచి వాళ్ళు లా వున్నారు. మా సంప్ లో నీళ్లు మీ సంపులోకి వదులుతోవుంటే మోటార్ లాగేసాను. మా సీసీ కెమెరాలలో దొంగలు క్లియర్ గా కనిపిస్తారు, కాసేపు వున్నాక పోలీసులు వస్తారు” అన్నాడు కృష్ణారావు. 


“యింతోటి దానికి పోలీసులు ఎందుకు అంకుల్, కావాలంటే మా సంప్ లో పడ్డ వాటర్ మీ సంప్ లోకి పంపుతాను, మోటార్ యిస్తే కనెక్షన్ యిచ్చుకుంటాను, ఈ రోజు మాకు టాంకర్ వస్తుందిట” అన్నాడు. 


వీళ్లతో గొడవ ఎందుకు అనుకుని మోటార్, పైప్ తీసుకుని వచ్చి అతనికి యిచ్చేసాడు. “ఈ సారి యిలా జరిగితే వదలను” అన్నాడు కృష్ణారావు. 


బయట జరుగుతున్న గొడవ అంతా విని కృష్ణారావు భార్య, “నీళ్ళ ప్రాబ్లెమ్ చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని కూడా దొంగగా మార్చింది” అంది. 


“ఎవ్వరు ఇంజనీర్?” అన్నాడు కృష్ణారావు. 


“ఆ రమణారావు గారి అబ్బాయే. అతను మా తమ్ముడు పనిచేసే కంపినీలో పనిచేస్తున్నాడుట” అంది. 


లంచ్ చేసుకుని టీవీ పెట్టాడు, టీవీలో చాగంటి గారి ప్రవచనం వస్తోంది, యింకో ఛానల్ పెడదాం అనుకుని ఛానల్ మార్చేలోపే “వుంచండి, ఏదో చెపుతున్నారు. వింటే పాపం ఏమీ రాదులెండి” అంది భార్య. 


“మనకి వున్నదానిలో కొద్దిగా అయినా యితరులకు దానం చేస్తే చాలా మంచిది. మొన్న ఏదో ఊరులో చూసాను, ప్రతీ రెండు వీదులకు ఒక మంచి నీరు యిచ్చే చలివేంద్రం వుంది. ఇంతకంటే పుణ్యం ఎముంటుంది చెప్పండి. నాకు తెలుసు, ఈ వూరిలో నీటి కరువు వుంది అని, మీ దగ్గర బిందెడు నీళ్లు వుంటే అవసరం అయిన వాళ్ళకి చెంబుడు నీళ్లు ఇవ్వండి. అదే దేముడు దృష్టిలో మీరు పుణ్యం చేసుకున్నట్టు లెక్క. ఏమో రేపు నీళ్లు రాకపోతే ఎలా అనుకోకండి, ఈ రోజు మీరు అవసరం అయిన వాళ్ళకి మీరు చేయగలిగిన సహాయం చేస్తే రేపు మీకు దేముడే యిస్తాడు. అది ఆయన బాధ్యత” అంటూ చెప్పుకుంటో వెళ్తున్నారు చాగంటి గారు. 


“నువ్వు విను, నేను కాసేపు పడుకుంటా” అంటూ వెళ్ళిపోయాడు కృష్ణారావు. 


మంచం మీద పడుకున్నాడే కానీ మనసులో చాగంటి గారి మాటలే గుర్తుకు వస్తున్నాయి. మూడు డ్రమ్ములు నిండా, రెండు సంపుల నిండా నీరు పెట్టుకుని, పక్కన యింటి వాళ్ళు నీళ్లకోసం యిబ్బంది పడుతోవుంటే, వాళ్ళు అడిగినా మాకే సరిపోవు అనటం వలన వాళ్ళని దొంగలుగా మార్చిన పాపం నాకు తగులుతుంది కదా అనుకుంటూ ఫోన్ తీసుకుని టెలిఫోన్ నెంబర్ యిచ్చిన వాటర్ ట్యాంక్ డ్రైవర్ కి ఫోన్ చేసాడు. మూడు సారులు చేసిన తరువాత ఆ డ్రైవర్ ఫోన్ లో ఎవ్వరండీ అన్నాడు. అతను ఫోన్ నెంబర్ యిచ్చిన విషయం గుర్తుకు తెచ్చి, “బాబూ మాకు ఈ రోజు ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకుని రాగలవా” అన్నాడు కృష్ణారావు. 


“గుర్తుకు వచ్చింది సార్, సహజంగా నేను నెంబర్ ఇవ్వను. ఎందుకో మిమ్మల్ని చూడగానే మా నాన్న గుర్తుకు వచ్చాడు. అందుకే నెంబర్ యిచ్చాను. నీళ్ల సప్లై కష్టం గా వుంది, అయినా రాత్రి 10 దాటిన తరువాత తీసుకొని వస్తాను” అన్నాడు ట్యాంకర్ డ్రైవర్. 


రమణారావు గారి గోడ దగ్గర నుంచుని, “రమణారావు గారు!” అని పిలిచాడు. రెండు పిలుపుల తరువాత రమణారావు గారు కుడి చేతికి కట్టుతో “ఎవ్వరు?” అంటూ బయటకు వచ్చాడు. 


“చేతికి ఏమైంది సార్” అన్నాడు కృష్ణారావు. 


“మొన్న గోడమీద పడ్డాను, కొద్దిగా విరిగింది” అన్నాడు రమణారావు. 


కృష్ణారావు మనసు కలక్కు మంది. ఆ రోజు పైప్ బలంగా లాగడం వలన పడిపోయినట్టు వున్నాడు అనుకుని, “ఏమీలేదు సార్, ఈ రోజు మీకు వాటర్ ట్యాంకర్ వస్తుంది అని మీ అబ్బాయి చెప్పాడు, వచ్చిందా” అని అడిగాడు. 


“వాడు వారం నుంచి ఈ మాటే చెప్తున్నాడు, ట్యాంకర్ రావడం లేదు” అన్నాడు విరక్తి గా రమణారావు. 


“పరవాలేదు లేండి, ఈ రోజు రాత్రి 10 గంటలకు మాకు వాటర్ ట్యాంకర్ వస్తుంది. మీరు సగం మేము సగం పోయించుకుందాం, నీళ్ళ గురించి కంగారు పడకండి, ఎలాగో మే నెల లోకి వచ్చాము, ఈ నెల గడిపితే బోర్ వాటర్ కూడా వస్తుంది” అన్నాడు కృష్ణారావు. 


“చాలా కృతజ్ఞతలు అండి, యింట్లో నీటి బొట్టు లేకపోవడంతో చాలా యిబ్బంది పడుతున్నాము, మనిషి లో ఈర్ష్య అసూయలు కూడా పుడుతున్నాయి నీళ్ల ట్యాంకర్ ఎవ్వరింటికైనా వస్తే” అన్నాడు సిగ్గుపడుతు. 


“పర్లేదు లేండి, యిహనుంచి కష్టమైనా కలిసి ఎదురుకుందాం” అన్నాడు. 


అన్నమాట ప్రకారం ట్యాంకర్ వచ్చింది. సగం తమ సంపులో సగం రమణారావు గారి సంపులో పోయించాడు. డ్రైవర్ కి చల్లటి మజ్జిగ యిచ్చి తాగమన్నాడు. నీళ్లు వచ్చినందుకు రమణారావు గారి మనసు, చల్లటి మజ్జిగతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మనసు, నేను కూడా ఉపయోగపడ్డాను అని కృష్ణారావు మనసు ఆనందపడ్డాయి. 

శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.











49 views0 comments
bottom of page