'Nenu Whatsapp Kodi Kumpati' New Telugu Story
Written By Vasundhara
రచన: వసుంధర
(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
చిన్నప్పుడు అమ్మ నాకు చెప్పిన కథ:
వెనకటికో ఊళ్లో ఓ ముసలమ్మ. ఆమెకో కోడి. అది తెల్లారు ఝామునే కూస్తే, ముసలమ్మ లేచి కుంపటంటించేది. ఊరి జనం కోడికూత విని తెల్లారిందని నిద్ర లేచేవారు. ముసలమ్మ దగ్గర నిప్పు తీసుకెళ్లి ఇళ్లల్లో పొయ్యి రాజేసుకునేవాళ్లు. కానీ ఎన్నేళ్లు గడిచినా ఊళ్లోవాళ్లు తన ప్రాముఖ్యాన్ని గుర్తించలేదని ముసలమ్మకి కోపమొచ్చి- ఓ రోజు కోడీ కుంపటితో సహా ఊరికి దూరంగా వెళ్లి ఓ చోట కూర్చుంది.
కాసేపటికి ఆ ఊర్నించి ఎవరో వస్తుంటే, “నా కోడీ కుంపటీ ఇక్కడుండిపోయాయి. మరి ఆ ఊళ్లో తెల్లారిందా” అనడిగిందిట.
“భలేదానివే- నీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?” అని నవ్వేట్ట అతడు. ఆ మాటే సామెతగా మారింది.
ఈ కథలో ముసలమ్మని నేనైతే, నా కోడీ కుంపటి విషయంలో నేను గ్రహించిన కొత్త కోణమొకటి ఉంది. అందుకు నా కథని రెండు భాగాలుగా చెప్పాలి. ఒకటి రిటైర్మెంటుకి ముందు, రెండు రిటైర్మెంటు తర్వాత.
రిటైర్మెంటుకి ముందు
నేనో గవర్నమెంటు డిపార్టుమెంట్లో పెద్ద ఆఫీసర్ని. పదిహేనేళ్లలో రిటైరౌతాననగా పెద్ద ప్రమోషనొచ్చింది. బ్యాంకులు, ఫైనాన్సు కంపెనీలు, పరిశ్రమలు- వీటి ఆర్థిక లావాదేవీలు తనిఖీ చెయ్యడం నా డ్యూటీ.
ఆ పొజిషన్లో నాకు ముందున్న ఆఫీసరు విలాసరావు భారీగా లంచాలు పట్టి సస్పెండయాడు. ఆ వెంటనే అమెరికాలో కొడుకు దగ్గరకెళ్లి విలాసంగా విశ్రాంతజీవితాన్ని ఆస్వాదిస్తూ, తనకొచ్చిన చెడ్డపేరుని పట్టించుకోలేదు.
నేను చార్జి తీసుకోగానే సమాజంలో పెద్దోళ్లు చాలామంది నన్ను కలుసుకున్నారు. అందరిదీ ఒకే మాట!
“విలాసరావు చెప్పాచెయ్యకుండా ఆకస్మిక తనిఖీలు చేసేవాడు. దాంతో అయోమయంలో పడ్డ మమ్మల్ని రక్షించడానికి ‘ఖరుసవుద్ది’ అనేవాడు. మేము ఖరుసు భరించేవాళ్లం. అందువల్ల ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు చేరకుండా, ఆయన జనానాకు చేరేది” అని ముందు నేపథ్యం చెప్పారు.
“మీరు నిజాయితీపరులని విన్నాం. మీరు స్ట్రిక్టుగా ఉంటే మేమూ నిజాయితీగా ఉంటాం” అని నా’పథ్యం’ చెప్పారు.
‘బాగా చదివే విద్యార్థికైనా పరీక్షలు ఆకస్మికంగా పెడితే, తప్పులు దొర్లుతాయి. అందుకే పరీక్షలకి డేట్లు ముందే చెబుతారు. ఆ పద్ధతే మీ తనిఖీలకి అనుసరించాలని మనవి” అని స్ట్రిక్టు పథం చెప్పారు.
అన్నీ చెప్పి, “ఇది డిమాండు కాదు. సలహా కాదు. విన్నపం, అంతే!” అన్నారు.
వాళ్ల విన్నపంలో న్యాయముందనిపించింది. సరేనన్నాను. నా తనిఖీల్లో ఒక్క ఆర్థిక నేరం కూడా బయటపడలేదు.
ఆదర్శ అధికారిగా నాకు పేరొచ్చింది. సమాజంలో ఆర్థిక నేరాల్ని అరికట్టడానికి, గొప్ప పరిష్కారమార్గం చూపానని మెచ్చుకుంటూ, నాలుగేళ్లక్రితం లయన్స్ క్లబ్బు వాళ్లు నాకో అవార్డు కూడా ఇచ్చారు.
ఈ హోదా రాకముందు నా పరిస్థితి ఏమిటంటే-
అబ్బాయి చదువుకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను. అమ్మాయి పెళ్లికి ఊళ్లో పొలం కొంత అమ్మాను. స్వంత కారు లేదు. ఇల్లు లేదు. ఇంట్లో ఆధునిక సదుపాయాలు లేవు.
మరి ప్రమోషనొచ్చాక-
నా హోదాకి కారుండాలని ఇంటాబయటా పోరు మొదలైంది. అది భరించలేక లోన్ కోసం ఓ ఫైనాన్సు కంపెనీకి దరఖాస్తు పెట్టాను. అంతే, ఆ కంపెనీ ఓనరు మహాలింగంనుంచి ఫోనొచ్చింది.
రెండేళ్లక్రితం మహాలింగం కూతురి పెళ్లికి అర్జంటుగా ఆరు లక్షలు అవసరపడితే, ఐనవాళ్లే మొహం చాటేశార్ట. అప్పుడు నా దగ్గర పల్లెటూళ్లో పొలం అమ్మిన డబ్బు చేతిలో ఉందట. ఆయనకి వడ్డీ లేకుండా అప్పిచ్చానుట. మళ్లీ అడగనైనా లేదుట.
“ఇప్పుడు మీరు కారు లోన్ కోసం నా ఫైనాన్సు కంపెనీలోనే అప్పుకి దరఖాస్తు పెడితే తట్టుకోలేకపోయాను. బాకీ అడగడానికి మీకు మొహమాటం కావచ్చు కానీ, ఇలాంటప్పుడైనా తీర్చడం నా మర్యాద కదా!” అన్నాడాయన.
రెండేళ్లక్రితం పొలం అమ్మిన మాట నిజమే కానీ అది నా కూతురి పెళ్లికి. ఐనా మహాలింగానికో కూతురుందనే తెలియదు నాకు. ఇక ఆ అమ్మాయి పెళ్లికి డబ్బివ్వడమేంటని ఆశ్చర్యపడ్డాను.
మహాలింగానికి నవ్వొచ్చింది, “జనం, మీడియా ఒక్కటై ఇది తప్పు- అన్నారనుకోండి. మనం దర్జాగా, ధైర్యంగా ఓ సంజాయిషీ ఇవ్వాలి. అంతే, తప్పు ఒప్పైపోతుంది. ఎందుకంటే- సంజాయిషీ అంటే నమ్మడానికో, నమ్మించడానికో కాదు. అదో గౌరవం. అది భీష్ముడి పాదాలపై అర్జునుడు వేసే నమస్కారబాణంలాంటిది. ఆ తర్వాత అర్జునుడు తనని చంపేసినా కూడా భీష్ముడు అర్జునుణ్ణి తప్పు పట్టడు. అందుకే తప్పు చేసేవాడు ముందు సంజాయిషీల్ని సిద్ధం చేసుకోవాలి” అన్నాడు.
“మీరెందుకు నవ్వారో, సంజాయిషీ గురించి ఎందుకు చెప్పారో నాకర్థం కాలేదు” అన్నాను.
“సరే, సూటిగా విషయానికొస్తాను. నానుంచి మీకు కారొచ్చిందనుకోండి. సంజాయిషీ నేనే కాదు, మీరూ ఇచ్చుకోవాలి కదా! ఇదంతే!” అన్నాడు మహాలింగం.
ఆయన నాకు సంజాయిషీ ఇచ్చాడా, బాకీ తీర్చాడా అన్నది తేలక తికమక పడుతుంటే, “అంత పెద్దమనిషి అబద్ధం ఆడ్డండీ! మనం అప్పిచ్చే ఉంటాం” అంది నా భార్య సీత నమ్మకంగా.
“అమ్మగారు అర్థం చేసుకున్నారు” అని మహాలింగం సీతని మెచ్చుకున్నాడు.
అప్పుడు మహాలింగానికి అప్పిచ్చే ఉంటానని నాకే అనిపించింది.
మర్నాడు మా ఇంటికి కొత్త కారొచ్చింది. కారుతో పాటు మారుతి అనే డ్రైవరు కూడా వచ్చాడు.
డ్రైవర్ని మెయింటైన్ చేసే స్తోమత నాకు లేదు. ఆపైన నాకు డ్రైవింగొచ్చు. అదే మారుతికి చెబితే, “అలాగనేయకండి సార్! కారే ఏమిటి, విమానమిస్తే దాన్ని కూడా నడిపించగలరు మీరని నాకు తెలుసు. కానీ మీ హోదాకి డ్రైవరు లేకపోతే ఎలా?” అన్నాడు.
అతణ్ణి ఎలా వదుల్చుకోవాలా అని ఆలోచనలో పడ్డాను. అంతలోనే మారుతి, ‘ఉన్న విషయం చెప్పేస్తాను సార్! నేను జీవితంలో చెయ్యకూడని పాపాలు కొన్ని చేసేను. మీవంటి పుణ్యాత్ముల్ని సేవించుకుంటే, నా పాపాలు పోతాయని ఓ స్వామీజీ చెప్పాడు. మిమ్మల్ని జీతమడగను. నా సేవల్ని కాదనకుండా ఉండడానికి ఈ సంజాయిషీ చాలుగా” అన్నాడు.
సంజాయిషీ అనగానే మహాలింగం మాటలు గుర్తొచ్చాయి. మరి మాట్లాడలేదు.
మారుతిది మామూలు సేవ కాదు. పెట్రోలు పోయిస్తాడు. మెయింటెనెన్సు చూస్తాడు. ఆ విషయం నాకు తప్ప బయటివాళ్లకి తెలియదు- అతణ్ణి పంపిన ఓ పెద్దోడికి తప్ప.
కారు తర్వాత ఇల్లు.
కడదామనుకున్నానో లేదో, పానకాలు అనే బిల్డరు ముందుకొచ్చాడు. ఆయన కొడుకు అమెరికా చదువుకి డబ్బు సద్దుబాటు కాకపోతే, నేను పొలమమ్మిన డబ్బు అప్పుగా ఇచ్చానుట. ఆ సంజాయిషీతో, ఓ పోష్ లొకాలిటీలో ఆరొందల గజాల స్థలాన్ని నా పరం చేసి బాకీ తీర్చాడు. ఇంటి ప్లానెయ్యడానికి ఇంజనీర్ని పంపాడు. ఇల్లు కట్టడానికి మాత్రం నన్నడిగి రెండున్నర లక్షల నగదు తీసుకున్నాడు. అందుకు పదిరెట్లు గృహ ప్రవేశమప్పుడు చదివింపుల్లో వచ్చింది. చూసినవాళ్లంతా నా ఇల్లు కోటి రూపాయలకు తక్కువ చెయ్యదన్నారు.
ఇంట్లోకి హోం థియేటర్ సిస్టం కొందామని నేనూ, సీతా షాపుకెళ్లాం. ‘మంచి సిస్టం రేపొస్తుంది. కానీ నేటికి ఉత్త చేతుల్తో వెనక్కెళ్లొద్దు. ఎనిమిదివేల ఫుడ్ ప్రోసెసర్, ఆఫర్లో రెండువేలకే వస్తోంది’ అని బలవంతంగా కొనిపించి పంపాడు సేల్సుబాయ్. మర్నాడు మేము షాపుకి వెళ్లేలోగానే, హోంథియేటర్ సిస్టం ఇంటికొచ్చి ఇన్‍స్టాలయింది. నిన్నటి మా బిల్లుకి ఇది లాటరీలో గిఫ్టుగా వచ్చిందట.
నగలషాపుతో సహా ఏ షాపుకెళ్లినా, ధరలు నామమాత్రం. సినిమాకెడితే రిలీజ్ డే ఐనా సరే, కారు దిగేలోగా టికెట్లు చేతికందేస్తాయి. యాత్రలకెడితే హొటల్ రూంకి 95 శాతం డిస్కౌంటు. లంచి, డిన్నరు వగైరాలు కర్టెసీ.
మా ఇంట్లో ఏ వేడుకైనా- ఎలా తెలిసేదో ముందు పెద్దోళ్లకి తెలిసిపోయేది. వాళ్లు విలువైన కానుకలు కుప్పించి, ఎగసిన వాటి కాంతి గగన మండలమంతా కప్పుకుంటే- తాము మాత్రం ‘చంద్రునికో నూలుపోగు’ అని సంజాయిషీ ఇచ్చేవారు.
ఆ విషయంలో వాళ్లెంత పక్కాగా ప్రిపేరై ఉండేవారంటే, ఓసారి మా మనవరాలు మమత పుట్టినతేదీ విషయంలో మీమాంస వచ్చింది. అదేం అసహజం కాదు. నేనైతే సెల్ ఫోనుకి వీలైనంత దూరంగా ఉంటాను కానీ, మా అబ్బాయి విశ్వానికీ, కోడలు కౌసల్యకీ కూడా అది లేందే క్షణం గడవదు. ముఖ్యమైన సమాచారాన్ని అందులోనే దాచుకుంటారు.
వాళ్లని పేరడిగినా, చెప్పడానికి మొబైల్ చూడాల్సిందే. ఇక కూతురి పుట్టిన్రోజెలా నోటికొస్తుందీ!
మమత ఓ తేదీ చెప్పింది. కౌసల్య ఫోన్లో చూసి, గతేడాది దాని పుట్టిన్రోజు వేరే తేదీన చేసేమంది.
సీతకి మమతే రైటని తెలుసు. కానీ తనని కాదన్నా ఫరవాలేదు కానీ, మొబైల్ని కాదంటే భరించలేదు కౌసల్య. ఒకసారి ఆ కారణంమీదే ఆమె కన్నతల్లితోనే వారం రోజులు మాట్లాడలేదు. అందుకని అత్తగారిగా తనెందుకు రిస్కు తీసుకోవడమని, “దీనికింత చర్చ అవసరమా? మన కోటిలింగం గారినడిగితే సరిపోదూ” అంది సీత. ఆయన మరో పెద్దోడు.
కౌసల్య వెంటనే, “మీ సలహా బాగున్నది. కోటిలింగంగారి పేరు చెప్పడం బహు బాగున్నది” అని ఆమోదముద్ర వేసింది.
కోటిలింగానికి ఫోన్ చెయ్యగానే వెంటనే, “మమతా బేబీ పుట్టిన్రోజా- నిద్రలో అడిగినా చెబుతాను. ఇంగ్లీషు కేలండరా, తిథుల ప్రకారం చెప్పనా?” అన్నాడు.
అప్పుడు కౌసల్యకి గుర్తొచ్చింది- మమతకి గుర్తున్న తేదీ ఇంగ్లీషు కేలండరుదనీ, గతేడాది ఆ తేదీకి మమతకి జ్వరం రావడంతో, పుట్టిన్రోజు తిథుల ప్రకారం చేశామనీ!
డిపార్టుమెంట్లో నా హోదా విలువని బట్టి, సమాజపు పెద్దోళ్లు నన్ను అల్పసంతోషి అనేవారు. మధ్యతరగతి పరిధిలోనే మహారాజ రాజభోగాన్ని ప్రసాదించిన ఆ అల్పసంతోషం పదిహేనేళ్లకి పైగా ఎన్నో గొప్ప అనుభూతుల్నిచ్చింది నాకు.
రోజూ ఆఫీసుకి బయల్దేరుతుంటే, అమెరికా వెడుతున్నంత హడావుడి ఇంట్లో. తిరిగొచ్చేక, అప్పుడే ఫారిన్నించి వచ్చినట్లు రిసెప్షను. అందుకని ఆఫీసుకెళ్లడం, రావడం ఏరోజుకారోజే మరపురాని అనుభూతి నాకు.
డ్యూటీకెళ్లడానికి కారొచ్చేది. ఆఫీసులో అంతా సలాములు కొట్టేవారు. నేనేం చేసినా, చెప్పినా అందరి నోటా ఆహా ఓహోలే! అందుకని ఆఫీసులో గడపడమూ ఏరోజుకారోజే మరపురాని అనుభూతి నాకు.
ఆఫీసు బయటకెళ్లి తనిఖీలు చేసేది సొసైటీలో అంతెత్తున ఉన్న పెద్దోళ్లని. అంతటివాళ్లూ నన్ను చూస్తూనే అంతెత్తునుంచీ కిందకి దూకి వినయవిధేయతలతో నా పాదాలు కడుగుతారు. అందుకని తనిఖీలూ నాకో మరపురాని అనుభూతి.
ఇంతకాలం అదంతా నా ఘనతే ననుకున్నాను. ఇంటాబయటా కూడా నేను లేందే ఎవరికీ గడవదు కామోసనుకున్నాను.
రిటైర్మెంటు తర్వాత
రిటైరయ్యేక- ఇంటాబయటా కూడా నన్నెవరూ పట్టించుకోకపోతే, అప్పుడు గుర్తొచ్చిందీ కోడీ కుంపటీ కథ.
కొడుకు, కోడలు ఆఫీసులకెళ్లాలి. మనుమడూ, మనుమరాలూ స్కూళ్లకెళ్లాలి. సీత వాళ్లకి వంటింటి సాయం చెయ్యాలి. తీరుబడొస్తే వాళ్లకి నాకంటే మొబైల్సుతో గడపడమే ఇష్టం. సీత కూడా అంతే!
మొదట్నించీ నాది పాతకాలపు మైండ్‍సెట్. మొబైల్సన్నా, ఇంటర్నెట్టన్నా మహా చిరాకు.
అవసరానికి ఫైల్సు ఓపెన్ చేసి చదివే కంప్యూటరు నాలెడ్జి ఉంది కానీ, మిగతా అన్నింటికీ పెర్సనల్ సెక్రటరీమీద ఆధార పడేవాణ్ణి. ఆమె అందమైనదీ, వయసులో ఉన్నదీ కావడంవల్ల- ఆ ఆధారపడ్డం నాకు ఆహ్లాదంగానే ఉండేది. ఆ ఆహ్లాదంలో ఆవేశం, అనుచితం లేకపోవడంవల్ల, నేనలా ఆధారపడ్డం ఆమెకూ ఆహ్లాదంగా ఉండేది.
అందుకే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, నంబరు నొక్కి ఫోన్ చెయ్యడం మించి మొబైల్ వాడకం నేర్చుకోలేదు నేను. మిగతావన్నీ పీఎస్ హాండిల్ చేసేది. అప్పుడప్పుడు ఆమెని చూసి, “చిన్నపిల్లవి. నీకున్నపాటి పట్టు లేకుండా పోయింది నాకీ మొబైల్సుమీద” అని ముచ్చటపడేవాణ్ణి. దానికామె, “మాకైతే తప్పదుకానీ, మేముండగా మీకా అవసరమేముంది సార్!” అనేది. గర్వంగా ఫీలయ్యేవాణ్ణి.
ఇప్పుడేమో, ఏ పనీ లేనివాణ్ణి నేనొక్కణ్ణేనని ఇంట్లో నా ప్రాధాన్యం తగ్గిపోయింది. అన్నింటికీ నన్ను వెనకబెట్టేస్తున్నారు.
పోనీ అంటే నా సంపాదనేం తగ్గలేదు.
నా పెన్షను కోడలి జీతంకంటే ఎక్కువ. ఆ పెన్షనుకి ఆర్నెల్లకోసారి డియ్యేలు తోడు. ఇంకా నాపేర్న బ్యాంకు డిపాజిట్లూ, షేర్లూ ఉన్నాయి. ఇంట్లో ఎవరూ సంపాదించకపోయినా, కుటుంబాన్ని నేనే పోషించగలను.
ఇవన్నీ సీతకి చెబితే, “రిటైరైనా కూర్చోబెట్టి జీతమిస్తోంది మీకు మీ ఆఫీసు. కానీ అప్పటి సేవలిస్తోందా? కారుకి డ్రైవరు లేడు. సినిమాకెళ్లినా, షాపుకెళ్లినా పట్టించుకునేవాళ్లు లేరు. అలాగే ఇంట్లో మా సేవలూనూ!” అంది.
“కానీ నా జీతం మీ అందరికీ ఉపయోగపడుతోందిగా. అందుకైనా రిటైరయ్యేక నన్ను పట్టించుకోవద్దూ?” అన్నాను.
“బాగుంది. రిటైర్మెంటు మీకేనా- నాకుండదా? ఇన్నేళ్లుగా మీకోసం, మీ పిల్లలకోసం రెక్కలు ముక్కలు చేసుకున్నాను. రిటైరయ్యేక నన్నెలా చూసుకోవాలో మీ ఆఫీసుని చూసైనా నేర్చుకోండి” అని చురక వేసింది.
దాంతో పరిస్థితి స్పష్టమైంది నాకు. ఇన్నేళ్లూ నాకు దక్కిన గౌరవం నా జీతానికి కాదు. నా హోదా ఇచ్చిన సదుపాయాలకి.
ఇంట గెలిచి రచ్చ గెలవమని సామెత ఉంది కానీ, నేను రచ్చ గెలవడం వల్లనే ఇన్నేళ్లూ ఇంట గెలిచాను.
ఉన్నట్లుండి ఇంటాబయటా అనామకుడిగా మారిపోవడం తట్టుకోలేకపోయాను.
అలాంటి సమయంలో మా ఇంటికొచ్చాడు నా పెదనాన్న కొడుకు వీరభద్రం.
వయసులో నాకంటే ఆర్నెల్లు పెద్ద. ఉద్యోగంలో కనీసం ముప్పైవేలు చిన్న. అందుకని వాడి పెన్షనూ అంతంతమాత్రమే కానీ స్వగ్రామంలో పొలాల్నించి అయివేజొస్తుంది.
వాడు నాకు చాలా హుషారుగా కనిపించాడు. నేను డల్‍గా ఉన్నందుకు ఆశ్చర్యపడి కారణమడిగి తెలుసుకున్నాడు.
“ఇంకా మనుషులకోసం పాకులాడుతావు, ఏ కాలంలో ఉన్నావురా! ఈరోజుల్లో మొబైలో, టాబ్లెట్టో, లాప్‌టాపో దగ్గరుంటే చాలు. ప్రపంచమే మన చుట్టూ తిరుగుతుంది. అక్కడ మనమేంచేస్తే అది ఘనకార్యం” అన్నాడు భద్రం.
అని ఊరుకోలేదు. వాడు ఓ రోజంతా నాతో గడిపి మొబైల్లో ఉన్న కొన్ని సదుపాయాల్ని ఎలా ఉపయోగించాలో నేర్పాడు. నాకోసం వాట్సాప్ డౌన్లోడ్ చేసి, తను కొత్తగా ప్రారంభించిన ‘రిటైర్డ్ మేధావులు’ అనే గ్రూపులో నన్ను కలిపాడు. మా ఇంట్లో నాలుగు రోజులుండి వాట్సాపు వంటబట్టేలా చేశాడు.
వెళ్లేముందు, “వాట్సాపుతో నీ జీవితమే మారిపోతుంది. ఎటొచ్చీ ప్రతి పోస్టుకీ రెస్పాండవడం ముఖ్యం. అలాగని పోస్టులన్నీ చదవక్కర్లేదు. మిగతావాళ్ల ట్రెండు చూసి ఒకటో రెండో ఎమోజీలు పెట్టేయ్. పనైపోతుంది” అని సలహా ఇచ్చాడు.
వాట్సాపు నిజంగానే నా జీవితాన్ని మార్చేసింది. రోజూ ఎవరో ఒకరు ఉదయమే శుభోదయం, రాత్రి శుభరాత్రి చెబుతారు. వాట్సాపులో ప్రొఫైల్ చూసి- జన్మదినం, పెళ్లిరోజు, వగైరా ముఖ్యఘట్టాలకి తమంతతామే శుభాకాంక్షలు చెబుతారు. ఎందరో జీవితానుభవాల్ని పంచుకుంటూ, మిగతా సభ్యుల ప్రశంసలు పొందుతారు. నా జీవితానుభవాలు క్లుప్తంగా రాసి పోస్టులు పెడుతుంటే, ‘వావ్’ అనీ, ‘ఇంకా చెప్పండి’ అనీ, ‘మీ పరిచయం మా అదృష్టం’ అనీ ఒకరు స్పందిస్తే, వరుసగా వందలాదిమంది అనుసరించేవారు.
అలా నాకు ఎందరో అభిమానులు తయారైతే- రెచ్చిపోయి వాట్సాప్ కోసం బుల్లి కథలు వ్రాశాను. కవితలు చదివాను. కొన్ని సినిమా పాటలు కూడా పాడాను.
దాంతో నా వ్యక్తిత్వానికే కాదు- నాలో దాగి ఉన్న బహుముఖప్రజ్ఞకూ వందలాది అభినందనలు మొదలయ్యాయి.
అలా నాకు రిటైర్మెంటుకి ముందున్న జీవితం తిరిగొచ్చింది. కోరుకున్న ప్రాధాన్యం లభించింది. నాకు బూరెలు నచ్చవన్నా, పాటలు ఘంటసాలవే ఇష్టమన్నా, క్రికెట్లో టీ20ని నిరసించినా, ఇలా ఏం రాసినా– ఎవరో ఒకరు ఆహా, ఓహో!
దానికి వంతగా వందలాది అభిమానులు ఆహా, ఓహో అంటూ ఎమోజీలు పెడితే, మళ్ళీ గొప్పవాణ్ణైపోయాను.
ఒకసారి మా వీరభద్రం పాత మూగమనసులు చిత్రంలోని, ‘ముద్దబంతి పూవులో’ పాట పాడి, ఆడియో ఫైలు పోస్టు చేసి అభిప్రాయాలు కోరాడు. దానికి కొందరు అచ్చం ఘంటసాలలా పాడేడని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. మిగతావాళ్లు దణ్ణాలు, థమ్సప్పుల ఎమోజీలు పెట్టారు.
నేను వేరు కదా, నిజాయితీగా అభిప్రాయం చెప్పాలనుకుని, “మా వీరభద్రం గొంతు నిజంగా బాగుంది. పాడ్డం మాత్రం నిజంగా బాగోలేదు” అని లోపాల్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లెవెల్లో విశ్లేషించి, “ఇవి సవరించుకుంటే ఈ వయసులోనూ గాయకుడిగా పేరు తెచ్చుకోవచ్చు” అని పోస్టు పెట్టాను.
దానికి వీరభద్రం చప్పట్ల ఎమోజీ పెట్టాడు. మిగతావాళ్లు కూడా వేరే వ్యాఖ్యలు పెట్టకుండా చప్పట్లూ, థమ్సప్పులూ, లైకులూ, దణ్ణాల ఎమోజీలు పెట్టారు. నా విమర్శ విలువని అంతా గ్రహించారనుకుని మురిసిపోయాను.
కాసేపటికి వీరభద్రంనుంచి ఫోనొచ్చింది, “వాట్సాపు పోస్టులు అటెన్షన్ కోసం, పొగడ్తలకోసం. బోడి సలహాలకి కాదు. ఐనా సంగీతం గురించి ఏం తెలుసని అంతలారాశావ్! కావాలంటే, అడ్మిన్‍గా నేనా పోస్టు డిలీట్ చెయ్యగలను. కానీ చెయ్యలేదు. ఎందుకంటే, ఆ పోస్టు ఎవరూ చదవరని నాకు తెలుసు. నేను చప్పట్లు పెడితే, మిగతావాళ్లు ఫాలో అయ్యారు. కాబట్టి ఆ పోస్టు డిలీట్ చేసి నీ మర్యాద కాపాడుకో” అని మందలించాడు.
నేను వాడి మాటలు నమ్మలేదు. “నీ కోడీ కుంపటీ లేకుంటే నాకు తెల్లారదనుకున్నావా? ఈ గ్రూపులో నా అభిమానులు నాకున్నారు. విమర్శను సహృదయంతో స్వీకరించడం నేర్చుకో. నేనా పోస్టు డిలీట్ చెయ్యను” అన్నాను.
“రిటైర్డ్ మేధావులు గ్రూపుకి అడ్మిన్ నేను. నా కోడీ కుంపటీ లేందే అక్కడ తెల్లారదు. నేను పెట్టిన పోస్టుకి తలూపడం తప్ప, మిగతావాళ్లెవరూ స్వంతబుర్రతో ఆలోచించరు. నువ్వూ అలాగే ఉండు. ఎవరూ నిన్ను పట్టించుకోవడంలేదని ఏడ్చావని, నిన్ను నా గ్రూపులో చేర్చాను. దాంతో తృప్తిపడి బుద్ధిగా ఉండు. వెంటనే పోస్టు డిలీట్ చెయ్యి. ఇప్పుడు చేసినా అది నీకు మాత్రమే డిలీటౌతుంది. గ్రూపులో ఉన్నా అదో గుడ్డికన్ను. ఉన్నా లేకున్నా ఒకటే. మనమధ్య పూర్వపు స్నేహభావం పోకూడదని, డిలీట్ చెయ్యమంటున్నానంతే! చెయ్యవూ, ఏం జరుగుతుందో చెప్పను, చేసి చూపిస్తాను” అన్నాడు వీరభద్రం.
నేను చలించలేదు, “సరేలే, రిటైర్మెంటుకి ముందు నేనూ నా గురించి ఇలాగే అనుకునేవాణ్ణి” అని ఎగతాళిగా నవ్వి ఫోన్ పెట్టేశాను.
రెంద్రోజుల తర్వాత వాట్సాపులో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు వీరభద్రం.
అది నా పుట్టిన్రోజు కాదు. ఐనా వెంటనే వందమంది నాకు శుభాకాంక్షలు చెప్పేశారు.
పొరపాటుని వెంటనే సవరించాలి కదా- నా పుట్టిన్రోజు జరిగి నెల దాటిందని పోస్టు పెట్టాను.
దీనికి వీరభద్రం సారీ చెప్పాడు. వెంటనే వందమంది సారీలు చెబుతూ పోస్టులు పెట్టారు.
రెండ్రోజులాగి వీరభద్రం మళ్లీ నాకు వాట్సాపులో పుట్టిన్రోజు శుభాకాంక్షలు చెప్పాడు. మళ్లీ వంద శుభాకాంక్షలు. నేను కాదనగానే మళ్లీ వంద సారీలు.
ఆ తర్వాత మా పెళ్లిరోజు రేపనగా ఈరోజు గ్రీటింగ్సు చెప్పాడు వీరభద్రం. వంద శుభాకాంక్షలు ఫాలో అయ్యాయి. నా పెళ్ళిరోజు రేపని నేను పోస్టు పెట్టగానే, వెంటనే ఓ వంద సారీలు.
ఐతేయేం- సారీ చెప్పింది క్రితంరోజే కాబట్టి, మర్నాటికి గుర్తుండి గ్రీటింగ్సు చెబుతారనుకున్నాను.
కానీ ఉదయం లేవగానే కండొలెన్సు మెసేజ్ చూసి షాక్ తిన్నాను.
నిన్న రాత్రి నేను బాత్రూంలో జారిపడ్డానుట. కుడి కాలు విరిగితే బ్యాండేజి వేశారుట.
‘గెట్ వెల్ సూన్’ అంటూ మెసేజి పెట్టాడు వీరభద్రం. వెంటనే వందమంది గెట్ వెల్ సూన్ అన్నారు.
అది చూసి వెంటనే వీరభద్రానికి ఫోన్ చేసి, “నాకు కాలు విరిగినట్లు తెలిస్తే, ముందు ఫోన్ చేసి ఎలాగున్నావని నన్నడగాలి. ఇలా వాట్సాపులో పెడతావా? అదీ నా పెళ్లిరోజున. గ్రీటింగ్సందాల్సిన రోజున కండొలెన్సెస్ వచ్చాయి” అని నిష్ఠూరమాడాను.
వాడు వెంటనే, “అయ్యో, నీకు కాలు విరిగిందని తెలిస్తే ఫోనెందుకు చేస్తాను? నేనే బయల్దేరి వచ్చి పక్కనుండేవాణ్ణి. ఆ పోస్టు పొరపాటున నీకు పెట్టేసినట్లున్నాను. సారీ చెప్పి తప్పు దిద్దుకుంటాలే” అన్నాడు. వాడు పొరపాటు ఒప్పుకుంటూ సారీ చెప్పగానే, ఓ వందమంది వాణ్ణి ఫాలో అయ్యారు. కానీ అప్పటికీ ఒక్కరు కూడా నా పెళ్లిరోజు ప్రస్తావన తేలేదు.
అప్పుడు నాకు అర్థమైంది. వాట్సాప్ గ్రూపులో నాకు లభించే ఆహా, ఓహోలు నా ప్రతిభకి కాదు. సానుభూతులు నామీద అభిమానంతో కాదు. ఆ గ్రూపు సభ్యులు నాకులాగే కాలక్షేపానికి వేరేదారి లేనివాళ్లు. నాకులాగే ప్రత్యేకమైన గుర్తింపుకై తాపత్రయపడేవాళ్లు. సాటి సభ్యుల గురించి ఏ మాత్రం ఆసక్తి లేకుండా, తమ గ్రూపు అడ్మిన్‍ని గుడ్డిగా అనుసరించేవాళ్లు.
రిటైర్మెంటుకి ముందు నా హోదా కోడి అయితే, నా తనిఖీ కుంపటి. నాకవి ఉండడంవల్ల సమాజపు పెద్దోళ్లకి తెల్లారుతుంది. అవి లేకుంటే వాళ్లకి నేనక్కర్లేదు. అవి ఎవరికుంటే వాళ్లు కావాలి. రిటైర్మెంటు తర్వాత వాట్సాప్ నా కోడి. ఆహా, ఓహోలు నా కుంపటి. ఆ రెండూ లేకుండా నాకు తెల్లారదు. కానీ అవి నా చేతుల్లో లేవు. అడ్మిన్ వీరభద్రం చేతుల్లో ఉన్నాయి.
కోడీ కుంపటి కథలో – వాటి ప్రయోజనానికి సంబంధించిన ఓ కొత్త కోణం నా అవగాహనకొచ్చిందిప్పుడు.
ఒకరి దయాధర్మంమీద ఆధారపడ్డ ఈ గుర్తింపుకై తాపత్రయపడ్డమెందుకూ, అని మనసు నిరసించింది.
చివరిగా ఓ పోస్టు పెట్టి వాట్సాప్ గ్రూపునుంచి తప్పుకుందామనిపించి మొబైల్ ఓపెన్ చేశాను. చివరిసారిగా వాట్సాపులో నాకు లభించిన అభినందనలు, ప్రశంసలు, గుర్తింపులు చదివాను.
చదువుతుండగా, వీరభద్రం పాటమీద నేను పెట్టిన పోస్టు కనబడింది. మరోసారి చదివాను.
చదువుతుంటే- ఈసారి నా పోస్టు నాకూ నచ్చలేదు. అలా ఎందుకు రాశానా అనిపించింది.
పోనీ నా పోస్టువల్ల ప్రయోజనమా అంటే- చదివిన వీరభద్రానికి కోపమొచ్చింది. మిగతావాళ్లు ఎమోజీలు పెట్టారు. అవి పెట్టడానికి చదవాలనేం లేదు కదా!
వీరభద్రం కోపంలో న్యాయముందనిపించింది. వెంటనే ఆ పోస్టు డిలీట్ చేశాను.
అప్పుడే వీడ్కోలు పోస్టు రాద్దామంటే కనులు చెమర్చాయి. చెయ్యి తడబడింది. భాష స్ఫురించలేదు.
మర్నాడు పెడదాంలే అనుకున్నాను.
మర్నాడు లేవగానే వాట్సాపు తెరిస్తే ఆశ్చర్యంగా అందులో నా ఫొటో.
నాలుగేళ్లక్రితం లయన్స్ క్లబ్ వాళ్లు నాకిచ్చిన సిన్సియారిటీ అవార్డుని మునిసిపల్ కమీషనర్ చేతులమీదుగా అదుకుంటున్న నా ఫొటో అది.
వీరభద్రం పెట్టిన ఆ పోస్టుకి అనూహ్యంగా రెండొందల రెస్పాన్సులొచ్చాయి. అన్నీ దణ్ణాలు, థమ్సప్పుల ఎమోజీలు.
వాళ్లా పోస్టు చదివారో లేదో నాకు తెలియదు. కానీ అభిమానుల రెస్పాన్సు, ఎమోజీలు నాకు మంచి కిక్కిచ్చాయి.
“ఇంకా నయం, వీడ్కోలు పోస్టు పెట్టాను కాదు” అనుకున్నాను.
మళ్లీ వాట్సాపుని వదలాలని అనుకోలేదు.
---౦---
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
వసుంధర పరిచయం: మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.
Comments